Sunday, May 19, 2013

కొబ్బరి బొండం .. బాద్షా సినిమా.. కొన్ని ప్రశ్నలు ????


"చాలా రోజుల తర్వాత రాస్తోంది కదా ఈవిడకేదైనా అయిందేమో?  "అనుకుంటారేమో అన్న అనుమానంతోనే మొదలు పెట్టాను ఈ టపా. చదివాకా పరవాలేదు అనిపించినా, బొత్తిగా ఆవూ, కొబ్బరి చెట్టూ వ్యాసాల్లా ఉంది అనిపించినా సరే వెంటనే చెప్పేయండి మరి. 
మొన్నెప్పుడో మిట్టమధ్యాహ్నం మండుటెండలో ( నిజమే .. మా బెంగుళూరులో మధ్యాహ్నం మూడింటికి  ముప్ఫై మూడు డిగ్రీ లు మండు టెండ కిందే లెక్క మరి )..
మా ఇంటి దగ్గరే ఉన్న  ఒక కొబ్బరి బొండాల అతని దగ్గరకు వెళ్లి ఒక బొండం కొట్టి ఇవ్వమని అడిగాను..
 " నీరా అమ్మా? కంజా? " అని అడుగుతూనే మళ్ళీ మర్చిపోతానేమో  అన్నట్టు " ఒకటి పాతిక రూపాయలమ్మా " అన్నాడు ఇవ్వమంటారా అన్న ధోరణిలో.
నేను ఆశ్చర్యపోయాను.. మొన్నటి వరకు ఇరవై కదా,  అని.. మెల్లిగానే అడిగాను.
 "సప్లై ఇల్లమ్మా "అన్నాడు.. ఇలాగే సాగితే రేపు ఇంకో ఐదు రూపాయలు పెంచాలేమో అన్నాడు కూడా ...
 పైన పెద్ద బోర్డ్ మీద 'థమ్స్ అప్ 'బాటిల్  పెద్ద అక్షరాలతో చెప్తోంది . 'రెండు లీటర్లు కేవలం యాభై రూపాయలే నంటూ
" సప్లై లేదా? అంటే కాయలే కాయడం లేదా? "అన్నాను అనుమానం గా.
" లేదమ్మా! కాయలున్నాయట.. అవి సిటీకి రావడం కష్టం గా ఉంది , రోజూ రావడం లేదమ్మా కాయలు..  నేనేం చెయ్యను చెప్పండి. " అన్నాడు..
అలా మా మాటల్లోనే అతనొక బొండం కొట్టి ఇవ్వడం, అందులోని గ్లాస్ నీళ్ళు నేను తాగడం జరిగింది..
నేను డబ్బు ఇచ్చి వెనక్కి తిరిగానో,  లేదో సర్రున వచ్చి ఆగింది కోల్డ్ డ్రింక్ ల వాన్.

 పదంటే పది నిమిషాల్లో చుట్టుపక్కల ఉన్న ఆని షాప్ ల లోనూ కావలసిన సరుకు నింపేసి, ఖాళీ డబ్బాలని తీసుకుని  దుమ్ము లేపుకుంటూ  వెళ్లి పోయింది.
చల్లటి    నీటినీ , దాని చుట్టూ చిగురాకులాంటి లేత మీగడ దుప్పటిని  కప్పుకుని దాహాన్ని,   తగు  మాత్రంగా ఆకలిని తీర్చే ఈ ఫలరాజానికి సప్లై కష్టం , రంగు రంగుల నీళ్ళ సీసాల కి మాత్రం ఆ  బెడదే లేదు.. ఎలా సాధ్యం?

'ఈ వేళ ఏదోటి ఆదరగొడదామ్'.. అంటూ తెలుగులోనూ,
 దాన్నే కాస్త అటూ ఇటూగా 'ఆజ్ కుచ్ తూఫానీ కర్తే హాయ్' అంటూ
 ఎక్కడెక్కడికో ఎగి రేసి, పాకేసి, దూకేసి,  చివరికి క్రేన్ ల ద్వారా ట్రక్ లని కూడా ఎగరేసి చివరికి కోల్డ్ డ్రింక్ తాగేసే హీరోలు ప్రకటనలు గుప్పించనందు వల్లనా?  ( అన్ని ఫీట్ లు చెయ్యడం అవసరమా?)
'ఇదే మన క్రికెట్ టీం యొక్క అఫీషియల్ డ్రింక్ 'అంటూ ఊదర గొట్టేస్తున్నందుకా?
'యంగిస్తాన్ , ఇంకో స్థాన్ అంటూ కుర్రహీరోలు సో కాల్డ్ యూత్ ఐకాన్లు" ఉన్నందుకా?
ఇంత రీచ్ ఉండడం  ధరలు తక్కువలో ఉన్నందుకా ?  
ఎప్పుడో కోకోబోర్డ్ వాళ్లకి గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఒక ప్రకటన తప్ప పాపం కొబ్బరి బొండాలని  పట్టించుకునే నాధుడు లేకనా ? పాపం..
కిలోల లెక్కన చక్కెరా , గాస్, కృత్రిమమైన రంగూ  తప్ప మరేమీ లేని  ఈ రంగు నీళ్ళ పాటి చెయ్యవా మన ప్రకృతి తల్లి ప్రసాదాలు అని బాధపడ్డాను...

కట్ చేస్తే .. బాద్షా లొకి..

