Tuesday, May 29, 2012

మరిచిపోయిన పక్కింటివారి ముఖచిత్రమా?





2012 మరియు ఆ పైన...
'నేను ఈ రోజు 'దూకుడు' సినిమా చూస్తున్నాను...' ( చూడు.. ఐతే దానికి అనౌన్స్ మెంట్ ఎందుకు? ..)
'నాకు ఈ మధ్యన ఎంతో బోర్ గా ఉంటోంది.... ఎందుకో తెలీదు,, ఈ రోజు మరీనూ...'  ( అలాగా పాపం)
'హుర్రే!..నాకు ఆన్ సైట్ అసైన్మెంట్ వచ్చింది.. వచ్చేవారమే ప్రయాణం.'.( భలే.. నిజమా?)
'నిన్నటినించీ ఒకటే తుమ్ములూ, దగ్గూ...' ( అయితే..?)
'ఇది మా పిల్లాడు మొదటిసారి స్నో లో ఆడిన ఫోటో..' ( నిజమే??)
'ఇది  నేను, మా కుక్క'( భలే..)
'మనవూరి కేమయింది? వర్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించదేం?' ( కాకెత్తుకుపోయింది.. ఇప్పుడే తీసుకొస్తా, కొంచం ఆగు)
'సూపర్ చెఫ్ కిరణ్ ఎట్ వర్క్.. ఘుమ ఘుమ లాడే చోలే.. '
ఇలాంటివే ఎన్నో...
 అమ్మయ్యా, ఇప్పటికి తెలిసిపోయింది కదా.. ఇవన్నీ ఏమిటో..

రోజూ ముఖం కడుక్కున్నంత సహజంగా, క్రమం తప్పకుండా,   ప్రతీవారూ అరగంట నించి, నాలుగైదు గంటల దాకా గడిపే ముఖ పుస్తకం లో తరచుగా మనకి కనపడే విషయాలే.. ఒక్కోసారి విసుగేత్తించేవి కూడా.

'మరీ ఇలా అన్నీ రాయాలా?'  అని నేనే ఎన్నోసార్లు అనుక్కున్నాను. ఇదే కాదు..
 ' నిన్న కొత్త ఫోటోలు పెట్టాను చూసావా? '  అని అడిగి 'చూశాను' అంటే..
'ఓ చూసావా? మరి కామెంట్ రాయలేదెం? 'అని అడిగేసి మరీ రాయిన్చేసుకోడం..
ఇవన్నీ కొత్త రకం పోకడలు. ఒక్కొసారి చాలా విపరీతంగానూ, వెర్రి చేష్టల్లానూ అనిపిస్తాయి కూడా..

ఇప్పుడు కొద్దిగా కత్తెర కి పని చెప్పేసి. "కట్ చేస్తే' అని . అదే చేత్తో గుండ్రాలు తిప్పేయండి.. నేను మీ ఎదురుగా నించున్నాను

