Thursday, November 25, 2010

నాకు నచ్చిన మూడు లాలి పాటలు...

        లాలి పాటకీ, మనకీ ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేము.. అమ్మ తరవాత మనతో అంతగా మమేకమైనది అమ్మ పాడే లాలేనేమో. ఈ భూమి మీద మనలో చాలా మంది ప్రయాణం "జో అచ్యుతానంద" అనో "రామా లాలీ" అనో మొదలవుతుందంటే అతిశయోక్తి కానే కాదు. "నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో చెప్పినట్టు ఇలా అంటే ఇలా నే కాదు.. మన తెలుగు వారికి ఇలా అయితే.. ఇతర భాషల వారికి వారి, వారి జోల పాటలతో అన్నమాట. :)
       "జో అచ్యుతానంద" అన్నది అన్నమాచార్య కృతి అని చాలా రోజుల వరకూ నాకు తెలియదు.. ఎవరో అమ్మలే కనిపెట్టి ఉంటారు అనుకునేదాన్ని.. నిజంగా చాలా మంచి కీర్తన. 'రామా లాలీ' అనే పాట  నిజంగా శ్రీ రాముడికి అతని తల్లులు పాడారో, లేదో తెలియదు.  కానీ పౌరాణికాలని అత్యంత అద్భుతంగా తెరకెక్కించే మన సినిమాలలో చూపిన విధానం నా మనసుకెంతో హత్తుకుపోయింది. పైనుంచీ వేళ్ళాడే బంగారుగొలుసుల ఉయ్యాలలూ, వాటిల్లో చిన్న చిన్న పట్టు పంచెలు కట్టుకుని,  ముత్యాల హారాలు వేసుకుని, చంద్రవంక లాంటి బొట్లు పెట్టుకుని ముద్దుగా,  బోసి నవ్వులు నవ్వుతున్న నలుగురు పిల్లలూ.. రామాలాలీ పాడుకున్నప్పు డల్లా   కళ్ళ ముందు కదులుతూనే ఉంటారు. ఆ తరవాత అనేక చిత్రాలలో రకరకాల లాలి పాటలూ, జోల పాటలూ వచ్చాయి.. ఎన్నో మంచి పాటలు.. మర్చిపోలేని పాటలు. అలాంటి మూడు పాటల గురించే ఇదిగో ఈ చిన్న టపా.. మూడు పాటలనీ స్వరపరిచినది శ్రీ ఇళయరాజా కావడం విశేషం.. ఇది పూర్తి చేసేవరకూ నేనూ గమనించలేదీ విషయం.

1. లాలీ లాలీ : ఈ మధ్యన వచ్చిన లాలి పాటల్లో  అగ్ర స్థానాన్ని పొందిన పాటల్లో ఇది తొలి  వరసలో  ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. డా.  సినారె కలం నించి జాలువారిన ఈ పాట ఎంత సరళంగా ఉంటుందో, అంత మధురంగా వినిపిస్తుంది.. లాలి పాట పాడి బిడ్డని నిద్రపుచ్చే ప్రతీ తల్లీ తన బిడ్డ వటపత్రశాయి అనే అనుకుని వరహాల లాలి పోస్తుంది, ఈ పాట పల్లవిలో అలాంటి రత్నాల లాలులూ, ముత్యాల పగడాల లాలలూ పోస్తారు సినారేగారు.

       మొదటి చరణం లో బిడ్డ లోకాలనేలే పరమాత్ముడైనా అమ్మ జోల వినకుండా పెరగడు  అన్న భావాన్ని ధ్వనింప చెయ్యడమే కాక ఎంత పెరిగినా పిల్లవాడు తల్లి కంటికి పసిపాపే సుమా! అన్న భావన వినిపిస్తారు. కళ్యాణ రామునికి కౌసల్య లాలీ.. యదువంశ విభునికి యశోద లాలీ అంటూ.. ఇదే భావాన్ని మరొక సినీ కవి ఇలా చెప్తారు. "అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైనా ఒక అమ్మ కు కొడుకే" అని..
     ఇక రెండో చరణంలో వివిధ వాగ్గేయ కారులు తమ ఇష్ట దైవానికి ఎలా జోలలూ, లాలలూ పాడారో అని ప్రస్తావిస్తారు. అలమేలు పతికి అన్నమయ్య లాలి పాడితే, కోదండ రాముడికి కంచర్ల గోపన్న పాడాడంటారు, కర్నాటక సంగీత త్రిమూర్తులలోని శ్యామ శాస్త్రి గారినీ, త్యాగరాజ స్వామిని గుర్తుకు తెస్తారు. 'ఉత్సవ సాంప్రదాయ కీర్తనలో' త్యాగరాజస్వామి చాలా మధురమైన లాలిపాటలు రాసారు, పాడారు. "రామా శ్రీరామా లాలీ", ఉయ్యాలలూగవయ్యా", "మల్లెపూల పాన్పు మీద" లాంటివి.
    సుమధురంగా లయ రాజు 'ఇళయరాజా' గారు స్వరపరచిన ఈ పాటని మధురగాయని శ్రీమతి పీ. సుశీల గారు కమనీయంగా, వీనులవిందుగా పాడారు
      ఇక  చిత్రీకరణ గురించి  చెప్పనే అక్కరలేదు. కాళ్ళమీద పడుక్కోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించడం, సాంబ్రాణి పొగ వేసి ఉయ్యాలలూపడం, గొడుగు పెట్టి మరీ నిద్ర పుచ్చడం అన్నీ ఎంతో సహజంగా ప్రతీ ఇంట్లో జరిగేవే అన్నట్టుగా చూపిస్తారు.  ఎంతో సాత్వికమైన అభినయాన్ని కనపరుస్తారు శ్రీమతి. రాధిక.
     చిత్రంలో మొదట తల్లి పాడిన లాలి పాటను తెలుగు వారందరూ గర్వపడే ప్రముఖ  కవి, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డాక్టర్.    శ్రీ. సి. నారాయణ రెడ్డి గారు రాస్తే, చివరలో కధానాయక మరణించే సన్నివేశంలో వచ్చిన చిన్న కొనసాగింపు శ్రీ సిరివెన్నెల గారు రాసారు.  ఈ సినిమా విడుదలైన తరవాత పుట్టిన తెలుగు పిల్లలందరూ  ఈ  జోల పాట చెవులా రా విని,  కళ్ళనిండా  నిద్ర పోయి  ఉంటారు అన్నది చాలా నిజం.
ఈ పాట ఇక్కడ వినండి.. లేదా ఇక్కడ  చూడండి.