  కొత్త తెలుగు సినిమాలు విడుదలైన వెంటనే వెళ్లి చూసేయ్యాలన్నంత వెర్రి లేదు కానీ, అనవసరంగా వెబ్సైట్ల రివ్యూ లు  చూసి, ఈ అరివీర భయంకర సినిమా రివ్యూలన్నీ ఏకబిగిన చదివేసి ( ఎవరు చదవమన్నారు?), చాలామంది' బావుంది'అన్నారు 'కామెడీ అదీ 'అంటే మొత్తానికి ఓ దుర్ముహూర్తాన మేమూ చూసేసాము ఈ సినిమా. పూర్తిగా చూసామని చెప్పలేను ఎందుకంటే చివరలో లేచి వచ్చేసాము కనక.. మనుషుల సహనానికీ ఒక హద్దు ఉంటుంది కదా మరి..
 ప్రపంచం నలుమూలనుంచి నలభై రకాల రివ్యూలు రాసాకా నేను ఈ పోస్ట్ రాసి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ మూడు గంటల మా  సమయం ఎలా డ్రైనేజ్  కలిసిపోయింది తలుచుకుంటేనూ, ప్రేక్షకులని ఉత్త మతిలేని వాజమ్మలుగా భావిస్తూ, మేమేం తీసినా చూసేస్తారులే అనుకున్న వారి నిర్లక్ష్యాన్ని తలుచుకుంటే వచ్చే కోపం ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు, బాగా లేట్ గా నైనా సరే  బయట పెట్టకపోతే నా ఆరోగ్యం దెబ్బ తింటుందేమో నని ఇలా ధైర్యం  చేస్తున్నానన్నమాట.  
     నీ కోసం' అంటూ మొదలు బాగానే పెట్టాడు ఈ దర్శకుడు శ్రీను వైట్ల.. నిజంగానే మనకోసమే 'ఆనందకరమైన' సినిమాలే తీస్తాడు, 'మనందరివాడు' ( ఇదో చెత్త సినిమా)  కదా  అనుకున్నాం. కొంచం కొత్తగా "ఢీ" అంటే మనం ఢీ అన్నాము.. దాంతో అతను  ఇంక ఇలాగే సినిమాలు తీస్తాను మీరు 'రెడీ' గా ఉండాలి మరి  అన్నాడు.. మనం వెర్రి వెంగళప్పల్లా సరే అన్నామ్.   అంతే .. ఇంక రెచ్చిపోయి తనే దర్శకింగ్ ననుకుని వీర దూకుడు తో తలా తోక లేని కధలకి కామెడీ రంగుల హంగులేసి మనమీదకి వదలడం మొదలు పెట్టాడు.. నమో వెంకటేశా అని దండం పెట్టుకుని మరీ.. అది వెంకీ అయినా, దుబాయి శీను అయినా ఒకే సీను.. వైట్ల శీను..  ఒకప్పుడు ఉత్త ప్రేమకధలకి పరిమితం అయితే ఇప్పుడు సరదాగా వాటికి పోలీస్, డాన్ ల కలర్ అద్దుతున్నారు , అతను , ఆయన రచయితలూ కలిసి.. గ్లోబల్ ఫీల్ కదా..   ' 
   
    చిన్నప్పుడు అమ్మ అనేది.. అందరి పెళ్ళిళ్ళూ ఒకటే, బొమ్మలు ( పెళ్లి కొడుకు,  పెళ్లి కూతురు) మాత్రం
మారతారు అని.. చిత్రంగా శ్రీను వైట్ల సినిమాలలోనూ అంతే. హీరో,  హీరోయిన్ తప్ప ఒక పెద్ద పెళ్ళికి సరిపడేంత తారాగణం, అన్ని సినిమాలలోనూ సుమారుగా వాళ్ళే , ఎప్పుడూ ఏదో హడావుడి..  పాడుతూ, ఆగుతూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, గజిబిజి గా తిరుగుతూ స్క్రీన్ అంతా నింపేస్తూ ఉంటారు. సినిమాలకి హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టినట్టు స్క్రీన్ ఫుల్ అని కూడ ఒక బోర్డ్ పెడితే  ఈయన సినిమాలే మొదట ఉంటాయి, నాదీ గారెంటీ .  నాజర్,  జయప్రకాశ్ రెడ్డి,  సుధా, సురేఖ వాణి, తనికెళ్ళ భరణి ఇలా...  అసలన్ని పాత్రలెందుకో నాకు అర్ధం కాలేదు ఈ సినిమాలో కొంతమంది సీనియర్ నటులకి కూడా ఒక్క సరి అయిన డైలాగ్ లేదు. వాళ్లకి లేని బాధ నీకెందుకు అంటే నేనేమీ చెప్పలేను. 
     
  పది లక్షల రూపాయల విలువ గల జాకెట్ ( నిజంగా) వేసుకుని, ప్రపంచాన్ని గడగడలాడించే సత్తా ఉన్న ధీరుడు మన బాద్షా. అతనికో డాన్ తో శతృత్వమ్. ఆ డాన్ కి విచిత్రమైన పేర్లు పెట్టుకుని తింగరి చేష్టలు చేసే శిష్యు లు. నిజానికి ఆ డాన్ కూడా  కొంచం విచిత్రంగానే, పరమ తింగరి వాడుగానే  ఉన్నాడు. మన సినిమాల్లో తప్ప ఈ డాన్ లు అనేవారు ఇంత మాములుగా తిరుగుతూ అలా కనిపించిన ప్రతీ హీరో మీదా సవాళ్ళు విసురుతూ ఉంటారా? ఈ మధ్యన ఏ సినిమా చూసిన ఇదే వరస..
 వాళ్ళని చూసి  ఈ మధ్యన మన సినిమాల్లో 'నేను డాన్ అయ్యి తీరుతాను' అని శపధాలు చెసుకోవడాలు.. అక్కడికి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయినట్టూ.. లేదా చాలా గొప్ప కెరియర్ ఆప్షన్ అయినట్టు.. అదే నిజమైతే మొన్నటి వరకూ IIT అనీ, ఈ మధ్యన కొంచం రూట్ మార్చి  సి.ఏ, చీ.పీ.టీ  అని ఊదరగొడుతున్న విద్యాసంస్థలన్నీ ఇక పైన ' బెస్ట్ డాన్'  అవడానికి మాసంస్థ  బెస్ట్. ఆల్ ఓవర్ ది వరల్డ్ లో ఫస్ట్ రేంక్ .. ఇలాంటి ప్రకటనలు గుప్పిస్తారేమో మరి ( వరల్డ్అనిఎందుకన్నానంటే మరి సినిమాలలో ఈ డాన్ లు ఎప్పుడూ  మన దేశం లో ఉండరు  కదా,). మరి మలేశియానో, మరో ఏషియానొ ఎలాలంటే  ఆ మాత్రం ఉండాలి కదా..
 ఆశీష్ విద్యార్ధి వంటి నటుడు పోషించిన జోకర్ లాంటి పాత్రని చూస్తే జాలి వేసింది, మంచి నటుడికి పట్టిన దౌర్భాగ్యం అది.. ఆయనెలా ఒప్పుకున్నాడో ?
           
