Sunday, July 10, 2011

నీలేకనీ గారి ఆధారం మాకు దొరికిన విధంబెట్టిదనిన...

  అన్ని శనివారాలలాగానే ఆరోజూ మామూలుగానే తెల్లవారింది.. 'ఆహా.'. అలా అని నేను అనుకున్నాను. కానీ కాదేమో మరి.. ఎప్పటిలాగే వేడిగా ఫిల్టర్ కాఫీ తాగుతూ, తాపీగా పేపర్ చదువుతున్న తను ఒక్కసారిగా ' సుభద్రా!.. వచ్చేసింది.. మనకీ వచ్చేసింది.. ' అని గట్టిగా అనే (అరిచే)సరికి నాకు మహా అనుమానం రానే వచ్చేసింది.. 
    "లాటరీ టికెట్లూ వగైరాలూ కొనే అలవాటు మనకి లేనే లేదు..అందుకని అది మనకి వచ్చే ఛాన్సు  లేదు.. అయినా చెప్పలేము కదా. మీ ఫోన్ నెంబర్ కి అద్భుతమైన ప్రైజ్ తగిలింది, లేద మీ మెయిల్ కి రాండం గా బహుమతి వచ్చింది.. అలాంటివి నిజమైనట్టు గా భ్రాంతి.. చిత్త భ్రమ.

 నా దగ్గర కట్టలు కట్టలు గా డబ్బు మూలుగుతోంది, నాకేమో కేన్సర్ అని డాక్టర్ లు చెప్పారు. పొయేముందు ఎదైనా మంచి పని (  నిజమా?) చేసి పోదామనీ, ఎందుకూ పనికిరాని నా ఈ సంపదనంతా నలుగురికీ పంచుదామని నిర్ణయించుకుని మీకు రాస్తున్నాను. మీ వివరాలు ( అంటే బాంక్ అకవుంట్ అని మాత్రమే అర్ధం) నాకు పంపితే మా అటార్నీ మీకు నా సంపదలో ఒక వంతు ఉదారంగా ధారాదత్తం చేస్తారు.. లాంటి మెయిల్స్ ని పాపం ఇప్పటివరకూ అబద్ధ్దం అనుకున్నాను, కానీ ఏ పుట్టలో ఏ పాముందో? అలా ఈ మధ్యన మనం కొన్న న్యూస్ పేపర్ లకి కూడా ప్రైజ్ లు వచ్చేస్తున్నాయేమో అని..దురాశ.. అలాంటిదేదైనా వచ్చేసిందేమో!  లాంటి రకరకాల అయిడియాలు నా మట్టిబుర్రలో మణిదీపాల్లా వెలగడం మొదలుపెట్టి, ఆ పరాకు లో నేను వెంటనే స్పందించలేదు.  

దానికే వెంటనే.. సుబ్స్..వింటున్నావా? 'కర్నాటకకీ, బెంగుళూరు కీ వచ్చేసింది అని తను.. కిచెన్ లోంచే " ఏం వచ్చింది?' అన్నాను.. పెద్దగా అర్ధం కాకపోయినా అది కేవలం  మాకు మాత్రమే వచ్చినది కాదని , ఇందాకటంత ఆలోచనా, ఆనందం అవసరం లేదని తెలిసిపోయింది కదా.... ఇంక అప్పుడు మెల్లిగా "అదే ఏమిటి? మాన్సూనా? సముద్రం లేదు కదా, సునామీ వచ్చే చాన్స్ లేదు.. మరింకేమిటి వచ్చిందన్నాను.. 

  'ఆధార్ ఎన్రొల్ మెంట్ వచ్చేసింది.  యు.. నో.... యు.. ఐ.. డీ...యురేకా అనడం ఒక్కటే తక్కువ..  మా వారికి ప్రభుత్వం వారు చేసే ఇలాంటి పనులంటే మహా, చాలా, గొప్ప ఇష్టం.. అది పన్నులైనా, ఎన్నికలైనా, వోటర్ కార్డు లైనా, ఎప్పుడూ ఏమీ ఇవ్వని రెషన్ కార్డు లైనా.. అవి రాగానే వచ్చినవి వచ్చినట్టే అమలు లో పెట్టేయడం లో క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు.. ఎక్కడెక్కడినించో ఉత్సాహం తన్నుకు వచ్చేస్తుంది. ఆ ఉరకలేసే ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ చూసి తీరాలి కానీ వర్ణించనలవి కాదు..

