నాలుగు ఊళ్లు తిరగడం..
నలుగురితో నారాయణా అనడం..
నాలుగు మంచి మాటలు మాట్లాడడం ... ఇంతేనా..
నాలుగు కాలాలూ ..
నాలుగు వేదాలూ
నాలుగు దిక్కులూ,
ఇలా. నాలుగుకీ, మనకీ ఉన్న అనుబంధం కొంత ఎక్కువే అని చెప్పాలి. అందుకే. కూర్చున్న చోటినించీ కదలకుండానే నాలుగు గొప్ప ఊళ్ళని మన కళ్ళముందు కనిపించేలా చేస్తూ, ఆ నగర దర్శనం చేయించే పాటలని ఒకచోట చేర్చే ప్రయత్నం ఇది. ఇలా చదివేసి, అలా ఆ నాలుగు ఊళ్లూ మీరు కూడా తిరిగి వచ్చేయండి . ఇంకెందుకాలస్యం?
1. మహాబలిపురం, మహాబలిపురం: బాలరాజు కధ లోని ఈ పాట చాలు, మహాబలిపురం అనే చారిత్రాత్మక ప్రదేశపు చరిత్రనీ, ప్రాభవాన్ని చెప్పడానికి. ఈ చిత్రంలో గైడ్ గా పనిచేసే చిన్నారి బాలరాజు ఎంతో హుషారుగా చెప్పిన కదే ఈ పాట. ఇది అక్కడ పని చేసే ప్రతీ గైడూ కూడా ఒక పుస్తకంగా భావించతగిన పాట ఇది. ఈ పాట మనసులో తలుచుకుంటూ మహాబలిపురం అంతా అవలీలగా చూసి రావచ్చు.
భారతీయ కళా జగతికే గొప్ప గోపురమైన ఈ ఊరుని కట్టించాడు పల్లవరాజు, ఆ కధ చెప్పగ వచ్చాడు బాలరాజు.. అంటూ మొదలు పెట్టి పల్లవరాజుల గొప్పతనాన్ని గురించి చెప్తాడు మన బాలరాజు మొదట. ఆ తర్వాత ఏకాండి శిలలనించి అద్భుతంగా చెక్కబడిన పాండవుల రధాలని పరిచయం చేస్తూ...'వీటి మీద బొమ్మలన్నీ వాటమైనవి, తాము సాటిలేని వాటిమంటూ చాటుతున్నవి 'అంటాడు.
తర్వాత చరణంలో కన్నులవిందుగా మలచబడిన మహిషాసుర మర్దనాన్నీ , శ్రీ కృష్ణావతారంలో గోవర్ధన పర్వతం ఎత్తడం, వరాహ అవతారంలో భూదేవిని కాపాడడం లాంటి విషయాల గురించి వివరిస్తాడు మన చిన్నారి మార్గదర్శకుడు. తరవాత పాశుపతాస్త్రం కోరి అర్జునుడు తపస్సు చేసిన వైనాన్నీ, అది చూడటానికి కదలి వచ్చిన సృష్టినీ మన కళ్ళ ముందు ఉంచుతాడు, అంతేకాదు 'ఆ సృష్టికే ఈ శిల్పం ప్రతి సృష్టి 'అంటాడు.
చివరగా సంద్రంలో కలిసినవి కలిసిపోయి ఒంటరిగా ఈ కోవెల మిగిలిపోయింది అని బాధపడుతూనే .. ఇది దర్శిస్తే మన పాపాలన్నీ పోవడం నిత్యం అంటాడు. ఎంతో సరళమైన మాటలతో, కేవలం చరిత్రకే కాక, భావానికీ, సెంటిమెంటు కీ కూడా ప్రాధాన్యతనిస్తూ ఆరుద్ర రాయగా మహదేవన్ స్వరపరచిన ఈ పాట బాపు రమణల చిత్రీకరణతో , సుశీల గాత్రంతో పిన్నలనీ పెద్దలనీ కూడా ఒకే తీరుగా ఆకట్టుకుంటుంది.
2 . వేదంలా ఘోషించే: సుమధురమైన వేద ఘోషతో ప్రారంభమయ్యే ఈ పాట ఆద్యంతమూ మధురమైన వేద నాదం వినిపిస్తుంది. వేదఘోషనీ, గోదావరి వడినీ, అమరధామం రాజమహేంద్రి వైభవాన్నీ కలగలిపిన ఈ పాట నిజంగా ఒక ఆణిముత్యం.
