Sunday, March 6, 2011

మహిళలూ- మణిదీపాలు (6 )

 డా. వి.  శాంత: దాదాపు యాభై సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి నివారణ, చికిత్సల  నిమిత్తం పరిశోధనలు చేస్తూ, కాన్సర్ రోగుల సంరక్షణ   కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న వైద్య శిఖామణి డా. శాంత. ఆమె అవిరళంగా చేస్తున్న కృషి కి మెగసేసే అవార్డూ, పద్మ భూషణ్ లాంటి పురస్కారాలెన్నో ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
           డా. శాంత మార్చ్ 11 , 1927 వ తారీకున చెన్నై లో జన్మించారు.   ఆమె  ఎందరో విద్యావేత్తలూ, విద్యాధికులూ ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ఆమె కి చిన్నప్పటినించీ ఎంతో ప్రోత్సాహం లభించింది  ఒక   నోబుల్ బహుమతి  విజేత, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త  సర్. సి.వీ. రామన్  గారి సోదరుని మనవరాలు, మరొక  నోబుల్ బహుమతి విజేత, విశ్వవ్యాప్తంగా ప్రముఖులైన  శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చద్రశేఖర్ గారి  మేనకోడలు. డా. శాంత. చిన్నతనం నించీ ఆమెకి డాక్టర్ అవ్వాలనే కోరిక. మద్రాస్ మెడికల్ కాలీజీ నించి 1949 లో ఎం.బీ.బీ.ఎస్ డిగ్రీనీ, 1955 లో ఎం. డీ పట్టానీ పొందారు. ఎం.డీ పూర్తీ కాగానే పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వచ్చిన ఉద్యోగం కాదని డా. ముతులక్ష్మి రెడ్డి నెలకొల్పిన కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. మూడు సంవత్సరాలు  అక్కడ ఉచితంగా పని చేసిన తర్వాత ఆమెకి నెలకు 200 రూ జీతమూ, కాంపస్ లో ఇల్లూ దొరికాయి. అప్పటినించీ ఇప్పటివరకూ ఆమె అక్కడే నివస్తిస్తున్నారు.
             డా. ముతులక్ష్మి రెడ్డి గారి కుమారుడైన డా. ఎస్. కృష్ణమూర్తి తో కలిసి 12 పడకల చిన్న హాస్పటల్ నించీ 431 పడకలతో,  దేసవ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా  పేరెన్నిక గన్న కాన్సర్ ఇన్స్టిట్యూట్ గా తీర్చి దిద్దారు. వైద్యరంగం ఎంత ఆధునిక పద్దతులూ, పోకడలూ అవలంబించినా ఎప్పటికీ పేషంట్ ల విషయం లో ఎప్పటికీ మారనిది ఒకటుంది అంటారామె. ' ఎన్నో ఏళ్లుగా  కేన్సర్ కు గురి అయిన వారిలో మొదటగా కలిగేది విపరీతమైన భయం, మానసిక సంక్షోభం.ఒక డాక్టర్ వారితో ప్రేమగా మాట్లాడి, వారిలో నమ్మకాన్ని, భద్రతా భావాన్నీ కలిగించాలి.   అప్పుడే వారికి పరిస్థితులని ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది". ఈ రోజుల్లో ఇది జరగటం లేదని, అందుకే తానూ ఎప్పుడూ మెడికల్ విధ్యార్దులకీ, వైద్యులకీ ఇదే సలహా ఇస్తాననీ అంటారు.
          అంతే కాదు, "విలియం ఒస్లేర్ అనే ప్రఖ్యాత వైద్యుడు చెప్పినట్టు. వైద్యం కేవలం సైన్సే కాదు, గొప్ప కళ కూడా. స్వాంతన కలిగిస్తూ నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ పెంచడం కళ అయితే, చికిత్స సైన్స్. నిజమైన డాక్టర్ ఎప్పుడూ రోగానికే కాక రోగికీ కూడా స్వాంతన చేకూర్చి చికిత్స  చెయ్యాలి అంటారు. ఈనాడు లభిస్తున్న ఆధునిక వైద్య విధానాలవల్ల పూర్వం కంటే ఎంతోమందిని ఈ వ్యాదినించి కాపాడ   గలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తారు.      
         వైద్య విధానాలు వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో వీరు ఇంకా తమ నియమాలకి కట్టుబడి కనీసం 60 శాతం మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. చికిత్సకీ, వైద్యానికీ రాజూ-పేదా అనే తేడా లేదంటారు. రోగాన్ని చాలా తోలి దశలోనే గుర్తించడం ఏంటో అవసరమని, తద్వారా నివారణ కీ, చికిత్సకీ ఎక్కువ వీలు , సమయమూ ఉంటుందని అంటారు. దీనికి ఇప్పుడు పెరిగిన శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకోవాలని అంటారు.
              ఎనభై మూడు సంవత్సారాల వయసులో కూడా ఆమె ఎప్పుడూ వైద్యం చెయ్యడానికీ, ఆపరేషన్లు చెయ్యడానికీ కూడా ముందుంటారు. 'తమ జీవితం ఆమె తమకిచ్చిన వరం 'అని ఎందరో పేషంట్లు వినమ్రంగా చెప్తారు. "నాకేవీ హాబీలు లేవు, ఎందుకంటే టైమే ఉండదు నాకు అంటారు'. మేలుకుని ఉన్న ప్రతీ నిమిషం ఆమె కేన్సర్ వ్యాధి నివారణకీ, చికిత్సకే వెచ్చిస్తారు. అందులోనే ఆమెకి ఆనందం, ఉత్సాహం. దీనిలో అలసట లేనే లేదు, ఆలసత్వం దగ్గరకి రానే రాదు. వచ్చే ఐదేళ్ళల్లో మీరేమి చేస్తారు? అని అడిగితె 'ఇలా దీనికోసం పనిచేస్తూనే కన్నుమూస్తే చాలు 'అంటారు..
              సేవాతత్పరత అనేది చాలా అరుదైపోయిన నేటి వైద్యరంగం లో , అలాంటి స్వార్ధపూరిత వాతావరణాన్ని  సవాలు చేస్తూ తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేసిన డా. శాంత ఎందరికో ఆదర్శం కావాలి. ఆమె చూపిన బాట లో ఎందరో యువతీ యువకులు కదలాలి.. కలిసి నడవాలి. ఆ మహోన్నత వైద్య శిఖామణి కి  మనందరి అభినందనలు తెలుపుదాం. భగవంతుడు ఆమెకు సంపూర్ణ ఆరోగ్య ఆయుర్దాయాలని ప్రసాదించాలని కోరుకుందాం.
             

No comments:

Post a Comment

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...