ఎనిమిదంటే ఎనిమిది కధలు.. అన్నీ ఆణిముత్యాలు. మళ్ళీ మళ్ళీ చదవాలని, మరెన్నో సార్లు తలుచుకోవాలనీ, కేవలం మనం చదివేసి ఊరుకోకుండా అందరితోనూ పంచుకోవాలని అనిపించే కధా రత్నాలు. చాలా సరళంగా, సుతిమెత్తగా, పౌర్ణమి నాటి వెలుగులో గోదారిమీద అలవోగ్గా తేలిపోయే వెన్నెల కిరణం లాంటి రచనా సరళి, ప్రతీదీ వేటికవే విలక్షణంగా కనిపిస్తూనే, నిత్యజీవితంలో ఎదురయే సంఘటనల లాంటి ఇతివృత్తాలూ, మన మధ్యనే కదిలే మనుషుల్లాంటి పాత్రలూ, సున్నితమైన హాస్యం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎక్కడా ఆగాలో తెలీదు నాకు.. ఎన్ని సార్లు చదివి ఉంటానో ఇప్పటికి.. పుస్తకం పేరున్న కధ అన్నింటికంటే చివర ఉంది కనక వెనకనించి రాసుకొచ్చాను.. ఇదో సరదా అనుకుందాం ఇప్పటికి.
1 . మిధునం: పుస్తకం శీర్షిక పేరే ఈ కధ పేరు. ఎన్నో దశాబ్దాల సంసార జీవిత రధాన్ని ఎంతో ముచ్చటగా కలిసి నడుపుకునే వృద్ధ దంపతుల కధ ఇది .. ఈ కధ రాసిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. ఇది చదివి బాపు గారు తన స్వదస్తూరితో రాసి ఇచ్చారుట. రచన పత్రిక వారు ముఖచిత్రంగా బాపు గారి బొమ్మ వేసి , వారి దస్తూరిలోనే ప్రచురించారు రెండుమూడుసార్లు (మొదటిసారి వేసినప్పుడే నేను ఈ కధ మొదటిసారి చదివాను ). కలిసి బతకడం సులువు.. కలిసి జీవించడం..జీవితాన్ని ఆస్వాదించడం చాలా కష్టం.. దాన్ని సాధ్యం చేసుకోవడమే అందమైన దాంపత్యానికి ఆధారం అని నేను అనుకుంటాను. ఈ కధలోని అప్పదాసుగారికీ, వారి సతీ మణి కీ తెలిసిన విషయాల పరిధి చాలా చిన్నది కావచ్చు.. దాంట్లోనే వారు తమకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరుచుకున్న తీరూ, రోజంతా ఒకరికోకరుగా మెసిలే విధానం, దానిలో దొర్లే వెక్కిరింతలూ, చతురోక్తులూ, చమత్కారాలూ..పాయసంలో జీడిపప్పు , కిస్మిస్ ల లా రుచిని మరింత పెంచుతాయి . ముగింపు మాత్రం ఆర్ద్రత తో కూడి మనసుని బరువు చేస్తుంది.. చాలా గొప్ప కధ. దీనిని సీరియల్ గా తీస్తే ఎలా ఉంటుందా? ఆ పాత్రలకి ఎవరు బావుంటారా? అనుకుంటూ ఉంటాను చాలా సార్లు.
2.పెళ్లి: సమకాలీన సమాజానికి అద్దం పట్టే చిన్న కధ. ఒకానొక ఆఫీసర్ గారి అమ్మాయి పెళ్లి నేపధ్యంలో రాయబడింది. అధికారం, హోదా దొరకగానే ప్రతీ ఒక్కరూ తమ పరిధిలో తమ కన్నా కింద స్థాయి ఉద్యోగులని ఎలా ఇరుకున పెట్టి తమ పనులు చేయించు కుంటారో, వారు కూడా పై అధికారుల ప్రాపకం కోసమో, మరే ఇతర మొహమాటాల వల్లనో లేని పోనీ ఇబ్బందులకి గురి కావడమూ కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. తాడిని తన్నేవాడు ఒకడైతే , వాడి తలని తన్నేవాడు మరోకడూ.. గుడిని మింగే వాడు ఒకడైతే , గుడినీ, లింగాన్నీ కూడా మింగేవాడు మరొకడు.. అన్న రీతికి అద్దం పడుతుంది.
