Monday, February 7, 2011

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది?

        జనవరి 24 వ తారీకున బెంగళూరు ఇందిరానగర్ లోని పురందరదాస భవనంలో జరిగిన 'ప్రియా సిస్టర్స్' సంగీత కచేరీకి వెళ్ళాము. వాళ్ళిద్దరూ ఎంత ప్రతిభావంతులో, ఎంత బాగా పాడతారో ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు..
       వారిద్దరూ నాకు కజిన్స్ అవుతారు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంటుంది.. చిన్నప్పుడు  ఎప్పుడూ వారిని కలిసే అవకాశం రాలేదు, ఈ మధ్యనే కలిసినా సరే  ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. 'విద్యావంతులకి వినయమే భూషణం 'అన్న నానుడిని నిజం చేస్తూ..ఈ సారి వచ్చినప్పుడు మా  ఇంటికి తప్పకుండా వస్తామని చెప్పారు కూడా.
        క్రిందటి సంవత్సరం వాళ్ళ కచేరి కి వెళ్ళినప్పుడు వారిద్దరూ పాడిన  "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది  "అన్న కీర్తన మా మనసులకి హత్తుకుపోయింది. అందుకే ఈ సారి కచేరీ ప్రారంభం అవటానికి ముందే స్టేజ్ మీదకి వెళ్లి పలకరించి ఈ కీర్తన మళ్ళీ పాడమని మా రిక్వెస్ట్ ఇచ్చి వచ్చాను. వారు కూడా అన్ని రకాల కృతులూ అద్భుతంగా పాడి, తన్యావర్తనం తరవాత మొదటగా ఇదే పాట పాడారు. జంట గాత్రాలతో వారు భౌళి రాగం లో పాడుతుంటే చెప్పలేని ఒక అనుభూతి మనసంతా పరుచుకుంటుంది. వీనులవిందైన  గాత్రం, వినసొంపుగా  మానవ నైజాన్ని ఆవిష్కరించిన   సాహిత్యమూ కలిసి మన జీవితాన్ని మన కళ్ళెదుట నిలబెడతాయి.. నిలదీస్తాయి కూడా. ఆ కీర్తనని మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం.
           అన్నమాచార్య కీర్తనగానే ప్రాచుర్యాన్ని పొందిన ఈ కీర్తన ని నిజానికి రాసినది ఆయన కుమారుడైన పెదతిరుమలాచార్య . ఆయన ఎంతో సరళమైన మాటలతో చక్కగా రచించిన కృతి ఇది.
పల్లవి: "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది? నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనూ.. నీ చిత్తంబికనూ" అన్న పల్లవితో మొదలవుతుంది..అన్ని జన్మలలోనూ అత్యుత్తమమైనదిగా చెప్పబడే మనిషి  జన్మ ఎత్తినా సరే, ఫలమేముంది?.. అందుకే నిన్నే నమ్మినాను.. ఆ తర్వాత నీ ఇష్టం.. నువ్వే నన్ను బ్రోచే దిక్కువు  అని భగవంతునికి చెప్పుకోవడం..
 చరణం 1 :   మరువను ఆహారంబును, మరువను ఇంద్రియ భోగము, మరువను సంసార సుఖము మాధవ నీ మాయా 
                 మరిచెద సుజ్ఞానంబును, మరిచెద తత్వరహస్యము, మరిచెద గురువును దైవము మాధవ నీ మాయ      (ఎ)  
మొదటి చరణం లో ఆహారాన్నీ, ఇంద్రియ భోగాలనీ, సంసార సుఖాలనీ  మరువను కానీ సుజ్ఞానాన్నీ, తత్వరహస్యాన్నీ, గురువునీ దైవాన్నీ మాత్రం అవలలీలగా  మరిచిపోతాను అంటే  ఇది  ఓ మాధవా నీ మాయే కదా, అది కాక వేరే ఏదీ కాదు కదా, నేను ఎంతో గొప్ప మానజన్మ ఎత్తినా ఫలమేముంది ? చెయ్యవలసిన పనులు సరిగా చెయ్యనప్పుడు అందుకే నిన్నే నమ్మాను నీ చిత్తం.. అని అర్ధం 
చరణం 2 : విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా
                విడిచెద షట్ కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ   (ఎ) 

రెండవ చరణంలో అదే కొనసాగిస్తూ  అన్ని జన్మలలోనూ ఉత్తమమైన జన్మ ఎత్తి కూడా నేను నా దుర్గుణములనూ  , నా ఆశలనూ  పాప పుణ్యాలని  విడవ లేను కానీ వైరాగ్యాన్నీ, చేయవలసిన షట్ కర్మలనీ, ఆచార వ్యవహారాలనీ చాలా అవలీలగా విడిచేస్తాను ఇది అంతా ఓ విష్ణుడా నీ మాయ మాత్రమే! అని ఆయననే అనడం అన్నమాట. నువ్వు ఈ మాయలో పడకుండా రక్షిస్తే చాలు అనేమో మరి.

