Thursday, June 14, 2012

షాంగై.. కదిలే తెర మీద కళ్ళెదుటి వాస్తవం..

 
ఈ మధ్యన వస్తున్న కొన్ని హిందీ సినిమాలు చూస్తుంటే ఇలాంటివి మన భాషలో ఎప్పుడు వస్తాయో కదా! అనిపిస్తోంది. 'ఖొస్లా కా గోస్లా' అనే ఒక చిన్న చిత్రాన్ని ఫ్లైట్ లో చూసాను మొదటిసారి, పేరు చూసి కామెడీ అనుకున్నాను మొదట్లో, కానీ మొదలయిన పదినిమిషాలలోనే కధలోకి మనల్ని తీసుకుపోయి, చాలా విరివిగా,  దేశంలో దాదాపూ అన్నిచోట్లా ఇంచుమించుగా ఒకే రీతిలో జరుగుతున్న అక్రమ భూ ఆక్రమణలు అన్న రియలిస్టిక్ అంశాన్ని తీసుకుని, దానికి కొద్దిగా నాటకీయత జోడించి కధను నడిపించి, కధానాయకుడి సమస్య తీర్చడమూ, ఆ పరిణామంలో మారిన పాత్రలూ, వారి మధ్యన అనుబంధాలూ.. చూపించిన తీరు నాకు చాలా నచ్చాయి. చాలా బావుందీ సినిమా. 
      దాదాపు ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ దర్శకుడి ఇంటర్వ్యూ పేపర్ లో చదివాను. ఖోస్లా తర్వాత ఆయన మరో రెండు సినిమాలు తీసారు కానీ నేను వాటిని చూడలేదు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన కొత్త సినిమాగురించి చెప్పిన తీరు నాకు చాలా నచ్చింది.. ఆ కొత్త సినిమా నిన్న రాత్రి చూసాము, దాని పేరే షాంగై, ఆ దర్శకుడి పేరు దిబాకర్ చటర్జీ.. తప్పకుండా చూడాల్సిన సినిమా.
            కధ మనకి తెలియనిది కాదు.. ఎక్కడో మరో లోకంలో జరుగుతున్నది కాదు.. సెజ్ లనీ, హొటళ్ళనీ, మన దేశంలోనో, మరీ మాట్లాడితే మన ఖండంలోనే పెద్ద మాల్స్ అని.. టెక్ పార్క్లనీ, బిజినెస్స్ పార్క్లనీ.. పేరేదైతేనేం.. వీలున్నంత భూమిని ఆక్రమించుకుని, అందులో నివసించేవారిని మరింత దూరానికి తరిమేసి, ఆపైన వారికే ఉద్యోగోపాధి కల్పిస్తున్నమని ప్రకటింస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలు చూపించడం అనేది ఒక మాదిరి పెద్ద పట్నాలు/నగరాలలో నిత్యం జరుగుతున్నదే..   మనం అనేక సార్లు చదివినదే.. వినందే.. అందుకే అన్నాను కళ్ళముందరి వాస్తవం, కదిలే తెరమీద కనిపించిందీ అని.'వాసిలిస్ వాసిలికొవ్' రాసిన' జెడ్ 'అనే నవల కి ఆధారం ఈ సినిమా.
       భారత్ పూర్ అనే ఒక గ్రామంలో పాలక సంకీర్ణ ప్రభుత్వం ఇంటర్నేషనల్ బిజినెస్ పార్క్  ( ఐ.