Thursday, July 14, 2011

లాంగ్ వీకెండ్ కదా.. మీరేం చేస్తున్నారు??

 ఈ మధ్యకాలంలో ఇదో పెద్దప్రశ్న.. సాధారణంగా రెండురోజుల వారాంతం కాక మరొక రోజు ఇటో, అటో సెలవు వస్తే చూడాలి జనాల హడావుడి. ఆఫీస్ లొ అ చిన్నపిల్లలు, అంటే ఈ మధ్యనే ఉద్యోగాల్లో చేరినవాళ్ళు.. ఇంటిమీదా, అమ్మచేతి ఆవకాయ అన్నం మీదా ఇంకా బెంగ తీరని వాళ్ళు ( ఈ బెంగ తీరిన వారెవరు లెండి?)  రెండు నెలల ముందే టిక్కట్లు బుక్ చేసేసుకుని, బాగ్ లు సర్దేసుకుని రెడీ గా ఉంటారు బస్సో, ట్రైనో ఇటునించి ఇటే ఎక్కేయడానికి.  వీళ్ళు ముందు జాగ్రత్తగా సీజన్ టికెట్లు కూడా కొనేసుకుంటారు.
 ఆ తర్వాత కాటగిరీ.. కొన్నాళ్ళుగా ఉద్యోగాలు చేస్తూ మరీ ప్రతీ వారమూ ఇళ్ళకి పరిగెత్తని వాళ్ళు.. వీళ్ళు ఫ్రెండ్స్ తోనో, కజిన్స్ తోనో సరదాగా చిన్న విహారయాత్రకి ముహూర్తాలు పెట్టేసుకుంటారు. 
 ఆ తర్వాత స్టేజ్ లో ఉన్నవాళ్ళు.. ఇలాంటి వారాంతాలకి ఎక్కడకి వెళదామా? అని బుర్రలు బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు... పిల్లలు గోవా అని గొడవ చేస్తున్నారు.. may be I will take another two days off and plan for that అనో . లేదంటే ఊటీకి మూడు రోజులు చాలు కదా.. అదే అనుకుంటున్నాను అనో.. ఇలా అనేస్తూ ఉంటారు..
...మీరేం చేస్తున్నారు?   ఇది నన్ను వాళ్ళు అడిగిన ప్రశ్న.. ఏమో. ఇంకా ఏమీ అనుకోలేదు..అన్నాను నేను కిందటిసారి.. అవునా.. అరే.. మరి ఎలా? ఇప్పటికే అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి.. ఇంకా లేట్ చేస్తే ఏమీ దొరకవు మీకు.. అన్నారు.

ఇంక ఇంటి దగ్గర కూడా సందడికేమీ తక్కువ లేదు.. తేజస్ వాళ్ళు కూర్గ్ వెళుతున్నారుట.. ఆర్నభ్ వాళ్ళు కొడై కెనాల్.. ఇలా లిస్ట్ చదివేస్తాడు మా అబ్బాయి.. మీరు ఎక్కడకి వెళుతున్నారు? Atleast drive down to a near by resort.. it will be a lot of fun. అని సలహా.. నేను అడగనేలేదు...yaa.. చూడాలి అన్నాను. 
అనుకున్న మంచి శుక్రవారం  ( నిజంగా Good Friday కాదు.. ) పొద్దు అంటే గురువారం సాయంత్రం.. అంటే లాంగ్ వీకెండ్ కి అంకురార్పణ జరిగే శుభ ముహూర్తం అన్నమాట..  రానే వచ్చింది.. ఈ రోజు అందరూ అడిగేస్తారు ఇంక చెప్పేయాలి తప్పదు.. ఇదేదో Alchemist పుస్తకం లో చెప్పినట్టు "మనం మన జీవితకాలంలో ఎక్కువ సేపు ఆలోచించేది.. ఇతరులు ఎలా జీవించాలి అనే దాన్ని గురించి ట".. ఎందుకో ఈ వాక్యం ఆ పుస్తకం చదివినప్పటినించీ నా మనసులో ఉండిపోయింది.నేనూ అంతేనా ? ( అంతే అని నా అనుమానం) అని భయం వేస్తుంది నాకు 
మేమూ వెళ్తున్నాం ఒక మంచి రిసార్ట్ కి.. వచ్చాకా చెప్తాను ఎలా ఉందో?.. so that  you can also try.. అని చెప్పేసాను.. 

