Thursday, June 16, 2011

సడి సేయకో గాలి.

  ఆషాడ మాసం వస్తోందంటే చాలు బెంగుళూరు లో విపరీతమైన గాలి వీస్తుంది. చాలా  వేగంగా, పెద్ద పెద్ద శబ్దాలతో. అప్రమత్తంగా లేకపోతె మనుషులు కూడా ఎగిరిపోతారేమో అన్నట్టుగా ఉంటుంది ఆ గాలి.  ఇది నాకు మేము హైదరాబాద్ నించి బెంగుళూరు వచ్చిన మొదటి  ఏడాది మా కొలీగ్ చెప్తే తెలిసింది.. ఆఫీస్ బిల్డింగ్ మేడ  మీద ఉన్న కాంటీన్ కి వెళితే అక్కడ కుర్చీలూ, ఒక్కోసారి బల్లలూ కూడా ఎగిరిపోయేవి ఎవరూ కూర్చోకపోతే. ( అదే జరిగి పోయేవి అన్నమాట). అప్పుడు తను  చెప్పింది.. 'ఆషాడ అల్వా.. ఈ తరానే గాలి బరోదు" అని..

'అరే.. ఆషాడ మాసం మన ఆంధ్రాలో కేవలం  ఈగలు బయటకు వచ్చే కీటక మాసం గానూ ( సంవత్సరమంతా జాగ్రత్తగా కూడబెట్టుకుని వర్షాకాలంలో బయటకు రాకుండా హాయిగా ఉండే చీమలు వర్సెస్ బద్ధకపు  ఈగలు కధ చిన్నప్పుడు చదువుకున్నాం కదా, 'సేవింగ్ ఫర్ ఎ రైనీ డే ' అనేది కూడా పాపం చీమల నించే వచ్చింది .. గేర్ మారిపోతోంది కదూ..వచేస్తున్నా..) 'ఆషాడం సేల్, ఒకటి కొంటె మరొకటో  , పద్నాలుగో ఫ్రీ అని ఊదరగొట్టే 'సేల్స్ మాసం గానూ , గోరింతాకూ, మునగాకూరాల మాసంగానూ,  కొత్త దంపతులని విడతీసే విలన్ మాసంగానే తెలుసు కదా మరి ఇలాంటి గాలికి మన ఆంధ్రా ఫేమస్ కాదా? అని చాలా ఆశ్చర్యపోయాను.  నిజంగా నాకు గుర్తు లేదు అక్కడ ఎప్పుడూ ఇంత  గాలి వచ్చినట్టు... సరే సాయి కుమార్ లా  'కట్ చేస్తే' గత కొన్నేళ్లుగా బెంగళూరు లో ఆషాడ మాసపు గాలికి అలవాటు పడ్డాము. అదెలా ఉంటుందో చూపిద్దామనే ఈ టపా.

  సూక్తిముక్తావళి, భక్తీ రంజని ఇలాంటివి వచ్చే టైము  కి ( ఇవి ఇంకా వస్తున్నాయో లేదో తెలీదు అనుకోండి అది వేరే..)    మెల్లిగా కళ్ళు తెరుస్తానా!  రయ్యని, జోరుగా  వీస్తూ ఉంటుంది అప్పటికే.. అంతకు ముందు కూడా ఉంటుంది కానీ మనం నిద్రలో ఉంటాం కదా..అందుకని మనకి పెద్దగా తెలీదు. అదన్నమాట. చిన్న పక్క వాయిద్యం..  ఈ మధ్యన ఎలెక్ట్రిక్ స్టార్  కి ఇష్టమైన భక్తీ పాటల రంజని అనో, బాబా సందేవ్ (some dev)  చెప్పిన సూక్తి ముక్తావళి అనో వస్తూ ఉండవచ్చు కూడా.

