Sunday, June 26, 2011

శ్రీ నీలోత్పల నాయికే..

       కొన్ని రాగాలూ, కొన్ని కీర్తనలూ మొదటి సారి వినగానే ఎప్పటినించో తెలిసిన వాటిలా అనిపిస్తాయి.మరెంతో కాలం గుర్తుండిపోతాయి. దానికి ప్రత్యేకమైన కారణాలు అక్కరలేదు అనిపిస్తుంది నాకు. ఆ యా రాగాలలోనూ, కీర్తనలలోనూ ఉన్న గొప్పదనం అది అనుకుంటాను నేను. కర్నాటక శాస్త్రీయ సంగీతం అంటే వల్లమాలిన ఇష్టం, అభిమానమూ తప్ప మరే గొప్ప అర్హతలూ నాకు లేవు.. అయినా సాహసించి ఒక రాగాన్ని గురించి అందులో స్వరపరిచిన కొన్ని కీర్తనలూ, పాటలగురించీ చెప్పాలని ఈ ప్రయత్నం.. ఇది చదివిన మిత్రులు ఇంకా వివరాలు నాకు తెలియచేస్తే చాలా సంతోషిస్తాను.
'శ్రీ నీలోత్పలనాయికే 'అన్న ఈ కీర్తన మొదటిసారి యూ ట్యూబ్ లో విద్వాన్. శ్రీ. టీ. ఎం. కృష్ణ పాడగా విన్నాను. మొదటిసారి వినడంతోనే ఈ రాగం ఎంతో గొప్పగా అనిపించింది.   తర్వాత సంగీత శిరోమణి శ్రీ. బాల మురళీకృష్ణ గారు పాడినది విన్న తర్వాత అయితే ఇంక చెప్పనక్కరలేదు.  అప్పటినించీ ఎన్ని సార్లు విన్నామో లెక్కలేదు. కార్లో, ఇంట్లో, సి.డీలో, కంప్యూటర్లో.. ఇలా లెక్కలేనన్నిసార్లు.విన్న ప్రతీసారి మరింత బాగా, గొప్పగా అనిపిస్తుంది. 

అందువల్లనే ఈ రాగాన్ని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని అనిపించింది. ఈ  రీతిగౌళ రాగం 22 వ మేళకర్త రాగమైన  ఖరహరప్రియ రాగానికి జన్య రాగం. ప్రస్తుతం రీతిగౌళగా ప్రసిద్ధి చెందినా ఈ రాగం యొక్క అసలు పేరు నారీ రీతిగౌళ. ఆనందభైరవి, శ్రీరంజని రాగాలకి చాలా దగ్గర పోలికలతో ఉన్నా, ఆరోహణలో 'ని, ని, స' అనే స్వరప్రయోగం ఈ రాగానికి ప్రత్యేకమైన ముద్రని చేకూరుస్తాయి. 

    శ్రీ ముతుస్వామి దీక్షితార్ రచించిన 'శ్రీ నీలోత్పల నాయికే' అన్న కృతితో పాటు, త్యాగరాజస్వామి రచించిన 'నన్ను విడచి కదలకురా', బాలే బాలేందు భూషిని, ద్వైతము సుఖమా లాంటివి, స్వాతి తిరుణాల్ కృతి 'జనని నిను వినా' లాంటివెన్నో ఈ రాగం లో ఉన్నాయి. 

శ్రీనగర నాయిక అయిన పార్వతీ దేవిని స్తుతిస్తూ సాగే ఈ కీర్తనలో దీక్షితార్ అనేకవిధాలుగా దేవిని ప్రస్తుతిస్తారు. నీలి కలువ పువ్వులో ఉద్భవించిన నాయిక అయిన ఆ  జగదంబికని కోరిన వరాలిచ్చే దేవతగా వర్ణిస్తారు.
 పల్లవి:    శ్రీ నీలోత్పల నాయికే..జగదంబికే..   శ్రీ నగర నాయికే... మామవ వరదాయికే..

దీన జనుల పట్ల అపారమైన దయా, జాలి లాంటి  లక్షణాల వల్ల అపరిమితమైన గౌరవం పొందినదట పార్వతీ  దేవి . విశ్వ గురువులూ, ఆచార్యులూ ఇతర ప్రముఖులూ ఈ జగత్తు సృష్టికీ,  విశ్వవ్యాప్తికీ మూలకారణంగా అభివర్ణించిన శక్తిస్వరూపిణి . సాక్షాత్తూ భైరవుడి చేతనే కొలవబడి నదట. ఎల్లప్పుడూ ఆనందంతోనూ, ఉల్లాసంతోనూ ఉండే ఈ పర్వతరాజ తనయ సుమ బాణదారి శత్రువు అయిన శివుని వల్ల కీర్తించబడినది.అంతే కాదు జ్ఞాన మనే సముద్రంలో అమృతం వంటిది అంటారు.
 చరణం: దీన జనార్తి ప్రభంజన రీతిగౌరవే, దేశిక  ప్రదర్శిత  చిద్రూపిణీ నటభైరవే. 
            ఆనందాత్మానుభావే అద్రిరాజ సముద్భవే....  సూన శరారి వైభవే జ్ఞాన సుదార్నవే శివే .. {శ్రీ}

