మొన్నామధ్యన మా అపార్ట్మెంట్ లో ముగ్గుల పోటీ జరిగింది.. ఇది ప్రతీ సంవత్సరమూ చాలా పక్కాగా, కోలాహలంగా జరుగుతుంది.. దాంట్లో మా పక్కింటి ఆవిడకి చుక్కల కేటగిరీలో మొదటి బహుమతి వచ్చింది. సాధారణంగా పోటీలో ముగ్గులు వెయ్యడం మధ్యాహ్నం మూడు గంటలనించీ, ఆరుగంటలవరకూ జరుగుతుంది దాని తర్వాత జడ్జీలు వచ్చి కమ్యూనిటీ హాల్ తలుపులు వేసేసుకుని, విపరీతంగా గుసగుసలాడేసుకుని ( గోడలకి చెవులుంటాయి కదా! మరి) విజేతలని నిర్ణయించేస్తారు.. తర్వాత టెర్రస్ మీద బహుమతి ప్రదానం.. జనాలకి బోర్ కొట్టకుండా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ,ఉంటాయి కూడా.. సాధారణంగా ఇవి మా ఫ్లాట్స్ లో ఫ్రెండ్స్ పెడుతూ ఉంటారు,, ఈ మధ్యన కొద్దిగా మారింది లెండి ఈ వ్యవహారం.. ఇంచుమించుగా ఇలాగే గత మూడు నాలుగేళ్ళుగా జరుగుతోంది.
'మొదటి బహుమతి' అని అనౌన్స్ చేసి ఆవిడ చేతిలో ఒక చిన్న కవర్ పెట్టారు.
విప్పి చూస్తే అదొక కూపన్.. ఆ నెలాఖరు లోగా మాకు రెండు సందుల అవతల ఉన్న షాప్ లో పదిహేను వందలు పెట్టి సిల్క్ చీర కొనుక్కుంటే అక్షరాలా 250 రూపాయలు డిస్కౌంట్. అదీ ఆ కూపన్ సారాంశం
రెండో బహుమతి వారికి 150 రూపాయల డిస్కౌంట్. ..
ప్రైజ్ వచ్చినవాళ్ళకి వాళ్ళు మండింది..
'సవ్యం గా ఇచ్చే ఉద్దేశ్యం ఉంటె చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి ,ఇవ్వాలి లేదా కనీసం ఈ కూపన్ కి సరిపడేదైనా కొనుక్కునే అవకాశం ఉండేట్టుగా ఇవ్వాలి అంతే కానీతప్పకుండా ఫలానా టైములోపల, ఖచ్చితంగా ఇంత డబ్బుకి సరిపడా కొనుక్కోవాలి అని ఈ బలవంతం ఏమిటి' అని..
ఫస్ట్ ప్రైజ్ వచ్చినావిడ "నాకిప్పుడు చీరలూ అవి కొనుక్కునే ఉద్దేశ్యం లేదు...అనవసరం గా నాదగ్గర ఉంచుకోవడం ఎందుకు??ఇంకెవరైనా వాడుకోవచ్చు కదా!" అని రెండు రోజులు పోయాకా మృదువుగా తిరిగి .ఇచ్చేసింది.
ఆవిడ అలా తిరిగి ఇచ్చేయ్యడం ఈ ఆలోచన అమలుపరిచిన ఆవిడకి అస్సలు నచ్చలేదు." ఇప్పుడు కొనుక్కుని తర్వాత ఎప్పుడైనా కట్టుకోకూడదా? బీరువాలో ఒక మూల పడేస్తే ఆ చీర అన్నం అడుగుతుందా? నీళ్ళు అడుగుతుందా ?? ... ఊరికే వస్తుందా అంత .మంచి ఆఫర్.. ఎంత కష్ట పడి సంపాదించానో ! "అని కనిపించిన వాళ్ళందరి దగ్గరా చెప్పి చాలా .బాధపడింది
కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆవిడకి కొంత బిజినెస్ పరిజ్ఞానం ఎక్కువ , తనకి వీలుగా ఉండేటట్టుగా పనులు చేసుకోగలగడమూ .. ఇలాంటి ఆఫర్ల మీదా, ఫ్రీగా ??) వచ్చే వాటి మీదా మోజూ ఎక్కువే.
