Saturday, June 11, 2011

గోపాల రావు గారి అమ్మాయి .....అందంగా, బావుంటుంది.

 ఈ టీ.వీ వారు 'సెకండ్ షో    ' పేరిట రాత్రి పదిన్నరకి ( ఒక్కోసారి ఇంకా ఆలస్యంగా ) మొదలు పెట్టి సినిమాలు చూపిస్తుంటే 'ఇంత  రాత్రి అయితే ఎవరు చూస్తారు? ఏదో టైము గడపడానికి వేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ ఈ మధ్యన సిని నటులు  చంద్ర మోహన్, కృష్ణ గార్ల పుట్టిన రోజుల  సందర్భంగా ప్రసారం చేసిన 'గోపాలరావు గారి అమ్మాయి', శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్' సినిమాలని నేనే చివరివరకూ కదలకుండా చూసేసాను. సినిమా మంచిది అవ్వాలే కానీ ఎప్పుడైనా , ఎలాగైనా జనం చూస్తారని అర్ధం చేసేసుకున్నాను :).

 కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ' అబ్బ భలే హాయి గా 'ఉంది అనిపిస్తుంది.. ఇక్కడ 'హాయి 'అన్నమాట తప్ప మరేమీ తట్టడమే లేదు.  ఎందుకంటే మొదటినించీ చివరివరకూ ఎవరో చక్కగా గీసిన గీత లా వంకర లేకుండా, సాఫీగా  సాగిపోతుంది కధ. సరిగ్గా అలాంటిదే ఈ సినిమా.

పక్క పాపిడి తీసుకుని గిరజాల జుట్టు దువ్వేసుకుని, పోట్టమీదకి ఉన్న పాంటు లోకి చొక్కా టక్ చేసేసుకుని, నాలుగో,  మళ్ళీ మాట్లాడితే ఆరో ఇంచెల హీల్ ఉన్న బూట్లు వేసేసుకుని కనిపిస్తూ  కేవలం తన నటనా పటిమతోనే తను నిజంగా  హీరోని అనిపించుకునే హీరో ..

అరే!.. ఈ అమ్మాయి ఎవరో అచ్చం మన పక్కింటి లోనో, మన ఇంటిలోనో  ఉండే అమ్మాయిల్లా ఉందే? అనుకునేలా ఉన్న హీరోయిన్.. మళ్ళీ అదే.. నటనే.. గట్టిగా మాట్లాడితే ఫాన్సీగా కనిపించే చీరలు కానీ, నగలు కానీ, అసలు మేకప్  కూడా ఉన్నట్టే  కనిపించదు.  పాత్రోచితంగా, చక్కగా నటించడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య అని ఎందుకంటారో మరొకసారి తెలుస్తుంది.

ఎక్కడా నటిస్తున్నట్టే అనిపించదు.. పాత్రల్లో ఒదిగిపోవడం అంటే ఇదేనేమో.. అలా అని ఆ పాత్రలేమీ పెద్ద పెద్ద డయలాగులూ, చొక్కాలూ ( ముళ్ళపూడి రమణ గారు చెప్పినట్టు)  ఉన్నవేమీ కాదు. మరీ అంత హావ భావాలు ప్రదర్శింపవలసినవేమీ కాదు. అయినా ఎంతో సహజంగా పాత్రలని పోషిస్తారు చంద్రమోహన్, జయసుధ .

 వీరికి తోడు.. వయసు ముందుకీ, మనసు వెనక్కీ పరిగెడుతున్న ఒక డబ్బున్న  రావు గోపాలరావు ,  ఆయన మాటకి మాట, విసురుకి విసురూ చురుగ్గా వేసే ఆయన  ఇల్లాలు  షావుకారు జానకీ.. క్లుప్తంగా చెప్పాలంటే వీరి నలుగురి మధ్యనా ప్రేక్షకులకి అర్ధం అవుతూనే, పాత్రలని మాత్రం  కన్ఫ్యూజ్ చేస్తూ  హుషారుగా నడుస్తూ, నవ్వించే కధనం.. కద కి  అవసరమైనంతవరకూ కావలసిన మిగతా పాత్రలు.  పంచ్ లూ, పించ్ లూ లేకుండా నే నడుస్తూ, అర్ధవంతంగా సందర్భానికి తగ్గట్టుగా రాసిన సంభాషణలూ. చాలా బావుంటుంది.

