Wednesday, January 11, 2012

ఉన్నతమైన ఆలోచన.. ఆచరణ. సమాజోన్నతే ధ్యేయం..
      నూతన సంవత్సరం మీ అందరికీ శుభ ప్రదంగానూ, సంతోష దాయకంగానూ ప్రారంభమైంది అని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి  శుభాకాంక్షలు. గడచినా ఏ సంవత్సరమైనా ఒకేలా ఉండదు.. కానీ వచ్చే ప్రతీ కొత్త సంవత్సరమూ కొత్త ఆశలకీ, ఆనందాలకీ, అనుభూతులకి ప్రతీకగానే దాదాపు ఒకేలా  మొదలవుతుంది. కొత్తకున్న మహత్యం అది.. ఆశకున్నబలం అది.. 
     వెళ్ళిపోయిన సంవత్సరం లో రోజూ చేసే పనులు తప్ప కొత్తగా ఏమి చేసాము? అనుకుంటే నాకేమీ కనబడదు. పొద్దున్న నిద్ర లేస్తే, మనకంటే ముందు పరిగెత్తే కాలమూ, దానితో పాటు గడియారమూ, వరసా, వావీ, విసుగూ, విరామమూ లేకుండా ఒకదానితర్వాత ఒకటిగా వచ్చిపడే పనులూ, ఉరుకులూ, పరుగులూ..నిట్టూర్పులూ, కోపాలూ, విసుగులూ,చిరాకులూ .. మధ్యమధ్యలో విహారాలూ, విందులూ.. నవ్వులూ, చుట్టాలూ, అచ్చమైన ఉగాది పచ్చడిలాంటి అనుభవమే.. జీవితమంటేనే షడ్రుచుల సమ్మేళనం  కదా మరి!! మనకంటూ మనం ఎంత చేసుకున్న మన పనుల వల్ల మరెవరికైనా  చిన్న మేలు జరిగినా సరే ఆ తృప్తి ఎంతో వేరు అని నాకనిపిస్తుంది. అలాంటి వారిగురించి చెప్పాలనే ఈ టపా. 
రమేష్ స్వామి
              