"కమిటీ వారికి డబ్బులుమిగులుస్తాను ఎందుకు అనవసరంగా ప్రై జూలూ అవీ కొనడం? " అని తెలివిగా చుట్టుపక్క ఉన్న షాపులూ, బ్యూటీ పార్లర్లూ వగైరాల దగ్గరకు వెళ్లి .సంపాదించింది ఇలాంటి కూపన్లు. ఇలాంటి వింత బహుమతులు ఇవ్వచ్చు అని మాకు ఆవిడ ద్వారానే .తెలిసింది .
అంతేకాదు... దగ్గరలో ఉన్న రెస్టారెంట్ల కి వెళ్లి మా అపార్ట్మెంట్ లో జరిగే పార్టీలకి కేటరింగ్ వాళ్లకి ఇప్పిస్తానని, వాళ్ళ దగ్గర తనకీ తన కుటుంబానికీ ఫ్రీ గా డిన్నర్ ఆఫర్ లూ అవీ కూడా తెచ్చుకునేది అని వినికిడి..ఆవిడకీ, కుటుంబానికీ తక్కువ పడకూడదనేనేమో ఆ ఏడాదిఅన్ని ఫంక్షన్ల లోనూ భోజనం ఎప్పుడూ తక్కువ పడడమే...చిన్నవో, పెద్దవో గొడవలు జరగడమే..
అన్నింటికంటే విచిత్రమేమిటంటే చిన్న పిల్లలకి పరుగు పందేలూ, చెంచాలూ- నిమ్మకాయలూ లాంటి పోటీలు పెట్టి దీపావళి ఫంక్షన్ లొనో, న్యూ ఇయర్ కో వాళ్ళ చెతిలొ ఇంటి పక్క బ్యూటీ పార్లర్ వాళ్ళ వాక్సింగ్,ఫేషియల్ లాంటి ( పైన చెప్పిన లాంటివే)) కూపన్లు .పెట్టేది
వాళ్ళు "ఇదేంటి ఆంటీ ?"అంటే?? .
"అమ్మకిచ్చేయి.. షి విల్ బీ హేపీ, వెయ్యి రూపాయల సర్వీస్ 800 కే వస్తే సంతోషం కాదూ మీ అమ్మకి" అనేది పైగా. పోటీ పిల్లలకి పెట్టాము కదా,, కనీసం ఓ పెన్నో,చాక్లేటో ఇవ్వచ్చు కదా, ఏమిటో చెప్తే వినేవాళ్ళకి చెప్పవచ్చు,, తెలీని వాళ్ళకీ చెప్పవచ్చు... అన్నీ తెలుసు అని ఎవ్వరి మాటా వినని వాళ్ళకేం చెప్తాం?? ..
ఇలాంటి చిత్రమైన పనులవల్ల అందరూ అబ్బా!! ఈవిడ పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందిరా బాబూ ! అని ఎదురు .చూసారు..అదొక ప్రహసనం..
మొన్న సమ్మర్ హాలిడేస్ లో మా కజిన్ వచ్చింది మా ఇంటికి. ఎన్నో ఏళ్ల తరవాత కలిసాము ఇంత తీరికగా .. అందుకని ఒకటే కబుర్లు.. హైదరాబాద్ నించి నాకొక సల్వార్ మెటీరియల్ తెచ్చింది, చాలా బావుంది అది..నిన్ననే చెప్పింది అది కొన్నప్పుడు లక్కీ డిప్ కూపన్లు ఇచ్చారనీ, వాటిల్లో ఒక దానికి ప్రైజ్ .వచ్చిందనీ. చాలా సంతోషంగా ఉంది దానికి.. 'నువ్వు చాలా లక్కీయే బాబూ... నీకోసం కొంటేనే నాకిది వచ్చింది, లేకపోతె ఇన్నేళ్ల నించీ కొంటున్నాను ఎప్పుడైనా .వచ్చిందా?' అందికూడానూ. 'నిజమే' అనుకున్నాను .నేనూనూ
''అయితే ఆ బహుమతి ఏమిటో తెలుసా?? నెలకి 500 చొప్పున వాళ్ళు మనకి కూపన్ .ఇస్తారు.. దానికి కనీసం డబల్ వేసుకుని ప్రతీనెలా ఫలానా తారీకు దాటకుండా మనం వెళ్లి బట్టలు .కొనుక్కోవాలి. ఏ నెల కొనకపోయినా అంతే .సంగతులు, అప్పటినించీ మిగతావి ఇవ్వరో, ఏదో లాంటి లక్ష కండీషన్ లు..