2. లాలిజో..లాలిజో : సాధారణంగా లాలి పాటలు అమ్మలు పాడినట్టే చూపిస్తారు మన చిత్రాలలో ఎందుకంటే నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది కనక. నాన్నలు పాడే లాలి పాటలు లేవని కాదు కానీ అవి సాధారణంగా సెంటిమెంట్ పెంచడానికి వాడుతూ ఉంటారు.. ఉదా: సినిమాలలో తల్లి లేని పిల్లలకిల  తండ్రులు  పాడుతూ ఉండడం అలాంటివి అన్నమాట. ఐతే  'ఇంద్రుడు -చంద్రుడు 'సినిమా లోని ఈ పాట చాలా ప్రత్యేకమైనది అని నా అభిప్రాయం. ఇది కేవలం తండ్రి పాడే జోల మాత్రమే కాదు, తాను గతంలో  చేసిన తప్పులు తెలుసుకుని భార్యనీ, పెద్ద పిలల్లనీ క్షమించమని అడగలేని పరిస్థితులలో అందరికంటే చిన్నపిల్లకి చెప్తున్నట్టుగా తనకి తనే చెప్పుకునే మాటల్లాంటి పాట ఇది. 
   పల్లవి లో' పారిపోనీకుండా పట్టుకో నా చేయి ' అంటూ తనకి తనవారైన వారితోనే  ఉండాలన్న్న బలమైన కోరిక ని చెప్తాడు. అంతేకాదు బుద్దిగా కాపురం చేసుకుంటున్న ఒక పావురం ఎలా గతి తప్పిందో చెప్తాడు. 
        మొదటి చరణం లో దానిని కొనసాగిస్తూ.. మాయని నమ్మి, బోయవాడిని కోరిన  ఆ పావురం దాపునే ఉన్న ముప్పును ఎలా చూసి, తెలుసుకొని గండాన్ని తప్పించుకుంది ( కనీసం తప్పించుకున్నాను  అని అనుకుంది ) అంటూ.. ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి అని కూతుర్ని  దీనంగా అడుగుతాడు. తన ఇంట్లో తనకి చోటు లేదనీ, ఉండదనీ కాదు,  ఆ చోటు తనదే అని చెప్పుకోగల  అర్హత తనకి నిజంగా ఉందా అన్నది భావన కావచ్చు.. శాస్త్రి గారి కలంలోంచి రాని భావన ఉంటుందా? చిన్న,  చిన్న పదాలతో గొప్పభావాలని తట్టి లేపడమే  ఆయన ప్రత్యేకత.
            రెండో చరణంలో ఇప్పటి వరకూ పావురం పేరున చెపుతున్నది కధ తనదే అని ఒప్పుకున్నట్టుగా సాగుతుంది. పిల్లలూ , ఇల్లాలూ తనవల్ల గుండెల్లో బండలు మోస్తూ ఎంత క్షోభ పడ్డారో, నేరం తాను చేస్తే అభం , శుభం తెలియని వారు ఎలా శిక్ష ని అనుభవించారో  అని బాధ పడతాడు. దానికి పరిహారంగానే "తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా నంటాడు. తల్లిలా మన్నించూ, మెల్లగా దండించూ.". అంటాడు. "ఏ  తల్లికైనా మెల్లగా  మాత్రమే దండిచడమే తెలుసు.". అని అభిప్రాయమేమో.  అందుకే.. తను చేసిన తప్పులకి అమ్మ పెద్ద మనసుతో ఇచ్చే మెల్లని దండన సరిపోదనో,  ఏమో.. తరవాత "కాళి లా మారమ్మా, కాలితో తన్నమ్మా" అంటూ . అప్పుడైనా పెడదారి పట్టిన నా 'బుద్ధిలో లోపాలు దిద్దుకోగలనేమో 'అని కుమిలిపోతాడు. కంటతడి పెట్టించే సాహిత్యం, అభినయం.
       ఒక చిన్న పాటలో చిత్ర కధనంతా ఇమిడి పోయేలా  చెయ్యడం శ్రీ సిరివెన్నెల గారికి వెన్నతో పెట్టిన విద్య. అది ఇందులో ఆద్యంతమూ కనబడి, వినబడుతుంది.. సమయానికీ, సందర్భానికీ తగ్గట్టు రాసిన  ఈ మాటలు తప్ప , మరేమీ ఇక్కడ నప్పనే నప్పవు అన్నట్టు గా సాగే  పాట ఇది. దానికి జతగా తోడైన మరో  రెండు మణి భూషణాలు.. ఒకటి స్వరజ్ఞాని రాజా గారి సంగీతం రెండోది ఆ పాత్ర ధరించిన శ్రీ కమల్ హాస నే పాడారేమో అన్నంత గొప్పగా ఆలపించిన గాన గంధర్వుడు శ్రీ బాలు గారి గానం.దానికి తోడేమో అనితరసాధ్యమనిపించే కమల్ హాసన్ గారి అభినయం. మొత్తమ్మీద మరిచిపోలేని మధుర గీతం..
ఈ పాట ఇక్కడ వినండి. ఇక్కడ చూడండి.