చరణం 3 :  తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధనముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా
                అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై,  నగి నగి నను నీవేలితి నాకా ఈ మాయా. (ఎ)

ఆఖరి చరణంలో పెరుకేంతో ఘనమైన ఈ మానవ జన్మలో నేను కోరి  తగులుకునేవన్నీ లంపటాలు, బంధనాలు అంతేకానీ కనీసం తలపులోనైనా మోక్షమార్గాన్ని తగులుకోను..అంతర్యామివై  నీవు నన్ను ఎలుకోవలసిన వాడివి, నా చెంతనే ఉండగా నాకేందుకయ్యా ఈ మాయ? అని ప్రశ్నిస్తారు తిరుమలాచార్య.
            మనుష్యుల జీవన విధానాన్నీ,  మాయా మోహపు జీవిత చక్రంలో ఇమిడిపోయి తెలుసుకోవలసిన సత్యాలనీ, విధానాల్నీ తెలుసుకోలేక పోవడాన్ని ఆవిష్కరిస్తూనే ఇది అంతా నీ మాయ మాత్రమే కదయ్యా, నా తప్పేముంది అని దేవుడిని అడుగుతారు. అలాగే నాకేమీ తెలియదు.. ఎంత గొప్ప జన్మ ఎత్తినా సరే.. నిజంగా నిన్నే నమ్మాను కనక అంతా నీ ఇష్టం అని ఆ అంతర్యామి పైనే భారం మోపుతారు ఆచార్యులవారు .  
మన జీవితాన్ని తరచి మనముందు నిలబెట్టే సాహిత్యమూ, సంప్రదాయబద్ధంగా సాగే ఎంతో చక్కని గానం వెరసి..అందరూ తప్పకుండా ఒక్కసారైనా విని తీరవలసిన కీర్తన అని నా అభిప్రాయం. క్రింద రెండు లింక్ లు ఇస్తున్నాను, ఒక దానిలో ప్రియా సిస్టర్స్ కనిపించరు, వినిపిస్తారు, రెండో దానిలో వారూ, వారిని అభిమానించేవారూ కూడా   కనిపిస్తారు.
ప్రియా సిస్టర్స్ అద్భుతంగా గానం చేసిన ఈ కీర్తన మీకోసం ఇదిగో ఇక్కడ..


Tuesday, February 1, 2011

కదంబమాలిక- 10

    వారం వారం ఒక్కొక్క రకమైన  కుసుమాలని  తనలో ఇముడ్చుకుంటూ, అందమైన అల్లికల, మెలికలు తిరుగుతూ, సుమనోహరమైన సుగంధాల పరిమళాలు వెదజల్లుతున్న ప్రమదావనపు కదంబమాలికకి ఇది పదో మజిలీ. ఇప్పటివరకూ స్నేహితులందరూ ఎంతో నేర్పుగా 'ఒక్కరే' ఈ కధ మొత్తం రాసినంత సహజంగా కధ నడిపారు. ఇప్పుడు ఈ పూదండ అల్లిక కొనసాగించే బాధ్యత నాకిచ్చారు. "పరవాలేదే" అనిపించేలా రాసినా నా ప్రయత్నం ఫలించినట్టే అనుకుంటాను. రంగూ, వాసనా చూసి చెప్పండి మా ప్రమదావని లో "వాణి'( సాహిత్య సరస్వతి) 'తలనిండ దాల్చే ఈ పూదండ' లో నేను కూర్చిన పూలు ఎలా ఉన్నాయో ? చూడ ముచ్చటగా ( చదవ ముచ్చటగా   అనాలేమో? ) నేర్పుగా, కమనీయంగా అల్లిన నిన్నటి అల్లిక  శ్రీలలిత గారిది.. 

     పనిమనిషి లక్ష్మమ్మ కూతురు చంద్రి కి జరిగిన అన్యాయాన్ని  గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని  భర్తా, మావగారు మిగతా అందరితో కలిసి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుంది  సరోజిని. 

      "కంప్లైంట్ తీసుకుంటారో లేదో? చంద్రికి ఎప్పుడు నయమవుతుందో ?   షాక్ నించి జానకి తేరు కుంటుందా ? పువ్వుల్లా విరబూసి నవ్వుతూ తుళ్ళుతూ ఉండవలసిన పసి  పిలల్లపైన ఇంత అమానుషమా? ఎక్కడ మొదలవుతున్నాయో, ఎక్కడ పొంచి ఉన్నాయో, ఎప్పుడూ మీద పడతాయో తెలియని ఈ ఘోరాలకి అంతు  ఎక్కడ? 

       బస్ ఎక్కితే కావాలని రాసుకు పూసుకు తిరిగే కండక్టర్, కాలేజీ కెళితే ప్రేమా, దోమా అంటూ వెంటపడే ఆకతాయిలూ, కాదంటే కాల్చడానికి సిద్దపడుతున్న కీచకులూ, పిల్లల వయసెంత?  అని అయినా చూడకుండానే వారిని వేధించే కామాతురులూ,  పెద్దవారు వీధిలో కెళితే  నగలూ, వాటికోసం ప్రాణాలు హరించే దుర్మార్గులూ, ఇవి  చాలనట్టు కొత్త రకాలైన సైబర్ క్రైములూ, ఆడపిల్లలైతే ఒకరకం సమస్యలూ, మగపిల్లలైతే మరొక రకమైన సమస్యలూ.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ చూసినా అబ్యూజ్. 

