Thursday, April 21, 2011

'ఆపరేషన్ ఆనింద్య'

    ఏడంతుస్తుల మేడ ఇది.. అని పాడు కోవచ్చు  మా అపార్ట్మెంటు చూస్తే. దాసరి గారి సినిమా పాటలోలా  వడ్డించిన విస్తరి మాత్రం కాదు లెండి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఏ కమ్యూనిటీలో ఉండే విషయాలు, ప్రత్యేకతలూ , కష్టాలూ    వాటికే ఉంటాయి. 'సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అని ఊరికే అన్నారా? ఇప్పుడు ఏం అంత కష్టం వచ్చింది , ఇంత నిట్టూరుస్తోంది ఈవిడ అనుకుంటున్నారా?  కష్టాలు అని కాదు కానీ కొన్ని విషయాలు బాగా తెలిసాయి సుమండీ. 
     మా ఫ్లాట్ ఏడో  అంతస్తులో ఉంది అయినా దోమలు వస్తాయి,  వచ్చే కాలంలో.. ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం పది అడుగులు వేసుకున్నా నా చిటికెన వెలి గోరు కన్నా చిన్నవైన రెక్కలున్న ఈ మచ్చర రాజాలు అంత ఎత్తు ఎగిరి ఎలా వస్తాయబ్బా? అని మొదట్లో నేను చాలా ఆశ్చర్యపోయాను.. తరవాత మా పక్క వాళ్ళు చెప్పారు.. లిఫ్ట్ లో దూరి వచ్చేస్తాయి. కేవలం ఎగిరే రానక్కరలేదు అని,  అవి చాలా తెలివైనవి అని.. అవి తెలివైనవి అయినా కాకపోయినా వాటిని చాలా నిశితంగా గమనించి ఈ విషయం కనిపెట్టిన వాళ్ళు మాత్రం చాలా తెలివైనవారు అని ఒప్పుకోవాలి కదా. అయితేనేం.. పావురాలూ, కాకులే కాదు దోమలు కూడా ఏడో అంతస్తుకి వచ్చేస్తాయి అని తెలిసిపోయింది నాకు.. ఇది పెరిగిన నా జువాలజీ పరిజ్ఞానం అన్నమాట.
      'కింద అంతస్తులలో ఉంటే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది, పైకి వెళితే ప్రశాంతతే... ప్రశాంతత.  అరిచి గీ పెట్టినా మీకు శబ్దం వినిపించదు ' అని అందరూ అంటే నిజమే కాబోలు అనుకున్నాను.. కానీ కింద స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు వేసే కేకలూ, రోడ్డు మీద నడిచే వాహనాల శబ్దాలు, మా కాంపౌండ్ లోనేకాక, బయట రోడ్ మీద నడుస్తున్న మనుషుల మాటలూ అన్ని సలక్షణంగా , అచ్చంగా మా ఇంట్లోనే జరుతున్నట్టు వినిపిస్తాయి. దీనిని బట్టి నా కర్ధం అయింది ఏమిటంటే 'ధ్వని' చాలా శక్తివంతమైనది, అది కూడా దోమలలాగానే ఎంత ఎత్తు కైనా  వెళ్తుంది అని.  ఇది నా ఫిజిక్స్ లెసన్ మరి..  ఇంకా బోటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఇలాంటివీ నేర్చుకున్నాను కానీ బొత్తిగా ఏదో చెప్తానని మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం బావుండదు కదా అందుకని పాయింటుకి వచ్చేస్తాను.
           సూర్యభగవానుడు పొద్దున్నే తన ప్రతాపాన్ని చూపడానికి శాంపిల్ గా  చిన్న సంతకం పెడుతున్నవేళ.. గాలి ఉన్నానా,  లేనా?  అని మెల్లిగా కదలలేక కదులుతున్న వేళ.. ఓ ఉదయాన్న, ఓ అంత మంచిది కాని ముహూర్తాన ( కరక్టే.. సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్నవేళ.. అనే శ్రీ వారికి ప్రేమలేఖ పాట  స్టైలే, మీకు తెలిసిపోయింది) నా వంటశాల ( మరీ నర్తనశాల లా ఉందా? అదే కిచెన్ అనేసుకుందాం, తేలిగ్గా ఉంటుంది) లో ఒక సొరుగు సగం తెరిచి ఉంది.. 'రాత్రి మర్చిపోయానేమో' అనుకుని మూసేద్దామని వెళితే కింద మెత్తగా తరిగినట్టున్న రంగురంగుల పొట్టు లాంటి పదార్ధం.. ఆ సొరుగులో నేను  తోమిన ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటాను.. బార్లా తెరిచి చూస్తే ఇంకేముంది? నా విదేశీ ప్లాస్టిక్ డబ్బాలు ( టప్పర్ వేర్) ఓ రెండింటిని చెరో మూల ఎవరో అతి చాక చక్యంగా గీరేసి , తినేసిన గుర్తులు.. ఆ కార్యక్రమానికి సాక్ష్యంగా వాటి కి ఉన్న చిన్న చిన్న చిల్లులు.. నా గుండె గుభేలంది. ఇంట్లో బొద్దింక ఉంటేనే నాకు చిరాకు అలాంటిది ఎలకా? అని తలచుకుంటేనే నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంక అక్కడనించీ నాకు వచ్చిన అనుమానాలు ఇన్నీ అన్నీ కావు.
