Tuesday, March 1, 2011

అంకుల్ పాయ్.. అనంత్ పాయ్

 ఈ సారి ఫిబ్రవరి నెలలోని ఆఖరి వారం పుస్తకప్రియులూ, సినిమా ప్రియులు.. ఇలా కళాప్రియులమీద కక్ష తీర్చుకోవడానికే నిశ్చ యించు కుందేమో అనిపిస్తోంది, వరసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. ముందు శ్రీ మిక్కిలినేని.. ఆ తరవాత శ్రీ ముళ్ళపూడి వెంటనే శ్రీ అనంత్ పాయ్. వీరందరూ  వరస తేదీలలో పరమపదించడం నిజంగా ఆశ్చర్యమే. చూస్తుంటే పైనేదో గూడుపుఠానీ చేసి ఈ మహానుభావులందరినీ మనకు లేకుండా , అక్కడకు పనిమీద పిలిచేసుకున్నట్టుగా అనిపించడం లేదూ.. 
    
దూర దర్శన్ లో ఎప్పుడో 1967 లో జరిగిన ఒక క్విజ్ ప్రోగ్రాం లో అభ్యర్ధులు 'గ్రీక్ పురాణాల గురించి అవలీల గా చెప్పి మన పురాణాలూ, ఇతిహాసాల దగ్గరకు వచ్చేసరికి తడబడడం చూసిన ఒక వ్యక్తి కి వచ్చిన ఆలోచనే.. అజరామరంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలతోనూ, వాళ్ళ తల్లితండ్రులతోనూ ప్రేమగా  పెనవేసుకుపోయిన 'అమర చిత్ర కధలు'. అంటే ఆశ్చర్యమే.  ఇప్పటి వరకూ దాదాపు గా 85 శీర్షికలతో వచ్చిన ఈ పుస్తకాలు దాదాపుగా 440 మిలియన్  కాపీలు అమ్ముడుపోయి చరిత్రని సృష్టించాయి. ఇప్పటికీ ప్రతీ సంవత్సరమూ మూడు మిలియన్లవరకూ అమ్ముడుపోతూనే ఉంటాయి. వీటిలో పురాణాలకీ, ఇతిహాసాలకీ, చరిత్రకీ సంబంధించిన ఎన్నో కధలు పుస్తకాలుగా ప్రచురించ బడ్డాయి. సాధారణంగా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంఘటన గానీ కేంద్ర బిందువుగా ఈ పుస్తకాలు సాగుతాయి. బీర్బల్, తెనాలి రాముడు లాంటి వారిగురించీ, శివుడు, దుర్గ, విష్ణు పురాణాలూ, జాతక కధలూ, భగవద్ గీతా, మదర్ తెరీసా ఇలా ఒకటనేమిటి ఎన్నో రకాల ఇతివృత్తాలూ, ఆహ్లాదంగా రాసే రాతలూ, ఆకట్టుకునే గీతలూ.. వెరసి మనకి మనసుకి హత్తుకునే కతలూ..అవి చెప్పే ఊసులూ.. అమర్ చిత్రకధలకీ, మిగతా వాటికీ కూడా కదా, కధనం శ్రీ పాయ్ సమకూర్చేవారు. రాం వారీకర్, దిలీప్ కదం. ప్రతాప్  ములిక్ వంటి వారు బొమ్మలని అందించేవారు.