౩. ఓ పాపా లాలి: అమ్మలూ, నాన్నలూ తమ చిన్నారులకి పాడే లాలి పాటలు చాలా కమనీయంగానూ, కామన్ గానూ ఉంటాయి అని ముందే చెప్పుకున్నాం కదా.  అల్లన్తికోవకి చెందని, ఇది ఒక ప్రత్యేకమైన పాట, తన ప్రేయసికి ప్రియుడు పాడే పాట గానే మాత్రమే కాదు , సందర్భానికి తగ్గట్టుగా మధురంగా వినిపించే పాట ఇది. ప్రముఖ దర్శకుడు శ్రీ మణి రత్నం గారు దర్సకత్వం వహించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ( ఇప్పటివరకూ) "గీతాంజలి" చిత్రంలోది. మరణానికి చేరువలో ఉన్న తన స్నేహితురాలికి మిగిలి ఉన్న కొద్ది  రోజులూ ఏ రకమైన కలతలూ, కన్నీళ్ళూ లేకుండా హాయిగా గడవాలని  తపన  పడే ఒక ప్రేమికుడు అదే విషయాన్ని ప్రకృతికి కూడా వినిపించడం ఈ పాట నేపధ్యం. 
            తొలిగా పల్లవిలోనే 'ఈ జన్మకంతా సరిపడేలా లాలి'  పాడనా అంటూ ప్రారంభమవుతుంది. మొదటి చరణం లో గాలిని కూడా సన్నగా వీచమని అడుగుతాడు.. గుండె సవ్వడి  కూడా సన్నగా వినిపిస్తే బావుంటుంది అనుకుంటూ, జీవితంలో ఏమీ చూడని,  అనుభవించని, కన్న  కలలారని పసి పాపకి తడి నీడలు పడేలా కన్నీళ్ళతో నింప వద్దని  చేపల్లాంటి ఆమె కళ్ళని బ్రతిమాలుతాడు. అన్నింటికీ ఒకే అర్ధం.. ఆమె కి మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగానూ, సంతోషంగానూ ఉండేలా చూడాలని చెప్పడం.
          రెండో చరణంలో కూడా దాదాపుగా ఇదే భావాన్ని మరికొన్ని మధురమైన మాటలతో పొందుపరిచారు. మేఘాన్ని ఉరమద్దంటూ, కోకిలమ్మని తన పాట పాడమంటాడు, తీయని తేనెలు చల్లమంటాడు.  ఇరు సందెలు కదలాడే ఎద  ఊయల  ఒదిలో తనను దాచుకున్నాను, అంటూ,  తరవాత లైనులో సెలయేరుల అలా పాట కూడా వినిపించనంత ప్రసాంతత లో దాచుకున్నాను మీరు కూడా అలాగే ఉండనివ్వండి అని చలి ఎండకీ, సిరి వెన్నెలకి మనవి చేస్తాడు. ఇక్కడ ఇరు సందె లు కదలాడే ఎద అంటే  జననమూ మరణమూ అనే రెండు సందెలూ  అనుకుంటాను నేను, ఎద కదలికల ఫలితమే కదా ఏ సందైనా.  సినిమా కధ ప్రకారం గా నాకలా అనిపించిందేమో..
   మహాకవి శ్రీ వేటూరి రాసిన ఎన్నో మధురమైన గీతాలలో ఇది ఒకటి. పాటంతా ఒకే భావాన్ని  వివిధ రకాల మాటలతో, అనుభూతి చెదరకుండా చాలా చక్కగా చెప్తారు. బంగారానికి పరిమళం అబ్బినట్టుగా  ఉండే  ఇళయరాజా గారి సంగీతం,  బాలూ గారి గానం  పాట  భావాన్నీ, మూడ్ ని ప్రతిబింబిస్తాయి. మంచుపూల మధ్యన, ఎంతో మృదువుగా చిత్రీకరించిన మంచి పాట ఇది. ఈ చిత్రం విడుదల అయ్యాకా "గీతక్కా", "ఏం?" లాంటి మాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు పేరు పొందాయి ఈ చిత్రం లోని పాటలు..
ఈ పాట ఇక్కడ వినండి. ఇక్కడ చూడండి..
ఇవన్నమాట నాకు నచ్చిన ఎన్నో పాటలలోంచి నేను ఏరుకున్న   మూడు లాలి పాటలు.. అమ్మా, నాన్నా, స్నేహితుడూ..పాడినవి..

Monday, November 22, 2010

ఫ్రీగా వచ్చినా బావున్నాయే.. అసలైనవేనేమో??

