Thursday, March 31, 2011

వచ్చిన భాష.. రాని భాష..?

వచ్చిన భాష ఏది? రాని భాష అంటే ఏమిటి? ఈ విషయం నాకు అర్ధం కావడం లేదు ఈ మధ్యన. కన్ప్యూసింగ్ గా ఉంది కదూ.నాకు తెలిసిన  భాషలో అర్ధం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం చాలా సార్లు ఈ ప్రశ్నని ఎదుర్కొంటూ ఉంటాము, చాలా సార్లు అప్లికేషన్ లలో కూడా రాయవలసి ఉంటుంది కూడానూ. అందుకని దీని సంగతి తెలుసుకుంటే మంచిది కదా, అని అనిపించి ఇలా ఇది రాసేస్తున్నానన్నమాట. 

        



          మన  తెలుగువారికి తెలుగు వచ్చిన భాష అనుకుందామా,  అంటే ఈ మధ్యన అది నిజంలా అనిపించడం లేదు. 'వాచ్ చేస్తున్నారా?', బాత్ తీసుకున్నారా? ఒకసారి డ్రాప్ ఇన్ అవ్వండి మీరు,   మా ఇంటికి.. చాలా పుల్ డౌన్ చేసారు రీసెంట్ గా  ఇలాంటివన్నీ వింటుంటే.. ఇవి తెలుగు వాక్యా లేనా?  అనిపిస్తోంది , , నిజం.. సినిమాలలో సంభాషణాలు కూడా ఇలాంటివే రాస్తున్నారు కూడాను.
చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు. ఈ మధ్యన అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు.. వీళ్ళకి పాపం ఇంగ్లీష్ పూర్, హిందీ నిల్, తెలుగు వీక్ అని.. నిజంగానే అలా కనిపిస్తోంది.. . పైన చెప్పిన లాంటి తెలుగూ ఇంగ్లీషూ కాని మరికొన్ని వాక్యాలు చూడండి.

  • నేను అలాంటి నకరాలు అస్సలు స్టాండ్ చెయ్యలేను ( I can't stand such antics అని అర్ధం చెప్పుకోవచ్చేమో)
  • నేను విండో ప్లేస్ కోసం చాల పర్టికులర్ 
  • నాకు చైల్డ్ హుడ్ నించీ మేన్గో లంటే లైకింగ్ ఎక్కువ
  • నేను రోజూ ఆఫీస్ కి వెళ్ళడానికి బస్ తీసుకుంటావా? ఇలాంటివన్నమాట. 
ఇవి తెలుగు వాక్యాల్లా కనిపించే పూర్తిగా తెలుగు కాని వాక్యాలు.. 
ఇప్పుడు ఇంకోరకం చూద్దాం.
  • I went by bus. car means very costly. why unnecessary burden therefore - ఐ వెంట్ బై బస్. కార్ మీన్స్ వెరీ కాస్త లీ.   వై.. అన్ నేసేసరీ బర్డెన్ దేర్ఫోర్.. ( అంటే.. కార్ ఐతే ఎక్కువ ఖరీదు అవుతుంగి కదా అని బస్ లో వెళ్లాను.. అనవసరమైన భారం ఎందుకు అని కాబోలు)
  • Morning, morning big fight in my house between mrs. and me. మార్నింగ్ మార్నింగ్ బిగ్ ఫైట్ ఇన్ మై హౌస్ బిట్వీన్ మిసెస్ అండ్ మీ.. ( పొద్దున్నే మా ఇంట్లో నాకు మా ఆవిడకీ పెద్ద గొడవ) 
  • The street gundas damaged all the property.. what else work they have? ది స్ట్రీట్ గుండాస్ డేమేజేడ్ ఆల్ ది ప్రాపర్టీ ..  వాట్ ఎల్స్ వర్క్ దీ హావ్? ( ఇంకేం పని ఉంది వారికి అనే అర్ధం)
  • We have kept the god during the ganesh navaratri. We will leave him on fifth day. వి హేవ్ కెప్ట్ ది గాడ్ డ్యూరింగ్ గణేష్ నవరాత్రి.. వి విల్ లీవ్ హిం ఆన్ ఫిఫ్త్ డే. ( వినాయకుడిని పెట్టాము, ఐదో రోజున విసర్జిస్తాము/నిమజ్జనం చేస్తాము)
  • Now where he is? నౌ వేర్ హీ ఇస్ ( అబీ కహా హాయ్ వో? అన్నమాట) 
ఇలాంటివి.. ఇవి ఇంగ్లీష్ లా కనిపించే ఇంగ్లీష్ కాని వాక్యాలు.. 
వీటిల్లో మన మాతృభాష ప్రభావం ఎంత ఉంటుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది..  ఎంత అలవోకగా, సునాయాసంగా మనం ఇలాంటివి మన రోజు వారీ పనులలో వాడేస్తూ ఉంటామో. ఎవరో విదేశీయులు వీటిని అర్ధం చేసుకోలేక కష్టపడినప్పుడు మనకర్ధం అవుతుంది.. విదేశీయులంటే గుర్తు వచ్చింది.. ఆ మధ్య మా అమెరికన్  కొలీగ్ ఒకా విడ  ఇక్కడకి వచ్చినప్పుడు టాక్సీ ఎక్కింది.. వాళ్ళిద్దరికీ మధ్యన సంభాషణ ఇలా జరిగిందిట. ఇలా విదేశీయులు వచ్చినప్పుడు కావేరీకో, కాటేజీ ఎంపోరియం లకో, బట్టలకైతే ఫాబ్ ఇండియా కీ తీసుకెళ్లడం టాక్సీ వాళ్ళకీ అలవాటే.. 