అలా మొదలయింది..భలే మొదలయింది.. :
మా మూడు రోజుల వారాంతపు సెలవు గురువారం రాత్రి కార్ పార్కింగ్ తో మొదలయిందన్నమాట.. పార్కింగ్ బానే ఉంది.. చాలా కార్లు పెట్టుకోవచ్చు..' గుడ్ 'అనుకున్నాము. కాటేజ్ కూడా చాలా బావుంది విశాలంగా, నీట్ గా.. అనుకున్నాము.. .. 'మంచి వియూ'.. ఎదురుగా రైల్వే ట్రాక్, దాని వెనక కంటికి కనిపించేంత మేర పచ్చదనం.. పచ్చదనమే.. పచ్చదనమే.. భలే..భలే.. చిన్నప్పటిలా ట్రైన్ వస్తే చూసి సరదాపడేలా ఉంది తప్ప అరగంటకొకటి వచ్చి చెవులు చిల్లులు పడేంత శబ్దం  చేసేలా లేదు.. అని సంబరపడిపోయాం..
ఇప్పటికి అర్ధం అయిపోయి ఉండాలి మీకు మేము వెళ్ళిన రిసార్ట్ గురించి.. ' అంటే మా ఇల్లు. అదే ఈ సారి మా హాలిడే డెస్టినేషన్ అన్నమాట. 
గులాబీలతో కాఫీ
 శుక్రవారం సినిమా విడుదల..:| చాలా లేట్ గా నిద్ర లేవాలని ముందే డిసైడ్ అయిపోయాము కనక అదే ఫాలో అయిపోయాము.. పొద్దుపొడవకుండా లేవాలంటే కష్టం కానీ,.. పొద్దేక్కేదాకా పడుకోమంటే కష్టమేముంది? బాల్కనీలో కూర్చుని వేడిగా కాఫీ/పాలూ తాగుతూ కాళ్ళు చాపుకుని న్యూస్ పేపర్ లో వార్తలు చర్చించేసుకున్నాము 'రాజ్ దీప్ సర్దేశాయి.. సాగరికా ఘోష్'  డిబేట్ పెడితే ఎలా ఉంటుందో అలా అయిందనుకోండి..అదిరిపోయింది,  కానీ చాలా బావుంది.. ఈ మధ్యలో ఆవపెట్టిన కూరలో నిమ్మకాయ రసంలాగానూ, కరివేపాకులానూ మా వాడి Expert opinions.. 
 ఇవి మల్లెపూలే.. ఇడ్లీలు కాదు :)
అరే..ఇది మన బాల్కనీయేనా? ఇంత పెద్దదా? ఇన్ని కొత్త మొక్కలెప్పుడు పెట్టావమ్మా? మన ఇంట్లో చిల్లీ మొక్కలున్నాయా? అని ఆశ్చర్యపోయాడు మా అబ్బాయి..మల్లెపూలలాంటి  వేడి వేడి ఇడ్లీలూ, కొబ్బరికాయపచ్చడీ, ఉల్లిపాయా పల్లెల పచ్చడీ. కారప్పొడీ వేసుకుని హాయిగా నిదానంగా తిన్నాము, ఆఫీస్ కి పరిగెత్తక్కరలేదు కదా.. అందుకే.. ఈ ఆదరా, బాదరాలలో ఆహారమూ, ఆరోగ్యమూ మిగలటం లేదా అని డౌట్ వచ్చింది.. భలే అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా? అనిపించింది..