అన్నిరకాల సంకల్పాలనే కాదు, వికల్పాలను కూడా తీర్చగలిగే శక్తివి నీవు అంటారు.ఎంతో గొప్పవారైన వారు కూడా సేవించే ఆదిశక్తివి నీవు, ఆదిగురువులకు కూడా శక్తినీ, స్పూర్తినీ ఇచ్చే తల్లివి, సమస్త సంకటాలను తీర్చే దానివి, గురుగుహుడికి ( దీక్షితార్) ఎంతో అనుకూల మైనదానివి. సృష్టి, స్థితి లయలకు మూల కారణమైన దానివి..నీ మహిమలచేత, గొప్పదనం చేత త్యాగరాజ స్వామిని  మైమరపించినదానివి..బంగారు వలువ ధరించిన కృపామయమైన మనసు కలిగిన శంకరివి. కలువరేకులవంటి విశాల నేత్రాలు కలిగి, పద్మ రాగ మణి మాలతో శోభిల్ల్లుతూ  శంకరునితో కీర్తించ బడుతూ, సదా సుమధురమైన సంగీతంతో విరాజిల్లే శారదవి అని కీర్తిస్తారు. 


            చరణం: సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తి జాలే, సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే
            సంకట హర ధురీణాతర గురుగుహానుకూలె, సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాదికాలే
            విటంక త్యాగరాజ మోహిత విచిత్రానుకూలె, శంకరి కృపాల వాల హటకా మయ చేలే 
            పంకజ నాయన విశాలే పద్మరాగ మణిమాలే, శంకర సన్నుత జాలే, శారదా గాన లోలె..    {శ్రీ}

ఎంతో భావోద్వేగంతో, అమ్మవారిని అణువణువూ ప్రస్తుతిస్తూ సాగే ఈ కీర్తన చాలా,  చాలా బావుంటుంది. శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ ఎప్పటిలాగే రకరకాలుగా అమ్మవారిని ప్రస్తుతిస్తూ,  సంస్కృతంలో రాసిన గీతం ఇది.ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. శ్రీ బాలమురళి పాడిన కీర్తన ఇదిగో. శ్రీ టీ.ఎం. కృష్ణ పాడినది ఇక్కడ
ఇదే రాగంలో చేసిన 'నన్ను విడచి కదలకురా' అన్న త్యాగరాజ  కృతి కూడా ఎంతో బావుంటుంది..నాకు చాలా ఇష్టం. ఇది నేను మొదటి సారి విద్వాన్. శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం గారి కచేరీ లో విన్నాను. ఆ తర్వాత  మహా విద్వాన్. మహారాజపురం సంతానంగారిది, భక్త పోతన సినిమాలో చిత్తూరు నాగయ్యగారు పాడినదీ కూడా.. అన్నీ బావుంటాయి.
ఇక ఈ రాగం లో చేసిన కొన్ని సినిమా పాటలు.
1 . శేష శైలా వాస.. శ్రీ వెంకటేశా.. వెంకటేశ్వర మహాత్మ్యం (పల్లవి)
2 . రామా కనవేమిరా..... స్వాతి ముత్యం 
3. కొంటె చూపుతో.. అనంతపురం 1980
4 . అందాల రాక్షసివే- ఒకే ఒక్కడు 

Thursday, June 16, 2011

సడి సేయకో గాలి.

  ఆషాడ మాసం వస్తోందంటే చాలు బెంగుళూరు లో విపరీతమైన గాలి వీస్తుంది. చాలా  వేగంగా, పెద్ద పెద్ద శబ్దాలతో. అప్రమత్తంగా లేకపోతె మనుషులు కూడా ఎగిరిపోతారేమో అన్నట్టుగా ఉంటుంది ఆ గాలి.  ఇది నాకు మేము హైదరాబాద్ నించి బెంగుళూరు వచ్చిన మొదటి  ఏడాది మా కొలీగ్ చెప్తే తెలిసింది.. ఆఫీస్ బిల్డింగ్ మేడ  మీద ఉన్న కాంటీన్ కి వెళితే అక్కడ కుర్చీలూ, ఒక్కోసారి బల్లలూ కూడా ఎగిరిపోయేవి ఎవరూ కూర్చోకపోతే. ( అదే జరిగి పోయేవి అన్నమాట). అప్పుడు తను  చెప్పింది.. 'ఆషాడ అల్వా.. ఈ తరానే గాలి బరోదు" అని..