అక్కడ ఇంకో డ్రైవర్ కనపడితే ' బ్రదర్ ఎలా ఉన్నావు? అని అడిగాడుట ఇతను కన్నడం లో..
ఆవిడ బ్రదర్ అన్న మాట విని.. ఆతను మీ బ్రదరా? అని అడిగిందిట..
దానికి మన డ్రైవర్.. నాట్ ఓన్. కజిన్ బ్రదర్.. అన్నాడుట.. ఆవిడకి అర్ధం కాలేదు.. ఓన్ బ్రదర్ అంటే? అందిట.  ఇతనికి అంతకంటే చెప్పడానికి రాలేదు. మెల్లిగా తన పిన్ని కొడుకు అని చెప్పాడుట..
వాళ్ళ మదర్ కి వంట్లో అసలు బాగాలేదు.. అందుకే పలకరించాను అని చెప్పడానికి.. హిస్ మదర్ సీరియస్ అన్నాడుట.
దానికావిడ సీరియస్ అబౌట్ వాట్ అంది.. అది అతనికి అర్ధం కాలేదు.. హాస్పటల్, కేన్సర్ ఇలాంటి పొడి మాటలతో ఆవిడకి కొంచం అర్ధం అయ్యేట్ల చెప్పాడు.
ప్లీజ్ డోన్ట్ మిస్టేక్ మీ.. ఐ నో.. లిటిల్ లిటిల్ ఇంగ్లీష్ అన్నాడుట.. ఆవిడ మర్నాడు మా అందరికీ చెప్పి నవ్వి, అతని ఉత్సాహాన్నీ, అర్ధం అయ్యేలా మాట్లాడాలన్న సంకల్పాన్నీ ఎంతో  మెచ్చుకుంది..ఇక్కడ ఆతను మాట్లాడినవన్నీ అందరూ రోజువారీగా మాట్లాడేవే.. 'ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ' తో సహా.. :)
కొన్ని మాటలు వాడగా వాడగా రైటయిపోతాయి..  మనుగడ లోకి వచ్చేస్తాయి.. ముందు లేకపోయినా.. ఉదా; prepone, updation, googled ఇలాంటివి.. 