3. బంగారు మురుగు: మానవతా వాది అయిన ఒక బామ్మగారూ, ఆ బామ్మకూచి అయిన బుల్లి మనవడూ, వీళ్ళిద్దరూ అమర్చుకున్న తమదైన ఒక చిన్న బాదం చెట్టు తొర్ర, ఆవిడ చేతిన ఉన్న బంగారు మురుగూ, దాని మీద కన్నేసిన కూతురూ, కోడలూ.. మనవడి పెళ్ళికోసం ఆవిడ నడిపిన మంత్రాంగమూ .. అది తెలుసుకున్న మనవడు పడే బాధా. వెరసి ఎంతో హృద్యంగా సాగే ఇది తప్పకుండా చదివి తీరాల్సిన కధ. బాదం చెట్టు నీడలో సేద తీరుతున్న బామ్మ మనవడి బొమ్మ ఎంత బావుంటుందో.. బామ్మగారు చెప్పే జీవిత సత్యాలు, మానవతా సూత్రాలు అంతే బావుంటాయి.
4. షోడా నాయుడు: మామూలు ఇతివృత్తాలతో ఇంత గొప్పగా కధ రాయవచ్చా అనిపిస్తుంది ఈ కధ చదివితే. ఒక్కసారి కాదు చదివిన ప్రతీసారీ. షోడా సీసా లో ఉండే నీలం రంగు గోళీ కాయ మీద ఒక చిన్న కుర్రాడు మోజు పడతాడు, కారణం అలాంటిది తన స్నేహితులందరి దగ్గరా ఉంది, తనకి తప్ప.. పీర్ ప్రెజర్ మరి.. అది సంపాదించడానికి సామ దాన, బేధ, చోరో పాయాలన్నీ ( దండం లేదు లెండి) పాటించినా ఫలితం ఉండదు... ఊరిలో ఉన్న షోడా నాయుడి వెనక తిరిగి కాళ్ళరుగుతాయే తప్ప. కాలక్రమంలో పట్నం లో చదువుకుని పెద్ద ఆఫీసరయి పోయిన ఆ కుర్రాడి దగ్గరకి అదే షోడా నాయుడు మరొక షోడా మిషన్ కోసం అప్పుకి రావడం, వచ్చినప్పుడు మర్చిపోకుండా నీలం గోళీకాయలు పొట్లం కట్టి తేవడం, అది ఇవ్వడానికి మొహమాట పడుతూ ఉండగానే ఆ మూట చేజారి అవన్నీ నేలమీద దొర్లడంతో కధ ముగుస్తుంది. నా బాల్యాన్ని పొట్లం కట్టి తెచ్చిన సిద్దుడిగా అనుకుంటాడు హీరో. నీలం గోళీ పిచ్చిలో కుర్రాడికి సూర్యుడు కూడా నీలం గోళీలా కనిపించడం, తన ప్రపంచమంతా షోడా మయమే అయిన నాయుడికి కువైట్ అయినా, కుగ్రామమైనా షోడా మిషనే ధ్యాసగా ఉండడం లాంటి విషయాలెన్నో ఎంతో హత్తుకుపోతాయి.
5. ధనలక్ష్మి: తెలివైన ఒక ఆడపడుచు చితికిపోయిన కుటుంబపు ఆర్ధిక స్థితినే కాదు, సంసారాన్ని కూడా ఎంత చక్కగా దిద్దుకోగలదో చూపించే కధ. పెద్ద చదువు లేకపోయినా, తనకున్న లౌక్యాన్నీ, వ్యవహార జ్ఞానాన్నీ, కష్టపడే తత్వాన్నీ మదుపుగా పెట్టుకుని అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో, 'మేనేజ్మెంట్ వారికి పాఠంగా పనికివస్తుంది 'అని తోటి పాత్రలచేత ఎలా అనిపించుకుందో చూపిస్తూ కధ నడిపిన తీరు ఎంతో హాయి కోల్పుతుంది. కార్పోరేట్ కంపెనీలు నడిపినంత శ్రద్దగా నడుపుతుంది ధనలక్ష్మి తన వ్యాపారాన్ని. అంతేకాదు 'అన్నీ ఉండి సంసారం లో సుఖం లేకపోతే ఏం లాభం? అంటూ చాకచక్యంగా భర్త ఈగోని కనుక్కుని సరి ఐన మార్గంలో పని సాధించుకుంటుంది.. ఆవిడ చెప్పే వ్యాపార సూత్రాలు నిజంగానే 'ఆహా' అనిపిస్తాయి. కొడిహళ్లి మురళీమోహన్ గారికధా జగత్ లో కూడా చోటు చేసుకుంది ఈ కధ.
