ఈ మధ్యన మనం కొనుక్కున్న వస్తువులకంటే ఫ్రీగా ఎక్కువ వస్తువులు వస్తున్నాయా? అని అనుమానం భయంకరంగా వచ్చేస్తోంది నాకు. దేశ, కాల, మాన పరిస్థితులతో సంబంధం లేకుండా దుకాణాలన్నీ ఎప్పుడూ కళకళ లాడిపోతూకనిపిస్తున్నాయి.. కేవలం జనాలతోనే కాదు. సేల్, సేల్, .. అన్న బోర్డులతోనూ.. లైట్లూ, మెరుపులూ వగైరా హంగులతోనూ.. కళ్ళూ, మనసులూ చెదిరిపోయే ఆఫర్లతోనూ..
కొన్ని అర్ధం అయ్యే ఆఫర్లూ.. మరికొన్ని అర్ధం కానివీనూ . ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేదూ రెండు కొంటే ఒకటి ఫ్రీ . ఇలాంటివి సులువుగా అర్ధం అయ్యేవన్నమాట. ఇంకోరకం ఇలా ఉంటాయి.. రెండు కొనండి, రెండో దాని మీద ఇరవైయో, నలభైయో.. నూటపద్దేనిమిదో శాతం ఆఫ్.. ఇది కొంచం తిరకాసు వ్యవహారం.. ఇక్కడ అర్ధం, మొదటి దానిమీద ఏమీ లేదు.. రెండోది కొంటే దానిమీదే డిస్కౌంట్ అని కదా .. ( నా మట్టి బుర్రకి అప్పుడప్పుడు ఇవి అర్ధం కావు కూడా). ఇలాంటివి ఇంకా ఉంటాయి. చాలా మంచి అవకాశం, 50% +40% డిస్కౌంట్ అనో.. లెకపోతే 50%+20% డిస్కౌంట్ అంటూ ఇలా మన సాధారణ, లేక సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో ఉన్న రకరకా ల చిహ్నాలూ, ఫార్ములాలూ వాడితే కాని అర్ధం అవని ఆఫర్లూ..ఇంత లెక్కల ఒలింపియాడ్ తగ్గట్టుగా ఎందుకూ లెక్కలు చెప్పడం? నిజం గా ఇచ్చేదేమైనా ఉంటే బుద్దిగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా..అనుకుంటాను నేను.
మొన్న మా పక్కింటివాళ్ళ అబ్బాయికి 4 జతల బట్టలు కొంటే ఐదు జతల బట్టలు ఫ్రీగా ఇచ్చారుట.. (నిజంగా నిజం) . వాడి ఆనందం పట్టలేకపోయాము. పది నిమిషాల కో జత మార్చుకొని , వాళ్ళ అమ్మా నాన్నలకి చూపించి తరవాత మా తలుపు కొట్టి మాకు చూపించడమూ, మళ్ళీ లోపలకి పరిగెత్తడమూ, ఇంకో జత వేసుకోడానికి ..ఈ రకంగా వాడి హడావుడి దాదాపు ఒక గంటసేపు నడిచింది అన్నమాట. ఆ ఐదేళ్ళ బుడతడి ఉత్సాహం చూస్తే చెప్పద్దూ.. నాకు కూడా భలే ముచ్చటేసింది..
మరి నల్లీ సిల్క్ వాళ్ళు ఒక మంచి పట్టుచీర కొనుక్కుంటే రెండు ఉచితం అని కానీ, స్టెర్లింగ్ హౌస్ వాళ్ళు ఒక సల్వార్ కమీజ్ కోంటే మరో మూడు ఫ్రీ అని కాని ఒక్కసారి కూడా అనరు గాక అనరు కదా. అలా కనక వాళ్ళు ఇచ్చేస్తే నేను కూడా అవన్నీ కట్టేసుకుని, ఈ పాటికి కారివాక్ లు ( అదేనండీ. కారిడార్ లో రాంప్ వాక్ లన్నమాట) అవీ, ఒక రేంజ్ లో చేసేద్దును కదా అని చాలా సేపు బాధ పడిపోయాను. కానీ ఏం చేస్తాం? చేసుకున్నవారికి చేసుకున్నంతా.