       ఆ తరవాత 1980  లో  స్థాపించబడిన 'టింకిల్" అనే పిల్లల కార్టూన్ పత్రిక ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో చెప్పక్కరలేదు. రామూ, షామూ, తంత్రీ ద మంత్రీ, షికారీ శంబు, ప్యారేలాల్,  సుపండి లాంటి పాత్రలైతే ప్రతీ ఇంట్లోనూ కుటుంబ సభ్యులలాగా కలిసిపోయాయి. సుపండి జోకులైతే ఇన్నీ, అన్నీ కావు, ప్రతీ  టింకిల్ పత్రికలోనూ కనిపిస్తూనే ఉంటాయి, కడుపుబ్బ  నవ్విస్తూనే ఉంటాయి. కేవలం మానవ పాత్రలే కాదు, మరిచిపోలేని జంతువులూ  ఉన్నాయి.. కపీశ్ అనే మర్కట రాజమూ , చమత్కా అనే నక్క, డూబ్ డూబ్ అనే మొసలి, కీచు మీచు అనే కుందేళ్ళూ ఇలా ఎన్నో పాత్రలు, వాటి మధ్యన జరిగే ఆసక్తికరమైన కధనాలూ..అను క్లబ్ అనే పేరిట విజ్ఞాన సంబంధితమైన విశేషాలూ, వింతలూ పంచుతారు. మీ చిన్నప్పుడు ఏమి జరిగింది?  అనో లేక మీరే కధ  రాయండి !అనో పిల్లలని తమతో కలుపుకునే ప్రయత్నాలూ, చిన్న చిన్న పజిల్సూ, ప్రశ్నలూ ఇలా ఎన్నో ఆకర్షణలతో టింకిల్ పత్రిక పిన్నలనూ, పెద్దలనూ ఒకేరీతిన అలరిస్తుంది. వీటన్నింటి వెనకా ఉన్నది పెద్ద సంస్థ ఏమీ కాదు.. కేవలం ఒక వ్యక్తి.. అతనే శ్రీ అనంత్ పాయ్.
              కర్నాటక లో 1929 లో జన్మించిన శ్రీ పాయ్ తన రెండో ఏటనే తల్లితండ్రులని పోగోట్టుకున్నారు. తరవాత స్వ శక్తి తో బొంబాయిలో  ఉన్నత విద్యాభ్యాసం చేసారు. మొదటినించీ కూడా పాయ్ కి పుస్తకాలు చదవడమే కాక, ప్రచురించడం అందునా 'కామిక్స్' ని ప్రచురించడం అంటే చాలా ఇష్టం. పెద్దగా నడవకపోయినా 1954 లో ప్రచురించబడిన "మానవ్' అన్న పత్రిక వీరిదే. వీరు టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నప్పుడు వారి 'ఇంద్రజాల్' కామిక్స్ వల్ల చాలా అనుభవం గడించారు. ఆ తర్వాత ఇండియా బుక్ హౌస్ "మీర్చందానీ' గారితో కలిసి అమర్ చిత్ర కదా ప్రారంభించారు..ఇవి అనేక ప్రాంతీయ భాషలలోకూడా లభిస్తాయి. ఇలా శ్రీ పాయ్ ని మా దేశంలోనే  కార్టూన్ యుగానికి 'ఆద్యుడు' గా చెప్పవచ్చు.
     కేవలం పిల్లల పుస్తకాలే కాక 'పర్సనాలిటీ డెవెలప్ మెంట్' మీద వీడియో చిత్రాల్నీ, పుస్తకాలనీ కూడా వెలువరిం చారు. ఆడియో పుస్తకాలకి ప్రయోక్తగానూ పనిచేశారు. పిల్లలకి 'అంకుల్ పాయ్' గా ఎంతో ప్రియమైన మావయ్యగా ఎన్నో కధలూ కబుర్లూ చెప్పే ఈ మావయ్యని ఎన్నో అవార్డులూ, రివార్డ్ లూ వరించాయి. బొంబాయిలోని ప్రభాదేవి లో  శ్రీ పాయ్ తన భార్య శ్రీమతి లలితా పాయ్ తో కలిసి నివసించేవారు.
వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ..
      

4 comments:

  1. Got this news in pustakam.net..very sad..!

    మా ఇంట్లో ఇంగ్లీష్, తెలుగు ఏది ముందు దొరికితే ఆ “టింకిల్" కొనేవాళ్ళం బాలజ్యోతి,చందమామలతో పాటూ. నా దగ్గర ఇంకా అమ్మ బైండ్ చేయించిన తెలుగు టింకిల్స్ ఉన్న బుక్ ఉంది. మా పాపకు అన్నం తినేప్పుడు రోజూ అవే కథలు. మళ్ళి మళ్ళీ అవే చదువు అంటుంది. కాళీయా, డుబ్-డుబ్,చమత్కా, సుపాండి, డుబుక డుబుక కథ,గిజిగాడి గూడు, నీటి గుర్రం కథ..ఇలా ఇన్నో. ఏదీ మర్చిపోలేదు. కొన్ని కథలకు ముగింపు మీరు రాయండి అని వేసేవారు.

    Thanks for the information..

    ReplyDelete
  2. Oh ... Very sad.. మా అమ్మాయికి టింకిల్ వ్యసనం.. లోట్ పోట్ లోపింకీ, సాబూ చాచా చౌదరీ..లాంటి ఎన్నో కారక్టర్లకి కూడా మేమంతా మహా ఫాన్స్ మీ.. నమ్మశక్యం కాకుండా ఉంది :-(

    ReplyDelete
  3. చిన్నప్పుడు ఆంధ్రప్రభలో వచ్చే అనంత పై, మోహన్ దాస్ ల రాము,శ్యాము నా ఫేవరేట్ కామిక్. అలాగే టింకిల్, అమరచిత్రకథ పుస్తకాలూ. భారతదేశపు కామిక్ చరిత్రలో అనంత పై నిర్వహించిన పాత్ర చిరస్మరణీయం.

    ReplyDelete
  4. తృష్ణ గారూ.. మీరు చెప్పినవన్నీ మాకు కూడా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు. మళ్ళీ గుర్తు చేసారు.. థాంక్ యూ.
    కృష్ణప్రియ గారూ.. మా చిన్నప్పుడు చదవడమే కాక, మా అబ్బాయితో సమానంగా నేనూ ఇవన్నీ ఇప్పటికీ చదువుతాను. నిజంగానే మన ఇండియన్ కార్టూన్ లకి ఇది పెద్ద లాస్.
    ఫణిగారూ.. మీరన్నది నిజం. ఎవరైనా ఈ లెగసీని కంటిన్యూ చేసినప్పుడే ఆయనకి నిజమైన నివాళి.

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...