భాష గురించి మాట్లాడటం మొదలు పెట్టాకా T.V.. . వాళ్ళగురించి మాట్లాడకుండా ఎలా? మొన్నెప్పుడో ఒక వంటల ప్రోగ్రాం లో బామ్మ వంట, తాతమ్మ వంట అంటూ ఒక విభాగంలో అక్కరలేని ఓవర్ ఆక్షన్ చేస్తున్న యాంకరమ్మ ఒకావిడ ని అడిగింది.. బామ్మా, ( అక్కడ వంట చేస్తున్నావిడకి గట్టిగా మాట్లాడితే అరవై ఏళ్ళు ఉండకపోయినా సరే మాటకి ముందో బామ్మా, వెనకో బామ్మా చేర్చి  మాట్లాడుతూ ఉంటారు ఈ పిల్లలు) మీ కెందరు  పిల్లలు? ఎక్కడుంటారు? అని అడిగింది
దానికి .. ఇద్దరు కొడుకులూ,, ఒక కూతురు.. అన్నారావిడ .
వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? మీ దగ్గరేనా? ఈవిడ ప్రశ్న
దానికా పెద్దావిడ..కొడుకులు హైదరాబాదో అని  ఏదో చెప్పి .. వాళ్ళింట్లో వాళ్ళు.. మా ఇంట్లో మేము.. ఉన్నాము.. అవసరమైనప్పుడు మేము వెళ్తాము, వాళ్ళు వస్తారు అన్నారు..
అంతేనా? హ హ హ.... ఇండివిడ్యువాలిటీ అన్నమాట.. డిపెండబుల్ కాదు అన్నమాట మీరూ, తాతగారూ.. అని అక్కర్లేని వెర్రి నవ్వుతూ  అంది ఆ అమ్మాయి...
ఆ అమ్మాయికి dependents కీ, dependable కీ తేడా  తెలీదా? ఒక వేళ కార్యక్రమం  చక్కగా చెయ్యాలనే ఆత్రం తో పొరపాటున అన్నా తరవాత ఎడిటింగ్ సమయంలోనైనా గమనించరా? అనుకున్నాను.
ఇలాంటివే.. గార్నీష్ కి, కంఫర్ట్ గా చేస్తారా? రిలాక్సా? రియల్ ఆ? లాంటివి..ఇతర కార్యక్రామాలో ఇంకా బోలెడన్ని ఇలాంటివే. 

ఇలాంటి రకరకాలు చూసాకా నాకు వచ్చిన సందేహం ఇదన్నమాట.. మనకి వచ్చిన భాష ఏది? రాని భాష ఏది? అన్నీ వచ్చీ రాని భాషలేనా? వస్తూ వస్తూ ఉన్న భాషలేనా? రాకుండానే వచ్చాయి అనుకున్న భాషలా అని.. మా అబ్బాయేమో.. గుడ్ మా. హైబ్రిడ్ లేన్గ్వేజేస్ అంటున్నాడు మరి.. మీరేమంటారు? ఇలాంటి ఉదాహరణలు మీ దగ్గర కూడా ఉంటే నాతొ పాటు అందరికీ చెప్పేయండి. ఓ పని అయిపోతుంది..


P.S: ఇది ఇప్పుడు వినబడుతున్న భాషా వ్యవహారాన్ని చూసి రాసినదే కానీ ఎవరినీ ఉద్దేసించి కాదు.
     

Tuesday, March 29, 2011

భూదేవి కొక్క గంట...

