ఉందో, లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి , ఆ సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి అని దేవుడిని కోరినట్టుగా రాసిన ఒక గజల్ కొన్నాళ్ళ క్రితం గజల్ శ్రీనివాస్ గారు పాడుతుండగా విన్నాను. ఆయన పాడిన తీరూ, ఎంతో బాగా రాసిన సాహిత్యం ఇంకా నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటాయి. ఉందో లేదో తెలియని స్వర్గం మీద నా పుణ్యాన్ని వృధా చేసుకోను, తెలిసినదీ, అందరి జీవితాల్లోనూ మరపురానిదీ అయినా బాల్యమనే స్వర్గాన్ని మళ్ళీ నాకిచ్చేస్తే ఆ పుణ్యం మొత్తం నీకిచ్చేస్తాను అని దేవుడితో బేరం పెట్టడం.. ఎంత మధురమైన ఊహ??
సరిగ్గా అలాంటి బాల్యాన్నే 'మిఠాయి పొట్లం' అనే తాయిలంగా చుట్టి దాదాపు వంద నిమిషాల సేపు మన చేతికందించిన నాటకం నిన్న రాత్రి మేము చూసిన 'Swami and friends". పసితనపు అమాయకత్వాన్నీ, ఆనందాన్ని, స్నేహాన్నీ, అవి తీసుకొచ్చే చిన్న చిన్న ఆపదలనీ, అనుమానాలనీ మనసుకు హత్తుకునేలా చూపించి అందరినీ మెప్పించారు. ప్రముఖ రచయత R.K.Narayan సృష్టించిన మరపురాని, మధురమైన పాత్ర ఈ చిన్నారి స్వామి. ఈ పదేళ్ళ చిన్న పిల్లాడూ, అతని కొత్తా, పాత స్నేహితులూ, వారి నడుమ చోటు చేసుకున్న సంఘటనలూ, మధ్య మధ్యలో వాన మబ్బుల్లా వచ్చి భయపెట్టే టీచర్లూ, కోప్పడి క్రమ శిక్షణ లో పెట్టే అప్పా ( నాన్న), లాలించి అక్కున చేర్చుకునే పాటీ ( బామ్మా) ఇవీ ఈ కధలోని పాత్రలు.
స్వామి ప్రపంచం చాలా చిన్నది. మాల్గుడి అనే చిన్న ఊరిలో (బెంగుళూరు లోని మల్లేశ్వరం, బసవనగుడి లని కలిపితే మాల్గుడి తయారయింది, కాల్పనిక గ్రామం ) ఉన్న స్వామి కుటుంబం, రెండు స్కూళ్ళూ, నలుగురు స్నేహితులూ, ముఖ్యంగా పెద్ద గైడ్ లా వ్యవహరించే స్నేహితుడు మణీ... ఇదీ అతని లోకం. కొత్తగా అందులోకి 'రాజం' అనే కుర్రవాడు వస్తాడు. పోలీస్ ఆఫీసర్ గారి అబ్బాయి, అతని తెలివీ, ధైర్యమూ చూసి మన స్వామీ అతనికి ఆప్త మిత్రుడైపోవాలని అనుకుంటాడు. "స్వామీ రాజం తోక" అని పిలిపించుకోవడానికి కూడా వెనుకాడడు. తన ఇల్లు అతని ఇల్లులాగే ఉండాలనీ, తాను కూడా అతనిలా ఉండాలని తాపత్రయపడతాడు. అమాయకత్వంతో చిక్కుల్లో పడి తను చదువుతున్న మొదటి స్కూల్ నించి బహిష్కరించ బడతాడు. రెండో స్కూల్ లో చేరిన తర్వాత ఆ స్కూల్ డిసిప్లిన్ కీ, స్నేహితుల క్రికెట్ ఆటకీ మధ్యన నలిగిపోతాడు. డ్రిల్ ప్రాక్టీస్ కి రమ్మని హెడ్ మాస్టారూ, ఆట ప్రాక్టీస్ కి రమ్మని స్నేహితుడు రాజం వత్తిడి చేసేసరికి, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో హెడ్ మాస్టార్ కోప్పడి స్కూల్ కి రావద్దనేసరికి భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు. తరవాత కొంతమంది సహాయం వల్ల క్షేమంగా ఇల్లు చేరతాడు. స్నేహితుడు రాజం తండ్రికి ట్రాన్స్ ఫర్ అయిందని తెలుసుకుని బాధ పడతాడు. అతనికి వీడ్కోలు పలికి, ఆ తరవాత మళ్ళీ తన పాత స్నేహితుడు మణి తో కలిసి ఉంటాడు.