   సంఘసేవట, ఏదైనా మంచి పని చేస్తేనే కానీ అన్నం, టిఫిన్ కూడా తినని హీరోయిన్ గా కాజల్ ప్రహసనం ఎంత విసిగించిందో చెప్పటం కష్టం. ఇలాంటి తిక్క చేష్టలు చెయ్యడానికి కూడా  ఇటలీలు, టర్కీలు వెళ్ళాలా? రివెంజ్ నాగేశ్వరరావు, సిరేంజ్ సుబ్బారావు ( ఇది నా పైత్యమే,, కావాలంటే ఎవరైనా వాడుకోవచ్చు..:)) లాంటి పాత్రల ద్వారా పండిన కామెడీ ఎంతో రాసిన వాళ్ళకి,  తీసిన వాళ్ళకి తెలియాలి.  వేఫర్ థిన్ స్టొరీ అంటారు కధ ఎక్కువగా  లేకపోతే.. పూతరేకు థిన్ అనాలేమో ఈ సినిమాని..  ..  ఎంత వెతికినా కధే కనబడదు.. కిచిడీ లా వండిన కలగూరగంప తప్ప.. ఒకవేళ ముందే కంచికి పంపేసారేమో ..
      ఎక్కడ, ఏ మూల హిట్ అయిన కాన్సెప్ట్ నైనా వదలని గొప్పవారు మనవారు. అందరికీ ఎంతో బాగా తెలిసిన Inception concept ని ఇంత చీప్ గా ఇమిటేట్ చెయ్యవచ్చా? అనిపించి, కామెడీ అంటే ఇదేనా? అనుకునేలా చే శారు.   మంచి పాత్రలతో ప్రేక్షకులకి బ్రహ్మానందాన్ని ( చాలా సినిమాలలో విసిగిస్తే విసిగించవచ్చు, అది వేరే విషయం) పంచి , సినిమాల విజయాలలో ముఖ్య పాత్ర పోషించే ఆ నటుడిని అన్నిసార్లు కొట్టించడం అవసరమా? కామెడీ పేరిట కాకోఫోనీ  తప్ప మరేమీ చూపలేరా? ఎన్ని రకాల గెటప్ లు వేసినా, ఎంత కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వాడినా, ఎన్ని దేశాలలో తిప్పినా,  చివరికి కామెడీ నే తురుపు ముక్కగా నమ్ముకున్నారా? దానివల్లనే సెకండ్ హాఫ్ లో హీరో ఎవరో? కమెడియన్ ఎవరో తెలియలేదా? సెన్స్, సెన్సిబిలిటీ, లాజిక్, కామన్ సెన్స్ ఇలాంటి పదాలన్నీ పట్టించుకోకుండా పది కామెడీ సీన్లు, ఐదు పాటలు, ఆరు ఫైట్లు , మిగిలిన టైములో ఏదో కలిపేసి అతుకుల బొంత గా కుట్టేసి  మనమీదకి వదిలేస్తే చాలనా వారి అభిప్రాయం?


 ఇలా రాస్తూ పొతే ఎన్నో ప్రశ్నలు.. మొత్తానికి  పేరులోనే తప్ప గమనంలో  నత్త నడక  నడిచిన దూకుడు , వీర బాదుడు బాదేసిన బాద్షా సినిమాలు సినిమా హాళ్ళల్లొ మనిషికి మూడేసి వందలు  చదివించుకుని చూసి వచ్చాకా, చస్తే మళ్ళీ శీను వైట్ల సినిమా థియేటర్ లో చూడను అని నాకు నేనే ధైర్యం చెప్పేసుకున్నాను..

ఇంక లాస్ట్ గా ,  అంటే చివరాఖరుగా ( నాకు ఈ  దర్శకుడి లక్షణాలు వచ్చేస్తున్నాయా? చెప్పినదే మళ్ళీ రకరకాలుగా చెప్తున్నాను)  నేను చెప్పే దేమిటంటే ఆ .. ఫేక్టరీలలొ ఫార్ములా ప్రకారం గా కొలతలు ఎక్కడా తేడా రాకుండా తయారయ్యే కోల్డ్ డ్రింక్ లన్నీ ఒకేలా ఉంటాయి, చూడడానికీ, రుచి చూడడానికీ కూడా..  అచ్చం ఇప్పుడొస్తున్న సినిమాల లాగానె. అందులో ఏ  వెరైటీ ఉండదు, రుచి కూడా మొదట బావున్నట్టనిపించినా తర్వాత విసుగు వస్తుంది. ఆరోగ్యసమస్యల గురించి నేను చెప్పనే చెప్పను. ప్రస్తుతం అదే పరిస్థితి ఈ దర్శకుడి సినిమాలది అనిపిస్తోంది నాకు.

 ఒకే గెలలోవైనా సరే, ఒకే చెట్టువైనా సరె.. ప్రతీ ఒక్కటీ విలక్షణం గానూ, ఆహ్లాదకరమైన రుచితోనూ ఉండే   గంగా బొండాలకెందు లోనూ సాటి రావుఈ డ్రింకులు. అందుకే ఇంటి భోజనంలాగే కొబ్బరి బొండాలు కూడా ఎప్పుడూ  బావుంటాయి అని నా అభిప్రాయం.  మన దర్శకులు కూ డా ఇలా పాకేజ్ద్  కోలా డ్రింకుల్లాంటిసినిమాలు కాక 'గంగా బొండాల్లాంటి  స్వచ్చమైన సినిమాలు తీస్తే  చూడాలని ఆశ.. దురాశ అంటారా?
 ఏమో మరి.. మీరే చెప్పాలి..
This is my wishful thinking..