ఈ వివరాలు తెలిసాకా, నాకు ఏమనాలో తెలియలేదు..ఇది నిజంగా లక్కీయేనా?? మనకి అవసరం లేకపోయినా ప్రతీ నెలావెళ్ళాలి, చచ్చినట్టు ఏదో ఒకటి కొనాలి ఆ ప్రయత్నంలో మన చేతులూ, కళ్ళూ ఊరుకోక ( ఊరుకోవు, మనకీ, ఆ షాపు వాళ్ళకీ కూడా బాగా తెలుసు ఆ సంగతి ) మరిన్ని వాటి మీద మనసు పారేసుకుంటే, వాటి భారం కూడా మన పర్సులే మొయ్యాలి మరి..
' పోనీ ఆ ఇచ్చేదేదో ఒక్కసారి ఇస్తారా, అంటే అదీ .లేదు. 'చక్కగా ఓ మంచి పట్టుచీర కొనుక్కోవే అని మా అమ్మ సలహా చెప్తే అప్పుడు బయట పడ్డాయి ఈ ఫైన్ ప్రింట్ డీటెయిల్స్.
.' ఇండియన్ ఐడోల్' విజేత శ్రీ రామచంద్ర మొన్నేదో షో లో చెప్పాడు.. అతని ప్రైజ్ మనీ యాభై లక్షలూ కూడా ఒక్కసారి ఇవ్వరుట. మూడునెలలకోకసారి ఐదు లక్షల చొప్పున ఇస్తారుట,ఇంకా ఇస్తూనే ఉన్నారుట అది.
నెలల పాటు సాధన చేసి, కష్టపడి, పాడి గెలుచుకున్నదే అలా వస్తూ ఉంటే మరి అప్పనంగా, అదృష్టం పేరుతొ వచ్చినవి ఇలా కాక ఎలా వస్తాయి మరి? అనుకోవాలేమో ..
ఇలాంటిదే ఇంకొకసారి బిగ్ బజార్ లో జరిగింది, వాళ్ళు మా ఈ షాపు ఆసియాలోనే పెద్దది, ఇంకా మాట్లాడితే ఆసియాకంటే పెద్దది అని టముకేసేస్తు ఉంటే ఎంత పెద్దదో, ఏవిటో చూద్దామని మా ఇంటి దగ్గర ఉన్న బిగ్ బజార్ కి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు లెండి...
ఎనిమిది వందల రూపాయల దుప్పటీ మూడు వందల యాభైకే అని చూసి కొనుక్కొచ్చి, విప్పి చూస్తే ఆ కొత్త దుప్పటి మధ్యలో మూడు రూపాయ కాసులంత ( అదే... మూడు రూపాయ బిళ్ళలు ఒక దాని పక్కన ఒకటి పెడితే ఎంతో అంతన్నమాట... మూడు రూపాయల నాణేలు లేవు, మీరే కరక్ట్) చిరుగు చూసినప్పటి నించీ నాకు ఆ షాప్ అంటే కోపం. వాళ్ళు ఏమి చెప్పినా .నేను నమ్మను .
సరే.. ఇలాంటివే ఓ పది వస్తువులు కొన్నారు కదా, మీ షాపింగ్ భక్తి కి మెచ్చి 'తొందరగా బిల్లింగ్ చెయ్యడమన్న ఒక్క వరం తప్ప మరేదైనా ఇచ్చేస్తాము' అన్నంత బిల్డ్ అప్ ఇచ్చి, అటూ ఇటూ చూసి ఓ 250 రూపాయల కూపన్ నా చేతిలో పెట్టాడు షాపతను.
'సిరిరామోకాలోడ్డడం' మంచిది కాదని తీసుకుని వాడుకుందాం కదా! అనుకున్నామా? చావు కబురు చల్లగా అప్పుడు చెప్పాడు ఇది .ఇప్పుడు వాడుకోలేరు, మళ్ళీ సారి వచ్చినప్పుడు మీరు కనీసం 2500 రూపాయల విలువైన ఫర్నిచర్ కానీ ఎల క్త్రానిక్ వస్తువులు కానీ కొంటే అందులోంచి 250 రూపాయలు తగ్గిస్తాము అని..
