Saturday, September 8, 2012

నా అగ్రహారం కధలు పుస్తకరూపంలో.. త్వరలో మీ ముందుకు

      "కౌముది" ఇంటర్నెట్ పత్రిక లో మూడేళ్ళపాటు ధారావాహికంగా ప్రచురించబడి, నాకెంతో పేరు తెచ్చిపెట్టిన నా అగ్రహారం కధలు త్వరలోనే పుస్తకరూపంలో రాబోతున్నాయి. వాహిని పబ్లిషింగ్ సంస్థ చేత రచన శాయిగారి సూపర్ విజన్ లో తయారవుతున్న నా ఈ పుస్తకానికి కవర్ పేజీ కి బొమ్మ వేసినది ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి గారు. ప్రముఖ రచయితా , నటులు శ్రీ గొల్లపూడి మారుతి రావుగారు ముందు మాట రాసారు. మరొక ప్రముఖ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఒక పరిచయం రాస్తే కౌముది పత్రిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభా, శ్రీమతి కాంతీ కిరణ్ గార్లు మరొక పరిచయం రాసారు.
          ప్రస్తుతం ప్రూఫ్ రీడింగ్ ముగించుకుని ముద్రణకు వెళుతోంది నా ఈ పుస్తకం. ఈ కదలని ఇంటర్నెట్ పత్రిక లో ఆదరించి అభిమానించి నట్టే పుస్తకరూపం లోనూ ఆదరిస్తారని ఆశిస్తాను. మిగతా వివరాలు మరొక పోస్ట్ లో.

Monday, July 23, 2012

కుటుంబ పరివార సమేతం.. ఇదో కొత్త రకం.

      కుటుంబ పరివార సమేతంగా వచ్చి మదర్పిత చందన  .. ఇలా రాసేవారు పాత శుభలేఖలు మర్యాదకోసం. అంతేకాని,  వాళ్ళన్నారు కదా అని మనం మన ఇంట్లో అందరితోనూ ,  పిల్లీ, మేక లతో సహా వెళ్లిపోతామని కాదు కదా..  చిన్నప్పుడు శుభలేఖల్లోనే మొదటిసారి ఈ పదం వినడం. ఉమ్మడి కుటుంబాల కాలం నించీ ఉండేది కనక అప్పట్లో బావుండేది ఆ పదం.   పిలిచారు కదా అని ఓ పదిమంది  పట్టుచీరలూ,  పట్టు పంచేలూ కట్టుకుని వెళ్లి చమత్కారంగా ఒక గ్లాస్ లేదా ప్లేట్ చదివింది పెళ్లి భోజనం చేసి రావడం కూడా మామూలే. అది వేరు.

  అప్పుడెప్పుడో అక్కినేని, సుహాసిని నటించిన సకుటుంబ సపరివార సమేతం అనే సినిమా వచ్చింది .  ఒక రకంగా బానే ఉందిట.  అందరూ గుండ్రంగా కూర్చుని' అంద చందాల చంద మామ రావే 'అని పాడే సుకుని, ఆవకాయ అన్నాలు కలుపుకు తినేసి ఆనక నిర్మాత ఇచ్చిన డబ్బులు పుచ్చేసుకుని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయారు. అది  తెలుగు సినిమాలో ఒక  సకుటుంబ సపరివారం.హిందీలో కుటుంబ పరమైన సినిమాలు తీసే ప్రముఖ సంస్థ రాజశ్రీ  ప్రొడక్షన్స్ వారు ఒక సినిమాలో చెప్తారు చెప్తారు. 'ఏ కుటుంబమైతే కలిసి భో జనం చేస్తుందో ఆ కుటుంబం ఎప్పటికి కలిసి ఉంటుది, అది  సకుటుంబ సపరివార సమేతం అంటే. అని.  అది హిందీ సకుటుంబ సపరివారం అనుకుందాం. రాజకీయాల్లో అయితే చెప్పనే అక్కరలేదు.

తీసేవారూ, చూసేవారు.. సకుటుంబ సమేతాలు.
        ఇక తెలుగులో  పెద్ద తెరమీద మెగా ఫేమిలీ అని, నందమూరి ఫేమిలీ అని, అక్కినేని ఫేమిలీ అని, ఘట్టమనేని, దగ్గుబాటి ఇలా రకరకాల కుటుంబాలు,  సకుటుంబ సపరివారసమేతంగా, వారి వంతుగా  అరడజను కు తక్కువ కాకుండా హీరోలను తెలుగు వెండి తెరకు సమర్పిస్తూ, వరసగా   సినిమాలు తీస్తూ మనల్ని చూడడానికి రమ్మని ఆహ్వానిస్తున్నారు..

మనం కూడా మనకి వీలైనప్పుడల్లా వాళ్ళు పిలిచినందుకు పాపం  కాదనకుండా వెళ్లి, రూపాయిలో, డాలర్లో మనకి వీలైన కరెన్సీ వారికి సమర్పించుకుని వారి సినిమాలు ఓ మాదిరినించి,భారీ  హిట్ లు గా నిలబడడానికి మనకి వీలైన  ఉడతా సాయం చేస్తున్నాం. 

పెద్దవాళ్ళనించి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు, వాటిల్లో తెరలకేమీ పెద్ద మినహాయింపు లేదు. ఈ మధ్య చిన్న తెరలమీద కనిపిస్తున్న సకుటుంబ సపరివార సమేతం గురింఛి చెప్పాలనే నా  ప్రయత్నం.
అది చెప్పే ముందు ఒక పిట్టకధ....
 మేము కాలేజీ లో ఉన్నప్పుడు విజయవాడ లో అప్పుడప్పుడు యువవాణికి చిన్న చిన్న ప్రోగ్రాం లు చేసేవాళ్ళం. అంటే వాళ్ళు ఒక విషయం ఇస్తే, దాని మీద మనం  ఒక చిన్న చర్చా కార్యక్రమమో, నాటకమో ఏదో ఒకటి తయారు చేసి స్టేషన్ కి వెళ్ళి  రికార్డింగ్ చెయ్యాలి.. అలాంటివాటికి మొదట్లో యాభై తర్వాత డెభై ఐదు రూపాయలు పారితోషికం గా ఇచ్చేవారు.   అప్పట్లో అది ఎంత గొప్పగా ఉండేదో చెప్పలేను. రెండు మూడు నెలలకొకసారి అవకాశం  ఇచ్చేవారు వాళ్ళ రూల్స్ ని బట్టి.

ఒకసారి ఇలాంటి ప్రోగ్రాం కి ముందు అనుకున్న స్నేహితులు ఇద్దరు రానందువల్ల, అప్పటికప్పుడు మరెవరూ దొరక్క నేను,  మా చెల్లీ కలిసి అమ్మనీ తమ్ముడినీ తీసుకుని వెళ్ళి  రికార్డింగ్ చేసేసాం స్క్రిప్ట్ అంతా మనమే రాసాం లెండి. ఆ ప్రోగ్రాం విన్న మా చుట్టాలు కొందరు. 'రేడియోవాళ్ళు ఇంటికొచ్చి రికార్డ్ చేసేసారా? మొత్తం అందరూ మాట్లాడే సారు? అని జోకులు వేసారు మనకిచ్చిన పారితోషికం ఎవ్వరితోనూ పంచుకోక్కరలేదు కదా అన్న ఆనందంలో మేము పెద్దగా పట్టించుకోలేదు లెండి.
ఈ మధ్యన పని అయ్యాకా కొంతా,  పని లేక కొంతా, ఏ  నిద్ర రాక ఇంకొంత  రకరకాల కారణాలవల్ల  ( కర్ణుడిచావులాగే, తల వాచేలా చావ కొట్టిన్చుకోవడానికి కారణం అయినా ఒకటే కదా మరి !)  రెండు మూడు సార్లు తెలుగు ఛానెల్స్ లో ఏవో గేం షోలు  (అసలీ ప్రయోగం కరక్టేనా? అని నా అనుమానం) అనుకోకుండా చూసాను పూర్తిగా కాదులెండి.

 మొదటి ప్రోగ్రాం పేరు లక్కూ కిక్కూ ట. ఇంకా నయం డొక్కూ తుక్కూ అని పెట్టలేదు.  దాంట్లో పాల్గొన్నవారు నలుగురు పిల్లలు. దాని పేరు 'స్మాల్ స్క్రీన్ సేలేబ్రిటీస్  కిడ్స్ స్పెషల్ ట'. మహా వెటరన్ యాంకర్ ఝాన్సీ ఆ స్పెషల్ ఎపిసోడ్ ని గురించి చెప్తూ ఉంటె నోరు తెరుచుకుని విన్నాను అదేదో సీరియల్  న టీమణుల    స్పెషల్ స్టార్ మహిళ అంటారు, వారితో వచ్చీ రాని   డాన్స్ లూ , పాటలూ...

చిన్ని తెర  సెలెబ్రిటీల  స్పెషల్ వంటలు - వార్పులు అన్నారు, మనం రోజూ చేసుకునే ఉప్మాలని కరివేపాకు లేకుండా,  వేపాకు వేసి  ఎలా చెయ్యవచ్చు? అసలు తనకి వంట రాకపోయినా ఈ ప్రోగ్రాం కోసం ఎలా నేర్చుకుని వచ్చి ఇలా సొగసుగా వండి మనందరినీ ఉద్ధరిస్తున్నారు ఇలాంటివన్నీ చెప్తూ, సీరియల్స్ లోనే కాక అన్ని ప్రోగ్రాములలోనూ అద్భుతమైన  తమ ప్రతిభ ని చూపిస్తునారు బుల్లి  తెర తారలు. ఇది చాలనట్టు వీళ్ళ పిల్లలు కూడానా ? అనుకున్నాను.

   ఆ నలుగురిలోనూ ఒక పిల్ల ఝాన్సీ కూతురుట  ఇంకో అబ్బాయి చంద్రముఖి సీరియల్ లో వచ్చే ప్రీతి నిగమ్ వాళ్ళ అబ్బాయిట ,  మిగిలిన వాళ్ళిద్దరూ యాంకర్ సుమ, నటుడు రాజీవ్   కనకాల ల  పిల్లలుట ఇవన్నీ యాంకర్ ఝాన్సి చెప్తే తెలిసింది. మధ్యలో 'ధన్యా నువ్వు చెప్పు ఈ రౌండ్ రూల్స్ అని తన కూతురి యాంకరింగ్ చేయించింది కూడా నూ ఆవిడ. అంతకు ముందే    ఇంకో షో లో  కూడా  కూడా పాల్గోన్నారుట వీళ్ళల్లో కొందరు.  వేసవి   సెలవలు కదా ఆని వాళ్ళ అమ్మలూ, నాన్నలూ వీళ్లని తమతో తీస్కుని వచ్చి పనిలో పనిగా ఇలాంటివి కూడా చేయిస్తారేమో మరి. పుణ్యమూ, పురు షార్ధమూ నూ.