ఆర్ధిక రేఖ కి దిగువన ఉన్న పద్దేనిమిది    ఏళ్ళు   నిండిన  పిల్లలని తీసుకొచ్చిఒక చోట  చేర్చి వాళ్ళ కి ఆసక్తి ఉన్న వృత్తి విద్యలలో 75 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ను ఇవ్వడమే కాకుండా, వారికి ఉద్యోగాలిప్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా వాళ్ళందరికీ  సహాయం చేసే ఒక గొప్ప సంస్థ 'ఉన్నతి'. పేరెంత గొప్పదో, ఆదర్శం కూడా అంత గొప్పది.. ఆచరణ కూడా అంతే.. "చిన్న పిల్లలకి, వయసు మళ్ళిన వారికీ తగినంత సేవ చెయ్యడానికి చాలా సంస్థలు ఉన్నాయి, సరి అయిన సమయంలో చదువుకోక, చదువుకునే వీలు లేక, తగిన ఆధారం లేక తిరుగుతున్న   ఈ యువతీ యువకులకి చేయూత నిస్తే, వాళ్ళతో పాటు వారి కుటుంబం కూడా బాగుపడుతుంది కదా" అన్న ఒక ఆలోచన ఈ సంస్థ పుట్టుకకి కారణం అంటారు సంస్థ ఫౌండర్ మెంబర్  శ్రీ రమేష్ స్వామి.సరి అయిన దారి దొరకకపోతే దారి తప్పే వయసు అది.. అందుకే వారికి ఈ సహాయం ఎంతో అవసరం అంటారు ఆయన. 
           బెంగుళూరు లోని అల్సూర్ లో ప్రారంభమైన ఎస్. జీ. బి. ఎస్ ట్రస్ట్ కి అనుబంధ సంస్థగా 'ఉన్నతి'ని బెంగుళూర్ లోని సదానంద నగర్ లో ప్రారంభించారు. ఎస్. జీ బి ఎస్ ట్రస్ట్ చాల రకాలైన కార్యక్రమాలని నిర్వహిస్తుంది. అందులో చాలా ప్రముఖమైనది ప్రతీసంవత్సరమూ గోకులాష్టమి కి జరిగే 'ఉత్సవ్' అనే కర్నాటక సంగీత కార్యక్రమం.గతంలో  అల్సూర్ లో జరిగినా, 'ఉన్నతి' ప్రారంభమైన నాటినించీ ఈ కార్యక్రమం 'ఉన్నతి'ఆవరణలోనే జరుగుతోంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద విద్వాంసులందరూ పాడతారు.. చాలా చాలా బావుంటుంది..ఉచిత ప్రవేశం..చాలా తక్కువ ధరకి భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా దొరుకుతాయి.  ఈ ఏ.సి హాల్ ని కుర్చీలతో కలిపి మరీ చాలా తక్కువ ధరకి అద్దెకి ఇస్తారు ప్రైవేట్ ఫంక్షన్స్ కి.. 
        ప్రతీ బేచ్ లోనూ దాదాపు 100  మందికి  పైన తీసుకుంటారు. తొమ్మిది వొకేషనల్ కోర్స్ లలో నూ, ఇంగ్లీష్ మాట్లాడడం లోనూ ట్రైనింగ్ ఇస్తారు. అందరికీ టిఫిన్లూ, భోజనమూ, లోకల్ వారైతే బస్ పాస్, లేకపోతె హాస్టల్ వసతీ ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారు. Retail sales, field sales, guest care (hotels), guest care (offices), industrial tailoring, Industrial painting, data entry (for BPO), security సర్వీసెస్
 and car driving ల లో ఈ క్లాసులు  నిర్వహిస్తారు. ఇవి కాక ఇంగ్లీష్ మాట్లాడటమూ, లైఫ్ స్కిల్ల్స్ వగైరాలు కూడా నేర్పిస్తారు. ఇప్పటి వరకూ ఎందరినో తీసుకొచ్చి ఇలా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే కాక వాళ్ళని చక్కటి మార్గంలో తీర్చి దిద్దారు.
              ఏ మంచి పని చేద్దామన్నా ఎన్ని అడ్డంకులో..చేయ్యదానికంటే చేయ్యకపోవడానికే ఎక్కువ కారణాలు కనబడతాయి.  "ఊరికే, పైసా ఖర్చు లేకుండా మీకిష్టమైనది నేర్చుకుని ఉద్యోగంలో చేరండి' అంటే కూడా దాన్నోపెద్ద  కష్టంగా భావిస్తారు పిల్లలు. ఇక్కడ క్రమ శిక్షణ తో    ఉండాలి అంటారు, వీలు దొరికితే మానేద్దామని మొదట్లో చూస్తారు. టైముకి రావడం కష్టం అంటారు.  'ఒక్క పైసా తీసుకోవడం లేదంటే ఇందులో ఏదో ఉంది" అన్న ఆలోచన కొందరిది.. 
  కానీ ఒక్కసారి ఈ ప్రోగ్రాం విలువ తెలిసాకా ఇంక వెనకడుగు వేసే ప్రశ్నే లేదు, ఉన్నతిని ఒక గుడిగా భావించి ఎంతో శ్రద్దగా నేర్చుకుంటారు. ఉన్నతి యొక్క ఉన్నతమైన విలువలనీ, అక్కడి టీచర్ల, ఉద్యోగులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. ఇంత పని క్రమం తప్పకుండా చెయ్యడం చాలా కష్టం.. కానీ వారెవ్వారూ కూడా అలా అనుకోరు. .ఎంతో ఇష్టంగా చేస్తారు. ఇంటర్వ్యూలూ, కోచింగ్, ప్లేస్మెంట్, వాలెడిక్తరీ అన్నీ ఎంతో పద్దతిగానూ,  సంతోషంగానూ చేస్తారు .
