కిరణ్ బేది (బేడి) : ఈ పేరే ఒక సంచలనం అప్పటికీ, ఇప్పటికీ కూడా. మన దేశపు తొలి ఐ.పీ.ఎస్ ఆఫీసర్ గా 1972 లో చరిత్ర సృష్టించారు ఆమె. పంజాబ్ లోని అమృత్ సర్ లో జూన్ 9 , 1949 వ సంవత్సరం లో ప్రకాష్ మరియు ప్రేమ పెషా వరియా దంపతుల రెండవ కుమార్తెగా జన్మించారు కిరణ్. చదువుతో పాటు ఆటలలో కూడా ఎంతో ప్రతిభ కనపరిచిన కిరణ్ టెన్నిస్ మీద ఎంతో మక్కువ కనపరిచే వారు.. అంతే కాదు, టెన్నిస్ లో అనేక చాంపియన్ షిప్ లు గెలుచుకున్నారు కూడా. అమృతసర్ గవర్నమెంట్ కాలేజీ నుంచీ బి.ఏ పట్టానీ, పంజాబ్ యూనివర్సిటీ నించి ఎం.ఎ పట్టానీ పొందారు. చదువు పూర్తీ కాగానే రెండు సంవత్సరాలు అమృత సర్ లోని ఖాల్సా కాలీజీ లో లెక్చరర్ గా పనిచేసిన ఆమె 1972 లో కేవలం తన పట్టుదల కారణంగా చేరారు. ఎంచుకున్న ఏ పనిలోనైనా అద్వితీయంగా ఉండడమే ఆమె నైజం.
ఉద్యోగరీత్యా ఆమె నిర్వహించినాన్ని కష్టతరమైన బాధ్యతలు అన్నీ ఇనీ కావు. డిల్లీ లో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్ గా, మిజోరం లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా, చండీఘర్ లెఫ్టినెంట్ గవర్నర్ కి సలహాదారుగా, డైరక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే ఐక్య రాజ్య సమితికి చెందిన సంస్థ లోనూ ఎన్నో గురుతరమైన బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా పోలీస్ అడ్వైసర్ గా ఐక్య రాజ్య సమితి శాంతి పరి రక్షణ లో ఆమె వహించిన బాధ్యతకి ఆమెకి యూ. ఎం మెడల్ బహూకరించారు. అధికార పరిరక్షణలో ఆమె ఎవరినీ పట్టించుకునే వారు కాదు, ఎంతో ధైర్య సాహసాలతో తనకప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవారు. ఈ లక్షణమే ఆమె కు 'క్రేన్ బేడి' అనే బిరుదు ని కూడా కట్టబెట్టింది, కారణం అప్పటి ప్రధాని శ్రీమతి. ఇందిరా గాంధి అధికారిక అమెరికా పర్యటనలో ఆమె కార్ ని సరి ఐన చోట పెట్టలేదని కిరణ్ బేడి తొలగించడమే.
సుదీర్ఘమైన ఆమె ఉద్యోగ జీవితం లో ఆమె సలహాలూ, సూచనలూ ఎన్నో ముఖ్యమైన నిర్ణయాల అమలు కు తోడ్పడ్డాయి. అంతే కాదు, తీహార్ జైల్లో ఆమె ప్రవేశ పెట్టిన యోగా, విపాసనా ప్రాణాయామం, ఖైదీలకు చదువు వంటి ఎన్నో సంస్కరణలు ఆమెకు రామన్ మెగసెసే అవార్డు తెచ్చిపెట్టాయి. ఒక పక్క ఇంత బాధ్యాతాయుతమైన, కష్టమైన ఉద్యోగాలు నిర్వహిస్తూనే 1988 లో డిల్లీ యూనివర్సిటీ నించి లా డిగ్రీనీ, 1993 లో డిల్లీ ఐ ఐ.టీ లోని పొలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ డిగ్రీ నీ కూడా పొందారు. అదీ ఆమె పట్టుదలకి నిదర్శనం, జైలు సంస్కరణలలో ఆమె అవలంబించిన మానవతా వాదానికీ, మంచితనానికీ 2005 లో గౌరవ లా డిగ్రీ ని పొందారు. పోలీస్ బ్యూరో ఆఫ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కి డైరక్టర్ జనరల్ గా ఉన్నప్పుదు ఆమె స్వచ్చంద పదవీ విరామాన్ని కోరి, పోలీస్ శాఖ నించి వైదొలగారు.
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆమె పలు కార్యక్రమాలలో పాలుగొంటున్నారు. స్టార్ ప్లస్ అనే టీ. వీ చానెల్ లో ప్రసారం అయ్యే 'ఆప్ కీ కచేరీ' అనే కార్యక్రమానికి జడ్జీగానూ, వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా పలు సమస్యలకి న్యాయపరమైన, చట్టపరమైన సలహాలనూ, సూచనలనూ అందిస్తారు. నవజ్యోతి అనే స్వచ్చంద సంస్థనీ, భారతీయ జైళ్ల సంస్కరణ ల కోసం మరొక సంతని స్థాపించి వాటి కార్యక్రమాలని నిర్వహిస్తారు.
కిరణ్ బేడి భర్త పేరు శ్రీ. బ్రిజ్ బేడి. వీరికి సైనా అని ఒక కుమార్తె. ఆమె తన భర్త తో కలిసి లఘు చిత్రాలూ, డాక్యుమెంటరీలు నిర్మిస్తారు.. అంతేకాక ఆమె కూడా తల్లి మాదిరిగానే సమాజ సేవలో ఎంతో ముందుంటారు.
ఉద్యోగం అంటే కేవలం జీతం ఇచ్చే కొలువు అని ఆమె ఎన్నడూ అనుకోలేదు. నమ్మినదాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడం మాత్రమె ఆమెకు తెలుసు.. రాజీ పడడం, వెను తిరగడం ఆమెకు తెలియనే తెలీదు. అందుకే ఆమె ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచారు. నిలుస్తూనే ఉంటారు. మచ్చ లేని వ్యక్తిత్వమూ, ఎనలేని ధైర్య సాహసాలు కలగలిసిన శ్రీమతి బేడి మరెందరికో మార్గదర్శి కాగలరు అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు.
No comments:
Post a Comment