    ఇవ్వాళ అనితకి ఎదురైన  సమస్య చిన్నదా? దానిని ఈ రోజు ధైర్యంగా తిప్పికొట్టింది. రేపు, ఎల్లుండి? మళ్ళీ మళ్ళీ  ఎదురవుతూనే ఉంటే? ఇలా ఎన్నాళ్ళు? ఎన్ని చోట్ల? ఎలా తమని తాము కాపాడుకోవడం? ఎలా పిల్లలకి నేర్పించడం? రేపు తన పిల్లలకి ఏదైనా అయితే? ఆ ఆలోచనకే చిగురుటాకులా వణికిపోయింది.ఎవరైనా, ఏదైనా చేస్తే బావుండును. ఈ బాధలు, గొడవలు లేని సమాజం రావడం కలేనా? కల్లేనా ? అసలే సున్నితమైన ఆమె మనసు మరింత క్షోభ పడసాగింది. 

      " సరోజా! నేను కాసేపు నడుం వాలుస్తాను. వెళ్ళిన వాళ్ళు వస్తే నువ్వు చూసుకుంటావు కదా  " అని అత్తగారు వెళ్లి పడుకున్నారు. కొడుకూ, కోడలూ మంచి వాళ్ళు, తమ జీవితం వారి చెంత సుఖంగా నడుస్తుంది అన్న ధైర్యం, నిశ్చింతా  తన  అత్తా మామల కెంతో హాయినిస్తోంది.అలాగే ఇంత మంచివారి చెంత తనకీ అలాంటి తృప్తే లభిస్తోంది. అలాంటి ధైర్యం, తృప్తి  సమాజంలో అందరికీ  ఉండాలి కదా,  అది లేనినాడు క్షణక్షణం భయంతో బ్రతకడం కన్నా వేరే నరకం ఉందా  ? అలాంటి రోజు  రావాలంటే ఎం చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? అనుకుంటూ చిరాగ్గా తిరుగుతున్న సరోజినికి ఒక్కసారిగా ఎవరో చెళ్ళున చరిచినట్టుగా  అనిపించింది.

  "ఎవరో ఎందుకు చెయ్యాలి? మనకి మనమే చేసుకోకూడదా? తను గత కొన్ని రోజులుగా జానకికీ, అలాంటి వారికి  చేతనైన సహాయం చేద్దామని అనుకుంటూనే ఉంది కదా.. 'నాకు ఆకలి వేస్తె నేను అన్నం తింటేనే  నా ఆకలి తీరుతుంది., అది తీరేదారీ, తీర్చే దారీ నేనే వెతుక్కోవాలి కదా. ఈ మాత్రపు జీవిత సత్యం ఆపదకి వర్తించదా? నాకు ఆపద వస్తే ఎవరో వచ్చి రక్షించాలని ఎందుకనుకోవాలి?' "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా?"  ఘంటసాల మాస్టారి పాట గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు తను స్కూల్ లోనూ, కాలేజీలోనూ తరచుగా పాడేది ఈ పాట. నాన్నకు, తనకూ ఎంతో ఇష్టమైనది. 

      "పాటలో ఉన్న భావం చూడు తల్లీ? మంచి ఎక్కడుందో ,దాని పక్కనే చెడు ఉంటుంది, దీపపు వెలుతురి కింద చీకటి నీడలాగా. వెలుగు మనకి మనం చూపించుకుంటూ నలుగురికీ చూపిస్తే దారి దానికదే కనిపిస్తుంది.. దానికింద క్రీనీడ ని చూస్తే అది గోడమీద నీడలా మరింత పెద్దది అయి  భూతంలా భయపెడుతుంది. తప్పు చెయ్యని వారికి ఉండకూడని అవలక్షణం భయం తల్లీ!. ఎందుకంటే మనలో నిద్రాణమై ఉన్న ధైర్యాన్ని అది నిద్ర లేవనీయదు" . ఎప్పుడూ ఇలాగే చెప్పేవారు. 

    తన పిల్లలు అన్నింట్లోనూ, ఎప్పుడూ స్వతంత్రంగానూ, స్వాభిమానం తోనూ  ఉండాలని చెప్పేవారు. అదొక్కటే కాదు తండ్రి తనకెంతో ప్రియమైన నాయకురాలు 'సరోజినీ నాయుడు' పేరు తనకు, అక్కకి 'విజయలక్ష్మి పండిట్ 'పేరు విజయలక్ష్మి అని  పెట్టుకున్నానని చెప్పేవారు. గతించిన తండ్రి గుర్తుకు రాగానే మనసంతా ఆర్ద్రమైపోయింది ఆమెకి.. కళ్ళు నిండి కన్నీళ్ళు జల జలా కారాయి.  

    తనేమో ఇలా వంటిటికి అంకితం అయిపోయి ఏం  చేస్తోంది.?. భాస్కర్ గట్టిగా మాట్లాడితేనే కన్నీళ్ళు పెట్టుకునేంత బేల అయిపోయింది  కదా తను? తన చిన్ని ప్రపంచం లో తను బాగానే ఉన్నాను అనుకుంటోంది.. 'చిన్ని నా బొజ్జకు శ్రీ రామరక్షా' అనుకుంటూ. కానీ తనకి తెలిసిన ఈ  చిన్న  ప్రపంచంలోనే ఎంతమంది బాధ పడుతున్నారో కదా? లక్ష్మమ్మ, జానకి. చంద్రి, అనిత ఇలా.. తెలిసి ఇందరు, తెలియక ఇంకెందరో   కానీ తనేం చెయ్యగలదు?  అసలు ఏమైనా చెయ్యగలదా ? ఇలా ఆమె ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయి. 