Saturday, September 8, 2012

నా అగ్రహారం కధలు పుస్తకరూపంలో.. త్వరలో మీ ముందుకు

      "కౌముది" ఇంటర్నెట్ పత్రిక లో మూడేళ్ళపాటు ధారావాహికంగా ప్రచురించబడి, నాకెంతో పేరు తెచ్చిపెట్టిన నా అగ్రహారం కధలు త్వరలోనే పుస్తకరూపంలో రాబోతున్నాయి. వాహిని పబ్లిషింగ్ సంస్థ చేత రచన శాయిగారి సూపర్ విజన్ లో తయారవుతున్న నా ఈ పుస్తకానికి కవర్ పేజీ కి బొమ్మ వేసినది ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి గారు. ప్రముఖ రచయితా , నటులు శ్రీ గొల్లపూడి మారుతి రావుగారు ముందు మాట రాసారు. మరొక ప్రముఖ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఒక పరిచయం రాస్తే కౌముది పత్రిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభా, శ్రీమతి కాంతీ కిరణ్ గార్లు మరొక పరిచయం రాసారు.
          ప్రస్తుతం ప్రూఫ్ రీడింగ్ ముగించుకుని ముద్రణకు వెళుతోంది నా ఈ పుస్తకం. ఈ కదలని ఇంటర్నెట్ పత్రిక లో ఆదరించి అభిమానించి నట్టే పుస్తకరూపం లోనూ ఆదరిస్తారని ఆశిస్తాను. మిగతా వివరాలు మరొక పోస్ట్ లో.

Monday, July 23, 2012

కుటుంబ పరివార సమేతం.. ఇదో కొత్త రకం.

      కుటుంబ పరివార సమేతంగా వచ్చి మదర్పిత చందన  .. ఇలా రాసేవారు పాత శుభలేఖలు మర్యాదకోసం. అంతేకాని,  వాళ్ళన్నారు కదా అని మనం మన ఇంట్లో అందరితోనూ ,  పిల్లీ, మేక లతో సహా వెళ్లిపోతామని కాదు కదా..  చిన్నప్పుడు శుభలేఖల్లోనే మొదటిసారి ఈ పదం వినడం. ఉమ్మడి కుటుంబాల కాలం నించీ ఉండేది కనక అప్పట్లో బావుండేది ఆ పదం.   పిలిచారు కదా అని ఓ పదిమంది  పట్టుచీరలూ,  పట్టు పంచేలూ కట్టుకుని వెళ్లి చమత్కారంగా ఒక గ్లాస్ లేదా ప్లేట్ చదివింది పెళ్లి భోజనం చేసి రావడం కూడా మామూలే. అది వేరు.

  అప్పుడెప్పుడో అక్కినేని, సుహాసిని నటించిన సకుటుంబ సపరివార సమేతం అనే సినిమా వచ్చింది .  ఒక రకంగా బానే ఉందిట.  అందరూ గుండ్రంగా కూర్చుని' అంద చందాల చంద మామ రావే 'అని పాడే సుకుని, ఆవకాయ అన్నాలు కలుపుకు తినేసి ఆనక నిర్మాత ఇచ్చిన డబ్బులు పుచ్చేసుకుని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయారు. అది  తెలుగు సినిమాలో ఒక  సకుటుంబ సపరివారం.హిందీలో కుటుంబ పరమైన సినిమాలు తీసే ప్రముఖ సంస్థ రాజశ్రీ  ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాలో చెప్తారు చెప్తారు. 'ఏ కుటుంబమైతే కలిసి భో జనం చేస్తుందో ఆ కుటుంబం ఎప్పటికి కలిసి ఉంటుది, అది  సకుటుంబ సపరివార సమేతం అంటే. అని.  అది హిందీ సకుటుంబ సపరివారం అనుకుందాం. రాజకీయాల్లో అయితే చెప్పనే అక్కరలేదు.

తీసేవారూ, చూసేవారు.. సకుటుంబ సమేతాలు.
        ఇక తెలుగులో  పెద్ద తెరమీద మెగా ఫేమిలీ అని, నందమూరి ఫేమిలీ అని, అక్కినేని ఫేమిలీ అని, ఘట్టమనేని, దగ్గుబాటి ఇలా రకరకాల కుటుంబాలు,  సకుటుంబ సపరివారసమేతంగా, వారి వంతుగా  అరడజను కు తక్కువ కాకుండా హీరోలను తెలుగు వెండి తెరకు సమర్పిస్తూ, వరసగా   సినిమాలు తీస్తూ మనల్ని చూడడానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు..

మనం కూడా మనకి వీలైనప్పుడల్లా వాళ్ళు పిలిచినందుకు పాపం  కాదనకుండా వెళ్లి, రూపాయిలో, డాలర్లో మనకి వీలైన కరెన్సీ వారికి సమర్పించుకుని వారి సినిమాలు ఓ మాదిరినించి,భారీ  హిట్ లు గా నిలబడడానికి మనకి వీలైన  ఉడతా సాయం చేస్తున్నాం. 

పెద్దవాళ్ళనించి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు, వాటిల్లో తెరలకేమీ పెద్ద మినహాయింపు లేదు. ఈ మధ్య చిన్న తెరలమీద కనిపిస్తున్న సకుటుంబ సపరివార సమేతం గురింఛి చెప్పాలనే నా  ప్రయత్నం.
అది చెప్పే ముందు ఒక పిట్టకధ....
 మేము కాలేజీ లో ఉన్నప్పుడు విజయవాడ లో అప్పుడప్పుడు యువవాణికి చిన్న చిన్న ప్రోగ్రాం లు చేసేవాళ్ళం. అంటే వాళ్ళు ఒక విషయం ఇస్తే, దాని మీద మనం  ఒక చిన్న చర్చా కార్యక్రమమో, నాటకమో ఏదో ఒకటి తయారు చేసి స్టేషన్ కి వెళ్ళి  రికార్డింగ్ చెయ్యాలి.. అలాంటివాటికి మొదట్లో యాభై తర్వాత డెభై ఐదు రూపాయలు పారితోషికం గా ఇచ్చేవారు.   అప్పట్లో అది ఎంత గొప్పగా ఉండేదో చెప్పలేను. రెండు మూడు నెలలకొకసారి అవకాశం  ఇచ్చేవారు వాళ్ళ రూల్స్ ని బట్టి.

