ముళ్ళపూడి వెంకట రమణ గారు ఇక లేరు.. మరి తిరిగి రారు.. నిజమేనా? తెల్లవారుతూనే ఎంత విషాదకరమైన వార్త వినవలసి వచ్చింది.. పొద్దున్నే ఒకటో రెండో తెలుగు బ్లాగ్లలో తప్ప మరెక్కడా కనిపించలేదు చాలా సేపు.. అబద్ధమైతే బావుండును అని ఒక ఆశ మనసులో అన్నిమూలలా.. ఆశ, దోశ అన్నారు ఆయన.. .
ఇలా మీ దారిన మీరు హాయిగా వెళ్ళిపోతే ..అరుదైన శైలికీ , ఆరోగ్యమైన హాస్యానికీ , అందమైన తెలుగు సాహిత్యానికీ , వీటన్నింటికీ చిరునామా రమణ గారే అని ఆరాధించే ఆశేషాంధ్ర సాహితీప్రియుల మాట ఏమిటి? అని అడుగుదామంటే వీలేదీ? అభిమానులు .. సరే..
పిల్లపిడుగులు బుడుగులూ, చిన్నారి సీగాన పెసూనాంబ లూ, రాధా గోపాళాలూ, లావుపాటి పక్కింటి పిన్నిగార్లూ, రెండు జెళ్ళ సీతలూ, వాళ్లకి ఈలలు వేసే బాబాయిలూ ఏమయిపొతారు? హలో ఓ ఫైవుందా? అని అప్పారావులు ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఫైవు కూడా రూపాయి బిళ్ళలా నాణెం అయిపోయిది కదా, కనీసం ఓ టెన్ ఉందా అని వారు అడగాలన్నా, ఆ డైలాగ్ మార్చి రాయాలన్నా ఎవరి దగ్గరకి వెళతారు ? పాపం వాళ్లనోసారి చూడండి సార్!
మూగమనసులూ, పూలరంగడూ, భార్యా భర్తలూ అంటూ ప్రేక్షకుల మనసులతో మీ కలంతో దాగుడు మూతలాడి ఇక ఇప్పటికింతే అని ఇప్పుడు తీరిగ్గా దానికి కేప్ పెట్టేస్తే ఎలాగండీ ?
మేమిద్దరం తూగోజీ, పగోజీ అని చెప్పి, ఇప్పుడు ఆయన్నీ, ఆయనతో పాటు తెలుగువారినీ ఒంటరిగా వదిలేస్తే అర్ధం ఏమిటి రమణాజీ? భట్టు గారి అట్టు మీద వొట్టు, ఎన్నో తెలుగు కళ్ళల్లో తిరిగిన కన్నీరు మీద ఒట్టు... మీరు లేక మా అందరి మనసులూ మూగపోవూ.. మనసుల దాకా ఎందుకు? ఈ వార్త విని మనుషులే మూగపోయారు..నిజంజీ.
తెలుగు వాకిట మీరిద్దరూ వేసిన "ముత్యాల ముగ్గులు', పెట్టిన 'గోరంత దీపాలు, బుద్ధిమంతులుగా మారిన బుడ్డిమంతులు, వారు 'అందాల రాముళ్లై' తరుణి సీతమ్మను చేపట్టినప్పుడు మీరు చేయించిన 'సీతాకళ్యాణాలు' ( మామూలు భాషలో సీతమ్మ పెళ్ళిళ్ళూ ), రాధా కళ్యాణాలు.. పెళ్లీడు పిల్లలతోనూ, నవదంపతులతోనూ మీరు చదివించిన పెళ్లి పుస్తకాలు, మిస్టర్ మొగుడా? మిసెస్ పెళ్ళామా ? అన్నది కాదు ప్రశ్న, భర్త కొంచం ఎక్కువ సమానం అని నువ్వనుకున్నా కావలసినది సమానత్వమే, తెలుసుకోరా మొగుడా అని మెత్తగా చివాట్లు పెట్టిన మిస్టర్ పెళ్ళాలూ .. ఒకరా ఇద్దరా.. చిట్టా రాస్తే సంపూర్ణ రామాయణమంత పెద్ద గ్రంధం నిండే మీ చిత్రాలూ, పాత్రలు . చిత్రసీమనూ, మంచి తెలుగు చిత్రాభిమానులనూ ఎన్నో ఏళ్ళు ఏలిన జంట రాజాదిరాజుల్లో ఒకరు లేక అనాధలై తల్లడిల్లి పోవూ?
ఆత్మ కధంటే కేవలం ఆత్మ స్తుతీ, పరనిందా నూ.. అందుకే నేను రాయనన్నాను అన్నారు. అయినా స్వాతీజీ మాట కాదనలేక రాసానన్నారు. ఎంత మంచి పని చేసారు.. కోతి కొమ్మచ్చి, కో.కొ.. కొహొతి కొమ్మ్మచ్చి అని మొదటా, ఇంకోతి కొమ్మచ్చి అంటూ పిమ్మటా, సరదాగా, గడుసుగా, గబా గబా ఎన్నో కొమ్మలు ఎక్కించారు.. మధ్య మధ్యలో 'శాఖా చంక్రమణం' చేస్తున్నాను.. అయ్యా క్షమించండి అంటూ ఎన్నో విషయాలు తమాషాగా చెప్పారు, మురిపించారు.. మమ్మల్ని మరిపించారు.. ముక్కు గోక్కుంటున్న బొమ్మ వేసి 'ముక్కోతి కొమ్మచ్చి' త్వరలో అని ఊరించారు. ఇంతలోకే ఏమంత తొందర వచ్చిందని చిటారు కొమ్మనేక్కేసారు ? ఇక్కడ పంచిన సాహితీ పరిమళాలు చాలు , ఇంక అక్కడ కూడా ఇదే పని చెయ్యి అంటూ ఓ ఆర్డర్ పారేసి అక్కడ దేవుడేం మిఠాయి పొట్లం పెట్టాడో మరి..
ముళ్ళపూడి వారికి నివాళులు !
ReplyDeleteరమణా! నీకు ఇచ్చిన ఉద్యోగం ఐపోయింది. ఇహా వచ్చేయ్ ఇక్కడ వేరే పని చెప్తాను అన్నాడేమో ఆ దేవుడు..
ReplyDeleteMay his soul rest in peace..
మహానుభావుడు .వారు ప్రత్యక్షంగా హరిసేవాకంకర్యము నకై తరలి వెళ్లారు.
ReplyDeleteఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
ReplyDeleteఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
కన్నీళ్లు ఒక్కుదుటున ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా
http://blogavadgeetha.blogspot.com/2011/02/blog-post_24.html
Navvu Thana Unikini Vethukkune Roju...
ReplyDeleteMahanubhavudiki na Anjali....
Bapu Ramnalu Okkasariga only Bapu anukovadam Chala Kastam ga vundi. Bapu Kunche lo eppudu unde O Rmana garuuu ... chupinchadi mee vilasam Bapugari Kunche dwara........
ReplyDeleteHari Narayana
Tera meeda peru, pedavula meeda navvu okasare vaste adi mamulu haasyam.. kani talachina pratisari.. nee matalu... chakkiligintala chekkara kelilai.. notilone undipotunnai... kani chedu gulika vesi cheppakunda vellipoyaru.
ReplyDelete