         ఈ మధ్యన మనం కొనుక్కున్న వస్తువులకంటే ఫ్రీగా ఎక్కువ వస్తువులు వస్తున్నాయా? అని అనుమానం భయంకరంగా వచ్చేస్తోంది నాకు. దేశ, కాల, మాన పరిస్థితులతో సంబంధం లేకుండా  దుకాణాలన్నీ ఎప్పుడూ కళకళ లాడిపోతూకనిపిస్తున్నాయి.. కేవలం జనాలతోనే కాదు. సేల్,  సేల్, .. అన్న బోర్డులతోనూ.. లైట్లూ, మెరుపులూ వగైరా హంగులతోనూ.. కళ్ళూ, మనసులూ చెదిరిపోయే ఆఫర్లతోనూ..
      కొన్ని అర్ధం అయ్యే ఆఫర్లూ.. మరికొన్ని అర్ధం కానివీనూ . ఒకటి కొంటే  ఒకటి ఫ్రీ, లేదూ రెండు కొంటే  ఒకటి ఫ్రీ . ఇలాంటివి సులువుగా అర్ధం అయ్యేవన్నమాట. ఇంకోరకం ఇలా ఉంటాయి.. రెండు కొనండి,   రెండో దాని మీద ఇరవైయో, నలభైయో.. నూటపద్దేనిమిదో శాతం ఆఫ్..   ఇది కొంచం తిరకాసు వ్యవహారం.. ఇక్కడ అర్ధం, మొదటి దానిమీద ఏమీ లేదు.. రెండోది కొంటే   దానిమీదే డిస్కౌంట్ అని కదా .. ( నా మట్టి బుర్రకి అప్పుడప్పుడు ఇవి అర్ధం కావు కూడా). ఇలాంటివి ఇంకా ఉంటాయి. చాలా మంచి అవకాశం, 50% +40% డిస్కౌంట్  అనో.. లెకపోతే 50%+20%  డిస్కౌంట్ అంటూ ఇలా మన సాధారణ, లేక సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో  ఉన్న రకరకా ల చిహ్నాలూ, ఫార్ములాలూ వాడితే కాని అర్ధం అవని ఆఫర్లూ..ఇంత లెక్కల ఒలింపియాడ్ తగ్గట్టుగా ఎందుకూ లెక్కలు చెప్పడం? నిజం గా ఇచ్చేదేమైనా ఉంటే బుద్దిగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా..అనుకుంటాను నేను.
     మొన్న మా పక్కింటివాళ్ళ అబ్బాయికి 4 జతల బట్టలు కొంటే ఐదు జతల బట్టలు ఫ్రీగా ఇచ్చారుట.. (నిజంగా నిజం) . వాడి ఆనందం పట్టలేకపోయాము. పది నిమిషాల కో జత మార్చుకొని , వాళ్ళ అమ్మా నాన్నలకి చూపించి తరవాత  మా తలుపు కొట్టి మాకు చూపించడమూ, మళ్ళీ లోపలకి పరిగెత్తడమూ, ఇంకో జత వేసుకోడానికి  ..ఈ రకంగా వాడి  హడావుడి దాదాపు ఒక గంటసేపు నడిచింది అన్నమాట. ఆ ఐదేళ్ళ బుడతడి ఉత్సాహం చూస్తే చెప్పద్దూ.. నాకు కూడా భలే ముచ్చటేసింది..
      మరి  నల్లీ సిల్క్ వాళ్ళు ఒక మంచి పట్టుచీర కొనుక్కుంటే రెండు ఉచితం అని కానీ, స్టెర్లింగ్ హౌస్ వాళ్ళు ఒక సల్వార్ కమీజ్ కోంటే మరో మూడు ఫ్రీ అని కాని ఒక్కసారి కూడా అనరు గాక అనరు కదా. అలా కనక వాళ్ళు ఇచ్చేస్తే  నేను  కూడా అవన్నీ కట్టేసుకుని,  ఈ పాటికి కారివాక్ లు ( అదేనండీ. కారిడార్ లో రాంప్ వాక్ లన్నమాట) అవీ,  ఒక రేంజ్ లో చేసేద్దును కదా అని చాలా సేపు బాధ పడిపోయాను. కానీ ఏం  చేస్తాం? చేసుకున్నవారికి చేసుకున్నంతా.
      ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా నాకూ ఒక అవకాశం వచ్చింది తొందరలోనే. M.T.V వారి టీ షర్టులు ట.  . వీళ్ళు ఒక్క  మ్యూజిక్  చానల్ మాత్రమే నడుపుతారు అనుకున్నా... ఇలా చొక్కాలూ, లాగూలూ  కూడా అమ్ముతారని  ఈ మధ్యనే తెలిసింది.. ఎలా అంటారా? మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్ లో దింపి వాడి కోసం ఎదురు చూస్తుండగా.  మరి  ఆ గంట సేపటిలో  వెనక్కి ఇంటికి వచ్చి  మళ్ళీ వెళ్ళలేము కదా మన బెంగళూర్ ట్రాఫిక్ లో.. అందుకని అక్కడే కూర్చునో, నించునో, కొంగ జపం చెయ్యటమో, ఎదైనా తినడమో, లేదా ఇలా పక్కన కనిపించిన షాప్ లో దూరి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేసుకోడమో మాత్రమే మార్గాలు. వేరే మార్గాంతరం లేదు కాక లేదు. 
        సరే అలా  ఆ షాప్ లోకి దూరానో లేదో.. M.T.V చొక్కాలు. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నాడు. షాప్ లో అతను  ఓహో.. మా పక్కింటి వాళ్ళ అబ్బాయంతల్లా  కాకపోయినా  మావాడి అలమారా ( అదే.. వార్డ్రోబ్) ఒక్కసారి మార్చి పారేసే మహదవకాశం  నాకూ వచ్చింది కదా!  అని గబగబా చూసేసాను. అంతేకాదు.. " పొడుగయ్యిపోయాడు.. పాతవి పట్టడం లేదు.. ఇవి బానే ఉన్నాయి. మూడు నెలలోచ్చినా చాలు" వగైరాలన్నీ  నాకునేను ముందు  చెప్పేసుకుని.. అర్జెంట్ గా  ఫోన్ చేసేసి తనకి కూడా చెప్పేసి.. మొత్తానికి మూడు కొన్నాను.. అవీ, వాటితో  ఫ్రీగా వచ్చినవీ కలుకుని నా ముఖం చేటంతా.. మోయ్యాల్సిన బరువు    కొండంతా  అయ్యాయి.. అయితే ఏమైంది? పరాలేదులే.. జీవితం లో లాభాలన్నీ ఊరికే వస్తాయా?  అనుకున్నాను. ప్చ్.. అమాయకత్వం!
        ఇంటికొచ్చాకా చూసుకుంటే నేను కట్టిన డబ్బుకి కొద్దిగా అటూ ఇటూగా అన్ని చొక్కాలు మామూలుగా కూడా కొనుక్కోవచ్చు అని తేలింది.. పొరపాటున నాలిక కరుచుకుని.. మోకాలి మీద కొట్టుకుని.. "పరవాలేదులే.!. వాడికి లేవు.. నేను కూడా జిమ్ కి వేసుకుంటాను" అని సర్ది చెప్పేసి వాటిని అర్జెంట్ గా  లోపల పెట్టేసాను.. "అవుట్ అఫ్ సైట్ ఇస్ అవుట్ అఫ్ మైండ్ "అని నాకు తెలీదా?.మా వాడేమో.. ఇదేం బ్రాండ్? నేను ఎప్పుడూ వినలేదు అని అననే అనేసాడు కూడా. ప్చ్ ! నా కష్టం అలా వృధా అయిపోయింది.  దానికి తోడూ  వాటిల్లో ఎక్కువ శాతం  ఒక నెల రోజుల్లో మేము ముగ్గురమూ రాత్రి పైజామాల మీదకి వేసుకున్టున్నామని మీకు నేను చెప్పలేదు.. చెప్పను కూడా..
        అలా తగిలిన ఆ చిన్న దెబ్బతో నేను కొన్ని రోజులు ఉచిత బట్టల జోలికి వెళ్ళలేదు.. అయినా నెలకోసారి వద్దన్నా వస్తున్నా పండగలూ,., పబ్బాలు..  చేతులు కట్టేసుకుని కూర్చోలేము కదా.. అయినా పాపం కూర్చున్నాము. 

