Wednesday, March 2, 2011

మహిళలూ-మణిదీపాలు (2 )

డా. శోభా నాయుడు: ఇష్టపడి ఎంచుకున్న ఏ రంగంలోనైనా అలుపెరుగని  దీక్షా, సాధనా, అంకిత భావాలతో కృషి చేస్తే చేరుకోలేని ఉన్నత శిఖరాలు ఉండవని నిరూపించిన నృత్య చూడామణి పద్మశ్రీ .  డా. శోభా నాయుడు. సుప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసులు శ్రీ వెంపటి చినసత్యం గారి శిష్యులలో పేరెన్నిక గన్న వీరు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. చాలా చిన్ననాటి నించీ ఆమె వివిధ సంగీత నృత్య రూపకాలలో నాయికా వేషాలు వేస్తూ కూచిపూడి నాట్యం మీద ఎంతో పట్టు సాధించారు. తన గురువుగారితో కలిసి మన దేశంలోనూ, విదేశాలలోనూ పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. అనేక రకాలైన పాత్రలలో తన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా సత్యభామ, పద్మావతి పాత్రలకి మారుపేరుగా నిలిచారు. 

తనకున్న అసమాన ప్రతిభా పాటవాలూ, కళా దృష్టి తోనూ వివిధ రకాలలిన  కదా అంశాలతో ఆమె రూపొందించిన నృత్యరూపకాలు ప్రపంచమంతా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. పురాణాలకి, ఇతిహాసాలకి సంబంధించినవైనా, ఆధునిక సాంఘిక ఇతి వృత్తాలైనా ఎంతో కమనీయంగా, సాంప్రదాయ నృత్య రీతి బద్దంగా రూపొందించడం ఆమె ప్రత్యేకత.
విప్రనారాయణ, శ్రీ కృష్ణ శరణం మమ, కళ్యాణ శ్రీనివాసం,  విజయోస్తుతే నారీ, క్షీర సాగర మధనం, సర్వం సాయి మయం, జగదానంద కారకా, గిరిజా కల్యాణం, స్వామీ వివేకానంద మరియు నవరస నటభామిని లాంటి సంగీత నృత్య రూపకాలను రూపొందించి, దర్సకత్వం వహించడమే కాక వాటిలో పద్మావతి, చండాలిక, సాయి బాబా, జగన్మాత పార్వతీ, మోహినీ వంటి పాత్రలను ఎంతో అద్భుతంగా, అనితరసాధ్యంగా పోషించి ప్రపంచమంతా నృత్య ప్రేమికుల ప్రసంసలు అందుకున్నారు. కళ్యాణ శ్రీనివాసం వంటి కార్యక్రమాలను చూసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాటిని దేశమంతా  ప్రదర్శింప చేసి  బహుళ ప్రాచుర్యాన్ని కల్పించారు.

 కూచిపూడి నృత్య అకాడమీ కి ప్రిన్సిపాల్ గా 1980 నించీ తన సేవలు అందిస్తున్నారు. అంతేకాక శ్రీ వెంకటేశ్వర  భక్తి చానల్ లో 'సాధన' అన్న కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యం లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే సంస్కృతీ చానల్ లో 'సిరి సిరి మువ్వ ' కార్యక్రమమాన్ని నిర్వహిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. గురువుగా ఇప్పటివరకూ దాదాపు 2000 మంది గొప్ప శిష్యుల్ని ఎంతో ప్రతిభావంతులుగా తీర్చి దిద్దారు. వీరంతా ప్రపంచలో నలుమూలలా స్థిరపడి తమ వంతు కళాపోషణ చేస్తున్నారు. రష్యాలో వీరి ప్రదర్సనలని చూసి కొంతమంది ఔత్సాహికులు రష్యానించి వచ్చి మరీ ఆమె దగ్గర నృత్యం నేర్చుకుంటున్నారు. 

మద్రాస్ లోని కృష్ణ గాన సభ వారు శోభానాయుడుగారికి 'నృత్య చూడామణి'  ,  కేంద్ర సంగీత నృత్య అకాడెమీ వారి పురస్కారమూ, నుంగంబాక్కం వారిచే నృత్య కళా శిరోమణి లాంటి బిరుదులెన్నో ఆవిడ సొంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వారిచే పద్మశ్రీ అవార్డ్ కూడా ఆమెని వరించింది. 

అనుపమానమైన అందం, అనితరసాధ్యమైన అభినయం, అకున్థత దీక్షా, ఎటువంటి భావాన్నైనా అవలీలగా పలికించే విశాల నేత్రాలూ,  హావభావాలు కలిసి ఆమెనొక విలక్షణమైన నర్తకిగా నిలబెడితే, తనకెంతో ప్రియమైన కళని పెంచి పోషించి, తరగని ఆ సంపదని భావి తరాలకి పదిలంగా అందించాలని నిరంతరంగా కృషి సలుపుతున్న మహా నర్తకి శ్రీమతి. శోభా నాయుడు. కళని ప్రేమించాలి, ఆరాధించాలి అని కేవలం చెప్పడం కాకుండా అనుక్షణమూ ఆచరించి చూపుతున్న అభినవ నాట్య సరస్వతి.. 
మృదు భాషణ  కీ, నిగర్వానికీ, నిరాడంబరతకీ మారుపేరుగా నిలిచిన ఈ నృత్య చూడామణి మార్గం ఎందరికో మార్గ దర్శకం.



No comments:

Post a Comment

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...