మళ్ళీనా? ..అనుకోకుండానే ఇంతకుముందు మేము ఇలాంటి కార్డు ల కోసం చేసిన ప్రయత్నాలు గంగలో సుడిగుండాల్లా కళ్ళముందు గుండ్రాలుగా తిరగసాగాయి.. 

మా మొట్టమొదటి ఉనికి పత్రం: అప్పుడెప్పుడో మా పెళ్ళి అయిన కొత్తల్లో అన్నమాట... ఒకరోజు తను చాలా సీరియస్ గా.. "మనం రేషన్ కార్డు చేయించుకోవాలి" అని  అనగానే.. "అవును" అని క్లుప్తంగా అనడం తనకి అస్సలు రుచించలేదు. అలా అన్న రెండురోజులకి వరంగల్ లో ఉన్న వాళ్ళ కుటుంబపు కార్డు లోంచి తన పేరూ, మచిలీపట్నం నుంచి బొంబాయికి బదిలీ అవుతున్న మా కార్డు లోంచి నా పేరూ తీసేసినట్టుగా సదరు గవర్నమెంట్ వారి ఉత్తరాలు పట్టుకొచ్చేయడమూ, ఆ రెండింటినీ జతపరిచి మేము కొత్త కార్డు తీసుకోవడమూ క్షణాల్లో జరిగిపోయాయి.. అంటే నేనేమీ పెద్దగా చెయ్యలేదు కనక అలా క్షణాల్లో జరిగినట్టు నాకనిపించింది అన్నమాట. 

ఆ తర్వాత వాళ్ళు నెలకొకసారి ఇచ్చే రెండు కేజీల చక్కెర ఎక్కడ దాచుకోవాలో, ఏం చేసుకోవాలో తెలిసేది కాదు మాకు. తెలిసినవారికీ, చుట్టాలకీ ఇచ్చేవాళ్ళం లేకపోతే మా ఇంట్లో చీమల పుట్టలో, వంట్లో మధుమేహాల చిక్కులో వస్తాయేమో నన్న భయంతో.. గేస్ నూనె తెచ్చుకుని రోజూ నా పేరుమీద పొయ్యి వెలిగించుకునేది మా పని అమ్మాయి.. ఈ మాత్రం దానికి ఈ కార్డు ఎందుకు అంతే.. ఒక అజ్ఞానికి జ్ఞానదానం చేస్తున్నట్టు మొహం పెట్టి.. 'ఇది మన ఐడెంటిటీ కార్డు' అంతేకానీ ఈ చక్కెర, ఉప్పూ ముఖ్యం కాదు అని తను చెప్పగానే..'ఒహో అలాగా' అనుకున్నాను. అయినా ఆ గులాబీ రంగు కార్డు బావుండేది లెండి..అది మా మొదటి ఉనికి పత్రం..
మరి బెంగుళూరు లో ఉనికి??: ఇది రెండోది.. ఇలా సామాన్లు సర్దుకున్నామో లేదో.. మొదలు. మన రేషన్ కార్డు ఇక్కడకి మార్చుకోవాలి.. లేకపోతే మనకి అయిడెంటిటీ కష్టం.. మళ్ళీ అదే పని.. సెలవు పెట్టుకుని మరీ హైదరాబాద్ వెళ్ళి పని సాధించుకుని వచ్చాము ( నేను సరదాగా హైదరాబాద్ వెళ్ళాను అనే ఈ మాటకి అర్ధం). అలా బెంగుళూరు లో మా ఉనికీ, ప్రస్థానం మొదలయ్యాయి  అన్నమాట. ఇంక అక్కడనించీ గేస్, టెలీఫోన్ దేనికి కావాలన్నా చాలా గర్వంగా మేము రేషన్ కార్డు కాపీలు జతపరిచెయ్యడమూ, ఆఫీస్ లో కొలీగ్స్ 'ఓ మీకు కార్డు ఉందా? హౌ నైస్? అంటే చాలా కాజువల్ గా భుజాలు ష్రగ్ చెసి.. ' యా.. ఉంది.. వి బిలీవ్ ఇన్ ఆల్ థీస్ థింగ్స్ వెరీ సీరియస్ లీ యూ.. నో.. అని స్టయిల్ గా చెప్పేసి,  మోర్ సో శ్రీనివాస్ .అని చాలా ఉదారంగా క్రెడిట్ తనకే ఇచ్చేసేదాన్ని.  మంచి భార్యని కదా..