బీ. పీ) ని నిర్మించేద్దామని నిర్ణయించి, దానిని ఆ ఊరు సాధిస్తున్న ప్రగతిగానూ, పురోగమనం గానూ చిత్రీకరిస్తూ ఉంటారు ముఖ్యమంత్రీ, సంకీర్ణ  ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీ నేతా. ఆ పార్క్ అక్కడ వెలిస్తే దానివల్ల ప్రజలకి జరిగే అన్యాయాన్నీ, వారు కోల్పేయే బ్రతుకునీ ( కేవలం భూమినే కాదు) గమనించాలనీ, స్థలం కోరితే సంతకం పెట్టవద్దనీ బోధిస్తూ, ఇలాంటి అన్యాయాలమీద పుస్తకాలు రాసే ఒక ప్రొఫెసర్ భారత్ నగర్లో ప్రసంగించడానికి వస్తాడు. ఆ సభ ముగించుకుని బయటకు వస్తూ ఉంటే ప్రజలూ, పోలీసులు చూస్తూ ఉండగానే వేగంగా వస్తున్న ఒక వేన్ గుద్ది చనిపోతాడు.  పోలీసులు వాన్ డ్రైవర్ తాగి ఉన్నాడని అతన్ని అరెస్ట్ చేసి కేసు మూసేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు.
 అది కేవలం ఆక్సిడెంట్  కాదనీ, కావాలని ఒక పధకం ప్రకారం జరిగిన హత్య అనీ  ,  అతని ప్రాణానికి ప్రమాదం ఉన్న సంగతి తను ముందే అందరికీ చెప్పాననీ, అసలేం జరిందో కనిపెట్టాలని పోరాడే ఆ ప్రొఫెసర్ స్టూడెంటూ, చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ పొట్టపోసుకునే ఒక వీడియోగ్రాఫర్ కి దొరికిన కొన్ని కీలక సాక్షాలూ, ప్రొఫెసర్ స్టూడెంటూ, అతని భార్యా చేసిన ఆందోళన ఫలితంగా వేసిన ఎంక్వైరీ కమీషన్ హెడ్ అయిన ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్  మొదట విడి విడిగానూ, తర్వాత కలిసీ ఈ మిస్టరీని ఎలా సాధించారో, ఇందులో ఎవరెవరు ఉన్నారో, తర్వాత ఎమైయిందో అన్న విషయాలను అత్యంత ఆసక్తికరంగానూ, ఆలోచింపచేసేవిధంగానూ చిత్రీకరించిన గొప్ప సినిమా షాంగై.
    దేశంలోని ప్రతీ పట్టణాన్నీ మాకు వీలుంటే షాంగై అంత గొప్పగా తయారుచేసేస్తాం అన్న మన నేతల వట్టి ఊకదంపుడు వాగ్దానాలకి మెటఫర్ గా మాత్రమే సినిమా టైటిల్ పెట్టబడింది తప్ప షాంగై నగరానికీ, కధకీ ఎమీ సంబంధం లేదు.. సినిమాలో ఉన్న ఒక విశేషమేమిటంటే అన్నీ అరటిపండు వలిచి పెట్టినట్టు చేతిలో పెట్టదు. మనల్ని కధలో లీనం చేస్తూనే, కొన్నిసార్లు సన్నివేశాలమధ్య ఉన్న లింకులనీ, పాత్రల లోని భావోద్వేగాలనీ సరిగ్గా గమనించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.  ఇది మర్డర్ మిస్టరీ కాదు కనక, ప్రొఫెసర్ ని  హత్య చేసిందెవరూ ? అనేది పెద్ద సస్పెన్స్ కాకపోవచ్చు, అలానే క్లైమాక్స్ కూడా మనం ఊహించిన దానికి భిన్నంగా ఉండదు కానీ ఈ కధాగమనంలో పాత్రలు నడుచుకునే తీరు, సాటి పాత్రలని నడిపించే తీరూ చాలా ఆకట్టుకుంటుంది.
    కధా, కధనాలమీద చాలా పట్టుతో దర్శకుడు కధ నడిపించిన తీరు చాలా బావుంది . చిన్న చిన్న తప్పులుంటే ఉండవచ్చు కానీ ఓవరాల్ గా సినిమా అంతా  చాలా గ్రిప్పింగ్ గా  బావుంది. ఇక పాత్రధారులంతా కూడా  తాముకనబడకుండా కేవలం  పాత్రలు మాత్రమే మనల్ని పలకరించేలా సమర్ధవంతంగా నటించారు. 


