Thursday, April 21, 2011

'ఆపరేషన్ ఆనింద్య'

    ఏడంతుస్తుల మేడ ఇది.. అని పాడు కోవచ్చు  మా అపార్ట్మెంటు చూస్తే. దాసరి గారి సినిమా పాటలోలా  వడ్డించిన విస్తరి మాత్రం కాదు లెండి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఏ కమ్యూనిటీలో ఉండే విషయాలు, ప్రత్యేకతలూ , కష్టాలూ    వాటికే ఉంటాయి. 'సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అని ఊరికే అన్నారా? ఇప్పుడు ఏం అంత కష్టం వచ్చింది , ఇంత నిట్టూరుస్తోంది ఈవిడ అనుకుంటున్నారా?  కష్టాలు అని కాదు కానీ కొన్ని విషయాలు బాగా తెలిసాయి సుమండీ. 
     మా ఫ్లాట్ ఏడో  అంతస్తులో ఉంది అయినా దోమలు వస్తాయి,  వచ్చే కాలంలో.. ఒక్కో అంతస్తు ఎత్తు కనీసం పది అడుగులు వేసుకున్నా నా చిటికెన వెలి గోరు కన్నా చిన్నవైన రెక్కలున్న ఈ మచ్చర రాజాలు అంత ఎత్తు ఎగిరి ఎలా వస్తాయబ్బా? అని మొదట్లో నేను చాలా ఆశ్చర్యపోయాను.. తరవాత మా పక్క వాళ్ళు చెప్పారు.. లిఫ్ట్ లో దూరి వచ్చేస్తాయి. కేవలం ఎగిరే రానక్కరలేదు అని,  అవి చాలా తెలివైనవి అని.. అవి తెలివైనవి అయినా కాకపోయినా వాటిని చాలా నిశితంగా గమనించి ఈ విషయం కనిపెట్టిన వాళ్ళు మాత్రం చాలా తెలివైనవారు అని ఒప్పుకోవాలి కదా. అయితేనేం.. పావురాలూ, కాకులే కాదు దోమలు కూడా ఏడో అంతస్తుకి వచ్చేస్తాయి అని తెలిసిపోయింది నాకు.. ఇది పెరిగిన నా జువాలజీ పరిజ్ఞానం అన్నమాట.
      'కింద అంతస్తులలో ఉంటే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది, పైకి వెళితే ప్రశాంతతే... ప్రశాంతత.  అరిచి గీ పెట్టినా మీకు శబ్దం వినిపించదు ' అని అందరూ అంటే నిజమే కాబోలు అనుకున్నాను.. కానీ కింద స్విమ్మింగ్ పూల్ లో పిల్లలు వేసే కేకలూ, రోడ్డు మీద నడిచే వాహనాల శబ్దాలు, మా కాంపౌండ్ లోనేకాక, బయట రోడ్ మీద నడుస్తున్న మనుషుల మాటలూ అన్ని సలక్షణంగా , అచ్చంగా మా ఇంట్లోనే జరుతున్నట్టు వినిపిస్తాయి. దీనిని బట్టి నా కర్ధం అయింది ఏమిటంటే 'ధ్వని' చాలా శక్తివంతమైనది, అది కూడా దోమలలాగానే ఎంత ఎత్తు కైనా  వెళ్తుంది అని.  ఇది నా ఫిజిక్స్ లెసన్ మరి..  ఇంకా బోటనీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఇలాంటివీ నేర్చుకున్నాను కానీ బొత్తిగా ఏదో చెప్తానని మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం బావుండదు కదా అందుకని పాయింటుకి వచ్చేస్తాను.
           సూర్యభగవానుడు పొద్దున్నే తన ప్రతాపాన్ని చూపడానికి శాంపిల్ గా  చిన్న సంతకం పెడుతున్నవేళ.. గాలి ఉన్నానా,  లేనా?  అని మెల్లిగా కదలలేక కదులుతున్న వేళ.. ఓ ఉదయాన్న, ఓ అంత మంచిది కాని ముహూర్తాన ( కరక్టే.. సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్నవేళ.. అనే శ్రీ వారికి ప్రేమలేఖ పాట  స్టైలే, మీకు తెలిసిపోయింది) నా వంటశాల ( మరీ నర్తనశాల లా ఉందా? అదే కిచెన్ అనేసుకుందాం, తేలిగ్గా ఉంటుంది) లో ఒక సొరుగు సగం తెరిచి ఉంది.. 'రాత్రి మర్చిపోయానేమో' అనుకుని మూసేద్దామని వెళితే కింద మెత్తగా తరిగినట్టున్న రంగురంగుల పొట్టు లాంటి పదార్ధం.. ఆ సొరుగులో నేను  తోమిన ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుంటాను.. బార్లా తెరిచి చూస్తే ఇంకేముంది? నా విదేశీ ప్లాస్టిక్ డబ్బాలు ( టప్పర్ వేర్) ఓ రెండింటిని చెరో మూల ఎవరో అతి చాక చక్యంగా గీరేసి , తినేసిన గుర్తులు.. ఆ కార్యక్రమానికి సాక్ష్యంగా వాటి కి ఉన్న చిన్న చిన్న చిల్లులు.. నా గుండె గుభేలంది. ఇంట్లో బొద్దింక ఉంటేనే నాకు చిరాకు అలాంటిది ఎలకా? అని తలచుకుంటేనే నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంక అక్కడనించీ నాకు వచ్చిన అనుమానాలు ఇన్నీ అన్నీ కావు.
