Tuesday, May 29, 2012

మరిచిపోయిన పక్కింటివారి ముఖచిత్రమా?





2012 మరియు ఆ పైన...
'నేను ఈ రోజు 'దూకుడు' సినిమా చూస్తున్నాను...' ( చూడు.. ఐతే దానికి అనౌన్స్ మెంట్ ఎందుకు? ..)
'నాకు ఈ మధ్యన ఎంతో బోర్ గా ఉంటోంది.... ఎందుకో తెలీదు,, ఈ రోజు మరీనూ...'  ( అలాగా పాపం)
'హుర్రే!..నాకు ఆన్ సైట్ అసైన్మెంట్ వచ్చింది.. వచ్చేవారమే ప్రయాణం.'.( భలే.. నిజమా?)
'నిన్నటినించీ ఒకటే తుమ్ములూ, దగ్గూ...' ( అయితే..?)
'ఇది మా పిల్లాడు మొదటిసారి స్నో లో ఆడిన ఫోటో..' ( నిజమే??)
'ఇది  నేను, మా కుక్క'( భలే..)
'మనవూరి కేమయింది? వర్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించదేం?' ( కాకెత్తుకుపోయింది.. ఇప్పుడే తీసుకొస్తా, కొంచం ఆగు)
'సూపర్ చెఫ్ కిరణ్ ఎట్ వర్క్.. ఘుమ ఘుమ లాడే చోలే.. '
ఇలాంటివే ఎన్నో...
 అమ్మయ్యా, ఇప్పటికి తెలిసిపోయింది కదా.. ఇవన్నీ ఏమిటో..

రోజూ ముఖం కడుక్కున్నంత సహజంగా, క్రమం తప్పకుండా,   ప్రతీవారూ అరగంట నించి, నాలుగైదు గంటల దాకా గడిపే ముఖ పుస్తకం లో తరచుగా మనకి కనపడే విషయాలే.. ఒక్కోసారి విసుగేత్తించేవి కూడా.

'మరీ ఇలా అన్నీ రాయాలా?'  అని నేనే ఎన్నోసార్లు అనుక్కున్నాను. ఇదే కాదు..
 ' నిన్న కొత్త ఫోటోలు పెట్టాను చూసావా? '  అని అడిగి 'చూశాను' అంటే..
'ఓ చూసావా? మరి కామెంట్ రాయలేదెం? 'అని అడిగేసి మరీ రాయిన్చేసుకోడం..
ఇవన్నీ కొత్త రకం పోకడలు. ఒక్కొసారి చాలా విపరీతంగానూ, వెర్రి చేష్టల్లానూ అనిపిస్తాయి కూడా..

ఇప్పుడు కొద్దిగా కత్తెర కి పని చెప్పేసి. "కట్ చేస్తే' అని . అదే చేత్తో గుండ్రాలు తిప్పేయండి.. నేను మీ ఎదురుగా నించున్నాను

ఇప్పుడు అప్పుడెప్పుడోలా కనిపిస్తున్నకాలం....
" పక్కింటి అమ్మమ్మగారిని ఒక సారి రమ్మనండర్రా!! ఇవ్వాళ మనింట్లో సత్యనారాయణ వ్రతం.. ఆవిడ చేత్తో ప్రసాదం చేస్తే చాలా మంచిది.. "
అని ఒక ఇంటి వారు పిలవడమే ఆలస్యం.. ఆ పక్కింటి అమ్మమ్మగారు తన ఇంట్లో ఎన్ని పనులున్నా సరే.. పక్కన పెట్టేసో,, తొందరగా కానిచ్చేసో వచ్చి కేవలం ప్రసాదం చెయ్యడమే కాదు.. వ్రతమూ,భోజనాలూ అన్ని అయ్యేవరకు దగ్గరేఉండి చూసుకుంటారు. తను తిన్నదీ, లేనిదీ కూడా ఆవిడకి పట్టదు.
ఎనభైలు..
"మీ ఇంట్లో స్టాంపులున్నాయా??  ఒక రెవెన్యూ స్టాంపూ, అదే చేత్తో ఓ రెండు నిమ్మకాయలుంటే ఇవ్వండి రేపిస్తాను.."
 ఇది మొన్న మా ఆడపడుచు గారింట్లో పెళ్ళికి పెట్టిన  చీర అని గోడమీదనించి చెప్పుకునే కబుర్లలో చూపించడం, నిన్న కొబ్బరిలడ్డూ చేసాను, రుచి చూడండి అని ఇచ్చి పుచ్చుకోవడం.. ఆడవారి మధ్య జరిగితే
మగవాళ్ళ మధ్య చేబదుళ్ళూ, ఇవ్వడాలూ, తీర్చడాలూ
"రేపు సినిమాకి వెళదామా వదినా? అని పక్కింటావిడని అడిగి అఫీసులకీ, స్కూళ్ళకీ వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళిపోయాకా, సి అంటూ ముఖాలు కడిగేసుకుని, నీ అనగానే చీరలు మార్చేసుకుని, మా అనగానే ఇళ్ళు తాలాలేసుకుని 'మహా మహిళా చిత్రాలైన మోర్నింగ్ షోలకి వెళ్ళే ముచ్చట్లూ
మా బావగారికి వంట్లో బాగోలేదుట.. అర్జెంట్ గా వెళుతున్నాము.. పిల్లలని చూసుకుంటారు కదా అని పక్కవాళ్ళకి అప్పచెప్పేసి  ధైర్యంగా వెళ్ళే పొరుగువారూ.
ఒరే, నీ జామెట్రీ బాక్స్ ఇస్తావా, రేపు నాది కొనగానే ఇచ్చేస్తాను.. అని తెచ్చుకుని జాగ్రత్తగా వెనక్కి ఇచ్చేసే మగపిల్లలూ
అక్కా, మా కాలేజీలో ఫంక్షన్ కి నీ చీర ఇస్తావా అని పక్కింటి కాలేజీ అక్కని అడిగే పదోక్లాస్ పిల్లలూ.. కొత్తగా టీ. వీ కొన్నవారింట్లో చిత్రహార్ చూడడానికి వచ్చే ఇరుగింటివారూ
తొంభైలు..
కొత్తకొత్తగా వస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లూ, మూసుకోవడం మొదలైన తలుపులూ...
http://saikumarkoya.files.wordpress.com/2010/01/18149car01_070509.jpg 'పొద్దున్నే వాకింగ్ కి వెళదామా, మీ తలుపు కొడతాను.. అని ముందు రోజు అడగడాలూ..
బెల్లు కొట్టి పాయసం గిన్నె ఇవ్వడాలూ..
చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు చిట్టెలు వేసుకుని కిట్టీ పార్టీల పేరిట కలుసుకునే సందర్భాలు ఏర్పాటు చేసుకోవడాలూ..
పెళ్ళిల్లకీ పేరంటాలకీ ఫోన్లు చేసి పిలుచుకోవడాలూ...
రెండువేలు..
  పెరిగిన దూరాలూ.. తగ్గిన మాటాలూ.. చదువుకో, ఉద్యోగానికో దూరప్రయాణాలూ.. మనసులో ఉన్నా మనుషులని కలిసేందుకు లేని అవకాశాలూ... అవకాశం ఉన్నా కలిసి రాని సందర్భాలూ.. 
తీరిక లేని పనివేళలూ.. తీరిక ఉన్నా కోరిక లేకపోవడాలూ...
 వారం మొదలు, వారాంతమూ తప్ప మరేమీ గుర్తుకు రానంతగా వేగంగా కదిలే రోజులూ...
ఏళ్ళతరబడి జీళ్ళ పాకాలలాంటి కధలతో కాలక్షేపాన్ని పంచే టీ.. వీ  సీరియళ్ళూ..
"అక్క, రేపు మీరింట్లో ఉంటారా? నేను అటువైపు వచ్చే పని ఉంది. వీలైతే వస్తాను.. ఫోన్ చేస్తానులే వచ్చేముందూ సొంత అక్కకే ఇలా చెప్పటాలు..
ఆపాదమస్తాన్ని రకరకాల వైర్లతో కట్టిపడేస్తున్న ఎలక్ట్రిక్ సాధనాలూ...