   చాలా చిన్న  పాత్రలో, ముఖ్యమంత్రిగా సుప్రియా పాథక్ అలరిస్తే, అసలైన బ్యూరోక్రాట్ ఎలా ఉంటాడో కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ మరొక చిన్న పాత్రలో గొప్పగా రాణించారు ఫారూక్ షేక్. వీరిద్దరిని చాలా రోజుల తర్వాత తెరమీద చూడడం బావుంది.  ఎవరి ప్రగతి?  ఎవరికోసం ? అన్న నినాదంతో ప్రజలని చైతన్యవంతులని చెయ్యాలని ప్రయత్నించే పాత్రలో ప్రొసేన్ జిత్ చటర్జీ బాగా నటించారు, జాతీయ అవార్డ్ విజేత  అయిన అతని నటప్రతిభకి,  ఈ పాత్రకి మరికొంత నిడివి ఉంటే బావుండేదేమో. ఆయన శిష్యురాలిగా కల్కి కోక్లీన్  చాలా బాలన్సెడ్ గా పాత్రకి తగ్గట్టు చక్కటి నటన కనపర్చింది.   హత్య చేసిన లారీ డ్రైవర్, అతని జతకాడు, ప్రొఫెసర్ భార్య, పోలీస్ ఆఫీసర్స్ అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా బిలీవబుల్ గా కనిపిస్తారు తెరమీద.
  
   వీరందరూ ఒకెత్తైతే మరో ఇద్దరు నటులు మరొక ఎత్తు.. ఈ సినిమా కేవలం వీరిద్దరిదే అని చెప్పడంలో అస్సలు తప్పు లేదు... సీరియల్ కిస్సర్ గానూ, భట్ కాంప్ యొక్క బ్రాండెడ్ కమ్మడిటీగానూ పేరు పడ్డ ఇమ్రాన్ హషిమీకి విలక్షణ   నటుడిగా ఒక ప్రత్యేక ఆవిష్కరణ కల్పించిన చిత్రం. అతని ఆహార్యం, ప్రవర్తన, వీధుల్లో చేసిన డాన్స్ లూ, సరి అయిన మోతాదులో పలికించిన భావాలు 'ఇతనిలో ఇంత మంచి నటుడున్నాడా?  అనిపిస్తాయి.. నటుడు నీరు వంటి వాడు, ఏ పాత్రలో పోస్తే బావుంటుంది అన్నది దర్శకుడు నిర్ణయిస్తే రాణించి ప్రకాశిస్తాడు అన్నదానికి ఇది మంచి ఉదాహరణ. A complete revelation..
    తమిళుడైన ఒక ఐ.ఏ. ఎస్ ఆఫీసర్ గా నటించిన అభయ్ డియోల్ (దేవల్) .. ఉద్యోగధర్మంగా సరి అయిన పని చెయ్యాలా? తన స్వార్ధంకోసం సరి అయినది చెయ్యాలా అన్ని చిన్న మీమాంసతోనూ, శృతి మించని తమిళ యాసతోనూ ( హిందీ సినిమాల్లో ఈ యాసని ఎంత అతిగా చూపిస్తారో మనకు తెలుసు) చాలా సెన్సిటివ్ గానూ, సటిల్ గానూ తన పాత్రని పోషించిన తీరు నిజంగా సుపర్బ్. చాలా మెత్తటివాడిగానూ, ప్రభుత్వానికీ,  అధికారులకీ వినయుడిగానూ ఉండే అతను ఎంక్వైరీ జరిపేటప్పుడు అధికారాన్ని సద్వినియోగం చేస్తూ తీసుకున్న నిర్ణయాలూ, తన పై అధికారిని పార్టీలో అదే హావభావలతో హెచ్చరించి. తర్వాత ఎం చెయ్యాలో సూచించినప్పుడూ, ఇంకా అనేక సన్నివేశాలలో అద్భుతమైన నటన కనబరిచాడు అభయ్. చాలా,  చాలా బావుంది అతని అభినయం.  మొదటినించీ కూడా ఇతను ఎంచుకునే సినిమాలూ, పాత్రలూ విభిన్నమైనవే కావడం, వాటన్నింటిలోనూ కూడ అతను తన ప్రతిభతోనూ రాణించడం అభయ్ నటనకి కొలబద్దలంటే అతిశయోక్తి కాదు.
      క్లైమాక్స్ కొంత నిరాశ పరిచింది. కానీ 'అవినీతి కొంతమంది వ్యక్తులలో మాత్రమే కాదు, ఎంతో మందితో, మరెంతో మంది కోసం   నడపబడుతున్న వ్యవస్థలో ఎంత ముఖ్య భాగమైపోయిందో! అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది.. హార్డ్ హిట్టింగ్ రియాలిటీ..
      ఒక మంచి సినిమా చూసి ఇంటికి వస్తున్నాం అన్న తృప్తితో ఇంటికి వస్తూ ఉంటే నాకో అనుమానం వచ్చింది.. ఇలాంటి సినిమాలు చిన్న ఊర్లలోనూ, సింగిల్ సినిమా హాళ్ళల్లోనూ ఎంతమంది చూస్తారు? మల్టిప్లెక్స్ సినిమాలుగా పేరు పొందిన ఇలాంటి సినిమాలు చూసే మల్టిప్లెక్స్ లు, వాటిని తమలో దాచుకుని పెంచి పోషించే మాల్సూ కూడా ఇలాగే కట్టి ఉంటారా? అని..
 అప్పటినించీ ఎదో తెలియని డిస్కంఫర్ట్. ఎటువైపు  మన దేశ ప్రగతి ప్రయాణం??
   

