Sunday, June 26, 2011

శ్రీ నీలోత్పల నాయికే..

       కొన్ని రాగాలూ, కొన్ని కీర్తనలూ మొదటి సారి వినగానే ఎప్పటినించో తెలిసిన వాటిలా అనిపిస్తాయి.మరెంతో కాలం గుర్తుండిపోతాయి. దానికి ప్రత్యేకమైన కారణాలు అక్కరలేదు అనిపిస్తుంది నాకు. ఆ యా రాగాలలోనూ, కీర్తనలలోనూ ఉన్న గొప్పదనం అది అనుకుంటాను నేను. కర్నాటక శాస్త్రీయ సంగీతం అంటే వల్లమాలిన ఇష్టం, అభిమానమూ తప్ప మరే గొప్ప అర్హతలూ నాకు లేవు.. అయినా సాహసించి ఒక రాగాన్ని గురించి అందులో స్వరపరిచిన కొన్ని కీర్తనలూ, పాటలగురించీ చెప్పాలని ఈ ప్రయత్నం.. ఇది చదివిన మిత్రులు ఇంకా వివరాలు నాకు తెలియచేస్తే చాలా సంతోషిస్తాను.
'శ్రీ నీలోత్పలనాయికే 'అన్న ఈ కీర్తన మొదటిసారి యూ ట్యూబ్ లో విద్వాన్. శ్రీ. టీ. ఎం. కృష్ణ పాడగా విన్నాను. మొదటిసారి వినడంతోనే ఈ రాగం ఎంతో గొప్పగా అనిపించింది.   తర్వాత సంగీత శిరోమణి శ్రీ. బాల మురళీకృష్ణ గారు పాడినది విన్న తర్వాత అయితే ఇంక చెప్పనక్కరలేదు.  అప్పటినించీ ఎన్ని సార్లు విన్నామో లెక్కలేదు. కార్లో, ఇంట్లో, సి.డీలో, కంప్యూటర్లో.. ఇలా లెక్కలేనన్నిసార్లు.విన్న ప్రతీసారి మరింత బాగా, గొప్పగా అనిపిస్తుంది. 

అందువల్లనే ఈ రాగాన్ని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని అనిపించింది. ఈ  రీతిగౌళ రాగం 22 వ మేళకర్త రాగమైన  ఖరహరప్రియ రాగానికి జన్య రాగం. ప్రస్తుతం రీతిగౌళగా ప్రసిద్ధి చెందినా ఈ రాగం యొక్క అసలు పేరు నారీ రీతిగౌళ. ఆనందభైరవి, శ్రీరంజని రాగాలకి చాలా దగ్గర పోలికలతో ఉన్నా, ఆరోహణలో 'ని, ని, స' అనే స్వరప్రయోగం ఈ రాగానికి ప్రత్యేకమైన ముద్రని చేకూరుస్తాయి. 

    శ్రీ ముతుస్వామి దీక్షితార్ రచించిన 'శ్రీ నీలోత్పల నాయికే' అన్న కృతితో పాటు, త్యాగరాజస్వామి రచించిన 'నన్ను విడచి కదలకురా', బాలే బాలేందు భూషిని, ద్వైతము సుఖమా లాంటివి, స్వాతి తిరుణాల్ కృతి 'జనని నిను వినా' లాంటివెన్నో ఈ రాగం లో ఉన్నాయి. 

శ్రీనగర నాయిక అయిన పార్వతీ దేవిని స్తుతిస్తూ సాగే ఈ కీర్తనలో దీక్షితార్ అనేకవిధాలుగా దేవిని ప్రస్తుతిస్తారు. నీలి కలువ పువ్వులో ఉద్భవించిన నాయిక అయిన ఆ  జగదంబికని కోరిన వరాలిచ్చే దేవతగా వర్ణిస్తారు.
 పల్లవి:    శ్రీ నీలోత్పల నాయికే..జగదంబికే..   శ్రీ నగర నాయికే... మామవ వరదాయికే..

