Tuesday, March 1, 2011

మహిళలూ- మణిదీపాలు (1 )

    మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతీ సంవత్సరమూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో మహిళలపై తమకున్న గౌరవాన్నీ, ప్రేమనూ వారు సాధించిన అభ్యున్నతినీ కీర్తిస్తూ, వాళ్ళ కీర్తి కిరీటాలలో మరెన్నో కలికి తురాయిలు చేరాలని ఆశించే రోజుగా జరపబడుతుంది. మొట్టమొదటగా ఈ పండగని జర్మనీలో 1911 వ సంవత్సరంలో మార్చి 19   వ  తారీకున జరిపారుట. ఈ ఒక్క రోజే మనదా? మిగతావన్నీ కాదా  ? అన్న ప్రశ్న పక్కన పెట్టి మనకంటూ కేటాయించుకున్న ఈ రోజుని చక్కగా ఆనందంగా గడిపేస్తే సరిపోతుంది కదా.. మహిళల దినోత్సవం అనగానే జీవితంలో ఎంతో సాధించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహిళలని గుర్తు తెచ్చుకోవడం సహజం.. నా మటుక్కు నాకు ఇలాంటి వారెంతో స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు, అందుకే అలాంటి కొందరిని గుర్తు చేసుకునే ఈ ప్రయత్నం..
1 . నిరుపమా మీనన్  రావు:  ప్రస్తుతం కేంద్ర  విదేశాంగ  శాఖలో (Ministry of External Affairs)కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి   గా (Foreign Secretary) గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి నిరుపమా రావు IFS ఆఫీసర్. విదేశాంగ కార్యదర్శిగా ఎంపిక అయిన రెండో మహిళ (మొదటి వారు చోకిలా ఐయ్యర్). 
       కేరళ లోని మలప్పురం లో జన్మించిన అరవై సంవత్స రాల  నిరుపమ,  తండ్రి ఆర్మీ ఉద్యోగ కారణంగా పలుచోట్ల చదువుకున్నారు. బెంగళూరు లోని మౌంట్ కార్మెల్ కాలీజీలో బి.ఎ లిటరేచర్, మరాఠ్వాడ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ పట్టాని పుచ్చుకున్నారు. 
      సివిల్ సర్వీసెస్ పరీక్ష లో, సర్వప్రధమురాలిగా 1973 లో ఎంపిక అయ్యి IFS లో చేరారు. అప్పటినించీ     ఈ నాటివరకూ ఆమె వృత్తి జీవితంలో అనేక పదవులను చేపట్టారు, అందులో వాషింగ్టన్‌లో పత్రికా వ్యవహారాల మంత్రిగా, మాస్కోలో డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా (తూర్పు ఆసియా), (విదేశీ ప్రచారం) విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో మొదటి మహిళా అధికార ప్రతినిధిగా, సిబ్బంది ముఖ్యాధికారిగా, పెరూ మరియు చైనాకు రాయబారిగా మరియు శ్రీలంక హై కమిషనర్‌గా ఎన్నో కీలకమైన పదవులలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. 
    IFS శిక్షణ ముగిసిన తర్వాత, ఆమె వియన్నాలోని(ఆస్ట్రియా) భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. 1981-83 మధ్యకాలంలో శ్రీలంకలోని భారత హై కమిషన్‌లో మొదటి కార్యదర్శిగా పని చేసిన ఘనత ఆమెదే . విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఆమె పనిచేసిన తొలినాళ్ళలోనే  చైనాతో భారతదేశానికి ఉన్న సంబంధాల విషయంలో   ఆమె వ్యవహరించిన తీరుకి  ప్రత్యేక గుర్తింపు  పొందారు మరియు ప్రధానమంత్రి డిసెంబర్ 1988లో బీజింగ్‌కు చారిత్రాత్మక పర్యటన చేసినప్పుడు అధికార సభ్యులుగా ఉన్నారు.

విద్య మీద ఉన్న మక్కువ వాళ్ళ ఆమె 1992-93 సంవత్సారాలలో ప్రఖ్యాత  హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని వెదర్‌హెడ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో  విద్యార్థిగా ఆసియా-పసిఫిక్ భద్రత మీద ప్రత్యేక అధ్యయనం చేశారు.
         వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాలలో మరియు మాస్కోలో మంత్రిగా మరియు డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా వరుసగా పనిచేశారు. ఆమె మొదటిసారి రాయబారిగా పెరూకు పంపబడ్డారు మరియు 1995-1998 మధ్యకాలంలో బొలివియా బాధ్యతలను కూడా తీసుకున్నారు. 2001లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ యొక్క మొదటి మహిళా అధికార ప్రతినిధిగా నియమింపబడ్డారు. భారతదేశ హైకమిషనర్‌గా 2004లో ఆమె శ్రీలంకకు పంపబడ్డారు. 2006లో, చైనాకు ఆమె భారతదేశం యొక్క మొదటి మహిళా రాయబారిగా అయ్యారు. ఆగష్టు 1, 2009న శివశంకర్ మీనన్ తరువాత ఆమె భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శి అయ్యారు.

డిసెంబర్ 21, 2010న, భారత విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ రావు పదవీకాలాన్ని  (31 జూలై 2011 వరకూ) పొడిగించటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 
 ఆంగ్ల సాహిత్యం మీదున్న మక్కువ  వాళ్ళ ఆమె  'రైన్ రైసింగ్ 'అనే కవితల పుస్తకాన్ని ప్రచురించారు. 
   
ఇంత గొప్ప అర్హతలున్న వీరు ఎప్పుడూ నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతారు.. తన గురించి చెప్పుకోవడం ఆమెకి తెలియనే తెలియదు. నిరుపమ శ్రీ సుధాకర్ రావు (IAS) ను 1975 లో వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిలేశ్, కార్తికేయ  అని ఇద్దరు పిల్లలు. 
'తనకప్పగించిన పనిని బాద్యతగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఇందులో నా గొప్పేమీ లేదు 'అంటారామె వినమ్రంగా.  జీవితంలో ప్రతీ రోజూ  ఒక కొత్త విషయం తెలుస్తుంది ,   నేర్చుకుంటే అంటారు అంతేకాదు వచ్చిన ప్రతీ కొత్త పదవీ మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికీ,  ఉద్యోగపరంగా  విషయ పరిహ్నానాన్ని పెంచుకోవడానికీ ఉపయోగ పడుతుంది   అని  చెప్పే నిరుపమా రావు గారి గురించి విన్నా,  చదివినా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మనమూ ఇలా ఉండగలిగితే ?అనిపిస్తుంది. అలాంటి మహిళా మణి దీపానికి హేట్సాఫ్.  
ఆవిడ స్పూర్తితో మరెందరో అమ్మాయిలు ఇలాంటి రంగాలని ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుందాం.


No comments:

Post a Comment

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...