   ఇంట్లో చేరిందా? లేక ఊరికే వస్తూ పోతూ ఉందా? ఒక వేళ  ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంది? వస్తూ పోతూ ఉంటె ఎక్కడనించి వస్తోంది? ఎప్పుడు వస్తోంది? ఎలా కనిపెట్టడం? కనిపెట్టినా ఎలా తరమడం? చంపడం మంచిది కాదు కదా? ఇలా రకరకాల చొ.ప్ర లు ( చొప్పదంటు ప్రశ్నలు  అన్నమాట)  నా మెదడులో  వెంట వెంటనే పుట్టుకొచ్చాయి.
     అంతలో కిచెన్ లోనే గిన్నెలు కడుగుతున్న మా నాగమ్మ 'ఇది ఇంకేమీ కాదు .. ఎలిక  పనే.. 'అని తేల్చేసింది.. అంతేకాక 'ఫ్రిజ్ లో కూర్చుంటుంది చల్లగా ఉంటుంది కదా' అని ఒక బాంబు  పేల్చింది.. " అయ్యా బాబోయ్! ఫ్రిజ్ లోనా.. యాక్.. ఇంకా నయం.. బట్టల బీరువాలో అన్నావు కాదు అని పైకి మేకపోతు గాభీర్యం ప్రదర్శిస్తూ గబా గబా నాగమ్మ చూడకుండా ఫ్రిజ్ ఆంతా చూసేసాను. 'ఫ్రిజ్ లో అది ఉండవచ్చు అన్న ఆలోచనకే నాకు  కడుపులో తిప్పినట్టయింది.. ఉండడానికి చాన్స్ లేకపోయినా సరే..  అయినా నాగమ్మ  చూసేసింది.. 
"ఇక్కడకాదు, వెనకాల ఉన్న గొట్టం లో.. అక్కడ వెచ్చగా ఉంటుంది కదా" అంది తాపీగా.'
"మరి ఇప్పుడు చల్లగా ఉంటుంది అని ఫ్రిజ్ లో అన్నావు "అన్నాను.. ' వెనక అంటే ,  ఇది ఫ్రిజ్ దే కాదా' అంది తను . 'ఓహో.అదా తల్లీ. రక్షించావు.. అని ఊపిరి తీసుకున్నాను.
ఒక క్షణం ఆడ షెర్లాక్ హోంస్ లా మొహం పెట్టి 
"ఒక పని చెయ్యండి.. ఒక టమాట తరిగి అక్కడక్కడా పెట్టండి, అలాగే ఉల్లిపాయా. అది ఇవే తినేది. ఒక వేళ తినేస్తే అది ఉంది అని తెలిసిపోతుంది, అప్పుడు మందు తెచ్చి వెయ్యండి "అని చెప్పింది. చాలా చిదంబర రహస్యాన్ని విప్పి నా చేతిలో పెట్టినట్టు.
"అర్రే నిజంగానా? అసలు ఎలకలు ఇంత  హెల్త్ కాన్షస్ అని కానీ, టమాటాలు తింటాయని కానీ నాకు అసలు తెలీదు ఇప్పటివరకు.. ఆక్షణాన మా నాగమ్మ నా కళ్ళకి చాల పెద్ద మేధావిలా, యానిమల్ న్యూట్రి షనిస్ట్  లా  కనిపించింది అంటే మీరు నమ్మాలి.  ఎలకల తిండి అలవాట్లు కూడా అంత  బాగా తెలుసుకోవడమంటే మరి మాటలా? 
  ఇలా ఎందుకన్నానంటే  మా చిన్నప్పుడు మా తాతగారింట్లో ఎలకలని పట్టుకోవడానికి ఎర పెట్టి ,  బోను అమర్చేవారు, ఎర కోసం మసాలావడ , బజ్జీ  లాంటి నూనె వస్తువు పెట్టేవారు. ఎలకకి ఒక వడ తేవడం కోసం వెళ్లి పది రూపాయల వడలు తినేసి వచ్చేవారు మా కజిన్స్. ఆ వడలూ, బజ్జీల కోసమే రోజూ ఇంట్లో ఎలకలు తిరగాలని మనస్పూర్తిగా కోరుకునేవారు కూడా. అలాంటిది ఇప్పుడు టమాటాలు తింటున్నాయా? సైజ్ జీరో వాటికీ కావాలేమో.. ఆ ప్రభావమే అయి ఉండవచ్చు. అనుకున్నాను.
ఏమైనా నా పని సులువైంది కదా అని సంతోషించి ఆ రోజు సాయంత్రం ఎప్పుడవుతుందా ?అని ఎదురు చూసాను.. 
     ఒక టొమేటో, ఒక ఉల్లిపాయ  చక్కగా గుండ్రంగా,  చక్రాల్లా తరిగి ( ఇది నాగమ్మ చెప్పలేదు కానీ నా కళా నైపుణ్యం  మరి) సిద్ధంగా పెట్టేసుకుని  మా ఇంట్లో ఐదారు చోట్ల పెట్టేసాను. ఆ రాత్రి మా ఇల్లంతా సలాడ్ బౌల్  లా కనిపించింది నాకు.  .రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా? ఎలక  టొమేటో తింటుందా? ఉల్లిపాయ తింటుందా ? రెండూ తింటుందా? అసలు తినదా? వస్తుందా,  రాదా? ఇలా. ఇండియా మేచ్ గెలుస్తుందా, లేదా ? అన్నంత టెన్షన్..మర్నాడు నిద్ర  లేవగానే నేను, మా అబ్బాయి  మొదట చూసినది ఎన్ని ముక్కలు  ఉన్నాయి? అని.. రెండు చోట్ల  టొమేటో  ముక్కలు మాయం.. 'పెద్ద రాజ పుత్ర రహస్యం తెలిసిపోయినట్టు సంతోషించాం'. 