4 comments:

  1. నేను చూసాను ఈ చిత్రాన్ని నాకు కూడా నచ్చింది.
    మీ సమీక్ష బాగుందండి!

    ReplyDelete
  2. sameeksha bhagundandi.'
    naa blog layout lane undi, meedi kuda, same pinch.

    ReplyDelete
  3. "షాంగై" మాత్రం అద్భుతంగా ఉందండీ!! మేధావులూ, హక్కుల ఉద్యమకారులూ, ప్రొఫెసర్లూ ఎంత మొత్తుకున్నా మన దేశంలో ప్రపంచీకరణ ఆగనట్టే, ఈ చిత్రంలోనూ IBP project చివరకు మొదలైపోతుంది. జనం కోసం పోరాడబోయిన ప్రొఫెసర్ చచ్చిపోయాడు, అతని అనుచరులు చెల్లాచెదురు అయ్యారు, అతని కుటుంబసభ్యులు రాజీపడిపోయారు, హంతకులు జనంలోనే తిరుగుతున్నారు, దోపిడీ కొనసాగుతున్నది. వ్యవస్థీకృత దోపిడీకి వ్యతిరేకంగా పోరాడబోయిన వాళ్లు చావడం, దోపిడీ మాత్రం ఆగకపోవడం - నిజంగా దేశంలో జరుగుతున్నదిదే!! చాలా వాస్తవికంగా ఉంది చిత్రం!!

    ReplyDelete
  4. పద్మార్పిత గారూ.. థాంక్ యూ. మంచి సినిమా కదూ..
    భాస్కర్ గారూ.. ధన్యవాదాలు.. నిజమే.. సేం పించ్..
    అవినాష్ గారూ.. నిజం.. సినిమా చాలా బావుంది. ముగింపు మరోరకంగా ఉంటే బావుండేదేమో అనిపించింది.. కానీ మీరన్నట్టు వాస్తవాన్ని చూపించాలంటే ఇలా ఉండడమే కరక్టేమో.

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...