6. వరహాల బావి: అందరికీ కన్నతల్లిలా అనిపించే వరహాలమ్మ, ఆవిడకి జాగీర్దార్ ఇచ్చిన ఈనాము, నీరు లేని ఆ రెండు ఊర్లకి ఆమె తదనంతరం ఆ ఇల్లు ఉన్న చోట తవ్విన బావీ కధా నేపధ్యం. గాజులబత్ అనే గాజులతని పరంగా సాగుతుంది. వరహాలమ్మ ని గౌరవించినంతగా ఆ బావిని అందరూ చూడటమూ, ఆవేశ కావేశాలకి లోనయి మతం పేరిట గొడవలు పడటమూ, గాజులబత్ వల్ల మళ్ళీ ఒకటీ కావడమూ కధని చక్కగా నడిపిస్తాయి. మంచి కధ. గాజులయ్యా, అతని మాటలు చాలా సహజంగా, ఆత్మీయంగా ఉంటాయి.
7. తేనెలో చీమ : పలుకుబడీ, ఆస్తి పాస్తులపరంగా ఇద్దరు పెద్దవారి మధ్యన నలిగిన ఒక బలహీనుడి కధ ఇది. వారిద్దరి మధ్య నడిచిన పందెం లో తన స్వేచ్చనీ, కావలసిన బ్రతుకునీ తుదకు తల్లినీ పోగుట్టుకుంటాడు శీనయ్య. అది మొదటిసారి తేనెలో ఇరుక్కోవడం. పందెం ముచ్చట తీరగానే వారు తనను పక్కకు నెట్టేస్తే బ్రతుకుతెరువు వెతుక్కుంటూ బావమరిది దగ్గరకి వచ్చి అక్కడ రౌడీలని తరిమి కొట్టినందుకు అందరూ మెచ్చుకుంటే మళ్ళీ తేనెలో ఇరుక్కున్నానా అని అనుమానం రావడంతో ముగుస్తుంది.
8. అరటిపువ్వు స్వాములారు: భలే చమత్కారంగా సాగిన కధ ఇది. రకరకాల ఉదాహరణలతో అరటిపువ్వుని వర్ణిస్తూ, అరటిపువ్వుని, వేదాంతాన్నీ కలిపి బహు చతురతతో స్వాములారు చేసే ప్రసంగాలూ, తరవాత అరటిపువ్వు వడలు వేసి ఫలహారం చెయ్యడం నవ్విస్తాయి. చివరికి ప్రజలకి తెలిసి స్వామివారికి బుద్ధి చెప్పడంతో ముగుస్తుంది.. చక్కెరకేళి కాదు రాజకీయ కేళి.. ఎమ్మేల్లెలందరూ మంత్రులు కానట్టే పూతలన్నీ కాయలు కావు.. లాంటి వాక్యాలెన్నో.
కొన్ని కధలు చాలా నచ్చితే, కొన్ని చాలా, చాలా నచ్చుతాయి.. బంగారానికి సంపెంగ పరిమళం అబ్బినట్టు కధకు అతికినట్టుగా వేసిన బాపు గారి బొమ్మలు మురిపిస్తాయి. అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.
