వారం వారం ఒక్కొక్క రకమైన కుసుమాలని తనలో ఇముడ్చుకుంటూ, అందమైన అల్లికల, మెలికలు తిరుగుతూ, సుమనోహరమైన సుగంధాల పరిమళాలు వెదజల్లుతున్న ప్రమదావనపు కదంబమాలికకి ఇది పదో మజిలీ. ఇప్పటివరకూ స్నేహితులందరూ ఎంతో నేర్పుగా 'ఒక్కరే' ఈ కధ మొత్తం రాసినంత సహజంగా కధ నడిపారు. ఇప్పుడు ఈ పూదండ అల్లిక కొనసాగించే బాధ్యత నాకిచ్చారు. "పరవాలేదే" అనిపించేలా రాసినా నా ప్రయత్నం ఫలించినట్టే అనుకుంటాను. రంగూ, వాసనా చూసి చెప్పండి మా ప్రమదావని లో "వాణి'( సాహిత్య సరస్వతి) 'తలనిండ దాల్చే ఈ పూదండ' లో నేను కూర్చిన పూలు ఎలా ఉన్నాయో ? చూడ ముచ్చటగా ( చదవ ముచ్చటగా అనాలేమో? ) నేర్పుగా, కమనీయంగా అల్లిన నిన్నటి అల్లిక శ్రీలలిత గారిది..
పనిమనిషి లక్ష్మమ్మ కూతురు చంద్రి కి జరిగిన అన్యాయాన్ని గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని భర్తా, మావగారు మిగతా అందరితో కలిసి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుంది సరోజిని.
"కంప్లైంట్ తీసుకుంటారో లేదో? చంద్రికి ఎప్పుడు నయమవుతుందో ? షాక్ నించి జానకి తేరు కుంటుందా ? పువ్వుల్లా విరబూసి నవ్వుతూ తుళ్ళుతూ ఉండవలసిన పసి పిలల్లపైన ఇంత అమానుషమా? ఎక్కడ మొదలవుతున్నాయో, ఎక్కడ పొంచి ఉన్నాయో, ఎప్పుడూ మీద పడతాయో తెలియని ఈ ఘోరాలకి అంతు ఎక్కడ?
బస్ ఎక్కితే కావాలని రాసుకు పూసుకు తిరిగే కండక్టర్, కాలేజీ కెళితే ప్రేమా, దోమా అంటూ వెంటపడే ఆకతాయిలూ, కాదంటే కాల్చడానికి సిద్దపడుతున్న కీచకులూ, పిల్లల వయసెంత? అని అయినా చూడకుండానే వారిని వేధించే కామాతురులూ, పెద్దవారు వీధిలో కెళితే నగలూ, వాటికోసం ప్రాణాలు హరించే దుర్మార్గులూ, ఇవి చాలనట్టు కొత్త రకాలైన సైబర్ క్రైములూ, ఆడపిల్లలైతే ఒకరకం సమస్యలూ, మగపిల్లలైతే మరొక రకమైన సమస్యలూ.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ చూసినా అబ్యూజ్.
ఇవ్వాళ అనితకి ఎదురైన సమస్య చిన్నదా? దానిని ఈ రోజు ధైర్యంగా తిప్పికొట్టింది. రేపు, ఎల్లుండి? మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉంటే? ఇలా ఎన్నాళ్ళు? ఎన్ని చోట్ల? ఎలా తమని తాము కాపాడుకోవడం? ఎలా పిల్లలకి నేర్పించడం? రేపు తన పిల్లలకి ఏదైనా అయితే? ఆ ఆలోచనకే చిగురుటాకులా వణికిపోయింది.ఎవరైనా, ఏదైనా చేస్తే బావుండును. ఈ బాధలు, గొడవలు లేని సమాజం రావడం కలేనా? కల్లేనా ? అసలే సున్నితమైన ఆమె మనసు మరింత క్షోభ పడసాగింది.