'అరే.. ఆషాడ మాసం మన ఆంధ్రాలో కేవలం  ఈగలు బయటకు వచ్చే కీటక మాసం గానూ ( సంవత్సరమంతా జాగ్రత్తగా కూడబెట్టుకుని వర్షాకాలంలో బయటకు రాకుండా హాయిగా ఉండే చీమలు వర్సెస్ బద్ధకపు  ఈగలు కధ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, 'సేవింగ్ ఫర్ ఎ రైనీ డే ' అనేది కూడా పాపం చీమల నించే వచ్చింది .. గేర్ మారిపోతోంది కదూ..వచేస్తున్నా..) 'ఆషాడం సేల్, ఒకటి కొంటె మరొకటో  , పద్నాలుగో ఫ్రీ అని ఊదరగొట్టే 'సేల్స్ మాసం గానూ , గోరింతాకూ, మునగాకూరాల మాసంగానూ,  కొత్త దంపతులని విడతీసే విలన్ మాసంగానే తెలుసు కదా మరి ఇలాంటి గాలికి మన ఆంధ్రా ఫేమస్ కాదా? అని చాలా ఆశ్చర్యపోయాను.  నిజంగా నాకు గుర్తు లేదు అక్కడ ఎప్పుడూ ఇంత  గాలి వచ్చినట్టు... సరే సాయి కుమార్ లా  'కట్ చేస్తే' గత కొన్నేళ్లుగా బెంగళూరు లో ఆషాడ మాసపు గాలికి అలవాటు పడ్డాము. అదెలా ఉంటుందో చూపిద్దామనే ఈ టపా.

  సూక్తిముక్తావళి, భక్తీ రంజని ఇలాంటివి వచ్చే టైము  కి ( ఇవి ఇంకా వస్తున్నాయో లేదో తెలీదు అనుకోండి అది వేరే..)    మెల్లిగా కళ్ళు తెరుస్తానా!  రయ్యని, జోరుగా  వీస్తూ ఉంటుంది అప్పటికే.. అంతకు ముందు కూడా ఉంటుంది కానీ మనం నిద్రలో ఉంటాం కదా..అందుకని మనకి పెద్దగా తెలీదు. అదన్నమాట. చిన్న పక్క వాయిద్యం..  ఈ మధ్యన ఎలెక్ట్రిక్ స్టార్  కి ఇష్టమైన భక్తీ పాటల రంజని అనో, బాబా సందేవ్ (some dev)  చెప్పిన సూక్తి ముక్తావళి అనో వస్తూ ఉండవచ్చు కూడా.

అప్పుడు మొదలు అన్నమాట.. "సడి సేయకో గాలి.. సడి సేయ బోకే.. బడలి ఇంట్లో వారు పవ్వళించేరే' అంటాను.. స్వర్ణకమలంలో శ్రీ లక్ష్మి చెప్పినట్టు తాళమూ కుదరాలి, వరసా చెడకూడదు కదా.. బడలి రాజూ, యువరాజూ పవ్వళించేరే అని అనాలని ఉన్నా సరే.. కుదరదు కదా, మనకా మాత్రం సంగీత జ్ఞానం ఉంది కనక అలా తెలివిగా, తాళం చెడకుండా పాట  మార్చేయగాలిగానన్నమాట.  గాలి మన చెప్పిన మాట వినదు కదా.. మరింత గట్టిగా అరుస్తుంది.. 

ఈ లోపున మా వాడు లేచి 'ఈ గాలీ , ఈ నేలా... ఈ ఊరు బెంగుళూరు.. ననుగన్న నా వాళ్ళూ'. అంటూ  మొదలు పెట్టాడు.   నిజమే.. వాడు ఇక్కడ పుట్టకపోయినా నాలుగేళ్ల వయసు నించీ ఇక్కడే పెరిగాడు. నువ్వు 'సెకండ్ జెనరేషన్ బెంగుళూరియన్ వి' అంటూ ఉంటాము మేము. సిలికాన్ వేలీ అఫ్ ఇండియా నా,  మజాకానా.?. ఐ. పీ. ఎల్ లో కూడా వాడి సపోర్ట్ ఆర్. సి. బీ కే. వాళ్ళు ఆడినా, ఓడినా సరే.

సరే..ఎక్కడున్నాం? ఈ లోపున తను లేచి.. ఈ గాలేమిటి? ఈ ఈలలేమిటి? అని 'పూలు గుసగుస లాడేనని,విర బూసేనని  . గాలి ఈలలు వేసేనని సైగ చేసెనని ఇక్కడే తెలిసిందీ.. అంటారు.. అప్పుడు నేను అవును.. రోజుకి కనీసం  ఒక కొత్త విషయం తెలుసుకున్నా మంచిదే అని. ' ఈ రోజు బిజీ  అయినదీ.. ఈ గాలి ఆషాడానిది ' లేవండి ఇద్దరూ.. అని తొందర పెడతాను. . అలా  దినచర్యలో పడతాము. 