          వేల దేశాలలో, లక్షల కొలదిగా ఉన్న ఊర్లలో కోట్లాదిమంది ప్రజలని, వారి భారాన్నీ మోస్తున్న భూదేవి కి ఏడాదికి ఒక్క గంట మనవంతు కృతజ్ఞత ప్రకటించడం, ధన్యవాదాలు చెప్పడమే ఈ ఎర్త్ అవర్ అని నా అభిప్రాయం. అది  అమలుపరచడం అంత కష్టమా? కానిపనా? ఏమో మరి.
       మా అపార్ట్మెంట్  లో ఉన్న 144 ఇళ్ళల్లో ఉన్న కొంతమంది ఉత్సాహవంతులం ఈ భూమి గంటను  మనందరం తప్పకుండా పాటించాలి అని నిశ్చయిన్చేసుకున్నం . అంతే కాదు,  మంచి మాట అందరికీ చెప్తే మంచిది కదా అని ఒకరంటే సరే అంటే సరే అనుకున్నాం. ఉన్న ఎనిమిది అంతస్తులనీ మాలో మేము సమానంగా పంచుకుని అందరికీ వీలయితే పర్సనల్ గా లేకపోతె ఇంటర్ కాం ద్వారానూ చెప్పి, దీనికి మనవంతు సహాయం చెయ్యాలని మా సంకల్పం. మాలో ఒకరు తయారు చేసి తెచ్చిన నోటీసులు అన్ని లిఫ్టు లలోనూ, నోటీసు బోర్డు లలోనూ  పెట్టాము. ( ఒక వైపు రాసిన కాగితాలే వాడాము సుమండీ). అపార్ట్మెంట్ యాహూ గ్రూప్ లో మెసేజ్ లు పంపించాం. ఇంక మిగిలింది వీలైనంత మందికి చెప్పడం.

         మొదట నేను ఫోన్ చేసిన ఒక ఫ్లాట్ ఆతను.. 'తప్పకుండా చేద్దాం అండీ, మనం ఇలాంటివన్నీ చాలా శ్రద్దగా పాటించాలి. గుర్తు చేసినందుకు మీకు థాంక్ యూ.. అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాదు, వారు అందులో పాలు పంచుకుంటాము అన్నందుకు.
       తరవాత ఇంకొకాయన 'మనందరం ఒక గంట ఆపేస్తే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెరిగిపోతుందా?' అని వ్యంగ్యంగా అడిగారు. దానికి నాకు కొంత కోపం వచ్చిన మాట నిజం.. పెరగక పోయినా కనీసం మిగులుతుంది కదా అని ఫోన్ పెట్టేసాను.
         మరికొందరు మెచ్చుకున్నారు. కొందరేమో.. "మేడం మాకూ తెలుసు దీని గురించి.. మేమూ బాధ్యతా గల పౌరులమే.. మీరు  పని కట్టుకుని గుర్తుచేసెంత శ్రమ తీసుకోక్కరలేదు" అన్నారు. నాకు ఏమనాలో తెలియలేదు. "ఇలా మేమందరం ఒక గ్రూప్, ఈ మెసేజ్ అందరికీ చెప్పాలని మా ప్రయత్నం. మీరు మాలాగే ఆలోచిస్తున్నందుకు సంతోషం" అని చెప్పాను.
            మా గ్రూప్ లో మిగతావారికి కూడా ఇలాంటి అనేక రకాలైన అనుభవాలు ఎదురయ్యాయి. "గవర్నమెంట్ ఎలాగూ పవర్ కట్ విధిస్తోంది, అప్పుడు ఎన్నో గంటలు ఇస్తున్నాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవ్వక్కర్లేదు" అని కొందరంటే, "నాలుగేళ్ళకొకసారి వస్తుంది, క్రికెట్ మాచ్ చూడక్కరలేదా?" అని కొందరు అన్నారుట. ఇలా ఒక అరగంట ప్రయతించి వీలున్నంత వరకూ చెప్పాం. తరవాత ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది అని వదిలేసాం. మొత్తానికి 75 % ఇళ్ళల్లో పాటించారని తృప్తి పడ్డాం.
        ఏ విషయం మీదైనా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఉండాలి కూడా. కానీ ఇలాంటి వాటిల్లో కాదేమో. ప్రపంచమంతా కేవలం సంవత్సరానికి ఒక్క గంట కరంట్ వినియోగం మానేస్తే ( కనీసం వీలైనంత వరకూ తగ్గిస్తే) జరిగే మేలు మనందరికీ తెలుసు. అలాంటప్పుడు అది పాటిస్తే మనకి వచ్చే పెద్ద నష్టం ఏమంటుంది?
         ఇది మనకి ప్రత్యక్షం గా ఇప్పటికిప్పుడు కనిపించే మేలు కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇలాంటి వెన్నో మనం క్రమం తప్పకుండాపాటించ డాన్ని  బట్టే మన మనుగడా, జీవిత విధానం ఆధారపడి ఉంటుంది అనేది కాదనలేని సత్యం. మన చేతిలో డబ్బు ఉండవచ్చు, కానీ కొనడానికి వనరులు లేకపోతే ఏం లాభం? వనరులు ఉన్నప్పుడు వివేకంగా వాడుకోకపోతే తరవాత ఎవరిని ఏమీ అనలేము. అది కోట్లకి పడగలెత్తి నెలకి లక్షల రూపాయల విధ్యుత్ కాల్చే కోటీశ్వరులైనా, కామన్ మాన్ అయినా సరే.. ఇది అందరూ పాటించవలసిన సూత్రం. నడుచుకోవలసిన మార్గం. లేకపోతే మన తరవాత తరం వారు కార్ల బదులు ఎడ్ల బళ్ళూ, జటకాలూ కొనుక్కోవాలి. తప్పదు.
          

