Thursday, August 19, 2010
తర్వాత ఎవరు???
ఆగస్ట్ నాలుగో తేదీన ' టాటా సన్స్" వారు చేసిన ప్రకటన తర్వాత నాతో పాటు అనేకమంది కి తోచిన మొదటి ప్రశ్న ఇది. ఎప్పుడో నూట నలభై రెండేళ్ళక్రిందట ఒక చిన్న మొక్కగా మొదలయి నేడు ఒక మహా సంస్థ గా విస్తరించి ఉప్పు మొదలు కార్లవరకూ అదీ ఇదీ అని లేకుండా అన్నింటినీ ఒకే రకమైన అంకితభావంతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తూ మన దేశానికే మకుటాయమానంగా నిలిచిన సంస్థకి తర్వాత అధినేత ఎవరు? 2012 లో తన 75 ఏళ్ళ వయసులో పదవీ విరమణ చేయడానికి నిర్ణయించిన ఆ మహానాయకుడి ని ఎవరు అనుసరించగలరు? ( అధిగమించడమనే సమస్య ఇంకా రానే లేదు) జే.ఆర్.డీ టాటా నించి 1991 లో పగ్గాలు చేపట్టిన నాటినించీ ఇప్పటివరకూ ఎన్నో విజయాలని తన ఖాతాలో వేసుకుని తిరుగులేని నాయకుడిగా నిలిచిన రతన్ నవల్ టాటా కి నిజమైన వారసుడు ఎవరు అనేవి ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నలు. బోర్డ్ నాయకుడిగా ఎవరిని ఎంపిక చేస్తుంది? దగ్గరబంధువులనా? లేక పార్శీ పరివారాలలోంచి ఒకరిని ఎంపిక చేస్తుందా? ఆ అవకాశం అసలు భారతీయుడిని వరిస్తుందా? లేక విదేశీయులని కూడా పరిగణిస్తారా? ( పరిగణిస్తామని అన్నారు కదా)
శ్రీ రతన్ టాటా ఇప్పటి వరకూ సాగించిన యాత్రలో విజయాలే అత్యధికం. దాదాపు 300 చిన్న చిన్న కంపెనీలుగా ఉన్నా టా టా సామ్రాజ్యాన్ని ఒక పద్దతిగా, ప్రణాళికా బద్ధంగా నిర్మించుకుంటూ, నిర్ణాయాత్మకమైన మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు టాటా సామ్రాజ్యంలో 98 సంస్థలు ఉన్నాయి, వీటిలో భారత దేశంలో సాఫ్ట్ వేర్ రంగంలో మొదటిదైన సంస్థా, కార్లలో రెందో స్థానంలో ఉన్న సంస్థా కూడా ఉన్నాయి. రతన్ టాటా ఏది చేసినా సఫలమే , టా టా వారు ఏది చేసిన సంచలనమే అన్న స్థాయికి సంస్థని తీసుకు వచ్చారు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న నానో కారు రూపొందించడమన్న తన కలని నిజం చేసుకున్నా, అధికంగా విదేశీ కంపెనీలని కొనుగోలు చేసినా ( టెట్ లీ టీ, కోరస్ స్టీల్, జాగ్వార్ లాండ్ రోవర్ వగైరాలు) అది ఆయనకున్న సమర్ధతా, నియమబధ్ధత వల్లనే. ఆయన చేసిన విదేశీ కొనుగోళ్ళు తొలుత ఒకింత మిశ్రమ స్పందనకు గురి అయినా తరవాత లాభాలనే ఆర్జించి పెట్టాయి అన్నది నిజం. ఆయన కున్న ప్రణాళికా బద్ధత, దూర దృష్టి చాలా స్పష్టమైనవి. ఆయన తరవాత అధిపతిగా వచ్చేవారు ఇవన్నీ అంతే చాకచక్యంగా నిర్వహించేవారు అయి ఉండాలి అన్నది నిర్వివాదాంశం.
ఈ విషయం మీద 'ద ఎకానమిస్ట్' పత్రికలో (ఆగస్ట్ 14-20, 2010) లో ఒక వ్యాసం చదివాను. వ్యాసకర్త ఇలా అంటారు.. రతన్ టాటా కి వారసుడిగా వచ్చే వ్యక్తి కొత్త సంస్థలని కొనుగోలు చేసేకంటే ముందు ప్రస్తుతం ఉన్న సంస్థలన్నీ సజావుగా, మెరుగ్గా పనిచేసేటట్టుగా చూడాలి. ఎందుకంటే ప్రజల దృష్టిలో టాటా వారికున్న మంచిపేరుని కొనసాగించడమూ, వీలున్నప్పుడల్లా పెంపొందించడం చాలా ముఖ్యమైన బాధ్యతలు. అంతే కాక టాటా వారు కొనసాగిస్తున్న పలు సామాజిక సహాయ కార్యక్రమాలు అన్నీ సజావుగా కొనసాగేలా చూడాలి. ఇలా అధికారికంగా ప్రకటన చేసి తర్వాత అధినేతని వెతకడం ఒక చక్కని ప్రయత్నంగా అభివర్ణించారు, ఎందుకంటే భారత దేశంలో ఒక అధినేత ఎలా ఎన్నుకోబడతాడన్నది ఎప్పుడూ వెల్లడి కాని రహస్యంగా ఉండిపోతుంది కనక అంటారు. ఇంటర్నేషనల్ బిజినెస్స్ స్కూల్ కి చెందిన కవిల్ రామచంద్రన్ గారు టాటా వారి ఈ పద్ధతిని ఒక సమున్నతమైన సాంప్రదాయంగా కొనియాడాతూ ఇదే పద్దతిని సౌత్ ఈస్ట్ ఆసియా లోని మిగతా దేశాలుకూడా అవలంబిస్తే బావుంటుంది అని అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అవుతారు? అనేది చాల ఉత్సుకభరితంగా మారింది. అంత గొప్ప నాయకుడినీ, " జెంటిల్మాన్ ఎక్స్ట్రా ఆర్డినైర్ " గా ప్రసిద్దుడైన వ్యక్తికి వారసుడవడం అంత సులభం కాదు కదా. అదన్నమాట విషయం.
చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా శివాజి లో ఒక డైలాగ్ ఉంది. " ఆరు తర్వాత ఏడురా, శివాజీ తర్వాత ఎవడురా? అని. ఈ అనువాద సంభాషణ విన్న వెంటనే చాలా విచిత్రంగా అనిపించినా ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది.. ఆరుతర్వాత ఏడు వచ్చినంత సులువు కాదు కదా ఒక గొప్ప నాయకుడి తర్వాత మరొకరు రావడమన్నది.. ఇక్కడ సినిమాలో శివాజీ పాత్రనుద్దేశించి రాసినా, రతన్ జీ వంటి మహానాయకుడి వారసుడిగా పీఠమెక్కడం నిజంగానే చాలా గొప్ప బాధ్యత.. రాగల కాలమే కాగల నాయకుడిని నిర్ణయించాలి.. అంతవరకు.. జయ హో రతన్ జీ..
Subscribe to:
Post Comments (Atom)
హ్మ్మ్... జెమ్షెడ్జీ కుటుంబం నుంచే ఎవరైనా వస్తారేమో లెండీ. ఇంకో రతన్ టాటా ఎవరో వున్నారు కదా ఆ కుటుంబం లోనే? ఆయన కూడా యాక్టీవ్ మెంబర్ ఏమో కదా బిజినెస్ వర్ల్డ్ లో... మీ పోలిక బాగుంది. :-)
ReplyDeleteThank you Bhavana gaaroo.
ReplyDelete