" సరోజా! నేను కాసేపు నడుం వాలుస్తాను. వెళ్ళిన వాళ్ళు వస్తే నువ్వు చూసుకుంటావు కదా " అని అత్తగారు వెళ్లి పడుకున్నారు. కొడుకూ, కోడలూ మంచి వాళ్ళు, తమ జీవితం వారి చెంత సుఖంగా నడుస్తుంది అన్న ధైర్యం, నిశ్చింతా తన అత్తా మామల కెంతో హాయినిస్తోంది.అలాగే ఇంత మంచివారి చెంత తనకీ అలాంటి తృప్తే లభిస్తోంది. అలాంటి ధైర్యం, తృప్తి సమాజంలో అందరికీ ఉండాలి కదా, అది లేనినాడు క్షణక్షణం భయంతో బ్రతకడం కన్నా వేరే నరకం ఉందా ? అలాంటి రోజు రావాలంటే ఎం చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? అనుకుంటూ చిరాగ్గా తిరుగుతున్న సరోజినికి ఒక్కసారిగా ఎవరో చెళ్ళున చరిచినట్టుగా అనిపించింది.
"ఎవరో ఎందుకు చెయ్యాలి? మనకి మనమే చేసుకోకూడదా? తను గత కొన్ని రోజులుగా జానకికీ, అలాంటి వారికి చేతనైన సహాయం చేద్దామని అనుకుంటూనే ఉంది కదా.. 'నాకు ఆకలి వేస్తె నేను అన్నం తింటేనే నా ఆకలి తీరుతుంది., అది తీరేదారీ, తీర్చే దారీ నేనే వెతుక్కోవాలి కదా. ఈ మాత్రపు జీవిత సత్యం ఆపదకి వర్తించదా? నాకు ఆపద వస్తే ఎవరో వచ్చి రక్షించాలని ఎందుకనుకోవాలి?' "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా?" ఘంటసాల మాస్టారి పాట గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు తను స్కూల్ లోనూ, కాలేజీలోనూ తరచుగా పాడేది ఈ పాట. నాన్నకు, తనకూ ఎంతో ఇష్టమైనది.
"పాటలో ఉన్న భావం చూడు తల్లీ? మంచి ఎక్కడుందో ,దాని పక్కనే చెడు ఉంటుంది, దీపపు వెలుతురి కింద చీకటి నీడలాగా. వెలుగు మనకి మనం చూపించుకుంటూ నలుగురికీ చూపిస్తే దారి దానికదే కనిపిస్తుంది.. దానికింద క్రీనీడ ని చూస్తే అది గోడమీద నీడలా మరింత పెద్దది అయి భూతంలా భయపెడుతుంది. తప్పు చెయ్యని వారికి ఉండకూడని అవలక్షణం భయం తల్లీ!. ఎందుకంటే మనలో నిద్రాణమై ఉన్న ధైర్యాన్ని అది నిద్ర లేవనీయదు" . ఎప్పుడూ ఇలాగే చెప్పేవారు.
తన పిల్లలు అన్నింట్లోనూ, ఎప్పుడూ స్వతంత్రంగానూ, స్వాభిమానం తోనూ ఉండాలని చెప్పేవారు. అదొక్కటే కాదు తండ్రి తనకెంతో ప్రియమైన నాయకురాలు 'సరోజినీ నాయుడు' పేరు తనకు, అక్కకి 'విజయలక్ష్మి పండిట్ 'పేరు విజయలక్ష్మి అని పెట్టుకున్నానని చెప్పేవారు. గతించిన తండ్రి గుర్తుకు రాగానే మనసంతా ఆర్ద్రమైపోయింది ఆమెకి.. కళ్ళు నిండి కన్నీళ్ళు జల జలా కారాయి.
తనేమో ఇలా వంటిటికి అంకితం అయిపోయి ఏం చేస్తోంది.?. భాస్కర్ గట్టిగా మాట్లాడితేనే కన్నీళ్ళు పెట్టుకునేంత బేల అయిపోయింది కదా తను? తన చిన్ని ప్రపంచం లో తను బాగానే ఉన్నాను అనుకుంటోంది.. 'చిన్ని నా బొజ్జకు శ్రీ రామరక్షా' అనుకుంటూ. కానీ తనకి తెలిసిన ఈ చిన్న ప్రపంచంలోనే ఎంతమంది బాధ పడుతున్నారో కదా? లక్ష్మమ్మ, జానకి. చంద్రి, అనిత ఇలా.. తెలిసి ఇందరు, తెలియక ఇంకెందరో కానీ తనేం చెయ్యగలదు? అసలు ఏమైనా చెయ్యగలదా ? ఇలా ఆమె ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయి.