చివరగా ఒక్కమాట. మిధునం కధ చాలా నచ్చి ప్రముఖ సాహితీ వేత్తా, చలనచిత్ర దర్శకుడు శ్రీ. ఎం. టి . వాసుదేవన్ నాయర్ ఈ కధ ఆధారంగా 'ఒరు ఉరి పుంజరి' (A Slender Smile) అనే పేరుతొ చలనచిత్రాన్ని రూపొందించారుట. అది ఎలాగైనా చూడాలని నా కోరిక. మిత్రులెవరైనా దీని గురించి తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి.
ఇలాంటి మంచి కధలని మనవారు కూడా చిత్రాలుగానో, సీరియల్స్ గానో నిర్మిస్తే చూడాలని ఆశ. సినిమా సంబంధ కార్యక్రమాలకి మించి విస్తరించని మన టీ .వీ చానెళ్ళ వారి ఆలోచన పరిధిలో వీటిని పాడు చేసే అవకాశమే ఎక్కువ ఉందేమో అని భయం కూడా. అందుకే వీటిని ఇలాగే వదిలేస్తేనే మంచిదేమో .. మన తలపుల్లో, ఊహల్లో ఎలాగైనా నిర్మించుకుని ఆనందించ వచ్చు కదా ..
మంచి పరిచయం.. అన్నట్టు 'తేనెలో ఈగ' కాదండీ, 'తేనెలో చీమ.' నాకెందుకో 'అరటిపువ్వు సాములోరు' అంతగా నచ్చదు. బాగా నచ్చినవి అంటే మిధునం, షోడా నాయుడు, బంగారుమురుగు మరియు ధనలక్ష్మి. అన్నట్టు ఒరు చిరు పుంజరి గురించి ఇక్కడ చూడండి.. http://navatarangam.com/2009/03/oru-cheru-punchuri1/
ReplyDeleteబావుంది...చాలా రోజులబట్టీ నేను మిధునం పుస్తకం గురించి రాయాలనుకుంటూ ఉన్నాను, కుదరలేదు. మీరు రాయడం బావుంది. నాకు బాగా నచ్చిన కథలు మిధునం, షోడానాయుడు, బంగారు మురుగు.
ReplyDeleteశ్రీ రమణ గారి హాస్యజ్యోతి, పేరడీలు, గుత్తొంకాయ-మానవసంభందాలు చదివారా?
మురళిగారూ..మీకు నా కృతజ్ఞతలు తప్పు గుర్తించినందుకు, ఒరు ఉరు పుంజరి లింక్ ఇచ్చినందుకూ. పొరపాటున ఈగ అని రాసాను, ఇప్పుడు సవరించాను. నాకు కూడా మీరు చెప్పిన కధలు చాలా ఇష్తం ( ఇవి చాలా బాగా నచ్చినవి). అరటిపువ్వు కధలో అరటిపువ్వునీ, ఆధ్యాత్మికతనీ పోల్చి పోలికలు చెప్పడం బావుంటుంది.కధాపరంగా అదీ, పెళ్ళీ కొద్దిగా వీక్ అనే చెప్పాలి.
ReplyDeleteసౌమ్య గారూ. థాంక్ యూ. మీరె చెప్పిన కధలే నాకు కూడా చాలా ఇష్టం. మీరు చెప్పిన వాటిల్లో అన్నీ చదవలేదు. ఈ సారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. మీరు ఈ పుస్తకాలగురించి పరిచయం రాయండి. బావుంటుంది.
This comment has been removed by the author.
ReplyDeleteబావుందండి. చాలా మంచి విశ్లేషణ. నాకీ పుస్తకంలో "బంగారు మురుగు", "మిధునం" రెండూ బాగా నచ్చుతాయండీ. చాలా రోజులైంది. పుస్తకాన్ని మళ్ళీ తిరగెయ్యాలనిపిస్తోంది మీ టపా చూశాకా.
ReplyDeleteశ్రీ రమణ గారు ఈమధ్యన రేడియోలో "మన తెలుగు" శీర్షికలో "జనపదాలు" అని కనుమరుగౌతున్న కొన్ని తెలుగు పదాల గురించి కొన్ని వారాలపాటూ ఉపన్యాసాలు చేసారు. ఐదారు వారాలు విన్నాం మేము. చాలా బావున్నాయి. అవన్నీ అక్షర రూపంలో కూడా వస్తే బావుంటుంది అనుకున్నాము.