'నేను చెప్పలేదూ !   టమాతానే   అది తినేది 'అని అని నాగమ్మ గర్వంగా తలెగరేసింది.. 
'నిజమే నీకు భలే తెలుసు 'అని మెచ్చుకుని.. 'తింటోంది సరే.. ఇప్పుడు దానిని బయటకు పంపేదేలా? అసలు ఇంట్లో ఉందా? లేక రాత్రి పూట వస్తోందా?' అని  అడిగాను అనుమానంగా..
'ఏమో మరి, మందు పెట్టి చూడండి లేదంటే బోను కొనుక్కుని  రండి , కింద ఫ్లోర్  లో నేను పని చేసే వారింట్లో ఉంది, కావాలంటే అడగండి, నేను చెప్పానని చెప్పకండి అంది కూడా.. ' అలా అని తేలిగ్గా నవ్వేసి చీపురు తీసుకుని వెళ్ళిపోయింది టొమేటో ముక్కలు తుడవడానికి.
'పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రం వచ్చి, వెనక్కి తెలియని అభిమన్యుడిలా తయారయింది నా పరిస్తితి. సరే. దిగాకా తప్పాడు కదా. ఎలాగైనా దీని అంతు చూడాల్సిందే.  ఈ పనికి ' ఆపరేషన్ అనింద్య'  అని పేరు పెట్టుకున్నాం.
     రాత్రి పూట వచ్చి వెళుతోంది అనుకుంటే  ఆ దారులన్నీ  మూసేస్తే?  అని మా అబ్బాయి సలహా ఇచ్చాడు . అన్ని తలుపులూ, కిటికీలూ వేసే ఉంటాయి, ఇంక అప్పుడు మొదలైంది మా రంద్రాన్వేషణ.. అలా వెతగ్గా వెతగ్గా కిచేన్లోనే చిమ్నీ పైపు బయటకు వెళ్ళే దగ్గర కొంత ఖాళీ ఉంది కదా,  అని మా పాదరసపు బుర్రలకి తట్టడమేమిటి? రెండు అట్ట ముక్కలు తెచ్చి  వాటికి అడ్డుపెట్టేయడమేమిటి? ఒక వేళ మా విజిటర్ చాలా బలవంతుడై, అట్టముక్కలని తోసేస్తే?    అని దానికి అడ్డంగా చిన్న పూల కుండీని  అందనంత ఎత్తులో పెట్టేయడమేమిటి అన్నీ క్షణాల్లో చేసేసాం. ఇంటిని ఇనప్పెట్టె చేసేసాం అని 'హై  ఫైవ్' లు ఇచ్చేసుకున్నాం.
       ఇప్పుడు మొదలయింది.. మా అసలు కధ. ఎలకల మందు కొనుక్కొచ్చాను నేను.. దాన్ని, దాని పక్కనే టొమేటో ముక్కలనీ పెట్టడం, అవి ఏవైనా  తింటున్నాయా? లేదా అని రోజూ చూడడం ఇదే మా దినచర్య అయింది ఆ తరవాతి నాలుగు రోజులూ..  అన్ని గదుల్లోవీ  తినడం లేదు, ఫలానా చోటవి మాత్రమే అని చెప్పుకోవడం, ఆ చుట్టుపక్కల ఏమైనా జాడలు కనపడతాయేమో  అని వెతకడం .. ఒకటే  హడావుడి . మందు ఎక్కడ పెట్టామో, ఆ వివరాలు   పేపర్ లో కూడా రాసుకునేదాన్ని మర్చిపోతానేమో అని.. ఈ ప్రహసనం పుణ్యామా అని మా మంచం కింద టొమేటో ముక్కలూ , టీ .వీ షెల్ఫ్ కింద ఎలక మందు బిళ్లల ముక్కలూ ఇలా నానా గందరగోళం.
      ఇక ఇది పని కాదని మా ఇంటి పక్కన ఉన్న మార్కెట్ కి వెళ్లి ఎలకల బోను కూడా కొన్నాం. అదేమిటో? ఇరవై ఒకటో శతాబ్దంలో ఎలకల బోను షేప్  కూడా మారిపోయింది.. ఒక పాత డబ్బా రేకుతో జానెడు ఉంది అది చూస్తే.. నా చిన్నప్పటి బోను తాలుకా పోలికలు ఎక్కడా లేవు.. కొత్త ట్రెండ్ ఏమో మరి. మిస్ మార్పెల్,  హిర్క్యూల్ పోయిరో లని రోజూ తలుచుకుని భూత అద్దం  లేని డిటెక్టివ్ లా  ఇంట్లో ప్రతీ  అంగుళం శోధించాను ఆ నాలుగు రోజులూ,,
ఆరో రోజున  జరిగింది అద్భుతం.. ఎక్కడ ముక్కలు అక్కడే.. నేను గుర్తు కోసం గీసుకున్న సున్నాలలోనే పదిలంగా ఉన్నాయి. ఎర్రగా, నోరూరేలా వేయించి బోను లో తగిలించిన ఫ్రెంచ్ ఫ్రై ముక్క కూడా అలాగే ఉంది.మండుటెండలో పన్నీరు చిలకరించినట్టు ఫీలయ్యి పోయాను.
నాగమ్మ మళ్ళీ రంగ ప్రవేశం చేసి.. 'ఇంక తినడం లేదు ఎక్కడో చచ్చిపోయింది 'అంది మళ్ళీ.. నీళ్ళు ఎక్కడా ఉంచద్దు అన్నారు కదా.. ఆ జాగ్రత్త పడ్డాం కదా, ఏమైపోయిన్దబ్బా  అనుకున్నాను.. తరవాత రెండు రోజులూ కూడా ఏమీ జరగలేదు.. తినడమూ లేదు.. ఇంట్లో ఉన్న జాడా లేదు .. మరి ఏమైనట్టు? అని మళ్ళీ అనుమానం..
 