       లక్ష్మమ్మ చెప్పింది కూడా.'ఏం  చేసినా టూడెంట్ కుర్రాళ్ళు చెయ్యాలి అని.'. వాళ్ళు ఒక్కళ్ళ వల్లా అవుతుందా? ఈ సమాజం అందరిదీ కాదా?.. తనలాంటి మరెందరిదో కాదా? ఇలాంటివారందరూ కూడా కలిస్తే?   పొద్దున్న పదీ,  పదకొండు గంటలకల్లా పని పూర్తి చేసుకుని టీ.వీ ల ముందో, పగటి నిద్రతోనో కాలం గడిపే ఇల్లాళ్ళూ , రిటైర్ అయినా సరే ఇంకా ఆరోగ్యంగా, ఓపికగా ఉన్న పెద్దవారూ రోజూ తమ సమయంలో ఒక రెండు గంటలు కేటాయిస్తే ఏదైనా చెయ్యలేరా? 

   తనూ, మావగారు, ఇష్టమైతే అత్తగారు, సుభద్ర , వాళ్ళ అత్తా  ఇలా తమ ఇంట్లోనే  నలుగురైదుగురు ఉన్నారు., అనితా, వీలైతే లక్ష్మమ్మా, సుమిత్రా .. ఇలా ఎవరి పరిధిలో వారు చాతనైనంత సహాయం చేస్తే అదే ఒక గొప్ప పనికి ఆరంభం అవుతుందేమో.. ఇలాంటి మరో పది,  పదిహేను  ఇళ్లు  పట్టుకున్నా  కనీసం నలభై మంది అవుతారు కదా, అందరూ ఒక చోట చేరి ఈ సమస్యలన్నీ చర్చించి పరిష్కార మార్గాలు కనిపెట్టడం కష్టమా ? ఒక సంఘం గా ఏర్పడి పిల్లలకీ, పెద్దలకీ కావలసిన శిక్షణా, ధైర్యమూ సమకూర్చలేమా.? దేశాన్నంతా ఉద్దరించ  లేకపోవచ్చు కానీ కనీసం మనకి తెలిసినవారికి కావలసినంత సహాయం చెయ్యవచ్చు. కావాలంటే సహాయం చెయ్యడానికి మహిళా పోలీసులూ, స్త్రీ శిక్షణా సంఘాలూ ఇలాంటివారందరూ లేరా?  ఈ దిశగా ఆలోచిస్తే ఆమె కి చాలా ఉత్సాహంగా అనిపించింది. 

    రోజూ పెరుమాళ్ళకి  చేసే పూజ మాధవ సేవ.. ఇది మానవ సేవ.. మానవ సేవే మాధవ సేవ కదా.. దానికి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది కదా.. ఒక నిశ్చయానికి వచ్చినట్టు, మనసులో అప్పటివరకూ ఉన్న అశాంతి కొద్ది, కొద్దిగా మంచులా విదిపోతున్నట్టూ అనిపించింది.

     ఇంటిల్లిపాదీ టీ. వీ చూస్తున్నారు. ఇప్పుడు మా టీ. వీ లో వెలుగూ.. వెలిగించు కార్యక్రమంలో 'కాంతి' సంఘం గురించిన కార్యక్రమం, ఈ సంఘ స్థాపకురాలు శ్రీమతి. సరోజినీ, వారి అత్తమామలు శ్రీ. శ్రీరాం గారూ, శ్రీమతి. నారాయణమ్మ లతో పరిచయం అని అనౌన్స్ మెంట్  వచ్చింది. కార్యక్రమంలో తననీ, అత్తా మామలనీ ఇంటర్వ్యూ చేసారు.. తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలగురించి చెప్పారు. 
  •   ఉదా.. ప్రముఖ స్కూళ్ళ దగ్గర అడ్డూ, అదుపూ లేకుండా రెండు వైపులా వెళ్ళిపోయే వాహనాల వల్ల ఎందరో  పిల్లలు ప్రమాదాలకి గురి అవుతూ ఉండడం వల్ల తమ సంఘం ద్వారా కొంతమంది తల్లి తండ్రులు అక్కడ ట్రాఫిక్ పోలీస్ లకి సహాయంగా రోజూ వంతుల వారీగా నిలబడి స్కూల్ మొదలు పెట్టే సమయానికీ, విదిలే సమయానికీ ఉండడం వల్ల కలిగిన లాభాలూ. 
  • సిటీ బస్ లలో రోజూ కాలేజీ లకి వెళ్ళే అమ్మాయిలకి తోడుగా తమ సంఘం వాలంటీర్లు బస్ లలో అప్పుడప్పుడూ వెళ్లి వారి క్షేమ సమాచారాలు విచారించడాలూ, ఈవ్ టీజింగ్ లాంటి కేసులని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావడాలూ..
  • బాల కార్మికుల ని ఉద్ధరించడం కోసం 'పిల్లల సహాయ వాణి' సంస్థ తోడ్పాటుతో వాళ్ళని స్కూళ్ళలో చేర్పించడమూ, వారి క్షేమ సమాచారాలు చూడటమూ,
  • వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కరాటే లాంటి ఆత్మ రక్షణ విద్యలు నేర్పించడమూ
  •  గుళ్ళకీ, వాకింగులకీ వెళ్ళే పెద్దలకీ, ఉద్యోగినులకీ 'పెప్పర్ స్ప్రే" లాంటి సాధనాలు సమకూర్చడమూ
  • అన్నింటికంటే ముఖ్యంగా అందరికీ వారం వారం కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి పరిస్థుతులలోనైనా సంయమనం, ధైర్యం కోల్పోకుండా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడం ఎలా ? అన్న విషయాల మీద వారికి తెలియ చెప్పడమూ 
ఇలాంటి వాటి గురింఛి వివరంగా చెప్పారు. ఇది ప్రజలు తమకోసం తాముగా నిర్మించుకున్న నెట్ వర్క్ అనీ, ఇలాంటి సంస్థల వల్ల తమకెంత అదనపు సహాయమో అని పోలీస్ కమీషనర్ కూడా చాలా మెచ్చు కున్నారు. అందరూ కొట్టిన చప్పట్ల మోతతో ఒకటే సందడి.తనవారి కళ్ళల్లోనూ, తన కళ్ళలోనూ ఏదో తెలియని ఆనందం. 