  
      అది అయిందా ?మరో రెండు రోజులకి అనుకుంటా ! ఈసారి పిల్లలు కాదు వాళ్ళ నాన్న.. రాజీవ్ కనకాల.. పార్టి సిపెంట్ ,  ఆతనికి    సపోర్ట్ వాళ్ళ కుటుంబ మంతానూ . వారికి రకరకాల క్లోజ్ అప్    షాట్లు. " మనస్ నువ్వేమంటావ్ ? నాన్నచెప్పినది రైటా ?" అనో "'రోషన్ నువ్వు చెప్పు "అనో వాళ్ళ అమ్మ, ఆ ప్రోగ్రాం యాంకర్   అయిన  సుమ అడగడమూ, దానికి వాళ్ళేదో చెప్పడమూ,  ఇదంతా చూస్తే  అదేదో వాళ్ళు సరదాగా  వాళ్ళింట్లో ఆడుకున్టున్నట్టుగా  అనిపించింది కానీ స్టూడియోలో జరుగు తున్న కార్యక్రమం లా అస్సలు అనిపించలేదు.  ఆ గోలా, ఇంట్లో వాళ్ల గొడవా భరించలేక టీ. వీ ఆపేసాను. ప్చ్..

       నిన్న రాత్రి నిజంగానే పొద్దు పోయేదాకా పని చేసుకుని ఊరికే టీ వీ పెట్టానా ! ఒకచానెల్ లోనూ చూడదగ్గది గా ఉన్న ఒక్క ప్రోగ్రాం కనిపించలేదు. మరో ఐదు నిమిషాల్లో అయిపోతుంది కదా అని భలేచాన్సులే అనే ప్రోగ్రాం పెట్టానా? అక్కడా మళ్ళీ వీళ్ళే. ఇది రిపీట్ ప్రోగ్రాం అనుకుంటా.  సుమ ఆడిస్తోంది..ఆవిడ కుటుంబం  అందరూ వైకుంఠ పాళీ మీద నిలబడి ఉన్నారు ఇంక అక్కడనించి చూడాలి వారి ప్రహసనం.. ఆ పిల్లని టీచర్ అవమన్నారు. ఆ చిన్న పిల్ల వీళ్ళని ఎదో అడగడమూ, వీళ్ళేదో తింగరి సమాధానం చెప్తే మాటి మాటికీ 'యూ ఆర్ స్టుపిడ్ అని తిట్టడమూ.. చాలు మహాప్రభో అనిపించింది. ఆ అబ్బాయిని ఇంకేమో చెయ్యమన్నారు . తన కూతురు టీచర్ గా ఉన్నప్పుడు దాన్ని చాలా రక్తి కట్టిస్తున్నాను అనుకుంటూ,  వాళ్ళ అమ్మ సుమ ముద్దు మాటలతో చేసిన వెర్రి చేష్టలూ. ఐదు నిమిషాలు చూడ్డమే కష్టమైంది.

  చివరిలో మా అబ్బాయికి 70 వేలు, మా వారు రాజీవ్ కి 60000, ఇంక ఈ ఎపిసోడ్ విన్నర్ అయిన మా అమ్మాయి మనస్వినికి లక్షా ఐదు వేలు అంటూ ఆవిడ ప్రకాటన చేసేసింది. ( కొద్దిగా అటూ ఇటూగా లెక్క వేసుకోండి). తన పారితోషికం ఎంతో చెప్పలేదు లెండి. ఇలా ఆడిచేందీ మేమే, గెలిచేదీ మేమే అని పారితోషికాలూ, ప్రైజ్ మనీలూ, గిఫ్ట్  హాంపర్ లూ పట్టుకుపోతున్నారన్నమాట ఒకరి చేతులొకరు పట్టుకుని చిరునవ్వులతో కెమెరాలకి పోజిచ్చేసి మరీ..

ఏళ్ళకి ఏళ్ళుగా వీళ్ళు చిన్న తెరలని ఏలుతున్నది చాలకనా ఇలాంటివి? ఇవన్నీ ఎవరికొచ్చిన ఐడియాలో మరి? యాంకర్ లు గా వారు చూపించిన/స్తున్న  ప్రతిభని తక్కువ చెయ్యలేం కానీ దేనికైనా ఒక పరిమితి ఉండాలి కదా? వారిమీద నాకేమీ కోపం లేదు.. కానీ ఎవరో సూచించినా కూడా ఒప్పుకునేముందు కొంత ఆలోచించాలి కదా.. పిల్లలకి అక్కరలేని ప్రచారమూ, ప్రైజ్ మనీలూ ఇవన్నీ అవసరమా?  సరదాగా చిన్న పిల్లల ప్రొగ్రాం ఎదైనా ఒకటి రూపొందించి సరదాగా వాల్లందరి తోనూ, ఆడీంచీ, పాడించీ ఇంటికి పంపవచ్చు కదా అనిపించింది. అంతగా చెయ్యాలి అనుకుంటే.

అసలే సినిమాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలూ, కోట్లు ఇచ్చి కొనుక్కున్న శాటిలైట్ హక్కులకి న్యాయం కలగడం కోసం పదే పదే    చూపించే అవే పది సినిమాలూ.. ఇవి   చాలనట్టు.. ఇలాంటి చెత్త కార్యక్రమాలు కూడానా?
ఇవి ఇలాగే  సాగితే ఇంక పెద్దగా తెలుగు చానెల్స్ పెట్టుకునె పని ఉండదని అనిపిస్తోంది.. అంతే కాదు.కొనసాగుతున్న నట వారసత్వం టైపులో యాంకర్ వారసత్వాలు, సుప్రీం యాంకరింగ్ ఫామిలీలు అవీ అవతరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 ఇరవై నాలుగు గంటలు కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని, లేకపొతే వానలు కురవవు, కురిసినా పంటలు పండవు అని ఎవ్వరూ శపించలేదు కదా!దేశాన్ని ఈ మాత్రం సురక్షితంగా ఉండాలంటే  మీరిలా నిరంతరం గా ప్రేక్షకులని హింస పెట్టవలసినదే అని ఎవరూబెదిరించలేదు కదా! మరి అలాంటప్పుడు ఎందుకీ కార్యక్రమాలు? ఎవరికోసం  ?

 నాణ్యమైన కార్యక్రమాలు నాలుగు గంటలు చూపించినా చాలు... మిగిలిన ఇరవై గంటలు ప్రజలు సుఖంగా, సంతోషంగా తమ పనులు తాము చేసుకుంటారు.హాయిగా, ఆనందంగా ఉంటారు.

 మీరు ఎన్ని అయినా చెప్పండి మన ఛిన్నప్పటి 'యే జో హై జిందగీ, ఆనందో బ్రహ్మా, చివరికీ రుకావట్  కే లియే ఖే ద్ హై సాక్షిగా పాలు చేలూ కార్యక్రమం .. నాటి రోజులే బావున్నాయి.      ఆమెన్.

Monday, July 9, 2012

ఈగ..ఈగ...ఈగ.. యముడి మెరుపు తీగ...

ఈగ..ఈగ...ఈగ.. యముడి మెరుపు తీగ...                         

నాకెందుకు ..నచ్చిందంటే 

        ఇది   తెలుగు చిత్ర పరిశ్రమని ఒక మలుపు తిప్పేసే కధ .. ఇన్ని రోజులూ నేను దీనికి మలుపులూ,  తలుపులూ, కిటికీలు.. చేరుస్తూ .మారుస్తూ ఉన్నాను.. ఇంత  ఆలస్యంగానైనా ఇది వెండి తెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది అని భీభత్సమైన డైలాగులు చెప్పలేదు కధా రచయత. 
   ఈ కధ వినగానే తనువంతా పులకరించి,  కనులు చెమరించి, ఎమోషన్ వర్షించింది. ఇన్ని రోజులు ఇలాంటి కధ చెప్పలేదేం?  అని దర్శకుడి మీద అలిగేసి, మీద పడి రక్కేసి   వెంటనే ఓకే చెప్పేసాను అని హీరో  ఓవర్ యాక్షన్ చెయ్యలేదు. ఇందులో నాది చాలా 'బబ్లీ అండ్ లవబల్ కారక్టర్' అని వచ్చీరాని ఇంగ్లీష్ లో పరమ రొటీన్ గా హీరోయినూ అనలేదు. ఇవి  నచ్చాయి నాకు.
 హీరోయిన్ ని ఇష్టపడే విలన్ హీరోని చంపేస్తే ఆ అబ్బాయి ఈగ గా మారి విలన్ మీద పగ తీర్చుకోవడమే కధ అని సింపుల్ గా ఒక లైన్ లో సినిమా మొదలుపెట్టినప్పుడే చెప్పేసాడు దర్శకుడు. ఈ సింప్లిసిటీ నచ్చింది... దాన్ని ఎలా తీస్తాడో అని దర్శకుడు  S.S.Rajamouli    వివిధ వర్గాల ప్రజలలో పెంచిన క్యూరిసియాటి నచ్చింది..
   ఇక అప్పటినించి ' ఈగ పగ తీర్చుకోవడమేమిటి??'  ఎలా ?తీర్చుకుంటుంది ? అనుకున్నవాళ్ళున్నారు , దానికన్నా ఇతనికేమైనా పిచ్చా ? వరసగా సినిమాలు హిట్ అవుతుంటే సంతోషంగా దాన్ని నిలబెట్టుకోక తీరి కూర్చుని చేతులు కాల్చు కుం టాడా ?అని పెదవి విరిచిన .వాళ్ళున్నారు.  రాజమౌళి ఏది చేసినా బాగా చేస్తాడు అని నమ్మకంగా ఉన్నవారూ ఉన్నారు.
   కధ  కన్నా ఎక్కువగా కధనాన్ని, ఎలాంటి కధ అయినా ప్రేక్షకులని తనతోటి తీసుకుని వెళ్ళగలిగితే అది ఎఫ్ఫెక్టివ్ గా కధ చెప్పడం అని నమ్మిన దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. అది ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ గా  కనిపించకుండా జాగ్రత్త పడటం నచ్చింది..
నయాపైసంత నటన రాకపోయినా, నట వారసత్వం పేరుతోనూ, గ్లామర్తోనూ తొడగొట్టడాలూ,  పడగొట్టడాలూ అన్న ప్రాస డైలాగులతోనూ  ఇరవైయ్యేసి, పాతికేసి సంవత్సరాలు పింక్ స్లిప్ ఎరగని గవర్నమెంట్ ఉద్యోగుల్లా పని  చేసుకోస్తున్న హీరోలూ, చిత్ర పరిశ్రమ అంటే తమ సొంత పరిశ్రమ అనుకుంటూ సొంత వ్యాపారం లో దిగినట్టు రోజుకోకరుగా దిగుతున్న నవ వారసుల మధ్య 'కొత్త గాలి'' లా కనపడే హీరో నచ్చాడు.  కనిపించిన ఇరవై నిమిషాలూ అతని సహజమైన నటనా, చక్కటి చిరునవ్వూ , బాడీ లాంగ్వేజ్ నచ్చాయి. మొదటగా అష్టాచెమ్మా లో చూసినప్పుడే ఈ అబ్బాయి లో మంచి ఈజ్ ఉంది.. సరియిన సినిమాలు దొరకితే మంచి నటుడవుతాడు అనిపించినది సరి అయిన అభిప్రాయమే అని మళ్ళీ  అనిపించడం నచ్చింది. ఇంటర్మీడియేట్ చదువుతున్న పక్కింటి చిన్న పిల్లలా తిరుగుతూ పాత్రకి తగ్గట్టుగా నీట్ గా, క్యూట్ గా  ఉన్న హీరోయిన్ నచ్చింది.