లక్ష్మమ్మ చెప్పింది కూడా.'ఏం చేసినా టూడెంట్ కుర్రాళ్ళు చెయ్యాలి అని.'. వాళ్ళు ఒక్కళ్ళ వల్లా అవుతుందా? ఈ సమాజం అందరిదీ కాదా?.. తనలాంటి మరెందరిదో కాదా? ఇలాంటివారందరూ కూడా కలిస్తే? పొద్దున్న పదీ, పదకొండు గంటలకల్లా పని పూర్తి చేసుకుని టీ.వీ ల ముందో, పగటి నిద్రతోనో కాలం గడిపే ఇల్లాళ్ళూ , రిటైర్ అయినా సరే ఇంకా ఆరోగ్యంగా, ఓపికగా ఉన్న పెద్దవారూ రోజూ తమ సమయంలో ఒక రెండు గంటలు కేటాయిస్తే ఏదైనా చెయ్యలేరా?
తనూ, మావగారు, ఇష్టమైతే అత్తగారు, సుభద్ర , వాళ్ళ అత్తా ఇలా తమ ఇంట్లోనే నలుగురైదుగురు ఉన్నారు., అనితా, వీలైతే లక్ష్మమ్మా, సుమిత్రా .. ఇలా ఎవరి పరిధిలో వారు చాతనైనంత సహాయం చేస్తే అదే ఒక గొప్ప పనికి ఆరంభం అవుతుందేమో.. ఇలాంటి మరో పది, పదిహేను ఇళ్లు పట్టుకున్నా కనీసం నలభై మంది అవుతారు కదా, అందరూ ఒక చోట చేరి ఈ సమస్యలన్నీ చర్చించి పరిష్కార మార్గాలు కనిపెట్టడం కష్టమా ? ఒక సంఘం గా ఏర్పడి పిల్లలకీ, పెద్దలకీ కావలసిన శిక్షణా, ధైర్యమూ సమకూర్చలేమా.? దేశాన్నంతా ఉద్దరించ లేకపోవచ్చు కానీ కనీసం మనకి తెలిసినవారికి కావలసినంత సహాయం చెయ్యవచ్చు. కావాలంటే సహాయం చెయ్యడానికి మహిళా పోలీసులూ, స్త్రీ శిక్షణా సంఘాలూ ఇలాంటివారందరూ లేరా? ఈ దిశగా ఆలోచిస్తే ఆమె కి చాలా ఉత్సాహంగా అనిపించింది.
రోజూ పెరుమాళ్ళకి చేసే పూజ మాధవ సేవ.. ఇది మానవ సేవ.. మానవ సేవే మాధవ సేవ కదా.. దానికి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది కదా.. ఒక నిశ్చయానికి వచ్చినట్టు, మనసులో అప్పటివరకూ ఉన్న అశాంతి కొద్ది, కొద్దిగా మంచులా విదిపోతున్నట్టూ అనిపించింది.
ఇంటిల్లిపాదీ టీ. వీ చూస్తున్నారు. ఇప్పుడు మా టీ. వీ లో వెలుగూ.. వెలిగించు కార్యక్రమంలో 'కాంతి' సంఘం గురించిన కార్యక్రమం, ఈ సంఘ స్థాపకురాలు శ్రీమతి. సరోజినీ, వారి అత్తమామలు శ్రీ. శ్రీరాం గారూ, శ్రీమతి. నారాయణమ్మ లతో పరిచయం అని అనౌన్స్ మెంట్ వచ్చింది. కార్యక్రమంలో తననీ, అత్తా మామలనీ ఇంటర్వ్యూ చేసారు.. తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలగురించి చెప్పారు.
- ఉదా.. ప్రముఖ స్కూళ్ళ దగ్గర అడ్డూ, అదుపూ లేకుండా రెండు వైపులా వెళ్ళిపోయే వాహనాల వల్ల ఎందరో పిల్లలు ప్రమాదాలకి గురి అవుతూ ఉండడం వల్ల తమ సంఘం ద్వారా కొంతమంది తల్లి తండ్రులు అక్కడ ట్రాఫిక్ పోలీస్ లకి సహాయంగా రోజూ వంతుల వారీగా నిలబడి స్కూల్ మొదలు పెట్టే సమయానికీ, విదిలే సమయానికీ ఉండడం వల్ల కలిగిన లాభాలూ.
- సిటీ బస్ లలో రోజూ కాలేజీ లకి వెళ్ళే అమ్మాయిలకి తోడుగా తమ సంఘం వాలంటీర్లు బస్ లలో అప్పుడప్పుడూ వెళ్లి వారి క్షేమ సమాచారాలు విచారించడాలూ, ఈవ్ టీజింగ్ లాంటి కేసులని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావడాలూ..