ఇంతలో వీధి తలుపు ఎవరో  కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చింది సరోజిని..ఇప్పటివరకూ తన మనసులో మెదులుతున్న ఆలోచనలు అంతలోనే కలగా కనిపించడంతో సిగ్గుపడి నవ్వుకుంది. 'పగలు వచ్చినదే అయినా దీనిని పగటికల కానివ్వకూడదు తను కానివ్వదు' . 

"ఊహించుకోవడానికి ఎంతో అందంగా ఉన్న తన ఆలోచనలు ఆచరణలో కష్టసాధ్యమైనవే కానీ అసాధ్యమైనవి కాదు. ఎంతో పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్వహించిన వారందరూ తమలాంటి వారే కదా? ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే  మొదలవుతుంది కదా, ఆ అడుగు తనదే ఎందుకు కాకూడదు? కావాలి "అనుకుంది స్థిరంగా. 
అలా మొదటి అడుగు వేసింది విశాల ప్రపంచపు క్షేమానికి తలుపు తెరవడానికి.
తరవాత ఏమైందో వచ్చే వారం చూడండి  ........

Friday, January 28, 2011

చుక్కలు చూపిస్తున్నాయి.

              ముక్కుపైకెక్కు.. చెవులపక్కన నిక్కు.. జారిందంటే పుటుక్కు.. అని చిన్నప్పుడు పొడుపు కధ పొడుచుకుని.. "నాకు తెలుసు, నాకు తెలుసు" అంటూ చేతులెత్తి మరీ.. కళ్ళ జోడు అని చెప్పేవాళ్ళం. అన్ని రకాల దృష్టి దోషాలనూ వీలైనంతవరకూ సవరించి కంటిచూపుని మెరుగు పరిచే సాధనాలు మన కళ్ళ జోళ్ళు.. సారం లేని తినే తిండి వల్లనో, పెరుగుతున్న కాలుష్య ప్రభావమో, స్వాభావికంగా మానవ జన్యువులలోనూ, తద్వారా ఆరోగ్యంలోనూ వస్తున్న మార్పులో.. కారణ మేదైతేనేం ? .. ఈ మధ్యన కళ్ళజోళ్ళు ధరించడం  కాలి జోళ్ళ వాడకమంత  సాధారణం అయిపోయింది. ప్రతీవారికీ ఏదో ఒక కారణాన వయసుతో సంబంధం లేకుండా వీటిని దరించ వలసిన అవసరం వస్తోంది. సరదాకో, ఫాషన్ కో,ఎండకో వాడే కళ్ళజోళ్ళ సంగతి సరేసరి..
      ఏడాదికొకసారి కళ్ళ పరీక్ష చేయించుకునే మేము ఈ సారి కూడా జనవరి ఒకటో తారీకున మా డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళాము. మా ఇద్దరికీ ఇప్పట్లో కళ్ళజోడు మార్చవలసిన అవసరం లేదు అని చెప్పారు, మా అబ్బాయికి కూడా పవర్ పెద్దగా పెరగలేదు కానీ మీరు ఎప్పుడూ స్పేర్ గా ఒకటి ఉంచుతారు కనక ఈ కొద్దిగా పెరిగిన పవర్ తో అది చేయించి ఉంచుకోండి అని సలహా చెప్పారు. 
         దానికోసం కొత్త జోడూ, అద్దాలూ కొనాలని షాప్ కి వెళ్లాం. మా ఇంటి వెనక ఉన్న షాపే ఇది, అతను మాకు బాగా తెలుసు కూడా. ఇక్కడొక విషయం చెప్పాలి. ఏ వస్తువైనా కొనడానికి వెళ్ళినప్పుడు మన అంచనాలని మించే ఉంటుంది కదా.. అది బంతిపూలైనా సరే, బంగారమైనా సరే.. అందుకని కొంత సిద్ధపడే వెళ్ళాము అయినా సరే అక్కడ మాకన్నీ షాక్ లే. 
        ముందు ఫ్రేం చూపించామన్నాము. "ఇది కొరియా లో చేసినది మేడం చాలా బావుంటుంది అన్నాడు ఒకటి చూపిస్తూ.. అది నిజానికి బానే ఉంది.. ధరతో సహా..పదిహేను వందలుట .. తరవాత ఇండోనేసియా లో చేసినది.. రెండు వేలు.. ఇలా ఒక దేశాన్ని మించి మరొక దేశపు ఫ్రేములూ, వాటితో పాటు అటు ఇటూగా సాగుతున్న ధరలు. నాకు అనుమానం వచ్చి.. "మన దేశంలో కళ్ళజోళ్ళ ఫ్రేములు తయారు చెయ్యరా? మనం అన్నీ దిగుమతి చేసుకోవడమేనా? అని అడిగాను. "ఉన్నాయండి.. కానీ క్వాలిటీ బావుండదు.. మూడు నెలలకే పై పొర ఊడి  పోవడం, స్క్రూలు లూజ్ అయిపోవడం ( ఎవరివో మరి??) ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తాయండి అన్నాడు. ఒక్క ధరలూ, దేశాలూ మాత్రమే కాదు.. వీటిల్లో ఎన్ని రకాలో.. మెటల్, ప్లాస్టిక్, హాల్ఫ్ రిం, ఫుల్ రిం, సైడ్ ప్లాస్టిక్, షెల్ ఫ్రేం ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా..