మరి నల్లీ సిల్క్ వాళ్ళు ఒక మంచి పట్టుచీర కొనుక్కుంటే రెండు ఉచితం అని కానీ, స్టెర్లింగ్ హౌస్ వాళ్ళు ఒక సల్వార్ కమీజ్ కోంటే మరో మూడు ఫ్రీ అని కాని ఒక్కసారి కూడా అనరు గాక అనరు కదా. అలా కనక వాళ్ళు ఇచ్చేస్తే నేను కూడా అవన్నీ కట్టేసుకుని, ఈ పాటికి కారివాక్ లు ( అదేనండీ. కారిడార్ లో రాంప్ వాక్ లన్నమాట) అవీ, ఒక రేంజ్ లో చేసేద్దును కదా అని చాలా సేపు బాధ పడిపోయాను. కానీ ఏం చేస్తాం? చేసుకున్నవారికి చేసుకున్నంతా.
ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా నాకూ ఒక అవకాశం వచ్చింది తొందరలోనే. M.T.V వారి టీ షర్టులు ట. . వీళ్ళు ఒక్క మ్యూజిక్ చానల్ మాత్రమే నడుపుతారు అనుకున్నా... ఇలా చొక్కాలూ, లాగూలూ కూడా అమ్ముతారని ఈ మధ్యనే తెలిసింది.. ఎలా అంటారా? మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్ లో దింపి వాడి కోసం ఎదురు చూస్తుండగా. మరి ఆ గంట సేపటిలో వెనక్కి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళలేము కదా మన బెంగళూర్ ట్రాఫిక్ లో.. అందుకని అక్కడే కూర్చునో, నించునో, కొంగ జపం చెయ్యటమో, ఎదైనా తినడమో, లేదా ఇలా పక్కన కనిపించిన షాప్ లో దూరి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేసుకోడమో మాత్రమే మార్గాలు. వేరే మార్గాంతరం లేదు కాక లేదు.
సరే అలా ఆ షాప్ లోకి దూరానో లేదో.. M.T.V చొక్కాలు. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నాడు. షాప్ లో అతను ఓహో.. మా పక్కింటి వాళ్ళ అబ్బాయంతల్లా కాకపోయినా మావాడి అలమారా ( అదే.. వార్డ్రోబ్) ఒక్కసారి మార్చి పారేసే మహదవకాశం నాకూ వచ్చింది కదా! అని గబగబా చూసేసాను. అంతేకాదు.. " పొడుగయ్యిపోయాడు.. పాతవి పట్టడం లేదు.. ఇవి బానే ఉన్నాయి. మూడు నెలలోచ్చినా చాలు" వగైరాలన్నీ నాకునేను ముందు చెప్పేసుకుని.. అర్జెంట్ గా ఫోన్ చేసేసి తనకి కూడా చెప్పేసి.. మొత్తానికి మూడు కొన్నాను.. అవీ, వాటితో ఫ్రీగా వచ్చినవీ కలుకుని నా ముఖం చేటంతా.. మోయ్యాల్సిన బరువు కొండంతా అయ్యాయి.. అయితే ఏమైంది? పరాలేదులే.. జీవితం లో లాభాలన్నీ ఊరికే వస్తాయా? అనుకున్నాను. ప్చ్.. అమాయకత్వం!
