మనసులోని భావాలని, మనలోని ఆలోచనలనీ, మదిలోని అనుభూతులనీ అందంగా, క్లుప్తంగా, వినసొంపుగా, సునిశితంగా చెప్పే సాధనాలే పాటలు. అది సాంప్రదాయ బద్దంగా స్వరపరిచిన సంగీతమే అయినా, లలితంగా మనసుని మీటే లలితగీతమైనా, నిత్యజీవనంలో ముఖ్యభాగమైన సినిమా గీతమైనా, గంభీరంగా ధ్వనించే గజల్ అయినా... పేరు వేరే కానీ ప్రయోజనం ఒకటే. జనరంజనమే.. పాటకి కొత్తా పాతా లేవు. నిన్నటిది నేటికి పాత పాట అయితే,,నేటిది రేపటికి. కానీ పాటల్లో మంచి పాటలు మాత్రం తప్పకుండా ఉంటాయి. విన్నది విన్నట్టుగా మరచిపోకుండా మన పెదవుల మీద నాట్యమాడితే అది మంచి పాట, మన జ్ఞాపకాలలో కొన్నాళ్ళు కదలాడితే అది గొప్ప పాట. మన జీవితాలలో ఒక భాగమైపోతే మాత్రం ఖచ్చితంగా అది అధ్బుతమైన పాట. ఇన్నేళ్ళ మన చలన చిత్ర పరిశ్రమ ప్రయాణంలో అలాంటి ఆణిముత్యాల లాంటి పాటలెన్నో. అందులోంచి కొన్ని ఏరి, కూర్చి ఒక ముత్యాల సరాన్ని చెయ్యాలనేదే ఈ ప్రయత్నం.
దైవ చింతన పలురకాలు.. అలాగే దైవ ప్రార్ధన కూడా. చాలా సందర్భాలలో దైవ ప్రార్ధన తన కోసమో, తన వారి క్షేమం కోసమో, లేక ఏదైనా కోరిక తీర్చమనో ఉంటుంది. నిజ జీవితంలోలాగానే సినిమాలలోనూ. కష్టం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవదమూ, నాకిదిస్తే నీ కిది చేయిస్తానని భగవంతుడికి ఆశ పెట్టడమూ మనుషులందరూ మామూలుగా చేసే పనే. ఇలాంటి మనస్తత్వాన్నీ, సంధర్భాలనీ ప్రతిబింబిస్తూ దేవుడిని వేడుకునే పాటలు మన చిత్రాలలో చాలానే వచ్చాయి. ఇంకా ఆవేశం ఎక్కువైతే 'ఇలా ఎందుకు చేసావ్ ? అసలు ఉన్నావా?.లేవా?" అంటూ నిలదీసే పాటలూ ఉన్నాయి.
ఐతే ఇక్కడ మనం చెప్పుకోబోయే పాట చాలా విలక్షణమైనది.జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారు రాసిన ఎన్నో మంచి పాటలలోని ఈ ఆణిముత్యం చాలా సందర్భోచితంగానూ, పాత్రల మనస్సులకీ, మనస్తత్వాలకీ అద్దం పట్టేది గానూ ఉండడం ఒక గొప్ప విషయం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ. అశ్వద్ధామ గారు స్వరపరచిన ఈ పాట 1972 లో విడుదలైన "మానవుడు-దానవుడు" చిత్రంలోది. కరుణ రసాత్మకంగా సాగే ఈ పాటను శ్రీ. బాలూ గారు దీనిని కర్ణపేయంగా ఆలపించారు, తెరమీద శ్రీ. శోభన్ బాబు, శ్రీమతి శారద తదితరులు కనిపిస్తారు.
సృష్టిలో ప్రతీ అణువులోనూ నిండి వున్న దేవుడిని ( పేరేదైనా సరే.. ఆ భగవత్స్వరూపాన్ని) , కనుల వెలుగువై కరుణించ రమ్మని పిలిచే ప్రార్ధన. ఒక శాంతియుతమైన ఆశ్రమ వాతావరణంలో పెరిగిన మనుషుల మనస్తత్వాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, నిస్వార్ధంగా ఏం కోరుకుంటాయో చూపించే పాట. మానవత్వాన్ని పరిమళింపచేసే సుగుణాలు తప్ప వారికి లేకపోయినా సరే, మామూలు ప్రాపంచిక సుఖాలేవీ వారు కోరుకోకపోవడమే విశేషం.