అప్పటికే ,అక్కడున్న జనాలనీ, బహు మందగమనంతో కదులుతూ గంట సేపైనా పూర్తి అవ్వని బిల్లింగ్ కార్యక్రమాన్నీ చూసి విరక్తి చెందిన నేను,' ఇంతోటి దానికి మళ్ళీ రావడం కూడానా?? అని వద్దులే బాబూ! అంత భాగ్యానికి నేను అనర్హురాలిని 'అని చెప్పేసి అది తిరిగి అతని చేతిలోనే పెట్టేసి .వచ్చాను ఎందుకంటే అంతకు ముందు ఇలాంటిదే ఏదో కూపన్ వస్తే ఆ షాప్ లో ఆ ధరకి .ఏమీ దొరకలేదు..దానికి సరిగ్గా డబల్ పెట్టి కొంటేనే కానీ ఒక టాప్ కూడా రాలేదు ఇంకా రెండువేలకి ఎలక్ట్రానిక్స్,, ఫర్నిచర్ కూడానా? ఒకసారి కాలితేనే కదా నిప్పు ముట్టుకుంటే తప్పు అని తెలిసేది .అదన్నమాట .సంగతి.
వ్యాపారం చాలా .తెలివైన వ్యవహారం. కొనడానికి వచ్చేవాళ్ళని 'కస్టమర్ ఈస్ కింగ్'' అని ఉబ్బేసి, మభ్యపెట్టి అరచేతిలో స్వర్గం చూపెట్టేయడమే ముఖ్య ఉద్దేశ్యం.. ఎవరో తెలివైన వ్యక్తీ చెప్పనే చెప్పాడు ఎప్పుడో..There are no free lunches in this world అని..
మొదట్లో పండగలకి ప్రత్యేకంగా సేల్ ,అన్నా
తర్వాత మెల్లగా end of season, beginning of season, middle of season సేల్స్ అన్నా,
ఇంకొంచెం ముందుకెళ్ళి ఫరెవర్ సేల్, most happening sale వగైరా, వగైరా పేర్లు పెట్టినా,
దాని వెనక ఉన్న ఉద్దేశ్యం మాత్రం పైన చెప్పిన రాజు గారిని రంజింప చేయడమే.. 'చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు'' .కరక్టే..మొదట రంజింపచేసి పిదప మూర్ఖులని చెయ్యవచ్చు అన్న .సూత్రమే.
మిల మిల లాడే లాంటి మెరుపుల లైట్లూ, ధగధగలాడేలా ట్యూబ్ లైట్లూ, కాసులతో గాలిని కండీషన్ లో పెట్టిన మిషన్లూ, చిరునవ్వులతో కేవలం మనకోసమే పనిలో చేరినట్టు నమ్మించే పడతులూ, పడుచువాళ్ళూ, కింగులా కనిపిస్తూ వంగి వంగి సలాములుపెట్టే కాపలా వాళ్ళూ .. వీళ్ళందరూ ఈ చదరంగంలో పావులు, పాత్రధారులు మాత్రమే .
అసలు చెక్ మేట్ చెప్పేది మాత్రం .కస్టమర్ కే.. ఎందుకంటే కస్టమర్ ఈజ్ కింగ్... హ హ హా..
మీరేమంటారు?????
మీరేమంటారు?????
వాస్తవాలను కళ్ళముందుంచారు.
ReplyDeleteఇదివరకు మహాకవి శ్రీశ్రీకి కూడా ఒక జాతీయ బహుమతి ఇచ్చిన సందర్భంలో డబ్బు ఇవ్వకుండా ఇలాంటిదే డ్రాఫ్ట్ లాంటిదేదో ఇచ్చినట్టు చదివాను. శ్రీశ్రీ, శ్రీరామచంద్ర లాంటి వారికే అటువంటి అనుభవాలయినప్పుడు సామాన్యులం మనమెంత?
యథారాజా తథాప్రజా... ప్రభుత్వమే ఇలా దారి చూపిస్తుంటే ఇంక లాభాలు కోరుకునే వ్యాపారస్తులు వూరుకుంటారా?
Useful post with truths.
ReplyDeleteథాంక్ యూ శ్రీ లలిత గారూ.. పద్మార్పిత గారూ..
ReplyDeleteశ్రీ లలితగారూ.. మీరు చెప్పిన శ్రీ శ్రీ గారి పర్స్ విషయం నేను ఎప్పుడో ఒక పత్రిక లో చదివాను. మీరన్నట్టు అందరూ భాగస్వాములే ఇలాంటి విషయాలలో. .
well said
ReplyDelete"అవసరం" "కావాలి" మధ్య వ్యత్యాసం తెలియనంత వారకు ఈ వ్యాపార ప్రకటనలు జనాలు మోసం చేస్తునే ఉంటాయి. తెలుసుకోవాలసింది మనమే need vs want :-)
ReplyDeleteGood idea is to give that coupon to the organizer as her birthday gift. :-)
ReplyDelete