Tuesday, March 8, 2011

మహిళలూ- మణిదీపాలు (8 )

భారత రత్నాలు:   ముందుగా నా స్నేహితురాళ్ళందరికీ  నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత వారం రోజులుగా వివిధ రంగాలులో విఖ్యాతి గాంచిన భారతీయ మహిళలగురించి రాస్తూ ఉంటే ఎంతో ఉత్సాహభారితంగానూ, ఉద్వేగభరితంగానూ అనిపించింది. ఎక్కడ,  ఎవరితో మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో కూడా తెలియలేదు. కొన్ని నెలలు కొనసాగితే ఇలాంటి ఎందరో  ధీరవనితలకి న్యాయం చేసినట్టు అవుతుందేమో అనిపించింది. ఇక ఈ రోజు కొసమెరుపు ..... ఎవరిగురించి రాద్దామా? అని ఆలోచిస్తూ ఉంటే అరుదైన మన ఈ ఐదుగురు  భారత రత్నాలు మనసులో మెదిలారు. ఇలాంటివారిని మరలా  గుర్తు చేసుకోవడం కంటే నా ఈ టపాల క్రమానికి సార్ధకత వేరే ఉంటుందా ?అనిపించింది..అందుకే ఈ పోస్ట్ ఇలా....
1 . మదర్ థెరీసా : మానవతకీ, పేదల, దీనుల సేవకీ తిరుగులేని  మారుపేరుగా, ప్రపంచ వ్యాప్తంగా  ప్రేమనీ, సేవ తత్పరతనీ పంచిన కరుణామయిగా అందరి మనసుల్లోనూ చిరస్మరణీయురాలు  మదర్ థెరీసా. ఎక్కడో ఆల్బేనియా లో పుట్టి (26 ఆగస్ట్, 1910 ) , ఆ తరవాత భారతీయ పౌరసత్వం పొంది కోల్ కత్తా లో 'మిషనరీస్ అఫ్ చారిటీ' అనే సంస్థని స్థాపించి వారూ, వీరూ అని తేడా లేకుండా పేదలూ, రోగులూ, దీనులూ, అన్నార్తుల సేవలో నలభై ఐదు సంవత్సాలకు పైగా గడిపిన మానవతామూర్తి మదర్. అందుకే ఆమెకు పోప్ 'సెయింట్ హూడ్'  ప్రకటించారు. ఆమె గరిపిన సేవకూ, చూపిన కరుణకూ ఆమెకు దక్కని పురస్కారం లేదు. నోబుల్ శాంతి బహుమతి తో సహా అన్నీ అమ్మకు లభించాయి. భారత ప్రభుత్వం కూడా 1980 లో మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైన 'భారత రత్న' పురస్కారాన్ని  ప్రకటించి తనను తానే గౌరవించుకుంది. ఏనాడూ తనకోసం కాక పరసేవ లోనే జీవితమంతా  గడిపిన  మదర్   5 సెప్టెంబర్ 1997 న పరమపదించారు.
2 .శ్రీమతి  అరుణా అసఫ్ ఆలీ :  పేరెన్నిక గన్న స్వాతంత్ర సమర  యోధులైన మహిళలలో అరుణా అసఫ్ ఆలి అత్యంత ప్రముఖులు. పంజాబ్ లోని కాల్కా లో జూలై 16 , 1909 న అరుణా గంగూలీ గా జన్మించిన అరుణ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ముంబాయ్ లోని గోవాలియా టాంక్ మైదానం లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. స్వాతంత్రోద్యమ కాలంలో ఉప్పుసత్యాగ్రహం లోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరుణ చూపిన సాహసమూ, నాయకత్వ ప్రతిభా భారత స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడం లో సందేహం లేదు. భారత ప్రభుత్వం అరుణా  ఆసఫ్ ఆలీ కి ఆమె మరణానంతరం (జూలై 29 , 1996 ) 1997 లో వీరికి 'భారత రత్న" పురస్కారాన్ని ప్రకటించింది. 'క్విట్ ఇండియా ' ఉద్యమానికి మారుపేరుగా నిలిచిన 'శ్రీమతి అరుణా అసఫ్ ఆలీ' సేవలకి సరి అయిన నివాళి ఇది.
3 . శ్రీమతి ఇందిరా ప్రియదర్శినీ గాంధీ : పరిచయం  అక్కరలేని పేరు ఇది. మన దేశపు తొలి, ఆ మాట కొస్తే ఏకైక మహిళా ప్రధాని గానూ, తిరుగులేని నాయకురాలుగానూ చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే  ఈ స్త్రీ మూర్తిగురించి  కొత్తగా చెప్పబూనడం సాహసమే. నాలుగు విడతలుగా మొత్తం పదహారు సంవత్సారు ఆమె దేశాన్ని ఏలారు. మొదటినించీ రాజకీయ కుటుంబంలో పుట్టి (నవంబర్ 19 , 1917 ) పెరిగిన ఆమె రాజకీయాలలో రాణించడం ఎంతో సహజం గా జరిగినట్టు అనిపించినా దీనివెనక నిజానికి ఉన్నది అలుపెరుగని దీక్షా, కార్య దక్షతా. భయమనేది ఎరుగని నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు ఆమె. ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి నిర్ణయాల వల్ల ఆమె తీవ్రమైన విమర్శలను ఎదురుకోవలసి వచ్చింది, చివరకు ఆమె భద్రతా సిబ్బంది చేతిలోనే అకోబార్ 31 , 1984 న దుర్మరణం పాలయ్యారు. భారత ప్రభుత్వం ఆమెకు 1971 లో నే 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించింది. 
4 . శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మి: ఏ గొంతు వినబడితే కానీ దేవుళ్ళకి సైతం తెల్లవారదో, ఏ పాట వినపడితే ప్రతీ గుండె సప్త స్వరాల,  సరాగాలతో పులకరించి పోతుందో ఆ గొంతుకీ, ఆ గానామృతమూర్తికీ ఒక పేరు పెడితే ఆ పేరు ఎం. ఎస్. సుబ్బులక్ష్మి. దేశంలోనే 'భారత రత్న' పొందిన మొట్టమొదటి  గాయకురాలుగా చరిత్ర సృష్టించి, అజరామరమైన గానాన్ని మనందరికీ పంచిన ప్రఖ్యాత విదుషీ మణి, శ్రీమతి  మదురై షణ్ముఖ వదివు  సుబ్బులక్ష్మి. 'భజ గోవిందం' అని గోవింద నామాలు పాడినా, 'విష్ణుం జిష్ణుం' అంటూ విష్ణు సహస్ర నామాలు ఆలపించినా అది అనితరసాధ్యం అనిపించడం కేవలం ఆవిడకే సాధ్యం, సొంతం. నిండైన విగ్రహం, భారతీయ సాంప్రదాయత ని అణువణువునా ప్రతిబింబిస్తూ ఉండేలా వేష ధారణా ,మాటే మంత్రం లా ధ్వనించే గాత్రమూ.. వెరసి ఆమె పాడుతుంటే సాక్షాత్తూ అమ్మవారే పాడుతున్నట్టు అనిపించడం అందరికీ అనుభవమే. భారత ప్రభుత్వం వీరికి 1998 లో భారత రత్న ప్రకటించింది, శ్రీమతి ఎం. ఎస్ 11 డిశంబర్ 2004 న పరమపదించారు.
5 . కుమారి లతా దీనానాధ్ మంగేష్కర్:  భారత దేశ సినీప్రపంచపు గాన కోకిలగా గత అరవై సంవత్సరాలకు పైగా అశేష ప్రజానీకాన్ని తన మధురగానంతో ఓలలాడిస్తున్నమధుర గాయని లతా మంగేష్కర్.  వీరు ఇండోర్ లో సెప్టెంబర్ 29 , 1929 న జన్మించారు. వీరి తండ్రీ, సోదరుడూ, చెల్లెళ్ళూ అందరూ గాయకులే కావడం విశేషం. ఎన్నో  భారతీయ భాషలలో 25000 పైగా పాటలు పాడిన ఘనత ఆమెదే .ఎం. ఎస్ సుబ్బులక్ష్మి గారి తర్వాత 'భారత రత్న' పొందిన రెండో గాయని లతా మంగేష్కర్. ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ అదే మాధుర్యంతో, తరగని ఉత్సాహంతో పాడతారు ఆమె. ఈ కోకిలకి భారత ప్రభుత్వం 2001 లో 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించింది.