జంతువులూ పగ పడతాయా?  అంటే విఠలాచార్య సినిమాల లో కాకుండా నిజ జీవితం లో ? 
ఈగ కి అంత బలం ,తెలివి ఎలా వచ్చాయి?
 ఒక్క మాట మాట్లాడలేకపోయినా చెట్టంత మనిషిని ఎలా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలదు? 
 బొత్తిగా లాజిక్ ఉండద్దా? అన్న ..ప్రశ్నలకి... 

ఓ నా మనసా!! ఏమంటివి?  ఏమంటివి?? మామూలు మాస్ మసాలా సినిమాలలో, అదీ మన తెలుగు సినిమాలలో లాజికా?? ఎంత మాటా?? ఎంత మాటా?? 
లాజికా   సినిమా హిట్ అవుతుందా, లేదా? .అని  నిర్ణయించునది. కాదూ,  కాకూడదూ .. కాదందువా ??
వందలమందిని ఒంటి చేత్తో ఒక మానవుడు కొన్ని సార్లు ఒక చిన్నవాడు  కేవలం హీరో అన్న పేరున్నందున  మట్టి కరిపించుట లో ఉన్న లాజిక్ ఎంత??
కదిలే రైలుని ఆపేయడాలూ,  పదో,  పాతికో జీపులని మూడో కంటికి తెలియకుండా నేలలో పాతి విలన్ తో వాదన చేసే టైములో ఒక్క దెబ్బతో వాటిని ..తాడెత్తున లేపడాలూ.. వీటిలో ఉన్న లాజిక్ ఎంత?
ఈ క్షణం హైదరాబాద్ లో డైలాగ్ చెప్పి,  మరుక్షణం స్విట్జర్ లాండ్ లో పాట  పాడేసే  సందర్భం లో ఉన్న లాజిక్ ఎంత??
పంచ్ డైలాగు ల పేరిట 'వంశాలనీ', ఆ 'వంశాకురాలనీ' కేవలం సినిమా నటులుగా మాత్రమే కాకుండా తెరవేల్పులుగా,  ఇలవేల్పులుగా జనం భావించడం లో ఉన్న లాజిక్ ఎంత??
ఇలా చెప్పుకుంటూ ..పొతే తెలుగు సినిమా ఏనాడో లాజిక్ రహితం అయినది,  కాగా నేడు లాజిక్,  లాజిక్ అన్న వ్యర్ధవాదమెందుకు? 
 అని అన్నగారి స్టైల్ లో నాకు నేనే సమాధానం ..చెప్పుకున్నాను చూసారూ!  అది.. అబ్బో!  నాకు చాలా నచ్చింది.. ఇలాంటి సినిమాలో ,లాజిక్  లేకపోయినా కొన్నిచోట్ల కొద్దిగా ఆ లేకపోవడం మరీ  ఎక్కువ అయిందేమో అనిపించినా పెద్ద నష్టమేమీ లేదు.. మన ఎంటర్తైన్మెంట్ కి లోటేమీ ఉండదు.
   'వంద మాటలకన్న పది చేతలు మిన్న' అని నమ్మిన మన సెకండ్ హాఫ్ హీరో అదేనండీ మన ఈగ మాట్లాడలేకుండానే  తెలివిగా విలన్ ని ఇబ్బంది పెట్టడం నచ్చింది.  సిని మాటోగ్రఫీలూ,  స్క్రీన్ ప్లే లు లాంటి పెద్ద మాటలు నాకు  తెలియవు కానీ, ఈగ పగని తమ పగగా పిల్లలూ,పెద్దలూ భావించి అది వేసిన ప్లాన్ లకి పగలబడి నవ్వడమూ, మనుషులని ఎడంచేత్తో చంపేస్తున్నాడు కదా ఇంత  చిన్న ఈగ కి భయ పడతాడేం ? ఇంత  అమాయకుడా ? అని విలన్ మీద  జాలి పడటం, 'ఈగను చంపేంత సీను నీకు లేదమ్మా'  అంటూ ఈగ గెలిచిన  ప్రతీ సీనులోనూ కేరింతలు .కొట్టడం నచ్చింది. 
        ప్రతీ సీన్ మూడ్ కి తగ్గట్టు, అది ఎలివేట్ అయ్యేట్టు సమకూర్చిన సంగీతం  చాలా నచ్చింది.. కీరవాణి సింప్లీ సూపర్బ్. 'చంపేస్తా...లాంటి మ్యూజిక్ బాక్ గ్రౌండ్ లో వస్తూ ఉంటే  ఎందుకో  మాయాబజార్  లోని   'కోర్ కోర్ శరణు   కోర్' గుర్తొచ్చింది.  మేజిక్ చేసిన   చాలా మంచి బాక్ గ్రౌండ్  మ్యూ జిక్.
     తనకన్నా బలవంతుడు, తెలివైన వాడు హీరోగా (కనీసం తెర మీద) ఉంటే అతనికి సమ ఉజ్జీగా రాణించే విలన్ గా నటించడం వేరు. తన చిటికెన వేలి గో రంత ఉన్న చిన్న కీటకం తన  చుట్టూ తిరుగుతూ,ముప్పు తిప్పలు పెడుతూ పిచ్చేక్కిస్తున్నట్టుగా ఉండే సన్నివేశాలకు తగ్గట్టుగా,  లేని ప్రత్యర్ధిని ఊహించుకుంటూ నటించడం చాలా కష్టం . ఇంచుమించు ఏక పాత్రాభినయం లాంటిది. అలాంటి పాత్రలో నూటికి రెండు వందల పాళ్ళు జీవించిన సుదీప్ నటన చాలా, చాలా నచ్చింది.. చక్కని రూపం, గంభీరమైన వాచకం ( కొద్దిగా కన్నడ యాస ఉండవచ్చు  గాక), పవర్ఫుల్ స్క్రీన్ ప్రేసేన్స్ ,  అన్నింటినీ మించి  నటన  వెరసి ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేసిన సుదీప్ అభినయం అబ్బో!  చెప్పలేనంతగా  నచ్చింది.. ఆయన నటన వల్లనేమో కొన్ని సార్లు విలన్ పాత్ర ఈగ వల్ల ఇబ్బంది పడుతుంటే పాపం అనికూడా అనిపించింది. సినిమాకి ఇతనో హీరో.. రెండో సగం కొద్దిగా  సాగినట్టు అనిపించినా అది సుదీప్ నటన వల్లనే పరవాలేదులే, మరీ అంత సాగతీత .కాదులే అనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా  ఉన్నాడు కూడా.
     మనకు తెలియనికధా  కాదు, ఊహాతీతమైన ముగింపూ కాదు... ఉన్నదల్లా మామూలుగా సాగే మన ఊహల కందకుండా  ఈగ ప్లాన్ లు వెయ్యడమూ,   హీరోయిన్ సాయంతో వాటిని అమలుపరచడమూ చివరకు అనుకున్నది సాధించడమూ నచ్చింది...మొత్తమ్మీద సినిమా బావుంది. చివరలో  ఈగ చేత చిరంజీవి వీణ స్టెప్సూ, రవితేజ జింతాత దరువులూ, జూ. ఎన్.టీ.యార్ డాన్సులూ కూడా  వేయిస్తుంటే, వాటిని చూసి  విరగబడి నవ్వుతున్న పిల్లలని, వాళ్ళని చూసి ఆనందపడుతున్న పెద్దవాళ్ళనీ చూస్తే.. ఫామిలీ అందరికీ నచ్చిన సినిమా అనిపించడం నచ్చింది. 

 ఈ సినిమా Super Success కి మూడు S లు  కారణం అనుకుంటాను నేను.. తెలుగు తెరమీదే  ఇంటర్నేషనల్ స్థాయి Special effects, తన పాత్రకీ , కధనానికీ ప్రాణం పోసిన విలన్- హీరో Sudeep, తను నమ్మిన దానిని చిత్తశుద్ధి తో, తన అనుచరగణంతో ( Team) తో కలిసి అనితరసాధ్యంగా ఆచరించి చూపించే S.S. Rajamouli. అందుకే ఆయన పేరులోని S.S. కి Supremely Successful అని భాష్యం ..చెప్పుకోవచ్చేమో ..

PS: కొత్త తెలుగు సినిమాలు వచ్చిన  వెంటనే  సినిమా హాల్ కి వెళ్లి చూసే అలవాటు లేనే లేదు, ఇంకా రివ్యూలు . కూడానా? మన బ్లాగ్ మిత్రులు  నీలం రాజ్ కుమార్ లాంటి వారు చక్క గా   రాస్తే,  నవ్వు కుంటూ చదివేసి, ఆ తర్వాతెప్పుడో వీలున్నప్పుడు టీవీ లో చూడడమే. సినిమా  బావుంది కదా అని సరదాగా రాసినది ఈ టపా. ఎవరినీ కించపరచాలని కానీ,తక్కువ చెయ్యాలని కానీ కాదు. సినిమా  గురించీ,  నా ఈ  టపా గురించీ మీ  ఆభిప్రాయాలని తప్పక తెలియచేస్తారు కదూ.. .
     

 

Wednesday, July 4, 2012

ఉచిత భోజనాలు (Free Lunches) ఉన్నాయంటారా ??