ఇది చదివాకా మళ్ళీ నేను పైన రాసిన 'ముఖ పుస్తకం' వాక్యాలు చూస్తే ఇలా అనిపిస్తుందెమో...
'నేను ఈ రోజు 'దూకుడు' సినిమా చూస్తున్నాను...' ( చూడు.. ఐతే దానికి అనౌన్స్ మెంట్ ఎందుకు? అని మనం అనకూడదు.. అడక్కూడదు..)
  పాతకాలంలో ఊరంతా చెప్పేవారుట సినిమాకి వెడుతున్న సంగతి.. కొత్తగా పెళ్ళైన సుమకి తనూ తన భర్తా సినిమాకి వెళుతున్న సంగతి ఎవరితోనైనా చెప్పాలి అని ఉంది.. అదేం పెద్ద విషయమని కాదు.. కానీ చలీ, మంచు దట్టంగా ముసిరిపోయి మనిషి కోసం మొహం వాచిపోయిన ఆ చలిదేశంలో ఎవరికి చెప్పాలో తెలియలేదు.. అందుకే ఫేస్ బుక్ లో  రాసుకుంది.. ఈ విషయం తెలిస్తే.. నేను బ్రాకెట్ లో ముందు రాసినదానికి బదులు ఇలా రాస్తానేమో.. ( ఓ.. అవునా.. వెరీ గుడ్.. చూసి ఎంజాయ్ చెయ్యండి.)

'నాకు ఈ మధ్యన ఎంతో బోర్ గా ఉంటోంది.... ఎందుకో తెలీదు,, ఈ రోజు మరీనూ...'  ( అలాగా పాపం)
 గత నాలుగు సంవత్సరాలుగా పీ.హెచ్ డీ కోసం కష్టపడుతున్న రవికి.. చాలా నిరాశగా ఉంటోంది ఈ మధ్యన.. లాబ్ లో ఎవరికీ చెప్పే పరిస్థితి లేదు.. తొందరగా డిగ్రీ చేతికి వస్తే ఉద్యోగాన్వేషణలో పడవచ్చు, మనదేశమైనా సరే,, విదేశమైనా సరే.. అప్పుడు ఇలా రసుకున్నాడు. ( పరవాలేదు.. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి అని కొత్త కామెంటు)

'హుర్రే!..నాకు ఆన్ సైట్ అసైన్మెంట్ వచ్చింది.. వచ్చేవారమే ప్రయాణం.'.( భలే.. నిజమా?) పవన్ కి ఆన్శైట్ వెళ్ళాలన్నది చిరకాలపు కల.. ఎక్కడో పల్లెట్టొరిలో పుట్టి పెరిగి చదివి, ఎదిగిన పవన్ కి ఇది చాలా పెద్ద విజయం..
(అభినందనలు)

'ఇది మా పిల్లాడు మొదటిసారి స్నో లో ఆడిన ఫోటో..' ( నిజమే??)- తనూ, భర్త రాం తప్ప ఎవరూ లేరు ఇక్కడ.. తన పిల్లాడి ఆట పాటలు చూడడానికి.. ఇదే దిగులు స్వప్న కి.. తన ఫ్రెండ్సూ, కజిన్సూ,, చూడాలని కోరిక.. (బాబు భలే ముద్దుగా ఉన్నాడు)


'మనవూరి కేమయింది? వర్షం ఎక్కడికి వెళ్ళిపోయింది? కనిపించదేం?' ( కాకెత్తుకుపోయింది.. ఇప్పుడే తీసుకొస్తా, కొంచం ఆగు) - ఒక్కొసారి పెద్ద కారణమేదీ లేకుండానే, ఏమీ తోచకపోతే రాసుకునే మాటలివి.. ఎవరో ఒకరు చదివి స్పందిస్తారు కదా అని..

'సూపర్ చెఫ్ కిరణ్ ఎట్ వర్క్.. ఘుమ ఘుమ లాడే చోలే.. '- అమ్మ కమ్మగా వండి పెడితే వంకలు పెట్టుకుంటూ తినడమే తప్ప, వంట అంటే ఎలా ఉంటుందో మొదటి సారి వంట పట్టించుకున్న అమెరికా చదువుల కుర్రాడు తను చేసిన వంట అందరికీ చూపించే ప్రయత్నం.. లేకపోతే ఎలా తెలుస్తుంది అందరికీ?
'ఈ సారి కామెంట్ రాస్తే.. భలే వండావు కిరణ్.. చూస్తేనే నోరూరుతోంది లాంటిదేదో రాస్తాను..

ఇక్కడ వారు రాసిన వాఖ్యల వెనక విషయం మనకి తెలియడం కాదు ముఖ్యం..తెలిస్తే మారేది మన పర్సెప్షన్ మాత్రమే.. ప్రతీవారికి ఏదో ఒక కారణం ఉండవచ్చు. అది అతి అయితే చిరాకు కలిగే మాటా వాస్తవమే.

 మనకి కలిసి జీవించడం ఇష్టం. కలిగినది..  అది మాటైనా సరే, మమతైనా సరే అందరితో పంచుకోవడం వల్ల కలిగే ఆనందం అంటే ప్రియం..
ఉమ్మడి కుటుంబాలే కాదు.. అమ్మమ్మలూ, బామ్మలూ ఉండే చిన్న కుటుంబాలు కూడా కనబడని ఈ రోజుల్లో.. ఖండాంతరాలూ, దేశాంతరాలూ మనుషుల మధ్యన దూరాన్ని ఏర్పరిచినా, మనసులో మనమంతా కొరుకునే దగ్గరతనన్ని పొందాలనే ప్రయత్నమే.. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు విపరీతంగా ప్రజాదరణ పొందడానికి కారణమేమో.
ఒంటరి తనాన్ని దూరంగా ఉంచేదుకు కావచ్చు. నాతోనూ నలుగురున్నారన్న భావన ఇచ్చే బలం కావచ్చు.. సహజంగానే అందరితోనూ పంచుకునే మనస్తత్వం కావచ్చు. కారణాలెన్నో.

 ఇది మనం వాడుకునే పద్దతి కొంత విపరీతంగా ఉండవచ్చు... వింత వింత పోకడలూ,, కాస్తంత వెర్రితలలూ వేసినట్టుగా అనిపించవచ్చు.. వీటిల్లో అంతర్లీనంగా ఉన్న కష్టాలూ అందరికీ తెలిసినవే కావచ్చు.. కానీ ఇవేవీ ఈ ఉధృతాన్నిఆపలేకపోవడానికి కారణం మాత్రం.. అరిస్టాటిల్ చెప్పినట్టు.. మనిషి సంఘజీవి అన్న మౌలిక సూత్రమే..
కలిసి ఉంటే కలదు సుఖము అన్నది మర్చిపోయినా.. కలిసి ఉంటే కలదు సరదా.. అన్న సూత్రం కావచ్చు. అందుకే అనిపిస్తుంది నాకు.. ఇవన్నీ మనం క్రమక్రమంగా మర్చిపోతున్న పక్కింటివారి ముఖచిత్రాలేనేమో. కేవలం ముఖపుస్తకం మాత్రం కాదు.. అని..