'ఎచట నుండి వీచెనో ఈ చల్లని  (చలి?) గాలి' అందామన్నా, 'తూలీ సూలేను తూరుపు గాలి' అనుకుందాం అన్నా  కుదరదు.. ఆఖరి అంతస్తు. కార్నర్ ఫ్లాట్. ఎక్కడ నించైనా  రావచ్చు.. అందుకే.. 'గాలికీ కులమేదీ? ఏదీ.. దిశ ఏదీ? అని పాడేసుకుని సరిపెట్టేసుకుని. ఇడ్లీ  కి పచ్చడి రుబ్బేద్దామని మిక్సీ పెట్టానో లేదో.. దానిని మించిన శబ్దం.  'ఆమె చీర నా చీర కన్నా తెలుపా?' టైపు లో 'పక్కవాళ్ళ మిక్సీ నా మిక్సీ కన్నా పెద్ద సౌండా?" అనుకున్నానా?  .. కానీ తరవాత తెలిసింది..అది మిక్సీ సౌండ్ కాదు.  కిటికీ అద్దాల మీదా, కొద్దిగా తెరిచినా తలుపుమీదా మన పవనుడు పాడుతున్న పంతువరాళి రాగం అని. 

తప్పమ్మా..గాలేప్పుడూ  'పిల్లగాలి ఊదెను పిల్లనగ్రోవి' అన్నట్టుగా ఉండాలి కానీ ఇలా భీభత్సంగా, భయపెట్టేటట్టు  కాదు అన్నా. అయినా అది  వినదు కదా.  'గాలికదుపు లేదూ, కడలి కంతు  లేదూ,నన్ను ఆపడం నీ వల్ల కాదు ' అంటూ మరింత గట్టిగా  వీస్తుంది. దాని రాగానికి మా తలుపుల తాళాలు, కిటికీల లయలు, డోర్  స్టాపర్ల జతులు.   ఈ ఆషాడ మాసం పుణ్యమా అని మాకు ఏడాదికో రెండు డోర్ స్టాపర్లు విరిగిపోతాయి..రెండు సార్లు అద్దాలు పగిలాయి కూడా తలుపులవి..  ఈ సారి అందుకే అయస్కాంతపు సాధనాలు పెట్టిస్తున్నాం మరి. 

కింద నడవడానికి వెళితే మనుషులేగిరిపోతారేమో అన్నంత భయంగా ఉంటుంది. నా వాకింగ్ స్నేహితులలో ఒకరు మరీ సన్నగా ఉండడం వాళ్ళ మేమందరం 'ఏమంటున్నది ఈ గాలి? ఎగిరే రేఖని (తన పేరు) అడగాలి ' అంటూ ఉంటాం. ఈ లోపున ఇంకో స్నేహితురాలు,  'గాలి చిరుగాలీ నిను చూసినదేవరామ్మా ? అన్నారు కానీ ఇంతకంటే చూడడానికేముంది?, ఇలా అందరినీ ఎగరేస్తుంటే..అంటుంది . మేము నిజమే కదా అంటాం.  

రోజూ పేరుకు వాక్ కి, అసలైతే కబుర్లకీ రోజూ వచ్చే ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు పడుతున్న చిన్న చినుకులకి పరవశించి పోయి 'పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లీ' అని మొదలు పెట్టేస్తారు. పిల్లలు కదా, పిల్లగాలీ, వెండిమబ్బూ, చిరుజల్లూ అన్నీ వాళ్ళకోసమే అనుకోవడం .. సహజం, ..అందరూ తమకు తాము త్రిషలూ, శ్రియలమే అనుకునే వయసే అది కదా మరి. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లి ఈ గాలిలో.. ఓహ్.. ఎక్కడో అలజడి.. అని అనకుండానే మేము 'రాక రాక వస్తోంది   గాలివానా, తడవకుండా ఉండండిరా  ఇంటిలోన .' అంటూ వర్షం వస్తే జ్వరంవస్తుంది అని పిల్లలనందరినీ లోపలి తరిమేస్తాం. 

మాట వింటే వాళ్ళు పిల్లలేన్డుకవుతారు? ఇంకా వాన రావడం లేదు కదా అందుకనే.. 'ఎగిరే గాలిపటానికి దారం ఆధారం, ఈ గాలే మూలాధారం ' అంటూ ఇంకా ఎగరేస్తాం అంటారు మగపిల్లలు. ఈ సరికే.' కొండగాలి తిరిగింది.. గుండె ఇంటికి పొమ్మంది ' అని తొందరగా  ఆఫీసులనించి వచేస్తారు అందరూ, లేకపోతె 'గాలివానలో, వాన నీటిలో' అనుకోవాల్సిన దురవస్థ ఎదురవ్వడం ఖాయం... 'ఈదురుగాలికి మా దొరగారికి' అని తమ భర్తలని చూసి పాడేసుకుంటారు ఆడవారు. అంతలో విధిగా కరంట్ పోతుందా, . యూ.పీ. ఎస్ లు ఉంటె పరవాలేదు.. లేకపోతె 'సుడిగాలిలోన దీపం, కడవరకు వెలుగునా' అని ఓ కొవ్వోత్తో, మరొకటో ( ఇంకేమున్నాయబ్బా ఈ రోజుల్లో) వెలిగించుకుని భజన చెయ్యడమే.. అన్నట్టు దాని హోరులో మన భజన కూడా వినిపించదు. అంత ప్రచండమైన, ప్రభంజనం లా ఉంటుంది మా ఆషాడ మాసపు గాలి.