   ఇంట్లో చేరిందా? లేక ఊరికే వస్తూ పోతూ ఉందా? ఒక వేళ  ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంది? వస్తూ పోతూ ఉంటె ఎక్కడనించి వస్తోంది? ఎప్పుడు వస్తోంది? ఎలా కనిపెట్టడం? కనిపెట్టినా ఎలా తరమడం? చంపడం మంచిది కాదు కదా? ఇలా రకరకాల చొ.ప్ర లు ( చొప్పదంటు ప్రశ్నలు  అన్నమాట)  నా మెదడులో  వెంట వెంటనే పుట్టుకొచ్చాయి.
     అంతలో కిచెన్ లోనే గిన్నెలు కడుగుతున్న మా నాగమ్మ 'ఇది ఇంకేమీ కాదు .. ఎలిక  పనే.. 'అని తేల్చేసింది.. అంతేకాక 'ఫ్రిజ్ లో కూర్చుంటుంది చల్లగా ఉంటుంది కదా' అని ఒక బాంబు  పేల్చింది.. " అయ్యా బాబోయ్! ఫ్రిజ్ లోనా.. యాక్.. ఇంకా నయం.. బట్టల బీరువాలో అన్నావు కాదు అని పైకి మేకపోతు గాభీర్యం ప్రదర్శిస్తూ గబా గబా నాగమ్మ చూడకుండా ఫ్రిజ్ ఆంతా చూసేసాను. 'ఫ్రిజ్ లో అది ఉండవచ్చు అన్న ఆలోచనకే నాకు  కడుపులో తిప్పినట్టయింది.. ఉండడానికి చాన్స్ లేకపోయినా సరే..  అయినా నాగమ్మ  చూసేసింది.. 
"ఇక్కడకాదు, వెనకాల ఉన్న గొట్టం లో.. అక్కడ వెచ్చగా ఉంటుంది కదా" అంది తాపీగా.'
"మరి ఇప్పుడు చల్లగా ఉంటుంది అని ఫ్రిజ్ లో అన్నావు "అన్నాను.. ' వెనక అంటే ,  ఇది ఫ్రిజ్ దే కాదా' అంది తను . 'ఓహో.అదా తల్లీ. రక్షించావు.. అని ఊపిరి తీసుకున్నాను.
ఒక క్షణం ఆడ షెర్లాక్ హోంస్ లా మొహం పెట్టి 
"ఒక పని చెయ్యండి.. ఒక టమాట తరిగి అక్కడక్కడా పెట్టండి, అలాగే ఉల్లిపాయా. అది ఇవే తినేది. ఒక వేళ తినేస్తే అది ఉంది అని తెలిసిపోతుంది, అప్పుడు మందు తెచ్చి వెయ్యండి "అని చెప్పింది. చాలా చిదంబర రహస్యాన్ని విప్పి నా చేతిలో పెట్టినట్టు.
"అర్రే నిజంగానా? అసలు ఎలకలు ఇంత  హెల్త్ కాన్షస్ అని కానీ, టమాటాలు తింటాయని కానీ నాకు అసలు తెలీదు ఇప్పటివరకు.. ఆక్షణాన మా నాగమ్మ నా కళ్ళకి చాల పెద్ద మేధావిలా, యానిమల్ న్యూట్రి షనిస్ట్  లా  కనిపించింది అంటే మీరు నమ్మాలి.  ఎలకల తిండి అలవాట్లు కూడా అంత  బాగా తెలుసుకోవడమంటే మరి మాటలా? 
  ఇలా ఎందుకన్నానంటే  మా చిన్నప్పుడు మా తాతగారింట్లో ఎలకలని పట్టుకోవడానికి ఎర పెట్టి ,  బోను అమర్చేవారు, ఎర కోసం మసాలావడ , బజ్జీ  లాంటి నూనె వస్తువు పెట్టేవారు. ఎలకకి ఒక వడ తేవడం కోసం వెళ్లి పది రూపాయల వడలు తినేసి వచ్చేవారు మా కజిన్స్. ఆ వడలూ, బజ్జీల కోసమే రోజూ ఇంట్లో ఎలకలు తిరగాలని మనస్పూర్తిగా కోరుకునేవారు కూడా. అలాంటిది ఇప్పుడు టమాటాలు తింటున్నాయా? సైజ్ జీరో వాటికీ కావాలేమో.. ఆ ప్రభావమే అయి ఉండవచ్చు. అనుకున్నాను.
ఏమైనా నా పని సులువైంది కదా అని సంతోషించి ఆ రోజు సాయంత్రం ఎప్పుడవుతుందా ?అని ఎదురు చూసాను.. 
     ఒక టొమేటో, ఒక ఉల్లిపాయ  చక్కగా గుండ్రంగా,  చక్రాల్లా తరిగి ( ఇది నాగమ్మ చెప్పలేదు కానీ నా కళా నైపుణ్యం  మరి) సిద్ధంగా పెట్టేసుకుని  మా ఇంట్లో ఐదారు చోట్ల పెట్టేసాను. ఆ రాత్రి మా ఇల్లంతా సలాడ్ బౌల్  లా కనిపించింది నాకు.  .రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా? ఎలక  టొమేటో తింటుందా? ఉల్లిపాయ తింటుందా ? రెండూ తింటుందా? అసలు తినదా? వస్తుందా,  రాదా? ఇలా. ఇండియా మేచ్ గెలుస్తుందా, లేదా ? అన్నంత టెన్షన్..మర్నాడు నిద్ర  లేవగానే నేను, మా అబ్బాయి  మొదట చూసినది ఎన్ని ముక్కలు  ఉన్నాయి? అని.. రెండు చోట్ల  టొమేటో  ముక్కలు మాయం.. 'పెద్ద రాజ పుత్ర రహస్యం తెలిసిపోయినట్టు సంతోషించాం'. 