'పని చేస్తూ ఉంటె వాళ్ళే పరిచయం అవుతారు, పని మానుకొని పరిచయాలు చేసుక్కోక్కర్లేదు ' అనేది ఈ మధ్యన వచ్చిన ఒక సినిమాలో ని వాక్యం.. అలాగే కధా, కధనాల్లో హాస్యానికి చోటూ, నటీ నటుల్లో ప్రతిభా ఉంటె చాలు, నవ్వులు అవే పూస్తాయి. హాస్యం పేరిట అక్కర్లేని పాత్రలు కల్పించి అపహాస్యం పాలు కానక్కరలేదు అని చూపిస్తుంది ఈ చిత్రం. ప్రధాన పాత్రలతో సహా అందరూ చక్కని హాస్యాన్ని చిలికిస్తారు.

ఇక పాటలు.. చక్రవర్తిగారు చేసిన మంచిపాటల్లో ఇవి తప్పకుండా ఉంటాయి అనిపిస్తుంది.. టైటిల్ సాంగ్, సుజాతా ఐ లవ్ యూ సుజాతా, వస్తావు కలలోకీ, మనవే వినవా.. ఇలా అన్ని పాటలు విన్న వెంటనే ఆకట్టుకోవడమే కాదు తరవాత కూడా మనం హమ్ చేసుకునేలా ఉంటాయి.  మాములు పార్కుల్లోనే తీసారు మరి, అందులోనూ ఒకటి జూ పార్క్ లో.  బాంకాక్ లు, స్విట్జర్ లాండు లలోనూ కాదు. అలా తీయడం తప్పని కాదు, అవసరం లేని చోట అక్కర్లేదు కదా అని. 

ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఈ సినిమా, ఆ తర్వాత హిందీ లో తీసిన సినిమా చూసాను. నాకెందుకో తెలుగు సినిమాయే బావుంది. హిందీ చిత్రానికి మాతృక ప్రియదర్శన్ గారి మలయాళం సినిమా అని చదివాను,కానీ అది తెలుగు సినిమా కంటే ముందు వచ్చిందా,  లేదా అనేది నాకు తెలియదు. మిత్రులెవరైనా తెలిస్తే దయచేసి  చెప్పండి.

Wednesday, June 1, 2011

మిధునం-శ్రీ రమణ కధలు.

 ఎనిమిదంటే ఎనిమిది కధలు.. అన్నీ ఆణిముత్యాలు. మళ్ళీ మళ్ళీ  చదవాలని, మరెన్నో సార్లు తలుచుకోవాలనీ,  కేవలం మనం చదివేసి ఊరుకోకుండా అందరితోనూ పంచుకోవాలని అనిపించే కధా రత్నాలు. చాలా సరళంగా, సుతిమెత్తగా, పౌర్ణమి నాటి వెలుగులో గోదారిమీద అలవోగ్గా తేలిపోయే వెన్నెల కిరణం లాంటి రచనా  సరళి, ప్రతీదీ వేటికవే విలక్షణంగా కనిపిస్తూనే, నిత్యజీవితంలో ఎదురయే సంఘటనల లాంటి  ఇతివృత్తాలూ, మన మధ్యనే కదిలే మనుషుల్లాంటి పాత్రలూ, సున్నితమైన హాస్యం.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎక్కడా ఆగాలో తెలీదు నాకు.. ఎన్ని సార్లు చదివి ఉంటానో ఇప్పటికి.. పుస్తకం పేరున్న కధ అన్నింటికంటే చివర ఉంది కనక వెనకనించి రాసుకొచ్చాను.. ఇదో సరదా అనుకుందాం ఇప్పటికి.
1 . మిధునం: పుస్తకం శీర్షిక పేరే ఈ కధ పేరు. ఎన్నో దశాబ్దాల సంసార జీవిత రధాన్ని ఎంతో ముచ్చటగా కలిసి నడుపుకునే వృద్ధ దంపతుల కధ ఇది .. ఈ కధ రాసిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. ఇది చదివి బాపు గారు తన స్వదస్తూరితో రాసి ఇచ్చారుట. రచన పత్రిక వారు ముఖచిత్రంగా బాపు గారి బొమ్మ వేసి , వారి దస్తూరిలోనే ప్రచురించారు రెండుమూడుసార్లు (మొదటిసారి వేసినప్పుడే నేను ఈ కధ    మొదటిసారి  చదివాను ). కలిసి బతకడం సులువు.. కలిసి జీవించడం..జీవితాన్ని ఆస్వాదించడం చాలా కష్టం.. దాన్ని సాధ్యం చేసుకోవడమే అందమైన దాంపత్యానికి ఆధారం అని నేను అనుకుంటాను. ఈ కధలోని అప్పదాసుగారికీ, వారి సతీ మణి కీ తెలిసిన విషయాల పరిధి చాలా చిన్నది కావచ్చు.. దాంట్లోనే వారు తమకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరుచుకున్న తీరూ, రోజంతా ఒకరికోకరుగా మెసిలే విధానం, దానిలో దొర్లే వెక్కిరింతలూ, చతురోక్తులూ, చమత్కారాలూ..పాయసంలో జీడిపప్పు , కిస్మిస్ ల లా రుచిని మరింత పెంచుతాయి . ముగింపు మాత్రం ఆర్ద్రత తో కూడి మనసుని బరువు చేస్తుంది.. చాలా గొప్ప కధ. దీనిని సీరియల్ గా తీస్తే ఎలా ఉంటుందా? ఆ పాత్రలకి ఎవరు బావుంటారా? అనుకుంటూ ఉంటాను చాలా సార్లు.  