'ఎక్కడికో బయటకు పోయి చచ్చి పోయి ఉంటుంది? 'అంది నాగమ్మ. 'నిజమే  !ఇంట్లో పొతే వాసన రాదా ?అనుకున్నాను, మళ్ళీ నా డిటెక్టివ్ టోపీ పెట్టుకుంటూ.
    అతి ముందు జాగ్రత్తగా మరొక రెండు రోజులు ఫ్రెంచ్ ఫ్రైసూ, టొమేటో ముక్కలూ ఇల్లంతా పెడుతూనే ఉన్నాం. అవి అంగుళం   కూడా కదలనందుకు ఆనందపడుతూ అమ్మయ్యా ! అనుకున్నాం..  ఇంక ఇంటిలోనూ లేదు, రావడమూ లేదు అని నిర్నయించేసుకున్నాం . అయితే దాదాపు వారం రోజులు నాకు మనశ్శాంతినీ,      నిద్రనీ దూరం చేసి, మా ఇల్లంతా సలాడ్ పందిరి చేసి, సందడి చేసిన ఆనింద్యుడు అలా గప్ చుప్ గా మాయమవడం మాత్రం ఒకింత నిరాశనే కలిగించింది మాకు. 'దొంగ దొరకని కారణాన", 'తగినంత రుజువు లేని కారణాన' 'ఆపరేషన్ ఆనింద్య'  ని సక్సెస్ ఫుల్లీ క్లోజేడ్ అని రాసేసుకున్నాం.   నిజంగానే 'ఆపరేషన్ సక్సెస్ ,, పేషంట్ డెడ్' అని నమ్మేసి  మరీ ....
           