Saturday, June 11, 2011

గోపాల రావు గారి అమ్మాయి .....అందంగా, బావుంటుంది.

 ఈ టీ.వీ వారు 'సెకండ్ షో    ' పేరిట రాత్రి పదిన్నరకి ( ఒక్కోసారి ఇంకా ఆలస్యంగా ) మొదలు పెట్టి సినిమాలు చూపిస్తుంటే 'ఇంత  రాత్రి అయితే ఎవరు చూస్తారు? ఏదో టైము గడపడానికి వేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ ఈ మధ్యన సిని నటులు  చంద్ర మోహన్, కృష్ణ గార్ల పుట్టిన రోజుల  సందర్భంగా ప్రసారం చేసిన 'గోపాలరావు గారి అమ్మాయి', శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' సినిమాలని నేనే చివరివరకూ కదలకుండా చూసేసాను. సినిమా మంచిది అవ్వాలే కానీ ఎప్పుడైనా , ఎలాగైనా జనం చూస్తారని అర్ధం చేసేసుకున్నాను :).

 కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ' అబ్బ భలే హాయి గా 'ఉంది అనిపిస్తుంది.. ఇక్కడ 'హాయి 'అన్నమాట తప్ప మరేమీ తట్టడమే లేదు.  ఎందుకంటే మొదటినించీ చివరివరకూ ఎవరో చక్కగా గీసిన గీత లా వంకర లేకుండా, సాఫీగా  సాగిపోతుంది కధ. సరిగ్గా అలాంటిదే ఈ సినిమా.

పక్క పాపిడి తీసుకుని గిరజాల జుట్టు దువ్వేసుకుని, పోట్టమీదకి ఉన్న పాంటు లోకి చొక్కా టక్ చేసేసుకుని, నాలుగో,  మళ్ళీ మాట్లాడితే ఆరో ఇంచెల హీల్ ఉన్న బూట్లు వేసేసుకుని కనిపిస్తూ  కేవలం తన నటనా పటిమతోనే తను నిజంగా  హీరోని అనిపించుకునే హీరో ..

అరే!.. ఈ అమ్మాయి ఎవరో అచ్చం మన పక్కింటి లోనో, మన ఇంటిలోనో  ఉండే అమ్మాయిల్లా ఉందే? అనుకునేలా ఉన్న హీరోయిన్.. మళ్ళీ అదే.. నటనే.. గట్టిగా మాట్లాడితే ఫాన్సీగా కనిపించే చీరలు కానీ, నగలు కానీ, అసలు మేకప్  కూడా ఉన్నట్టే  కనిపించదు.  పాత్రోచితంగా, చక్కగా నటించడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య అని ఎందుకంటారో మరొకసారి తెలుస్తుంది.

ఎక్కడా నటిస్తున్నట్టే అనిపించదు.. పాత్రల్లో ఒదిగిపోవడం అంటే ఇదేనేమో.. అలా అని ఆ పాత్రలేమీ పెద్ద పెద్ద డయలాగులూ, చొక్కాలూ ( ముళ్ళపూడి రమణ గారు చెప్పినట్టు)  ఉన్నవేమీ కాదు. మరీ అంత హావ భావాలు ప్రదర్శింపవలసినవేమీ కాదు. అయినా ఎంతో సహజంగా పాత్రలని పోషిస్తారు చంద్రమోహన్, జయసుధ .

 వీరికి తోడు.. వయసు ముందుకీ, మనసు వెనక్కీ పరిగెడుతున్న ఒక డబ్బున్న  రావు గోపాలరావు ,  ఆయన మాటకి మాట, విసురుకి విసురూ చురుగ్గా వేసే ఆయన  ఇల్లాలు  షావుకారు జానకీ.. క్లుప్తంగా చెప్పాలంటే వీరి నలుగురి మధ్యనా ప్రేక్షకులకి అర్ధం అవుతూనే, పాత్రలని మాత్రం  కన్ఫ్యూజ్ చేస్తూ  హుషారుగా నడుస్తూ, నవ్వించే కధనం.. కద కి  అవసరమైనంతవరకూ కావలసిన మిగతా పాత్రలు.  పంచ్ లూ, పించ్ లూ లేకుండా నే నడుస్తూ, అర్ధవంతంగా సందర్భానికి తగ్గట్టుగా రాసిన సంభాషణలూ. చాలా బావుంటుంది.

'పని చేస్తూ ఉంటె వాళ్ళే పరిచయం అవుతారు, పని మానుకొని పరిచయాలు చేసుక్కోక్కర్లేదు ' అనేది ఈ మధ్యన వచ్చిన ఒక సినిమాలో ని వాక్యం.. అలాగే కధా, కధనాల్లో హాస్యానికి చోటూ, నటీ నటుల్లో ప్రతిభా ఉంటె చాలు, నవ్వులు అవే పూస్తాయి. హాస్యం పేరిట అక్కర్లేని పాత్రలు కల్పించి అపహాస్యం పాలు కానక్కరలేదు అని చూపిస్తుంది ఈ చిత్రం. ప్రధాన పాత్రలతో సహా అందరూ చక్కని హాస్యాన్ని చిలికిస్తారు.