దీన జనుల పట్ల అపారమైన దయా, జాలి లాంటి  లక్షణాల వల్ల అపరిమితమైన గౌరవం పొందినదట పార్వతీ  దేవి . విశ్వ గురువులూ, ఆచార్యులూ ఇతర ప్రముఖులూ ఈ జగత్తు సృష్టికీ,  విశ్వవ్యాప్తికీ మూలకారణంగా అభివర్ణించిన శక్తిస్వరూపిణి . సాక్షాత్తూ భైరవుడి చేతనే కొలవబడి నదట. ఎల్లప్పుడూ ఆనందంతోనూ, ఉల్లాసంతోనూ ఉండే ఈ పర్వతరాజ తనయ సుమ బాణదారి శత్రువు అయిన శివుని వల్ల కీర్తించబడినది.అంతే కాదు జ్ఞాన మనే సముద్రంలో అమృతం వంటిది అంటారు.
 చరణం: దీన జనార్తి ప్రభంజన రీతిగౌరవే, దేశిక  ప్రదర్శిత  చిద్రూపిణీ నటభైరవే. 
            ఆనందాత్మానుభావే అద్రిరాజ సముద్భవే....  సూన శరారి వైభవే జ్ఞాన సుదార్నవే శివే .. {శ్రీ}

అన్నిరకాల సంకల్పాలనే కాదు, వికల్పాలను కూడా తీర్చగలిగే శక్తివి నీవు అంటారు.ఎంతో గొప్పవారైన వారు కూడా సేవించే ఆదిశక్తివి నీవు, ఆదిగురువులకు కూడా శక్తినీ, స్పూర్తినీ ఇచ్చే తల్లివి, సమస్త సంకటాలను తీర్చే దానివి, గురుగుహుడికి ( దీక్షితార్) ఎంతో అనుకూల మైనదానివి. సృష్టి, స్థితి లయలకు మూల కారణమైన దానివి..నీ మహిమలచేత, గొప్పదనం చేత త్యాగరాజ స్వామిని  మైమరపించినదానివి..బంగారు వలువ ధరించిన కృపామయమైన మనసు కలిగిన శంకరివి. కలువరేకులవంటి విశాల నేత్రాలు కలిగి, పద్మ రాగ మణి మాలతో శోభిల్ల్లుతూ  శంకరునితో కీర్తించ బడుతూ, సదా సుమధురమైన సంగీతంతో విరాజిల్లే శారదవి అని కీర్తిస్తారు. 


            చరణం: సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తి జాలే, సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే
            సంకట హర ధురీణాతర గురుగుహానుకూలె, సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాదికాలే
            విటంక త్యాగరాజ మోహిత విచిత్రానుకూలె, శంకరి కృపాల వాల హటకా మయ చేలే 
            పంకజ నాయన విశాలే పద్మరాగ మణిమాలే, శంకర సన్నుత జాలే, శారదా గాన లోలె..    {శ్రీ}

ఎంతో భావోద్వేగంతో, అమ్మవారిని అణువణువూ ప్రస్తుతిస్తూ సాగే ఈ కీర్తన చాలా,  చాలా బావుంటుంది. శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ ఎప్పటిలాగే రకరకాలుగా అమ్మవారిని ప్రస్తుతిస్తూ,  సంస్కృతంలో రాసిన గీతం ఇది.ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. శ్రీ బాలమురళి పాడిన కీర్తన ఇదిగో. శ్రీ టీ.ఎం. కృష్ణ పాడినది ఇక్కడ
ఇదే రాగంలో చేసిన 'నన్ను విడచి కదలకురా' అన్న త్యాగరాజ  కృతి కూడా ఎంతో బావుంటుంది..నాకు చాలా ఇష్టం. ఇది నేను మొదటి సారి విద్వాన్. శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం గారి కచేరీ లో విన్నాను. ఆ తర్వాత  మహా విద్వాన్. మహారాజపురం సంతానంగారిది, భక్త పోతన సినిమాలో చిత్తూరు నాగయ్యగారు పాడినదీ కూడా.. అన్నీ బావుంటాయి.
ఇక ఈ రాగం లో చేసిన కొన్ని సినిమా పాటలు.
1 . శేష శైలా వాస.. శ్రీ వెంకటేశా.. వెంకటేశ్వర మహాత్మ్యం (పల్లవి)
2 . రామా కనవేమిరా..... స్వాతి ముత్యం 
3. కొంటె చూపుతో.. అనంతపురం 1980
4 . అందాల రాక్షసివే- ఒకే ఒక్కడు 