తీయగా పాడే చిన్నారులు..

          బాలూ గారు నిర్వహించిన అన్ని పాటల కార్యక్రమాలనీ విడవకుండా చూడడం నాకు చాలా ఇష్టం. ఈ టీ వీ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న చిన్నారుల ధారావాహికం 'పాడుతా తీయగా' చిన్నారుల చక్కని గాత్రాలతో, సరదాగానూ, సంస్కారవంతగానూ సాగే బాలూ గారి వ్యాఖ్యానంతో ఎంతో కమనీయంగా సాగుతోంది. అనవసరమైన డ్రామాలు కానీ, అక్కరలేని వ్యాఖ్యలు కానీ ఉండవు.
          .   వయసు లో చిన్నవారైనా, ప్రతిభలో ఏంతో  పెద్దవారిలా, చాలా అనుభవమున్నవారిలా పాడే ఆ చిన్న పిల్లలని చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది,  మనసంతా ఏంటో చెప్పలేనంత సంతోషంతో నిండిపోతుంది.  కష్టమైన పాటలు నేర్చుకోవడమే కాదు, చాలా సార్లు పుస్తకం అవసరం లేకుండానే అలవోకగా పాడేస్తారు  వాళ్ళు. ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ లు జరుగుతున్న ఈ కార్యక్రమంలో లక్ష్మీ మేఘన, రాఘవేంద్ర, అంజనీ నిఖిల, గణేష్ రేవంత్ లు చిచ్చర  పిడుగుల్లా పాడుతున్నారు. అందరిదీ తలో రకమైన విలక్షణమైన శైలి.  ప్రతీ వారమూ నువ్వా, నేనా అన్నట్టుగా కనిపిస్తారు. చిన్న చిన్న తప్పులు చేస్తే చెయ్యవచ్చు గాక, వారందరూ పాడే విధానం మాత్రం చక్కగా ఉంటుంది.
            పాట ఎంత బాగా పాడతారో,  అంతే చక్కగా తోటివారికి అవసరం అయినప్పుడు తమ గళాన్ని కోరస్ గా పంచుతారు. అన్నింటికంటే నన్ను ఆకట్టుకునేది వారి పసితనం, అమాయకత్వం. ప్రతీవారం 'ఉజాల' వారిచ్చే 'ఉత్తమ గాయకుడు/గాయని బహుమతి అమ్డుకునేప్పుడు వారు కనబరిచే సంతోషం, హావభావాలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. సొట్టలు పడుతున్న చిన్న బుగ్గల మీద విరిసిన ఆ నవ్వులు మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. అలాగే పొరపాటున ఏదైనా తప్పు చేస్తే గభాల్న నాలుక కరుచుకుంటూ,  భుజాలెగరేసి అందరినీ పరీక్షగా చూడడంలాంటివి కూడా .
       ఇవన్నీ ఒక ఎత్తు బాలుగారితో మాట్లాడేటప్పుడు వారిచ్చే సమాధానాలు మరొక ఎత్తు. 'గణేష్ రేవంత్' బాలు గార్ల మధ్యన నడిచే సరదా సంభాషణ అందులో ఒకటి. ఆయన కవ్విస్తున్నట్టుగా ఏదో ఒకటి అనడం, దానికి ఆ అబ్బాయి తడుముకోకుండా, కొద్దిగా భయం భయంగానే సమాదాలు చెప్పడమూ.  అలాగే.. 'ఎన్నేళ్ళుగా సంగీతం నేర్చు కుంటున్నావు?  అని అడిగితె  నేను ఎల్.కే.జీ లో ఉన్నప్పటినించీ అంది లక్ష్మీ మేఘన . దానికి ఆయన నువ్వు ఎల్.కే.జీ ఎప్పుడు చదివావో నాకెలా తెలుస్తుంది ? అంటే ఇప్పుడు నేను సిక్స్త్ అంది ముద్దుగా,  అంటే మీరు లెక్కపెట్టుకోండి ఎన్నేళ్ళ నించీ  నేర్చుకున్తున్నానో  అన్నట్టు.. ఇలాంటివి పిల్లల్లో ఉన్న అమాయకత్వాన్నే, నిజమైన పసితనాన్నీ చూపిస్తాయి.
      చేత ఉలి ని పట్టి శిల్పాలని చెక్కిన శిల్పి  బాలుగారు. ఈ గాన గంధర్వ జక్కన్నగారి కార్యక్రమం  'పాడుతా తీయగా, పాడాలని ఉంది' ల  నించి వచ్చిన ఎందరో గాయనీ గాయకులూ ఎంతో పేరు తెచ్చ్సుకున్న ప్రముఖులయ్యారు. అలాగే ఈ చిన్నారులు కూడా రాణిస్తారు. అందులో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా రావాలని ఆశిద్దాం.
           