Wednesday, January 11, 2012

ఉన్నతమైన ఆలోచన.. ఆచరణ. సమాజోన్నతే ధ్యేయం..
      నూతన సంవత్సరం మీ అందరికీ శుభ ప్రదంగానూ, సంతోష దాయకంగానూ ప్రారంభమైంది అని ఆశిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి  శుభాకాంక్షలు. గడచినా ఏ సంవత్సరమైనా ఒకేలా ఉండదు.. కానీ వచ్చే ప్రతీ కొత్త సంవత్సరమూ కొత్త ఆశలకీ, ఆనందాలకీ, అనుభూతులకి ప్రతీకగానే దాదాపు ఒకేలా  మొదలవుతుంది. కొత్తకున్న మహత్యం అది.. ఆశకున్నబలం అది.. 
     వెళ్ళిపోయిన సంవత్సరం లో రోజూ చేసే పనులు తప్ప కొత్తగా ఏమి చేసాము? అనుకుంటే నాకేమీ కనబడదు. పొద్దున్న నిద్ర లేస్తే, మనకంటే ముందు పరిగెత్తే కాలమూ, దానితో పాటు గడియారమూ, వరసా, వావీ, విసుగూ, విరామమూ లేకుండా ఒకదానితర్వాత ఒకటిగా వచ్చిపడే పనులూ, ఉరుకులూ, పరుగులూ..నిట్టూర్పులూ, కోపాలూ, విసుగులూ,చిరాకులూ .. మధ్యమధ్యలో విహారాలూ, విందులూ.. నవ్వులూ, చుట్టాలూ, అచ్చమైన ఉగాది పచ్చడిలాంటి అనుభవమే.. జీవితమంటేనే షడ్రుచుల సమ్మేళనం  కదా మరి!! మనకంటూ మనం ఎంత చేసుకున్న మన పనుల వల్ల మరెవరికైనా  చిన్న మేలు జరిగినా సరే ఆ తృప్తి ఎంతో వేరు అని నాకనిపిస్తుంది. అలాంటి వారిగురించి చెప్పాలనే ఈ టపా. 
రమేష్ స్వామి
              
ఆర్ధిక రేఖ కి దిగువన ఉన్న పద్దేనిమిది    ఏళ్ళు   నిండిన  పిల్లలని తీసుకొచ్చిఒక చోట  చేర్చి వాళ్ళ కి ఆసక్తి ఉన్న వృత్తి విద్యలలో 75 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ను ఇవ్వడమే కాకుండా, వారికి ఉద్యోగాలిప్పించి వారి కాళ్ళ మీద వారు నిలబడేలా వాళ్ళందరికీ  సహాయం చేసే ఒక గొప్ప సంస్థ 'ఉన్నతి'. పేరెంత గొప్పదో, ఆదర్శం కూడా అంత గొప్పది.. ఆచరణ కూడా అంతే.. "చిన్న పిల్లలకి, వయసు మళ్ళిన వారికీ తగినంత సేవ చెయ్యడానికి చాలా సంస్థలు ఉన్నాయి, సరి అయిన సమయంలో చదువుకోక, చదువుకునే వీలు లేక, తగిన ఆధారం లేక తిరుగుతున్న   ఈ యువతీ యువకులకి చేయూత నిస్తే, వాళ్ళతో పాటు వారి కుటుంబం కూడా బాగుపడుతుంది కదా" అన్న ఒక ఆలోచన ఈ సంస్థ పుట్టుకకి కారణం అంటారు సంస్థ ఫౌండర్ మెంబర్  శ్రీ రమేష్ స్వామి.సరి అయిన దారి దొరకకపోతే దారి తప్పే వయసు అది.. అందుకే వారికి ఈ సహాయం ఎంతో అవసరం అంటారు ఆయన. 
           బెంగుళూరు లోని అల్సూర్ లో ప్రారంభమైన ఎస్. జీ. బి. ఎస్ ట్రస్ట్ కి అనుబంధ సంస్థగా 'ఉన్నతి'ని బెంగుళూర్ లోని సదానంద నగర్ లో ప్రారంభించారు. ఎస్. జీ బి ఎస్ ట్రస్ట్ చాల రకాలైన కార్యక్రమాలని నిర్వహిస్తుంది. అందులో చాలా ప్రముఖమైనది ప్రతీసంవత్సరమూ గోకులాష్టమి కి జరిగే 'ఉత్సవ్' అనే కర్నాటక సంగీత కార్యక్రమం.గతంలో  అల్సూర్ లో జరిగినా, 'ఉన్నతి' ప్రారంభమైన నాటినించీ ఈ కార్యక్రమం 'ఉన్నతి'ఆవరణలోనే జరుగుతోంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద విద్వాంసులందరూ పాడతారు.. చాలా చాలా బావుంటుంది..ఉచిత ప్రవేశం..చాలా తక్కువ ధరకి భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా దొరుకుతాయి.  ఈ ఏ.సి హాల్ ని కుర్చీలతో కలిపి మరీ చాలా తక్కువ ధరకి అద్దెకి ఇస్తారు ప్రైవేట్ ఫంక్షన్స్ కి.. 
        ప్రతీ బేచ్ లోనూ దాదాపు 100  మందికి  పైన తీసుకుంటారు. తొమ్మిది వొకేషనల్ కోర్స్ లలో నూ, ఇంగ్లీష్ మాట్లాడడం లోనూ ట్రైనింగ్ ఇస్తారు. అందరికీ టిఫిన్లూ, భోజనమూ, లోకల్ వారైతే బస్ పాస్, లేకపోతె హాస్టల్ వసతీ ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారు. Retail sales, field sales, guest care (hotels), guest care (offices), industrial tailoring, Industrial painting, data entry (for BPO), security సర్వీసెస్
 and car driving ల లో ఈ క్లాసులు  నిర్వహిస్తారు. ఇవి కాక ఇంగ్లీష్ మాట్లాడటమూ, లైఫ్ స్కిల్ల్స్ వగైరాలు కూడా నేర్పిస్తారు. ఇప్పటి వరకూ ఎందరినో తీసుకొచ్చి ఇలా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడమే కాక వాళ్ళని చక్కటి మార్గంలో తీర్చి దిద్దారు.