2.పెళ్లి: సమకాలీన సమాజానికి అద్దం పట్టే చిన్న కధ. ఒకానొక ఆఫీసర్ గారి అమ్మాయి పెళ్లి నేపధ్యంలో రాయబడింది. అధికారం, హోదా దొరకగానే ప్రతీ ఒక్కరూ తమ పరిధిలో తమ కన్నా కింద స్థాయి  ఉద్యోగులని ఎలా ఇరుకున పెట్టి తమ పనులు చేయించు కుంటారో, వారు కూడా పై అధికారుల ప్రాపకం కోసమో, మరే ఇతర మొహమాటాల వల్లనో లేని పోనీ ఇబ్బందులకి గురి కావడమూ  కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. తాడిని తన్నేవాడు ఒకడైతే  , వాడి తలని తన్నేవాడు మరోకడూ.. గుడిని మింగే వాడు ఒకడైతే  , గుడినీ,  లింగాన్నీ  కూడా మింగేవాడు మరొకడు.. అన్న రీతికి అద్దం పడుతుంది.

3. బంగారు మురుగు: మానవతా వాది అయిన ఒక బామ్మగారూ, ఆ బామ్మకూచి అయిన  బుల్లి మనవడూ,  వీళ్ళిద్దరూ అమర్చుకున్న  తమదైన ఒక చిన్న బాదం చెట్టు తొర్ర, ఆవిడ చేతిన ఉన్న బంగారు మురుగూ, దాని మీద కన్నేసిన కూతురూ, కోడలూ.. మనవడి పెళ్ళికోసం ఆవిడ నడిపిన మంత్రాంగమూ .. అది తెలుసుకున్న మనవడు పడే బాధా. వెరసి  ఎంతో హృద్యంగా సాగే ఇది తప్పకుండా  చదివి తీరాల్సిన కధ. బాదం చెట్టు నీడలో సేద తీరుతున్న బామ్మ మనవడి బొమ్మ ఎంత బావుంటుందో.. బామ్మగారు చెప్పే జీవిత సత్యాలు, మానవతా సూత్రాలు అంతే  బావుంటాయి.

4. షోడా నాయుడు: మామూలు ఇతివృత్తాలతో    ఇంత గొప్పగా కధ రాయవచ్చా అనిపిస్తుంది ఈ కధ చదివితే. ఒక్కసారి కాదు చదివిన ప్రతీసారీ. షోడా సీసా లో ఉండే నీలం రంగు గోళీ కాయ  మీద ఒక చిన్న కుర్రాడు మోజు పడతాడు, కారణం అలాంటిది తన స్నేహితులందరి దగ్గరా  ఉంది, తనకి తప్ప.. పీర్ ప్రెజర్ మరి.. అది సంపాదించడానికి సామ దాన, బేధ, చోరో పాయాలన్నీ ( దండం లేదు లెండి) పాటించినా ఫలితం ఉండదు... ఊరిలో ఉన్న షోడా నాయుడి వెనక తిరిగి కాళ్ళరుగుతాయే తప్ప. కాలక్రమంలో పట్నం లో చదువుకుని పెద్ద ఆఫీసరయి పోయిన ఆ కుర్రాడి దగ్గరకి అదే షోడా నాయుడు మరొక షోడా మిషన్ కోసం అప్పుకి రావడం, వచ్చినప్పుడు మర్చిపోకుండా నీలం గోళీకాయలు పొట్లం కట్టి తేవడం, అది ఇవ్వడానికి మొహమాట పడుతూ ఉండగానే ఆ మూట చేజారి అవన్నీ నేలమీద దొర్లడంతో కధ  ముగుస్తుంది. నా బాల్యాన్ని పొట్లం కట్టి తెచ్చిన సిద్దుడిగా అనుకుంటాడు  హీరో. నీలం గోళీ పిచ్చిలో కుర్రాడికి సూర్యుడు కూడా   నీలం గోళీలా  కనిపించడం, తన ప్రపంచమంతా షోడా మయమే అయిన నాయుడికి కువైట్ అయినా, కుగ్రామమైనా షోడా మిషనే ధ్యాసగా ఉండడం లాంటి విషయాలెన్నో ఎంతో హత్తుకుపోతాయి.