పెద్దాపురం చేంతాడంత క్యూ..
తర్వాత కె.వీ లొ: వోటర్ ఐ.డీ కార్డు లు ఇస్తారుట.. ఇది అందరూ తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలో? ఇక ఇప్పటి నించీ ఇది దేశంలోని ప్రతీ వ్యక్తికీ ఐ.డీ ( ఒహో!) అని పేపర్లూ, టీ. వీ చానెళ్ళూ కోళ్ళై కూసేసరికి.. మేము ఊరుకునేది ఎలా? వెంటనే వెళ్ళి కావలసిన తతంగమంతా కానిచ్చేసాం. నాకు మా ఇంటి దగ్గర ఉన్న కేంద్రీయ విద్యాలయంలో సెంటర్. ఎప్పుడు చూసినా అక్కడ పెద్దాపురం చాంతాడంత క్యూలు. ఆఫీస్ పక్కనే కావడంతో మధ్యలో రెండు మూడు సార్లు వచ్చి చూసినా దాదాపు రోజంతా అదే పరిస్థితి. అప్పుడు ఆఫీస్ పనిమీద జపాను, అమెరికా వెళ్ళిన తనకి ' మనసంతా నువ్వే 'అన్నట్టు ఈ కార్డే నిండి ఉండడాన్ని గురించీ, వారిచ్చిన వ్యవధిలో తను దాన్ని చేయించుకోలేకపోవడం వల్ల కలిగిన బాధ గురించి నేను చెప్పలేను. 
లెక్చర్
 'ఎప్పుడో ఒకప్పుడు చేయించుకోవడమో,  లేకపోతే నేనెంత బాధ్యతా రాహిత్యం కల పౌరురాలినో? అన్న దానిమీద ఇంట్లో లెక్చర్ వినడమో.. ఇవే నా ముందున్న రెండు మార్గాలు.. తెలివైనదాన్ని కనక తేలికైనది ఎంచుకుని.. లైన్ లో నిలబడ్డాను. హీనపక్షం మూడు గంటలు సాగిన ఆ చాంతాడు.. ఇంక మరీ తెగేవరకూ లాగితే బావుండదన్న భయంతో నాకూ ఆ కుర్చీపీట మీద కూర్చునే చాన్స్ ఇచ్చింది. 'మేరా భీ నంబర్ ఆయేగా' అని నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్న నేను గబ గబా ఫోటో తీయించేసుకున్నాను.
'ఆ హడావుడిలో జుట్టు సరిచేసుకున్నానో? మెళ్ళో గొలుసు కనిపించేలా  చేసుకున్నానో ,  లేదో?'   అన్నీ మర్చిపోయాను. ఇవన్నీ     క్యూ లో ఖాళీగా ఉన్నప్పుడు వేసుకున్న ప్లాన్ లు మరి..  ఇంక కార్డు వచ్చేవరకూ ఎదురుచూపులు.. ఒకరోజు మా కార్డులు రానే వచ్చాయి.. అయితే అందులో ఫొటో నాది.. పేరు మరెవరిదో? ఇంక ఎడ్రస్ దాకా వెళ్ళకుండానే నీరసం వచ్చింది నాకు. ఇలాంటి తప్పులు చాలానే వచ్చాయి కనక ఇచ్చిన కార్డు లు అన్నీ తీసేసుకుని మళ్ళీ కొత్తవి ఇస్తామని చెప్పారు.. తర్వాతెప్పుడో నేను మర్చిపోయాకా ఇచ్చారు లెండి..

