Sunday, May 19, 2013

కొబ్బరి బొండం .. బాద్షా సినిమా.. కొన్ని ప్రశ్నలు ????


"చాలా రోజుల తర్వాత రాస్తోంది కదా ఈవిడకేదైనా అయిందేమో?  "అనుకుంటారేమో అన్న అనుమానంతోనే మొదలు పెట్టాను ఈ టపా. చదివాకా పరవాలేదు అనిపించినా, బొత్తిగా ఆవూ, కొబ్బరి చెట్టూ వ్యాసాల్లా ఉంది అనిపించినా సరే వెంటనే చెప్పేయండి మరి. 
మొన్నెప్పుడో మిట్టమధ్యాహ్నం మండుటెండలో ( నిజమే .. మా బెంగుళూరులో మధ్యాహ్నం మూడింటికి  ముప్ఫై మూడు డిగ్రీ లు మండు టెండ కిందే లెక్క మరి )..
మా ఇంటి దగ్గరే ఉన్న  ఒక కొబ్బరి బొండాల అతని దగ్గరకు వెళ్లి ఒక బొండం కొట్టి ఇవ్వమని అడిగాను..
 " నీరా అమ్మా? కంజా? " అని అడుగుతూనే మళ్ళీ మర్చిపోతానేమో  అన్నట్టు " ఒకటి పాతిక రూపాయలమ్మా " అన్నాడు ఇవ్వమంటారా అన్న ధోరణిలో.
నేను ఆశ్చర్యపోయాను.. మొన్నటి వరకు ఇరవై కదా,  అని.. మెల్లిగానే అడిగాను.
 "సప్లై ఇల్లమ్మా "అన్నాడు.. ఇలాగే సాగితే రేపు ఇంకో ఐదు రూపాయలు పెంచాలేమో అన్నాడు కూడా ...
 పైన పెద్ద బోర్డ్ మీద 'థమ్స్ అప్ 'బాటిల్  పెద్ద అక్షరాలతో చెప్తోంది . 'రెండు లీటర్లు కేవలం యాభై రూపాయలే నంటూ
" సప్లై లేదా? అంటే కాయలే కాయడం లేదా? "అన్నాను అనుమానం గా.
" లేదమ్మా! కాయలున్నాయట.. అవి సిటీకి రావడం కష్టం గా ఉంది , రోజూ రావడం లేదమ్మా కాయలు..  నేనేం చెయ్యను చెప్పండి. " అన్నాడు..
అలా మా మాటల్లోనే అతనొక బొండం కొట్టి ఇవ్వడం, అందులోని గ్లాస్ నీళ్ళు నేను తాగడం జరిగింది..
నేను డబ్బు ఇచ్చి వెనక్కి తిరిగానో,  లేదో సర్రున వచ్చి ఆగింది కోల్డ్ డ్రింక్ ల వాన్.

 పదంటే పది నిమిషాల్లో చుట్టుపక్కల ఉన్న ఆని షాప్ ల లోనూ కావలసిన సరుకు నింపేసి, ఖాళీ డబ్బాలని తీసుకుని  దుమ్ము లేపుకుంటూ  వెళ్లి పోయింది.
చల్లటి    నీటినీ , దాని చుట్టూ చిగురాకులాంటి లేత మీగడ దుప్పటిని  కప్పుకుని దాహాన్ని,   తగు  మాత్రంగా ఆకలిని తీర్చే ఈ ఫలరాజానికి సప్లై కష్టం , రంగు రంగుల నీళ్ళ సీసాల కి మాత్రం ఆ  బెడదే లేదు.. ఎలా సాధ్యం?

'ఈ వేళ ఏదోటి ఆదరగొడదామ్'.. అంటూ తెలుగులోనూ,
 దాన్నే కాస్త అటూ ఇటూగా 'ఆజ్ కుచ్ తూఫానీ కర్తే హాయ్' అంటూ
 ఎక్కడెక్కడికో ఎగి రేసి, పాకేసి, దూకేసి,  చివరికి క్రేన్ ల ద్వారా ట్రక్ లని కూడా ఎగరేసి చివరికి కోల్డ్ డ్రింక్ తాగేసే హీరోలు ప్రకటనలు గుప్పించనందు వల్లనా?  ( అన్ని ఫీట్ లు చెయ్యడం అవసరమా?)
'ఇదే మన క్రికెట్ టీం యొక్క అఫీషియల్ డ్రింక్ 'అంటూ ఊదర గొట్టేస్తున్నందుకా?
'యంగిస్తాన్ , ఇంకో స్థాన్ అంటూ కుర్రహీరోలు సో కాల్డ్ యూత్ ఐకాన్లు" ఉన్నందుకా?
ఇంత రీచ్ ఉండడం  ధరలు తక్కువలో ఉన్నందుకా ?  
ఎప్పుడో కోకోబోర్డ్ వాళ్లకి గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఒక ప్రకటన తప్ప పాపం కొబ్బరి బొండాలని  పట్టించుకునే నాధుడు లేకనా ? పాపం..
కిలోల లెక్కన చక్కెరా , గాస్, కృత్రిమమైన రంగూ  తప్ప మరేమీ లేని  ఈ రంగు నీళ్ళ పాటి చెయ్యవా మన ప్రకృతి తల్లి ప్రసాదాలు అని బాధపడ్డాను...