ఇంటికొచ్చాకా చూసుకుంటే నేను కట్టిన డబ్బుకి కొద్దిగా అటూ ఇటూగా అన్ని చొక్కాలు మామూలుగా కూడా కొనుక్కోవచ్చు అని తేలింది.. పొరపాటున నాలిక కరుచుకుని.. మోకాలి మీద కొట్టుకుని.. "పరవాలేదులే.!. వాడికి లేవు.. నేను కూడా జిమ్ కి వేసుకుంటాను" అని సర్ది చెప్పేసి వాటిని అర్జెంట్ గా లోపల పెట్టేసాను.. "అవుట్ అఫ్ సైట్ ఇస్ అవుట్ అఫ్ మైండ్ "అని నాకు తెలీదా?.మా వాడేమో.. ఇదేం బ్రాండ్? నేను ఎప్పుడూ వినలేదు అని అననే అనేసాడు కూడా. ప్చ్ ! నా కష్టం అలా వృధా అయిపోయింది. దానికి తోడూ వాటిల్లో ఎక్కువ శాతం ఒక నెల రోజుల్లో మేము ముగ్గురమూ రాత్రి పైజామాల మీదకి వేసుకున్టున్నామని మీకు నేను చెప్పలేదు.. చెప్పను కూడా..
అలా తగిలిన ఆ చిన్న దెబ్బతో నేను కొన్ని రోజులు ఉచిత బట్టల జోలికి వెళ్ళలేదు.. అయినా నెలకోసారి వద్దన్నా వస్తున్నా పండగలూ,., పబ్బాలు.. చేతులు కట్టేసుకుని కూర్చోలేము కదా.. అయినా పాపం కూర్చున్నాము.
సరే ఇంతట్లోకి నాకు బొంబాయి వెళ్ళే పని వచ్చింది.. ఈ లోపున మా అబ్బాయి వాళ్ళ నాన్నా కలిసి డ్యూయల్ సిమ్ కార్డ్ లు వేసుకోగలిగే ఫోన్ కావాలి.. అందులో సింపిల్ మోడల్ చాలు నాకు.. నాది చాలా సింపిల్ టేస్ట్ అదీ ,ఇదీ ( ముందర కొన్న హై, ఫై ఫోన్ లూ, గేజేట్లూ గుర్తుకి రావు) అంటూ నాకు బిల్డ్ అప్ లు ఇచ్చి.. "సంగీతా" షాప్ కి వెళ్లి సామ్సంగ్ వాళ్ళది ఏదో ఒక ఫోన్ కొనుక్కోచ్చారు. నేను వచ్చేసరికి " ఆ ఫోన్ తో పాటు ఈ గ్లాస్ ఫ్రీగా ఇచ్చారు సంగీతా వాళ్ళు , అని భలే ముద్దుగా ఉన్న ఒక వెండి గ్లాస్ చూపించారు కూడా. " ఇంత చిన్న ఫోనుతో ఇలాంటి వెండి గ్లాసా" అని మేమందరమూ హాచ్చెర్య పడి పోతూ ఉండగానే వచ్చింది ఒక చిన్న అనుమానం.. "ఆ ! మహా మహా వస్తువులు కొంటేనే వెండిసామాన్లు ఇవ్వరు , ఇది ఆ మధ్యన నేను మల్లేశ్వరం మార్కెట్లో చూసిన తెల్ల లోహంది ( వైట్ మెటల్ అన్నమాట) అయ్యి ఉంటుంది అనుకున్నాను . ఎందుకంటే అప్పుడెప్పుడో మేము వాషింగ్ మెషీన్ కొన్నప్పుడు బంగారు గాజులు ఫ్రీ అని ఇరవై పైసల బిళ్ళతో చేసిన గాజుల జత ఇచ్చారు. వాషింగ్ మెషీన్ కి బంగారు గాజులు ఇస్తారంటే మేము నమ్మలేదు కానీ అలా వాళ్ళు ప్రకటించుకోవడం నవ్వొచ్చింది. ఇదీ అలాంటిదే అనుకున్నాం.