'నేను చెప్పలేదూ !   టమాతానే   అది తినేది 'అని అని నాగమ్మ గర్వంగా తలెగరేసింది.. 
'నిజమే నీకు భలే తెలుసు 'అని మెచ్చుకుని.. 'తింటోంది సరే.. ఇప్పుడు దానిని బయటకు పంపేదేలా? అసలు ఇంట్లో ఉందా? లేక రాత్రి పూట వస్తోందా?' అని  అడిగాను అనుమానంగా..
'ఏమో మరి, మందు పెట్టి చూడండి లేదంటే బోను కొనుక్కుని  రండి , కింద ఫ్లోర్  లో నేను పని చేసే వారింట్లో ఉంది, కావాలంటే అడగండి, నేను చెప్పానని చెప్పకండి అంది కూడా.. ' అలా అని తేలిగ్గా నవ్వేసి చీపురు తీసుకుని వెళ్ళిపోయింది టొమేటో ముక్కలు తుడవడానికి.
'పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రం వచ్చి, వెనక్కి తెలియని అభిమన్యుడిలా తయారయింది నా పరిస్తితి. సరే. దిగాకా తప్పాడు కదా. ఎలాగైనా దీని అంతు చూడాల్సిందే.  ఈ పనికి ' ఆపరేషన్ అనింద్య'  అని పేరు పెట్టుకున్నాం.
     రాత్రి పూట వచ్చి వెళుతోంది అనుకుంటే  ఆ దారులన్నీ  మూసేస్తే?  అని మా అబ్బాయి సలహా ఇచ్చాడు . అన్ని తలుపులూ, కిటికీలూ వేసే ఉంటాయి, ఇంక అప్పుడు మొదలైంది మా రంద్రాన్వేషణ.. అలా వెతగ్గా వెతగ్గా కిచేన్లోనే చిమ్నీ పైపు బయటకు వెళ్ళే దగ్గర కొంత ఖాళీ ఉంది కదా,  అని మా పాదరసపు బుర్రలకి తట్టడమేమిటి? రెండు అట్ట ముక్కలు తెచ్చి  వాటికి అడ్డుపెట్టేయడమేమిటి? ఒక వేళ మా విజిటర్ చాలా బలవంతుడై, అట్టముక్కలని తోసేస్తే?    అని దానికి అడ్డంగా చిన్న పూల కుండీని  అందనంత ఎత్తులో పెట్టేయడమేమిటి అన్నీ క్షణాల్లో చేసేసాం. ఇంటిని ఇనప్పెట్టె చేసేసాం అని 'హై  ఫైవ్' లు ఇచ్చేసుకున్నాం.
       ఇప్పుడు మొదలయింది.. మా అసలు కధ. ఎలకల మందు కొనుక్కొచ్చాను నేను.. దాన్ని, దాని పక్కనే టొమేటో ముక్కలనీ పెట్టడం, అవి ఏవైనా  తింటున్నాయా? లేదా అని రోజూ చూడడం ఇదే మా దినచర్య అయింది ఆ తరవాతి నాలుగు రోజులూ..  అన్ని గదుల్లోవీ  తినడం లేదు, ఫలానా చోటవి మాత్రమే అని చెప్పుకోవడం, ఆ చుట్టుపక్కల ఏమైనా జాడలు కనపడతాయేమో  అని వెతకడం .. ఒకటే  హడావుడి . మందు ఎక్కడ పెట్టామో, ఆ వివరాలు   పేపర్ లో కూడా రాసుకునేదాన్ని మర్చిపోతానేమో అని.. ఈ ప్రహసనం పుణ్యామా అని మా మంచం కింద టొమేటో ముక్కలూ , టీ .వీ షెల్ఫ్ కింద ఎలక మందు బిళ్లల ముక్కలూ ఇలా నానా గందరగోళం.
      ఇక ఇది పని కాదని మా ఇంటి పక్కన ఉన్న మార్కెట్ కి వెళ్లి ఎలకల బోను కూడా కొన్నాం. అదేమిటో? ఇరవై ఒకటో శతాబ్దంలో ఎలకల బోను షేప్  కూడా మారిపోయింది.. ఒక పాత డబ్బా రేకుతో జానెడు ఉంది అది చూస్తే.. నా చిన్నప్పటి బోను తాలుకా పోలికలు ఎక్కడా లేవు.. కొత్త ట్రెండ్ ఏమో మరి. మిస్ మార్పెల్,  హిర్క్యూల్ పోయిరో లని రోజూ తలుచుకుని భూత అద్దం  లేని డిటెక్టివ్ లా  ఇంట్లో ప్రతీ  అంగుళం శోధించాను ఆ నాలుగు రోజులూ,,
ఆరో రోజున  జరిగింది అద్భుతం.. ఎక్కడ ముక్కలు అక్కడే.. నేను గుర్తు కోసం గీసుకున్న సున్నాలలోనే పదిలంగా ఉన్నాయి. ఎర్రగా, నోరూరేలా వేయించి బోను లో తగిలించిన ఫ్రెంచ్ ఫ్రై ముక్క కూడా అలాగే ఉంది.మండుటెండలో పన్నీరు చిలకరించినట్టు ఫీలయ్యి పోయాను.
నాగమ్మ మళ్ళీ రంగ ప్రవేశం చేసి.. 'ఇంక తినడం లేదు ఎక్కడో చచ్చిపోయింది 'అంది మళ్ళీ.. నీళ్ళు ఎక్కడా ఉంచద్దు అన్నారు కదా.. ఆ జాగ్రత్త పడ్డాం కదా, ఏమైపోయిన్దబ్బా  అనుకున్నాను.. తరవాత రెండు రోజులూ కూడా ఏమీ జరగలేదు.. తినడమూ లేదు.. ఇంట్లో ఉన్న జాడా లేదు .. మరి ఏమైనట్టు? అని మళ్ళీ అనుమానం..
 