రాజమహేంద్రి ని ఏలిన రాజుల పరిచయంతో మొదటి చరణం ప్రారంభం అవుతూ, రాజరాజ నరేంద్రుడూ, కాకతీయులూ, తెజమున్న మేటి దొరలూ రెడ్డి రాజులూ ఏలారు. మొదట..అంటూ 'గజపతులూ, నరపతులూ ఏలిన ఊరు. ఆ కధలన్నీ నినదించే గౌతమి హోరు అంటూ ఆరుద్రగారి అంత్య ప్రాసల అలంకారాన్ని పొదువు కుంటుంది. ఈ ఒక్క చరణంలోనే కాదు పాటంతా కూడా అతిమదురమైన ఆరుద్ర గారి అంత్యప్రాసలు మనలని అలరిస్తూనే ఉంటాయి.
తర్వాత ఈ ఊరు వెదజల్లిన కవిత్వాల, సాహిత్యపు పరిమళాల పరిచయం హృద్యంగా సాగుతుంది. 'ఆదికవిత నన్నయ్యా రాసేనిచ్చటా , శ్రీ నాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా' అంటూ ఎందరు కవి సార్వభౌములకిది ఆలవాలమైనదీ వివరిస్తారు.
తర్వాత చరణంలో సహజ శిల్ప కలలతో అలరారే దిట్టమైన శిల్పాల దేవళాలనీ చిత్రాంగి కనక మెదలనీ ప్రస్తావిస్తూ చివరగా ఎంతో చమత్కారాన్ని ప్రదర్శిస్తూ 'కొట్టుకుని పోయే కొన్ని కోటిలింగాలు.. అయితేనేం వీరేశ లింగమొకడు మిగిలెను చాలు అంటూ రాజమండ్రికే తలమానికమనదగ్గ సంఘ సంస్కర్త ని స్మరిస్తారు.
ఇలా గోదావరి తీరాన కొలువున్న రాజమహేన్ద్రవరానికి సంబంధించిన అన్ని విశేషాలని ఒక చోట కూర్చి అద్భుతమైన పాటగా మలచినది అక్షరశిల్పి ఆరుద్ర. రేవతీ రాగంలో దీనిని ఎంతో హాయిగొలి పేలా సత్యంగారు స్వరపరిస్తే, వేదనాదాలూ, కవితా గానాల మధ్యన బాలు గారు కమనీయంగా పాడారు.
3 . యమహా నగరి: కదన కుతుహలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన 'రఘువంశ సుదాంభుది' కీర్తనని అనుసరిస్తూ రెండు మూడు పాటలు వచ్చినా సరే ఈ పాటకి సాటి మాత్రం కావు. ఒక మహానగరపు ఉరుకుల పరుగుల జీవితాలనీ, సాహిత్యపు గుబాళింపు లనీ, చిత్ర రాజాలనీ, ప్రముఖ వ్యక్తులనీ.. ఇలా ఏ ఒక్క అంశాన్నీ కూడా వదలకుండా సందర్భోచితంగా మనసుకు హత్తుకునేలా ప్రయోగిస్తూ ప్రతీ పదమూ, ప్రతీ వాక్యమూ, ప్రతీ చరణమూ మరపురానిదిగా మలిచిన మహా సినీ కవి వేటూరి గారు అద్భుతంగా రచించిన గీతరాజం ఇది.
హుగిలీ వారధికి నమహా అంటూ మొదలవుతుంది ఈ యమాహా నగరి చరిత్ర.. నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన చోట పాపం అద్దె ఇంటి కోసం తెలుగులో పాడే ఒక యువకుడి తపన ఇది. పరమహంసనీ, వివేకానందుడినీ ప్రస్తుతిస్తూనే బిజీ బిజీ బ్రతుకుల, గజి బిజీ ఉరుకుల,పరుగుల పందెపు బ్రతుకుల మహాపట్నాన్ని పరిచయం చేస్తూ మొదటి చరణం సాగుతుంది.
తర్వాత చరణంలో తెలుగింట మెట్టిన కోడలు పిల్ల ఈ బెంగాలీ కోకిల బాలే అంటూ, శరన్నవలాభిషేకం చేయిస్తారు. కధలకూ, కళలకూ నెలవైన ఈ పట్నం యొక్క తీరు తెన్నులనూ చూపిస్తారు. విధులకు సెలవట, అతిధుల గొడవ ట అంటూ.