              ఏ మంచి పని చేద్దామన్నా ఎన్ని అడ్డంకులో..చేయ్యదానికంటే చేయ్యకపోవడానికే ఎక్కువ కారణాలు కనబడతాయి.  "ఊరికే, పైసా ఖర్చు లేకుండా మీకిష్టమైనది నేర్చుకుని ఉద్యోగంలో చేరండి' అంటే కూడా దాన్నోపెద్ద  కష్టంగా భావిస్తారు పిల్లలు. ఇక్కడ క్రమ శిక్షణ తో    ఉండాలి అంటారు, వీలు దొరికితే మానేద్దామని మొదట్లో చూస్తారు. టైముకి రావడం కష్టం అంటారు.  'ఒక్క పైసా తీసుకోవడం లేదంటే ఇందులో ఏదో ఉంది" అన్న ఆలోచన కొందరిది.. 
  కానీ ఒక్కసారి ఈ ప్రోగ్రాం విలువ తెలిసాకా ఇంక వెనకడుగు వేసే ప్రశ్నే లేదు, ఉన్నతిని ఒక గుడిగా భావించి ఎంతో శ్రద్దగా నేర్చుకుంటారు. ఉన్నతి యొక్క ఉన్నతమైన విలువలనీ, అక్కడి టీచర్ల, ఉద్యోగులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. ఇంత పని క్రమం తప్పకుండా చెయ్యడం చాలా కష్టం.. కానీ వారెవ్వారూ కూడా అలా అనుకోరు. .ఎంతో ఇష్టంగా చేస్తారు. ఇంటర్వ్యూలూ, కోచింగ్, ప్లేస్మెంట్, వాలెడిక్తరీ అన్నీ ఎంతో పద్దతిగానూ,  సంతోషంగానూ చేస్తారు .
 ప్లేస్మెంట్ సమయానికి చాలా కంపెనీల వారు వస్తారు. సాఫ్ట్వేర్ కంపీనీలూ, బి.ఫై.వో లు, హోటల్స్, కాఫీ డే, బరిస్టా వంటి వారూ ఇలా.. ఇవన్నీ బయట ఏదైనా కమర్షియల్ ఇన్స్టిట్యూట్ లో జరగాలంటే ఎంత ఫీజ్ వసూల్ చేస్తారో అందరికీ తెలుసు.. ఇక్కడ విద్యార్దినించి డబ్బు తీసుకోవడమనేదే ఉండదు..  ప్రతీ విద్యార్ధికీ ట్రైనింగ్ కీ, వసతికీ, భోజనానికీ అన్నింటికీ కలిపి ఇంచుమించుగా  12000   రూపాయలు ఖర్చు అవుతుంది. 'ఉన్నతి' లాంటి ఆశయంతో ఎవరైనా తమ ఊరిలో ఇలాంటి సంస్థ ప్రారంభిచాలని అనుకుంటే దానికి తగ్గ ట్రైనింగ్, గైడెన్స్ కూడా ఇస్తారు. 2020  సంవత్సరం నాటికి దేశం మొత్తమ్మీద 200  ఉన్నతులు ఏర్పడాలని ఎందఱో యువతీ యువకులకి ఈ సహాయం అందాలని వారి కోరిక. ప్రస్తుతానికి ఒక డజను వరకూ ఏర్పడ్డాయి.
కొందరు అలవాటుగా ఇచ్చే దాతలున్నా ఈ బృహత్కార్యక్రమానికి ఎంతో సహాయం అవసరం అవుతుంది. డబ్బు సహాయం మాట అటుంచితే, ఇంకా ఎన్నో రకాల సహాయం అవసరం అవుతుంది.
1 . విద్యార్ధులని తీసుకు రావడం ( మనకి తెలిసిన పిల్లలు, డ్రైవర్ల, లేదా పనిమనిషుల పిల్లలు ఇలా ఎవరినైనా రికమెండ్ చెయ్యవచ్చు). 
2 . టీచింగ్, వాలంటరీ సర్వీస్: మనకిష్టమైన సబ్జెక్ట్ చెప్పవచ్చు. ముందు టీచర్లకి కూడా శిక్షణ ఇస్తారు..వాలంటరీగా మనకి ఇష్టమైన పని కూడా చెయ్యవచ్చు
3 . ధన సహాయం: మనకి వీలైనంత సహాయం చెయ్యవచ్చు. ఇది 100 % టాక్స్ మినహాయింపు. ఒక విద్యార్ధికి 12000  అవుతుంది. .అంతే ఇవ్వాలని లేదు.. ఎంత కావాలన్నా ఇవ్వచ్చ్చు..ఒక రోజు భోజనం ఖర్చు 3000 .
4 . హాల్ రెంట్: మన ఇంటి ఫంక్షన్స్ కి హాల్ రెంట్ కి తీసుకోవచ్చు.. దానికి కూడా ఇంచుమించు 12000  మాత్రమె తీసుకుంటారని గుర్తు.. 
అన్నింటికంటే ముఖ్యమైనది. గోకులాష్టమి సంగీత ఉత్సవాలలో భాగం పంచుకోవచ్చు. మేము గత మూడు సంవత్సరాలుగా వెళుతున్నాము. ఎందఱో ప్రముఖులని చూసే అవకాశం కలగడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తాము. 
గత సంవత్సరంగా ప్రతీ మూడు నెలలకి ఒకసారి  ఉన్నతికి నేను ఒక న్యూస్ లెటర్ చేస్తున్నాను. బండాత్మకూరు కళ్యాణ్ అనే ఒక అబ్బాయి నాకు H.T.M.L programming లో సహాయం చేస్తాడు. ప్రతీ సారీ ఉన్నతికి సంబంధించిన ఏదో ఒక విషయంతో పాటు, ఉన్నతి లో భాగం పంచుకుంటున్న ఒక టీచర్ని, ఒక ఉద్యోగిని, స్టూడెంట్స్ చెప్పిన అభిప్రాయాలు వగైరాలతో తయారు చేస్తాము.. ఇది ఉన్నతి గ్రూప్ లోనే దాదాపు ఐదారువేల మందికి చేరుతుంది..    ఈ మహా యజ్ఞం లో ఇది నా ఉడతా భక్తీ అనుకుంటాను. గత సంవత్సరం నేను చేసిన మంచి పని ఇది అని సంతోషం గా చెప్పుకోగలను.  మా అబ్బాయి పేరు మీద ఒక విద్యార్ధికి సరిపడే  డబ్బు కట్టాలి అనుకున్నాము, శనివారం వెళ్ళాలి.
  ఉన్నతి వెబ్ సైట్ వివరాలు కింద ఇస్తున్నాను. నేను చేసిన న్యూస్ లెటర్ లింక్ ఇవ్వడానికి కుదరడం లేదు.. మిత్రులెవరికైనా అవకాశమూ, టైమూ ఉంటె మీకు వీలైన సహాయం  తప్పకుండా చెయ్యండి..  మీకెవరికైనా ఉన్నతి మెయిల్ గ్రూప్ లో చేరాలని ఉంటె నాకు మెసేజ్ పంపించండి,లేదా ఈ పోస్ట్ కి కామెంట్ చెయ్యండి.  దానివల్ల వాళ్ళ కార్య క్రమాలు మొదలైన వివరాలు మీకు తెలుస్తాయి. ముఖ్యంగా సంగీత కార్యక్రమాలని మిస్ కాకండి. 
1. http://www.unnatiblr.org/