ఒకసారి ఇలాంటి ప్రోగ్రాం కి ముందు అనుకున్న స్నేహితులు ఇద్దరు రానందువల్ల, అప్పటికప్పుడు మరెవరూ దొరక్క నేను,  మా చెల్లీ కలిసి అమ్మనీ తమ్ముడినీ తీసుకుని వెళ్ళి  రికార్డింగ్ చేసేసాం స్క్రిప్ట్ అంతా మనమే రాసాం లెండి. ఆ ప్రోగ్రాం విన్న మా చుట్టాలు కొందరు. 'రేడియోవాళ్ళు ఇంటికొచ్చి రికార్డ్ చేసేసారా? మొత్తం అందరూ మాట్లాడే సారు? అని జోకులు వేసారు మనకిచ్చిన పారితోషికం ఎవ్వరితోనూ పంచుకోక్కరలేదు కదా అన్న ఆనందంలో మేము పెద్దగా పట్టించుకోలేదు లెండి.
ఈ మధ్యన పని అయ్యాకా కొంతా,  పని లేక కొంతా, ఏ  నిద్ర రాక ఇంకొంత  రకరకాల కారణాలవల్ల  ( కర్ణుడిచావులాగే, తల వాచేలా చావ కొట్టిన్చుకోవడానికి కారణం అయినా ఒకటే కదా మరి !)  రెండు మూడు సార్లు తెలుగు ఛానెల్స్ లో ఏవో గేం షోలు  (అసలీ ప్రయోగం కరక్టేనా? అని నా అనుమానం) అనుకోకుండా చూసాను పూర్తిగా కాదులెండి.

 మొదటి ప్రోగ్రాం పేరు లక్కూ కిక్కూ ట. ఇంకా నయం డొక్కూ తుక్కూ అని పెట్టలేదు.  దాంట్లో పాల్గొన్నవారు నలుగురు పిల్లలు. దాని పేరు 'స్మాల్ స్క్రీన్ సేలేబ్రిటీస్  కిడ్స్ స్పెషల్ ట'. మహా వెటరన్ యాంకర్ ఝాన్సీ ఆ స్పెషల్ ఎపిసోడ్ ని గురించి చెప్తూ ఉంటె నోరు తెరుచుకుని విన్నాను అదేదో సీరియల్  న టీమణుల    స్పెషల్ స్టార్ మహిళ అంటారు, వారితో వచ్చీ రాని   డాన్స్ లూ , పాటలూ...

చిన్ని తెర  సెలెబ్రిటీల  స్పెషల్ వంటలు - వార్పులు అన్నారు, మనం రోజూ చేసుకునే ఉప్మాలని కరివేపాకు లేకుండా,  వేపాకు వేసి  ఎలా చెయ్యవచ్చు? అసలు తనకి వంట రాకపోయినా ఈ ప్రోగ్రాం కోసం ఎలా నేర్చుకుని వచ్చి ఇలా సొగసుగా వండి మనందరినీ ఉద్ధరిస్తున్నారు ఇలాంటివన్నీ చెప్తూ, సీరియల్స్ లోనే కాక అన్ని ప్రోగ్రాములలోనూ అద్భుతమైన  తమ ప్రతిభ ని చూపిస్తునారు బుల్లి  తెర తారలు. ఇది చాలనట్టు వీళ్ళ పిల్లలు కూడానా ? అనుకున్నాను.

   ఆ నలుగురిలోనూ ఒక పిల్ల ఝాన్సీ కూతురుట  ఇంకో అబ్బాయి చంద్రముఖి సీరియల్ లో వచ్చే ప్రీతి నిగమ్ వాళ్ళ అబ్బాయిట ,  మిగిలిన వాళ్ళిద్దరూ యాంకర్ సుమ, నటుడు రాజీవ్   కనకాల ల  పిల్లలుట ఇవన్నీ యాంకర్ ఝాన్సి చెప్తే తెలిసింది. మధ్యలో 'ధన్యా నువ్వు చెప్పు ఈ రౌండ్ రూల్స్ అని తన కూతురి యాంకరింగ్ చేయించింది కూడా నూ ఆవిడ. అంతకు ముందే    ఇంకో షో లో  కూడా  కూడా పాల్గోన్నారుట వీళ్ళల్లో కొందరు.  వేసవి   సెలవలు కదా ఆని వాళ్ళ అమ్మలూ, నాన్నలూ వీళ్లని తమతో తీస్కుని వచ్చి పనిలో పనిగా ఇలాంటివి కూడా చేయిస్తారేమో మరి. పుణ్యమూ, పురు షార్ధమూ నూ.

  
      అది అయిందా ?మరో రెండు రోజులకి అనుకుంటా ! ఈసారి పిల్లలు కాదు వాళ్ళ నాన్న.. రాజీవ్ కనకాల.. పార్టి సిపెంట్ ,  ఆతనికి    సపోర్ట్ వాళ్ళ కుటుంబ మంతానూ . వారికి రకరకాల క్లోజ్ అప్    షాట్లు. " మనస్ నువ్వేమంటావ్ ? నాన్నచెప్పినది రైటా ?" అనో "'రోషన్ నువ్వు చెప్పు "అనో వాళ్ళ అమ్మ, ఆ ప్రోగ్రాం యాంకర్   అయిన  సుమ అడగడమూ, దానికి వాళ్ళేదో చెప్పడమూ,  ఇదంతా చూస్తే  అదేదో వాళ్ళు సరదాగా  వాళ్ళింట్లో ఆడుకున్టున్నట్టుగా  అనిపించింది కానీ స్టూడియోలో జరుగు తున్న కార్యక్రమం లా అస్సలు అనిపించలేదు.  ఆ గోలా, ఇంట్లో వాళ్ల గొడవా భరించలేక టీ. వీ ఆపేసాను. ప్చ్..

       నిన్న రాత్రి నిజంగానే పొద్దు పోయేదాకా పని చేసుకుని ఊరికే టీ వీ పెట్టానా ! ఒకచానెల్ లోనూ చూడదగ్గది గా ఉన్న ఒక్క ప్రోగ్రాం కనిపించలేదు. మరో ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా అని భలేచాన్సులే అనే ప్రోగ్రాం పెట్టానా? అక్కడా మళ్ళీ వీళ్ళే. ఇది రిపీట్ ప్రోగ్రాం అనుకుంటా.  సుమ ఆడిస్తోంది..ఆవిడ కుటుంబం  అందరూ వైకుంఠ పాళీ మీద నిలబడి ఉన్నారు ఇంక అక్కడనించి చూడాలి వారి ప్రహసనం.. ఆ పిల్లని టీచర్ అవమన్నారు. ఆ చిన్న పిల్ల వీళ్ళని ఎదో అడగడమూ, వీళ్ళేదో తింగరి సమాధానం చెప్తే మాటి మాటికీ 'యూ ఆర్ స్టుపిడ్ అని తిట్టడమూ.. చాలు మహాప్రభో అనిపించింది. ఆ అబ్బాయిని ఇంకేమో చెయ్యమన్నారు . తన కూతురు టీచర్ గా ఉన్నప్పుడు దాన్ని చాలా రక్తి కట్టిస్తున్నాను అనుకుంటూ,  వాళ్ళ అమ్మ సుమ ముద్దు మాటలతో చేసిన వెర్రి చేష్టలూ. ఐదు నిమిషాలు చూడ్డమే కష్టమైంది.