         మొన్నామధ్యన మా అపార్ట్మెంట్ లో ముగ్గుల పోటీ జరిగింది.. ఇది ప్రతీ సంవత్సరమూ చాలా పక్కాగా, కోలాహలంగా జరుగుతుంది.. దాంట్లో మా పక్కింటి ఆవిడకి చుక్కల కేటగిరీలో మొదటి బహుమతి వచ్చింది.  సాధారణంగా పోటీలో  ముగ్గులు వెయ్యడం మధ్యాహ్నం మూడు  గంటలనించీ, ఆరుగంటలవరకూ జరుగుతుంది దాని తర్వాత జడ్జీలు వచ్చి కమ్యూనిటీ హాల్ తలుపులు వేసేసుకుని,  విపరీతంగా గుసగుసలాడేసుకుని ( గోడలకి చెవులుంటాయి  కదా! మరి) విజేతలని నిర్ణయించేస్తారు.. తర్వాత టెర్రస్ మీద బహుమతి ప్రదానం.. జనాలకి బోర్ కొట్టకుండా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ,ఉంటాయి కూడా.. సాధారణంగా ఇవి మా ఫ్లాట్స్ లో ఫ్రెండ్స్ పెడుతూ ఉంటారు,, ఈ మధ్యన కొద్దిగా మారింది లెండి ఈ వ్యవహారం.. ఇంచుమించుగా ఇలాగే గత మూడు నాలుగేళ్ళుగా జరుగుతోంది.
 'మొదటి బహుమతి' అని అనౌన్స్ చేసి ఆవిడ చేతిలో  ఒక చిన్న కవర్ పెట్టారు.
     విప్పి చూస్తే అదొక కూపన్.. ఆ నెలాఖరు లోగా మాకు రెండు సందుల అవతల ఉన్న షాప్ లో పదిహేను వందలు పెట్టి సిల్క్ చీర కొనుక్కుంటే అక్షరాలా 250 రూపాయలు డిస్కౌంట్. అదీ ఆ కూపన్ సారాంశం
రెండో బహుమతి వారికి 150 రూపాయల డిస్కౌంట్. ..
 ప్రైజ్ వచ్చినవాళ్ళకి వాళ్ళు మండింది..
'సవ్యం గా ఇచ్చే ఉద్దేశ్యం ఉంటె చిన్నదో,  పెద్దదో ఏదో ఒకటి ,ఇవ్వాలి లేదా కనీసం ఈ కూపన్ కి సరిపడేదైనా కొనుక్కునే అవకాశం  ఉండేట్టుగా ఇవ్వాలి అంతే  కానీతప్పకుండా ఫలానా టైములోపల, ఖచ్చితంగా ఇంత  డబ్బుకి సరిపడా కొనుక్కోవాలి అని ఈ బలవంతం ఏమిటి' అని.. 
 ఫస్ట్ ప్రైజ్ వచ్చినావిడ "నాకిప్పుడు చీరలూ అవి కొనుక్కునే ఉద్దేశ్యం లేదు...అనవసరం గా నాదగ్గర ఉంచుకోవడం ఎందుకు??ఇంకెవరైనా వాడుకోవచ్చు కదా!"  అని రెండు రోజులు పోయాకా  మృదువుగా తిరిగి .ఇచ్చేసింది. 
   ఆవిడ అలా తిరిగి ఇచ్చేయ్యడం ఈ ఆలోచన అమలుపరిచిన ఆవిడకి  అస్సలు నచ్చలేదు." ఇప్పుడు కొనుక్కుని తర్వాత ఎప్పుడైనా కట్టుకోకూడదా?  బీరువాలో ఒక మూల పడేస్తే ఆ చీర అన్నం అడుగుతుందా? నీళ్ళు అడుగుతుందా ??  ... ఊరికే వస్తుందా అంత .మంచి ఆఫర్.. ఎంత కష్ట పడి సంపాదించానో ! "అని కనిపించిన వాళ్ళందరి దగ్గరా చెప్పి  చాలా .బాధపడింది 
       కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆవిడకి కొంత బిజినెస్ పరిజ్ఞానం  ఎక్కువ , తనకి వీలుగా ఉండేటట్టుగా పనులు చేసుకోగలగడమూ  .. ఇలాంటి ఆఫర్ల మీదా,  ఫ్రీగా ??) వచ్చే వాటి మీదా మోజూ ఎక్కువే. 
 "కమిటీ వారికి డబ్బులుమిగులుస్తాను ఎందుకు అనవసరంగా ప్రై జూలూ  అవీ  కొనడం? " అని తెలివిగా చుట్టుపక్క ఉన్న షాపులూ, బ్యూటీ పార్లర్లూ వగైరాల దగ్గరకు వెళ్లి  .సంపాదించింది ఇలాంటి కూపన్లు. ఇలాంటి వింత బహుమతులు ఇవ్వచ్చు అని మాకు ఆవిడ ద్వారానే .తెలిసింది .
 అంతేకాదు... దగ్గరలో ఉన్న రెస్టారెంట్ల కి వెళ్లి మా అపార్ట్మెంట్ లో జరిగే పార్టీలకి కేటరింగ్ వాళ్లకి ఇప్పిస్తానని, వాళ్ళ దగ్గర తనకీ తన కుటుంబానికీ ఫ్రీ గా డిన్నర్ ఆఫర్ లూ అవీ కూడా తెచ్చుకునేది అని వినికిడి..ఆవిడకీ,  కుటుంబానికీ తక్కువ పడకూడదనేనేమో ఆ ఏడాదిఅన్ని  ఫంక్షన్ల లోనూ భోజనం ఎప్పుడూ తక్కువ పడడమే...చిన్నవో, పెద్దవో గొడవలు జరగడమే.. 
      అన్నింటికంటే విచిత్రమేమిటంటే  చిన్న పిల్లలకి పరుగు పందేలూ, చెంచాలూ- నిమ్మకాయలూ లాంటి పోటీలు పెట్టి దీపావళి ఫంక్షన్ లొనో, న్యూ ఇయర్ కో వాళ్ళ చెతిలొ ఇంటి పక్క బ్యూటీ పార్లర్ వాళ్ళ వాక్సింగ్,ఫేషియల్ లాంటి ( పైన చెప్పిన లాంటివే)) కూపన్లు .పెట్టేది 
వాళ్ళు "ఇదేంటి ఆంటీ ?"అంటే?? .
"అమ్మకిచ్చేయి.. షి విల్ బీ  హేపీ, వెయ్యి రూపాయల సర్వీస్ 800 కే వస్తే సంతోషం కాదూ మీ అమ్మకి"  అనేది పైగా. పోటీ పిల్లలకి పెట్టాము కదా,, కనీసం ఓ పెన్నో,చాక్లేటో ఇవ్వచ్చు కదా, ఏమిటో చెప్తే వినేవాళ్ళకి చెప్పవచ్చు,, తెలీని వాళ్ళకీ చెప్పవచ్చు... అన్నీ తెలుసు అని ఎవ్వరి మాటా వినని వాళ్ళకేం  చెప్తాం?? .. 
ఇలాంటి చిత్రమైన పనులవల్ల అందరూ అబ్బా!! ఈవిడ పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందిరా  బాబూ ! అని ఎదురు .చూసారు..అదొక ప్రహసనం.. 
         మొన్న సమ్మర్ హాలిడేస్ లో మా కజిన్ వచ్చింది మా ఇంటికి.  ఎన్నో ఏళ్ల  తరవాత కలిసాము ఇంత తీరికగా .. అందుకని ఒకటే  కబుర్లు.. హైదరాబాద్ నించి నాకొక సల్వార్ మెటీరియల్ తెచ్చింది, చాలా బావుంది అది..నిన్ననే చెప్పింది  అది కొన్నప్పుడు లక్కీ డిప్ కూపన్లు  ఇచ్చారనీ, వాటిల్లో ఒక దానికి ప్రైజ్ .వచ్చిందనీ. చాలా సంతోషంగా ఉంది దానికి.. 'నువ్వు చాలా లక్కీయే బాబూ... నీకోసం కొంటేనే  నాకిది వచ్చింది, లేకపోతె ఇన్నేళ్ల  నించీ  కొంటున్నాను ఎప్పుడైనా .వచ్చిందా?' అందికూడానూ. 'నిజమే' అనుకున్నాను .నేనూనూ 
 ''అయితే ఆ బహుమతి ఏమిటో తెలుసా?? నెలకి 500 చొప్పున వాళ్ళు మనకి కూపన్ .ఇస్తారు.. దానికి కనీసం డబల్ వేసుకుని ప్రతీనెలా ఫలానా తారీకు దాటకుండా మనం వెళ్లి బట్టలు .కొనుక్కోవాలి. ఏ  నెల కొనకపోయినా అంతే  .సంగతులు, అప్పటినించీ మిగతావి ఇవ్వరో, ఏదో లాంటి లక్ష కండీషన్ లు..  
  ఈ వివరాలు తెలిసాకా, నాకు ఏమనాలో తెలియలేదు..ఇది నిజంగా లక్కీయేనా?? మనకి అవసరం లేకపోయినా ప్రతీ నెలావెళ్ళాలి, చచ్చినట్టు ఏదో ఒకటి కొనాలి ఆ ప్రయత్నంలో మన చేతులూ, కళ్ళూ ఊరుకోక ( ఊరుకోవు, మనకీ, ఆ షాపు వాళ్ళకీ కూడా బాగా తెలుసు ఆ సంగతి ) మరిన్ని వాటి మీద మనసు పారేసుకుంటే, వాటి భారం కూడా మన పర్సులే మొయ్యాలి మరి..
' పోనీ ఆ ఇచ్చేదేదో ఒక్కసారి ఇస్తారా,  అంటే అదీ .లేదు. 'చక్కగా ఓ మంచి పట్టుచీర కొనుక్కోవే అని మా అమ్మ సలహా చెప్తే అప్పుడు బయట పడ్డాయి ఈ ఫైన్ ప్రింట్  డీటెయిల్స్.
.' ఇండియన్ ఐడోల్' విజేత శ్రీ రామచంద్ర మొన్నేదో షో  లో చెప్పాడు.. అతని ప్రైజ్ మనీ యాభై లక్షలూ కూడా ఒక్కసారి ఇవ్వరుట.  మూడునెలలకోకసారి ఐదు లక్షల చొప్పున ఇస్తారుట,ఇంకా ఇస్తూనే ఉన్నారుట అది.
 నెలల పాటు సాధన చేసి, కష్టపడి, పాడి గెలుచుకున్నదే అలా వస్తూ ఉంటే మరి అప్పనంగా,  అదృష్టం పేరుతొ వచ్చినవి ఇలా కాక ఎలా వస్తాయి మరి? అనుకోవాలేమో ..
      ఇలాంటిదే ఇంకొకసారి బిగ్ బజార్ లో జరిగింది, వాళ్ళు మా ఈ షాపు  ఆసియాలోనే పెద్దది, ఇంకా మాట్లాడితే ఆసియాకంటే పెద్దది అని టముకేసేస్తు  ఉంటే  ఎంత పెద్దదో, ఏవిటో చూద్దామని మా ఇంటి దగ్గర ఉన్న బిగ్ బజార్ కి  వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ  వెళ్ళలేదు లెండి...
 ఎనిమిది వందల రూపాయల దుప్పటీ మూడు వందల యాభైకే అని చూసి కొనుక్కొచ్చి, విప్పి చూస్తే ఆ కొత్త దుప్పటి  మధ్యలో మూడు రూపాయ కాసులంత ( అదే... మూడు రూపాయ బిళ్ళలు ఒక దాని పక్కన ఒకటి పెడితే ఎంతో అంతన్నమాట... మూడు రూపాయల నాణేలు లేవు, మీరే కరక్ట్) చిరుగు చూసినప్పటి నించీ నాకు ఆ షాప్ అంటే కోపం. వాళ్ళు ఏమి చెప్పినా .నేను నమ్మను .
సరే.. ఇలాంటివే ఓ పది వస్తువులు కొన్నారు కదా, మీ షాపింగ్ భక్తి  కి మెచ్చి 'తొందరగా బిల్లింగ్ చెయ్యడమన్న ఒక్క వరం తప్ప మరేదైనా ఇచ్చేస్తాము' అన్నంత బిల్డ్ అప్ ఇచ్చి,   అటూ ఇటూ చూసి ఓ 250 రూపాయల కూపన్ నా చేతిలో పెట్టాడు షాపతను.
'సిరిరామోకాలోడ్డడం' మంచిది  కాదని తీసుకుని వాడుకుందాం కదా! అనుకున్నామా?  చావు కబురు చల్లగా అప్పుడు చెప్పాడు ఇది .ఇప్పుడు వాడుకోలేరు, మళ్ళీ సారి వచ్చినప్పుడు మీరు కనీసం 2500 రూపాయల విలువైన ఫర్నిచర్ కానీ ఎల క్త్రానిక్ వస్తువులు కానీ కొంటే అందులోంచి 250 రూపాయలు తగ్గిస్తాము అని.. 
     అప్పటికే ,అక్కడున్న జనాలనీ, బహు మందగమనంతో కదులుతూ గంట సేపైనా పూర్తి  అవ్వని బిల్లింగ్ కార్యక్రమాన్నీ   చూసి విరక్తి చెందిన నేను,' ఇంతోటి దానికి మళ్ళీ రావడం కూడానా?? అని వద్దులే  బాబూ! అంత భాగ్యానికి నేను అనర్హురాలిని 'అని చెప్పేసి  అది తిరిగి అతని చేతిలోనే పెట్టేసి .వచ్చాను ఎందుకంటే అంతకు ముందు ఇలాంటిదే ఏదో కూపన్ వస్తే ఆ షాప్ లో ఆ ధరకి .ఏమీ దొరకలేదు..దానికి సరిగ్గా డబల్ పెట్టి కొంటేనే కానీ ఒక టాప్ కూడా  రాలేదు  ఇంకా రెండువేలకి ఎలక్ట్రానిక్స్,, ఫర్నిచర్ కూడానా?  ఒకసారి కాలితేనే కదా నిప్పు ముట్టుకుంటే తప్పు అని తెలిసేది .అదన్నమాట .సంగతి.
         వ్యాపారం చాలా .తెలివైన వ్యవహారం. కొనడానికి వచ్చేవాళ్ళని 'కస్టమర్ ఈస్ కింగ్'' అని ఉబ్బేసి, మభ్యపెట్టి అరచేతిలో స్వర్గం చూపెట్టేయడమే ముఖ్య ఉద్దేశ్యం.. ఎవరో తెలివైన వ్యక్తీ చెప్పనే చెప్పాడు ఎప్పుడో..There are no free lunches in this world  అని..
 మొదట్లో పండగలకి ప్రత్యేకంగా సేల్ ,అన్నా 
తర్వాత మెల్లగా end of season, beginning of season, middle of season సేల్స్ అన్నా, 
ఇంకొంచెం ముందుకెళ్ళి ఫరెవర్ సేల్, most happening sale వగైరా, వగైరా పేర్లు పెట్టినా, 
దాని వెనక ఉన్న ఉద్దేశ్యం మాత్రం పైన చెప్పిన రాజు గారిని రంజింప చేయడమే.. 'చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు'' .కరక్టే..మొదట రంజింపచేసి పిదప మూర్ఖులని చెయ్యవచ్చు అన్న .సూత్రమే. 
మిల మిల లాడే లాంటి మెరుపుల లైట్లూ, ధగధగలాడేలా ట్యూబ్ లైట్లూ, కాసులతో గాలిని కండీషన్ లో పెట్టిన మిషన్లూ, చిరునవ్వులతో కేవలం మనకోసమే పనిలో చేరినట్టు నమ్మించే పడతులూ,  పడుచువాళ్ళూ, కింగులా  కనిపిస్తూ వంగి వంగి సలాములుపెట్టే కాపలా వాళ్ళూ ..  వీళ్ళందరూ ఈ చదరంగంలో పావులు, పాత్రధారులు మాత్రమే .
 అసలు చెక్ మేట్  చెప్పేది మాత్రం .కస్టమర్ కే.. ఎందుకంటే   కస్టమర్ ఈజ్ కింగ్... హ హ హా..
మీరేమంటారు?????