5. ధనలక్ష్మి: తెలివైన ఒక ఆడపడుచు చితికిపోయిన కుటుంబపు ఆర్ధిక స్థితినే  కాదు, సంసారాన్ని కూడా ఎంత చక్కగా దిద్దుకోగలదో చూపించే కధ. పెద్ద చదువు లేకపోయినా, తనకున్న లౌక్యాన్నీ, వ్యవహార జ్ఞానాన్నీ, కష్టపడే తత్వాన్నీ మదుపుగా పెట్టుకుని అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో,  'మేనేజ్మెంట్ వారికి పాఠంగా పనికివస్తుంది 'అని తోటి పాత్రలచేత ఎలా అనిపించుకుందో చూపిస్తూ కధ నడిపిన తీరు ఎంతో హాయి కోల్పుతుంది. కార్పోరేట్ కంపెనీలు నడిపినంత శ్రద్దగా నడుపుతుంది ధనలక్ష్మి తన వ్యాపారాన్ని. అంతేకాదు 'అన్నీ ఉండి  సంసారం లో సుఖం లేకపోతే ఏం  లాభం? అంటూ చాకచక్యంగా భర్త ఈగోని కనుక్కుని సరి ఐన మార్గంలో పని సాధించుకుంటుంది.. ఆవిడ చెప్పే వ్యాపార సూత్రాలు నిజంగానే 'ఆహా' అనిపిస్తాయి.   కొడిహళ్లి మురళీమోహన్ గారికధా జగత్  లో కూడా  చోటు చేసుకుంది ఈ కధ.

6. వరహాల బావి: అందరికీ కన్నతల్లిలా అనిపించే వరహాలమ్మ, ఆవిడకి జాగీర్దార్ ఇచ్చిన ఈనాము, నీరు లేని ఆ రెండు ఊర్లకి ఆమె తదనంతరం  ఆ ఇల్లు ఉన్న చోట తవ్విన బావీ కధా నేపధ్యం. గాజులబత్ అనే గాజులతని పరంగా సాగుతుంది. వరహాలమ్మ ని గౌరవించినంతగా ఆ బావిని అందరూ చూడటమూ, ఆవేశ కావేశాలకి లోనయి మతం పేరిట గొడవలు పడటమూ, గాజులబత్ వల్ల మళ్ళీ ఒకటీ కావడమూ కధని చక్కగా నడిపిస్తాయి. మంచి కధ. గాజులయ్యా, అతని మాటలు చాలా సహజంగా, ఆత్మీయంగా ఉంటాయి.

7. తేనెలో చీమ : పలుకుబడీ, ఆస్తి పాస్తులపరంగా ఇద్దరు పెద్దవారి మధ్యన నలిగిన ఒక బలహీనుడి కధ ఇది. వారిద్దరి మధ్య నడిచిన పందెం లో తన స్వేచ్చనీ, కావలసిన బ్రతుకునీ తుదకు తల్లినీ పోగుట్టుకుంటాడు శీనయ్య. అది మొదటిసారి తేనెలో ఇరుక్కోవడం. పందెం ముచ్చట తీరగానే వారు తనను పక్కకు నెట్టేస్తే బ్రతుకుతెరువు వెతుక్కుంటూ బావమరిది దగ్గరకి వచ్చి అక్కడ రౌడీలని తరిమి కొట్టినందుకు అందరూ మెచ్చుకుంటే మళ్ళీ తేనెలో ఇరుక్కున్నానా  అని అనుమానం రావడంతో ముగుస్తుంది.