అతి తక్కువ పాత్రలతో (11 ), సరంజామాతో (props), ఎక్కడా అంతరాయం లేకుండా, ఒక్క బిగిన నాటకం మొత్తం చాలా రసవత్తరంగా ప్రదర్శించారు. చిన్న పిల్లలూ, వారి మానసిక స్థితినీ, వారి వయసులో చాలా పెద్దవిగా కనపడే సంఘటనలనీ ప్రతిభావంతంగా చూపించారు. తెలివైన తన స్నేహితుడు మణి కి ఎదురు చెప్పలేక పోవడమూ, క్రికెట్ జట్టుకి తగ్గ పేర్లు ఆలోచించు కోవడమూ , ఆమెకేమీ తెలియదని తెలిసినా సరే బామ్మకి అన్నీ చెప్పుకోవడమూ, ఇంట్లో తిడతారని భయపడి పారిపోయిన తర్వాత స్వామి ఇంటి గురించీ, తన వారి గురించీ తలచుకుని బాధపడడమూ .. ఒకటేమిటి? స్టేజ్ మీద కనపడిన అన్ని సన్నివేశాలూ ఎంతో సహజంగా ఉంది పెద్దవారికి గడచిపోయిన తమ బాల్యాన్ని గుర్తు చేస్తే, పిలల్లకి తమ ప్రస్తుత బాల్యాన్ని గుర్తుచేశాయి. ఈ నాటకం ఇంత రక్తి కట్టడానికి పెద్ద కారణం ఇదే. ప్రతీవారూ తమని ఇందులో చూసుకోగలగడమే..
"The Hindu" దిన పత్రిక వారు నిర్వహిస్తున్న "The Metroplus Theater Fest" లో భాగంగా "The Madras and Landing Stage" వారిచే ప్రదర్శింప బడింది. R.K.Narayan రచించిన ఈ పుస్తకాన్ని 'మానసి సుబ్రహ్మణ్యం' నాటక రూపాన్ని కూర్చగా, 'అరుణ గణేష్ రాం' ఎంతో ప్రతిభావంతంగా దర్శకత్వం వహించారు. పాత్రధారులందరూ తమ తమ పాత్రలలో లీనమై నటించారు. అవకాశం దొరికితే తప్పకుండా చూడవలసిన నాటకం.
సంతోషం.
ReplyDeleteమీ సమీక్ష/పరిచయం బావుంది
'Swamy and Friends' is one of the wonderful books I read.
ReplyDeleteదూరదర్శన్ లో ఈ సీరియల్ చూసాను.
ReplyDelete@కొత్తపాళీగారూ. ధన్యవాదాలు. ఈ నాటకం మీద నేనూ, మా అబ్బాయి కలిసి రాసిన చిన్న సమీక్ష ఈ రోజు 'హిందూ' పేపర్ (బెంగళూర్) లో ప్రచురించబడింది.
ReplyDelete@ మాధురి.. సరిగ్గా చెప్పారు. Great books. They take you back to your childhood
@సునిత గారూ.. పుస్తకాలు కూడా చదవండి వీలైతే.. చాలా బావుంటాయి.