ఇక పాటలు.. చక్రవర్తిగారు చేసిన మంచిపాటల్లో ఇవి తప్పకుండా ఉంటాయి అనిపిస్తుంది.. టైటిల్ సాంగ్, సుజాతా ఐ లవ్ యూ సుజాతా, వస్తావు కలలోకీ, మనవే వినవా.. ఇలా అన్ని పాటలు విన్న వెంటనే ఆకట్టుకోవడమే కాదు తరవాత కూడా మనం హమ్ చేసుకునేలా ఉంటాయి.  మాములు పార్కుల్లోనే తీసారు మరి, అందులోనూ ఒకటి జూ పార్క్ లో.  బాంకాక్ లు, స్విట్జర్ లాండు లలోనూ కాదు. అలా తీయడం తప్పని కాదు, అవసరం లేని చోట అక్కర్లేదు కదా అని. 

ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఈ సినిమా, ఆ తర్వాత హిందీ లో తీసిన సినిమా చూసాను. నాకెందుకో తెలుగు సినిమాయే బావుంది. హిందీ చిత్రానికి మాతృక ప్రియదర్శన్ గారి మలయాళం సినిమా అని చదివాను,కానీ అది తెలుగు సినిమా కంటే ముందు వచ్చిందా,  లేదా అనేది నాకు తెలియదు. మిత్రులెవరైనా తెలిస్తే దయచేసి  చెప్పండి.

Wednesday, June 1, 2011

మిధునం-శ్రీ రమణ కధలు.

 ఎనిమిదంటే ఎనిమిది కధలు.. అన్నీ ఆణిముత్యాలు. మళ్ళీ మళ్ళీ  చదవాలని, మరెన్నో సార్లు తలుచుకోవాలనీ,  కేవలం మనం చదివేసి ఊరుకోకుండా అందరితోనూ పంచుకోవాలని అనిపించే కధా రత్నాలు. చాలా సరళంగా, సుతిమెత్తగా, పౌర్ణమి నాటి వెలుగులో గోదారిమీద అలవోగ్గా తేలిపోయే వెన్నెల కిరణం లాంటి రచనా  సరళి, ప్రతీదీ వేటికవే విలక్షణంగా కనిపిస్తూనే, నిత్యజీవితంలో ఎదురయే సంఘటనల లాంటి  ఇతివృత్తాలూ, మన మధ్యనే కదిలే మనుషుల్లాంటి పాత్రలూ, సున్నితమైన హాస్యం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎక్కడా ఆగాలో తెలీదు నాకు.. ఎన్ని సార్లు చదివి ఉంటానో ఇప్పటికి.. పుస్తకం పేరున్న కధ అన్నింటికంటే చివర ఉంది కనక వెనకనించి రాసుకొచ్చాను.. ఇదో సరదా అనుకుందాం ఇప్పటికి.
1 . మిధునం: పుస్తకం శీర్షిక పేరే ఈ కధ పేరు. ఎన్నో దశాబ్దాల సంసార జీవిత రధాన్ని ఎంతో ముచ్చటగా కలిసి నడుపుకునే వృద్ధ దంపతుల కధ ఇది .. ఈ కధ రాసిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. ఇది చదివి బాపు గారు తన స్వదస్తూరితో రాసి ఇచ్చారుట. రచన పత్రిక వారు ముఖచిత్రంగా బాపు గారి బొమ్మ వేసి , వారి దస్తూరిలోనే ప్రచురించారు రెండుమూడుసార్లు (మొదటిసారి వేసినప్పుడే నేను ఈ కధ    మొదటిసారి  చదివాను ). కలిసి బతకడం సులువు.. కలిసి జీవించడం..జీవితాన్ని ఆస్వాదించడం చాలా కష్టం.. దాన్ని సాధ్యం చేసుకోవడమే అందమైన దాంపత్యానికి ఆధారం అని నేను అనుకుంటాను. ఈ కధలోని అప్పదాసుగారికీ, వారి సతీ మణి కీ తెలిసిన విషయాల పరిధి చాలా చిన్నది కావచ్చు.. దాంట్లోనే వారు తమకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరుచుకున్న తీరూ, రోజంతా ఒకరికోకరుగా మెసిలే విధానం, దానిలో దొర్లే వెక్కిరింతలూ, చతురోక్తులూ, చమత్కారాలూ..పాయసంలో జీడిపప్పు , కిస్మిస్ ల లా రుచిని మరింత పెంచుతాయి . ముగింపు మాత్రం ఆర్ద్రత తో కూడి మనసుని బరువు చేస్తుంది.. చాలా గొప్ప కధ. దీనిని సీరియల్ గా తీస్తే ఎలా ఉంటుందా? ఆ పాత్రలకి ఎవరు బావుంటారా? అనుకుంటూ ఉంటాను చాలా సార్లు.  