8. అరటిపువ్వు స్వాములారు: భలే చమత్కారంగా సాగిన కధ ఇది. రకరకాల ఉదాహరణలతో అరటిపువ్వుని వర్ణిస్తూ, అరటిపువ్వుని, వేదాంతాన్నీ కలిపి బహు చతురతతో స్వాములారు చేసే ప్రసంగాలూ, తరవాత అరటిపువ్వు వడలు వేసి ఫలహారం చెయ్యడం నవ్విస్తాయి. చివరికి ప్రజలకి తెలిసి స్వామివారికి బుద్ధి చెప్పడంతో ముగుస్తుంది.. చక్కెరకేళి కాదు రాజకీయ కేళి.. ఎమ్మేల్లెలందరూ మంత్రులు కానట్టే పూతలన్నీ కాయలు కావు.. లాంటి వాక్యాలెన్నో.   

కొన్ని కధలు చాలా  నచ్చితే, కొన్ని చాలా, చాలా  నచ్చుతాయి.. బంగారానికి సంపెంగ పరిమళం అబ్బినట్టు  కధకు అతికినట్టుగా వేసిన  బాపు గారి బొమ్మలు మురిపిస్తాయి.   అందరూ తప్పకుండా చదవవలసిన  పుస్తకం. 

చివరగా ఒక్కమాట. మిధునం కధ చాలా  నచ్చి ప్రముఖ సాహితీ వేత్తా, చలనచిత్ర దర్శకుడు శ్రీ. ఎం. టి . వాసుదేవన్  నాయర్ ఈ కధ ఆధారంగా 'ఒరు ఉరి పుంజరి' (A Slender Smile) అనే పేరుతొ చలనచిత్రాన్ని రూపొందించారుట. అది ఎలాగైనా చూడాలని నా కోరిక. మిత్రులెవరైనా దీని గురించి తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి. 

 ఇలాంటి మంచి  కధలని మనవారు కూడా చిత్రాలుగానో, సీరియల్స్ గానో నిర్మిస్తే చూడాలని ఆశ. సినిమా సంబంధ కార్యక్రమాలకి మించి విస్తరించని మన టీ .వీ  చానెళ్ళ వారి ఆలోచన పరిధిలో వీటిని పాడు చేసే అవకాశమే ఎక్కువ ఉందేమో అని భయం కూడా. అందుకే వీటిని ఇలాగే వదిలేస్తేనే మంచిదేమో .. మన తలపుల్లో, ఊహల్లో ఎలాగైనా నిర్మించుకుని ఆనందించ వచ్చు కదా ..

Monday, May 30, 2011

ఒంటి చెయ్యీ... వంకర మెడా...



        కాఫీ పొడి కొందామని కాఫీ డే వాళ్ళ షాప్ కి వెళ్లాను. పీ.బీ. రిచ్ పావు కిలో అని చెప్పాను, అప్పటికే ఆ షాపు అతను ఒంటి చేత్తో ఉన్నాడు. కంగారు పడకండి.. ఒక చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు.  నేను చెప్పినది.. 'ఆ విన్నాను' అన్నట్టు తల ఆడించి ఫోన్ మాట్లాడుతున్నా చెయ్యి అలాగే ఉంచి ఖాళీగా ఉన్న ఎడం చేత్తో కవర్ తీసాడు.. అది పక్కన పెట్టి డబ్బా మూట తీసాడు. ఇప్పటివరకూ ఒంటిచేత్తో బానే నడిపించాడు, ఆ తర్వాత కుదరలేదు పాపం. అప్పుడు వంకర మెడ మొదలయ్యింది.. రెండు చేతులతో కాఫీ పొడిని కవర్లో వేసి, తూచడం, టేప్ వెయ్యడం ఇలాంటివన్నీవంకర మెడతో పూర్తీ చేసి మళ్ళీ ఒంటి చేతికి వచ్చేసాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు పది నిమిషాలు పట్టింది..అప్పటివరకూ ఇది కొనసాగుతూనే ఉంది. నేను చెప్పిండ పీ. బి.రిచ్ అన్న మాట తప్ప మరొక మాట లేదు, నాతోనే కాదు. మరొక ఇద్దరు కస్టమర్స్ తోనూ ఇదే పరిస్థితి.
       అక్కడనించి పళ్ళు కొందామని వచ్చాము. అక్కడా ఇదే పరిస్థితి.. అక్కడ మొదట వంకర మెడ తర్వాత ఒంటి చెయ్యి.. రోడ్డు మీద ఎవరిని చూసినా అంతే.. కొందరైతే చెవులు మూసుకుపోయి ( మరేమీ లేదు.. ఇయర్ ఫోన్ లు) నడుస్తూ వెనకాల హారన్ లు వినిపించక పోవడాలు, ఫోన్ లో మాట్లాడేది తమకెంతో ప్రియమైనవారైతే తన్మయత్వం లో కళ్ళు కూడా కనపడకపోవడం చాలా మామూలు అయిపోయింది. వీటన్నిన్తివల్లా లేని అవకరాలు ఎన్ని వస్తాయో అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఒంటి చెయ్యీ, వంకర మెడా బాగా కనిపిస్తున్నాయి. 