 మధ్యాహ్నం. నువ్వు కష్టపడి వండద్దు.. ఈ రోజు ఆంధ్రా స్టైల్ భోజనం తెప్పించేసుకుందాం ఎక్కడనించైనా అన్నారు వాళ్ళిద్దరూ.. నేనసలే శ్రీకృష్ణ భగవానుడి టైపు.. అంటే పర్యవసానం ఎమవుతుందో నాకు ముందే తెలుసు అయినా అచ్చు మా అన్నగారిలా  చిద్విలాసంగా తలూపాను.. (శ్రీకృష్ణుడి వేషానికి మారుపేరయిన అన్నగారిలా కూడా అని  అర్ధం) మన పేరే ఆయన చెల్లెలి పేరు కదా.. అదన్నమాట..
        స్నానం చెయ్యాలనిపించినవాళ్ళం చేసాం.. లేనివాళ్ళు లేదు.. అయినా స్నానానికీ, ఆకలికీ లింకుందా మరి?.. టైముకి గంట కొట్టినట్టు ఆకలి వెయ్యాల్సిందే కదా.. నందిని నించి పార్సెల్ వచ్చేసింది.. అలాంటప్పుడు అదేమిటో అవన్నీ గిన్నెల్లో సర్దుకోవడం కూడా పెద్ద పనిలా ఉంటుంది.. "పప్పు బావుంది" అంతే మిగతావేమీ బావులేవు.. మనమే చేసుకోవలసింది.. మా వాడి మొదటి కామెంటు. ఇదే  నా అప్పటి చిద్విలాసానికి కారణం అని ఈపాటికి మీకూ అర్ధం అయిపోయి ఉంటుంది.. అప్పుడప్పుడూ ఇలాంటి భొజనాలు తింటేనే కదా అలవోకగానూ, అప్రయత్నంగానూ కంచాల్లోకి వచ్చేస్తున్న ( అలా అనిపిస్తున్న) మన ఇంటి భోజనం విలువ బాగా తెలిసేది.. అవినాష్ దీక్షిత్ గారి 'The art of Strategy' ఈ మధ్యనే మొదలు పెట్టాను కదా.. అదన్నమాట సంగతి.
అందరూ హాయిగా ఎవరికి కావలసిన రూం లో వాళ్ళు నిద్రపొయామా?.. అదేమిటో సెలవురోజుల్లో సాయంత్రం చాలా తొందరగా అయిపోతుందేమో.. చీకటి పడిపోయింది.. అలా అనిపించిందే కానీ.. మేము చాలా సేపు మొద్దు నిద్ర పోయాము అనిపించనేలేదు.. చిత్రం..
శనివార వ్రత కధ.. : శనివారం.. మా మొదటి ప్రోగ్రాం.. అభ్యంగన స్నాం.. ఆలీవ్ నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె.. నువ్వుల నూనె.. మా ఇంట్లో నూనె కొట్టు పెట్టే ఉద్దేశ్యం అస్సలు లేదు.. ఒట్టు.. ఇవన్నీ నేను నా పాకశాస్త్ర నైపుణ్యానికి మెరుగులూ, నూనె జాణ సొబగులూ అద్దడానికి కొంచం, కొంచం కొనుక్కుని పెట్టుకుంటానన్నమాట.. కిచెన్ లోంచి , పొద్దంతా, ఇల్లంతా తిరుగుతూ వంట వండడానికి మాత్రం పొద్దు తిరుగుడు పువ్వు నూనే..
ఇంట్లో స్పా
నూనె రాసుకుని నలుగు పెట్టుకుని మూడు గీజర్లూ ఆన్ చేసుకుని తనివి తీరా స్నానం చేసాం.. మొన్నెప్పుడో  ఒపెన్ హార్ట్ లో తనికెళ్ళ భరణి గారు చెప్పిన మాట గుర్తొచ్చింది ఇప్పుడు స్నానాల తొట్టె ఉంది.. టైమే లేదు అని..  మర్చిపోయాను.. special affects కొసం మా అబ్బాయికి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కొంచం వాసన నూనె ( ఆరోమా ఆయిల్) వేసి డిస్పెన్సర్ పెట్టాను.. అచ్చు' స్పా'లా ఉంది మా అన్నాడు.. మళ్ళీ భరణిగారినే తలిచేసుకున్నాను.. "నీలోన శివుడు కలడు" అన్నారు కదా ఆయన. మన ఇంటిలోన స్పా కలదు అని నేను అనేసుకున్నాను.. 