ఇప్పుడు అప్పుడెప్పుడోలా కనిపిస్తున్నకాలం....
" పక్కింటి అమ్మమ్మగారిని ఒక సారి రమ్మనండర్రా!! ఇవ్వాళ మనింట్లో సత్యనారాయణ వ్రతం.. ఆవిడ చేత్తో ప్రసాదం చేస్తే చాలా మంచిది.. "
అని ఒక ఇంటి వారు పిలవడమే ఆలస్యం.. ఆ పక్కింటి అమ్మమ్మగారు తన ఇంట్లో ఎన్ని పనులున్నా సరే.. పక్కన పెట్టేసో,, తొందరగా కానిచ్చేసో వచ్చి కేవలం ప్రసాదం చెయ్యడమే కాదు.. వ్రతమూ,భోజనాలూ అన్ని అయ్యేవరకు దగ్గరేఉండి చూసుకుంటారు. తను తిన్నదీ, లేనిదీ కూడా ఆవిడకి పట్టదు.
ఎనభైలు..
"మీ ఇంట్లో స్టాంపులున్నాయా??  ఒక రెవెన్యూ స్టాంపూ, అదే చేత్తో ఓ రెండు నిమ్మకాయలుంటే ఇవ్వండి రేపిస్తాను.."
 ఇది మొన్న మా ఆడపడుచు గారింట్లో పెళ్ళికి పెట్టిన  చీర అని గోడమీదనించి చెప్పుకునే కబుర్లలో చూపించడం, నిన్న కొబ్బరిలడ్డూ చేసాను, రుచి చూడండి అని ఇచ్చి పుచ్చుకోవడం.. ఆడవారి మధ్య జరిగితే
మగవాళ్ళ మధ్య చేబదుళ్ళూ, ఇవ్వడాలూ, తీర్చడాలూ
"రేపు సినిమాకి వెళదామా వదినా? అని పక్కింటావిడని అడిగి అఫీసులకీ, స్కూళ్ళకీ వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళిపోయాకా, సి అంటూ ముఖాలు కడిగేసుకుని, నీ అనగానే చీరలు మార్చేసుకుని, మా అనగానే ఇళ్ళు తాలాలేసుకుని 'మహా మహిళా చిత్రాలైన మోర్నింగ్ షోలకి వెళ్ళే ముచ్చట్లూ
మా బావగారికి వంట్లో బాగోలేదుట.. అర్జెంట్ గా వెళుతున్నాము.. పిల్లలని చూసుకుంటారు కదా అని పక్కవాళ్ళకి అప్పచెప్పేసి  ధైర్యంగా వెళ్ళే పొరుగువారూ.
ఒరే, నీ జామెట్రీ బాక్స్ ఇస్తావా, రేపు నాది కొనగానే ఇచ్చేస్తాను.. అని తెచ్చుకుని జాగ్రత్తగా వెనక్కి ఇచ్చేసే మగపిల్లలూ
అక్కా, మా కాలేజీలో ఫంక్షన్ కి నీ చీర ఇస్తావా అని పక్కింటి కాలేజీ అక్కని అడిగే పదోక్లాస్ పిల్లలూ.. కొత్తగా టీ. వీ కొన్నవారింట్లో చిత్రహార్ చూడడానికి వచ్చే ఇరుగింటివారూ
తొంభైలు..
కొత్తకొత్తగా వస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లూ, మూసుకోవడం మొదలైన తలుపులూ...
http://saikumarkoya.files.wordpress.com/2010/01/18149car01_070509.jpg 'పొద్దున్నే వాకింగ్ కి వెళదామా, మీ తలుపు కొడతాను.. అని ముందు రోజు అడగడాలూ..
బెల్లు కొట్టి పాయసం గిన్నె ఇవ్వడాలూ..
చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు చిట్టెలు వేసుకుని కిట్టీ పార్టీల పేరిట కలుసుకునే సందర్భాలు ఏర్పాటు చేసుకోవడాలూ..
పెళ్ళిల్లకీ పేరంటాలకీ ఫోన్లు చేసి పిలుచుకోవడాలూ...
రెండువేలు..
  పెరిగిన దూరాలూ.. తగ్గిన మాటాలూ.. చదువుకో, ఉద్యోగానికో దూరప్రయాణాలూ.. మనసులో ఉన్నా మనుషులని కలిసేందుకు లేని అవకాశాలూ... అవకాశం ఉన్నా కలిసి రాని సందర్భాలూ.. 
తీరిక లేని పనివేళలూ.. తీరిక ఉన్నా కోరిక లేకపోవడాలూ...
 వారం మొదలు, వారాంతమూ తప్ప మరేమీ గుర్తుకు రానంతగా వేగంగా కదిలే రోజులూ...
ఏళ్ళతరబడి జీళ్ళ పాకాలలాంటి కధలతో కాలక్షేపాన్ని పంచే టీ.. వీ  సీరియళ్ళూ..
"అక్క, రేపు మీరింట్లో ఉంటారా? నేను అటువైపు వచ్చే పని ఉంది. వీలైతే వస్తాను.. ఫోన్ చేస్తానులే వచ్చేముందూ సొంత అక్కకే ఇలా చెప్పటాలు..
ఆపాదమస్తాన్ని రకరకాల వైర్లతో కట్టిపడేస్తున్న ఎలక్ట్రిక్ సాధనాలూ...

ఇది చదివాకా మళ్ళీ నేను పైన రాసిన 'ముఖ పుస్తకం' వాక్యాలు చూస్తే ఇలా అనిపిస్తుందెమో...
'నేను ఈ రోజు 'దూకుడు' సినిమా చూస్తున్నాను...' ( చూడు.. ఐతే దానికి అనౌన్స్ మెంట్ ఎందుకు? అని మనం అనకూడదు.. అడక్కూడదు..)
  పాతకాలంలో ఊరంతా చెప్పేవారుట సినిమాకి వెడుతున్న సంగతి.. కొత్తగా పెళ్ళైన సుమకి తనూ తన భర్తా సినిమాకి వెళుతున్న సంగతి ఎవరితోనైనా చెప్పాలి అని ఉంది.. అదేం పెద్ద విషయమని కాదు.. కానీ చలీ, మంచు దట్టంగా ముసిరిపోయి మనిషి కోసం మొహం వాచిపోయిన ఆ చలిదేశంలో ఎవరికి చెప్పాలో తెలియలేదు.. అందుకే ఫేస్ బుక్ లో  రాసుకుంది.. ఈ విషయం తెలిస్తే.. నేను బ్రాకెట్ లో ముందు రాసినదానికి బదులు ఇలా రాస్తానేమో.. ( ఓ.. అవునా.. వెరీ గుడ్.. చూసి ఎంజాయ్ చెయ్యండి.)