ఒకరా, ఇద్దరా? ఇలా రాసుకుంటూ పొతే ఎంత మందో, ఎనలేని పేరు ప్రఖ్యాతులు పొందినవారే కానక్కరలేదు.. గోరుముద్దలు తినిపిస్తూ, బుజ్జగించే అమ్మా,కమ్మగా కధలు, కబుర్లూ చెప్పే అమ్మమ్మా, నాన్నమ్మా,అత్తలూ, అత్తగార్లూ,  తోడుగా నడిచే తోబుట్టువులూ, ఎప్పుడైనా నేనున్నాను అని పలికే స్నేహితురాళ్ళూ, సహోద్యోగినులూ, టీచర్లూ, ప్రొఫెసర్లూ,  పై అధికారులూ, .. తరచి తరచి చూస్తె ప్రతీ ఒక్కరినించి మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాము కదా... స్ఫూర్తి పొందుతూనే ఉంటాము కదా.. అలా అనేక విధాలుగా, వివిధ సమయాలలో మనకు సహకరించి, మన జీవితాలని  స్పృశించిన స్త్రీ మూర్తులందరికీ  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
                     ఎందరో మహిళా మణిదీపాలు.. అందరికీ ప్రేమపూర్వక అభివందనాలు..

5 comments:

  1. ఎందరో ఉన్నత స్త్రీమూర్తులను పరిచయం చేస్తూ చాలా బాగా రాశారండీ

    ReplyDelete
  2. ఎంతో చక్కగా ఉన్నత మహిళలను పరిచయం చేస్తున్న మీ కృషికి నా ధన్యవాదాలు. మీకు నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. నలుగురు స్త్రీ రత్నాలు .. బాగుంది.

    ReplyDelete
  4. చదివి స్పందించినందుకూ, మీ శుభాకాంక్షలకూ నా కృతజ్ఞతలు. లతగారూ, జయ గారూ, మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మిరియప్పొడిగారూ.. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...