ఆ తర్వాత' వందే మాతరం 'అన్న ఈ 'వంగా భూతలం జాతికే గీతరా 'అంటారు.. ఈ చరణం ఈ పాటకే తలమానికం అనవచ్చు. మాతంగి కాళీ నిలయమూ, చౌరంగీ రంగీ నిలయమూ అయిన ఈ ప్రదేశం సత్యజిత్ రే సితార నీ, ఎస్. డీ. బర్మన్ లాంటి సుస్వర సంగీత ధారనీ ప్రపంచానికి పరిచయం చేసినదీ ఈ నేలె కదారా,ఓ తెరెసా కుమారా అంటారు.
ఒక్క వందే మాతరమేనా, జనగణ మణముల స్వరపద వనముల, హృదయపు లయలను శృతి పరచిన ప్రియ శుక పిక ముఖ శుక రవళులను వినిపించినది ఈ నగరమే అంటారు. ఇంత సొగసుగా ఒక ప్రాంతాన్ని గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ చెప్పడం సాధ్యమా అనిపించేలా సాగుతుంది ఈ గీతం . మణి శర్మ సంగీత సారధ్యంలో హరిహరన్ ఆలపించిన ఈ గీతానికి చిరంజీవి అభినయం కూడా అలంకారమే. అనీ ఎంతో అందంగా అమరిన ఒక చక్కని పాట.
4 . భంభం భోలే: పైన చెప్పిన పాటలన్నీ ఆ ప్రాంతపు భౌగోళిక, చారిత్రిక, సాహిత్యక విశేషాలని స్పృశిస్తూ సాగితే.. 'వారణాశి ని వర్ణించే నా గీతికా, నాటి శ్రీనాధుని కవితై వినిపించగా' అంటూ సాగే ఈ పాట అవన్నీ ఏమీ లేకుండానే వారణాసి వైభవాన్ని అలవోకగా చెప్తుంది . కలం పట్టి స్వయంగా ఆ కాశీ విశ్వనాధుడే రాసుకున్నాడా అనిపించేలా సాగే ఈ గీతం రాయగలిగే కలం ఒక్కటే.. అదే సిరివెన్నెల కలం.. అయితే ఆ పాట పలికిన గళాలు మాత్రం రెండు.. హరిహరన్, శంకర్ మహదేవన్.. ఆ ఇద్దరినీ కలిపి ఒక్కరే పాడారా అనిపించేలా వినిపింప చేసినది మణిశర్మ.
'విలాసంగా శివానంద లహరి.. మహాగంగా ప్రవాహంగా మారి.. విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీ పురీ 'అంటూ పల్లవించిన ఈ పాట నిజంగానే స్వరరాగ గంగా ప్రవాహ ఝరి. నమకాన్నీ, చమకాన్నీ యమక గమకాలనీ మనకి పరిచయం చేస్తూ ముక్తికే మార్గం ఈ మణికర్ణిక అంటుంది. కార్తీక మాసాన వేల దీపాల వెలుగే శివపూజకు సమానం, ప్రేమతో ఆ దేవుడిని అర్చిస్తే మన కష్టమే తొలగిపోదా అని సరళంగా తెలియ చేస్తుంది.
తర్వాత చరణంలో వారణాశి లో శివమహత్యం గురించి చెప్తూ. ఎదురయే శిల ఏదైనా అయినా సరే శివలింగమే, అది మన్నుతో చేసినది అయినా సరే.. ఆ మహాదేవుడి వరదానమే అంటారు. శాస్త్రిగారు. అంతే కాదు.. ఈ పుణ్యక్షేత్రంలోని గాలిలో నిత్యం వినపడేది ఓంకారమే, గంగలో అణువణువునా కనపడేది ఆ శివ కారుణ్యమే.. కదలిరండి, తెలుసుకోండి, ఈ కాశీ క్షేత్ర మహిమా అంటారు.. శివానంద లహరి అంత మధురంగా వినబడుతూ, సౌందర్య లహరిలా కనబడుతుంది. చాలా గొప్ప గీతం.
ఇవన్నమాట నాలుగు ఊళ్ళని మనకి పరిచయం చేసే నాలుగు మంచి పాటలు.
బాగుందండీ.. చక్కని ఎంపిక.. నాకు మాత్రం 'వేదంలా ఘోషించే..' అంటే కొంచం ఎక్కువ ఇష్టం.. ఎందుకో చెప్పక్కర్లేదు కదా :))
ReplyDelete:)) very true..
ReplyDeletevery nice
ReplyDeleteThank you Kottapaalee garu.
ReplyDelete