          

Thursday, December 29, 2011

అమ్మా నాగమ్మా!!!

'అమ్మా నాగమ్మ '.ఈ పేరుతొ అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చింది .. అది విడుదలై పదేళ్లో, ఇరవై ఏళ్ళో    అయింది.. కనక  నేను ఒక సింహా వలోకనం లాంటిదేదో రాసేస్తున్నాను,  అని అనుకుంటున్నారా కొంపదీసి!.. కాదు.. కానే కాదు..అలాంటి వ్యాసాలంటే బోలెడు ఇష్టమూ, రాయాలన్న కోరికా ఉన్నాయి,  కానీ ప్రస్తుతం  అంత సీనూ లేదు.. అంత టైమూ లేదు..
గొప్ప పెద్ద పాత్ర!!

ఎందుకంటే ఇప్పుడు నేను గత వారం రోజులుగా 'కలలోనైనా మెలకువనైనా తలచేద   నిన్నే' అని కలవరిస్తున్నది ఒకే పేరు.. ఒకే మనిషి.. ' ఆవిడే శ్యామల!!!' కాదు కాదు.. ' ఆవిడే నాగమ్మ'.. అమ్మయ్యా! చెప్పేశానా! ఇప్పటికే మీ కర్ధం అయిపోయి ఉంటుంది.. నాగమ్మ అంటే ఎవరో ?ఆవిడ పాత్ర నా ఈ చిన్ని, బుజ్జి జీవితం లో ఎంత గొప్పదో..
ఈ రోజు మీకు ఇంత సులువుగా చెప్పెస్తున్నాను  కానీ ఆ రోజు..  నాకే అర్ధం కాలేదు..
పోయిన శనివారం పొద్దున్నే కుడి కన్ను అధిరితే..వేడి చేసిందేమో అనుకున్నాను.కానీ అసలు విషయం గ్రహించలేదు.
 ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.. నేను ఎం. ఎస్. సి లో ఉండగా మా ఫ్రెండ్ అనుపమ  'ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది     కాదు,  అశుభం,  గోంగూర.. అంటారు.. నన్నడిగితే ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే,  పెళ్ళయిన వాళ్ళైతే భర్తకీ, కాని వారైతే కాబోయే వాడికీ మంచి జరుగుతుంది అని అర్ధం చేసుకోవాలి.. అనేది..
మాయాబాజార్ లో  శాస్త్రీ, శర్మ లు చెప్పినట్టు "శాస్త్రం ఏది చెప్పినా కర్కశం   గానూ, నిష్కర్శ గా నూ చెప్తుంది.. మనమే దానిని సున్నితంగా అర్ధం చేసుకోవాలి అని తెలుసుకున్నాం.
అంతే  కాదు తను  కుడి కన్ను అదిరినప్పుదల్లా, 'ఎక్కడున్నాడో తెలియదు గానీ, మా కాబోయే ఆయనకీ మంచి జరుగుతుంది ఈ రోజు' అని ' అదిరేటి కన్ను నాదైతే, వచ్చేది మంచి నీకైతే.. ఏలా  దడా ? అని పాడేసుకుని పరవశించి  పోయేది ..
ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకుని నేను ఆ శనివారం నాడు పొద్దున్నే కుడి కన్ను  అడిరితే మా అనుపమ లాగే అనుకున్నాను కాని.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ( కొంచం మెలోడ్రామా ఎక్కువ అయిందా? సారీ, ఆ సందర్భమే అలాంటిది మరి)
ఆ రోజు.. నాకూ మా నాగమ్మ కి మధ్యన జరిగిన సంభాషణ.
ఇక్కడ నాగమ్మ గురించి రెండు ముక్కలు చెప్పాలి.. చాలా స్వతంత్రభావాలు కలిగిన మనిషి. భర్త చేసిన పనులు నచ్చక తను పిల్లలతో విడిగా ఉంటుంది.. అత్తవారి సపోర్ట్ తనకే.. అంతే కాదు.. ఒక అక్క చనిపోతే ఆవిడ పిలల్లనిద్దరిని హాస్టల్ లో పెట్టి చదివిస్తుంది.. ఆడపడుచు పెళ్ళికీ, అన్నయ్య లు పొతే వాళ్ళ కుటుంబాలకీ తనకి వీలైనంత అండగా ఉంటుంది. పెద్ద పిల్లాడు డ్రైవర్ గా పని చేస్తాడు, చిన్నవాడు చదువుకుంటున్నాడు.. పాపం ఆ అబ్బాయికి తరచూ ఫిట్స్   వస్తాయి.. అదొక టెన్షన్.. స్కూల్ నించి ఫోన్ వస్తుంది.. ఆదరా బాదరా గా పరిగెడుతుంది.. వాడి ట్రీట్ మెంట్ కోసం నిం హాన్స్ చుట్టూ చక్కర్లూ..ఆ బాధలూ, బాధ్యతలూ తనని తరచూ చికాకు పెడుతూనే ఉంటాయి.. అందుకే అందరూ' తిక్క ఎక్కువ ,నాగమ్మ  మూడీ.. ఏమీ మాట్లాడదు రోబోలా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతుంది.. అంటారు.. నాకు  చికాకు.. మీరెలా భరిస్తున్నారు అని కూడా అడుగుతూ  ఉంటారు.నాకు మాత్రం ఒక్కోసారి తనని చూస్తె జాలి గానూ, తన ఇండివిడ్యువాలిటీ చూస్తే ఆనందంగానూ, గౌరవంగానూ  ఉంటుంది.. వీలైనంత సహాయం చెయ్యడానికే ప్రయత్నిస్తాము మేము.. అలాగే గత ఏడు సంవత్సరాలుగా సాగుతోంది మా రిలేషన్.
మళ్ళీ సంభాషణ లోకి..
"మీరొక్కరే ఊర్లో ఉండేది.." అంది ఉపోద్ఘాతమనేదే లేకుండా..
"అంటే  ఏమిటి  ?" అన్నాను నేను .. తొందరగా వెలగలేదు ఫ్యూజు ..
"మీరు ఊరికి పోవట్లేదా     ? అందరూ పోతున్నారు" మీరు కూడా వెళ్ళండి.. అంది 'వామనమూర్తికి బలి చక్రవర్తి భూదానం చేసినట్టు నాకు హాలిడే దానం చేస్తున్న ఫీలింగ్ తో..ఇలా నాగమ్మే నాకు లీవ్  ఇచ్చేస్తే ఇంకా మన మేనేజర్లు ఎందుకు? లీవ్ అప్రూవింగ్ సిస్టమ్స్ వగైరాలేందుకు?? అంతా  భ్రమ..చిత్త   భ్రాంతి
అప్పటికి అర్ధం అయింది.. 'ఎందుకు నువ్వు రేపు రావా? ' అన్నాను మెల్లిగా.. ( అదే మరి అజ్ఞానం.. ఒక్కరోజుకే ఐతే నాకు హాలిడే దానం ఎందుకు చేస్తుంది.. ? అనే ఆలోచన లేకుండా)
"రేపు వస్తాను.. సోమవారం నించి ఆరు రోజులు లీవ్ వేస్తున్నాను..మేల్ మరువత్తూర్ వెళతాము కదా, అంది. ఆవిడ ప్రతీ సంవత్సరం అమ్మవారి దీక్ష తీసుకుని ఆ ఊరు వెళుతుంది.. అది తెలిసిన విషయమే
"కానీ ఎప్పుడూ నువ్వు వెళ్ళేది  2-3 రోజులే కదా !.. ఈ సారి  ఇన్ని రోజులేందుకు ?" అన్నాను ..
"మా పిల్లలిద్దరూ కూడా వస్తున్నారు.. వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారు.  అందుకే అటునించి అటే  రామేశ్వరం అవీ పోయి వద్దామని.. " అంది
ఆఫీస్ లలో పని చేసే వాళ్లకి లీవ్ అప్లై చెయ్యడమూ, అప్ప్రూవ్ అవ్వడమూ, కాకపోవడమూ అనే సమస్యలుంటాయి.. ఇక్కడ అలా కాదు కదా.. ఇది కేవలం ఇన్ఫర్మేషన్..
డిసైడ్ చేసినా..
'నేను ఇలా డిసైడ్ చేసినా.. నీ తిప్పలేవో నువ్వు పడు' అని..
"అందుకే చెప్తున్నాను.. నేను రాకపోతే కష్టం కదా.. మీరు కూడా ఊరికి పొండి "అంది నవ్వుతూ.."ఈ లాజిక్ చాలా బావుంది..అని నేను నవ్వాను. ఇంకేం చెయ్యగలను?

"అన్ని రోజులా? పోనీ నీకు తెలిసినవాళ్ళ  నేవరినైనా చూసి ఈ నాలుగురోజులకి రమ్మన  వచ్చు కదా, రేపు నాకు చుట్టాలు వస్తారు కూడా  అన్నాను..
" ఎవరున్నారు? ఆ ప్రియ నిన్ననే పోయింది.. ఈ రత్న నాలుగురోజులు రానంది.. లక్ష్మి రేపు పోతోంది అని లిస్టు చదివింది..
ఇంకా నాకు ఓపిక నశించి.. "సరేలే.. ఏదో చెయ్యి.. కనీసం వచ్చే ఆదివారం వస్తావా? "అని అడిగాను నీరసంగా..
"వస్తాలెండి"..అంది ఉదారంగా.. "అది చాలనట్టు ఒక మూడు వేలు ఉంటె ఇచ్చేయండి.. జీతంలో కట్ చేద్దురుగాని.. అంత దూరం పోయాక డబ్బు తక్కువైతే కష్టం కదా! అంది..
'పోనీలే పాపం,. వెళ్లక వెళ్లక,  ఒక సారి పిలల్లతో కలిసి వెళుతోంది అని వెంటనే  మూడు  వేలు ఇచ్చాను.
ఏ  మాట కి ఆమాట చెప్పుకోవాలి.. " పని చేసే తీరు ఎలా ఉన్నా, వారం రోజులు సెలవు పెట్టడం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు మా నాగమ్మ విషయం లో.. ఒకటి రెండు రోజులకి మించి పెట్టదు.. వారం రోజులకి సరిపడా పని, అలవోకగా అరగంట లో చేసేస్తుంది ... అదే వేరే విషయం..
సుప్పండి 
ఇక్కడో చిన్న కధ. వెనకటికెవడో మన సుప్పండి లాంటి వాడు  రాజు గారి దగ్గరకి వచ్చి "నన్ను పనిలో పెట్టుకోండి మహారాజా!, నా పని ముగ్గురి పని అన్నాడుట.. ఆయన సంబరపడి పెట్టేసుకుంటే తీరా తెలిసినది ఏవిటంటే ఈయనగారు చేసిన ప్రతీ పనికి వెనక ముగ్గురు సరి చెయ్యవలసి వచ్చేది.. అదే నా పని ముగ్గురి పని అంటే అని".. కొంచం అలాంటి దే ఇదన్నమాట. తనకి నచ్చినట్టు  చేస్తుంది..
నేను ఏదైనా చెప్పబోతే.. "మీరొక్కరే నాకు చెప్పేది.. అది బాగులేదు.. ఇది బాగులేదు అని.. ఇంకెవ్వరూ అనేలేదు.. అంటుంది ఎదురు..  ఇంటి తాళం తన చేతిలో పెట్టినా సరే ఇల్లు బాంక్ అంత  భద్రంగా ఉంటుంది అన్న భరోసా మీద మా నాగమ్మ "బ్రాండ్ వాల్యూ' చాలా చాలా ఎక్కువ..చాలా నమ్మకమైన మనిషి. నిజాయితీ తన రెండో పేరు.