కట్ చేస్తే .. బాద్షా లొకి..

  కొత్త తెలుగు సినిమాలు విడుదలైన వెంటనే వెళ్లి చూసేయ్యాలన్నంత వెర్రి లేదు కానీ, అనవసరంగా వెబ్సైట్ల రివ్యూ లు  చూసి, ఈ అరివీర భయంకర సినిమా రివ్యూలన్నీ ఏకబిగిన చదివేసి ( ఎవరు చదవమన్నారు?), చాలామంది' బావుంది'అన్నారు 'కామెడీ అదీ 'అంటే మొత్తానికి ఓ దుర్ముహూర్తాన మేమూ చూసేసాము ఈ సినిమా. పూర్తిగా చూసామని చెప్పలేను ఎందుకంటే చివరలో లేచి వచ్చేసాము కనక.. మనుషుల సహనానికీ ఒక హద్దు ఉంటుంది కదా మరి..
 ప్రపంచం నలుమూలనుంచి నలభై రకాల రివ్యూలు రాసాకా నేను ఈ పోస్ట్ రాసి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ మూడు గంటల మా  సమయం ఎలా డ్రైనేజ్  కలిసిపోయింది తలుచుకుంటేనూ, ప్రేక్షకులని ఉత్త మతిలేని వాజమ్మలుగా భావిస్తూ, మేమేం తీసినా చూసేస్తారులే అనుకున్న వారి నిర్లక్ష్యాన్ని తలుచుకుంటే వచ్చే కోపం ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు, బాగా లేట్ గా నైనా సరే  బయట పెట్టకపోతే నా ఆరోగ్యం దెబ్బ తింటుందేమో నని ఇలా ధైర్యం  చేస్తున్నానన్నమాట.  
     నీ కోసం' అంటూ మొదలు బాగానే పెట్టాడు ఈ దర్శకుడు శ్రీను వైట్ల.. నిజంగానే మనకోసమే 'ఆనందకరమైన' సినిమాలే తీస్తాడు, 'మనందరివాడు' ( ఇదో చెత్త సినిమా)  కదా  అనుకున్నాం. కొంచం కొత్తగా "ఢీ" అంటే మనం ఢీ అన్నాము.. దాంతో అతను  ఇంక ఇలాగే సినిమాలు తీస్తాను మీరు 'రెడీ' గా ఉండాలి మరి  అన్నాడు.. మనం వెర్రి వెంగళప్పల్లా సరే అన్నామ్.   అంతే .. ఇంక రెచ్చిపోయి తనే దర్శకింగ్ ననుకుని వీర దూకుడు తో తలా తోక లేని కధలకి కామెడీ రంగుల హంగులేసి మనమీదకి వదలడం మొదలు పెట్టాడు.. నమో వెంకటేశా అని దండం పెట్టుకుని మరీ.. అది వెంకీ అయినా, దుబాయి శీను అయినా ఒకే సీను.. వైట్ల శీను..  ఒకప్పుడు ఉత్త ప్రేమకధలకి పరిమితం అయితే ఇప్పుడు సరదాగా వాటికి పోలీస్, డాన్ ల కలర్ అద్దుతున్నారు , అతను , ఆయన రచయితలూ కలిసి.. గ్లోబల్ ఫీల్ కదా..   ' 
   