- బాల కార్మికుల ని ఉద్ధరించడం కోసం 'పిల్లల సహాయ వాణి' సంస్థ తోడ్పాటుతో వాళ్ళని స్కూళ్ళలో చేర్పించడమూ, వారి క్షేమ సమాచారాలు చూడటమూ,
- వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కరాటే లాంటి ఆత్మ రక్షణ విద్యలు నేర్పించడమూ
- గుళ్ళకీ, వాకింగులకీ వెళ్ళే పెద్దలకీ, ఉద్యోగినులకీ 'పెప్పర్ స్ప్రే" లాంటి సాధనాలు సమకూర్చడమూ
- అన్నింటికంటే ముఖ్యంగా అందరికీ వారం వారం కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి పరిస్థుతులలోనైనా సంయమనం, ధైర్యం కోల్పోకుండా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడం ఎలా ? అన్న విషయాల మీద వారికి తెలియ చెప్పడమూ
ఇలాంటి వాటి గురింఛి వివరంగా చెప్పారు. ఇది ప్రజలు తమకోసం తాముగా నిర్మించుకున్న నెట్ వర్క్ అనీ, ఇలాంటి సంస్థల వల్ల తమకెంత అదనపు సహాయమో అని పోలీస్ కమీషనర్ కూడా చాలా మెచ్చు కున్నారు. అందరూ కొట్టిన చప్పట్ల మోతతో ఒకటే సందడి.తనవారి కళ్ళల్లోనూ, తన కళ్ళలోనూ ఏదో తెలియని ఆనందం.
ఇంతలో వీధి తలుపు ఎవరో కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చింది సరోజిని..ఇప్పటివరకూ తన మనసులో మెదులుతున్న ఆలోచనలు అంతలోనే కలగా కనిపించడంతో సిగ్గుపడి నవ్వుకుంది. 'పగలు వచ్చినదే అయినా దీనిని పగటికల కానివ్వకూడదు తను కానివ్వదు' .
"ఊహించుకోవడానికి ఎంతో అందంగా ఉన్న తన ఆలోచనలు ఆచరణలో కష్టసాధ్యమైనవే కానీ అసాధ్యమైనవి కాదు. ఎంతో పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్వహించిన వారందరూ తమలాంటి వారే కదా? ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా, ఆ అడుగు తనదే ఎందుకు కాకూడదు? కావాలి "అనుకుంది స్థిరంగా.
అలా మొదటి అడుగు వేసింది విశాల ప్రపంచపు క్షేమానికి తలుపు తెరవడానికి.
తరవాత ఏమైందో వచ్చే వారం చూడండి ........
ప్రసీదగారూ,
ReplyDeleteచాలా బాగా అందుకున్నారు. నేనూ అదే అనుకుంటున్నాను. ఈ సరోజిని ఇలా ఆలోచిస్తూనే కూర్చుంటుందా..లేక ఆ ఆలోచనలలో కదలిక ఏమైనా వస్తుందా.. అని. నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తున్న అసలైన పాత్ర ఆలోచనల్లో అలజడి తెచ్చారు. బాగుంది.
థాంక్ యూ లలితగారూ..
ReplyDeleteకధ కూర్పు ఎవరి శైలివారిదైనా, అందరి ఆలోచనలలోనూ మార్పు వస్తోదనటానికి మన కధే నిదర్శనం. ఎవరో రావాలని కాకుండా, మన పరిధిలో మనం కూడా నడుం బిగించాలి...తప్పకుండా సంఘం బాగు పడుతుంది.
ReplyDeleteప్రసీదగారూ
నాకు ఆకలి వస్తే అన్నం తింటే నా ఆకలి తీరుతుంది..ఈ మాత్రం జీవిత సత్యం ఆపదకి వర్తించదా...ఆపదకి టైపు మిస్టేకా నాకర్ధం కాలేదా
psmlakshmi
థాంక్ యూ లక్ష్మి గారూ.. అది ఆకలైనా , ఆపదైనా ఎవరి సమస్య వారే పరిష్కరించుకోవాలి అన్న భావనలో రాసినది. సరిగ్గా అర్ధం అయ్యేలా రాయలేదా? చెప్పండి. కావాలంటే మారుస్తాను.