అలా నా ఇంటినీ , నా ఇంటి పనినీ  నా చేతుల్లోనే  పెట్టేసి  తను హాయిగా అమ్మ వారి దీక్షకని కొనుక్కున్న ఎర్ర చీర కట్టేసుకుని ఎర్ర బస్సెక్కి వెళ్ళిపోయింది హాయిగా.
ఎర్ర cheeraa
ఎర్ర బస్సూ


 ఈ మర్ఫీ అనేవాడేవడో కానీ కంటికి కనబడితే కట్టేసి,  కొట్టేసే వాళ్ళు ఎంత మంది  ఉంటారో నేను ఊహించగలను..నాతొ సహా..
మర్నాడు ట్రైన్ దిగబోయే చుట్టాలూ..నాలుగు రోజుల్లో భోజనానికి రమ్మన్న బంధువులూ,  అర్జంట్ పని మీద ముఫై కిలోమీటర్లు   రానూ, మరో ముఫై పోనూ, వెళ్ళవలసిన ఆఫీస్ పనీ ఇలాంటివన్నీ తలుచుకుంటే నే బెంగ పట్టుకుంది నాకు..
ముగ్గురు నలుగురు స్నేహితులకి ఫోన్లు చేసాకా తెలిసింది.. అందరిదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. వీళ్ళందరూ కూడగట్టుకుని వెళతారేమో?  తమ పనే కాదు, ఇతరుల పని తప్పించు కోవడానికి  అనిపించింది..
అంతలోనే పట్టుదలా.. 'ఒకరి మీద ఆధార పడితేనే కదా?.. ఈ ఖర్మ.. మనం చేసుకోలేకపోతే కదా, ఇంతోటి పని.. ఒక్క అరగంట ముందు నిద్ర లేస్తే సరి.. అని భీషణమైన ప్రతిజ్ఞలు చేసేసుకున్నాను.
'ఎప్పడూ  నాగమ్మ వెనకాల  ఇది సరిగ్గా చెయ్యి.. అది ఇలా చెయ్యి అని చెప్పే బాధ ఉండదు.. మనకి కావలసినట్టు మనమే హాయిగా చేసుకోవచ్చు..
ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు .. ఇలా వెయ్యి రకాలుగా నాకు నేనే సర్ది చెప్పేసుకుని
ఒక  స్క్రబ్బరూ, చీపురూ చేత్తో పట్టుకుని రెడీ అయిపోయాను. ఆ గుర్తొచ్చింది.. మొన్నెప్పుడో స్కాచ్ బ్రైట్ వాళ్ళు కొత్త తుడుచుకునే వస్తువేదో పరిచయం చేస్తూ మా అపార్ట్మెంట్ లో కొన్ని పోటీ లు అవీ పెట్టారు.. నెగ్గిన వాళ్లకి, వాళ్ళ ప్రాడక్ట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు.. నాకు కూడా  చాలా వచ్చాయని మీకు చెప్పాలి కదా..ఇవిగో చూసేయండి మరి..
ఇవన్నీ నాకు వాళ్ళు ఇచ్చ్చినవి..వెబ్ నించి తీసిన ఫోటో కాదు..

మేము ముగ్గురం, వచ్చినవాళ్ళు ముగ్గురూ,, పొద్దున్న  టిఫిన్లూ, మధ్యాహ్నం భోజనాలూ చేస్తే ఇన్ని గిన్నెలు వస్తాయని నేను  ఎప్పడూ ఊహించనే లేదు.. కొంపదీసి నాకు గిఫ్ట్ గా వచ్చిన స్క్రబ్బార్  లన్నీ  అయిపోతాయేమో అని భయం వేసింది.
సింక్ ఖాళీగా , క్లీన్ గా ఉంచాలనే తాపత్రయంలో ప్రతీ అరగంటకీ గిన్నెలు తోముతూనే ఉన్నాము.. సర్డుతూనే ఉన్నాము.. ' పాత కాలపు పత్రివ్రతల సినిమాలలో అంటే, ' సతీ సక్కుబాయి' లాంటి వన్న మాట.వాటిల్లో  ఆవిడ గిన్నెలు తోముతూనే ఉంటుది.. ఆవిడని కష్టాలు పెట్టడమే ధ్యేయంగా ఉండే పాత్రలు ఇంకా తెచ్చి పడేస్తూ ఉంటారు.. అది ఎంత వద్దనుకున్నా గుర్తోచ్చేసింది..
ఐతే ఇక్కడ అన్ని పాత్రలూ మనమే ( అంటే తోమించుకునే పాత్రలు కాదు లెండి ).. అదీ చిన్న తేడా.. "చేసేడి  వాళ్ళమూ.. చేయించెడి  వాళ్ళమూ మేమే.. అని భగవద్గీత కూడా పాడేసుకున్నాము..అంతే కాదు.. తోముకోడానికి గిన్నెలు అయిపోవడం అంటూ  ఉండదు.. న్యూటన్ సూత్రంలాగా అప్పుడప్పుడు కాఫీ పాత్రలలాగానూ, మరొకప్పుడు టిఫిన్ పాత్రలలాగానూ, ఇంకోసారి వంట పాత్రలలాగానూ అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి అని కూడా అర్ధం అయింది.
ఇంకా ఇల్లు తుడుచుకోవడం.. చీపురుతో  తో మొదట.. తడి బట్టతో పిమ్మట.. ఇది ఒక్క పని లా కనిపించినా నిజానికి రెండు పనులు..  ఒక్కసారి తుడిచేసరికే నీరసం వచ్చింది..'మనం తుడుచుకుంటే ఎలా అద్దం లా మెరుస్తోందో? లాంటి మాటలు ఒకటికి పది సార్లు నాకు నేనే చెప్పుకుంటూ సంతృప్తి పొందడానికి విఫల యత్నాలు చాలానే చేసాను.
మొదటి రోజు చేసినప్పుడు ఆ ప్రయత్నం కొంత సఫలమైనా తర్వాత 'ఆ ఎలా ఉంటే     ఏమిటి? ఇప్పుడు ఎవరు వచ్చి చూస్తారు?" అని మనసు అరుస్తుంటే నిజమే కదా అనుకున్నా.. 
మళ్ళీ అంతలోనే.. "ఛీ ఇలా అయిపోయనేమిటి? ఎవరికోసమో చేసుకుంటామా, మనకోసమే కదా ! అని దాని గొంతు నొక్కేసి మళ్ళీ  బట్ట పెట్టి తుడిచేసా.  దానికి తోడు  మా అబ్బాయి 'అవును మా..ఈ రోజు ఇల్లు చాలా క్లీన్ గా ఉంది.." అని పొగడ్తలు.
గుండె గుభేల్ 
'రోజూ మనం తిరిగే ఇల్లు ఇలా భూగ్రహమంత పెద్దదిగా ఉందేమిటి? అసలు భూమినంతా ఎవరైనా తుడవాలంటే ఎన్ని రోజులు పడుతుంది?అసలు నైనైతే తువగాలనా?  లాంటి తిక్క ప్రశ్నలు కూడా చాలానే  ఉదయించాయి... ఇంకా బాల్కనీలు.. స్నానాల గదులూ మిగిలాయా? .. అమ్మ నాయనోయ్..అని గుండె గుభేల్మంది. ఇలా ఏదో అష్ట కష్టాలూ, ఆపసోపాలు పడుతూ రెండు రోజులు గడిచాయి.
చైన్ రియాక్షన్
   మర్నాడు ఆఫీస్ నించి వచ్చేసరికి లేట్ అవ్వడంతో వంటా, భోజనాలూ, మిగతా పనులూ అయ్యేసరికి రెండు గంటలు పట్టింది.. మెషీన్ లో వేసిన బట్టలు 'మా సంగతేమిటి?' అని అడుగుతున్నాయి మరి.. నిద్ర కళ్ళనీ, వాషింగ్ మెషీన్ మూతనీ తెరిచి బట్టలు ఆరేయ్యాలంటే అంతక్రితం తాళ్లమీద ఉన్నవాటిని  తీసి లోపలకి తేవాలి.. ఆ తెచ్చిన వాటిని మడత పెట్టాలి.. అవి మళ్ళీ వేసుకోవాలి. ఇలా చైన్ రియాక్షన్ అంటే ఏమిటో చాలా బాగా అర్ధం అయింది.. ఎంతైనా థియరీ కంటే ప్రాక్టికల్ కున్న వేల్యూ ఎక్కువ కదా..