11 comments:

  1. బావుంది మీ (ఆ)పరేషాన్ :))

    చివరి కార్టూన్ బాగా నవ్వించింది.

    ReplyDelete
  2. baga raasaaru..very funny

    ReplyDelete
  3. ROFL....very funny......

    కేక పొస్ట్ అండీ ...ఎంత సేపు నవ్వుకున్నానొ... ఆఖరి కార్టూన్ అయితే కేక.
    గుండ్రంగా చక్రాల్లా తరిగి పెట్టడం..., హెల్త్ కాన్షస్ సైజ్ జీరొ ఎలకలు..., తలచుకుంటేనే నవ్వాగట్లేదు... :D:D:D

    ReplyDelete
  4. సూపర్బ్ అండి మీ ఆపరేషన్ అనింద్య , నాకొక చిన్న అనుమానం మీ ఆనింద్యుడు ఏ హాలిడే ట్రిప్ కో , లేదా ఆఫీసు టూర్ కో వెళ్లి ఉండొచ్చేమో :D (ఈ
    లైన్ చూసి మీ మనసుకు శాంతి కరువైతే ఆ తప్పు నాది నా బుర్రలో దిక్కుమాలిన ఆలోచనదే అని గమనించ ప్రార్ధన:( )

    ReplyDelete
  5. @శరత్ కాలం గారూ..థాంక్ యూ. నిజంగానె ఆ పరెషాన్ అండి. ఎప్పుడూ ఎదురవ్వలేదు ఇలాంటి అనుభవం.
    @అజ్ఞాత గారూ.. థాంక్ యూ.
    @ మంచు గారూ.. థాంక్ యూ.. నిజంగానే టొమాటోలు తిన్నాయి..
    @ శ్రావ్య గారూ.. మీరు ఇలాంటి బాంబులు పెల్చకండి మరి.. నాకు అప్పుడే భయం మొదలైంది.. :)

    ReplyDelete
  6. చాలా బాగా రాశారు.
    అయితే ఏడోఫ్లోర్ అయినా పదోఫ్లోర్ అయినా ఈ కష్టాలు తప్పవు అంటారు
    అదే దోమలూ,శబ్దాలూ ఎట్సెట్రా

    ReplyDelete
  7. బాగుంది. మీ కేసు క్లోజ్ జేస్తిరిగాని, అనింద్యుడు వ్యూహాత్మకంగా నిరాహారదీచ్చ జేస్తుండా అని అనుమానంగా వుంది, అద్యచ్చా..

    ReplyDelete
  8. లత గారూ.. థాంక్ యూ.. దోమలూ, శబ్దాలు తప్పనే తప్పవు. ఇది నా స్వానుభవం.. ఇంకా పై అంతస్థులలో తక్కువ ఉంటుందేమో మరి తెలీదు.
    ఎస్ ఎన్ కె ఆర్ గారూ.. మరీ అలా అని భయపెట్టేయకండి మరి..

    ReplyDelete
  9. Ide Kadavanta Gummadi Kaya Kathi Petaku Lokuva Ante!!!! Elakalu kuda manalanu Bhaya pette ethuku edigi poyayi.....

    ReplyDelete
  10. గూగులమ్మని ఏదో అడిగితే ఇక్కడికి తీసుకొచ్చిందండీ... పొద్దున్నే హాయిగా నవ్వేసుకున్నాను :) చాలా బాగుంది మీ ఆపరేషన్ అనింద్య...

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...