'ఎక్కడికో బయటకు పోయి చచ్చి పోయి ఉంటుంది? 'అంది నాగమ్మ. 'నిజమే  !ఇంట్లో పొతే వాసన రాదా ?అనుకున్నాను, మళ్ళీ నా డిటెక్టివ్ టోపీ పెట్టుకుంటూ.
    అతి ముందు జాగ్రత్తగా మరొక రెండు రోజులు ఫ్రెంచ్ ఫ్రైసూ, టొమేటో ముక్కలూ ఇల్లంతా పెడుతూనే ఉన్నాం. అవి అంగుళం   కూడా కదలనందుకు ఆనందపడుతూ అమ్మయ్యా ! అనుకున్నాం..  ఇంక ఇంటిలోనూ లేదు, రావడమూ లేదు అని నిర్నయించేసుకున్నాం . అయితే దాదాపు వారం రోజులు నాకు మనశ్శాంతినీ,      నిద్రనీ దూరం చేసి, మా ఇల్లంతా సలాడ్ పందిరి చేసి, సందడి చేసిన ఆనింద్యుడు అలా గప్ చుప్ గా మాయమవడం మాత్రం ఒకింత నిరాశనే కలిగించింది మాకు. 'దొంగ దొరకని కారణాన", 'తగినంత రుజువు లేని కారణాన' 'ఆపరేషన్ ఆనింద్య'  ని సక్సెస్ ఫుల్లీ క్లోజేడ్ అని రాసేసుకున్నాం.   నిజంగానే 'ఆపరేషన్ సక్సెస్ ,, పేషంట్ డెడ్' అని నమ్మేసి  మరీ ....
           