కొన్నేళ్ళకి మళ్ళీ కొత్తగా: అది జరిగిన కొన్నేళ్ళకి మళ్ళీ రెండు మూడేళ్ళక్రితం పాతవన్నీ చెల్లవు.... మళ్ళీ కొత్తగా ఇస్తాము.. అందరూ వచ్చి కుఠోలు దిగండి అని గవర్నమెంట్ వారు హుకుం జారీ చేసారుట.. అంతే మళ్ళీ మా ఇంట్లో హడావుడి మొదలు. ఈ సారి ఆన్ లైన్ లో వివరాలన్నీ చూసేసుకుని, అందరికీ చెప్పేసి మాకు చెప్పిన సెంటర్ దగ్గరకి వెళ్ళిపోయామా? అక్కడ ఉన్నంత గందరగోళం బహుశా ఎక్కడా ఉండదు.. ఎడ్రస్ లు మార్చుకునేందుకొక క్యూ, పేర్ల లో తఫ్ఫులుంటే దానికొక క్యూ, ఫార్మ్ లు ఇచ్చేందుకొక క్యూ.. అసలు కార్యక్రమానికొక క్యూ.. ఫోనుల్లోనూ, మాములుగానూ మాటలాడే శబ్దాలతో హోరెత్తిపోతోంది ఆ ప్రాంగణమంతా. 
సాఫ్ట్ వేర్ లో బగ్
దాదాపు రెండు గంటలు నించున్నాకా ' సాఫ్ట్వేర్ లో బగ్ ఉంది.. అది వివరాలని సరిగా ప్రింట్ చెయ్యడం లేదు కనక.. ప్రస్తుతం ఆపేసాం అని చావు కబురు చల్లగా చెప్పినప్పుడు ఏంచెయ్యాలో తెలియలేదు. పైగా ఆ ఆఫీసర్ 'ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టూ యూ.. వాట్ సాఫ్ట్ వెర్ ఈస్.. ఎండ్ ద బగ్ ఈస్ అని అమాయకంగా అంటున్నప్పుడు.. 'నిజమా? అనుకుని జాలిపడ్డాం తప్ప.. మాకూ తెలుసు అని అతని అమాయకమైన వదనారవిందాన్ని చూస్తూ చెప్పలేకపోయాం. 

అలా మూడు సార్లు తిరిగి.. ఆఖరుకు మా భాగ్యవశాన ఒక శుభదినాన ఆ బగ్ ఫిక్స్ అయ్యి అన్నీ సరిగ్గా పని చేస్తున్నాయి అని తెలిసిన తర్వాత.. మళ్ళీ వెళ్ళి క్యూలో నిల్చుని.. అక్షరాలా నాలుగు గంటలూ, రెండు బిస్కెట్ పాకెట్ల తర్వాత ( పొద్దున్నే వెళితే క్యూ ఉండదు అని వెళ్ళిపోయాము కదా) ఫొటోకార్డు లతో బయట పడ్డాము. నా ఫోటో బాగా వచ్చింది కనక అప్పటి వరకూ అయిన ఆలస్యాన్నీ, శ్రమనీ క్షమించేసాను.. 

ఇప్పుడు  మళ్ళీనా ????: ఇన్ని గుండ్రాలు తిరిగాకా, మళ్ళీ ఇంకో కార్డా? అని భయం వేసింది నాకు. భూమి గుండ్రంగా ఉంటుంది అనే ప్రాధమిక భౌగోళిక సూత్రాన్ని మర్చిపోతే అంతే మరి.. నందన్ నీలేకనీ గారు ఢిల్లీ వెళ్ళే ఈ అవకాశం వచ్చినప్పటినించీ అన్నీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం కనక 'ఈ రోజు ఎప్పుడో వస్తుంది అని తెలుసు'  కానీ అది వచ్చేసరికి నాకు నీరసం వచ్చింది.. నిజం చెప్పాలి కదా మరి..కానీ మన దేశ ఘనతని ప్రపంచానికి చాటిన నారాయణ మూర్తి గారన్నా, వారి అనుంగు శిష్యుడు నందన్ గారన్నా మాకెంతో అభిమానం కనక వారి ఆజ్ఞ శిరసా వహించాల్సిందే..

   పేపర్ లో చదివిన తక్షణం స్కూటర్ మీద ( కార్ అయితే ట్రాఫిక్ లో చాలా టైం వేస్ట్ అవుతుంది) వెళ్ళిపోయి హెచ్. ఏ. ఎల్ పోస్ట్ ఆఫీస్ చేరాము.. అక్కడ అందరూ కార్డు   లు, కవర్ లూ కొనుక్కోవడమూ, వాటికి గమ్ము రాస్తూ చుట్టూ ఉన్న గోడలకీ, కుర్చీలనీ కూడా జిగురుతో పావనం చెయ్యడమూ లాంటి మామూలు కార్యక్రమాలు తప్ప మరేమీ జరగక పోవడం తో మాకు అనుమానం..'అడిగితే కానీ అమ్మైనా పెట్టదు మరీ పోస్టల్ వాళ్ళు ఎలా పెడతారు?' అని అడిగేశాం.. వాళ్ళు మా దగ్గర ఏమీ లేవు.. మీరు కార్వీ ( రెండు వీధుల అవతల ఉన్న ఆఫీస్) కి వెళ్ళండి.. అక్కడ కూడా ఇస్తున్నారు ( ఇక్కడ ఇవ్వడం లేదు అన్న విషయం మర్చిపోయి) అన్నారు. 