         ఆటలూ, పరుగులూ.. వీటిల్లో ఎప్పుడు విరగ గొట్టుకుంటారో తెలియని వయసులో అంత ఖరీదైనవి ఎందుకు ?అని నా అభిప్రాయం అని చెప్పాను అతనికి. వీటిల్లో స్టార్టింగ్ రేంజ్ 675 /-  అన్నాడు, కానీ ఆ రేట్లలో రెండో మూడో మాత్రమే ఉన్నాయి.  అవి మనకు ఎలాగూ  పెద్దగా నచ్చవు.  .. ఓ నాలుగుంటే కదా చూసుకోవడానికి .. మొత్తానికి మా ముగ్గురికీ, మధ్యలో చూపిస్తున్న అతనికీ ( అభిప్రాయం చెప్పాడు కనక) నచ్చిన ఫ్రేం దొరికింది. పాపం మా అబ్బాయి కూడా  ఇంత ఖరీదు వేస్ట్ డాడీ, మళ్ళీ విరిగి పోతే అనుకుంటూ మాములుదే తీసుకున్నాడు. అమ్మయ్య! సగం పని అయిపోయింది కనక ఇంక అద్దాలు చూసేసుకుంటే సరి అనుకున్నామో లేదో మళ్ళీ ఇంకో బాంబు..
    "మామూలు అద్దాలు బావుండవండి.:. అని ఒక పెద్ద కాటలాగ్ మా ముందు పెట్టాడు.. దాన్లో ఉన్నన్ని పేర్లు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తందూరీ, చైనీస్ ఇలా అన్ని రకాలు దొరికే హోటల్ మెనూ లో కూడా ఉండకపోవచ్చు.. పాలీ కార్బనేట్, ఆంటీ స్క్రాచ్, అంటీ గ్లేర్, ఫోటో సన్, సూపర్ తిన్, ఇలాంటివన్నీ కాలంలలోనూ,  జిస్, సుప్రోల్.. ఇంకా ఇలాంటివెన్నో రకాల బ్రాండ్ ల పేర్లు వరసలలోనూ ఉన్న పెద్ద పెద్ద పట్టికలు చూపించాడు. ఇంక అక్కడనించి చూసుకోండి.. ఆ కామ్బినేషలూ, పర్ముటేషణ్ లూ .. ఒక్కోదానికి ఒక్కొక్క రేటు.. మినిమం మూడువేలుగా చెప్పవచ్చు, ఇంకా ఎక్కువేనేమో కూడా. ఈ లెక్కన  అధమం వెయ్యి రూపాయలు ఫ్రేం కీ, మూడువేలు లెన్స్ లకి వేసుకున్నా ఒక కళ్ళజోడు ఖరీదు కనీసం నాలుగు వేలు అవుతుంది అన్నమాట. ఇంకా ప్రోగ్రెసివ్ లాంటివి కొనాలంటే ఇంకా ఎక్కువే.. కేవలం లెన్స్ లే ఐదేసి వేలూ లేక ఇంకా ఎక్కువో ఉంటాయి.. అంతే మా షాపు అతని భాషలో చెప్పాలంటే మంచి ఫ్రేమూ, మంచి లెన్స్ లూ ఉన్న కళ్ళ జోడు కి కనీసం పదివేలు అవుతుందేమో.. !!!
          ఇది ఇప్పుడు కొత్తగా చూసినది కాకపోయినా, ధరలు మరీ ఇంత ఎక్కువగా అనిపించడం ఈ మధ్యన బాగా ఎక్కువ అయింది అనిపిస్తోంది నాకు. ముందుగా వాళ్ళు మన దేశంలో తయారయ్యే ఫ్రేములూ అవీ ఏమి చూపించారు, ఆ తర్వాత ఇంపోర్టెడ్ వాటి గుణాల్ని కీర్తించి మనల్ని నమ్మించి అమ్మే ప్రయత్నం చేస్తారు. మనలో ఉన్న బ్రాండ్ పిచ్చి ని బాగా వాడుకుంటారు. రెండేళ్ళ క్రితం వాడికి కొన్న( ఇంపోర్టెడ్ అని మాకు తెలియకుండానే)  ఫ్రేం ఇంపోర్టెడ్ అని వాడి స్నేహితుడు సర్టిఫై చేసాక మా వాడి ఆనందం చూసి తీరాలి. 
            అంతేకాదు.. ఇదివరకు టైము చూపించడానికి మాత్రమే పనికివస్తుంది అనుకున్న వాచీ, చూపు సరిగా చూపించే కళ్ళ జోడూ, ధరించే బట్టలూ, చేతిలో పట్టుకునే సెల్ ఫోనూ, మేడలో వేసుకునే టై ఇలా ఒకటేమిటీ అన్నీ కూడా మనల్ని జనాలకి చూపించే సాధనాలుగా (fashion accessories) గా మారిపోయి,  ప్రతీదానిలోనూ brand consciouness విపరీతంగా పెరిగి పోయాకా,  ఇలా కాక ఎలా ఉంటాయి?. అందుకే ఈ మధ్యన కళ్ళ జోళ్ల మీదా, కాలి జోళ్ల మీదా కూడా swaarovski లాంటి అంతర్జాతీయ బ్రాండ్ ల తళుకులూ, బెళుకులూ అద్ది మరీ అమ్ముతున్నారు. వాటి ధర నాకు ఊహించడానికి కూడా కష్టమే..అందుకే అంటున్నాను.. ఈ కళ్ళ జోళ్ళు మాత్రం మనకి  లోకాన్ని చూపించడం మాట ఎలా ఉన్నా, చుక్కలు తప్పకుండా చూపిస్తున్నాయి అని.