 ప్లేస్మెంట్ సమయానికి చాలా కంపెనీల వారు వస్తారు. సాఫ్ట్వేర్ కంపీనీలూ, బి.ఫై.వో లు, హోటల్స్, కాఫీ డే, బరిస్టా వంటి వారూ ఇలా.. ఇవన్నీ బయట ఏదైనా కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో జరగాలంటే ఎంత ఫీజ్ వసూల్ చేస్తారో అందరికీ తెలుసు.. ఇక్కడ విద్యార్దినించి డబ్బు తీసుకోవడమనేదే ఉండదు..  ప్రతీ విద్యార్ధికీ ట్రైనింగ్ కీ, వసతికీ, భోజనానికీ అన్నింటికీ కలిపి ఇంచుమించుగా  12000   రూపాయలు ఖర్చు అవుతుంది. 'ఉన్నతి' లాంటి ఆశయంతో ఎవరైనా తమ ఊరిలో ఇలాంటి సంస్థ ప్రారంభిచాలని అనుకుంటే దానికి తగ్గ ట్రైనింగ్, గైడెన్స్ కూడా ఇస్తారు. 2020  సంవత్సరం నాటికి దేశం మొత్తమ్మీద 200  ఉన్నతులు ఏర్పడాలని ఎందఱో యువతీ యువకులకి ఈ సహాయం అందాలని వారి కోరిక. ప్రస్తుతానికి ఒక డజను వరకూ ఏర్పడ్డాయి.
కొందరు అలవాటుగా ఇచ్చే దాతలున్నా ఈ బృహత్కార్యక్రమానికి ఎంతో సహాయం అవసరం అవుతుంది. డబ్బు సహాయం మాట అటుంచితే, ఇంకా ఎన్నో రకాల సహాయం అవసరం అవుతుంది.
1 . విద్యార్ధులని తీసుకు రావడం ( మనకి తెలిసిన పిల్లలు, డ్రైవర్ల, లేదా పనిమనిషుల పిల్లలు ఇలా ఎవరినైనా రికమెండ్ చెయ్యవచ్చు). 
2 . టీచింగ్, వాలంటరీ సర్వీస్: మనకిష్టమైన సబ్జెక్ట్ చెప్పవచ్చు. ముందు టీచర్లకి కూడా శిక్షణ ఇస్తారు..వాలంటరీగా మనకి ఇష్టమైన పని కూడా చెయ్యవచ్చు
3 . ధన సహాయం: మనకి వీలైనంత సహాయం చెయ్యవచ్చు. ఇది 100 % టాక్స్ మినహాయింపు. ఒక విద్యార్ధికి 12000  అవుతుంది. .అంతే ఇవ్వాలని లేదు.. ఎంత కావాలన్నా ఇవ్వచ్చ్చు..ఒక రోజు భోజనం ఖర్చు 3000 .
4 . హాల్ రెంట్: మన ఇంటి ఫంక్షన్స్ కి హాల్ రెంట్ కి తీసుకోవచ్చు.. దానికి కూడా ఇంచుమించు 12000  మాత్రమె తీసుకుంటారని గుర్తు.. 
అన్నింటికంటే ముఖ్యమైనది. గోకులాష్టమి సంగీత ఉత్సవాలలో భాగం పంచుకోవచ్చు. మేము గత మూడు సంవత్సరాలుగా వెళుతున్నాము. ఎందఱో ప్రముఖులని చూసే అవకాశం కలగడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తాము. 
గత సంవత్సరంగా ప్రతీ మూడు నెలలకి ఒకసారి  ఉన్నతికి నేను ఒక న్యూస్ లెటర్ చేస్తున్నాను. బండాత్మకూరు కళ్యాణ్ అనే ఒక అబ్బాయి నాకు H.T.M.L programming లో సహాయం చేస్తాడు. ప్రతీ సారీ ఉన్నతికి సంబంధించిన ఏదో ఒక విషయంతో పాటు, ఉన్నతి లో భాగం పంచుకుంటున్న ఒక టీచర్ని, ఒక ఉద్యోగిని, స్టూడెంట్స్ చెప్పిన అభిప్రాయాలు వగైరాలతో తయారు చేస్తాము.. ఇది ఉన్నతి గ్రూప్ లోనే దాదాపు ఐదారువేల మందికి చేరుతుంది..    ఈ మహా యజ్ఞం లో ఇది నా ఉడతా భక్తీ అనుకుంటాను. గత సంవత్సరం నేను చేసిన మంచి పని ఇది అని సంతోషం గా చెప్పుకోగలను.  మా అబ్బాయి పేరు మీద ఒక విద్యార్ధికి సరిపడే  డబ్బు కట్టాలి అనుకున్నాము, శనివారం వెళ్ళాలి.
  ఉన్నతి వెబ్ సైట్ వివరాలు కింద ఇస్తున్నాను. నేను చేసిన న్యూస్ లెటర్ లింక్ ఇవ్వడానికి కుదరడం లేదు.. మిత్రులెవరికైనా అవకాశమూ, టైమూ ఉంటె మీకు వీలైన సహాయం  తప్పకుండా చెయ్యండి..  మీకెవరికైనా ఉన్నతి మెయిల్ గ్రూప్ లో చేరాలని ఉంటె నాకు మెసేజ్ పంపించండి,లేదా ఈ పోస్ట్ కి కామెంట్ చెయ్యండి.  దానివల్ల వాళ్ళ కార్య క్రమాలు మొదలైన వివరాలు మీకు తెలుస్తాయి. ముఖ్యంగా సంగీత కార్యక్రమాలని మిస్ కాకండి. 
1. http://www.unnatiblr.org/






          

2 comments:

  1. చాలా సతొషం. ఎందిరికొ వెలుగుచుపుతున్న ఉన్నతి కి అభినందనలు.
    హరి నారాయణ

    ReplyDelete
  2. Thank you Hari garu and More Entertainment..

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...