Tuesday, May 10, 2011

నాలుగు ఊళ్లు- నాలుగు పాటలు..

నాలుగు ఊళ్లు తిరగడం.. 
      నలుగురితో నారాయణా అనడం..                 
               నాలుగు మంచి  మాటలు మాట్లాడడం ...       ఇంతేనా..
                            నాలుగు కాలాలూ ..
                                      నాలుగు వేదాలూ
                                                 నాలుగు  దిక్కులూ,
                     ఇలా. నాలుగుకీ, మనకీ ఉన్న అనుబంధం కొంత ఎక్కువే అని చెప్పాలి. అందుకే. కూర్చున్న చోటినించీ కదలకుండానే నాలుగు గొప్ప ఊళ్ళని మన కళ్ళముందు కనిపించేలా చేస్తూ, ఆ నగర దర్శనం చేయించే పాటలని ఒకచోట చేర్చే ప్రయత్నం ఇది.  ఇలా చదివేసి, అలా  ఆ నాలుగు ఊళ్లూ మీరు కూడా తిరిగి వచ్చేయండి . ఇంకెందుకాలస్యం?
1. మహాబలిపురం, మహాబలిపురం:  బాలరాజు కధ   లోని ఈ పాట  చాలు,  మహాబలిపురం అనే చారిత్రాత్మక ప్రదేశపు    చరిత్రనీ, ప్రాభవాన్ని చెప్పడానికి. ఈ చిత్రంలో గైడ్ గా పనిచేసే చిన్నారి  బాలరాజు  ఎంతో హుషారుగా చెప్పిన కదే ఈ పాట. ఇది అక్కడ పని చేసే ప్రతీ గైడూ  కూడా  ఒక పుస్తకంగా భావించతగిన పాట ఇది. ఈ పాట మనసులో తలుచుకుంటూ మహాబలిపురం అంతా  అవలీలగా చూసి రావచ్చు. 
  భారతీయ కళా జగతికే  గొప్ప గోపురమైన ఈ ఊరుని  కట్టించాడు పల్లవరాజు, ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు.. అంటూ మొదలు పెట్టి పల్లవరాజుల గొప్పతనాన్ని  గురించి చెప్తాడు మన బాలరాజు మొదట. ఆ తర్వాత ఏకాండి శిలలనించి అద్భుతంగా చెక్కబడిన పాండవుల రధాలని పరిచయం చేస్తూ...'వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, తాము సాటిలేని వాటిమంటూ చాటుతున్నవి 'అంటాడు. 
    తర్వాత చరణంలో కన్నులవిందుగా మలచబడిన  మహిషాసుర మర్దనాన్నీ , శ్రీ కృష్ణావతారంలో గోవర్ధన పర్వతం ఎత్తడం, వరాహ అవతారంలో భూదేవిని కాపాడడం లాంటి విషయాల గురించి వివరిస్తాడు మన చిన్నారి మార్గదర్శకుడు. తరవాత పాశుపతాస్త్రం కోరి అర్జునుడు తపస్సు చేసిన వైనాన్నీ, అది చూడటానికి కదలి వచ్చిన సృష్టినీ మన కళ్ళ ముందు ఉంచుతాడు, అంతేకాదు 'ఆ సృష్టికే ఈ శిల్పం ప్రతి సృష్టి 'అంటాడు.
       చివరగా సంద్రంలో కలిసినవి కలిసిపోయి ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయింది అని బాధపడుతూనే .. ఇది దర్శిస్తే మన పాపాలన్నీ పోవడం నిత్యం అంటాడు. ఎంతో సరళమైన మాటలతో, కేవలం చరిత్రకే కాక, భావానికీ, సెంటిమెంటు కీ కూడా ప్రాధాన్యతనిస్తూ  ఆరుద్ర రాయగా మహదేవన్ స్వరపరచిన ఈ పాట బాపు రమణల చిత్రీకరణతో , సుశీల గాత్రంతో పిన్నలనీ పెద్దలనీ కూడా ఒకే తీరుగా ఆకట్టుకుంటుంది.