2.పెళ్లి: సమకాలీన సమాజానికి అద్దం పట్టే చిన్న కధ. ఒకానొక ఆఫీసర్ గారి అమ్మాయి పెళ్లి నేపధ్యంలో రాయబడింది. అధికారం, హోదా దొరకగానే ప్రతీ ఒక్కరూ తమ పరిధిలో తమ కన్నా కింద స్థాయి  ఉద్యోగులని ఎలా ఇరుకున పెట్టి తమ పనులు చేయించు కుంటారో, వారు కూడా పై అధికారుల ప్రాపకం కోసమో, మరే ఇతర మొహమాటాల వల్లనో లేని పోనీ ఇబ్బందులకి గురి కావడమూ  కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. తాడిని తన్నేవాడు ఒకడైతే  , వాడి తలని తన్నేవాడు మరోకడూ.. గుడిని మింగే వాడు ఒకడైతే  , గుడినీ,  లింగాన్నీ  కూడా మింగేవాడు మరొకడు.. అన్న రీతికి అద్దం పడుతుంది.

3. బంగారు మురుగు: మానవతా వాది అయిన ఒక బామ్మగారూ, ఆ బామ్మకూచి అయిన  బుల్లి మనవడూ,  వీళ్ళిద్దరూ అమర్చుకున్న  తమదైన ఒక చిన్న బాదం చెట్టు తొర్ర, ఆవిడ చేతిన ఉన్న బంగారు మురుగూ, దాని మీద కన్నేసిన కూతురూ, కోడలూ.. మనవడి పెళ్ళికోసం ఆవిడ నడిపిన మంత్రాంగమూ .. అది తెలుసుకున్న మనవడు పడే బాధా. వెరసి  ఎంతో హృద్యంగా సాగే ఇది తప్పకుండా  చదివి తీరాల్సిన కధ. బాదం చెట్టు నీడలో సేద తీరుతున్న బామ్మ మనవడి బొమ్మ ఎంత బావుంటుందో.. బామ్మగారు చెప్పే జీవిత సత్యాలు, మానవతా సూత్రాలు అంతే  బావుంటాయి.

4. షోడా నాయుడు: మామూలు ఇతివృత్తాలతో    ఇంత గొప్పగా కధ రాయవచ్చా అనిపిస్తుంది ఈ కధ చదివితే. ఒక్కసారి కాదు చదివిన ప్రతీసారీ. షోడా సీసా లో ఉండే నీలం రంగు గోళీ కాయ  మీద ఒక చిన్న కుర్రాడు మోజు పడతాడు, కారణం అలాంటిది తన స్నేహితులందరి దగ్గరా  ఉంది, తనకి తప్ప.. పీర్ ప్రెజర్ మరి.. అది సంపాదించడానికి సామ దాన, బేధ, చోరో పాయాలన్నీ ( దండం లేదు లెండి) పాటించినా ఫలితం ఉండదు... ఊరిలో ఉన్న షోడా నాయుడి వెనక తిరిగి కాళ్ళరుగుతాయే తప్ప. కాలక్రమంలో పట్నం లో చదువుకుని పెద్ద ఆఫీసరయి పోయిన ఆ కుర్రాడి దగ్గరకి అదే షోడా నాయుడు మరొక షోడా మిషన్ కోసం అప్పుకి రావడం, వచ్చినప్పుడు మర్చిపోకుండా నీలం గోళీకాయలు పొట్లం కట్టి తేవడం, అది ఇవ్వడానికి మొహమాట పడుతూ ఉండగానే ఆ మూట చేజారి అవన్నీ నేలమీద దొర్లడంతో కధ  ముగుస్తుంది. నా బాల్యాన్ని పొట్లం కట్టి తెచ్చిన సిద్దుడిగా అనుకుంటాడు  హీరో. నీలం గోళీ పిచ్చిలో కుర్రాడికి సూర్యుడు కూడా   నీలం గోళీలా  కనిపించడం, తన ప్రపంచమంతా షోడా మయమే అయిన నాయుడికి కువైట్ అయినా, కుగ్రామమైనా షోడా మిషనే ధ్యాసగా ఉండడం లాంటి విషయాలెన్నో ఎంతో హత్తుకుపోతాయి.

5. ధనలక్ష్మి: తెలివైన ఒక ఆడపడుచు చితికిపోయిన కుటుంబపు ఆర్ధిక స్థితినే  కాదు, సంసారాన్ని కూడా ఎంత చక్కగా దిద్దుకోగలదో చూపించే కధ. పెద్ద చదువు లేకపోయినా, తనకున్న లౌక్యాన్నీ, వ్యవహార జ్ఞానాన్నీ, కష్టపడే తత్వాన్నీ మదుపుగా పెట్టుకుని అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో,  'మేనేజ్మెంట్ వారికి పాఠంగా పనికివస్తుంది 'అని తోటి పాత్రలచేత ఎలా అనిపించుకుందో చూపిస్తూ కధ నడిపిన తీరు ఎంతో హాయి కోల్పుతుంది. కార్పోరేట్ కంపెనీలు నడిపినంత శ్రద్దగా నడుపుతుంది ధనలక్ష్మి తన వ్యాపారాన్ని. అంతేకాదు 'అన్నీ ఉండి  సంసారం లో సుఖం లేకపోతే ఏం  లాభం? అంటూ చాకచక్యంగా భర్త ఈగోని కనుక్కుని సరి ఐన మార్గంలో పని సాధించుకుంటుంది.. ఆవిడ చెప్పే వ్యాపార సూత్రాలు నిజంగానే 'ఆహా' అనిపిస్తాయి.   కొడిహళ్లి మురళీమోహన్ గారికధా జగత్  లో కూడా  చోటు చేసుకుంది ఈ కధ.

