Wednesday, August 18, 2010

తోడుగా నడిచే తోబుట్టువులు.

ఒక అమ్మ పిల్లలందరూ ఒకేలా ఉండరు.. ఎంత అక్కాచెళ్ళెళ్ళయినా, అన్నదమ్ములైనా ఒక్కలా ఉంటారా, ఒక్కటే చేస్తారా? ఇలాంటి మాటలూ, ప్రశ్నలూ మనం తరుచూ వింటూనే ఉంటాము. ఒక చేతివేళ్ళూ ఒక్కలా ఉండవు, ఒక్క తల్లి పిల్లలూ ఒక్కలా ఉండరూ అని కూడా అంటారు. అన్నదమ్ములూ, అక్కచెళ్ళెల్లూ ఒకేలా ఉన్నా లేకపోయినా ఒకే రంగంలో కలిసి రాణించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పైన చెప్పిన ప్రశ్నలని గురించి ఆలోచిస్తుంటే ఈ ఆలోచన వచ్చి అలాంటివారిలో కొందరిగురించి రాయాలని అనిపించింది. ఇది చదివి మీరు కూడా కొన్ని ఉదాహరణలు చెప్తే బావుంటుంది. ముందుగా సంగీతరంగాన్ని ప్రస్తావిస్తాను. తొలుతగా కర్నాటక సంగీతరంగం.

1. హైదరాబాద్ బ్రదర్స్ : కర్నాటక సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన హైదరాబాద్ బ్రదర్స్ గా ప్రసిద్ధులైన డి. శేషాచారి, డి. రాఘవాచారి గార్లు దేశ విదేశాలలో అనేక కచేరీలు చేసిన విద్వాంసులు. ఏన్నో అవార్డులనీ, రివార్డులనీ అందుకున్నారు. తొలుత వారి తండ్రిగారైన లేటు సంగీత విద్వాన్ శ్రీ. రామానుజాచార్యుల వారివద్దా, తల్లిగారైనా శ్రీమతి సులోచనాదేవి గారి వద్దా శిక్షణ ప్రారంభించి తరవాత వారు తమదైన ప్రత్యేక శైలిని అవలంబించి ఎంతో ప్రాచుర్యాన్ని పొందారు.

2. హైదరాబాద్ సిస్టర్స్: హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధులైన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ కూడా ఎంతో పేరు గలిగిన సంగీత కళాకారిణులు. వీరు లేటు శ్రీ టీ. పద్మనాభన్ గారి దగ్గర శిక్షణ పొందారు, దేశంలో అన్ని ప్రముఖ సభలలోనూ, విదేశాలలోనూ కూడా ఎన్నో కచేరీలు నిర్వహించారు. మన తెలుగు తేజం శ్రీ రామ చంద్ర వీరిలో హరిప్రియగారి శిష్యుడు కూడా.


హైదరాబాద్ సిస్టర్స్



3. బాంబే సిస్టర్స్: శ్రీమతి శీ. సరోజ, శ్రీమతి శీ. లలిత గార్లు కూడా చాలా ప్రముఖులైన సంగీత విద్వాంసులు. వీరు హెచ్. ఏ. ఎస్ మణీ, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన వారి వద్ద విద్యనభ్యసించారు. అనేక కచేరీలు చేసారు.

బాంబే సిస్టర్స్


4. శూలమంగళం సిస్టర్స్: శూలమంగలం జయలక్ష్మి, రాజ్యలక్ష్మి గార్లు శూలమంగలం సిస్టర్స్ గా, యుగళ గానానికి ( ఇద్దరు చేసే కచేరీలకి) ఆద్యులుగా చెప్పబడతారు. వీరిద్దరి బాటలోనే ఆ తరవాత రాధా-జయలక్ష్మి ( కజిన్స్), బాంబే సిస్టర్స్ మొదలైన వారు పయనించారు అని చెప్పుకోవచ్చు.

శూలమంగళం సిస్టర్స్


రాధా-జయలక్ష్మి


5. రంజని- గాయత్రి: ఈ ఇద్దరు సోదరీమణులు వోకల్ మరియూ వయొలీన్ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్ నుంచే వీరిద్దరూ వయొలీన్ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవాయిద్యంగా కూడా వయోలీన్ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు.

రంజని- గాయత్రి


6. ప్రియా సిస్టర్స్: ఫ్రియా సిస్టర్స్ గా సుపరిచుతులైన హరిప్రియ, షణ్ముఖప్రియ కూడా ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు. రాధా-జయలక్ష్మి గార్ల శిష్యులైన వీరిద్దరూ కూడా చిన్ననాటినించే ప్రతిభ కనపర్చిన వారు. వీరు ఇప్పుడు టీ. ఆర్ సుబ్రమనియం గారి శిష్యులు. ప్రియా సిస్టర్స్ కూడా ఎన్నో కచేరీలు చేసి ప్రశంసలూ, పురస్కారాలూ పొందారు.