" కొత్త బట్టలు ఉన్నాయి కదా. నీ ఫోన్ పాడయిపోయింది.. కొత్తది కొందాం "అని దీపావళి కి మళ్ళీ అదే షాపు కి వెళ్ళాము. ఈ సారి మా వాడు "టచ్ ఫోన్ కొందాం, టచ్ మీ నాట్ ఫోన్ వద్దు "అదీ అని మొత్తానికి కొద్దిగా ఎక్కువ ఖరీదున్న ఫోన్ కొనిపించాడు. "అబ్బో! ఆ చిన్న, సింపిల్ ఫోన్ కే అంత లావు వెండి గ్లాస్ ఇచ్చేస్తే మరి ఇంత ఖరీదైన ఫోన్ కి కంచమో, వెండి చెంబో ఇచ్చేస్తారేమో" అని నేను మనసులోనే అనేసుకున్నాను .. నయం పైకి అనలేదు. బిల్ కట్టేసి అప్పుడు మెల్లిగా అడిగాము.. "కిందటి వారం ఈ ఫోన్ కోంటే వెండి గ్లాస్ ఇచ్చారు.. ఇప్పుడు దీపావళి కూడా కదా. మరి ఈ పెద్దఫోన్ కి ఏమి ఇస్తున్నారు? "అని..
"ఆ స్కీం అయిపోయిందండి.. ఇప్పుడేమీ లేదు" అన్నాడు మొదట. ఇంకోసారి అడిగాకా మెల్లిగా చిన్న కవర్లోంచి మళ్ళీ గ్లాసూ, చిన్న వెండి (?) కుందులూ చూపించి.." దీపావళి కదా ఈ దీపాలు కూడా ఉన్నాయి. మీకు ఏది కావలిస్తే అది తీసుకోండి "అన్నాడు రహస్యంగా. మళ్ళీ ఎవరైనా వింటే ఏం ప్రమాదమో !అన్నట్టుగా.. "చూసారా! అడగందే అమ్మైనా పెట్టదు అని ఒక గ్లాస్ ఉంది కదా, అసలే కొత్తగా దేముడి మందిరం కూడా చేయించాము, దీపాలు తీసుకందాం "అని తీసేసుకున్నాను.. భలే.. భలే ! నా దేవుడి మందిరానికి కావలసిన హంగులన్నీ ఇక్కడే అమిరిపోతున్నాయి అన్న ఆనందంతో. సరే మిలమిల లాడుతున్న ఆ గ్లాసూ, దీపాలు పెట్టేసుకుని దీపావళి పూజ కొత్త మందిరం లో చేసేసుకుని ఆనందించేసినా "అవి వెండి సామానులా , కావా? "అన్న అనుమానం అలాగే ఉండిపోయింది. వాటిని చూస్తె వారం రోజులైనా రంగు మారలేదు, రవ్వంత మెరుపు తగ్గలేదు.. "అరే!. ఇవి నిజంగా వెండి వాటి లాగే ఉన్నాయే.. గ్లాసు తీసుకోవలసిందేమో.. రెండూ జతగా ఉండేవి, ఈ కుందులు మరీ చిన్నవిగా ఉన్నాయి కూడానూ" అని ఇంకో బాధ.. ఆశ.. దురాశ ...
అనుమానం అన్నది రానే కూడదు.. వచ్చిందా ?మరి మనల్ని నిలబడ నివ్వదు కదా. మా పక్కింటి స్నేహితురాలికి చూపించాను.. ఇలా, ఇలాంటి సంగతి అని చెప్పాను.. ఆవిడ వాటిని ఎగా ,దిగా , కిందా, పైనా చూసి "వెండివాటి లాగే ఉన్నాయి ,పోనీ మన కాలనీ లో ఉన్న బంగారం షాప్ లో అడగండి "అన్నారు.