Saturday, January 1, 2011

నడిచి వచ్చిన దారి..

               నా చిన్నప్పుడు ఒకసారి  కొత్త సంవత్సరం ప్రవేశించే వేళకి అమ్మమ్మగారి ఇంట్లో ఉన్నాము. అర్ధరాత్రివరకూ వేచి ఉండడమూ, శుభాకాంక్షలు చెప్పుకోవడమూ అనేది మాకు అప్పుడప్పుడే తెలుస్తున్న విషయం. అందుకనే ఆ సంవత్సరం ఎలాగైనా మెలకువగా ఉండి హంగామా చెయ్యాలని నిర్ణయించేసుకుని పన్నెండు వరకూ ఆటలూ, పాటలతో గడిపాము. ( తోమ్మిదిన్టికే అర్ధరాత్రి అనుకునే పల్లెటూరిలో, టీ.వీలు కాదు కదా కనీసం రేడియో కూడా సరిగ్గా పలకని రోజుల్లో.. ఎంత కష్టమో చూసుకోండి). 
           గంట పన్నెండు కొట్టగానే కేరింతలు కొట్టుకుంటూ మాలో మాకు విషెస్ చెప్పుకుంటూ అప్పటికే చలికి ముసుగేసిన పెద్దలని కూడా నిద్ర లేపి విషెస్ చెప్పాము. వారిలో ఒక బామ్మగారు "ఎవిటర్రా.. హడావుడి ? అన్నారు.కొత్త సంవత్సరం వచ్చింది, అన్నాము ఉత్సాహంగా.. ఐతే ఏవిటి? నోరుమూసుకుని పడుకోండి".. అన్నారు ఆవిడ. 'అయ్యో ఇలా అంటారేమిటి? ఈవిడకి బొత్తిగా ఏమీ తెలీదు అనుకున్నాం 'నిరాశగా. మరోకావిడ.. అయ్యో.. "ఇంత రాత్రి పడి వచ్చిందా? ఇప్పుడేం బస్ ఉందర్రా?అన్నం తిందో లేదో కనుక్కోండి.".అన్నారు.. కొత్త సంవత్సరం అంటే మనిషి అనుకున్నారో లేక  ఆవిడ దృష్టి అంటా ఆ తరవాత రోజు రాబోయే చెల్లెలి మీద ఉండి ఆవిడే వచ్చింది అనుకున్నారో ఏమిటో? వీళ్ళిద్దరి రియాక్షన్ చూసి మా ఉత్సాహం మీద నీరు చల్లినట్టయింది.. ఆ తరవాత అమ్మ వచ్చి "పెద్దవాళ్ళకి ఈ విషయాలు పెద్దగా తెలియవు, తెలుగు సంవత్సరాదే వాళ్లకి లెక్క.. ఇంక ఎవరినీ నిద్ర లేపవద్దు.. పొద్దున్న చెప్పవచ్చు" అని చెప్పింది.
            ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే కొందరికి ఎంతో గొప్పగా అనిపించే విషయం  మరొకరికి  అంత గొప్పది కాకపోవచ్చు. మనం ప్రాణప్రదంగా భావించే విషయానికి మరి కొందరి దృష్టిలో   ప్రాముఖ్యత లేకపోవచ్చు. మన భావనలోనే ఆనందం ఉంది, అనుభూతి ఉంది. నిన్నటిలాగే ఈ రోజూ, ఈ ఏడాది లాగే వచ్చే ఏడూ అనుకుంటే దేనికీ ప్రత్యేకత లేదు., అలా      అనుకునే వారికి మనం చెప్పగాలిగేదీ లేదు. . 
       మొదటి అడుగూ, మొదటి బడీ , మొదటి బహుమతీ, మొదటి ఉద్యోగం, మొదటి వలపు, మొదటి తలపూ, మొదటి తారీకు ( జీతాల రోజు కదా)  ఇలా మొదటివన్నీ ప్రత్యేకమైనవే అనుకుంటే సంవత్సరం లో వచ్చే మొదటి తేదీ కూడా అలాంటిదే. గడచిన సంవత్సరపు స్మృతులు నెమరు వేసుకుంటూ, వచ్చే సంవత్సరం మనకే కాదు, మన కుటుంబ సభ్యులకీ, స్నేహితులకీ, తెలిసిన వారందరికీ కూడా   అంతకంటే బాగా  ఉండాలని కోరుకోవడమే  ఈ కొత్త సంవత్సర వేడుక. 
