వచ్చిన భాష ఏది? రాని భాష అంటే ఏమిటి? ఈ విషయం నాకు అర్ధం కావడం లేదు ఈ మధ్యన. కన్ప్యూసింగ్ గా ఉంది కదూ.నాకు తెలిసిన భాషలో అర్ధం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం చాలా సార్లు ఈ ప్రశ్నని ఎదుర్కొంటూ ఉంటాము, చాలా సార్లు అప్లికేషన్ లలో కూడా రాయవలసి ఉంటుంది కూడానూ. అందుకని దీని సంగతి తెలుసుకుంటే మంచిది కదా, అని అనిపించి ఇలా ఇది రాసేస్తున్నానన్నమాట.
మన తెలుగువారికి తెలుగు వచ్చిన భాష అనుకుందామా, అంటే ఈ మధ్యన అది నిజంలా అనిపించడం లేదు. 'వాచ్ చేస్తున్నారా?', బాత్ తీసుకున్నారా? ఒకసారి డ్రాప్ ఇన్ అవ్వండి మీరు, మా ఇంటికి.. చాలా పుల్ డౌన్ చేసారు రీసెంట్ గా ఇలాంటివన్నీ వింటుంటే.. ఇవి తెలుగు వాక్యా లేనా? అనిపిస్తోంది , , నిజం.. సినిమాలలో సంభాషణాలు కూడా ఇలాంటివే రాస్తున్నారు కూడాను.
చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు. ఈ మధ్యన అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు.. వీళ్ళకి పాపం ఇంగ్లీష్ పూర్, హిందీ నిల్, తెలుగు వీక్ అని.. నిజంగానే అలా కనిపిస్తోంది.. . పైన చెప్పిన లాంటి తెలుగూ ఇంగ్లీషూ కాని మరికొన్ని వాక్యాలు చూడండి.
- నేను అలాంటి నకరాలు అస్సలు స్టాండ్ చెయ్యలేను ( I can't stand such antics అని అర్ధం చెప్పుకోవచ్చేమో)
- నేను విండో ప్లేస్ కోసం చాల పర్టికులర్
- నాకు చైల్డ్ హుడ్ నించీ మేన్గో లంటే లైకింగ్ ఎక్కువ
- నేను రోజూ ఆఫీస్ కి వెళ్ళడానికి బస్ తీసుకుంటావా? ఇలాంటివన్నమాట.
ఇప్పుడు ఇంకోరకం చూద్దాం.
- I went by bus. car means very costly. why unnecessary burden therefore - ఐ వెంట్ బై బస్. కార్ మీన్స్ వెరీ కాస్త లీ. వై.. అన్ నేసేసరీ బర్డెన్ దేర్ఫోర్.. ( అంటే.. కార్ ఐతే ఎక్కువ ఖరీదు అవుతుంగి కదా అని బస్ లో వెళ్లాను.. అనవసరమైన భారం ఎందుకు అని కాబోలు)
- Morning, morning big fight in my house between mrs. and me. మార్నింగ్ మార్నింగ్ బిగ్ ఫైట్ ఇన్ మై హౌస్ బిట్వీన్ మిసెస్ అండ్ మీ.. ( పొద్దున్నే మా ఇంట్లో నాకు మా ఆవిడకీ పెద్ద గొడవ)
- The street gundas damaged all the property.. what else work they have? ది స్ట్రీట్ గుండాస్ డేమేజేడ్ ఆల్ ది ప్రాపర్టీ .. వాట్ ఎల్స్ వర్క్ దీ హావ్? ( ఇంకేం పని ఉంది వారికి అనే అర్ధం)
- We have kept the god during the ganesh navaratri. We will leave him on fifth day. వి హేవ్ కెప్ట్ ది గాడ్ డ్యూరింగ్ గణేష్ నవరాత్రి.. వి విల్ లీవ్ హిం ఆన్ ఫిఫ్త్ డే. ( వినాయకుడిని పెట్టాము, ఐదో రోజున విసర్జిస్తాము/నిమజ్జనం చేస్తాము)
- Now where he is? నౌ వేర్ హీ ఇస్ ( అబీ కహా హాయ్ వో? అన్నమాట)
ఇలాంటివి.. ఇవి ఇంగ్లీష్ లా కనిపించే ఇంగ్లీష్ కాని వాక్యాలు..