ఆ రోజు మధ్యాహ్నం చైనీస్. చేసుకుందాము అని గొడవ పెడితే అమెరికన్ చాప్సీ, నూడుల్స్ వగైరాలు చేసేసుకుని హాయిగా గిన్నెలు ఖాళీ చేసేసాం.. తర్వాత లైబ్రరీ ప్రయాణమూ, రోజు కొకటి చొప్పున Bourne సీరీస్ సినిమాలు చూడ్డామని ముందే అనుకున్నాం కనక అది రెండోది కానిచ్చేసాం..
Kaleidoscope
అహహా.. ఆదివారం: 'ఆది' అంటే మొదలు.. మరి అదేవిటో దీన్ని వారం చివర పెట్టారు.. అయినా ఆదివారం అంటే హాయివారం మాములుగానే.. ఎన్ని రోజులయిందో మనిద్దరం swim  చేసి అని నేనూ,, మా వాడు పొద్దున్నే వెళ్ళిపోయాము.. తర్వాత కాసేపు ముగ్గురం కలిసి బేడ్ మింటన్ ఆడేసాం.. ఇంట్లో Keleidoscope లో రకరకాల Patterns ట్రై చేసాం. మధ్యాహ్నం రొట్టెలూ కూరా సేవించి.. లైబ్రరీ పుస్తకాలు చదువుకున్నాం. రాత్రి మళ్ళీ మూడో  Bourne సినిమా చూసాం.. ఇలా మూడు రోజులూ చేసిన పని చెయ్యకుండా, తిన్న వెరైటీ తినకుండా, మరే ఇతర వ్యాపకాలూ పెట్టుకోకుండా మా తో మేము వీలైనంత సమయం గడిపేలా మా ఈ లాంగ్ వీకెండ్ గడిపేసాం..  మర్చిపోయాను.. . శనివారం ఇంటి ముందు ముగ్గు వేసాను.వంటపని లేని నాడు గుమ్మడి వడియాలు పెట్టాము ఎంత బావున్నాయో.. మీరూ చూడండి..
'అతడు'  సినిమాలో మహేష్ బాబు అంటాడు 'ఇల్లు ఇంత బావుంటుందని తెలీదు ఇన్నాళ్ళూ' అని.. అచ్చు అదే స్టైల్ లొ  మా వాడు " ఇంట్లో హాలిడే ఇంత బావుంటుందని తెలీలేదు ఇన్నాళ్ళూ' అన్నాడు.. చెప్పద్దు నాకెంత సంతోషం వేసిందో. ఇల్లంటే కేవలం రాత్రి వచ్చి నిద్రపోయే విడిది అని మన తర్వాత తరం వాళ్ళు అనుకోరు అని నమ్మకం వచ్చింది కూడా..
   మా మూడు రోజుల దినచర్యని చెప్పి మీ అందరికీ బోర్ కొట్టీంచడం నా ఉద్దేశ్యం కాదు..   హాలిడే అంటే ఈ నాటి పిల్లల భాషలో చెప్పలంటే out of India నే అనీ .. ఇలా రెండు,  మూడు రోజులు సెలవలు వస్తే తప్పకుండా ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అందరూ అనుకునే ఈ రోజుల్లొ అప్పుడప్పుడైనా ఇలాంటివి చేస్తే చాలా.. చాలా బావుంటుందని చెప్పాలనే..
సెలవు పెట్టి ఇంట్లో ఉంటారా ?  అని ఆశ్చర్యపోతారు కొందరు.. అదేదో పెద్ద తప్పు అయినట్టు.. వేలకి వేలు పోసి కర్టెన్లూ, సామాన్లూ, ఇంకా ఎక్కువ పెట్టి ఫర్నిచరూ, టీ. వీ లూ గట్రా  కొనుక్కుని.. మెలకువగా ఉన్న సమయంలో దాదాపు  సగంసేపు, అద్దాలూ, టైల్సూ, వంట గట్లూ తుడుచుకుంటూ, బూజులు దులుపుకుటూ  మైంటైన్ చేసుకోవడానికీ, పొద్దున్నే తిని,  పోయి రాత్రి వచ్చి పడుకోవడానికీ మాత్రమే కాదు.. ఇల్లంటే..
మేడంటే మేడా కూదూ.. గూడంటే గూడూ కాదూ.. పదిలంగా  మనందరం ఎవరికివారు తమకోసం అల్లుకున్న పొదరిల్లు ఇల్లూ.. అని చెప్పాలనే.. నిజంగానే ఇల్లెంతో బావుంటుంది.. ఇల్లే బావుంటుంది.. త్రివిక్రం శ్రీనివాసూ, మహేష్ బాబూ కరక్ట్ గా చెప్పారు.. హోం స్వీట్ హోం..
Sweet home