6. వరహాల బావి: అందరికీ కన్నతల్లిలా అనిపించే వరహాలమ్మ, ఆవిడకి జాగీర్దార్ ఇచ్చిన ఈనాము, నీరు లేని ఆ రెండు ఊర్లకి ఆమె తదనంతరం  ఆ ఇల్లు ఉన్న చోట తవ్విన బావీ కధా నేపధ్యం. గాజులబత్ అనే గాజులతని పరంగా సాగుతుంది. వరహాలమ్మ ని గౌరవించినంతగా ఆ బావిని అందరూ చూడటమూ, ఆవేశ కావేశాలకి లోనయి మతం పేరిట గొడవలు పడటమూ, గాజులబత్ వల్ల మళ్ళీ ఒకటీ కావడమూ కధని చక్కగా నడిపిస్తాయి. మంచి కధ. గాజులయ్యా, అతని మాటలు చాలా సహజంగా, ఆత్మీయంగా ఉంటాయి.

7. తేనెలో చీమ : పలుకుబడీ, ఆస్తి పాస్తులపరంగా ఇద్దరు పెద్దవారి మధ్యన నలిగిన ఒక బలహీనుడి కధ ఇది. వారిద్దరి మధ్య నడిచిన పందెం లో తన స్వేచ్చనీ, కావలసిన బ్రతుకునీ తుదకు తల్లినీ పోగుట్టుకుంటాడు శీనయ్య. అది మొదటిసారి తేనెలో ఇరుక్కోవడం. పందెం ముచ్చట తీరగానే వారు తనను పక్కకు నెట్టేస్తే బ్రతుకుతెరువు వెతుక్కుంటూ బావమరిది దగ్గరకి వచ్చి అక్కడ రౌడీలని తరిమి కొట్టినందుకు అందరూ మెచ్చుకుంటే మళ్ళీ తేనెలో ఇరుక్కున్నానా  అని అనుమానం రావడంతో ముగుస్తుంది.

8. అరటిపువ్వు స్వాములారు: భలే చమత్కారంగా సాగిన కధ ఇది. రకరకాల ఉదాహరణలతో అరటిపువ్వుని వర్ణిస్తూ, అరటిపువ్వుని, వేదాంతాన్నీ కలిపి బహు చతురతతో స్వాములారు చేసే ప్రసంగాలూ, తరవాత అరటిపువ్వు వడలు వేసి ఫలహారం చెయ్యడం నవ్విస్తాయి. చివరికి ప్రజలకి తెలిసి స్వామివారికి బుద్ధి చెప్పడంతో ముగుస్తుంది.. చక్కెరకేళి కాదు రాజకీయ కేళి.. ఎమ్మేల్లెలందరూ మంత్రులు కానట్టే పూతలన్నీ కాయలు కావు.. లాంటి వాక్యాలెన్నో.   

కొన్ని కధలు చాలా  నచ్చితే, కొన్ని చాలా, చాలా  నచ్చుతాయి.. బంగారానికి సంపెంగ పరిమళం అబ్బినట్టు  కధకు అతికినట్టుగా వేసిన  బాపు గారి బొమ్మలు మురిపిస్తాయి.   అందరూ తప్పకుండా చదవవలసిన  పుస్తకం. 

చివరగా ఒక్కమాట. మిధునం కధ చాలా  నచ్చి ప్రముఖ సాహితీ వేత్తా, చలనచిత్ర దర్శకుడు శ్రీ. ఎం. టి . వాసుదేవన్  నాయర్ ఈ కధ ఆధారంగా 'ఒరు ఉరి పుంజరి' (A Slender Smile) అనే పేరుతొ చలనచిత్రాన్ని రూపొందించారుట. అది ఎలాగైనా చూడాలని నా కోరిక. మిత్రులెవరైనా దీని గురించి తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి. 

 ఇలాంటి మంచి  కధలని మనవారు కూడా చిత్రాలుగానో, సీరియల్స్ గానో నిర్మిస్తే చూడాలని ఆశ. సినిమా సంబంధ కార్యక్రమాలకి మించి విస్తరించని మన టీ .వీ  చానెళ్ళ వారి ఆలోచన పరిధిలో వీటిని పాడు చేసే అవకాశమే ఎక్కువ ఉందేమో అని భయం కూడా. అందుకే వీటిని ఇలాగే వదిలేస్తేనే మంచిదేమో .. మన తలపుల్లో, ఊహల్లో ఎలాగైనా నిర్మించుకుని ఆనందించ వచ్చు కదా ..

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...