  చివరిలో మా అబ్బాయికి 70 వేలు, మా వారు రాజీవ్ కి 60000, ఇంక ఈ ఎపిసోడ్ విన్నర్ అయిన మా అమ్మాయి మనస్వినికి లక్షా ఐదు వేలు అంటూ ఆవిడ ప్రకాటన చేసేసింది. ( కొద్దిగా అటూ ఇటూగా లెక్క వేసుకోండి). తన పారితోషికం ఎంతో చెప్పలేదు లెండి. ఇలా ఆడిచేందీ మేమే, గెలిచేదీ మేమే అని పారితోషికాలూ, ప్రైజ్ మనీలూ, గిఫ్ట్  హాంపర్ లూ పట్టుకుపోతున్నారన్నమాట ఒకరి చేతులొకరు పట్టుకుని చిరునవ్వులతో కెమెరాలకి పోజిచ్చేసి మరీ..

ఏళ్ళకి ఏళ్ళుగా వీళ్ళు చిన్న తెరలని ఏలుతున్నది చాలకనా ఇలాంటివి? ఇవన్నీ ఎవరికొచ్చిన ఐడియాలో మరి? యాంకర్ లు గా వారు చూపించిన/స్తున్న  ప్రతిభని తక్కువ చెయ్యలేం కానీ దేనికైనా ఒక పరిమితి ఉండాలి కదా? వారిమీద నాకేమీ కోపం లేదు.. కానీ ఎవరో సూచించినా కూడా ఒప్పుకునేముందు కొంత ఆలోచించాలి కదా.. పిల్లలకి అక్కరలేని ప్రచారమూ, ప్రైజ్ మనీలూ ఇవన్నీ అవసరమా?  సరదాగా చిన్న పిల్లల ప్రొగ్రాం ఎదైనా ఒకటి రూపొందించి సరదాగా వాల్లందరి తోనూ, ఆడీంచీ, పాడించీ ఇంటికి పంపవచ్చు కదా అనిపించింది. అంతగా చెయ్యాలి అనుకుంటే.

అసలే సినిమాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలూ, కోట్లు ఇచ్చి కొనుక్కున్న శాటిలైట్ హక్కులకి న్యాయం కలగడం కోసం పదే పదే    చూపించే అవే పది సినిమాలూ.. ఇవి   చాలనట్టు.. ఇలాంటి చెత్త కార్యక్రమాలు కూడానా?
ఇవి ఇలాగే  సాగితే ఇంక పెద్దగా తెలుగు చానెల్స్ పెట్టుకునె పని ఉండదని అనిపిస్తోంది.. అంతే కాదు.కొనసాగుతున్న నట వారసత్వం టైపులో యాంకర్ వారసత్వాలు, సుప్రీం యాంకరింగ్ ఫామిలీలు అవీ అవతరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 ఇరవై నాలుగు గంటలు కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని, లేకపొతే వానలు కురవవు, కురిసినా పంటలు పండవు అని ఎవ్వరూ శపించలేదు కదా!దేశాన్ని ఈ మాత్రం సురక్షితంగా ఉండాలంటే  మీరిలా నిరంతరం గా ప్రేక్షకులని హింస పెట్టవలసినదే అని ఎవరూబెదిరించలేదు కదా! మరి అలాంటప్పుడు ఎందుకీ కార్యక్రమాలు? ఎవరికోసం  ?

 నాణ్యమైన కార్యక్రమాలు నాలుగు గంటలు చూపించినా చాలు... మిగిలిన ఇరవై గంటలు ప్రజలు సుఖంగా, సంతోషంగా తమ పనులు తాము చేసుకుంటారు.హాయిగా, ఆనందంగా ఉంటారు.

 మీరు ఎన్ని అయినా చెప్పండి మన ఛిన్నప్పటి 'యే జో హై జిందగీ, ఆనందో బ్రహ్మా, చివరికీ రుకావట్  కే లియే ఖే ద్ హై సాక్షిగా పాలు చేలూ కార్యక్రమం .. నాటి రోజులే బావున్నాయి.      ఆమెన్.

Monday, July 9, 2012

ఈగ..ఈగ...ఈగ.. యముడి మెరుపు తీగ...

ఈగ..ఈగ...ఈగ.. యముడి మెరుపు తీగ...                         

