సంగీత త్రిమూర్తులలో ప్రతీ ఒక్కరిదీ ఒక విలక్షణమైన శైలి.. పధ్ధతి .. అందుకే వారికా గౌరవం..ఇది తక్కువ అని ఏదీ అనిపించని కృతులు వారి సొంతం.. ఏ రాగమైనా, తాళమైనా, సాహిత్యమైనా కలకాలం గుర్తుండి పోయేలా మలచగలగడం కేవలం వారికే సొంతం..' శ్రీ త్యాగరాజ సన్నుత' అంటూ రామనామం తో శ్రీరాముడిని కీర్తించి, తరించిన త్యాగరాజ స్వామి అయినా, ముగ్గురమ్మల మూలపుటమ్మని 'శ్యామ కృష్ణ సోదరి' అంటూ కీర్తించిన శ్యామ శాస్త్రి అయినా, గురుగుహ అనేది తన సంతకంగా మార్చుకుని, గురుగుహుడినీ, ఆయన అన్నగారైన వినాయకుడినీ కీర్తిసూ కృతులని సమకూర్చిన శ్రీ దీక్షితుల వారైనా సంగీత కళా మకుటంలో చూడా మణులే. అయితే సాధారణం గా వినవచ్చే దీక్షితార్ కృతులకి భిన్నంగా , రామవైభవాన్నీ, ఆ మర్యాదా పురుషోత్తముడి గోప్పదనాన్నీ ప్రస్తుతిస్తూ, ప్రస్తావిస్తూ ఎంతో వైవిధ్యంగా సాగే రామ నామ సంకీర్తనమే ఈ మణి రంగు రాగ కీర్తన.. దీక్షితుల వారు రాసిన అనేక గొప్ప కృతులలో ప్రత్యేకంగా పేర్కొనవలసిన మరకత మణి వంటి కృతి ఇది. దానికి తగ్గట్టే అరుదైన రాగం.
" కోమల తర పల్లవ పద... కోదండ రామా.. ఘన శ్యామల విగ్రహాబ్జనయన.. సంపూర్ణ కామా.. రాగురామా.కళ్యాణ రామ రామ.."మామవ"
ఆ తరువాత ఆ లీలా మానుష మూర్తిని ఎవరెవరు సేవిస్తున్నారో చెప్తారు. ఛత్ర చామరాలని కరమున ధరించి భారత, లక్ష్మణ, శత్రుఘ్నులే కాక విభీషనుడూ , సుగ్రీవుడు మొదలైన ప్రముఖులున్నారుత శ్రీ రాముని సేవకై. ' 'ఛత్ర చామర కర ద్రుత భారత, లక్ష్మణ, శత్రుఘ్న విభీషణ సుగ్రీవ ప్రముఖాది సేవిత ' అంటూ.' సోదరులందరినీ వయసు క్రమంలో ప్రస్తావిస్తారు దీక్షితుల వారు. అంతేకానీ వనవాసానికి అన్నతో కలిసి వెళ్ళినవాడు, అనుంగు తమ్ముడు అని లక్ష్మణుడిని భరతుడి కంటే ముందు పెట్టలేదు. ఇది ఆరోజుల్లో వయసుకీ, వావి వరసలకీ ఇచ్చే గౌరవమూ, అది ఆ పెద్దవారు కూడా నిలుపుకు న్న గొప్పదనమూ అనుకుంటాను నేను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
మణి రంగు రాగం కూడా రీతిగౌళ రాగం లాగే 22 వ మేళకర్త రాగమైన ఖరహర ప్రియ కి జన్య రాగమే. మధ్యమావతికి అత్యంత దగ్గరగా అనిపిస్తూనే ఎంతో విలక్షణంగా వినిపించే గమక ప్రధానమైన రాగం. మధ్యమావతికీ, ఈ రాగానికీ కేవలం ఆరోహణలో వచ్చే గాంధారం మాత్రమే తేడా. మణిరంగు రాగానికి ఆరోహణ 'స రి మ ప ని స' అవరోహణ 'స ని ప మ గ రి స'. మ జీవ స్వరంగా వినిపించే ఉపాంగ రాగం. 'హలధరాజం ప్రాప్తుం' అనే కృతీ , 'రానిది రాదు' అనే త్యాగరాజ కృతి ఈ రాగం లోనే చేయబడ్డాయి..
మారుతి సన్నుతుడైన పట్టాభిరామా.. నన్ను కాపాడు అన్న పల్లవితో మొదలవుతుందీ కృతి. 'మామవ పట్టాభిరామా.. జయ మారుతి సన్నుతి సన్నుత రామా.. ' అంటూ..