సరే.. మర్నాడు ఏదో పెద్ద పని ఉన్నట్టు గా వెళ్లి, చాలా కాజువల్ గా ఏదో వేరే వస్తువు గురించి అడుగుతూ దీని విషయం అడిగాను.. అతను " అయ్యో. మేము ఇక్కడ టెస్టింగ్, పాలిషింగ్ చెయ్యడం మానేసామండి. ఎందుకంటే మొదట ,మనుషులు దొరకటం లేదు, రెండు , షాప్ లో A.C పెట్టాకా యాసిడ్ పొగలు ఒక పట్టాన పోవండి.. మూడు, వర్క్ షాప్ కి పంపిద్దామంటే నాకు గిట్టుబాటు అవడం లేదండి.. వస్తువుకి యాభై తీసుకుంటారు వాళ్ళు." అని కర్ణుడి చావుకి ఉన్న కారణాల లాగా పెద్ద లిస్టు చెప్పారు. పైగా.." అందుకే పాత వెండి ఎక్స్చేంజ్ లో కూడా తీసుకోవడం లేదు "అన్న చావు కబురు కూడా చల్లగా చెప్పాడు. 'సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటే ఇదే మరి.'. అతని కష్టం మాట సరే.. ఇప్పుడు నా దగ్గరున్న ఆ వస్తువులు వెండివా ,కాదా అని తేలడం ఎలాగా? ఈ నా పీత కష్టం తీర్చే నాధుడెవరు? ఇదో పెద్ద సమస్య అయింది నాకు.
"ఫ్రీగా వచ్చిన వస్తువులకి ఇంత పెద్ద హంగామా ఎందుకు? రోజూ వాడు.. బావుంటే వెండి.. లేకుంటే కాదు "అంటారు తను.. "అబ్బా అది నాకు తెలియదా? అయినా తెలియని విషయాలు తెలుసుకోవడమనే కుతూహలం ఉంది చూసారూ.. అది అంత సామాన్యంగా వదిలేది కాదు.. అంచేత మీకెవరికైనా అసలైన వెండి సామాను కనిపెట్టే విద్యలు, చిట్కాలు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి. ఈ లోపున మా గ్లాసూ, దీపాలు వాటి రంగులు మార్చేసుకుని తమ అసలు రంగులు బయట పెట్టేసుకుంటే మీ చిట్కాలు వేస్ట్ అయిపోతాయి కదా.. అందుకే..
sooper...baga raasaaru
ReplyDeleteచిన్నప్పుడు సైన్సు ప్రయోగాల్లో విశిష్ట గురుత్వం (స్పెసిఫిచ్ గ్రావిటీ) కనుక్కునే పద్ధతి గుర్తున్నదా? అలా చేస్తే సులభంగా తెల్సిపోతుంది, వెండిదో కాదో.
ReplyDeletebhale raasaaru..nijamgaane ee sales choostunte mati potondi
ReplyDeleteనిరు గారు.. థాంక్ యూ..
ReplyDeleteకొత్త పాళీగారూ.. చాలా రోజుల తర్వత మీ కామెంట్ కనిపించింది. ధన్యవాదాలు. మీ సలహానే పాటిస్తాను..
అజ్ఞాత గారూ.. థాంక్ యూ
సుభద్రా,
ReplyDeleteమీ బ్లాగ్ బాగుంది.
మంచి వెండి గాలికి కొద్ది రోజులకి నల్ల బడుతుంది. ఎంత లేకర్ పాలిష్ చేసినా కూడా. మీకు అనుభవం అయే ఉండాలి.. నా కయితే విసుగు వచ్చి దేముడి మందిరం దగ్గర్నుంచీ మార్చేద్దామని చూస్తున్నాను.
మీరు చెప్పిన వైట్ మెటల్(విగ్రహాలు గిఫ్ట్‍లుగా ఇస్తుంటారూ.. అవీ.) ఎప్పటికి నల్లబడవు.. పైగా ఆకారాని తగ్గ బరువు ఉండవు.
వెండి చాలా ఖరీదు కదా.. మరి ఫ్రీగా ఇస్తారా? అనుమానమే!
Manthaa Bhanumathi
nice one !
ReplyDelete