"అప్పటికే.. ఇది చాలా ముఖ్యం.. ఇంచుమించు మన జీవనాధారం, అందుకే దీనికి ఆధార్ అని పేరు పెట్టారు. 'దిస్ ఈస్ గొయింగ్ టు బీ.. యువర్ యూనిక్ ఐడెంటిటీ"  లాంటివి చాలా వినేసాను కనక.. నోరు మూసుకుని వెనకాల కూర్చున్నాను స్కూటర్ మీద.. కార్వీ లో వెళ్ళి ఆ ఫార్ము తెచ్చుకున్నాం.. 'అది జాగ్రత్తగా పట్టుకో! మధ్యకి మడతపెట్టకు ( అక్కడికి దాని ఇస్త్రీ మడత పోతున్నట్టు), ఎగిరిపోతుందేమో చూడు.. లాంటి ఎన్ని జాగ్రత్తలో.'. దారిలో ఆగి. మాముగ్గురికీ, మా ఫ్లాట్స్ లో మాకు బాగా క్లొజ్ అయినా వారికోసం ఒక డజన్ వరకూ కాపీలు తీయించేసాం.. అలా మొదటి అంకం పూర్తి అయింది.. 
'మడిసన్నాకా కూసింత కాలా పోసనా, సంగ సేవా (రెండోది నా నా సొంత కవిత్వం. రమణగారిది కాదు) ఉండాలి కదా. బొత్తిగా ఏం తిని తొంగుంటాం చెప్పండి..' అందుకని.. ఆ వొరిజినల్ మా బిల్డింగ్ మేనెజర్ కి ఇచ్చి.. 'ఇదిగో ఇలాంటి ఫలానా అతి ముఖ్యమైన కాగితం తెచ్చి ఇక్కడ పెట్టాము.. కావలసిన వారు తీసుకుని కాపీలు చేసుకుని వొరిజినల్ మళ్ళీ అక్కడే పెట్టేయండి 'అని మా బిల్డింగ్ వే, రకరకాల మెయిల్ గ్రూప్ లలో మెసెజీ లు పంపేసాం.. అంతేకాదు.... అది ఎలా నింపాలో, ఎక్కడ ఇవ్వాలో కూడా చెప్పేసాం .. 
"యూ గైస్ ఆర్ గూడ్ యార్... ఎప్పుడూ ముందుంటారు ఇలాంటి వాటిల్లో"అని సాయంత్రం వాక్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అంతే.. చాలా హుందాగా తీసుకున్నాను ఆ కాంప్లిమెంట్స్.. "అందుకే నిన్ను మళ్ళీ కమిటీలో ఉండమనేది.. లేకుండానే యూ థింక్ సో మచ్ అబవుట్ కమ్యూనిటీ"  అనేసరికి మాత్రం నిజం చెప్పద్దూ,.నేలకి రెండించెల పైన నడిచేసాను..
ఇంక అక్కడనించీ మొదలు.. "నీది ఐ.డీ ప్రూఫ్ లేదు.. అని మొదటి బాంబు పడింది నా మీదా, మా వాడి మీదా. " "ఇంతకుముందు దానికోసమే కదా అన్ని తతంగాలు జరిపాము, అన్ని రకాల కార్డ్ లూ గట్రా తెచ్చుకున్నాము"  అంటే.. ఒక దానిలో ఎడ్రస్ వేరే ఉంది, మరొక దాంట్లో మా వాడి బాగా చిన్నపటి ఫొటో ఉండడం ఇలాంటి కారణాలు చాలా బయట పడ్డాయి..
ఆఖరికి ఈ మధ్యనే ( అంటే ఓ మూడున్నరేళ్ళని అర్ధం) రెన్యూ చేయించి పాస్ పోర్ట్ లో కూడా మేము అద్దెకున్న ఫ్లాట్ ( ఇదే కాంప్లెక్స్ అయినా సరే, అది గవర్నమెంట్ కి కుదరినా కుదరవచ్చు కానీ తనకి మాత్రం కుదరదు) ఎడ్రస్ ఉందిట.. 'అన్నీ మనం అనుకున్నట్టు జరిగిపోతే దాన్ని జీవితం అనరు కదా అని నేను వేదాంత సూక్ష్మాలు గ్రహించడంలో బిజీ అయిపోయాను....
మా వాడికి.." నువ్వు కాలీజీ నించి బొనాఫైడ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి నాన్నా", అని చెప్పారుట వాళ్ళ నాన్న..
ఓ రెండు రోజులు దాన్ని తీసుకురావడం కుదరలేదని విసుగు.. ఇలా కొనసాగి ఒక రోజు వాడు తీసుకొచ్చాడు.. " మా! ఐ మేడ్ డాడీస్ డే!" అంటూ.. 
ముందు సంతోషించినా " కాలేజీ స్టాంప్ వేసారు, స్కూల్ లెటర్ హెడ్ మీద ఇచ్చారు.. "అని మళ్ళీ విసుగు.ఈ లోపున నాకు కూడా హౌసింగ్ అగ్రీమెంట్ లాంటిదేదో సెట్ అయ్యింది