11 comments:

  1. అద్భుతంగా రాశారు. చాలా ఆనందంగా ఉన్నది.
    ఆలాపన మొదలు పెట్టీ పెట్టంగానే మనసుని ఊయలలూపే రాగాల్లో ఒకటి రీతిగౌళ. నాకు చాలా ఇష్టమైన వాటిలో ఒకటి కూడా.
    తమిళంలో ఒక రెండు కృతులు: పాపనాశం శివన్ గారి తత్త్వమరయ తరమా, అంబుజం కృష్ణగారి గురువాయూరప్పనే అప్పన్, త్యాగరాజస్వామివారిదే మరో గొప్ప రత్నం రాగరత్నమాలికచే

    తిరువారూరులో వెలసిన శ్రీత్యాగరాజేశ్వరస్వామివారి దేవేరి నీలోత్పలాంబ. ఆ వూరివారే అయిన దీక్షితులు ఈ అయ్యవారిమీద అమ్మవారిమీద అనేక కృతులు రచించారు.

    మరికొన్ని వివరాలకై ఈ కింది లంకెలు చూడండి.

    త్యాగరాజ యోగ వైభవం

    గోపుఛ్ఛ యతి

    దీక్షితుల రచనా దక్షత

    ReplyDelete
  2. జననీ నిన్ను వినా రాసినది సుబ్బరాయశాస్త్రిగారు. ఈయన శ్యామశాస్త్రులవారి కుమారుడు.
    పైన ఉదహరించిన దీక్షితుల కృతిలో శ్రీనగరము అంటే తిరువారూరు.
    అనుపల్లవిలో ప్రభంజన రీతిగౌరవే అనడంలో రీతిగౌళ రాగాన్ని సూచించారు.
    గురుగుహ అనేది దీక్షితులవారి ముద్ర. గుహన్ అంటే సుబ్రహ్మణ్యస్వామి. ఆయన కృతులలో గురుగుహ అని భావించేది స్వామినే, తనను కాదు. ఉదాహరణకి శ్రీమహాగణపతిరవతుమాం కృతిలో గణేశుని "గురుగుహాగ్రజం" అని సంబోధిస్తారు.

    I sincerely hope you write lot more posts about your favorite songs like this.

    ReplyDelete
  3. సంగీతం విషయంలో నేనూ మీలాగే.. మీరు చెప్పిన పాటల్లో కొన్ని మాత్రం వినగలిగాను.. టైం రావాలేమోనండీ..

    ReplyDelete
  4. చాల బాగా రాసారు ! ఆ బ్లూ కలర్ పువ్వు పోస్టు కు తగ్గట్లు గా బావుంది .

    ReplyDelete
  5. రీతి గౌళలో "జో జో జో రామా," అనే త్యాగరాజ కీర్తన కూడా చాలా సరళంగా, చాలా బాగుంటుందండీ!
    దీక్షితార్ వారు తన కృతుల్లో రాగం పేరు తప్పక ఉపయోగిస్తారు. అయితే అలా ఉపయోగించని కృతులు నాకు తెలిసి,
    "గజానన యుతం" (చక్రవాకం), "పామర జన పాలిని"(సిం హేంద్ర మధ్యమం). ఇంకా ఎవైనా వున్నాయా?
    శారద

    ReplyDelete
  6. ధన్యవాదాలండీ, మంచి విషయాల్ని పంచుకున్నందుకు.