వీటిల్లో మన మాతృభాష ప్రభావం ఎంత ఉంటుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.. ఎంత అలవోకగా, సునాయాసంగా మనం ఇలాంటివి మన రోజు వారీ పనులలో వాడేస్తూ ఉంటామో. ఎవరో విదేశీయులు వీటిని అర్ధం చేసుకోలేక కష్టపడినప్పుడు మనకర్ధం అవుతుంది.. విదేశీయులంటే గుర్తు వచ్చింది.. ఆ మధ్య మా అమెరికన్ కొలీగ్ ఒకా విడ ఇక్కడకి వచ్చినప్పుడు టాక్సీ ఎక్కింది.. వాళ్ళిద్దరికీ మధ్యన సంభాషణ ఇలా జరిగిందిట. ఇలా విదేశీయులు వచ్చినప్పుడు కావేరీకో, కాటేజీ ఎంపోరియం లకో, బట్టలకైతే ఫాబ్ ఇండియా కీ తీసుకెళ్లడం టాక్సీ వాళ్ళకీ అలవాటే..
అక్కడ ఇంకో డ్రైవర్ కనపడితే ' బ్రదర్ ఎలా ఉన్నావు? అని అడిగాడుట ఇతను కన్నడం లో..
ఆవిడ బ్రదర్ అన్న మాట విని.. ఆతను మీ బ్రదరా? అని అడిగిందిట..
దానికి మన డ్రైవర్.. నాట్ ఓన్. కజిన్ బ్రదర్.. అన్నాడుట.. ఆవిడకి అర్ధం కాలేదు.. ఓన్ బ్రదర్ అంటే? అందిట. ఇతనికి అంతకంటే చెప్పడానికి రాలేదు. మెల్లిగా తన పిన్ని కొడుకు అని చెప్పాడుట..
వాళ్ళ మదర్ కి వంట్లో అసలు బాగాలేదు.. అందుకే పలకరించాను అని చెప్పడానికి.. హిస్ మదర్ సీరియస్ అన్నాడుట.
దానికావిడ సీరియస్ అబౌట్ వాట్ అంది.. అది అతనికి అర్ధం కాలేదు.. హాస్పటల్, కేన్సర్ ఇలాంటి పొడి మాటలతో ఆవిడకి కొంచం అర్ధం అయ్యేట్ల చెప్పాడు.
ప్లీజ్ డోన్ట్ మిస్టేక్ మీ.. ఐ నో.. లిటిల్ లిటిల్ ఇంగ్లీష్ అన్నాడుట.. ఆవిడ మర్నాడు మా అందరికీ చెప్పి నవ్వి, అతని ఉత్సాహాన్నీ, అర్ధం అయ్యేలా మాట్లాడాలన్న సంకల్పాన్నీ ఎంతో మెచ్చుకుంది..ఇక్కడ ఆతను మాట్లాడినవన్నీ అందరూ రోజువారీగా మాట్లాడేవే.. 'ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ' తో సహా.. :)
కొన్ని మాటలు వాడగా వాడగా రైటయిపోతాయి.. మనుగడ లోకి వచ్చేస్తాయి.. ముందు లేకపోయినా.. ఉదా; prepone, updation, googled ఇలాంటివి..
