Saturday, June 11, 2011

గోపాల రావు గారి అమ్మాయి .....అందంగా, బావుంటుంది.

 ఈ టీ.వీ వారు 'సెకండ్ షో    ' పేరిట రాత్రి పదిన్నరకి ( ఒక్కోసారి ఇంకా ఆలస్యంగా ) మొదలు పెట్టి సినిమాలు చూపిస్తుంటే 'ఇంత  రాత్రి అయితే ఎవరు చూస్తారు? ఏదో టైము గడపడానికి వేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ ఈ మధ్యన సిని నటులు  చంద్ర మోహన్, కృష్ణ గార్ల పుట్టిన రోజుల  సందర్భంగా ప్రసారం చేసిన 'గోపాలరావు గారి అమ్మాయి', శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' సినిమాలని నేనే చివరివరకూ కదలకుండా చూసేసాను. సినిమా మంచిది అవ్వాలే కానీ ఎప్పుడైనా , ఎలాగైనా జనం చూస్తారని అర్ధం చేసేసుకున్నాను :).

 కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ' అబ్బ భలే హాయి గా 'ఉంది అనిపిస్తుంది.. ఇక్కడ 'హాయి 'అన్నమాట తప్ప మరేమీ తట్టడమే లేదు.  ఎందుకంటే మొదటినించీ చివరివరకూ ఎవరో చక్కగా గీసిన గీత లా వంకర లేకుండా, సాఫీగా  సాగిపోతుంది కధ. సరిగ్గా అలాంటిదే ఈ సినిమా.

పక్క పాపిడి తీసుకుని గిరజాల జుట్టు దువ్వేసుకుని, పోట్టమీదకి ఉన్న పాంటు లోకి చొక్కా టక్ చేసేసుకుని, నాలుగో,  మళ్ళీ మాట్లాడితే ఆరో ఇంచెల హీల్ ఉన్న బూట్లు వేసేసుకుని కనిపిస్తూ  కేవలం తన నటనా పటిమతోనే తను నిజంగా  హీరోని అనిపించుకునే హీరో ..

అరే!.. ఈ అమ్మాయి ఎవరో అచ్చం మన పక్కింటి లోనో, మన ఇంటిలోనో  ఉండే అమ్మాయిల్లా ఉందే? అనుకునేలా ఉన్న హీరోయిన్.. మళ్ళీ అదే.. నటనే.. గట్టిగా మాట్లాడితే ఫాన్సీగా కనిపించే చీరలు కానీ, నగలు కానీ, అసలు మేకప్  కూడా ఉన్నట్టే  కనిపించదు.  పాత్రోచితంగా, చక్కగా నటించడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య అని ఎందుకంటారో మరొకసారి తెలుస్తుంది.

ఎక్కడా నటిస్తున్నట్టే అనిపించదు.. పాత్రల్లో ఒదిగిపోవడం అంటే ఇదేనేమో.. అలా అని ఆ పాత్రలేమీ పెద్ద పెద్ద డయలాగులూ, చొక్కాలూ ( ముళ్ళపూడి రమణ గారు చెప్పినట్టు)  ఉన్నవేమీ కాదు. మరీ అంత హావ భావాలు ప్రదర్శింపవలసినవేమీ కాదు. అయినా ఎంతో సహజంగా పాత్రలని పోషిస్తారు చంద్రమోహన్, జయసుధ .

 వీరికి తోడు.. వయసు ముందుకీ, మనసు వెనక్కీ పరిగెడుతున్న ఒక డబ్బున్న  రావు గోపాలరావు ,  ఆయన మాటకి మాట, విసురుకి విసురూ చురుగ్గా వేసే ఆయన  ఇల్లాలు  షావుకారు జానకీ.. క్లుప్తంగా చెప్పాలంటే వీరి నలుగురి మధ్యనా ప్రేక్షకులకి అర్ధం అవుతూనే, పాత్రలని మాత్రం  కన్ఫ్యూజ్ చేస్తూ  హుషారుగా నడుస్తూ, నవ్వించే కధనం.. కద కి  అవసరమైనంతవరకూ కావలసిన మిగతా పాత్రలు.  పంచ్ లూ, పించ్ లూ లేకుండా నే నడుస్తూ, అర్ధవంతంగా సందర్భానికి తగ్గట్టుగా రాసిన సంభాషణలూ. చాలా బావుంటుంది.