ఆ రోజు రానే వచ్చింది: "రేపు లేట్ గా లేస్తే కుదరదు.. ఆలస్యం అయితే అక్కడ రష్ పెరిగిపోతుంది. బై 8.45 వి షుడ్ బీ థేర్ "అని హెచ్చరిక. పొద్దున్నే నేను ఓపెన్ మసాలా దోశెలు, క్లోసెడ్ మసాలా దోశెలు వేస్తూ బిజీగా ఉన్నానా? ఏం బట్టలు వేసుకోవాలి? అని తండ్రీ , కొడుకూ చర్చ.. 
"ఇది  లైఫ్ లాంగ్ ఉండే కార్డు..సో యు షుడ్ లుక్ గుడ్.. నువ్వు కాలర్లేని టీ.. షర్టు వేసుకోవద్దు అని మా వాడినీ, తన ఫార్మల్ షర్టు  లు అన్నీ లైట్ గా ఉంటాయి కనక అప్పుడెప్పుడో రెండు లీ జీన్స్ కొంటే వచ్చిన బ్లూ చెక్స్ లీ షర్టు వేసుకుంటానని చెప్పేసరికీ నేనూ మా వాడూ కింద పడిపోయాం. అన్నీ లైట్ కలర్సూ , పిన్ స్త్రైప్స్ తప్ప వేరేవేమీ వేసుకోడానికి ఇష్టం ఉండదు తనకి..
ఈ లోపున నేను.. 'ఆ!  వెబ్ కెమెరాతో తీసే ఫోటోలో అంతగా ఏం కనబడతాయి? అన్నాను.. 
"లేదు లేదు.. ఇది హై టెక్ లో ఉంటుంది" అనడం.. అక్కడికి తనేదో ఆ కెమెరాలూ అవీ దగ్గరుండి సెలెక్ట్ చేసినట్టుగా,, అంతేకాదు. నీ బ్లూ సిల్కు ఫాబ్ ఇండియా టాప్ వేసుకో బావుంటుంది..నాకు సలహా..తను అలా అన్నప్పుడు..
ఒహో, ఆధార్ కార్డు అంటే భార్యా భర్తలు మేచింగ్ బట్టలు వేసుకోవాలేమో? అని కూడా అనుమానం వచ్చింది.. తనతో అనలేదు కానీ.. అలా మొత్తానికి రెండు మంచినీళ్ళ సీసాలూ, రెండు బేగ్ లూ, రెండు గొడుగులూ కార్లో పెట్టుకుని బయలు దేరాం.దోశెలు లాగించాం కనక బిస్కెట్ లు పెట్టుకోలేదు..