Thursday, June 14, 2012

షాంగై.. కదిలే తెర మీద కళ్ళెదుటి వాస్తవం..

 
ఈ మధ్యన వస్తున్న కొన్ని హిందీ సినిమాలు చూస్తుంటే ఇలాంటివి మన భాషలో ఎప్పుడు వస్తాయో కదా! అనిపిస్తోంది. 'ఖొస్లా కా గోస్లా' అనే ఒక చిన్న చిత్రాన్ని ఫ్లైట్ లో చూసాను మొదటిసారి, పేరు చూసి కామెడీ అనుకున్నాను మొదట్లో, కానీ మొదలయిన పదినిమిషాలలోనే కధలోకి మనల్ని తీసుకుపోయి, చాలా విరివిగా,  దేశంలో దాదాపూ అన్నిచోట్లా ఇంచుమించుగా ఒకే రీతిలో జరుగుతున్న అక్రమ భూ ఆక్రమణలు అన్న రియలిస్టిక్ అంశాన్ని తీసుకుని, దానికి కొద్దిగా నాటకీయత జోడించి కధను నడిపించి, కధానాయకుడి సమస్య తీర్చడమూ, ఆ పరిణామంలో మారిన పాత్రలూ, వారి మధ్యన అనుబంధాలూ.. చూపించిన తీరు నాకు చాలా నచ్చాయి. చాలా బావుందీ సినిమా. 
      దాదాపు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ దర్శకుడి ఇంటర్వ్యూ పేపర్ లో చదివాను. ఖోస్లా తర్వాత ఆయన మరో రెండు సినిమాలు తీసారు కానీ నేను వాటిని చూడలేదు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన కొత్త సినిమాగురించి చెప్పిన తీరు నాకు చాలా నచ్చింది.. ఆ కొత్త సినిమా నిన్న రాత్రి చూసాము, దాని పేరే షాంగై, ఆ దర్శకుడి పేరు దిబాకర్ చటర్జీ.. తప్పకుండా చూడాల్సిన సినిమా.
            కధ మనకి తెలియనిది కాదు.. ఎక్కడో మరో లోకంలో జరుగుతున్నది కాదు.. సెజ్ లనీ, హొటళ్ళనీ, మన దేశంలోనో, మరీ మాట్లాడితే మన ఖండంలోనే పెద్ద మాల్స్ అని.. టెక్ పార్క్లనీ, బిజినెస్స్ పార్క్లనీ.. పేరేదైతేనేం.. వీలున్నంత భూమిని ఆక్రమించుకుని, అందులో నివసించేవారిని మరింత దూరానికి తరిమేసి, ఆపైన వారికే ఉద్యోగోపాధి కల్పిస్తున్నమని ప్రకటింస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలు చూపించడం అనేది ఒక మాదిరి పెద్ద పట్నాలు/నగరాలలో నిత్యం జరుగుతున్నదే..   మనం అనేక సార్లు చదివినదే.. వినందే.. అందుకే అన్నాను కళ్ళముందరి వాస్తవం, కదిలే తెరమీద కనిపించిందీ అని.'వాసిలిస్ వాసిలికొవ్' రాసిన' జెడ్ 'అనే నవల కి ఆధారం ఈ సినిమా.
       భారత్ పూర్ అనే ఒక గ్రామంలో పాలక సంకీర్ణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ బిజినెస్ పార్క్  ( ఐ.బీ. పీ) ని నిర్మించేద్దామని నిర్ణయించి, దానిని ఆ ఊరు సాధిస్తున్న ప్రగతిగానూ, పురోగమనం గానూ చిత్రీకరిస్తూ ఉంటారు ముఖ్యమంత్రీ, సంకీర్ణ  ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీ నేతా. ఆ పార్క్ అక్కడ వెలిస్తే దానివల్ల ప్రజలకి జరిగే అన్యాయాన్నీ, వారు కోల్పేయే బ్రతుకునీ ( కేవలం భూమినే కాదు) గమనించాలనీ, స్థలం కోరితే సంతకం పెట్టవద్దనీ బోధిస్తూ, ఇలాంటి అన్యాయాలమీద పుస్తకాలు రాసే ఒక ప్రొఫెసర్ భారత్ నగర్లో ప్రసంగించడానికి వస్తాడు. ఆ సభ ముగించుకుని బయటకు వస్తూ ఉంటే ప్రజలూ, పోలీసులు చూస్తూ ఉండగానే వేగంగా వస్తున్న ఒక వేన్ గుద్ది చనిపోతాడు.  పోలీసులు వాన్ డ్రైవర్ తాగి ఉన్నాడని అతన్ని అరెస్ట్ చేసి కేసు మూసేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు.
 అది కేవలం ఆక్సిడెంట్  కాదనీ, కావాలని ఒక పధకం ప్రకారం జరిగిన హత్య అనీ  ,  అతని ప్రాణానికి ప్రమాదం ఉన్న సంగతి తను ముందే అందరికీ చెప్పాననీ, అసలేం జరిందో కనిపెట్టాలని పోరాడే ఆ ప్రొఫెసర్ స్టూడెంటూ, చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ పొట్టపోసుకునే ఒక వీడియోగ్రాఫర్ కి దొరికిన కొన్ని కీలక సాక్షాలూ, ప్రొఫెసర్ స్టూడెంటూ, అతని భార్యా చేసిన ఆందోళన ఫలితంగా వేసిన ఎంక్వైరీ కమీషన్ హెడ్ అయిన ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్  మొదట విడి విడిగానూ, తర్వాత కలిసీ ఈ మిస్టరీని ఎలా సాధించారో, ఇందులో ఎవరెవరు ఉన్నారో, తర్వాత ఎమైయిందో అన్న విషయాలను అత్యంత ఆసక్తికరంగానూ, ఆలోచింపచేసేవిధంగానూ చిత్రీకరించిన గొప్ప సినిమా షాంగై.
    దేశంలోని ప్రతీ పట్టణాన్నీ మాకు వీలుంటే షాంగై అంత గొప్పగా తయారుచేసేస్తాం అన్న మన నేతల వట్టి ఊకదంపుడు వాగ్దానాలకి మెటఫర్ గా మాత్రమే సినిమా టైటిల్ పెట్టబడింది తప్ప షాంగై నగరానికీ, కధకీ ఎమీ సంబంధం లేదు.. సినిమాలో ఉన్న ఒక విశేషమేమిటంటే అన్నీ అరటిపండు వలిచి పెట్టినట్టు చేతిలో పెట్టదు. మనల్ని కధలో లీనం చేస్తూనే, కొన్నిసార్లు సన్నివేశాలమధ్య ఉన్న లింకులనీ, పాత్రల లోని భావోద్వేగాలనీ సరిగ్గా గమనించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.  ఇది మర్డర్ మిస్టరీ కాదు కనక, ప్రొఫెసర్ ని  హత్య చేసిందెవరూ ? అనేది పెద్ద సస్పెన్స్ కాకపోవచ్చు, అలానే క్లైమాక్స్ కూడా మనం ఊహించిన దానికి భిన్నంగా ఉండదు కానీ ఈ కధాగమనంలో పాత్రలు నడుచుకునే తీరు, సాటి పాత్రలని నడిపించే తీరూ చాలా ఆకట్టుకుంటుంది.
    కధా, కధనాలమీద చాలా పట్టుతో దర్శకుడు కధ నడిపించిన తీరు చాలా బావుంది . చిన్న చిన్న తప్పులుంటే ఉండవచ్చు కానీ ఓవరాల్ గా సినిమా అంతా  చాలా గ్రిప్పింగ్ గా  బావుంది. ఇక పాత్రధారులంతా కూడా  తాముకనబడకుండా కేవలం  పాత్రలు మాత్రమే మనల్ని పలకరించేలా సమర్ధవంతంగా నటించారు. 