ప్రియా సిస్టర్స్



7.మల్లాది బ్రదర్స్: మల్లాది శ్రీరాంకుమార్, మల్లాది రవికుమార్ మల్లాది బ్రదర్స్ గా ప్రసిద్దులు. మొదట వారి తాతగారూ, తండ్రిగార్ల దగ్గర శిక్షణ ప్రారంభించిన వీరు తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారు, వోలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీపాద పినాకపాణి గారు వంటి మహానుభావుల వద్ద విద్యాభ్యాసం చేసి త్యాగరాజ కృతుల ఆలాపనలో ప్రముఖులుగా నిలిచారు. ఎన్నో కచేరీలు చేసారు.


మల్లాది బ్రదర్స్



8. మైసూర్ బ్రదర్స్: సుప్రసిద్ధ వయొలీన్ విద్వాసుంలైన శ్రీ. మంజునాధ్, శ్రీ. నాగరాజ్ అత్యంత పేరు ప్రఖ్యతులు కలిగిన వయొలీన్ విద్వాసులు. వీరి ప్రతిభగురించి కానీ, వారి ప్రత్యేకతలని గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తినార్జించిన ప్రముఖులు వీరు. కలిసి ప్రదర్శనలిస్తూనే, ప్రముఖులకి పక్కవాయిద్య సహకారాన్ని కూడా అందిస్తారు.

మైసూర్ బ్రదర్స్



9.మాండలీన్ సిస్టర్స్: మాండలీన్ మీద సురాగాలు పలికించే ఈ ఇద్దరు చిన్నారులు శ్రీఉష, శిరిష అనతికాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు.


మాండలీన్ సిస్టర్స్


10.రుద్రపట్నం బ్రదర్స్: రుద్రపట్నం బ్రదర్స్ గా ప్రముఖులైనా ఆర్.ఎన్. త్యాగరాజన్, ఆర్. ఎన్ తారానాథన్ గార్లకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరు ప్రముఖు విద్వాసులవద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు. వారిలో ప్రముఖ వయోలీన్ విద్వాసుంలు శ్రీ. టీ. చౌడయ్య గారు కూడా ఉన్నారు. మూడు తరాల సంగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ప్రముఖులు వీరిద్దరూ.

రుద్రపట్నం బ్రదర్స్


వీరు మచ్చుకి కొందరు మాత్రమే. ఇంకా ఎందరో ఇలాంటి వారు ఉన్నారు. ప్రతిభావంతులైన బిడ్డల వల్ల తల్లి తండ్రులకి కలిగే ఆనందమూ, గౌరవమూ ఎంత ఆహ్లదాన్ని కలిగిస్తాయో మనందరికీ తెలుసు. అది ఒకటికి రెండితంలైతే.. ఆ భావాన్ని చెప్పడానికి మాటలుండవేమో.. వీరి తల్లితండ్రులు నిజంగా ధన్యులు..


వీరిలో కొందరిని ప్రత్యక్షంగా చూసే అవకాశమూ, వారి అమృతగానాన్నీ, వాయిద్య విన్యాసాలనీ వినగలిగే అదృష్టం మాకు దొరకడం నిజంగా గొప్ప వరం.


ఇతరరంగాలలోని ప్రముఖ అక్కచెళ్ళెళ్ళూ, అన్నదమ్ముల గురించి మరొక టపాలో. ఇక్కడ నేను ప్రస్తావించని కళాకారులగురించి తప్పకుండా చెప్పండి.

5 comments:

  1. classical musicians పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ప్రసీదగారు.

    Hearty Welcome to 'Blogger'

    ReplyDelete
  2. మీ కొత్త బ్లాగిల్లు భలే ఉందండి. కానీ ఇదే పేరు తొ ఇంకొకరు వ్రాస్తున్నారు.
    ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఎలా?

    ReplyDelete
  3. @ నిహారిక
    ఇదే పేరు తో మరో బ్లాగు మొదలెడితే సరి

    ReplyDelete
  4. ఒకేఒక పోలిక (అదే తోబుట్టువులు) గల గొప్ప సంగీతవిద్వాంసుల గురించి బాగా వివరించారు.

    ReplyDelete
  5. నీహారిక గారూ. వర్డ్ ప్రెస్ లో ఇదే పేరుతో రాసేది నేనే. అప్పుడెప్పుడో బ్లాగర్లో కూడా ఒకటి ఒపెన్ చేసినట్టు గుర్తు ఉంది, మరి అది నేనేనో కాదో? :). అందుకె ఇప్పుడు ప్రసీద1 అని ఇచ్చాను. నా అసలు పేరు వేదుల సుభద్ర
    నాగార్జునగారూ.. ఠాంక్ యూ..
    శ్రీలలిత గారూ.. ధన్యవాదాలు

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...