మొదటి చరణంలో మనుషులలో ఒకరిని ఒకరు నాశనం చేసుకునే ఈర్ష్యా, విషంలా కురిపించే ద్వేషమూ రాజ్యమేలుతున్న రోజుల్లో నిప్పు లాంటిదైనా సరే నిజాన్ని తెలిపి, చల్లని అమృతపు జల్లులు కురిపించే మంచి మనుషుల అమృత గుణాన్ని మా కందించమని కోరిక. మంచిమనసూ, అది కలవారి సుగుణాలూ మాకందిస్తే మేము కూడా ఈ ఈర్ష్యా ద్వేశాలని తప్పించుకుని మంచివారుగా మెలుగుతామని భావన. సినిమా పేరుకు తగ్గట్టుగా మనుషుల్లోనే మానవులూ, దానవులూ ఉన్నారని చెప్పకనే చెప్పడం. తోటిమనిషిని కరిచే దానవులున్న వేళలోనే, ఆ నేలలోనే మంచితనపు సుధారసాలు కురిపించే మానవులూ ఉంటారని, వారిలాగే మేము ఉండేలా వరమివ్వమనీ.. కోరిక. చాలా సాధారణమైన మాటలతో గొప్పగా ధ్వనించే సాహిత్యం.
రెండవ చరణంలో త్యాగనిరతిని ప్రసాదించమని కోరిక. దానికి ఉదాహరణగా స్వతంత్ర సమరంలో తమ ప్రాణాలకు లెక్క చేయక, తమ భావి తరాల వారు స్వతంత్ర ఫలాలను అనుభవించడానికి తమ అసువులు తృణప్రాయంగా త్యజించిన వారి సేవాగుణం అందించమని ప్రార్దిస్తారు. ఏ పని చేయాలన్నా, 'దీనివల్ల నాకేం లాభం'? అనుకుంటూ ఉంటూ ఏ పనీ చెయ్యలేము, లాభాపేక్ష వల్ల స్వార్ధమూ, సంకుచిత తత్వమూ అలవడతాయి. మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన మహనీయులెవ్వరూ ఒక్కసారి కూడా 'నాకేమిటి?" అన్న ప్రశ్న వేసుకోలేదు కనకనే తోటివారి స్వేచ్చకి కారణమయ్యారు. అలాంటి గొప్ప గుణం మా కందిచవయ్యా అని భగవంతుడిని ఆర్తితో కోరుకుంటారు.
ప్రేమా, త్యాగమూ తరవాత మానవతా విలువల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది సేవాగుణం. సేవా, సాధనా మనుషులని సన్మార్గంలో నడుపుతాయి. నిస్వార్ధమైన సేవాభావం అరుదుగా కనిపించే లక్షణం. ముఖ్యంగా వ్యాధి పీడితులకీ, బాధలలో కూరుకుపోయిన రోగులకీ, అవసరార్దులకీ, చేతనైనంత సేవ చెయ్యడం అనే మానవ సేవ ని మించిన మాధవ సేవ లేదు.. అలాంటి లక్షణం అయినా సేవాగుణం మాకందిచ రావా అని దేవుడిని మనస్పూర్తిగా వేడుకుంటారు మూడో చరణంలో.
మనసుని కదిలించే సాహిత్యం, భావం, కరిగించే సంగీతం, కమ్మని గానం, కమనీయమైన అభినయం వెరసి ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోయే గీతరాజం. ఈ పాటలో ప్రస్తావించిన సుగుణాలలో కొన్నైనా అలవరచుకోగలిగితే ఆ మనిషి జన్మ ధన్యం అనిపించే పాట. చాలా గొప్పపాట .
ముఖ్యంగా ఈ రోజు ఈ పాత గురించి ప్రస్తావించడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటూ, వారికి తనకు వీలైన సాయాన్ని అందించాలని తపనపడుతూ, మంచితనానికీ, స్నేహానికీ, శాంతానికీ మారుపేరుగా గత ఇరవై ఏళ్లుగా నాకు జీవిత సహచరునిగానే కాక, ఒక మంచి స్నేహితుడిగా, తోడుగా, మార్గదర్శకుడిగా వెన్నంటి నిలిచి, నడుస్తున్న మా వారు శ్రీనివాస్ కి అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా పాట ఇది, ఈ రోజు తన పుట్టినరోజు కనక నాకు అత్యంత ఇష్టమైన రోజు ఇది. అందుకే ఇది కేవలం తనకోసం రాసిన టపా.
పుట్టిన రోజు శుభాకాంక్షలు శీను.. ఇలాంటి పుట్టిన రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి..
ముఖ్యంగా ఈ రోజు ఈ పాత గురించి ప్రస్తావించడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటూ, వారికి తనకు వీలైన సాయాన్ని అందించాలని తపనపడుతూ, మంచితనానికీ, స్నేహానికీ, శాంతానికీ మారుపేరుగా గత ఇరవై ఏళ్లుగా నాకు జీవిత సహచరునిగానే కాక, ఒక మంచి స్నేహితుడిగా, తోడుగా, మార్గదర్శకుడిగా వెన్నంటి నిలిచి, నడుస్తున్న మా వారు శ్రీనివాస్ కి అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా పాట ఇది, ఈ రోజు తన పుట్టినరోజు కనక నాకు అత్యంత ఇష్టమైన రోజు ఇది. అందుకే ఇది కేవలం తనకోసం రాసిన టపా.
పుట్టిన రోజు శుభాకాంక్షలు శీను.. ఇలాంటి పుట్టిన రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి..
Have a great day.....
No comments:
Post a Comment