      సరే ఇంతట్లోకి నాకు బొంబాయి వెళ్ళే పని వచ్చింది.. ఈ లోపున మా అబ్బాయి వాళ్ళ నాన్నా కలిసి డ్యూయల్ సిమ్ కార్డ్ లు వేసుకోగలిగే ఫోన్ కావాలి.. అందులో సింపిల్ మోడల్ చాలు నాకు.. నాది చాలా సింపిల్ టేస్ట్ అదీ ,ఇదీ ( ముందర కొన్న హై, ఫై ఫోన్ లూ, గేజేట్లూ గుర్తుకి రావు)  అంటూ నాకు బిల్డ్ అప్ లు ఇచ్చి.. "సంగీతా" షాప్ కి వెళ్లి సామ్సంగ్ వాళ్ళది ఏదో ఒక ఫోన్ కొనుక్కోచ్చారు. నేను వచ్చేసరికి " ఆ ఫోన్ తో పాటు ఈ గ్లాస్ ఫ్రీగా ఇచ్చారు సంగీతా వాళ్ళు , అని భలే ముద్దుగా ఉన్న ఒక వెండి గ్లాస్ చూపించారు కూడా. " ఇంత చిన్న ఫోనుతో  ఇలాంటి వెండి గ్లాసా" అని మేమందరమూ హాచ్చెర్య పడి పోతూ ఉండగానే వచ్చింది ఒక చిన్న అనుమానం.. "ఆ ! మహా మహా వస్తువులు కొంటేనే వెండిసామాన్లు ఇవ్వరు , ఇది  ఆ మధ్యన నేను మల్లేశ్వరం మార్కెట్లో చూసిన తెల్ల లోహంది ( వైట్ మెటల్ అన్నమాట)  అయ్యి ఉంటుంది అనుకున్నాను . ఎందుకంటే అప్పుడెప్పుడో మేము వాషింగ్ మెషీన్ కొన్నప్పుడు బంగారు గాజులు ఫ్రీ అని ఇరవై పైసల బిళ్ళతో చేసిన గాజుల జత ఇచ్చారు. వాషింగ్ మెషీన్ కి బంగారు గాజులు ఇస్తారంటే మేము నమ్మలేదు కానీ అలా వాళ్ళు ప్రకటించుకోవడం నవ్వొచ్చింది. ఇదీ అలాంటిదే అనుకున్నాం.
          "  కొత్త బట్టలు ఉన్నాయి  కదా. నీ ఫోన్ పాడయిపోయింది.. కొత్తది కొందాం "అని దీపావళి కి మళ్ళీ అదే షాపు కి వెళ్ళాము. ఈ సారి మా వాడు "టచ్ ఫోన్ కొందాం, టచ్ మీ నాట్ ఫోన్ వద్దు "అదీ అని మొత్తానికి కొద్దిగా ఎక్కువ ఖరీదున్న  ఫోన్ కొనిపించాడు. "అబ్బో! ఆ చిన్న, సింపిల్ ఫోన్ కే అంత లావు వెండి గ్లాస్ ఇచ్చేస్తే మరి ఇంత ఖరీదైన ఫోన్ కి కంచమో, వెండి చెంబో ఇచ్చేస్తారేమో" అని నేను మనసులోనే అనేసుకున్నాను .. నయం పైకి  అనలేదు.   బిల్ కట్టేసి అప్పుడు మెల్లిగా అడిగాము.. "కిందటి వారం ఈ ఫోన్  కోంటే వెండి  గ్లాస్ ఇచ్చారు.. ఇప్పుడు దీపావళి కూడా కదా. మరి ఈ పెద్దఫోన్ కి ఏమి ఇస్తున్నారు? "అని.. 
        "ఆ స్కీం అయిపోయిందండి.. ఇప్పుడేమీ లేదు" అన్నాడు మొదట.  ఇంకోసారి అడిగాకా మెల్లిగా చిన్న కవర్లోంచి మళ్ళీ గ్లాసూ, చిన్న వెండి (?) కుందులూ చూపించి.." దీపావళి కదా ఈ దీపాలు కూడా ఉన్నాయి. మీకు ఏది కావలిస్తే అది తీసుకోండి "అన్నాడు రహస్యంగా. మళ్ళీ ఎవరైనా వింటే ఏం  ప్రమాదమో !