ముత్యాల సరాలు: 1. అణువూ . అణువున .......

      మనసులోని భావాలని, మనలోని ఆలోచనలనీ, మదిలోని అనుభూతులనీ అందంగా, క్లుప్తంగా, వినసొంపుగా, సునిశితంగా చెప్పే సాధనాలే  పాటలు. అది సాంప్రదాయ బద్దంగా స్వరపరిచిన సంగీతమే అయినా, లలితంగా మనసుని మీటే లలితగీతమైనా, నిత్యజీవనంలో ముఖ్యభాగమైన సినిమా గీతమైనా, గంభీరంగా  ధ్వనించే గజల్ అయినా... పేరు వేరే కానీ ప్రయోజనం ఒకటే. జనరంజనమే.. పాటకి కొత్తా పాతా  లేవు. నిన్నటిది నేటికి పాత పాట అయితే,,నేటిది రేపటికి. కానీ పాటల్లో మంచి పాటలు మాత్రం తప్పకుండా ఉంటాయి. విన్నది విన్నట్టుగా మరచిపోకుండా మన పెదవుల మీద నాట్యమాడితే  అది మంచి పాట, మన జ్ఞాపకాలలో కొన్నాళ్ళు కదలాడితే అది గొప్ప పాట. మన జీవితాలలో ఒక భాగమైపోతే మాత్రం ఖచ్చితంగా అది అధ్బుతమైన పాట. ఇన్నేళ్ళ మన చలన చిత్ర పరిశ్రమ ప్రయాణంలో అలాంటి ఆణిముత్యాల లాంటి పాటలెన్నో. అందులోంచి కొన్ని ఏరి, కూర్చి ఒక ముత్యాల సరాన్ని  చెయ్యాలనేదే ఈ ప్రయత్నం. 