   చాలా చిన్న  పాత్రలో, ముఖ్యమంత్రిగా సుప్రియా పాథక్ అలరిస్తే, అసలైన బ్యూరోక్రాట్ ఎలా ఉంటాడో కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ మరొక చిన్న పాత్రలో గొప్పగా రాణించారు ఫారూక్ షేక్. వీరిద్దరిని చాలా రోజుల తర్వాత తెరమీద చూడడం బావుంది.  ఎవరి ప్రగతి?  ఎవరికోసం ? అన్న నినాదంతో ప్రజలని చైతన్యవంతులని చెయ్యాలని ప్రయత్నించే పాత్రలో ప్రొసేన్ జిత్ చటర్జీ బాగా నటించారు, జాతీయ అవార్డ్ విజేత  అయిన అతని నటప్రతిభకి,  ఈ పాత్రకి మరికొంత నిడివి ఉంటే బావుండేదేమో. ఆయన శిష్యురాలిగా కల్కి కోక్లీన్  చాలా బాలన్సెడ్ గా పాత్రకి తగ్గట్టు చక్కటి నటన కనపర్చింది.   హత్య చేసిన లారీ డ్రైవర్, అతని జతకాడు, ప్రొఫెసర్ భార్య, పోలీస్ ఆఫీసర్స్ అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా బిలీవబుల్ గా కనిపిస్తారు తెరమీద.
  
   వీరందరూ ఒకెత్తైతే మరో ఇద్దరు నటులు మరొక ఎత్తు.. ఈ సినిమా కేవలం వీరిద్దరిదే అని చెప్పడంలో అస్సలు తప్పు లేదు... సీరియల్ కిస్సర్ గానూ, భట్ కాంప్ యొక్క బ్రాండెడ్ కమ్మడిటీగానూ పేరు పడ్డ ఇమ్రాన్ హషిమీకి విలక్షణ   నటుడిగా ఒక ప్రత్యేక ఆవిష్కరణ కల్పించిన చిత్రం. అతని ఆహార్యం, ప్రవర్తన, వీధుల్లో చేసిన డాన్స్ లూ, సరి అయిన మోతాదులో పలికించిన భావాలు 'ఇతనిలో ఇంత మంచి నటుడున్నాడా?  అనిపిస్తాయి.. నటుడు నీరు వంటి వాడు, ఏ పాత్రలో పోస్తే బావుంటుంది అన్నది దర్శకుడు నిర్ణయిస్తే రాణించి ప్రకాశిస్తాడు అన్నదానికి ఇది మంచి ఉదాహరణ. A complete revelation..
    తమిళుడైన ఒక ఐ.ఏ. ఎస్ ఆఫీసర్ గా నటించిన అభయ్ డియోల్ (దేవల్) .. ఉద్యోగధర్మంగా సరి అయిన పని చెయ్యాలా? తన స్వార్ధంకోసం సరి అయినది చెయ్యాలా అన్ని చిన్న మీమాంసతోనూ, శృతి మించని తమిళ యాసతోనూ ( హిందీ సినిమాల్లో ఈ యాసని ఎంత అతిగా చూపిస్తారో మనకు తెలుసు) చాలా సెన్సిటివ్ గానూ, సటిల్ గానూ తన పాత్రని పోషించిన తీరు నిజంగా సుపర్బ్. చాలా మెత్తటివాడిగానూ, ప్రభుత్వానికీ,  అధికారులకీ వినయుడిగానూ ఉండే అతను ఎంక్వైరీ జరిపేటప్పుడు అధికారాన్ని సద్వినియోగం చేస్తూ తీసుకున్న నిర్ణయాలూ, తన పై అధికారిని పార్టీలో అదే హావభావలతో హెచ్చరించి. తర్వాత ఎం చెయ్యాలో సూచించినప్పుడూ, ఇంకా అనేక సన్నివేశాలలో అద్భుతమైన నటన కనబరిచాడు అభయ్. చాలా,  చాలా బావుంది అతని అభినయం.  మొదటినించీ కూడా ఇతను ఎంచుకునే సినిమాలూ, పాత్రలూ విభిన్నమైనవే కావడం, వాటన్నింటిలోనూ కూడ అతను తన ప్రతిభతోనూ రాణించడం అభయ్ నటనకి కొలబద్దలంటే అతిశయోక్తి కాదు.
      క్లైమాక్స్ కొంత నిరాశ పరిచింది. కానీ 'అవినీతి కొంతమంది వ్యక్తులలో మాత్రమే కాదు, ఎంతో మందితో, మరెంతో మంది కోసం   నడపబడుతున్న వ్యవస్థలో ఎంత ముఖ్య భాగమైపోయిందో! అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది.. హార్డ్ హిట్టింగ్ రియాలిటీ..
      ఒక మంచి సినిమా చూసి ఇంటికి వస్తున్నాం అన్న తృప్తితో ఇంటికి వస్తూ ఉంటే నాకో అనుమానం వచ్చింది.. ఇలాంటి సినిమాలు చిన్న ఊర్లలోనూ, సింగిల్ సినిమా హాళ్ళల్లోనూ ఎంతమంది చూస్తారు? మల్టిప్లెక్స్ సినిమాలుగా పేరు పొందిన ఇలాంటి సినిమాలు చూసే మల్టిప్లెక్స్ లు, వాటిని తమలో దాచుకుని పెంచి పోషించే మాల్సూ కూడా ఇలాగే కట్టి ఉంటారా? అని..
 అప్పటినించీ ఎదో తెలియని డిస్కంఫర్ట్. ఎటువైపు  మన దేశ ప్రగతి ప్రయాణం??
   

Tuesday, May 29, 2012

మరిచిపోయిన పక్కింటివారి ముఖచిత్రమా?





2012 మరియు ఆ పైన...
'నేను ఈ రోజు 'దూకుడు' సినిమా చూస్తున్నాను...' ( చూడు.. ఐతే దానికి అనౌన్స్ మెంట్ ఎందుకు? ..)
'నాకు ఈ మధ్యన ఎంతో బోర్ గా ఉంటోంది.... ఎందుకో తెలీదు,, ఈ రోజు మరీనూ...'  ( అలాగా పాపం)
'హుర్రే!..నాకు ఆన్ సైట్ అసైన్మెంట్ వచ్చింది.. వచ్చేవారమే ప్రయాణం.'.( భలే.. నిజమా?)
'నిన్నటినించీ ఒకటే తుమ్ములూ, దగ్గూ...' ( అయితే..?)
'ఇది మా పిల్లాడు మొదటిసారి స్నో లో ఆడిన ఫోటో..' ( నిజమే??)
'ఇది  నేను, మా కుక్క'( భలే..)
'మనవూరి కేమయింది? వర్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించదేం?' ( కాకెత్తుకుపోయింది.. ఇప్పుడే తీసుకొస్తా, కొంచం ఆగు)
'సూపర్ చెఫ్ కిరణ్ ఎట్ వర్క్.. ఘుమ ఘుమ లాడే చోలే.. '
ఇలాంటివే ఎన్నో...
 అమ్మయ్యా, ఇప్పటికి తెలిసిపోయింది కదా.. ఇవన్నీ ఏమిటో..

రోజూ ముఖం కడుక్కున్నంత సహజంగా, క్రమం తప్పకుండా,   ప్రతీవారూ అరగంట నించి, నాలుగైదు గంటల దాకా గడిపే ముఖ పుస్తకం లో తరచుగా మనకి కనపడే విషయాలే.. ఒక్కోసారి విసుగేత్తించేవి కూడా.

'మరీ ఇలా అన్నీ రాయాలా?'  అని నేనే ఎన్నోసార్లు అనుక్కున్నాను. ఇదే కాదు..
 ' నిన్న కొత్త ఫోటోలు పెట్టాను చూసావా? '  అని అడిగి 'చూశాను' అంటే..
'ఓ చూసావా? మరి కామెంట్ రాయలేదెం? 'అని అడిగేసి మరీ రాయిన్చేసుకోడం..
ఇవన్నీ కొత్త రకం పోకడలు. ఒక్కొసారి చాలా విపరీతంగానూ, వెర్రి చేష్టల్లానూ అనిపిస్తాయి కూడా..

ఇప్పుడు కొద్దిగా కత్తెర కి పని చెప్పేసి. "కట్ చేస్తే' అని . అదే చేత్తో గుండ్రాలు తిప్పేయండి.. నేను మీ ఎదురుగా నించున్నాను

ఇప్పుడు అప్పుడెప్పుడోలా కనిపిస్తున్నకాలం....
" పక్కింటి అమ్మమ్మగారిని ఒక సారి రమ్మనండర్రా!! ఇవ్వాళ మనింట్లో సత్యనారాయణ వ్రతం.. ఆవిడ చేత్తో ప్రసాదం చేస్తే చాలా మంచిది.. "
అని ఒక ఇంటి వారు పిలవడమే ఆలస్యం.. ఆ పక్కింటి అమ్మమ్మగారు తన ఇంట్లో ఎన్ని పనులున్నా సరే.. పక్కన పెట్టేసో,, తొందరగా కానిచ్చేసో వచ్చి కేవలం ప్రసాదం చెయ్యడమే కాదు.. వ్రతమూ,భోజనాలూ అన్ని అయ్యేవరకు దగ్గరేఉండి చూసుకుంటారు. తను తిన్నదీ, లేనిదీ కూడా ఆవిడకి పట్టదు.
ఎనభైలు..
"మీ ఇంట్లో స్టాంపులున్నాయా??  ఒక రెవెన్యూ స్టాంపూ, అదే చేత్తో ఓ రెండు నిమ్మకాయలుంటే ఇవ్వండి రేపిస్తాను.."
 ఇది మొన్న మా ఆడపడుచు గారింట్లో పెళ్ళికి పెట్టిన  చీర అని గోడమీదనించి చెప్పుకునే కబుర్లలో చూపించడం, నిన్న కొబ్బరిలడ్డూ చేసాను, రుచి చూడండి అని ఇచ్చి పుచ్చుకోవడం.. ఆడవారి మధ్య జరిగితే
మగవాళ్ళ మధ్య చేబదుళ్ళూ, ఇవ్వడాలూ, తీర్చడాలూ
"రేపు సినిమాకి వెళదామా వదినా? అని పక్కింటావిడని అడిగి అఫీసులకీ, స్కూళ్ళకీ వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళిపోయాకా, సి అంటూ ముఖాలు కడిగేసుకుని, నీ అనగానే చీరలు మార్చేసుకుని, మా అనగానే ఇళ్ళు తాలాలేసుకుని 'మహా మహిళా చిత్రాలైన మోర్నింగ్ షోలకి వెళ్ళే ముచ్చట్లూ
మా బావగారికి వంట్లో బాగోలేదుట.. అర్జెంట్ గా వెళుతున్నాము.. పిల్లలని చూసుకుంటారు కదా అని పక్కవాళ్ళకి అప్పచెప్పేసి  ధైర్యంగా వెళ్ళే పొరుగువారూ.
ఒరే, నీ జామెట్రీ బాక్స్ ఇస్తావా, రేపు నాది కొనగానే ఇచ్చేస్తాను.. అని తెచ్చుకుని జాగ్రత్తగా వెనక్కి ఇచ్చేసే మగపిల్లలూ
అక్కా, మా కాలేజీలో ఫంక్షన్ కి నీ చీర ఇస్తావా అని పక్కింటి కాలేజీ అక్కని అడిగే పదోక్లాస్ పిల్లలూ.. కొత్తగా టీ. వీ కొన్నవారింట్లో చిత్రహార్ చూడడానికి వచ్చే ఇరుగింటివారూ
తొంభైలు..
కొత్తకొత్తగా వస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లూ, మూసుకోవడం మొదలైన తలుపులూ...
http://saikumarkoya.files.wordpress.com/2010/01/18149car01_070509.jpg 'పొద్దున్నే వాకింగ్ కి వెళదామా, మీ తలుపు కొడతాను.. అని ముందు రోజు అడగడాలూ..
బెల్లు కొట్టి పాయసం గిన్నె ఇవ్వడాలూ..
చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు చిట్టెలు వేసుకుని కిట్టీ పార్టీల పేరిట కలుసుకునే సందర్భాలు ఏర్పాటు చేసుకోవడాలూ..
పెళ్ళిల్లకీ పేరంటాలకీ ఫోన్లు చేసి పిలుచుకోవడాలూ...
రెండువేలు..
  పెరిగిన దూరాలూ.. తగ్గిన మాటాలూ.. చదువుకో, ఉద్యోగానికో దూరప్రయాణాలూ.. మనసులో ఉన్నా మనుషులని కలిసేందుకు లేని అవకాశాలూ... అవకాశం ఉన్నా కలిసి రాని సందర్భాలూ.. 
తీరిక లేని పనివేళలూ.. తీరిక ఉన్నా కోరిక లేకపోవడాలూ...
 వారం మొదలు, వారాంతమూ తప్ప మరేమీ గుర్తుకు రానంతగా వేగంగా కదిలే రోజులూ...
ఏళ్ళతరబడి జీళ్ళ పాకాలలాంటి కధలతో కాలక్షేపాన్ని పంచే టీ.. వీ  సీరియళ్ళూ..
"అక్క, రేపు మీరింట్లో ఉంటారా? నేను అటువైపు వచ్చే పని ఉంది. వీలైతే వస్తాను.. ఫోన్ చేస్తానులే వచ్చేముందూ సొంత అక్కకే ఇలా చెప్పటాలు..
ఆపాదమస్తాన్ని రకరకాల వైర్లతో కట్టిపడేస్తున్న ఎలక్ట్రిక్ సాధనాలూ...