జ్ఞానార్జన 
ఒక్క ఫిజిక్సూ, కేమిస్ట్రీ మాత్రమేనా ? మా నాగమ్మ నాలుగు రోజులు రాకపోతే ఎంత జ్ఞానం వచ్చిందో తెలుసా? .. మన ఇల్లు ఎలా ఉంది? ( జాగ్రఫీ/భూగోళం), వైశాల్యం ఎంత? పోడువెంత? వెడల్పెంత? ( జామెట్రీ), ఎపుడు ఎన్ని సార్లు తుడిచాను లేదా గిన్నెలు తోమాను? ( చరిత్ర), ఏ పని చేస్తే అది ఇంకో పనికి అనుకోకుండా దారి తీస్తుంది ? ( కెమిస్ట్రీ), ఏ పని చేస్తే ఎలాంటి ఎఫ్ఫెక్ట్ వస్తుంది? ( ఫిజిక్స్)  మొక్కలకి నీళ్ళు మనకున్న టైము లో ఎప్పుడు పొయ్యాలి? అర్ధరాత్రి పోసినా ( అంటే టైము లేక) పరవాలేదా? ( బోటనీ), మన మొక్కల తోట్టెలు బాగా నచ్చి వాట్లో తమ విశ్రాంతి గృహాలని ఏర్పరుచుకున్న పావురాలని డిస్టర్బ్ చెయ్యకుండా బాల్కనీ ఎలా తుడవాలి ( జువాలజీ)లాంటివే కాకుండా ఇంత పని ఎందుకు చెయ్యాలి ? ( తర్కం), ఏది ఎప్పుడు చెయ్యాలి ( మీమాంస), ఎలా కరక్ట్ గా చెయ్యాలి ( వ్యాకరణం) లాంటి వి కూడా బాగానే పట్టు బడ్డాయి..
అయితే అన్నింటి కంటే ముఖ్యంగా అలవడినది ఫిలాసఫీ అన్నమాట.. 'ఈ క్షణ భంగురమైన జీవితం లో  ఈ ఇల్లు తుడిస్తే ఎంత ? తుడవక పొతే ఎంత? అనీ, బట్టలు ఉతికితేనే బట్టలా? లేకపోయినా బట్టలే కదా అని.. ఇలాంటివన్నమాట..
పొరపాటున కూడా ఇవన్నీ మా నాగమ్మ కి చెప్పకండి.. మీ మంచి కోసమే, మీ జ్ఞాన సముపార్జన కోసమే  నేను లీవ్ తీసుకున్నది అన్నా అంటుంది..
సరే ఇలా ఆదివారం నించీ మూడు   రోజులు సాగి బుధవారం వచ్చేసరికి నేను మా అబ్బాయికి ఎప్పుడూ చెప్పే విషయం ఒకటి గుర్తొచ్చింది. నేను పని చేస్తుంటే వాడికి చాలా తేలికగా జరుగుతున్నట్టుగా కనిపించి " ఓ! వడలు చెయ్యడమంటే ఇంతేనా? నేనూ చేసేస్తాను అనో.. పరాతాలు  చెయ్యడం ఇంత ఈజీనా? .. అనో అన్నప్పుడు.. నేను నవ్వుతూ.. మనం చెయ్యక్కరలేని పని ఏదైనా సరే, ఎదుటి వాళ్ళు చేస్తుంటే చాలా సులువుగా అనిపిస్తుంది.. మనం చెయ్యవలసి వస్తేనే తెలుస్తుంది అందులో కష్టం అని అంటూ ఉంటాను.. ఇప్పుడు నా పరిస్థితి  అదే..
అంటే
అమాంతం గా నాగమ్మ మీద అంతులేని జాలి పుట్టుకొచ్చింది. ' నాలుగు రోజులకే ఇంత విసుగు వచ్చేసింది.. రోజూ ఎలా చేస్తుందో పాపం.. అదీ ఒకటి కాదు, నాలుగైదు ఇళ్ళల్లో.. అందుకే పాపం అప్పుడప్పుడు ఈరోజు ఇల్లు బట్ట పెట్టి తుడవను అదీ అంటుంది అనిపించడం మొదలు పెట్టింది. పాపం ఈసారి అలా అంటే సరేలే! రేపు చేద్దువుగానిలే, అనాలి లాంటి భావాలన్నీ వచ్చేసాయి. ( ఇంతకూ ముందు అన్నాను అయినా సరే.. ఇప్పుడు కొత్తగా వచ్చిన జాలివల్ల అలా మరీ గట్టిగా అనిపిస్తోంది అన్నమాట).
ఎవరి పని వాళ్ళు చేస్తే తెలీదు కానీ మనమే అన్నీ చేసుకోవాలంటే తెలుస్తోంది అనుకున్నాను..
అంతే కాదు తనతోటి.. " మనం డబ్బు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఒప్పుకున్న  పని చేయాలి అని అనుకుంటాం కానీ చాలా బోర్ పాపం! అని కూడా చెప్పేసాను. అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేసినందుకు తనకీ తెలిసింది కదా.. 'వెరీ ట్రూ' అని చెప్పేశారు..
ఇది 'స్టాక్ హోమ సిండ్రోం' లా 'హౌస్  వితౌట్ నాగమ్మ 'సిండ్రోం ఏమో మరి..
ఏది ఏమైనా ఇవ్వాళ భళ్ళున తెల్లారి గురువారం అనుకోగానే 'అమ్మయ్య నాగమ్మ వచ్చేసే రోజు దగ్గరకొచ్చేసింది' అనుకుని ఆనందపడిపోయాను.. మళ్ళీ ఆఫీస్ నించి రాగానే చెయ్యడం కష్టం అని పని చేసేసుకుని వచ్చాను అనుకోండి.. ఇంకా ఇప్పుడు ఇంటికెళ్ళి..
"అమ్మా నాగమ్మా, త్వరగా రావమ్మా! అని పాడుకుంటూ వెయిట్ చెయ్యడమే.."ఇంకేమైనా చెయ్యచ్చా? కొంచం సలహా చెప్పరూ!!

Sunday, September 25, 2011

మణి రంగ వల్యాలంకృత ...మేదినీ పాల రామ చంద్ర..