భాష గురించి మాట్లాడటం మొదలు పెట్టాకా T.V.. . వాళ్ళగురించి మాట్లాడకుండా ఎలా? మొన్నెప్పుడో ఒక వంటల ప్రోగ్రాం లో బామ్మ వంట, తాతమ్మ వంట అంటూ ఒక విభాగంలో అక్కరలేని ఓవర్ ఆక్షన్ చేస్తున్న యాంకరమ్మ ఒకావిడ ని అడిగింది.. బామ్మా, ( అక్కడ వంట చేస్తున్నావిడకి గట్టిగా మాట్లాడితే అరవై ఏళ్ళు ఉండకపోయినా సరే మాటకి ముందో బామ్మా, వెనకో బామ్మా చేర్చి మాట్లాడుతూ ఉంటారు ఈ పిల్లలు) మీ కెందరు పిల్లలు? ఎక్కడుంటారు? అని అడిగింది
దానికి .. ఇద్దరు కొడుకులూ,, ఒక కూతురు.. అన్నారావిడ .
వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? మీ దగ్గరేనా? ఈవిడ ప్రశ్న
దానికా పెద్దావిడ..కొడుకులు హైదరాబాదో అని ఏదో చెప్పి .. వాళ్ళింట్లో వాళ్ళు.. మా ఇంట్లో మేము.. ఉన్నాము.. అవసరమైనప్పుడు మేము వెళ్తాము, వాళ్ళు వస్తారు అన్నారు..
అంతేనా? హ హ హ.... ఇండివిడ్యువాలిటీ అన్నమాట.. డిపెండబుల్ కాదు అన్నమాట మీరూ, తాతగారూ.. అని అక్కర్లేని వెర్రి నవ్వుతూ అంది ఆ అమ్మాయి...
ఆ అమ్మాయికి dependents కీ, dependable కీ తేడా తెలీదా? ఒక వేళ కార్యక్రమం చక్కగా చెయ్యాలనే ఆత్రం తో పొరపాటున అన్నా తరవాత ఎడిటింగ్ సమయంలోనైనా గమనించరా? అనుకున్నాను.
ఇలాంటివే.. గార్నీష్ కి, కంఫర్ట్ గా చేస్తారా? రిలాక్సా? రియల్ ఆ? లాంటివి..ఇతర కార్యక్రామాలో ఇంకా బోలెడన్ని ఇలాంటివే.
ఇలాంటి రకరకాలు చూసాకా నాకు వచ్చిన సందేహం ఇదన్నమాట.. మనకి వచ్చిన భాష ఏది? రాని భాష ఏది? అన్నీ వచ్చీ రాని భాషలేనా? వస్తూ వస్తూ ఉన్న భాషలేనా? రాకుండానే వచ్చాయి అనుకున్న భాషలా అని.. మా అబ్బాయేమో.. గుడ్ మా. హైబ్రిడ్ లేన్గ్వేజేస్ అంటున్నాడు మరి.. మీరేమంటారు? ఇలాంటి ఉదాహరణలు మీ దగ్గర కూడా ఉంటే నాతొ పాటు అందరికీ చెప్పేయండి. ఓ పని అయిపోతుంది..
P.S: ఇది ఇప్పుడు వినబడుతున్న భాషా వ్యవహారాన్ని చూసి రాసినదే కానీ ఎవరినీ ఉద్దేసించి కాదు.
మరో వంటల ప్రోగ్రాంలో షెఫ్ గారు అల్లం జూలియన్స్(juliennes) గా తరగాలి అని చెప్పగానే తింగరి లంగరు పాప పళ్లికిలిస్తూ "రోమియోలుగా వద్దా?" అని అడిగినప్పుడు మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది ప్రసీద గారూ.
ReplyDeleteఈ మధ్యాహ్నం హస్తకళల కార్యక్రమంలో ఒకాయన 'పురివిప్పిన నెమలి'ఎలా వేయాలో చూపిస్తూంటే మరో తిం.లం.పా "మీరు "నెమలికన్ను" అన్నప్పుడు నేను 'కన్ను మాత్రమే' పెద్దగా వుంటుందేమో? అనుకున్నానండీ? అని తన తెలుగు భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది.
మీరు రాసినవి బావున్నాయి. ఇలాంటివి చాలా కార్యక్రమాలలో కనిపిస్తున్నాయి.. ఒక్క టీ. వీ లోనేనా.. నిజ జీవితంలోనూనూ.
ReplyDelete