   దైవ చింతన పలురకాలు.. అలాగే దైవ ప్రార్ధన కూడా. చాలా సందర్భాలలో దైవ ప్రార్ధన తన కోసమో, తన వారి క్షేమం కోసమో, లేక ఏదైనా కోరిక తీర్చమనో ఉంటుంది. నిజ జీవితంలోలాగానే సినిమాలలోనూ. కష్టం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవదమూ, నాకిదిస్తే నీ కిది చేయిస్తానని భగవంతుడికి ఆశ పెట్టడమూ మనుషులందరూ మామూలుగా చేసే పనే. ఇలాంటి మనస్తత్వాన్నీ, సంధర్భాలనీ ప్రతిబింబిస్తూ దేవుడిని వేడుకునే పాటలు మన చిత్రాలలో చాలానే వచ్చాయి. ఇంకా ఆవేశం ఎక్కువైతే 'ఇలా ఎందుకు చేసావ్   ?  అసలు ఉన్నావా?.లేవా?" అంటూ నిలదీసే పాటలూ ఉన్నాయి. 

      ఐతే ఇక్కడ మనం చెప్పుకోబోయే పాట చాలా విలక్షణమైనది.జ్ఞానపీఠ్  అవార్డ్ గ్రహీత డా.  సి. నారాయణ రెడ్డి గారు రాసిన ఎన్నో  మంచి పాటలలోని ఈ ఆణిముత్యం చాలా సందర్భోచితంగానూ, పాత్రల మనస్సులకీ, మనస్తత్వాలకీ అద్దం పట్టేది గానూ ఉండడం ఒక గొప్ప విషయం. ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ. అశ్వద్ధామ గారు స్వరపరచిన ఈ పాట 1972 లో విడుదలైన "మానవుడు-దానవుడు" చిత్రంలోది. కరుణ రసాత్మకంగా సాగే ఈ పాటను   శ్రీ. బాలూ గారు దీనిని కర్ణపేయంగా ఆలపించారు, తెరమీద శ్రీ. శోభన్ బాబు, శ్రీమతి శారద తదితరులు కనిపిస్తారు. 

    సృష్టిలో ప్రతీ అణువులోనూ నిండి వున్న దేవుడిని ( పేరేదైనా సరే.. ఆ భగవత్స్వరూపాన్ని) , కనుల వెలుగువై కరుణించ రమ్మని పిలిచే ప్రార్ధన. ఒక శాంతియుతమైన ఆశ్రమ వాతావరణంలో పెరిగిన మనుషుల మనస్తత్వాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, నిస్వార్ధంగా ఏం కోరుకుంటాయో చూపించే పాట. మానవత్వాన్ని పరిమళింపచేసే సుగుణాలు తప్ప  వారికి లేకపోయినా సరే, మామూలు ప్రాపంచిక సుఖాలేవీ వారు కోరుకోకపోవడమే విశేషం. 

    మొదటి చరణంలో మనుషులలో ఒకరిని ఒకరు నాశనం చేసుకునే ఈర్ష్యా, విషంలా కురిపించే ద్వేషమూ రాజ్యమేలుతున్న రోజుల్లో నిప్పు లాంటిదైనా  సరే నిజాన్ని తెలిపి, చల్లని అమృతపు జల్లులు కురిపించే మంచి మనుషుల అమృత గుణాన్ని  మా కందించమని కోరిక. మంచిమనసూ, అది కలవారి సుగుణాలూ మాకందిస్తే మేము కూడా ఈ ఈర్ష్యా ద్వేశాలని తప్పించుకుని మంచివారుగా మెలుగుతామని భావన. సినిమా పేరుకు తగ్గట్టుగా మనుషుల్లోనే మానవులూ, దానవులూ ఉన్నారని చెప్పకనే చెప్పడం. తోటిమనిషిని కరిచే దానవులున్న వేళలోనే,  ఆ నేలలోనే మంచితనపు సుధారసాలు కురిపించే మానవులూ ఉంటారని, వారిలాగే మేము ఉండేలా వరమివ్వమనీ.. కోరిక. చాలా సాధారణమైన మాటలతో గొప్పగా ధ్వనించే సాహిత్యం.