అన్నట్టుగా.. "చూసారా! అడగందే అమ్మైనా పెట్టదు అని ఒక గ్లాస్ ఉంది కదా, అసలే కొత్తగా దేముడి మందిరం కూడా చేయించాము, దీపాలు తీసుకందాం "అని తీసేసుకున్నాను.. భలే.. భలే ! నా దేవుడి మందిరానికి కావలసిన హంగులన్నీ ఇక్కడే అమిరిపోతున్నాయి అన్న ఆనందంతో. సరే మిలమిల లాడుతున్న ఆ గ్లాసూ, దీపాలు పెట్టేసుకుని దీపావళి పూజ కొత్త మందిరం లో చేసేసుకుని ఆనందించేసినా   "అవి వెండి సామానులా , కావా? "అన్న అనుమానం అలాగే ఉండిపోయింది.  వాటిని చూస్తె వారం రోజులైనా రంగు  మారలేదు, రవ్వంత మెరుపు తగ్గలేదు.. "అరే!. ఇవి నిజంగా వెండి  వాటి లాగే ఉన్నాయే.. గ్లాసు తీసుకోవలసిందేమో.. రెండూ జతగా ఉండేవి, ఈ కుందులు మరీ చిన్నవిగా ఉన్నాయి కూడానూ"  అని ఇంకో బాధ.. ఆశ.. దురాశ ...
         అనుమానం అన్నది రానే కూడదు.. వచ్చిందా ?మరి మనల్ని నిలబడ నివ్వదు  కదా. మా పక్కింటి స్నేహితురాలికి చూపించాను.. ఇలా, ఇలాంటి సంగతి అని చెప్పాను.. ఆవిడ వాటిని ఎగా ,దిగా , కిందా, పైనా చూసి "వెండివాటి లాగే ఉన్నాయి ,పోనీ మన కాలనీ లో ఉన్న బంగారం షాప్ లో అడగండి "అన్నారు.
     సరే.. మర్నాడు ఏదో పెద్ద పని ఉన్నట్టు గా  వెళ్లి, చాలా కాజువల్ గా ఏదో వేరే వస్తువు గురించి అడుగుతూ దీని విషయం అడిగాను.. అతను " అయ్యో. మేము ఇక్కడ టెస్టింగ్, పాలిషింగ్ చెయ్యడం మానేసామండి. ఎందుకంటే మొదట ,మనుషులు దొరకటం లేదు, రెండు , షాప్ లో A.C పెట్టాకా యాసిడ్ పొగలు ఒక పట్టాన పోవండి.. మూడు,  వర్క్ షాప్ కి పంపిద్దామంటే నాకు గిట్టుబాటు అవడం లేదండి.. వస్తువుకి  యాభై తీసుకుంటారు వాళ్ళు." అని కర్ణుడి చావుకి ఉన్న కారణాల లాగా పెద్ద లిస్టు చెప్పారు. పైగా.." అందుకే పాత వెండి ఎక్స్చేంజ్ లో కూడా తీసుకోవడం లేదు "అన్న చావు కబురు కూడా చల్లగా చెప్పాడు. 'సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటే ఇదే మరి.'. అతని కష్టం మాట సరే.. ఇప్పుడు నా దగ్గరున్న ఆ వస్తువులు వెండివా ,కాదా అని తేలడం ఎలాగా? ఈ నా పీత కష్టం తీర్చే నాధుడెవరు? ఇదో పెద్ద సమస్య అయింది నాకు.
      "ఫ్రీగా వచ్చిన వస్తువులకి ఇంత పెద్ద హంగామా ఎందుకు? రోజూ వాడు.. బావుంటే వెండి.. లేకుంటే కాదు "అంటారు తను.. "అబ్బా అది నాకు తెలియదా? అయినా తెలియని విషయాలు తెలుసుకోవడమనే కుతూహలం ఉంది చూసారూ.. అది అంత సామాన్యంగా వదిలేది   కాదు.. అంచేత మీకెవరికైనా అసలైన వెండి సామాను కనిపెట్టే విద్యలు, చిట్కాలు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి. ఈ లోపున మా గ్లాసూ, దీపాలు వాటి రంగులు మార్చేసుకుని తమ అసలు రంగులు బయట పెట్టేసుకుంటే మీ చిట్కాలు వేస్ట్ అయిపోతాయి కదా.. అందుకే..