2 . వేదంలా ఘోషించే: సుమధురమైన వేద ఘోషతో ప్రారంభమయ్యే ఈ పాట ఆద్యంతమూ మధురమైన వేద నాదం   వినిపిస్తుంది. వేదఘోషనీ, గోదావరి వడినీ, అమరధామం రాజమహేంద్రి వైభవాన్నీ కలగలిపిన ఈ పాట నిజంగా ఒక ఆణిముత్యం. 
       రాజమహేంద్రి ని ఏలిన రాజుల పరిచయంతో మొదటి చరణం ప్రారంభం అవుతూ, రాజరాజ నరేంద్రుడూ, కాకతీయులూ, తెజమున్న మేటి దొరలూ రెడ్డి రాజులూ ఏలారు. మొదట..అంటూ  'గజపతులూ, నరపతులూ ఏలిన ఊరు. ఆ కధలన్నీ నినదించే గౌతమి హోరు అంటూ ఆరుద్రగారి అంత్య ప్రాసల అలంకారాన్ని పొదువు కుంటుంది.  ఈ ఒక్క చరణంలోనే కాదు పాటంతా కూడా అతిమదురమైన ఆరుద్ర గారి అంత్యప్రాసలు మనలని అలరిస్తూనే ఉంటాయి. 
  తర్వాత ఈ ఊరు వెదజల్లిన కవిత్వాల, సాహిత్యపు పరిమళాల పరిచయం హృద్యంగా సాగుతుంది. 'ఆదికవిత నన్నయ్యా రాసేనిచ్చటా , శ్రీ నాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా' అంటూ ఎందరు కవి సార్వభౌములకిది ఆలవాలమైనదీ వివరిస్తారు. 
    తర్వాత  చరణంలో  సహజ శిల్ప కలలతో అలరారే దిట్టమైన శిల్పాల దేవళాలనీ  చిత్రాంగి కనక మెదలనీ ప్రస్తావిస్తూ  చివరగా ఎంతో చమత్కారాన్ని ప్రదర్శిస్తూ 'కొట్టుకుని పోయే కొన్ని కోటిలింగాలు.. అయితేనేం వీరేశ లింగమొకడు   మిగిలెను చాలు అంటూ రాజమండ్రికే తలమానికమనదగ్గ సంఘ సంస్కర్త ని స్మరిస్తారు. 
     ఇలా గోదావరి తీరాన కొలువున్న రాజమహేన్ద్రవరానికి సంబంధించిన అన్ని విశేషాలని ఒక చోట కూర్చి అద్భుతమైన పాటగా మలచినది అక్షరశిల్పి ఆరుద్ర. రేవతీ రాగంలో దీనిని ఎంతో హాయిగొలి పేలా సత్యంగారు స్వరపరిస్తే, వేదనాదాలూ, కవితా గానాల మధ్యన బాలు గారు కమనీయంగా పాడారు.

3 . యమహా నగరి: కదన కుతుహలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన  'రఘువంశ సుదాంభుది' కీర్తనని అనుసరిస్తూ రెండు మూడు పాటలు వచ్చినా సరే ఈ పాటకి సాటి మాత్రం కావు. ఒక మహానగరపు ఉరుకుల పరుగుల జీవితాలనీ, సాహిత్యపు గుబాళింపు లనీ, చిత్ర రాజాలనీ, ప్రముఖ వ్యక్తులనీ.. ఇలా ఏ ఒక్క అంశాన్నీ కూడా వదలకుండా సందర్భోచితంగా మనసుకు హత్తుకునేలా ప్రయోగిస్తూ ప్రతీ పదమూ, ప్రతీ వాక్యమూ, ప్రతీ చరణమూ మరపురానిదిగా మలిచిన  మహా సినీ కవి వేటూరి గారు అద్భుతంగా రచించిన గీతరాజం ఇది. 
         హుగిలీ వారధికి నమహా అంటూ మొదలవుతుంది ఈ యమాహా నగరి చరిత్ర.. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాపం అద్దె ఇంటి కోసం తెలుగులో పాడే ఒక యువకుడి తపన ఇది. పరమహంసనీ, వివేకానందుడినీ ప్రస్తుతిస్తూనే బిజీ బిజీ బ్రతుకుల, గజి బిజీ  ఉరుకుల,పరుగుల  పందెపు బ్రతుకుల మహాపట్నాన్ని  పరిచయం చేస్తూ మొదటి చరణం సాగుతుంది.
     తర్వాత చరణంలో తెలుగింట మెట్టిన కోడలు పిల్ల ఈ బెంగాలీ కోకిల బాలే అంటూ, శరన్నవలాభిషేకం చేయిస్తారు. కధలకూ, కళలకూ నెలవైన ఈ పట్నం యొక్క తీరు తెన్నులనూ చూపిస్తారు. విధులకు సెలవట, అతిధుల గొడవ ట అంటూ. 
        ఆ తర్వాత' వందే మాతరం 'అన్న ఈ 'వంగా భూతలం జాతికే గీతరా 'అంటారు.. ఈ చరణం ఈ పాటకే తలమానికం అనవచ్చు. మాతంగి కాళీ నిలయమూ, చౌరంగీ రంగీ నిలయమూ అయిన ఈ ప్రదేశం సత్యజిత్ రే సితార నీ, ఎస్. డీ. బర్మన్ లాంటి సుస్వర సంగీత ధారనీ ప్రపంచానికి పరిచయం చేసినదీ ఈ నేలె కదారా,ఓ తెరెసా కుమారా అంటారు. 
    ఒక్క వందే మాతరమేనా, జనగణ   మణముల స్వరపద వనముల, హృదయపు లయలను శృతి పరచిన  ప్రియ  శుక పిక ముఖ శుక  రవళులను వినిపించినది ఈ నగరమే అంటారు. ఇంత సొగసుగా ఒక ప్రాంతాన్ని గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ చెప్పడం సాధ్యమా అనిపించేలా సాగుతుంది ఈ గీతం . మణి శర్మ సంగీత సారధ్యంలో హరిహరన్ ఆలపించిన ఈ గీతానికి చిరంజీవి అభినయం కూడా అలంకారమే. అనీ ఎంతో అందంగా అమరిన ఒక  చక్కని పాట.