Good citizen syndrome!!
అక్కడ ఆఫీసులో: కార్వీ  ఆఫీస్ కి వెళ్ళేసరికి అక్కడ మేమేఉన్నాం.. 'ఇక్కడ ఫార్ము లు మాత్రం ఇస్తారేమో? మిగతా తతంగమంతా పోస్ట్ ఆఫీస్ ల లోనే చేస్తారేమో?'అని నా అనుమానం.. అంత ఉత్సాహంలో ఉంటే ఎలాంటి వెర్రి ప్రశ్నలడిగినా సమాధానం బాగా వస్తుంది.. "లేదమ్మా, ఇక్కడ కూడా చేస్తారు "అని చాలా అనునయమైన సమాధానం. చెప్పానుకదా.. 'గుడ్ సిటిజెన్ సిండ్రోం సింప్టం స్'  అవి.. 
పొరపాటున పోస్ట్ ఆఫీస్ లో ట్రై చేస్తానని వెళ్ళిన ఫెండ్  అప్పటికే చెప్పేసాడు.. ఆ పోస్ట్ ఆఫీస్ లో రోజుకి 35 మందికి మాత్రం టోకెన్ లు ఇస్తారని.. ఇప్పటికే జూలై పదిహేను వరకూ బుక్ అయిపోయిందనీ. 
'చూసావా? 'అని నా కేసి గర్వంగా ఓ చూపు చూసేసి.. అతనిని ఇక్కడికే  గబ గబా వచ్చేయమని చెప్పేయడమూ, ఆర్డర్ లో వరసగా, వయసు ప్రకారంగా అమర్చిన కాగితాలు వాళ్ళకి చూపించేయడమూ, వాళ్ళు ఇన్ని రకాలు అక్కరలేదు సార్  అని కొన్ని వెనక్కి ఇచ్చెయడమూ చక చకా సినిమా రీళ్ళల్లా కదిలిపోయాయి. ఈ లోపున మా వాడు "you see maa.. I have put a pink clip for you.. girl color.. and blue ones for both of us"..అని నవ్వడం
ఇంతలో మిగతావారు రావడం మొదలు పెట్టారు.. అమాయకంగా కనిపిస్తున్నట్టే ఉండి క్యూని జంప్ చేద్దామని ప్రయత్నాలూ, మిగతావారితో చెప్పించుకోవడలూ ఇలాంటివన్నీ మామూలే.. మొత్తానికి నేనూ లోపలకి వెళ్ళాను.
ఆఖరి అంకం ( మాయాబజార్ లో చెప్పినట్టు అంత్యక్రియ అందామా సరదాగా :)) : ముందు మీ ఏడమ చెయ్యి దీనిమీద పెట్టి నొక్కండి, నాలుగు వేళ్ళూ ముద్ర పడాలి.. అన్నాడు ఈ ప్రక్రియని నిర్వహిస్తున్న అతను..తర్వాత కుడి చెయ్యి, తర్వాత ఐరిస్ స్కాన్..అన్నింటికంటే ఆఖరున ఫోటో.. లాజిటెక్ వెబ్ కెమెరాతోనే.. తల కిందకీ, చూపు పైకీ లాంటి సూచనల తర్వాత కేవలం నా మొహం మాత్రమే కనబడేటట్టు ఫోటో తీసాడు.
మీకు కన్నడం చదవడం వచ్చా మేడం? అన్నాడు.. వచ్చు అన్నాకా, అన్ని వివరాలు ఇంగ్లీష్ వీ, కన్నడానివీ పోల్చి సరి చూసాకా ప్రింట్ తీసి టెంపరరీ ఆధార్ పత్రం నా చేతిలో పెట్టాడు.. ఇంక అరవై నించీ- తొంభై రోజులలో అసలు కార్డ్ వస్తుందిట.. 'దట్ వస్ క్విక్' అని మా వాడి కామెంటు.. దానికి వాళ్ళ నాన్నేమో.. "who planned it after all.. now we have to follow this up online till we get our permanent cards.." అని జవాబు.. అంటే ఈ ఆధారం తా లూకా ఎక్సైట్ మెంట్ మా ఇంట్లో మాతో పాటుగా. ఇంకో మూడు నెలలుంటుందన్నమాట..  . 

అలా మా ఆధార్ కార్డ్ ల ప్రహసనం పూర్తి అయిందన్నమాట.. మళ్ళీ ఎప్పుడు ఏం వస్తుందో మరి??
 హాస్యం మాట పక్కనుంచితే.. మన దేశం లాంటి పెద్ద దేశంలో ఇలాంటి ప్రక్రియలు నిర్వయించడం చాలా కష్టమైన పని.. అది జనాభాలెక్కలైనా, ఎన్నికలైనా, ఈ కార్డ్ లైనా. చాలా బాధ్యత తో కూడిన పనులు.. మొన్నెక్కడో చదివాను.. దేశంలో అందరికీ ఆధార్ కార్డ్ లు రావాలంటే రెండు లక్షలమంది కనీసం ఐదేళ్ళపాటు పని చెయ్యాలిట.. అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత పెద్ద పనో.. దీనికి మనం చేయగలిగే సహాయం ఎదైనా ఉందీ అంటే బాధ్యత గల పౌరుల్లా వీలున్నంత త్వరగా చేయించుకోవడమే.. ఇలాంటి వన్నీ ఎంతో బాధ్యతగా, యుద్ధ ప్రాతిపదికన చేసే తనకి థాంక్స్ చెప్పేసాం నేనూ మా అబ్బాయి.
మీరు కూడా వీలున్నంత తొందరగా చేయించేసుకోండి మరి..

13 comments:

  1. :) అయితే మొత్తానికి కార్డ్ సంపాదించారన్నమాట!

