Tuesday, March 29, 2011

తీయగా పాడే చిన్నారులు..

          బాలూ గారు నిర్వహించిన అన్ని పాటల కార్యక్రమాలనీ విడవకుండా చూడడం నాకు చాలా ఇష్టం. ఈ టీ వీ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న చిన్నారుల ధారావాహికం 'పాడుతా తీయగా' చిన్నారుల చక్కని గాత్రాలతో, సరదాగానూ, సంస్కారవంతగానూ సాగే బాలూ గారి వ్యాఖ్యానంతో ఎంతో కమనీయంగా సాగుతోంది. అనవసరమైన డ్రామాలు కానీ, అక్కరలేని వ్యాఖ్యలు కానీ ఉండవు.
          .   వయసు లో చిన్నవారైనా, ప్రతిభలో ఏంతో  పెద్దవారిలా, చాలా అనుభవమున్నవారిలా పాడే ఆ చిన్న పిల్లలని చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది,  మనసంతా ఏంటో చెప్పలేనంత సంతోషంతో నిండిపోతుంది.  కష్టమైన పాటలు నేర్చుకోవడమే కాదు, చాలా సార్లు పుస్తకం అవసరం లేకుండానే అలవోకగా పాడేస్తారు  వాళ్ళు. ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ లు జరుగుతున్న ఈ కార్యక్రమంలో లక్ష్మీ మేఘన, రాఘవేంద్ర, అంజనీ నిఖిల, గణేష్ రేవంత్ లు చిచ్చర  పిడుగుల్లా పాడుతున్నారు. అందరిదీ తలో రకమైన విలక్షణమైన శైలి.  ప్రతీ వారమూ నువ్వా, నేనా అన్నట్టుగా కనిపిస్తారు. చిన్న చిన్న తప్పులు చేస్తే చెయ్యవచ్చు గాక, వారందరూ పాడే విధానం మాత్రం చక్కగా ఉంటుంది.
            పాట ఎంత బాగా పాడతారో,  అంతే చక్కగా తోటివారికి అవసరం అయినప్పుడు తమ గళాన్ని కోరస్ గా పంచుతారు. అన్నింటికంటే నన్ను ఆకట్టుకునేది వారి పసితనం, అమాయకత్వం. ప్రతీవారం 'ఉజాల' వారిచ్చే 'ఉత్తమ గాయకుడు/గాయని బహుమతి అమ్డుకునేప్పుడు వారు కనబరిచే సంతోషం, హావభావాలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. సొట్టలు పడుతున్న చిన్న బుగ్గల మీద విరిసిన ఆ నవ్వులు మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. అలాగే పొరపాటున ఏదైనా తప్పు చేస్తే గభాల్న నాలుక కరుచుకుంటూ,  భుజాలెగరేసి అందరినీ పరీక్షగా చూడడంలాంటివి కూడా .
       ఇవన్నీ ఒక ఎత్తు బాలుగారితో మాట్లాడేటప్పుడు వారిచ్చే సమాధానాలు మరొక ఎత్తు. 'గణేష్ రేవంత్' బాలు గార్ల మధ్యన నడిచే సరదా సంభాషణ అందులో ఒకటి. ఆయన కవ్విస్తున్నట్టుగా ఏదో ఒకటి అనడం, దానికి ఆ అబ్బాయి తడుముకోకుండా, కొద్దిగా భయం భయంగానే సమాదాలు చెప్పడమూ.  అలాగే.. 'ఎన్నేళ్ళుగా సంగీతం నేర్చు కుంటున్నావు?  అని అడిగితె  నేను ఎల్.కే.జీ లో ఉన్నప్పటినించీ అంది లక్ష్మీ మేఘన . దానికి ఆయన నువ్వు ఎల్.కే.జీ ఎప్పుడు చదివావో నాకెలా తెలుస్తుంది ? అంటే ఇప్పుడు నేను సిక్స్త్ అంది ముద్దుగా,  అంటే మీరు లెక్కపెట్టుకోండి ఎన్నేళ్ళ నించీ  నేర్చుకున్తున్నానో  అన్నట్టు.. ఇలాంటివి పిల్లల్లో ఉన్న అమాయకత్వాన్నే, నిజమైన పసితనాన్నీ చూపిస్తాయి.
      చేత ఉలి ని పట్టి శిల్పాలని చెక్కిన శిల్పి  బాలుగారు. ఈ గాన గంధర్వ జక్కన్నగారి కార్యక్రమం  'పాడుతా తీయగా, పాడాలని ఉంది' ల  నించి వచ్చిన ఎందరో గాయనీ గాయకులూ ఎంతో పేరు తెచ్చ్సుకున్న ప్రముఖులయ్యారు. అలాగే ఈ చిన్నారులు కూడా రాణిస్తారు. అందులో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా రావాలని ఆశిద్దాం.
           

2 comments:

  1. ప్రసీద గారు,
    చక్కగా రాశారు. నేనూ రాసుకున్నాను నాకుతోచిందేదో వారి గురించి. చూస్తానంటే ఇదిగో లంకె.
    http://paarijatam.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete
  2. చాలా బాగా రాశారు మందాకినిగారు. నాకు చాలా నచ్చింది.

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...