    చిన్నప్పుడు అమ్మ అనేది.. అందరి పెళ్ళిళ్ళూ ఒకటే, బొమ్మలు ( పెళ్లి కొడుకు,  పెళ్లి కూతురు) మాత్రం
మారతారు అని.. చిత్రంగా శ్రీను వైట్ల సినిమాలలోనూ అంతే. హీరో,  హీరోయిన్ తప్ప ఒక పెద్ద పెళ్ళికి సరిపడేంత తారాగణం, అన్ని సినిమాలలోనూ సుమారుగా వాళ్ళే , ఎప్పుడూ ఏదో హడావుడి..  పాడుతూ, ఆగుతూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, గజిబిజి గా తిరుగుతూ స్క్రీన్ అంతా నింపేస్తూ ఉంటారు. సినిమాలకి హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టినట్టు స్క్రీన్ ఫుల్ అని కూడ ఒక బోర్డ్ పెడితే  ఈయన సినిమాలే మొదట ఉంటాయి, నాదీ గారెంటీ .  నాజర్,  జయప్రకాశ్ రెడ్డి,  సుధా, సురేఖ వాణి, తనికెళ్ళ భరణి ఇలా...  అసలన్ని పాత్రలెందుకో నాకు అర్ధం కాలేదు ఈ సినిమాలో కొంతమంది సీనియర్ నటులకి కూడా ఒక్క సరి అయిన డైలాగ్ లేదు. వాళ్లకి లేని బాధ నీకెందుకు అంటే నేనేమీ చెప్పలేను. 
     
  పది లక్షల రూపాయల విలువ గల జాకెట్ ( నిజంగా) వేసుకుని, ప్రపంచాన్ని గడగడలాడించే సత్తా ఉన్న ధీరుడు మన బాద్షా. అతనికో డాన్ తో శతృత్వమ్. ఆ డాన్ కి విచిత్రమైన పేర్లు పెట్టుకుని తింగరి చేష్టలు చేసే శిష్యు లు. నిజానికి ఆ డాన్ కూడా  కొంచం విచిత్రంగానే, పరమ తింగరి వాడుగానే  ఉన్నాడు. మన సినిమాల్లో తప్ప ఈ డాన్ లు అనేవారు ఇంత మాములుగా తిరుగుతూ అలా కనిపించిన ప్రతీ హీరో మీదా సవాళ్ళు విసురుతూ ఉంటారా? ఈ మధ్యన ఏ సినిమా చూసిన ఇదే వరస..
 వాళ్ళని చూసి  ఈ మధ్యన మన సినిమాల్లో 'నేను డాన్ అయ్యి తీరుతాను' అని శపధాలు చెసుకోవడాలు.. అక్కడికి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయినట్టూ.. లేదా చాలా గొప్ప కెరియర్ ఆప్షన్ అయినట్టు.. అదే నిజమైతే మొన్నటి వరకూ IIT అనీ, ఈ మధ్యన కొంచం రూట్ మార్చి  సి.ఏ, చీ.పీ.టీ  అని ఊదరగొడుతున్న విద్యాసంస్థలన్నీ ఇక పైన ' బెస్ట్ డాన్'  అవడానికి మాసంస్థ  బెస్ట్. ఆల్ ఓవర్ ది వరల్డ్ లో ఫస్ట్ రేంక్ .. ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తారేమో మరి ( వరల్డ్అనిఎందుకన్నానంటే మరి సినిమాలలో ఈ డాన్ లు ఎప్పుడూ  మన దేశం లో ఉండరు  కదా,). మరి మలేశియానో, మరో ఏషియానొ ఎలాలంటే  ఆ మాత్రం ఉండాలి కదా..
 ఆశీష్ విద్యార్ధి వంటి నటుడు పోషించిన జోకర్ లాంటి పాత్రని చూస్తే జాలి వేసింది, మంచి నటుడికి పట్టిన దౌర్భాగ్యం అది.. ఆయనెలా ఒప్పుకున్నాడో ?
           