Sunday, November 21, 2010

బ్లాగుల్లో వనభోజనాలు..పప్ప, పప్ప పప్ప పప్పు దప్పళం

బ్లాగులలో స్నేహాలు .. కొబ్బరిలో నీళ్ళల్లా అన్నారు.. బానేఉంది, భలే కమ్మగా ఉన్నాయి ఈ స్నేహాలు, అచ్చు లేత కొబ్బరి నీళ్ళల్లాగే. అని సంబరపడిపోయాను నా బ్లాగ్ మిత్రులందరినీ చూసి ... భోజనాలూ. టిఫిన్లూ కూడా బ్లాగుల్లోనేనా? అనుకున్నా బ్లాగులలో వనభోజనాల గురించి వినగానే.. అందుకేనేమో.. హాస్యబ్రహ్మ జంధ్యాల కోడిని చూరుకి కట్టేసుకుని దానికేసి ఆశగా చూస్తూ ఆత్రంగా ఉత్తి అన్నం తినేసే చిట్కా ఎప్పుడో చెప్పేశారు. ఇలాంటి రోజులు వస్తాయని ఆయన ముందే ఊహించేసారు.. అని కూడా అనేసుకున్నా.
ఇప్పుడు మాత్రం!.. షడ్రుచుల మన వంటల జ్యోతిగారూ,కేవలం సొరకాయలే కాక అన్నిరకాల వంటల స్పెషలిస్ట్ మాలగారూ, కాబీజీ ఉడికించే కధ చెప్తూ సరదాగా టమాటా పచ్చడి చేసేసే భావన (ఉమా) గారూ.. ఇలా చెప్పుకుంటూ పొతే నా ఈ పోస్ట్ సరిపోనంత లిస్టు అయ్యే స్నేహితులందరి వంటలూ, వారు పెట్టిన టపాలు చదువుకుంటూ, చిత్రాలు చూసుకుంటూ రోజూ మనం వండుకునే వంటే ఈ రోజు కూడా తినాలి కదా అనేదే నా బాధ. అర్ధం చేసుకోరూ!!!!
అయితే నిజంగా రాసేడప్పుడు ఆ అనుభవం చాలా బావుంది లెండి అది వేరే విషయం.అది గట్టిగా చెప్పేస్తే ఇంకా అందరి వంటలూ ఎప్పటికీ ఇలా కంప్యూటరల లోనే తినేయమంటారు మరి. అందుకే ..ష్! గప్ చుప్ !!
సరే.. ఒప్పుకున్నాక తప్పేదేముంది? స్నేహబంధమూ ఎంత మధురమూ ( బ్లాగ్ స్నేహితలకిచ్చిన మాట వల్లే కదా ఈ టపా).. మన ఈ (కంప్యూ) వన భోజనమూ ఎంత అందమూ.. అనుకుంటూ వనాన్ని, ఉసిరి చెట్టునీ కొంతసేపు మర్చిపోదామని ప్రయత్నిస్తూ.. ఏమి వండాలి? దేని గురించి రాయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టా.. వంట వండే ఏ ఇల్లాలినైనా అడగండి.. వండడం ఎంత సులువో, ఏమి వండాలి? అని నిర్ణయించడం ఎంత కష్టమో? చాలా సులువుగా చెప్పేస్తుంది. అలా, ఇలా తిరుగుతూ , ఒక సారి పెన్ను తలమీద కొట్టుకుంటూ, ఒక సారి శూన్యం లోకి చూస్తూ, మరొకసారి చేసిన ప్రతీ వంటకీ రకరకాల భంగిమలలో ఫోటోలు తీస్తూ.. ఇలా చిత్రాతి చిత్రమైన వేషాలు వేసి మా ఇంట్లో వాళ్ళని కొన్నిరోజులు భయపెట్టాకా..
" ఆ! పెద్ద కష్టమైన వంటలు మన వల్ల కాదులే!.. చాలా సులువైనదీ, తప్పకుండా ఉండి తీరాల్సినదీ, రుచికరమైనదీ, వంటలలోకెల్లా ఉత్తమోత్తమైనదీ ( ఏమిటీ.. ఏదైనా వ్రతం తాలూకా విశేషణాలు గుర్తొస్తున్నాయా? ఇంచుమించు ఇదీ అలాంటిదే కదా మరి), అందరిచేతా ప్రశంసలు అందుకునే అర్హత ఉన్నదీ.. అయిన అలాంటి ఒక ఉత్తమ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చెయ్యాలని డిసైడ్ అయిపోయాను. అది మీకు ముందే తెలిసినా, నా కంటే చాలా బాగా చెయ్యడం వచ్చినా సరే.. మీరందరూ అమాంతం 'గజినీ' సినిమా గుర్తుకు తెచ్చుకుని ఈ వంట చేసే విధానం మర్చిపోవాలి అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అందుకని నా మీద పెద్ద మనసు చేసుకుని.. ఈ సారి కిలా కానిచ్చెయ్యండి మరి..
ఇక వంట గురించి చెప్పేద్దామా ? "ఆగు.... ఆత్రం లేదు... మరగనీ- బాగా మరగనీ.. దప్పళం, దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. అన్నారు 'మిధునం' కధలో ఒక రమణగారు ( ప్రముఖ రచయత శ్రీ రమణగారు). ఇంకో రమణ గారు మరికొంత ముందుకెళ్ళి తానూ తన ప్రాణమిత్రుడూ ఆలుమగల అనుబంధాన్ని ఎంతో అపురూపంగానూ, అద్దంలా అద్భుతంగానూ ఆవిష్కరించిన "పెళ్లి పుస్తకం" సినిమాలో "పప్ప, పప్ప, పప్ప, పప్పు దప్పళం " అని ఒక పాట కూడా పెట్టించారు ( సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి రమణగారు). మరి అదన్నమాట ప్రముఖుల చేత మననలూ, మన్ననలూ పొందినదే మన ఈ వంట.
ఈ ఇద్దరి మాటలు ఆదర్శంగా తీసేసుకుని.. ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను కూడా పప్పు.. దప్పళం చెయ్యడాని కి ఫిక్స్ అయ్యాను. సింపుల్ గా చెప్పాలంటే ముక్కల పులుసు అన్నమాట. సింపుల్ గా అన్నాను కదా అని మరీ అలా తేలికగా చూడకండి. సరిగ్గా చెయ్యకపోతే.. శ్రీ రమణ గారు కధలో చెప్పిన " క్షీరసాగర మధనంలా కోలాహలం ఉండదు మరి.. పోపు పడితే రాచ్చిప్పలో ఉప్పెన రాదు మరి.". అందుకే ఏమేమి వేసానో?, ఎలా, ఎలా చేసానో ? కింద చూడండి మరి.