ReplyDeletebaagaa andukunnaru kadhani...mi saili baavundi
ReplyDeleteప్రసీద గారు,
ReplyDelete' అది ఆకలైనా, ఆపదైనా ఎవరి సమస్య వారే పరిష్కఅరించుకోవాలి....' ఆ భావనతో రాసినా మీరు సరోజిని పగటి కలలో కూడా అందరూ కలిసి, కూడి ఒక్కో సమస్య పరిష్కారానికి నడుం కట్టి పరిష్కరించారు అని చూపించారu. అనిత ఈ సమస్య నాది కాబట్టి నేనే ఎదుర్కోవాలి అని తనకి తోచినట్టుగా కరాటే నేర్చుకుంది. కానీ మీరు చూపించిన దాంట్లో రోజు ఇంట్లో పనులు కాగానే టి.వి ల ముందు కూర్చునే మహిళలు, రిటైర్ అయినవారు అందరూ కలిసీ అక్కడ పనులను ఒక్కొక్కరు ఒకో పనిగా పంచుకున్నారు.
ఏ సమస్య అయినా సమాజంలో అందరూ కలిస్తేనే అంటే ముందుగా ఆ సమస్య గురించి అందరిలో అవగాహన పెంచి, వారిని ఆలోచింపచేసి వారే కాకుండా వారి కుటుంబం, స్నేహితులు, చుట్టు ప్రక్కల వారు, ఇందులో అన్ని వయసుల వారు కలిస్తే తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ అందరిలో డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, స్టుడెంట్స్ అందరూ వుంటారు కదా, అందుకని తప్పకుండా మనకి వీలైన సమస్యలను మనమందరం కలిసి పరిష్కరించుకుంటే, ' ఎవరో ఒకరు, అపుడో, ఇపుడో, ఇటో, అటో, ఎటో వైపు కదలరా ముందుకూ?' అని కలిసి సాగితే సాదించనిది ఏది లేదండి.
మీరు సూచించిన పరిష్కారాలు బావున్నాయి, అవి ఎవరికి వారు ఒంటరిగా చేయాలంటే కుదరదు. అందరూ కలిసి చేస్తేనే ఫలితం లభిస్తుంది. మీరు రాసింది కూడా అదే! నాకు అలాగే అర్ధం అయ్యింది మరి.
చెప్పాలంటే గారూ. థాంక్ యూ.
ReplyDeleteదుర్గగారూ.. మీ విశ్లేషణకి ధన్యవాదాలు. మీరన్నది కరక్టే. నేను చెప్పదలచినది కూడా అదే. ఒక్కరుగా పరిష్కరించుకోలేని సమస్యలు ఇవి.. కానీ ప్రతీ వారు ఎవరో ఒకరు తీరుస్తారులే అన్నధోరణిలో ఆలోచిస్తే ఎక్కడా ముందుకు కదలదు అదా.. ఏ పనైనా ముందు నేను అన్నదగ్గర మొదలవుతాయి కదా.. అందుకనే అలా రాసాను. తరచి చూస్తే ముండు సరోజిని తన వైపునించీ ఆలోచించి తరవాత మెళ్ళిగా అందరినీ కలుపుకునే దిశలో ఆలోచించింది. ఈ భావం సరిగ్గా కుదిరిందా లేదా చెప్పండి.
బాగా రాశారండి .
ReplyDeleteమొత్తానికి ఒకొక్కరూ ఒక్కో సమస్య , దానికి పరిష్కారము దిశ గా అడుగులు వేయిస్తూ బాగారాస్తున్నారు .
చాల బాగా మలుపు తిప్పారు.ఇలా రాస్తూ పొతే మనమే ఎన్నో పరిష్కారాలు చూపవచ్చు...ఎన్ని ఆలోచనలను అందరితో పంచుకోగాలుగు తున్నాం. నాకు నిజంగా గర్వంగా వుంది...సమాజంలో మనం కోరుకునే మార్పులను తీసుకువచ్చే కారణాలు చెప్పడమే కాదు ప్రయత్నించచ్చు కూడా..సరోజినీ పాత్ర ఇన్ని రోజులకి బయటపడింది..
ReplyDeleteఅభినందనలు
subhadra chala baga rasavu,prati vokkaru ei vidhamga alochiste sham samasyalu maname pariskarinchu ko vacchu prati okkaru tanloni bhayanni, manaki endukule anna attitude ni vadli munduku ravali
ReplyDeleteథాంక్ యూ మాల గారూ, లక్ష్మీ రాఘవ గారూ.
ReplyDeleteథాంక్ యూ అరుణా