   సంఘసేవట, ఏదైనా మంచి పని చేస్తేనే కానీ అన్నం, టిఫిన్ కూడా తినని హీరోయిన్ గా కాజల్ ప్రహసనం ఎంత విసిగించిందో చెప్పటం కష్టం. ఇలాంటి తిక్క చేష్టలు చెయ్యడానికి కూడా  ఇటలీలు, టర్కీలు వెళ్ళాలా? రివెంజ్ నాగేశ్వరరావు, సిరేంజ్ సుబ్బారావు ( ఇది నా పైత్యమే,, కావాలంటే ఎవరైనా వాడుకోవచ్చు..:)) లాంటి పాత్రల ద్వారా పండిన కామెడీ ఎంతో రాసిన వాళ్ళకి,  తీసిన వాళ్ళకి తెలియాలి.  వేఫర్ థిన్ స్టొరీ అంటారు కధ ఎక్కువగా  లేకపోతే.. పూతరేకు థిన్ అనాలేమో ఈ సినిమాని..  ..  ఎంత వెతికినా కధే కనబడదు.. కిచిడీ లా వండిన కలగూరగంప తప్ప.. ఒకవేళ ముందే కంచికి పంపేసారేమో ..
      ఎక్కడ, ఏ మూల హిట్ అయిన కాన్సెప్ట్ నైనా వదలని గొప్పవారు మనవారు. అందరికీ ఎంతో బాగా తెలిసిన Inception concept ని ఇంత చీప్ గా ఇమిటేట్ చెయ్యవచ్చా? అనిపించి, కామెడీ అంటే ఇదేనా? అనుకునేలా చే శారు.   మంచి పాత్రలతో ప్రేక్షకులకి బ్రహ్మానందాన్ని ( చాలా సినిమాలలో విసిగిస్తే విసిగించవచ్చు, అది వేరే విషయం) పంచి , సినిమాల విజయాలలో ముఖ్య పాత్ర పోషించే ఆ నటుడిని అన్నిసార్లు కొట్టించడం అవసరమా? కామెడీ పేరిట కాకోఫోనీ  తప్ప మరేమీ చూపలేరా? ఎన్ని రకాల గెటప్ లు వేసినా, ఎంత కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వాడినా, ఎన్ని దేశాలలో తిప్పినా,  చివరికి కామెడీ నే తురుపు ముక్కగా నమ్ముకున్నారా? దానివల్లనే సెకండ్ హాఫ్ లో హీరో ఎవరో? కమెడియన్ ఎవరో తెలియలేదా? సెన్స్, సెన్సిబిలిటీ, లాజిక్, కామన్ సెన్స్ ఇలాంటి పదాలన్నీ పట్టించుకోకుండా పది కామెడీ సీన్లు, ఐదు పాటలు, ఆరు ఫైట్లు , మిగిలిన టైములో ఏదో కలిపేసి అతుకుల బొంత గా కుట్టేసి  మనమీదకి వదిలేస్తే చాలనా వారి అభిప్రాయం?


 ఇలా రాస్తూ పొతే ఎన్నో ప్రశ్నలు.. మొత్తానికి  పేరులోనే తప్ప గమనంలో  నత్త నడక  నడిచిన దూకుడు , వీర బాదుడు బాదేసిన బాద్షా సినిమాలు సినిమా హాళ్ళల్లొ మనిషికి మూడేసి వందలు  చదివించుకుని చూసి వచ్చాకా, చస్తే మళ్ళీ శీను వైట్ల సినిమా థియేటర్ లో చూడను అని నాకు నేనే ధైర్యం చెప్పేసుకున్నాను..

ఇంక లాస్ట్ గా ,  అంటే చివరాఖరుగా ( నాకు ఈ  దర్శకుడి లక్షణాలు వచ్చేస్తున్నాయా? చెప్పినదే మళ్ళీ రకరకాలుగా చెప్తున్నాను)  నేను చెప్పే దేమిటంటే ఆ .. ఫేక్టరీలలొ ఫార్ములా ప్రకారం గా కొలతలు ఎక్కడా తేడా రాకుండా తయారయ్యే కోల్డ్ డ్రింక్ లన్నీ ఒకేలా ఉంటాయి, చూడడానికీ, రుచి చూడడానికీ కూడా..  అచ్చం ఇప్పుడొస్తున్న సినిమాల లాగానె. అందులో ఏ  వెరైటీ ఉండదు, రుచి కూడా మొదట బావున్నట్టనిపించినా తర్వాత విసుగు వస్తుంది. ఆరోగ్యసమస్యల గురించి నేను చెప్పనే చెప్పను. ప్రస్తుతం అదే పరిస్థితి ఈ దర్శకుడి సినిమాలది అనిపిస్తోంది నాకు.

 ఒకే గెలలోవైనా సరే, ఒకే చెట్టువైనా సరె.. ప్రతీ ఒక్కటీ విలక్షణం గానూ, ఆహ్లాదకరమైన రుచితోనూ ఉండే   గంగా బొండాలకెందు లోనూ సాటి రావుఈ డ్రింకులు. అందుకే ఇంటి భోజనంలాగే కొబ్బరి బొండాలు కూడా ఎప్పుడూ  బావుంటాయి అని నా అభిప్రాయం.  మన దర్శకులు కూ డా ఇలా పాకేజ్ద్  కోలా డ్రింకుల్లాంటిసినిమాలు కాక 'గంగా బొండాల్లాంటి  స్వచ్చమైన సినిమాలు తీస్తే  చూడాలని ఆశ.. దురాశ అంటారా?
 ఏమో మరి.. మీరే చెప్పాలి..
This is my wishful thinking..


నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...