ఇది చదివాకా మళ్ళీ నేను పైన రాసిన 'ముఖ పుస్తకం' వాక్యాలు చూస్తే ఇలా అనిపిస్తుందెమో...
'నేను ఈ రోజు 'దూకుడు' సినిమా చూస్తున్నాను...' ( చూడు.. ఐతే దానికి అనౌన్స్ మెంట్ ఎందుకు? అని మనం అనకూడదు.. అడక్కూడదు..)
  పాతకాలంలో ఊరంతా చెప్పేవారుట సినిమాకి వెడుతున్న సంగతి.. కొత్తగా పెళ్ళైన సుమకి తనూ తన భర్తా సినిమాకి వెళుతున్న సంగతి ఎవరితోనైనా చెప్పాలి అని ఉంది.. అదేం పెద్ద విషయమని కాదు.. కానీ చలీ, మంచు దట్టంగా ముసిరిపోయి మనిషి కోసం మొహం వాచిపోయిన ఆ చలిదేశంలో ఎవరికి చెప్పాలో తెలియలేదు.. అందుకే ఫేస్ బుక్ లో  రాసుకుంది.. ఈ విషయం తెలిస్తే.. నేను బ్రాకెట్ లో ముందు రాసినదానికి బదులు ఇలా రాస్తానేమో.. ( ఓ.. అవునా.. వెరీ గుడ్.. చూసి ఎంజాయ్ చెయ్యండి.)

'నాకు ఈ మధ్యన ఎంతో బోర్ గా ఉంటోంది.... ఎందుకో తెలీదు,, ఈ రోజు మరీనూ...'  ( అలాగా పాపం)
 గత నాలుగు సంవత్సరాలుగా పీ.హెచ్ డీ కోసం కష్టపడుతున్న రవికి.. చాలా నిరాశగా ఉంటోంది ఈ మధ్యన.. లాబ్ లో ఎవరికీ చెప్పే పరిస్థితి లేదు.. తొందరగా డిగ్రీ చేతికి వస్తే ఉద్యోగాన్వేషణలో పడవచ్చు, మనదేశమైనా సరే,, విదేశమైనా సరే.. అప్పుడు ఇలా రసుకున్నాడు. ( పరవాలేదు.. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి అని కొత్త కామెంటు)

'హుర్రే!..నాకు ఆన్ సైట్ అసైన్మెంట్ వచ్చింది.. వచ్చేవారమే ప్రయాణం.'.( భలే.. నిజమా?) పవన్ కి ఆన్శైట్ వెళ్ళాలన్నది చిరకాలపు కల.. ఎక్కడో పల్లెట్టొరిలో పుట్టి పెరిగి చదివి, ఎదిగిన పవన్ కి ఇది చాలా పెద్ద విజయం..
(అభినందనలు)

'ఇది మా పిల్లాడు మొదటిసారి స్నో లో ఆడిన ఫోటో..' ( నిజమే??)- తనూ, భర్త రాం తప్ప ఎవరూ లేరు ఇక్కడ.. తన పిల్లాడి ఆట పాటలు చూడడానికి.. ఇదే దిగులు స్వప్న కి.. తన ఫ్రెండ్సూ, కజిన్సూ,, చూడాలని కోరిక.. (బాబు భలే ముద్దుగా ఉన్నాడు)


'మనవూరి కేమయింది? వర్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించదేం?' ( కాకెత్తుకుపోయింది.. ఇప్పుడే తీసుకొస్తా, కొంచం ఆగు) - ఒక్కొసారి పెద్ద కారణమేదీ లేకుండానే, ఏమీ తోచకపోతే రాసుకునే మాటలివి.. ఎవరో ఒకరు చదివి స్పందిస్తారు కదా అని..

'సూపర్ చెఫ్ కిరణ్ ఎట్ వర్క్.. ఘుమ ఘుమ లాడే చోలే.. '- అమ్మ కమ్మగా వండి పెడితే వంకలు పెట్టుకుంటూ తినడమే తప్ప, వంట అంటే ఎలా ఉంటుందో మొదటి సారి వంట పట్టించుకున్న అమెరికా చదువుల కుర్రాడు తను చేసిన వంట అందరికీ చూపించే ప్రయత్నం.. లేకపోతే ఎలా తెలుస్తుంది అందరికీ?
'ఈ సారి కామెంట్ రాస్తే.. భలే వండావు కిరణ్.. చూస్తేనే నోరూరుతోంది లాంటిదేదో రాస్తాను..

ఇక్కడ వారు రాసిన వాఖ్యల వెనక విషయం మనకి తెలియడం కాదు ముఖ్యం..తెలిస్తే మారేది మన పర్సెప్షన్ మాత్రమే.. ప్రతీవారికి ఏదో ఒక కారణం ఉండవచ్చు. అది అతి అయితే చిరాకు కలిగే మాటా వాస్తవమే.

 మనకి కలిసి జీవించడం ఇష్టం. కలిగినది..  అది మాటైనా సరే, మమతైనా సరే అందరితో పంచుకోవడం వల్ల కలిగే ఆనందం అంటే ప్రియం..
ఉమ్మడి కుటుంబాలే కాదు.. అమ్మమ్మలూ, బామ్మలూ ఉండే చిన్న కుటుంబాలు కూడా కనబడని ఈ రోజుల్లో.. ఖండాంతరాలూ, దేశాంతరాలూ మనుషుల మధ్యన దూరాన్ని ఏర్పరిచినా, మనసులో మనమంతా కొరుకునే దగ్గరతనన్ని పొందాలనే ప్రయత్నమే.. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు విపరీతంగా ప్రజాదరణ పొందడానికి కారణమేమో.
ఒంటరి తనాన్ని దూరంగా ఉంచేదుకు కావచ్చు. నాతోనూ నలుగురున్నారన్న భావన ఇచ్చే బలం కావచ్చు.. సహజంగానే అందరితోనూ పంచుకునే మనస్తత్వం కావచ్చు. కారణాలెన్నో.

 ఇది మనం వాడుకునే పద్దతి కొంత విపరీతంగా ఉండవచ్చు... వింత వింత పోకడలూ,, కాస్తంత వెర్రితలలూ వేసినట్టుగా అనిపించవచ్చు.. వీటిల్లో అంతర్లీనంగా ఉన్న కష్టాలూ అందరికీ తెలిసినవే కావచ్చు.. కానీ ఇవేవీ ఈ ఉధృతాన్నిఆపలేకపోవడానికి కారణం మాత్రం.. అరిస్టాటిల్ చెప్పినట్టు.. మనిషి సంఘజీవి అన్న మౌలిక సూత్రమే..
కలిసి ఉంటే కలదు సుఖము అన్నది మర్చిపోయినా.. కలిసి ఉంటే కలదు సరదా.. అన్న సూత్రం కావచ్చు. అందుకే అనిపిస్తుంది నాకు.. ఇవన్నీ మనం క్రమక్రమంగా మర్చిపోతున్న పక్కింటివారి ముఖచిత్రాలేనేమో. కేవలం ముఖపుస్తకం మాత్రం కాదు.. అని..

Wednesday, January 11, 2012

ఉన్నతమైన ఆలోచన.. ఆచరణ. సమాజోన్నతే ధ్యేయం..
      నూతన సంవత్సరం మీ అందరికీ శుభ ప్రదంగానూ, సంతోష దాయకంగానూ ప్రారంభమైంది అని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి  శుభాకాంక్షలు. గడచినా ఏ సంవత్సరమైనా ఒకేలా ఉండదు.. కానీ వచ్చే ప్రతీ కొత్త సంవత్సరమూ కొత్త ఆశలకీ, ఆనందాలకీ, అనుభూతులకి ప్రతీకగానే దాదాపు ఒకేలా  మొదలవుతుంది. కొత్తకున్న మహత్యం అది.. ఆశకున్నబలం అది.. 
     వెళ్ళిపోయిన సంవత్సరం లో రోజూ చేసే పనులు తప్ప కొత్తగా ఏమి చేసాము? అనుకుంటే నాకేమీ కనబడదు. పొద్దున్న నిద్ర లేస్తే, మనకంటే ముందు పరిగెత్తే కాలమూ, దానితో పాటు గడియారమూ, వరసా, వావీ, విసుగూ, విరామమూ లేకుండా ఒకదానితర్వాత ఒకటిగా వచ్చిపడే పనులూ, ఉరుకులూ, పరుగులూ..నిట్టూర్పులూ, కోపాలూ, విసుగులూ,చిరాకులూ .. మధ్యమధ్యలో విహారాలూ, విందులూ.. నవ్వులూ, చుట్టాలూ, అచ్చమైన ఉగాది పచ్చడిలాంటి అనుభవమే.. జీవితమంటేనే షడ్రుచుల సమ్మేళనం  కదా మరి!! మనకంటూ మనం ఎంత చేసుకున్న మన పనుల వల్ల మరెవరికైనా  చిన్న మేలు జరిగినా సరే ఆ తృప్తి ఎంతో వేరు అని నాకనిపిస్తుంది. అలాంటి వారిగురించి చెప్పాలనే ఈ టపా. 
రమేష్ స్వామి
              