4 . భంభం భోలే:  పైన చెప్పిన పాటలన్నీ  ఆ ప్రాంతపు భౌగోళిక, చారిత్రిక, సాహిత్యక విశేషాలని  స్పృశిస్తూ సాగితే.. 'వారణాశి ని  వర్ణించే నా గీతికా, నాటి శ్రీనాధుని కవితై వినిపించగా' అంటూ సాగే ఈ పాట అవన్నీ ఏమీ లేకుండానే  వారణాసి వైభవాన్ని అలవోకగా చెప్తుంది . కలం  పట్టి స్వయంగా ఆ  కాశీ  విశ్వనాధుడే  రాసుకున్నాడా అనిపించేలా సాగే ఈ గీతం రాయగలిగే కలం ఒక్కటే.. అదే  సిరివెన్నెల కలం..  అయితే ఆ పాట  పలికిన గళాలు మాత్రం రెండు.. హరిహరన్, శంకర్ మహదేవన్.. ఆ ఇద్దరినీ కలిపి ఒక్కరే పాడారా అనిపించేలా వినిపింప  చేసినది మణిశర్మ.
          'విలాసంగా శివానంద లహరి.. మహాగంగా ప్రవాహంగా మారి.. విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీ పురీ 'అంటూ పల్లవించిన ఈ పాట నిజంగానే స్వరరాగ గంగా ప్రవాహ ఝరి. నమకాన్నీ, చమకాన్నీ యమక గమకాలనీ మనకి పరిచయం చేస్తూ ముక్తికే మార్గం  ఈ మణికర్ణిక అంటుంది.  కార్తీక మాసాన వేల దీపాల వెలుగే శివపూజకు సమానం, ప్రేమతో ఆ దేవుడిని అర్చిస్తే మన కష్టమే తొలగిపోదా అని సరళంగా తెలియ చేస్తుంది. 
     తర్వాత చరణంలో వారణాశి లో శివమహత్యం గురించి చెప్తూ. ఎదురయే శిల  ఏదైనా అయినా సరే శివలింగమే, అది మన్నుతో చేసినది అయినా సరే.. ఆ మహాదేవుడి వరదానమే అంటారు. శాస్త్రిగారు. అంతే కాదు.. ఈ పుణ్యక్షేత్రంలోని గాలిలో నిత్యం వినపడేది ఓంకారమే, గంగలో అణువణువునా కనపడేది ఆ శివ కారుణ్యమే.. కదలిరండి, తెలుసుకోండి, ఈ కాశీ క్షేత్ర  మహిమా అంటారు.. శివానంద లహరి అంత మధురంగా వినబడుతూ, సౌందర్య లహరిలా కనబడుతుంది. చాలా గొప్ప గీతం.

ఇవన్నమాట నాలుగు ఊళ్ళని మనకి పరిచయం చేసే నాలుగు మంచి పాటలు.

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...