     రెండవ చరణంలో త్యాగనిరతిని ప్రసాదించమని కోరిక. దానికి ఉదాహరణగా స్వతంత్ర సమరంలో తమ ప్రాణాలకు లెక్క చేయక, తమ భావి తరాల వారు స్వతంత్ర ఫలాలను  అనుభవించడానికి తమ అసువులు తృణప్రాయంగా త్యజించిన వారి సేవాగుణం అందించమని ప్రార్దిస్తారు. ఏ పని చేయాలన్నా, 'దీనివల్ల  నాకేం లాభం'? అనుకుంటూ ఉంటూ ఏ పనీ చెయ్యలేము, లాభాపేక్ష వల్ల స్వార్ధమూ, సంకుచిత తత్వమూ అలవడతాయి. మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు వదిలిన మహనీయులెవ్వరూ ఒక్కసారి కూడా 'నాకేమిటి?" అన్న ప్రశ్న వేసుకోలేదు కనకనే తోటివారి స్వేచ్చకి కారణమయ్యారు. అలాంటి గొప్ప గుణం మా కందిచవయ్యా అని భగవంతుడిని ఆర్తితో కోరుకుంటారు.

   ప్రేమా, త్యాగమూ తరవాత మానవతా విలువల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది సేవాగుణం. సేవా, సాధనా మనుషులని సన్మార్గంలో నడుపుతాయి. నిస్వార్ధమైన సేవాభావం అరుదుగా కనిపించే లక్షణం. ముఖ్యంగా వ్యాధి పీడితులకీ, బాధలలో కూరుకుపోయిన రోగులకీ, అవసరార్దులకీ, చేతనైనంత సేవ చెయ్యడం అనే మానవ సేవ ని మించిన మాధవ సేవ లేదు.. అలాంటి లక్షణం అయినా సేవాగుణం మాకందిచ రావా  అని దేవుడిని మనస్పూర్తిగా వేడుకుంటారు మూడో చరణంలో. 

     మనసుని కదిలించే సాహిత్యం, భావం, కరిగించే సంగీతం, కమ్మని గానం, కమనీయమైన అభినయం వెరసి ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోయే గీతరాజం. ఈ పాటలో ప్రస్తావించిన సుగుణాలలో కొన్నైనా అలవరచుకోగలిగితే  ఆ మనిషి జన్మ ధన్యం అనిపించే పాట. చాలా గొప్పపాట .
        ముఖ్యంగా ఈ రోజు ఈ పాత గురించి ప్రస్తావించడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ఎప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటూ,  వారికి  తనకు వీలైన సాయాన్ని  అందించాలని తపనపడుతూ, మంచితనానికీ, స్నేహానికీ, శాంతానికీ మారుపేరుగా  గత ఇరవై ఏళ్లుగా నాకు జీవిత  సహచరునిగానే  కాక, ఒక మంచి స్నేహితుడిగా,  తోడుగా, మార్గదర్శకుడిగా వెన్నంటి నిలిచి, నడుస్తున్న మా వారు   శ్రీనివాస్ కి అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా పాట ఇది, ఈ రోజు తన పుట్టినరోజు కనక నాకు అత్యంత ఇష్టమైన రోజు ఇది. అందుకే ఇది కేవలం తనకోసం రాసిన టపా.
                      పుట్టిన రోజు శుభాకాంక్షలు శీను.. ఇలాంటి పుట్టిన రోజులు మనం మరెన్నో జరుపుకోవాలి..
Have a great day..... 


నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...