Tuesday, March 8, 2011

మహిళలూ- మణిదీపాలు (8 )

భారత రత్నాలు:   ముందుగా నా స్నేహితురాళ్ళందరికీ  నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత వారం రోజులుగా వివిధ రంగాలులో విఖ్యాతి గాంచిన భారతీయ మహిళలగురించి రాస్తూ ఉంటే ఎంతో ఉత్సాహభారితంగానూ, ఉద్వేగభరితంగానూ అనిపించింది. ఎక్కడ,  ఎవరితో మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో కూడా తెలియలేదు. కొన్ని నెలలు కొనసాగితే ఇలాంటి ఎందరో  ధీరవనితలకి న్యాయం చేసినట్టు అవుతుందేమో అనిపించింది. ఇక ఈ రోజు కొసమెరుపు ..... ఎవరిగురించి రాద్దామా? అని ఆలోచిస్తూ ఉంటే అరుదైన మన ఈ ఐదుగురు  భారత రత్నాలు మనసులో మెదిలారు. ఇలాంటివారిని మరలా  గుర్తు చేసుకోవడం కంటే నా ఈ టపాల క్రమానికి సార్ధకత వేరే ఉంటుందా ?అనిపించింది..అందుకే ఈ పోస్ట్ ఇలా....
1 . మదర్ థెరీసా : మానవతకీ, పేదల, దీనుల సేవకీ తిరుగులేని  మారుపేరుగా, ప్రపంచ వ్యాప్తంగా  ప్రేమనీ, సేవ తత్పరతనీ పంచిన కరుణామయిగా అందరి మనసుల్లోనూ చిరస్మరణీయురాలు  మదర్ థెరీసా. ఎక్కడో ఆల్బేనియా లో పుట్టి (26 ఆగస్ట్, 1910 ) , ఆ తరవాత భారతీయ పౌరసత్వం పొంది కోల్ కత్తా లో 'మిషనరీస్ అఫ్ చారిటీ' అనే సంస్థని స్థాపించి వారూ, వీరూ అని తేడా లేకుండా పేదలూ, రోగులూ, దీనులూ, అన్నార్తుల సేవలో నలభై ఐదు సంవత్సాలకు పైగా గడిపిన మానవతామూర్తి మదర్. అందుకే ఆమెకు పోప్ 'సెయింట్ హూడ్'  ప్రకటించారు. ఆమె గరిపిన సేవకూ, చూపిన కరుణకూ ఆమెకు దక్కని పురస్కారం లేదు. నోబుల్ శాంతి బహుమతి తో సహా అన్నీ అమ్మకు లభించాయి. భారత ప్రభుత్వం కూడా 1980 లో మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైన 'భారత రత్న' పురస్కారాన్ని  ప్రకటించి తనను తానే గౌరవించుకుంది. ఏనాడూ తనకోసం కాక పరసేవ లోనే జీవితమంతా  గడిపిన  మదర్   5 సెప్టెంబర్ 1997 న పరమపదించారు.