అప్పుడు మొదలు అన్నమాట.. "సడి సేయకో గాలి.. సడి సేయ బోకే.. బడలి ఇంట్లో వారు పవ్వళించేరే' అంటాను.. స్వర్ణకమలంలో శ్రీ లక్ష్మి చెప్పినట్టు తాళమూ కుదరాలి, వరసా చెడకూడదు కదా.. బడలి రాజూ, యువరాజూ పవ్వళించేరే అని అనాలని ఉన్నా సరే.. కుదరదు కదా, మనకా మాత్రం సంగీత జ్ఞానం ఉంది కనక అలా తెలివిగా, తాళం చెడకుండా పాట  మార్చేయగాలిగానన్నమాట.  గాలి మన చెప్పిన మాట వినదు కదా.. మరింత గట్టిగా అరుస్తుంది.. 

ఈ లోపున మా వాడు లేచి 'ఈ గాలీ , ఈ నేలా... ఈ ఊరు బెంగుళూరు.. ననుగన్న నా వాళ్ళూ'. అంటూ  మొదలు పెట్టాడు.   నిజమే.. వాడు ఇక్కడ పుట్టకపోయినా నాలుగేళ్ల వయసు నించీ ఇక్కడే పెరిగాడు. నువ్వు 'సెకండ్ జెనరేషన్ బెంగుళూరియన్ వి' అంటూ ఉంటాము మేము. సిలికాన్ వేలీ అఫ్ ఇండియా నా,  మజాకానా.?. ఐ. పీ. ఎల్ లో కూడా వాడి సపోర్ట్ ఆర్. సి. బీ కే. వాళ్ళు ఆడినా, ఓడినా సరే.

సరే..ఎక్కడున్నాం? ఈ లోపున తను లేచి.. ఈ గాలేమిటి? ఈ ఈలలేమిటి? అని 'పూలు గుసగుస లాడేనని,విర బూసేనని  . గాలి ఈలలు వేసేనని సైగ చేసెనని ఇక్కడే తెలిసిందీ.. అంటారు.. అప్పుడు నేను అవును.. రోజుకి కనీసం  ఒక కొత్త విషయం తెలుసుకున్నా మంచిదే అని. ' ఈ రోజు బిజీ  అయినదీ.. ఈ గాలి ఆషాడానిది ' లేవండి ఇద్దరూ.. అని తొందర పెడతాను. . అలా  దినచర్యలో పడతాము. 

'ఎచట నుండి వీచెనో ఈ చల్లని  (చలి?) గాలి' అందామన్నా, 'తూలీ సూలేను తూరుపు గాలి' అనుకుందాం అన్నా  కుదరదు.. ఆఖరి అంతస్తు. కార్నర్ ఫ్లాట్. ఎక్కడ నించైనా  రావచ్చు.. అందుకే.. 'గాలికీ కులమేదీ? ఏదీ.. దిశ ఏదీ? అని పాడేసుకుని సరిపెట్టేసుకుని. ఇడ్లీ  కి పచ్చడి రుబ్బేద్దామని మిక్సీ పెట్టానో లేదో.. దానిని మించిన శబ్దం.  'ఆమె చీర నా చీర కన్నా తెలుపా?' టైపు లో 'పక్కవాళ్ళ మిక్సీ నా మిక్సీ కన్నా పెద్ద సౌండా?" అనుకున్నానా?  .. కానీ తరవాత తెలిసింది..అది మిక్సీ సౌండ్ కాదు.  కిటికీ అద్దాల మీదా, కొద్దిగా తెరిచినా తలుపుమీదా మన పవనుడు పాడుతున్న పంతువరాళి రాగం అని. 