         న్యూ ఇయర్ వేడుకలంటూ న్యూజీలాండ్ వెళ్ళినా, బీచ్ వడ్డున సరదా అంటూ గోవా వెళ్ళినా, డీ.జేలూ,పీ.జీలూ అంటూ ఉన్న ఊరిలో హోటల్కి వెళ్ళినా , లేదూ సరదాగా కుటుంబ సభ్యులతో గడిపినా దాని వెనక ఉన్న పరమార్ధం మాత్రం ఇదే. నలుగురితో కలిపి జరుపుకుమతూ మనతో పాటు ఆ నలుగురికీ కూడా శుభం కలగాలని కోరుకోవడమే . ఒకప్పుడు పోస్ట్ కార్డ్ ల లో వచ్చేవి విషెస్. తరవాత గ్రీటింగ్ కార్డ్ లు, కొనుక్కోవడమో, లేక ఇంట్లో చేసుకోవడమో..ఇప్పుడేమో కంప్యూటర్ లో కార్డ్లు, మొబైల్ ఫోన్ ల లో శుభాకాంక్షలు.. పని సక్రమంగా జరిగినంతవరకూ ఎలా చేసినా తప్పులేదు..
     అసలు విషయమంతా ఆ తర్వాతే ఉంది. "న్యూ ఇయర్ ఈవ్" అంటూ ఆడి పాడి అలసి పోయి మర్నాడు పది గంటలవరకూ  నిద్రపోవడం మాత్రమేనా కొత్త సంవత్సరం అంటే? లెక్కకు మిక్కిలిగా ఎస్.ఎం.ఎస్ లూ, ఈ మెయిల్స్ పంపేసి ఆ సర్వీస్ మనకందిమ్చే వారిని  పోషించేస్తే చాలా? రిసల్యూషన్స్ అంటూ ఎప్పుడూ అనుకునే మాటలనే మళ్ళీ అనుకుని వదిలేస్తే సరా? రేమినేసేన్సేస్ అంటూ జరిగిన విషయాలని తల్చుకుని వదిలేస్తే సరిపోతుందా?
            గడచిన గతసంవత్సరాన్ని అవలోకనం చేసుకుంటూ ఆ బాటలో  ఎక్కడ పూలు ఉన్నాయో చూసి అక్కడ మరిన్ని పరుచుకుని మన మార్గం మరింత ఆహ్లాదంగా మార్చుకోవదమూ, ముళ్ళు తగిలిన చోట్లనించి అవి ఏరి పారేసే ప్రయత్నం చేసుకోవడమూ, "ఆ మాట్లడదాములే! అని వాయిదా వేస్తున్న స్నేహితులనీ, సన్నిహితులనీ బద్దకించ కుండా కలిసే/మాట్లాడే ప్రయత్నం చెయ్యడమూ, వ్యక్తిగానూ, వ్యక్తిత్వంలోనూ మరింత ఎదిగే ప్రయత్నం చెయ్యడమూ, కొత్త పుస్తకాలని, కొత్త ప్రదేశాలనీ  మనం చదివే/చూసే  లిస్టు లో చేర్చుకోవదమూ ఇలాంటివి నిజంగా కొత్త సంవత్సరాన్ని కొత్తగా స్వాగతిస్తాయేమో. అనిపిస్తుంది  నాకు. 
        ముఖ్యంగా మనం నడిచి వచ్చిన దారిని వెనక్కి తిరిగి చూసుకుంటే దాటినా మెయిలు రాళ్ళే కాదు, అలవోకగా దాటిన దూరాభారాలే కాదు ,  ప్రయాణాన్ని ఆపిన స్పీడ్ బ్రేకర్లూ, కలతలు పెట్టిన మలుపులూ, మెలికలూ, తిరిగిన వంకర్లూ కనిపిస్తాయి.. వాటిని చూసుకుంటూ, అధిగమించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటూ ముందుకు సాగితే ఆనందమే.
      మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీరు నడిచి వచ్చిన దారిలాగే,, ఈ సంవత్సరం నడవబోయే దారి కూడా సాఫీగా, సుఖంగా సాగాలనీ,  సుఖ సంతోషాలు మీ ఇంటిముంగిట తోరణాలు కట్టాలనీ, ఆరోగ్యం, ఆనందం మీ ఇళ్ళముందు రంగవల్లులు వేయాలని, నూతన సంవత్సరం మీ కు సకల శుభాలనూ   ప్రసాదించాలని  మనసారా కోరుకుంటూ..

                           

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...