లేత ఆకులకన్నా సుకుమారమైన, కోమలమైన పాదాలున్న కోదండ రాముడు....ఘనమైన శ్యామల వర్ణపు విగ్రహం కలిగిన కమల నయనమ్ములు కలిగిన కోరిన కోరికలన్నీ సంపూర్ణం కావించే రఘురామా.. కళ్యాణ రామ రామ.. అని ప్రస్తుతిస్తారు అనుపల్లవిలో..


అత్రి, వశిష్టుడూ మొదలైన మహర్షుల అనుగ్రహా న్నీ , ఆశీర్వాదాన్నీ పొందిన వాడట ఈ దశరధ రాజ పుత్రుడు. తాను సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపుడైనా మానవ రూపు ధరించినందుకు ఈ మహర్షులందరినీ గురువులుగా భావించిన శ్రీ రాముని వినయ విధేయతలకు సాటిగా సాగుతుంది శ్రీ దీక్షితుల వారి వర్ణన . 'అత్రి వశిష్టాద్యను గ్రహ పాత్ర.. దశరధ పుత్ర..అంటారు.
కేవలం నవరత్నాలతోనే కాదు.. మణి రంగ రాగం యొక్క ఉజ్జ్వలత తోనూ, కాంతి తోనూ కూడా అలంకృతమైన ( తను రాసిన కృతిలోనూ ఆ రాగం పేరును చేర్చడం శ్రీ దీక్షితుల వారి ప్రత్యేకత.. దాదాపుగా ) మంటపం లో విచిత్రమైన, మణి మయాలంకృతమైన సింహాసనం పై సీత తో కలిసి సహ సంస్థితుడైన సుచరిత్రుడూ,, పరమ పవిత్రుడూ, గురుగుహ మిత్రుడు ( అంటే తనకే అన్నమాట)నట శ్రీ రాముడు..
మణిరంగా వల్యాలంకృత నవరత్న మంటపే విచిత్ర మణిమయ సింహా సనే సీతయా సహ సంస్థిత..సుచరిత్ర , పరమ పవిత్ర.. గురుగుహ మిత్ర..
అంతే కాదు ఆ తరవాత వచ్చే సాహిత్యం ఇంకా బావుంటుంది. పంకజ మిత్ర వంశ సుధాంబుధి చంద్ర.. మేదినీ పాల రామచంద్ర ...అనే ఈ పద ప్రయోగం నాకెంతో ఇష్టం. పంకజ మిత్రుడైన సూర్యుని వంశమనే a సముద్రంలోంచి ఉద్భవించిన చంద్రుడట.. ఈ భూమి కే పాలకుడైన ఈ రామచంద్రుడు..
వింటుంటే ప్రతీ అక్షరమూ ఎంతో మధురం గానూ, చక్కగానూ వినిపించే రాగమూ, కీర్తన..ఈ రాగం అరుదైన రాగాలలో ఒకటి అని చెప్తారు. ఒక్కసారి వింటే చాలు, వెయ్యి సార్లు వినాలనిపించే రాగమూ.. కీర్తన..సినిమా పాటల్లో ఈ రాగం చాలా తక్కువగా వాడినట్టు అనిపిస్తుంది. లయ రాజు ఇళయరాజా
కన్ని వయసు అనే తమిళ చిత్రం లో 'సుభారాగమే' అనే ఒక పాత ఈ రాగం లో చేసారు. అలాగే సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో పూసింది పూసింది పున్నాగా కూడా ఇందులోనే కీరవాణి స్వరపరచారని సమాచారం. ఈ పాత విన్న ప్రతీ సారీ, దీనికీ 'మామవ ' కీర్తనకీ గల పోలికలు వెతుకుతూనే ఉంటాను. ఈ రాగం లో చేసిన ఇతర కీర్తనలు కానీ, సినిమా పాటలు కానీ ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియచేయండి.
శ్రీ మహారాజ పురం సంతానం ఆలపించిన ఈ కీర్తన ఇక్కడ..
శ్రీ. టి.ఎం కృష్ణ పాడిన 'మా మావ పట్టాభి రామ' ఇదిగో ఇక్కడ...
Beautiful! Thanks for sharing a nice song.
ReplyDeleteSharada
చాలా బావుందండి. చాలా చక్కగా రాశారు.
ReplyDeletetoo good Subhadra garu..
ReplyDeleteThank you Sarada garu, kottapaalee gaaru and kiran garu
ReplyDeletedescription is really super.....
ReplyDeleteawesome
description is super.
ReplyDeleteawesome...