తప్పమ్మా..గాలేప్పుడూ  'పిల్లగాలి ఊదెను పిల్లనగ్రోవి' అన్నట్టుగా ఉండాలి కానీ ఇలా భీభత్సంగా, భయపెట్టేటట్టు  కాదు అన్నా. అయినా అది  వినదు కదా.  'గాలికదుపు లేదూ, కడలి కంతు  లేదూ,నన్ను ఆపడం నీ వల్ల కాదు ' అంటూ మరింత గట్టిగా  వీస్తుంది. దాని రాగానికి మా తలుపుల తాళాలు, కిటికీల లయలు, డోర్  స్టాపర్ల జతులు.   ఈ ఆషాడ మాసం పుణ్యమా అని మాకు ఏడాదికో రెండు డోర్ స్టాపర్లు విరిగిపోతాయి..రెండు సార్లు అద్దాలు పగిలాయి కూడా తలుపులవి..  ఈ సారి అందుకే అయస్కాంతపు సాధనాలు పెట్టిస్తున్నాం మరి. 

కింద నడవడానికి వెళితే మనుషులేగిరిపోతారేమో అన్నంత భయంగా ఉంటుంది. నా వాకింగ్ స్నేహితులలో ఒకరు మరీ సన్నగా ఉండడం వాళ్ళ మేమందరం 'ఏమంటున్నది ఈ గాలి? ఎగిరే రేఖని (తన పేరు) అడగాలి ' అంటూ ఉంటాం. ఈ లోపున ఇంకో స్నేహితురాలు,  'గాలి చిరుగాలీ నిను చూసినదేవరామ్మా ? అన్నారు కానీ ఇంతకంటే చూడడానికేముంది?, ఇలా అందరినీ ఎగరేస్తుంటే..అంటుంది . మేము నిజమే కదా అంటాం.  

రోజూ పేరుకు వాక్ కి, అసలైతే కబుర్లకీ రోజూ వచ్చే ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు పడుతున్న చిన్న చినుకులకి పరవశించి పోయి 'పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లీ' అని మొదలు పెట్టేస్తారు. పిల్లలు కదా, పిల్లగాలీ, వెండిమబ్బూ, చిరుజల్లూ అన్నీ వాళ్ళకోసమే అనుకోవడం .. సహజం, ..అందరూ తమకు తాము త్రిషలూ, శ్రియలమే అనుకునే వయసే అది కదా మరి. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లి ఈ గాలిలో.. ఓహ్.. ఎక్కడో అలజడి.. అని అనకుండానే మేము 'రాక రాక వస్తోంది   గాలివానా, తడవకుండా ఉండండిరా  ఇంటిలోన .' అంటూ వర్షం వస్తే జ్వరంవస్తుంది అని పిల్లలనందరినీ లోపలి తరిమేస్తాం. 

మాట వింటే వాళ్ళు పిల్లలేన్డుకవుతారు? ఇంకా వాన రావడం లేదు కదా అందుకనే.. 'ఎగిరే గాలిపటానికి దారం ఆధారం, ఈ గాలే మూలాధారం ' అంటూ ఇంకా ఎగరేస్తాం అంటారు మగపిల్లలు. ఈ సరికే.' కొండగాలి తిరిగింది.. గుండె ఇంటికి పొమ్మంది ' అని తొందరగా  ఆఫీసులనించి వచేస్తారు అందరూ, లేకపోతె 'గాలివానలో, వాన నీటిలో' అనుకోవాల్సిన దురవస్థ ఎదురవ్వడం ఖాయం... 'ఈదురుగాలికి మా దొరగారికి' అని తమ భర్తలని చూసి పాడేసుకుంటారు ఆడవారు. అంతలో విధిగా కరంట్ పోతుందా, . యూ.పీ. ఎస్ లు ఉంటె పరవాలేదు.. లేకపోతె 'సుడిగాలిలోన దీపం, కడవరకు వెలుగునా' అని ఓ కొవ్వోత్తో, మరొకటో ( ఇంకేమున్నాయబ్బా ఈ రోజుల్లో) వెలిగించుకుని భజన చెయ్యడమే.. అన్నట్టు దాని హోరులో మన భజన కూడా వినిపించదు. అంత ప్రచండమైన, ప్రభంజనం లా ఉంటుంది మా ఆషాడ మాసపు గాలి.

16 comments:

  1. భలే ఉంది సుభద్రా..కాని ఈ పాటల లింకులు కూడా పెడితే బావుండేది కదా.