   సంగీత త్రిమూర్తులలో ప్రతీ ఒక్కరిదీ ఒక విలక్షణమైన శైలి.. పధ్ధతి .. అందుకే వారికా గౌరవం..ఇది తక్కువ అని ఏదీ అనిపించని కృతులు వారి సొంతం..  ఏ రాగమైనా, తాళమైనా, సాహిత్యమైనా కలకాలం గుర్తుండి పోయేలా మలచగలగడం కేవలం వారికే సొంతం..' శ్రీ త్యాగరాజ సన్నుత' అంటూ రామనామం తో  శ్రీరాముడిని కీర్తించి, తరించిన త్యాగరాజ స్వామి అయినా, ముగ్గురమ్మల మూలపుటమ్మని  'శ్యామ కృష్ణ సోదరి' అంటూ కీర్తించిన శ్యామ శాస్త్రి అయినా, గురుగుహ అనేది  తన సంతకంగా మార్చుకుని,  గురుగుహుడినీ, ఆయన అన్నగారైన వినాయకుడినీ  కీర్తిసూ  కృతులని  సమకూర్చిన శ్రీ దీక్షితుల వారైనా సంగీత కళా మకుటంలో చూడా మణులే.  అయితే సాధారణం గా వినవచ్చే  దీక్షితార్ కృతులకి భిన్నంగా , రామవైభవాన్నీ, ఆ మర్యాదా పురుషోత్తముడి గోప్పదనాన్నీ ప్రస్తుతిస్తూ, ప్రస్తావిస్తూ  ఎంతో వైవిధ్యంగా సాగే రామ నామ సంకీర్తనమే ఈ మణి రంగు రాగ కీర్తన..  దీక్షితుల వారు రాసిన అనేక గొప్ప కృతులలో  ప్రత్యేకంగా పేర్కొనవలసిన మరకత మణి వంటి  కృతి ఇది. దానికి తగ్గట్టే అరుదైన రాగం.
  మణి రంగు  రాగం కూడా రీతిగౌళ రాగం లాగే 22  వ మేళకర్త రాగమైన ఖరహర ప్రియ కి జన్య రాగమే. మధ్యమావతికి అత్యంత దగ్గరగా అనిపిస్తూనే ఎంతో విలక్షణంగా వినిపించే గమక ప్రధానమైన రాగం. మధ్యమావతికీ, ఈ రాగానికీ కేవలం ఆరోహణలో వచ్చే గాంధారం మాత్రమే తేడా. మణిరంగు రాగానికి ఆరోహణ 'స రి మ ప ని స' అవరోహణ 'స ని ప మ గ రి స'. జీవ స్వరంగా వినిపించే ఉపాంగ రాగం. 'హలధరాజం ప్రాప్తుం' అనే కృతీ , 'రానిది రాదు' అనే త్యాగరాజ కృతి ఈ రాగం లోనే చేయబడ్డాయి.. 
   మారుతి సన్నుతుడైన పట్టాభిరామా.. నన్ను కాపాడు అన్న పల్లవితో మొదలవుతుందీ కృతి. 'మామవ పట్టాభిరామా.. జయ మారుతి సన్నుతి సన్నుత రామా.. ' అంటూ..
      లేత ఆకులకన్నా సుకుమారమైన, కోమలమైన పాదాలున్న కోదండ రాముడు....ఘనమైన శ్యామల వర్ణపు విగ్రహం కలిగిన కమల నయనమ్ములు కలిగిన కోరిన కోరికలన్నీ సంపూర్ణం కావించే రఘురామా.. కళ్యాణ రామ రామ.. అని ప్రస్తుతిస్తారు అనుపల్లవిలో.. 
" కోమల తర పల్లవ పద... కోదండ రామా.. ఘన శ్యామల విగ్రహాబ్జనయన.. సంపూర్ణ కామా.. రాగురామా.కళ్యాణ రామ రామ.."మామవ"

ఆ తరువాత  ఆ లీలా మానుష మూర్తిని ఎవరెవరు సేవిస్తున్నారో చెప్తారు. ఛత్ర  చామరాలని కరమున ధరించి భారత, లక్ష్మణ, శత్రుఘ్నులే కాక విభీషనుడూ , సుగ్రీవుడు మొదలైన ప్రముఖులున్నారుత   శ్రీ రాముని సేవకై. ' 'ఛత్ర చామర కర ద్రుత భారత, లక్ష్మణ, శత్రుఘ్న విభీషణ సుగ్రీవ ప్రముఖాది సేవిత ' అంటూ.' సోదరులందరినీ వయసు క్రమంలో ప్రస్తావిస్తారు దీక్షితుల వారు. అంతేకానీ వనవాసానికి అన్నతో కలిసి వెళ్ళినవాడు, అనుంగు తమ్ముడు అని లక్ష్మణుడిని భరతుడి కంటే ముందు పెట్టలేదు. ఇది ఆరోజుల్లో వయసుకీ, వావి వరసలకీ ఇచ్చే గౌరవమూ, అది ఆ పెద్దవారు కూడా  నిలుపుకు న్న గొప్పదనమూ అనుకుంటాను నేను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.
 అత్రి, వశిష్టుడూ  మొదలైన  మహర్షుల అనుగ్రహా న్నీ , ఆశీర్వాదాన్నీ పొందిన వాడట ఈ దశరధ రాజ పుత్రుడు. తాను సాక్షాత్తు విష్ణు  మూర్తి స్వరూపుడైనా  మానవ రూపు ధరించినందుకు ఈ మహర్షులందరినీ  గురువులుగా భావించిన శ్రీ రాముని వినయ విధేయతలకు సాటిగా సాగుతుంది శ్రీ దీక్షితుల వారి వర్ణన . 'అత్రి వశిష్టాద్యను గ్రహ పాత్ర.. దశరధ పుత్ర..అంటారు.
 కేవలం నవరత్నాలతోనే కాదు.. మణి రంగ రాగం యొక్క ఉజ్జ్వలత తోనూ, కాంతి  తోనూ  కూడా అలంకృతమైన  ( తను రాసిన కృతిలోనూ ఆ రాగం పేరును చేర్చడం శ్రీ దీక్షితుల వారి ప్రత్యేకత.. దాదాపుగా ) మంటపం లో  విచిత్రమైన,  మణి మయాలంకృతమైన సింహాసనం పై  సీత తో కలిసి సహ సంస్థితుడైన     సుచరిత్రుడూ,, పరమ పవిత్రుడూ, గురుగుహ మిత్రుడు ( అంటే తనకే అన్నమాట)నట శ్రీ రాముడు.. 
మణిరంగా  వల్యాలంకృత నవరత్న మంటపే విచిత్ర మణిమయ సింహా సనే  సీతయా సహ సంస్థిత..సుచరిత్ర , పరమ పవిత్ర.. గురుగుహ మిత్ర..
అంతే  కాదు ఆ తరవాత వచ్చే సాహిత్యం ఇంకా బావుంటుంది.  పంకజ  మిత్ర వంశ  సుధాంబుధి చంద్ర.. మేదినీ పాల రామచంద్ర ...అనే ఈ పద ప్రయోగం నాకెంతో ఇష్టం. పంకజ మిత్రుడైన సూర్యుని వంశమనే  a సముద్రంలోంచి ఉద్భవించిన చంద్రుడట.. ఈ భూమి కే  పాలకుడైన ఈ రామచంద్రుడు..
  వింటుంటే ప్రతీ అక్షరమూ ఎంతో మధురం గానూ, చక్కగానూ వినిపించే రాగమూ, కీర్తన..ఈ రాగం అరుదైన రాగాలలో ఒకటి అని చెప్తారు. ఒక్కసారి వింటే చాలు, వెయ్యి సార్లు వినాలనిపించే రాగమూ.. కీర్తన..సినిమా పాటల్లో ఈ రాగం చాలా తక్కువగా వాడినట్టు అనిపిస్తుంది. లయ రాజు ఇళయరాజా 
 కన్ని వయసు అనే తమిళ చిత్రం లో 'సుభారాగమే' అనే ఒక పాత ఈ రాగం లో చేసారు. అలాగే సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో పూసింది పూసింది పున్నాగా కూడా ఇందులోనే కీరవాణి స్వరపరచారని సమాచారం. ఈ పాత విన్న ప్రతీ సారీ, దీనికీ 'మామవ ' కీర్తనకీ గల పోలికలు వెతుకుతూనే ఉంటాను. ఈ రాగం లో చేసిన ఇతర కీర్తనలు కానీ, సినిమా పాటలు కానీ ఎవరికైనా తెలిస్తే దయచేసి తెలియచేయండి.
శ్రీ మహారాజ పురం సంతానం ఆలపించిన ఈ కీర్తన ఇక్కడ..
శ్రీ. టి.ఎం కృష్ణ పాడిన 'మా మావ పట్టాభి రామ'  ఇదిగో ఇక్కడ...



 

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...