    ReplyDelete
  2. బాగా రాసారండి !

    దేశంలో అందరికీ ఆధార్ కార్డ్ లు రావాలంటే రెండు లక్షలమంది కనీసం ఐదేళ్ళపాటు పని చెయ్యాలిట.. అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత పెద్ద పనో.. దీనికి మనం చేయగలిగే సహాయం ఎదైనా ఉందీ అంటే బాధ్యత గల పౌరుల్లా వీలున్నంత త్వరగా చేయించుకోవడమే

    ----------

    సో ట్రూ !

    ReplyDelete
  3. :) బాగుంది. మీ కార్డ్ ప్రహసనం!

    krishnapriya

    ReplyDelete
  4. హమ్మ్..ఇలాంటివాటిలో నేనూ మీ వారి లాగానే..ఇంతకీ మీకు కార్డులు వచ్చాయా? మా కాలనీలో మునుముందుగా తీయించుకుంది మేమే! ఇప్పుడు బాగా వత్తిడిగా ఉంటుంది..ఓ నెలకు కానీ తేదీ దొరకటంలేదట! కార్డులు ఎప్పుడు వస్తాయో మరి...రోజూ ఎదురు చూస్తున్నా వాటి కోసం. పదిహేను రోజులన్నారు కానీ రెండునెలలా పదిహేను రోజులయ్యింది..ఇంకా రాలేదు!

    సిరిసిరిమువ్వ

    ReplyDelete
  5. when we enquire the status online in the website uidai.gov.in, it is showing not found. dont know if the fellows have uploaded our info. anyways very good write up.

    ReplyDelete
  6. వావ్.. భలేగా రాశారు.. ఇక్కడ మేమూ అదే పనిలో ఉన్నామండీ..

    ReplyDelete
  7. మీ ఉత్సాహం చూస్తుంటే నాకూ సరదా గా ఉంది, నేను కూడా ఓ కార్డు తెచ్చుకోవాలని. నేను అంతగా బాధ్యత గల పౌరుడిని కాదు. అప్పుడెప్పుడో ఓ ఓటరు కార్డ్ సంపాయించాను. ఫోటో నాది కాదు అంటే భలేవారే మీదే అది, మీరెల్లా ఉంటే ఫుటోవ్ అల్లాగే వస్తుంది అన్నారు. పేరు సరిగ్గా వ్రాయ లేదు అంటే ఈ మాత్రం పేరుకి ఇంకా అందంగా వ్రాస్తారా బడాయి కాకపోతే అన్నారు.
    కార్డ్ లంటే విరక్తి పుట్టింది. మళ్ళీ ఇంకో మారు విరక్తి పుట్టించుకోవాలేమో.

    టపా సరదాగా చాలా బాగుంది. దహా

    ReplyDelete
  8. @అజ్ఞాత గారూ.. థాంక్ యూ.. ఇంకా అసలు కార్డు చేతికి రాలేదు.. టెంపరరీ కార్డు కే ఈ హడావుడంతా
    @ శ్రావ్య గారూ.. థాంక్ యూ.
    @కృష్ణ ప్రియ గారూ.. ఈ కార్డుల ప్రహసనాలలో ఇదే ఆఖరుది అవుతుందని నా ఆశ. చూద్దాం. థాంక్ యూ..
    @సిరిసిరి మువ్వ గారూ.. మాక్జిమం మూడు నెలలు అన్నారు కదా.. మరో పదిహేనురోజుల్లో వచ్చేస్తాయేమో మీ కార్డులు.. మాకూ ఇంకా రాలేదు.. ఇంకా టైముంది లెండి మాకు. అన్నట్టు మా కాలనీలోనూ మేమే అందరికంటే ముందు చేయించుకున్నం అచ్చు మీలాగే :)

    ReplyDelete
  9. @Anonymous.. I hope they will sort out these issues soon.

    ReplyDelete
  10. @ మురళిగారూ.. థాంక్ యూ.. ఆల్ ది బెస్ట్ మీకు. తొందరగా చేయించేసుకోండి..

    ReplyDelete
  11. మీ నేరేషన్ చాలా బావుందండీ.మేమూ ఆ మధ్య తీయించుకున్నాము.కార్డుల కోసం వెయిటింగ్

    ReplyDelete
  12. థాంక్ యూ లతగారూ..మీకు ఎన్నిరోజుల్లో వచ్చాయో చెప్పండి కార్డ్ లు వచ్చాకా..

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...