'నాకు ఈ మధ్యన ఎంతో బోర్ గా ఉంటోంది.... ఎందుకో తెలీదు,, ఈ రోజు మరీనూ...'  ( అలాగా పాపం)
 గత నాలుగు సంవత్సరాలుగా పీ.హెచ్ డీ కోసం కష్టపడుతున్న రవికి.. చాలా నిరాశగా ఉంటోంది ఈ మధ్యన.. లాబ్ లో ఎవరికీ చెప్పే పరిస్థితి లేదు.. తొందరగా డిగ్రీ చేతికి వస్తే ఉద్యోగాన్వేషణలో పడవచ్చు, మనదేశమైనా సరే,, విదేశమైనా సరే.. అప్పుడు ఇలా రసుకున్నాడు. ( పరవాలేదు.. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి అని కొత్త కామెంటు)

'హుర్రే!..నాకు ఆన్ సైట్ అసైన్మెంట్ వచ్చింది.. వచ్చేవారమే ప్రయాణం.'.( భలే.. నిజమా?) పవన్ కి ఆన్శైట్ వెళ్ళాలన్నది చిరకాలపు కల.. ఎక్కడో పల్లెట్టొరిలో పుట్టి పెరిగి చదివి, ఎదిగిన పవన్ కి ఇది చాలా పెద్ద విజయం..
(అభినందనలు)

'ఇది మా పిల్లాడు మొదటిసారి స్నో లో ఆడిన ఫోటో..' ( నిజమే??)- తనూ, భర్త రాం తప్ప ఎవరూ లేరు ఇక్కడ.. తన పిల్లాడి ఆట పాటలు చూడడానికి.. ఇదే దిగులు స్వప్న కి.. తన ఫ్రెండ్సూ, కజిన్సూ,, చూడాలని కోరిక.. (బాబు భలే ముద్దుగా ఉన్నాడు)


'మనవూరి కేమయింది? వర్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించదేం?' ( కాకెత్తుకుపోయింది.. ఇప్పుడే తీసుకొస్తా, కొంచం ఆగు) - ఒక్కొసారి పెద్ద కారణమేదీ లేకుండానే, ఏమీ తోచకపోతే రాసుకునే మాటలివి.. ఎవరో ఒకరు చదివి స్పందిస్తారు కదా అని..

'సూపర్ చెఫ్ కిరణ్ ఎట్ వర్క్.. ఘుమ ఘుమ లాడే చోలే.. '- అమ్మ కమ్మగా వండి పెడితే వంకలు పెట్టుకుంటూ తినడమే తప్ప, వంట అంటే ఎలా ఉంటుందో మొదటి సారి వంట పట్టించుకున్న అమెరికా చదువుల కుర్రాడు తను చేసిన వంట అందరికీ చూపించే ప్రయత్నం.. లేకపోతే ఎలా తెలుస్తుంది అందరికీ?
'ఈ సారి కామెంట్ రాస్తే.. భలే వండావు కిరణ్.. చూస్తేనే నోరూరుతోంది లాంటిదేదో రాస్తాను..

ఇక్కడ వారు రాసిన వాఖ్యల వెనక విషయం మనకి తెలియడం కాదు ముఖ్యం..తెలిస్తే మారేది మన పర్సెప్షన్ మాత్రమే.. ప్రతీవారికి ఏదో ఒక కారణం ఉండవచ్చు. అది అతి అయితే చిరాకు కలిగే మాటా వాస్తవమే.

 మనకి కలిసి జీవించడం ఇష్టం. కలిగినది..  అది మాటైనా సరే, మమతైనా సరే అందరితో పంచుకోవడం వల్ల కలిగే ఆనందం అంటే ప్రియం..
ఉమ్మడి కుటుంబాలే కాదు.. అమ్మమ్మలూ, బామ్మలూ ఉండే చిన్న కుటుంబాలు కూడా కనబడని ఈ రోజుల్లో.. ఖండాంతరాలూ, దేశాంతరాలూ మనుషుల మధ్యన దూరాన్ని ఏర్పరిచినా, మనసులో మనమంతా కొరుకునే దగ్గరతనన్ని పొందాలనే ప్రయత్నమే.. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు విపరీతంగా ప్రజాదరణ పొందడానికి కారణమేమో.
ఒంటరి తనాన్ని దూరంగా ఉంచేదుకు కావచ్చు. నాతోనూ నలుగురున్నారన్న భావన ఇచ్చే బలం కావచ్చు.. సహజంగానే అందరితోనూ పంచుకునే మనస్తత్వం కావచ్చు. కారణాలెన్నో.

 ఇది మనం వాడుకునే పద్దతి కొంత విపరీతంగా ఉండవచ్చు... వింత వింత పోకడలూ,, కాస్తంత వెర్రితలలూ వేసినట్టుగా అనిపించవచ్చు.. వీటిల్లో అంతర్లీనంగా ఉన్న కష్టాలూ అందరికీ తెలిసినవే కావచ్చు.. కానీ ఇవేవీ ఈ ఉధృతాన్నిఆపలేకపోవడానికి కారణం మాత్రం.. అరిస్టాటిల్ చెప్పినట్టు.. మనిషి సంఘజీవి అన్న మౌలిక సూత్రమే..
కలిసి ఉంటే కలదు సుఖము అన్నది మర్చిపోయినా.. కలిసి ఉంటే కలదు సరదా.. అన్న సూత్రం కావచ్చు. అందుకే అనిపిస్తుంది నాకు.. ఇవన్నీ మనం క్రమక్రమంగా మర్చిపోతున్న పక్కింటివారి ముఖచిత్రాలేనేమో. కేవలం ముఖపుస్తకం మాత్రం కాదు.. అని..

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...