2 .శ్రీమతి  అరుణా అసఫ్ ఆలీ :  పేరెన్నిక గన్న స్వాతంత్ర సమర  యోధులైన మహిళలలో అరుణా అసఫ్ ఆలి అత్యంత ప్రముఖులు. పంజాబ్ లోని కాల్కా లో జూలై 16 , 1909 న అరుణా గంగూలీ గా జన్మించిన అరుణ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ముంబాయ్ లోని గోవాలియా టాంక్ మైదానం లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. స్వాతంత్రోద్యమ కాలంలో ఉప్పుసత్యాగ్రహం లోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరుణ చూపిన సాహసమూ, నాయకత్వ ప్రతిభా భారత స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడం లో సందేహం లేదు. భారత ప్రభుత్వం అరుణా  ఆసఫ్ ఆలీ కి ఆమె మరణానంతరం (జూలై 29 , 1996 ) 1997 లో వీరికి 'భారత రత్న" పురస్కారాన్ని ప్రకటించింది. 'క్విట్ ఇండియా ' ఉద్యమానికి మారుపేరుగా నిలిచిన 'శ్రీమతి అరుణా అసఫ్ ఆలీ' సేవలకి సరి అయిన నివాళి ఇది.
3 . శ్రీమతి ఇందిరా ప్రియదర్శినీ గాంధీ : పరిచయం  అక్కరలేని పేరు ఇది. మన దేశపు తొలి, ఆ మాట కొస్తే ఏకైక మహిళా ప్రధాని గానూ, తిరుగులేని నాయకురాలుగానూ చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే  ఈ స్త్రీ మూర్తిగురించి  కొత్తగా చెప్పబూనడం సాహసమే. నాలుగు విడతలుగా మొత్తం పదహారు సంవత్సారు ఆమె దేశాన్ని ఏలారు. మొదటినించీ రాజకీయ కుటుంబంలో పుట్టి (నవంబర్ 19 , 1917 ) పెరిగిన ఆమె రాజకీయాలలో రాణించడం ఎంతో సహజం గా జరిగినట్టు అనిపించినా దీనివెనక నిజానికి ఉన్నది అలుపెరుగని దీక్షా, కార్య దక్షతా. భయమనేది ఎరుగని నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు ఆమె. ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి నిర్ణయాల వల్ల ఆమె తీవ్రమైన విమర్శలను ఎదురుకోవలసి వచ్చింది, చివరకు ఆమె భద్రతా సిబ్బంది చేతిలోనే అకోబార్ 31 , 1984 న దుర్మరణం పాలయ్యారు. భారత ప్రభుత్వం ఆమెకు 1971 లో నే 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించింది. 
4 . శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మి: ఏ గొంతు వినబడితే కానీ దేవుళ్ళకి సైతం తెల్లవారదో, ఏ పాట వినపడితే ప్రతీ గుండె సప్త స్వరాల,  సరాగాలతో పులకరించి పోతుందో ఆ గొంతుకీ, ఆ గానామృతమూర్తికీ ఒక పేరు పెడితే ఆ పేరు ఎం. ఎస్. సుబ్బులక్ష్మి. దేశంలోనే 'భారత రత్న' పొందిన మొట్టమొదటి  గాయకురాలుగా చరిత్ర సృష్టించి, అజరామరమైన గానాన్ని మనందరికీ పంచిన ప్రఖ్యాత విదుషీ మణి, శ్రీమతి  మదురై షణ్ముఖ వదివు  సుబ్బులక్ష్మి. 