16 comments:

  1. 100% correct మాట చెప్పారు. అదీ.. చాలా అందంగా.. అభినందనలు!
    కృష్ణప్రియ

    ReplyDelete
  2. అబ్బ ఎంత బాగా ఎంజాయ్ చేశారండి. ఇంతకంటే ఇంకేం కావాలి.అంతే బాగా రాశారు కూడా

    ReplyDelete
  3. wrote nicely... its realy intresting ...

    ReplyDelete
  4. అవును..ఇల్లెంతో బావుంటుంది.. ఇల్లే బావుంటుంది..

    ReplyDelete
  5. So sweet! :))
    నిజమే.. ఇల్లంటే ఇల్లే.. ఇంటికి దూరంగా బయట ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు కలిగే ఆనందాన్ని వెల కట్టలేం..

    ReplyDelete
  6. నా perfect holiday idea కూడా ఇదేనండీ.. కంచం ముందు నుంచి మంచమ్మీదకి, మంచమ్మీదనుంచి కంచం ముందుకి .. :)

    కానీ అన్నిసార్లూ ఇది work out అవదు కదండీ.. "మీకేమీ.. మేము రోజంతా ఇంట్లోనే కదా ఉండేది.." లాంటి కామెంట్ల వల్ల (పాపం అదీ నిజమే అనుకోండి).

    అందుకే మీరన్నట్టు, "సెలవు పెట్టి ఇంట్లో ఉండడమే..!" :)

    ReplyDelete
  7. @ కృష్ణప్రియ : ధన్యవాదాలు..
    @ లత : కరక్ట్ గా చెప్పారు.. కలిసి ఎంజాయ్ చెయ్యడమే కదా ముఖ్యం.. నా టపా మీకు నచ్చినందుకు థాంక్ యూ..
    @ రాజీవ్ రాఘవ్: Thank you.. Welcome to my blog..
    @ క్రాంతి గారూ: నా బ్లాగ్ కి స్వాగతం..
    @ మధురవాణి : సరిగ్గా చెప్పారు. థాంక్ యూ..
    @ రవికిరణ్: మొదటి సారి కామెంటు చేసారు నా బ్లాగ్ లో.. స్వాగతం మీకు.. మీరన్నది నిజమే.. ఇలా అస్తమానూ చెయ్యడానికి వీలవదు. అప్పుడప్పుడు వరైటీగా చెయ్యడానికి మాత్రం చాలా బావుంటుంది.. :)

    ReplyDelete
  8. well said. reading this post was as if reading my thoughts. Can you please tell the name of the kaleidoscope toy name and where it is available? in my sons school the maths teacher recommneded having a toy like this at home. thanks
    for the nice post. i apologize for typing in english.

    - sangeetha

    ReplyDelete
  9. Thank you Sangeetha.. You can find this game in any of the big toy/books hops like Landmark, crossword etc. We bought ours in Landmark a while ago.. Thank you once again..

    ReplyDelete
  10. భలే ఎంజాయ్ చేసారు.ఈసారి లాంగ్ వీకెండుకి నేనూ అలాగే చేస్తా.

    ReplyDelete
  11. superb...really love this idea ;)

    chala baga raasaru :)

    ReplyDelete
  12. Wow ! Nice idea and well written too :)))

    ReplyDelete
  13. @శ్రీ థాంక్ యూ.. తప్పకుండా ట్రై చెయ్యండి. వెరైటీగా చాలా బావుంటుంది..
    @ ఇందు.. Thank you..
    @ Sravya.. Thank you very much..

    ReplyDelete
  14. Hello Praseeda garu! Intha late ga comment pedutunnanduku emi anukokandi. Inni rojulu nenu okkathine ila alochistanu anukune daanni. Kani ila alochinche vallandarni represent chesi meeru raasina ee post chala bagundi.

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...