నాకెందుకు ..నచ్చిందంటే 

        ఇది   తెలుగు చిత్ర పరిశ్రమని ఒక మలుపు తిప్పేసే కధ .. ఇన్ని రోజులూ నేను దీనికి మలుపులూ,  తలుపులూ, కిటికీలు.. చేరుస్తూ .మారుస్తూ ఉన్నాను.. ఇంత  ఆలస్యంగానైనా ఇది వెండి తెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది అని భీభత్సమైన డైలాగులు చెప్పలేదు కధా రచయత. 
   ఈ కధ వినగానే తనువంతా పులకరించి,  కనులు చెమరించి, ఎమోషన్ వర్షించింది. ఇన్ని రోజులు ఇలాంటి కధ చెప్పలేదేం?  అని దర్శకుడి మీద అలిగేసి, మీద పడి రక్కేసి   వెంటనే ఓకే చెప్పేసాను అని హీరో  ఓవర్ యాక్షన్ చెయ్యలేదు. ఇందులో నాది చాలా 'బబ్లీ అండ్ లవబల్ కారక్టర్' అని వచ్చీరాని ఇంగ్లీష్ లో పరమ రొటీన్ గా హీరోయినూ అనలేదు. ఇవి  నచ్చాయి నాకు.
 హీరోయిన్ ని ఇష్టపడే విలన్ హీరోని చంపేస్తే ఆ అబ్బాయి ఈగ గా మారి విలన్ మీద పగ తీర్చుకోవడమే కధ అని సింపుల్ గా ఒక లైన్ లో సినిమా మొదలుపెట్టినప్పుడే చెప్పేసాడు దర్శకుడు. ఈ సింప్లిసిటీ నచ్చింది... దాన్ని ఎలా తీస్తాడో అని దర్శకుడు  S.S.Rajamouli    వివిధ వర్గాల ప్రజలలో పెంచిన క్యూరిసియాటి నచ్చింది..
   ఇక అప్పటినించి ' ఈగ పగ తీర్చుకోవడమేమిటి??'  ఎలా ?తీర్చుకుంటుంది ? అనుకున్నవాళ్ళున్నారు , దానికన్నా ఇతనికేమైనా పిచ్చా ? వరసగా సినిమాలు హిట్ అవుతుంటే సంతోషంగా దాన్ని నిలబెట్టుకోక తీరి కూర్చుని చేతులు కాల్చు కుం టాడా ?అని పెదవి విరిచిన .వాళ్ళున్నారు.  రాజమౌళి ఏది చేసినా బాగా చేస్తాడు అని నమ్మకంగా ఉన్నవారూ ఉన్నారు.
   కధ  కన్నా ఎక్కువగా కధనాన్ని, ఎలాంటి కధ అయినా ప్రేక్షకులని తనతోటి తీసుకుని వెళ్ళగలిగితే అది ఎఫ్ఫెక్టివ్ గా కధ చెప్పడం అని నమ్మిన దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. అది ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ గా  కనిపించకుండా జాగ్రత్త పడటం నచ్చింది..
నయాపైసంత నటన రాకపోయినా, నట వారసత్వం పేరుతోనూ, గ్లామర్తోనూ తొడగొట్టడాలూ,  పడగొట్టడాలూ అన్న ప్రాస డైలాగులతోనూ  ఇరవైయ్యేసి, పాతికేసి సంవత్సరాలు పింక్ స్లిప్ ఎరగని గవర్నమెంట్ ఉద్యోగుల్లా పని  చేసుకోస్తున్న హీరోలూ, చిత్ర పరిశ్రమ అంటే తమ సొంత పరిశ్రమ అనుకుంటూ సొంత వ్యాపారం లో దిగినట్టు రోజుకోకరుగా దిగుతున్న నవ వారసుల మధ్య 'కొత్త గాలి'' లా కనపడే హీరో నచ్చాడు.  కనిపించిన ఇరవై నిమిషాలూ అతని సహజమైన నటనా, చక్కటి చిరునవ్వూ , బాడీ లాంగ్వేజ్ నచ్చాయి. మొదటగా అష్టాచెమ్మా లో చూసినప్పుడే ఈ అబ్బాయి లో మంచి ఈజ్ ఉంది.. సరియిన సినిమాలు దొరకితే మంచి నటుడవుతాడు అనిపించినది సరి అయిన అభిప్రాయమే అని మళ్ళీ  అనిపించడం నచ్చింది. ఇంటర్మీడియేట్ చదువుతున్న పక్కింటి చిన్న పిల్లలా తిరుగుతూ పాత్రకి తగ్గట్టుగా నీట్ గా, క్యూట్ గా  ఉన్న హీరోయిన్ నచ్చింది.

జంతువులూ పగ పడతాయా?  అంటే విఠలాచార్య సినిమాల లో కాకుండా నిజ జీవితం లో ? 
ఈగ కి అంత బలం ,తెలివి ఎలా వచ్చాయి?
 ఒక్క మాట మాట్లాడలేకపోయినా చెట్టంత మనిషిని ఎలా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలదు? 
 బొత్తిగా లాజిక్ ఉండద్దా? అన్న ..ప్రశ్నలకి... 

