Thursday, March 3, 2011

మహిళలు- మణిదీపాలు (3 )

ఇరోం చానూ షర్మిల: 'ఐరన్ లేడీ అఫ్ మణిపూర్ ' గా ప్రసిద్ది చెందిన షర్మిల గత పది సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత దీర్ఘమైన నిరాహాహారదీక్ష జరుపుతున్నారు. ఇది తనకోసమో, తనవారికోసమో కాదు, కేవలం తను నమ్మిన మానవ హక్కుల కోసం.
       మణిపూర్ కి చెందిన 38 సంవత్సరాల  షర్మిల, ఒక  జర్నలిస్ట్,కవయిత్రి ,  మానవ హక్కుల పరిరక్షణ   కోసం పోరాడే వ్యక్తి. మాలూం అనే ఊర్లో నవంబర్ 1 , 2000 వ తేదీన అస్సాం రైఫిల్స్ జరిపిన కాల్పులలో బస్ కోసం ఎదురుచూస్తున్న పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పార్లమెంట్ మీద దాడి జరుపబోతుంటే ఆపడానికి జరిపిన కాల్పులలో ఈ ప్రయాణీకులు చనిపోయారు తప్ప వారిని అటాక్ చేసే ప్రయత్నం కాదని 'అస్సాం రైఫిల్స్' చెప్పారు. చనిపోయిన వారిలో పెద్దవారూ, సాహస బాల పురస్కారం పొందిన పదేనిమిదేళ్ళ అమ్మాయి ఉండడమూ, ప్రభుత్వం నించీ ఈ సంఘటన గురించి సరి ఐన వివరణ రాకపోవడం వల్ల కలత చెందిన  షర్మిల తన తల్లి ఆశీర్వాదంతో నవంబర్ నాలుగో తేదీనించి నిరవరధిక నిరాహారదీక్ష ప్రారంభించింది.ఆమె కోరిక ఒక్కటే  'ఆర్మేడ్ ఫోర్సెస్ స్పెషల్ పోవేర్స్ ఆక్ట్ (AFSPA) 1958 ని మణిపూర్ నించీ,  మిగతా సమీప ప్రాంతాలనించీ  వెనక్కి తీసుకోమనే.
        ఆమె నిరాహార దీక్ష ప్రారంభిన మూడు రోజులకే పోలీసులు 'ఆత్మహత్యా ప్రయత్నం" క్రింద  ఆమెని అరెస్టు  చేసారు. ఆమె తనంత తానుగా ఆహరం కానీ, నీరు కానీ తీసుకోవడానికి నిరాకరించడం వల్ల బలవంతంగా ఆమెకి ముక్కుద్వారా ద్రవపదార్ధాలు అందిస్తారు. ఇది అత్యంత బాధాకరమైన ప్రక్రియ. దీనిని అనుభవించిన వారికి కానీ అర్ధం కాదని వైద్యులే అంటారు. ఇలాంటి  ఆమె దీక్ష గత పదేళ్లుగా సాగుతూనే ఉంది. ఆమెకి సాయంగా ప్రజలు కూడా అనేక రకాలుగా ప్రభుత్వాలకీ సంగతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలోAFSPA చట్టం గురించీ  తద్వారా అస్సాం రైఫిల్స్ కి ఉండవలసిన అధికారాలూ, హక్కుల గురించి అధ్యయనం చెయ్యమని ఆదేశించింది. వారు కూడా AFSPA ని వెనక్కు తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడినా కూడా అప్పుటి హోం శాఖామాత్యులు ఒప్పుకోలేదు. గత పదేళ్లుగా షర్మిలని అత్యంత కట్టుదిట్టాలమధ్య ఇంఫాల్ లోని జవహర్ లాల్ హాస్పటల్ లో బందీగా ఉంచారు. ఆమెని ప్రతీ ఏడాది విడుదల చెయ్యడమూ, మళ్ళీ ఖైదు చెయ్యడమూ అలవాటుగా జరుగుతోంది.
          మహాత్మాగాంధీ లాగే షర్మిల కూడా సత్యాగ్రహాన్ని సాధనం గా ఎంచుకుంది, అంతమాత్రాన ఆమెని క్రిమినల్ గా పరిగణించడం చాలా  మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఆయనే కాదు, చాలా మంది ప్రముఖ మానవ హక్కుల పరిరక్షణా నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఒక మహిలని , అదీ ఎంతో శాంతియుతంగా తన నిరసన ని తెలియచేస్తున్నా ఆమెని ఇలా బంధించడం తప్పని చెప్పారు.
       'ఎంతో మానసిక స్థైర్యం ఉంటేనే కానీ ఇలాంటి సాహసం చేయ్యలేరనీ, ఆమె కధ  ఆధారంగా సినిమా తియ్యాలని ఉన్నా ఆమె నిజ జీవితాన్ని, ధైర్యాన్నీ  సరిగ్గా చిత్రీకరించాలేనేమో అని అనిపించడమే కారణమని' ప్రసిద్ద దర్శకుడు అరిబం శ్యాం శాస్త్రి అన్నారు.వీరే కాదు, మరెందరో ప్రముఖులు ఆమెకితమ సహకారాన్ని, సహాయాన్ని ప్రకటించారు. వీరిలో అరుంధతీ రాయ్, మహాశ్వేతా దేవి, నోబుల్ బహుమతి గ్రహీత 'శిరీన్ ఎబాడి 'వంటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో పుస్తకాలు కూడా పలువు రచించారు.   
    షర్మిల పేరును నోబుల్ శాంతి బహుమతికై 2005 లో ప్రతిపాదించారు. ఐ.ఐ.పీ .ఎం వారు  ఈ మధ్యనే షర్మిల కి టాగూరు శాంతి బహుమతి ( 51 లక్షల నగదు)  నిచ్చి సత్కరించారు. మరెన్నో బహుమతులూ,సత్కారాలు ఆమకు లభించాయి.
 పదేళ్లుగా ఒక్క ముద్ద అన్నం తినకుండా గడపడం అనేది నాలాంటి మామూలు మనుషుల ఊహకి కూడా అందని విషయం. తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి,  అత్యంత    శాంతియుతంగా ఏమాత్రం ఆవేశ కావేశాలకి  లోను కాకుండా షర్మిల చేస్తున్న పోరాటాన్ని ఏ  పేరుతొ పిలవాలో? ఎంత గొప్పగా అభివర్ణించాలో  కూడా   తెలియడంలేదు. అయితే ఆమె మాత్రం 'మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో విధిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వెళ్లి పోతామో  మనకే తెలియదు కనక..' అంటారు.
ఈ మహిళా దినోత్సవ సంధర్ధంలో ఈ ఉక్కుమహిళకి జోహార్లు. ఆమె ప్రయత్నం సఫలం కావాలని మనస్పూర్తిగా  కోరుకుందాం.

No comments:

Post a Comment

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...