'భజ గోవిందం' అని గోవింద నామాలు పాడినా, 'విష్ణుం జిష్ణుం' అంటూ విష్ణు సహస్ర నామాలు ఆలపించినా అది అనితరసాధ్యం అనిపించడం కేవలం ఆవిడకే సాధ్యం, సొంతం. నిండైన విగ్రహం, భారతీయ సాంప్రదాయత ని అణువణువునా ప్రతిబింబిస్తూ ఉండేలా వేష ధారణా ,మాటే మంత్రం లా ధ్వనించే గాత్రమూ.. వెరసి ఆమె పాడుతుంటే సాక్షాత్తూ అమ్మవారే పాడుతున్నట్టు అనిపించడం అందరికీ అనుభవమే. భారత ప్రభుత్వం వీరికి 1998 లో భారత రత్న ప్రకటించింది, శ్రీమతి ఎం. ఎస్ 11 డిశంబర్ 2004 న పరమపదించారు.
5 . కుమారి లతా దీనానాధ్ మంగేష్కర్:  భారత దేశ సినీప్రపంచపు గాన కోకిలగా గత అరవై సంవత్సరాలకు పైగా అశేష ప్రజానీకాన్ని తన మధురగానంతో ఓలలాడిస్తున్నమధుర గాయని లతా మంగేష్కర్.  వీరు ఇండోర్ లో సెప్టెంబర్ 29 , 1929 న జన్మించారు. వీరి తండ్రీ, సోదరుడూ, చెల్లెళ్ళూ అందరూ గాయకులే కావడం విశేషం. ఎన్నో  భారతీయ భాషలలో 25000 పైగా పాటలు పాడిన ఘనత ఆమెదే .ఎం. ఎస్ సుబ్బులక్ష్మి గారి తర్వాత 'భారత రత్న' పొందిన రెండో గాయని లతా మంగేష్కర్. ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ అదే మాధుర్యంతో, తరగని ఉత్సాహంతో పాడతారు ఆమె. ఈ కోకిలకి భారత ప్రభుత్వం 2001 లో 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించింది.

ఒకరా, ఇద్దరా? ఇలా రాసుకుంటూ పొతే ఎంత మందో, ఎనలేని పేరు ప్రఖ్యాతులు పొందినవారే కానక్కరలేదు.. గోరుముద్దలు తినిపిస్తూ, బుజ్జగించే అమ్మా,కమ్మగా కధలు, కబుర్లూ చెప్పే అమ్మమ్మా, నాన్నమ్మా,అత్తలూ, అత్తగార్లూ,  తోడుగా నడిచే తోబుట్టువులూ, ఎప్పుడైనా నేనున్నాను అని పలికే స్నేహితురాళ్ళూ, సహోద్యోగినులూ, టీచర్లూ, ప్రొఫెసర్లూ,  పై అధికారులూ, .. తరచి తరచి చూస్తె ప్రతీ ఒక్కరినించి మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాము కదా... స్ఫూర్తి పొందుతూనే ఉంటాము కదా.. అలా అనేక విధాలుగా, వివిధ సమయాలలో మనకు సహకరించి, మన జీవితాలని  స్పృశించిన స్త్రీ మూర్తులందరికీ  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
                     ఎందరో మహిళా మణిదీపాలు.. అందరికీ ప్రేమపూర్వక అభివందనాలు..

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...