    ReplyDelete
  2. థాంక్ యూ జ్యొతిగారూ. తప్పకుండా పెడతాను. టైం పడుతుంది కదా.. సాయంత్రం లొపల పెడతాను.

    ReplyDelete
  3. చాలా పాటలు గుర్తు చేస్తూ బాగా రాశారు బావుంది

    ReplyDelete
  4. మరీ పాటలు పాడుకునేంత గాలి వుంటుందాండీ ?
    బాగున్నాయి మీ గాలి పాటల కబుర్లు .

    ReplyDelete
  5. ఈ గాలులు రాయలసీమలో కూడా వస్తాయండీ. అక్కడ మాకు "గాలికాలం" అదనం. :-)

    ReplyDelete
  6. Brilliant.
    ఇంతహాయిగొలిపే గాలి వీయింపించినందుకు మీకో మలయమారుతం దక్షిణ.

    ReplyDelete
  7. లత గారూ.. థాంక్ యూ..
    మాలా గారూ.. థాంక్ యూ. నిజంగా మీరొకసారి వచ్చి చూడాలి.. నమ్మడానికి. ఎప్పుడొస్తున్నారు మరి??
    శ్రావ్య గారూ.. థాంక్ యూ.
    త్రివిక్రం గారూ.. మీకు కూడా ఉన్నాయన్నమాట ఈ గాలులు.. భలే భలే..
    కొత్త పాళీ గారూ.. ధన్యవాదాలు. చాలా రోజులకి వచ్చారు నా బ్లాగ్ కి..

    ReplyDelete
  8. శీర్షిక చూసి, నా ఆల్ టైం ఫేవరెట్స్ లో ఒక పాట గురించి రాసి ఉంటారనుకుంటూ వస్తే వరుసగా చాలా పాటలనే గుర్తు చేసేశారు!!

    ReplyDelete
  9. మీ గాలి పాటలతో అందరం ఆకాశానికి ఎగిరిపోయాం..
    ఎంత బాగుందో ఇక్కడ...

    ReplyDelete
  10. జ్యొతి గారూ.. లింక్స్ పెట్టేసాను..
    మురళి గారూ.. నాకు కూడా సడి సేయకో గాలి పాట చాలా చాలా ఇష్టం.. టపా మీకు నచ్చిందని ఆశిస్తాను.
    శ్రీ లలిత గారూ.. థాంక్ యూ..

    ReplyDelete
  11. చాలా చాలా బాగా రాసారు.

    ReplyDelete
  12. చాల బాగుంది ఈ గాలి బ్లాగ్ .ఇంత చిన్న విషయాన్ని పాటలతొ అల్లి ఒక కదంబగ చేసి ఆందించారు. చాల ఆహ్లదంగ ఉంది.మీ బెంగలూరు గాలిని మేము ఇక్కడనుంచే ఆస్వాదించాము.
    అంజని దుడ్డు

    ReplyDelete
  13. చాలా సరదాగా, బాగా రాసారండి. నేనెప్పుడో రాసుకున్న నా 'గాలి కబుర్లు' అనే పోస్ట్ కూడా నాకు గుర్తొచ్చింది.

    ReplyDelete
  14. సుభద్ర గారు,

    చాలా చక్కగా రాసారు. ఎన్ని గాలి పాటలు తెలుసో మీకు...

    కృష్ణప్రియ

    ReplyDelete
  15. శిశిర గారూ.. థాంక్ యూ..
    అంజని గారూ. బావుందా మా గాలి. బాగా ఆస్వాదించండి. మీ అభినందనలకి థాంక్ యూ.
    జయగారూ.. థాంక్ యూ.. మీ పోస్ట్ లింక్ ఇవ్వండి చదివేద్దాం
    కృష్ణప్రియ గారూ.. ఎడో అలా గాలికి పాడుకుంటే ఇన్ని గుర్తొచ్చాయి. ఇంకా రాస్తే మరీ ఎక్కువ అవుతాయేమో అని ఆపేసాను

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...