ఆర్ధిక రేఖ కి దిగువన ఉన్న పద్దేనిమిది    ఏళ్ళు   నిండిన  పిల్లలని తీసుకొచ్చిఒక చోట  చేర్చి వాళ్ళ కి ఆసక్తి ఉన్న వృత్తి విద్యలలో 75 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ను ఇవ్వడమే కాకుండా, వారికి ఉద్యోగాలిప్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా వాళ్ళందరికీ  సహాయం చేసే ఒక గొప్ప సంస్థ 'ఉన్నతి'. పేరెంత గొప్పదో, ఆదర్శం కూడా అంత గొప్పది.. ఆచరణ కూడా అంతే.. "చిన్న పిల్లలకి, వయసు మళ్ళిన వారికీ తగినంత సేవ చెయ్యడానికి చాలా సంస్థలు ఉన్నాయి, సరి అయిన సమయంలో చదువుకోక, చదువుకునే వీలు లేక, తగిన ఆధారం లేక తిరుగుతున్న   ఈ యువతీ యువకులకి చేయూత నిస్తే, వాళ్ళతో పాటు వారి కుటుంబం కూడా బాగుపడుతుంది కదా" అన్న ఒక ఆలోచన ఈ సంస్థ పుట్టుకకి కారణం అంటారు సంస్థ ఫౌండర్ మెంబర్  శ్రీ రమేష్ స్వామి.సరి అయిన దారి దొరకకపోతే దారి తప్పే వయసు అది.. అందుకే వారికి ఈ సహాయం ఎంతో అవసరం అంటారు ఆయన. 
           బెంగుళూరు లోని అల్సూర్ లో ప్రారంభమైన ఎస్. జీ. బి. ఎస్ ట్రస్ట్ కి అనుబంధ సంస్థగా 'ఉన్నతి'ని బెంగుళూర్ లోని సదానంద నగర్ లో ప్రారంభించారు. ఎస్. జీ బి ఎస్ ట్రస్ట్ చాల రకాలైన కార్యక్రమాలని నిర్వహిస్తుంది. అందులో చాలా ప్రముఖమైనది ప్రతీసంవత్సరమూ గోకులాష్టమి కి జరిగే 'ఉత్సవ్' అనే కర్నాటక సంగీత కార్యక్రమం.గతంలో  అల్సూర్ లో జరిగినా, 'ఉన్నతి' ప్రారంభమైన నాటినించీ ఈ కార్యక్రమం 'ఉన్నతి'ఆవరణలోనే జరుగుతోంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద విద్వాంసులందరూ పాడతారు.. చాలా చాలా బావుంటుంది..ఉచిత ప్రవేశం..చాలా తక్కువ ధరకి భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా దొరుకుతాయి.  ఈ ఏ.సి హాల్ ని కుర్చీలతో కలిపి మరీ చాలా తక్కువ ధరకి అద్దెకి ఇస్తారు ప్రైవేట్ ఫంక్షన్స్ కి.. 
        ప్రతీ బేచ్ లోనూ దాదాపు 100  మందికి  పైన తీసుకుంటారు. తొమ్మిది వొకేషనల్ కోర్స్ లలో నూ, ఇంగ్లీష్ మాట్లాడడం లోనూ ట్రైనింగ్ ఇస్తారు. అందరికీ టిఫిన్లూ, భోజనమూ, లోకల్ వారైతే బస్ పాస్, లేకపోతె హాస్టల్ వసతీ ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారు. Retail sales, field sales, guest care (hotels), guest care (offices), industrial tailoring, Industrial painting, data entry (for BPO), security సర్వీసెస్
 and car driving ల లో ఈ క్లాసులు  నిర్వహిస్తారు. ఇవి కాక ఇంగ్లీష్ మాట్లాడటమూ, లైఫ్ స్కిల్ల్స్ వగైరాలు కూడా నేర్పిస్తారు. ఇప్పటి వరకూ ఎందరినో తీసుకొచ్చి ఇలా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే కాక వాళ్ళని చక్కటి మార్గంలో తీర్చి దిద్దారు.
              ఏ మంచి పని చేద్దామన్నా ఎన్ని అడ్డంకులో..చేయ్యదానికంటే చేయ్యకపోవడానికే ఎక్కువ కారణాలు కనబడతాయి.  "ఊరికే, పైసా ఖర్చు లేకుండా మీకిష్టమైనది నేర్చుకుని ఉద్యోగంలో చేరండి' అంటే కూడా దాన్నోపెద్ద  కష్టంగా భావిస్తారు పిల్లలు. ఇక్కడ క్రమ శిక్షణ తో    ఉండాలి అంటారు, వీలు దొరికితే మానేద్దామని మొదట్లో చూస్తారు. టైముకి రావడం కష్టం అంటారు.  'ఒక్క పైసా తీసుకోవడం లేదంటే ఇందులో ఏదో ఉంది" అన్న ఆలోచన కొందరిది.. 
  కానీ ఒక్కసారి ఈ ప్రోగ్రాం విలువ తెలిసాకా ఇంక వెనకడుగు వేసే ప్రశ్నే లేదు, ఉన్నతిని ఒక గుడిగా భావించి ఎంతో శ్రద్దగా నేర్చుకుంటారు. ఉన్నతి యొక్క ఉన్నతమైన విలువలనీ, అక్కడి టీచర్ల, ఉద్యోగులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. ఇంత పని క్రమం తప్పకుండా చెయ్యడం చాలా కష్టం.. కానీ వారెవ్వారూ కూడా అలా అనుకోరు. .ఎంతో ఇష్టంగా చేస్తారు. ఇంటర్వ్యూలూ, కోచింగ్, ప్లేస్మెంట్, వాలెడిక్తరీ అన్నీ ఎంతో పద్దతిగానూ,  సంతోషంగానూ చేస్తారు .
 ప్లేస్మెంట్ సమయానికి చాలా కంపెనీల వారు వస్తారు. సాఫ్ట్వేర్ కంపీనీలూ, బి.ఫై.వో లు, హోటల్స్, కాఫీ డే, బరిస్టా వంటి వారూ ఇలా.. ఇవన్నీ బయట ఏదైనా కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో జరగాలంటే ఎంత ఫీజ్ వసూల్ చేస్తారో అందరికీ తెలుసు.. ఇక్కడ విద్యార్దినించి డబ్బు తీసుకోవడమనేదే ఉండదు..  ప్రతీ విద్యార్ధికీ ట్రైనింగ్ కీ, వసతికీ, భోజనానికీ అన్నింటికీ కలిపి ఇంచుమించుగా  12000   రూపాయలు ఖర్చు అవుతుంది. 'ఉన్నతి' లాంటి ఆశయంతో ఎవరైనా తమ ఊరిలో ఇలాంటి సంస్థ ప్రారంభిచాలని అనుకుంటే దానికి తగ్గ ట్రైనింగ్, గైడెన్స్ కూడా ఇస్తారు. 2020  సంవత్సరం నాటికి దేశం మొత్తమ్మీద 200  ఉన్నతులు ఏర్పడాలని ఎందఱో యువతీ యువకులకి ఈ సహాయం అందాలని వారి కోరిక. ప్రస్తుతానికి ఒక డజను వరకూ ఏర్పడ్డాయి.
కొందరు అలవాటుగా ఇచ్చే దాతలున్నా ఈ బృహత్కార్యక్రమానికి ఎంతో సహాయం అవసరం అవుతుంది. డబ్బు సహాయం మాట అటుంచితే, ఇంకా ఎన్నో రకాల సహాయం అవసరం అవుతుంది.
1 . విద్యార్ధులని తీసుకు రావడం ( మనకి తెలిసిన పిల్లలు, డ్రైవర్ల, లేదా పనిమనిషుల పిల్లలు ఇలా ఎవరినైనా రికమెండ్ చెయ్యవచ్చు). 
2 . టీచింగ్, వాలంటరీ సర్వీస్: మనకిష్టమైన సబ్జెక్ట్ చెప్పవచ్చు. ముందు టీచర్లకి కూడా శిక్షణ ఇస్తారు..వాలంటరీగా మనకి ఇష్టమైన పని కూడా చెయ్యవచ్చు
3 . ధన సహాయం: మనకి వీలైనంత సహాయం చెయ్యవచ్చు. ఇది 100 % టాక్స్ మినహాయింపు. ఒక విద్యార్ధికి 12000  అవుతుంది. .అంతే ఇవ్వాలని లేదు.. ఎంత కావాలన్నా ఇవ్వచ్చ్చు..ఒక రోజు భోజనం ఖర్చు 3000 .
4 . హాల్ రెంట్: మన ఇంటి ఫంక్షన్స్ కి హాల్ రెంట్ కి తీసుకోవచ్చు.. దానికి కూడా ఇంచుమించు 12000  మాత్రమె తీసుకుంటారని గుర్తు.. 
అన్నింటికంటే ముఖ్యమైనది. గోకులాష్టమి సంగీత ఉత్సవాలలో భాగం పంచుకోవచ్చు. మేము గత మూడు సంవత్సరాలుగా వెళుతున్నాము. ఎందఱో ప్రముఖులని చూసే అవకాశం కలగడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తాము. 
గత సంవత్సరంగా ప్రతీ మూడు నెలలకి ఒకసారి  ఉన్నతికి నేను ఒక న్యూస్ లెటర్ చేస్తున్నాను. బండాత్మకూరు కళ్యాణ్ అనే ఒక అబ్బాయి నాకు H.T.M.L programming లో సహాయం చేస్తాడు. ప్రతీ సారీ ఉన్నతికి సంబంధించిన ఏదో ఒక విషయంతో పాటు, ఉన్నతి లో భాగం పంచుకుంటున్న ఒక టీచర్ని, ఒక ఉద్యోగిని, స్టూడెంట్స్ చెప్పిన అభిప్రాయాలు వగైరాలతో తయారు చేస్తాము.. ఇది ఉన్నతి గ్రూప్ లోనే దాదాపు ఐదారువేల మందికి చేరుతుంది..    ఈ మహా యజ్ఞం లో ఇది నా ఉడతా భక్తీ అనుకుంటాను. గత సంవత్సరం నేను చేసిన మంచి పని ఇది అని సంతోషం గా చెప్పుకోగలను.  మా అబ్బాయి పేరు మీద ఒక విద్యార్ధికి సరిపడే  డబ్బు కట్టాలి అనుకున్నాము, శనివారం వెళ్ళాలి.
  ఉన్నతి వెబ్ సైట్ వివరాలు కింద ఇస్తున్నాను. నేను చేసిన న్యూస్ లెటర్ లింక్ ఇవ్వడానికి కుదరడం లేదు.. మిత్రులెవరికైనా అవకాశమూ, టైమూ ఉంటె మీకు వీలైన సహాయం  తప్పకుండా చెయ్యండి..  మీకెవరికైనా ఉన్నతి మెయిల్ గ్రూప్ లో చేరాలని ఉంటె నాకు మెసేజ్ పంపించండి,లేదా ఈ పోస్ట్ కి కామెంట్ చెయ్యండి.  దానివల్ల వాళ్ళ కార్య క్రమాలు మొదలైన వివరాలు మీకు తెలుస్తాయి. ముఖ్యంగా సంగీత కార్యక్రమాలని మిస్ కాకండి. 
1. http://www.unnatiblr.org/






          

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...