'పని చేస్తూ ఉంటె వాళ్ళే పరిచయం అవుతారు, పని మానుకొని పరిచయాలు చేసుక్కోక్కర్లేదు ' అనేది ఈ మధ్యన వచ్చిన ఒక సినిమాలో ని వాక్యం.. అలాగే కధా, కధనాల్లో హాస్యానికి చోటూ, నటీ నటుల్లో ప్రతిభా ఉంటె చాలు, నవ్వులు అవే పూస్తాయి. హాస్యం పేరిట అక్కర్లేని పాత్రలు కల్పించి అపహాస్యం పాలు కానక్కరలేదు అని చూపిస్తుంది ఈ చిత్రం. ప్రధాన పాత్రలతో సహా అందరూ చక్కని హాస్యాన్ని చిలికిస్తారు.

ఇక పాటలు.. చక్రవర్తిగారు చేసిన మంచిపాటల్లో ఇవి తప్పకుండా ఉంటాయి అనిపిస్తుంది.. టైటిల్ సాంగ్, సుజాతా ఐ లవ్ యూ సుజాతా, వస్తావు కలలోకీ, మనవే వినవా.. ఇలా అన్ని పాటలు విన్న వెంటనే ఆకట్టుకోవడమే కాదు తరవాత కూడా మనం హమ్ చేసుకునేలా ఉంటాయి.  మాములు పార్కుల్లోనే తీసారు మరి, అందులోనూ ఒకటి జూ పార్క్ లో.  బాంకాక్ లు, స్విట్జర్ లాండు లలోనూ కాదు. అలా తీయడం తప్పని కాదు, అవసరం లేని చోట అక్కర్లేదు కదా అని. 

ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఈ సినిమా, ఆ తర్వాత హిందీ లో తీసిన సినిమా చూసాను. నాకెందుకో తెలుగు సినిమాయే బావుంది. హిందీ చిత్రానికి మాతృక ప్రియదర్శన్ గారి మలయాళం సినిమా అని చదివాను,కానీ అది తెలుగు సినిమా కంటే ముందు వచ్చిందా,  లేదా అనేది నాకు తెలియదు. మిత్రులెవరైనా తెలిస్తే దయచేసి  చెప్పండి.

4 comments:

  1. :) బాగుంది. నేనూ చాలా సార్లు ETV లో అంత రాత్రి 10.30 కి సినిమా ఎవరు చూస్తారు అనుకుంటాను కానీ చాలా మంచి సినిమా అయితే నిద్రనాపుకుని తప్పక చూస్తాను. మీరు చూసిన రెండు సినిమాలూ నా ఫేవరేట్ సినిమాలే...

    సమస్య ఏంటో తెలియలేదు కానీ నా గూగుల్ అకవుంట్ తో వ్యాఖ్య పెట్టలేకపోతున్నా..
    -కృష్ణప్రియ/

    ReplyDelete
  2. అవును ఈ సినిమా చాలా బాగుంటుంది . చాలా ఏళ్ళ క్రితము చూసినా బాగానే గుర్తుంది .

    ReplyDelete
  3. అవునండీ.. చాలా హాయిగా ఉండే సినిమా ఇది.. వేరే మాట తోచడం లేదు నాక్కూడా :))

    ReplyDelete
  4. కృష్ణప్రియ గారూ.. థాంక్ యూ. నిజమే.. నేను కూడా కొన్నిసార్లు మీలాగే నిద్ర ఆపుకుంటూ చూసేస్తాను.
    మాలాగారూ.. ఎప్పటికీ బావుండే కొన్ని సినిమాలలో ఇది కూడా ఒకటి.
    మురలిగారూ.. :) హాయి హాయిగా చూసేసే సినిమా

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...