మధురమైన ఈ దాంపత్యానికి.. అదేనండి దప్పళం చెయ్యడాని కి కావలసిన వస్తువులు..
సొరకాయ ముక్కలు- రెండు కప్పులు, తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి
చిలగడదుంప ముక్కలు- ఒక దుంప తొక్కతీసి గుండ్రంగా చక్రాలుగా తరుగు కోవాలి
బెండకాయలు- 4 - 5 - ముచికలు తీసి పెద్ద ముక్కలుగా కానీ, నిలువుగా కానీ తరుగు కోవాలి
గుమ్మడి కాయ ముక్కలు - ఒక కప్పు.. పెద్ద ముక్కలు..
టమాటో - ఇష్టమైతే వేసుకోవచ్చు.. పూర్తిగా చింతపండు కంటే ఆరోగ్యం కాదా.
పచ్చిమిరపకాయలు- మన ఇష్టానికి సరిపడినన్ని
బెల్లం - తగి నంత
చింతపండు- ఒక నిమ్మ పండంత. నీటిలో నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి.
సెనగపిండి- కొంచం నీళ్ళల్లో కలిపి ఉంచుకోవాలి.
కూర పొడి లేదా రసం పొడి కొద్ది గా
కొత్తిమీర తగినంత
ఉప్పు తగినంత
పసుపు.
పోపుకి:
ఆవాలు, జీలకర్రా, కరివేపాకు, ఇంగువ.

ఇంకా ఇలా చేసేసుకోండి మరి! ముందుగా తరిగిన కూరగాయ ముక్కలన్నీ పచ్చి మిరపకాయలతో సహా కలిపి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. కుకర్లో అయితే రెండు విజిల్స్ వస్తే చాలు, మైక్రోవేవ్ లో అయితే 5 -6 నిమిషాలు సరిపోతుంది. తరవాత ఇందులో చింతపండు రసమూ, ఉప్పూ, పసుపూ, బెల్లమూ వేసి మరిగించుకోవాలి. చిన్న గిన్నెలో కొంచెం నీళ్ళల్లో కలిపిన సెనగపిండిని దీనికి చేర్చాలి.. దీనివల్లన పులుసుకి చిక్కదనమూ, కమ్మదనమూ వస్తాయి . ఇప్పుడు కరివేపాకు వేసి మరొక రెండు నిమిషాలు మరిగించాలి. ఇష్టమైన వారు కూరపొడి కానీ, రసం పొడి కానీ వేసుకోవచ్చు.ఆ తరవాత చిన్న మూకుడు లో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జీలకర్రా, కరివేపాకూ, ఇంగువ లతో పోపు పెట్టుకుని అది కూడా మరుగుతున్న పులుసు లో వేసి, అప్పుడు కొత్తిమీర వేసి.. మూత పెట్టి, స్టవ్ ఆపేసి దింపుకోవాలి.
సన్నని సెగ మీద దోరగా కందిపప్పుని వేయించి దానికి తగినంత నీరు పోసి ఉడికిస్తే చక్కటి ముద్దపప్పు తయారవుతుంది. వేడి వేడి అన్నం మీద.. కమ్మని పప్పు.. కాచిన నెయ్యీ..తోడుగా దప్పళం.. ..సోమరాజు సుశీల గారి 'ఇల్లేరమ్మ కధల్లో'వాళ్ళ నాన్న అంటారుట.. పప్పూ, దప్పళమూ ఉంటే కూరెందుకూ? కుమ్ములోకి అని. మీరు అదే మాట అంటారు .. మేము అదే అన్నాము కనక.. అంతే కాదు.. ఈ వంకన కూర వండండం బద్దకింఛినా మీకు మరేమీ ఇబ్బంది ఉండదు అని ఇందుమూలం గా నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. కనక ఈ ఫోటోలు చూసేసి, ఈ పాట తాలూకా ఆడియో వినేసి , వీడియో చూసేసి .. ఇది వండేసుకుని, తినేసి హాయిగా నిద్రపోండి.. మరి మళ్ళీ ఎప్పుడో బ్లాగుల్లో భోజనాలకో, టిఫినీలకో మళ్ళీ ఇంకో వంటతో కలుసుకుందాం. సరే నా .. అమ్మయ్యా రాసేసాను.. ఇంక ఎలా ఉందో చదివి చెప్పేయండి మరి.
ఈ సందర్భంగా పాట వినేయండి మరి..






నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...