ఓ నా మనసా!! ఏమంటివి?  ఏమంటివి?? మామూలు మాస్ మసాలా సినిమాలలో, అదీ మన తెలుగు సినిమాలలో లాజికా?? ఎంత మాటా?? ఎంత మాటా?? 
లాజికా   సినిమా హిట్ అవుతుందా, లేదా? .అని  నిర్ణయించునది. కాదూ,  కాకూడదూ .. కాదందువా ??
వందలమందిని ఒంటి చేత్తో ఒక మానవుడు కొన్ని సార్లు ఒక చిన్నవాడు  కేవలం హీరో అన్న పేరున్నందున  మట్టి కరిపించుట లో ఉన్న లాజిక్ ఎంత??
కదిలే రైలుని ఆపేయడాలూ,  పదో,  పాతికో జీపులని మూడో కంటికి తెలియకుండా నేలలో పాతి విలన్ తో వాదన చేసే టైములో ఒక్క దెబ్బతో వాటిని ..తాడెత్తున లేపడాలూ.. వీటిలో ఉన్న లాజిక్ ఎంత?
ఈ క్షణం హైదరాబాద్ లో డైలాగ్ చెప్పి,  మరుక్షణం స్విట్జర్ లాండ్ లో పాట  పాడేసే  సందర్భం లో ఉన్న లాజిక్ ఎంత??
పంచ్ డైలాగు ల పేరిట 'వంశాలనీ', ఆ 'వంశాకురాలనీ' కేవలం సినిమా నటులుగా మాత్రమే కాకుండా తెరవేల్పులుగా,  ఇలవేల్పులుగా జనం భావించడం లో ఉన్న లాజిక్ ఎంత??
ఇలా చెప్పుకుంటూ ..పొతే తెలుగు సినిమా ఏనాడో లాజిక్ రహితం అయినది,  కాగా నేడు లాజిక్,  లాజిక్ అన్న వ్యర్ధవాదమెందుకు? 
 అని అన్నగారి స్టైల్ లో నాకు నేనే సమాధానం ..చెప్పుకున్నాను చూసారూ!  అది.. అబ్బో!  నాకు చాలా నచ్చింది.. ఇలాంటి సినిమాలో ,లాజిక్  లేకపోయినా కొన్నిచోట్ల కొద్దిగా ఆ లేకపోవడం మరీ  ఎక్కువ అయిందేమో అనిపించినా పెద్ద నష్టమేమీ లేదు.. మన ఎంటర్తైన్మెంట్ కి లోటేమీ ఉండదు.
   'వంద మాటలకన్న పది చేతలు మిన్న' అని నమ్మిన మన సెకండ్ హాఫ్ హీరో అదేనండీ మన ఈగ మాట్లాడలేకుండానే  తెలివిగా విలన్ ని ఇబ్బంది పెట్టడం నచ్చింది.  సిని మాటోగ్రఫీలూ,  స్క్రీన్ ప్లే లు లాంటి పెద్ద మాటలు నాకు  తెలియవు కానీ, ఈగ పగని తమ పగగా పిల్లలూ,పెద్దలూ భావించి అది వేసిన ప్లాన్ లకి పగలబడి నవ్వడమూ, మనుషులని ఎడంచేత్తో చంపేస్తున్నాడు కదా ఇంత  చిన్న ఈగ కి భయ పడతాడేం ? ఇంత  అమాయకుడా ? అని విలన్ మీద  జాలి పడటం, 'ఈగను చంపేంత సీను నీకు లేదమ్మా'  అంటూ ఈగ గెలిచిన  ప్రతీ సీనులోనూ కేరింతలు .కొట్టడం నచ్చింది. 
        ప్రతీ సీన్ మూడ్ కి తగ్గట్టు, అది ఎలివేట్ అయ్యేట్టు సమకూర్చిన సంగీతం  చాలా నచ్చింది.. కీరవాణి సింప్లీ సూపర్బ్. 'చంపేస్తా...లాంటి మ్యూజిక్ బాక్ గ్రౌండ్ లో వస్తూ ఉంటే  ఎందుకో  మాయాబజార్  లోని   'కోర్ కోర్ శరణు   కోర్' గుర్తొచ్చింది.  మేజిక్ చేసిన   చాలా మంచి బాక్ గ్రౌండ్  మ్యూ జిక్.
     తనకన్నా బలవంతుడు, తెలివైన వాడు హీరోగా (కనీసం తెర మీద) ఉంటే అతనికి సమ ఉజ్జీగా రాణించే విలన్ గా నటించడం వేరు. తన చిటికెన వేలి గో రంత ఉన్న చిన్న కీటకం తన  చుట్టూ తిరుగుతూ,ముప్పు తిప్పలు పెడుతూ పిచ్చేక్కిస్తున్నట్టుగా ఉండే సన్నివేశాలకు తగ్గట్టుగా,  లేని ప్రత్యర్ధిని ఊహించుకుంటూ నటించడం చాలా కష్టం . ఇంచుమించు ఏక పాత్రాభినయం లాంటిది. అలాంటి పాత్రలో నూటికి రెండు వందల పాళ్ళు జీవించిన సుదీప్ నటన చాలా, చాలా నచ్చింది.. చక్కని రూపం, గంభీరమైన వాచకం ( కొద్దిగా కన్నడ యాస ఉండవచ్చు  గాక), పవర్ఫుల్ స్క్రీన్ ప్రేసేన్స్ ,  అన్నింటినీ మించి  నటన  వెరసి ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేసిన సుదీప్ అభినయం అబ్బో!  చెప్పలేనంతగా  నచ్చింది.. ఆయన నటన వల్లనేమో కొన్ని సార్లు విలన్ పాత్ర ఈగ వల్ల ఇబ్బంది పడుతుంటే పాపం అనికూడా అనిపించింది. సినిమాకి ఇతనో హీరో.. రెండో సగం కొద్దిగా  సాగినట్టు అనిపించినా అది సుదీప్ నటన వల్లనే పరవాలేదులే, మరీ అంత సాగతీత .కాదులే అనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా  ఉన్నాడు కూడా.
     మనకు తెలియనికధా  కాదు, ఊహాతీతమైన ముగింపూ కాదు... ఉన్నదల్లా మామూలుగా సాగే మన ఊహల కందకుండా  ఈగ ప్లాన్ లు వెయ్యడమూ,   హీరోయిన్ సాయంతో వాటిని అమలుపరచడమూ చివరకు అనుకున్నది సాధించడమూ నచ్చింది...మొత్తమ్మీద సినిమా బావుంది. చివరలో  ఈగ చేత చిరంజీవి వీణ స్టెప్సూ, రవితేజ జింతాత దరువులూ, జూ. ఎన్.టీ.యార్ డాన్సులూ కూడా  వేయిస్తుంటే, వాటిని చూసి  విరగబడి నవ్వుతున్న పిల్లలని, వాళ్ళని చూసి ఆనందపడుతున్న పెద్దవాళ్ళనీ చూస్తే.. ఫామిలీ అందరికీ నచ్చిన సినిమా అనిపించడం నచ్చింది. 

 ఈ సినిమా Super Success కి మూడు S లు  కారణం అనుకుంటాను నేను.. తెలుగు తెరమీదే  ఇంటర్నేషనల్ స్థాయి Special effects, తన పాత్రకీ , కధనానికీ ప్రాణం పోసిన విలన్- హీరో Sudeep, తను నమ్మిన దానిని చిత్తశుద్ధి తో, తన అనుచరగణంతో ( Team) తో కలిసి అనితరసాధ్యంగా ఆచరించి చూపించే S.S. Rajamouli. అందుకే ఆయన పేరులోని S.S. కి Supremely Successful అని భాష్యం ..చెప్పుకోవచ్చేమో ..

PS: కొత్త తెలుగు సినిమాలు వచ్చిన  వెంటనే  సినిమా హాల్ కి వెళ్లి చూసే అలవాటు లేనే లేదు, ఇంకా రివ్యూలు . కూడానా? మన బ్లాగ్ మిత్రులు  నీలం రాజ్ కుమార్ లాంటి వారు చక్క గా   రాస్తే,  నవ్వు కుంటూ చదివేసి, ఆ తర్వాతెప్పుడో వీలున్నప్పుడు టీవీ లో చూడడమే. సినిమా  బావుంది కదా అని సరదాగా రాసినది ఈ టపా. ఎవరినీ కించపరచాలని కానీ,తక్కువ చెయ్యాలని కానీ కాదు. సినిమా  గురించీ,  నా ఈ  టపా గురించీ మీ  ఆభిప్రాయాలని తప్పక తెలియచేస్తారు కదూ.. .
     

 

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...