    ReplyDelete
  7. చాల బాగుంది. ఈ పాటని నేను వినలేదు. ట్.యం క్రిష్ణ గారి పాటలు నాకు చాల ఇష్టం .ఓకసారి ఆయన కచేరి చాల దగ్గరినుంచి వినడం జరిగింది .అందుకని. ఇంక ఇలాంటి మాకు తెలెయని విషయాల గురుంచి వ్రాస్తూంటరని ఆషిస్తున్నాను
    అంజని దుడ్డు

    ReplyDelete
  8. @కొత్తపాళీ గారూ.. ధన్యవాదాలు. మీరిచ్చిన లింక్ లు చాలా చాలా బావున్నాయి.. అలాగే మీరు అందించిన వివరాలు కూడా. మీరు చెప్పినట్టు దీక్షితార్ తన ముద్ర 'గురుగుహ ' ని చాలా సందర్భోచితంగా వాడతారు అనిపిస్తుంది. నాలాంటివారికి ఆ ముద్ర వల్లనే సులువుగా తెలిసిపోతుంది అనుకుంటాను, ఫలానాది ఆయన కీర్తన అని. నన్ను విడచి కదలకురా, చేర రావదేమిరా . కూడా ఎంత బావుంటాయో.. ప్రియా సిస్టర్స్ పాడిన 'తత్వమరియా యూట్యూబ్ లో విన్నాను. ఇలాంటివి మరిన్ని పోస్ట్ లు రాయాలని నాకూ కూడా ఉంది. ధైర్యం చేసి తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తాను.

    @ మురళిగారూ.. థాంక్ యూ.. మిగతావి కూడా తప్పక వినండి.. ముఖ్యంగా నన్ను విడచి కదలకురా..

    @ శ్రావ్య గారూ.. థాంక్ యూ.. ' గాడెస్ పార్వతి ఇన్ బ్లూ లొటస్ ' అని గూగులమ్మ ని అడిగితే వచ్చిన వాటిల్లో ఇది ఒకటి.

    @ ఎస్. బీ. మురళి గారూ.. చాలా థాంక్స్ అండి.. ఈ వివరాలకు. ఈ కౄతి నేను వినలేదు.. తప్పకుండా వినాలి..

    @ మందాకిని గారూ.. ఈ టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషం..థాంక్ యూ..

    @ అంజని గారూ... థాంక్ యూ.. యూ ట్యూబ్ లొ కృష్ణ గారిది ఉంది. వినండి. ఆయన కచేరీలకి మేము రెగ్యులర్ గా వెళుతూ ఉంటాము. రెండు మూడు సార్లు ఆయనతో మాట్లాడే చాన్స్ కూడా దొరికింది నాకు. సరస్వతీ పుత్రులు వీరంతా..

    ReplyDelete
  9. @కొత్త పాళీ గారూ.. శ్రీ రాగం లో చేసిన కీర్తన 'మూలాధారా చక్ర వినాయక " లో కూడా 'అకళంక విభాస్కర.. విఘ్నేశ్వర, హర 'గురుగుహా సోదర.. లంబోదర " అంటారు.. మర్చిపోయాను ఇది నా మొదటి కామెంట్ లో రాయడం.

    ReplyDelete
  10. ఎంతో బాగుంది ప్రసీద గారు మీ బ్లాగు. చాలా వివరంగా చక్కటి బొమ్మలతో భలే వ్రాస్తున్నారు మీరు. i am happy to see this blog.

    ReplyDelete
  11. ధన్యవాదాలండీ తెలుగు అభిమాని గారూ.. Please keep visiitng..

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...