Friday, September 17, 2010

జాలిగా జాబిలమ్మా..



        మనసులో   నాలుగు కాలాలపాటు నిలిచిపోయేది మంచిపాట అనుకుంటే ఎప్పుడు గుర్తు వచ్చినా కళ్ళనే కాదు మనసుని తడిమేదీ, తడిపేది.. గొప్ప పాట. అలాంటి గొప్ప పాటలు మాత్రమే రాయగలిగే  ఒక కలం.. ఆ కలం పట్టే ఒక చెయ్యి.. ఆ చేతిని ఎప్పుడూ , ఎల్లప్పుడూ సరి అయిన దిశలో మాత్రమే నడిపించే ఒక  సాహితీ మూర్తి.. సొంత పేరు కాకపోయినా పాటల వెన్నెలలూ, మాటల మిల మిలలూ కురిపిస్తూ,  పొందిన ఆ   పేరుకే  కళనీ, కాంతినీ, వెన్నెలంత చల్లదన్నాన్నీ, అపారమైన గౌరవాన్నీ  ఆపాదించుకున్న  ఆ  వ్యక్తి 'శ్రీ సిరి వెన్నెల.'   ఆయన కలంలో ఒదగని భావం లేదు.. ఆ ఇంకులో ఇంకని మధురిమ  లేదు..ఎంతమంది  ఎన్ని రకాలుగా  రాసినా, కీర్తించినా  ఇంకా  ఇంకా చెప్పుకోడానికి మరెంతో మిగిలి ఉన్న అసమాన  ప్రతిభా మూర్తి ఆయన . అందుకే ఈ టపా.  ఈ సాహితీ చంద్రునికో నూలుపోగు..
            " శ్లేషా మాత్రంగానైనా అభ్యంతరకరమైన పదాలుండవు శాస్త్రి గారి పాటల్లో "అని శ్రీ బాలు గారు ఎప్పుడూ చెపుతూ ఉండే మాట ఎంత నిజమో ఆయన రాసిన ఏ పాటైనా చెప్తుంది. అంతే కాదు.. కత్తికి  మహా ఉంటే రెండు వైపులా పదును ఉండవచ్చు  కానీ  కలానికీ, కవి హృదయానికీ అన్ని వైపులా పదునే అంటుంది ఆయన కలం. అందుకే  ఒక పాటలో 'తరలి రాద  తనే వసంతం.. తన దరికి రాని వనాలకోసం" అని  అంటే.. "అదుపెరుగని  ఆటలాడు వసంతాలు వలదంటే విరి వనముల పరిమళముల విలువేముందీ?" అంటారు మరొక పాటలో.   . పరస్పరం విభిన్నంగా అనిపించే భావాలని అందంగా రాసి నిజమే కదా అనిపించి ఒప్పించా గలగడమే   ఆయన  గొప్పతనం.
              మూడు నిమిషాల చిన్న పాటలో చిత్ర కధ మొత్తం ఇమిడ్చి,  జీవిత కధలా వినిపించీ, వినగానే అలరించి.. కళ్ళని ఎడిపించీ  మనసుని కదిలించగలిగే ఒక గొప్ప  పాట గురించే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది. శాస్త్రి గారు రాసిన ఎన్నో వందల అధ్బుతమైన పాటల్లోంచి  ఈ పాటనే నేను ఎంచుకోవడానికి ఇదే ముఖ్య కారణం. కళా తపస్వి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతి కిరణం' చిత్రం లో ఒక పాట గొప్పదీ, మరొకటి కాదు.. అని ఎంచడం పెద్ద దుస్సాహసం. అయినా ఈ పాటలో ఇమిడిన భావం, అనుభూతి ఎందుకో నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి.. ఇది నిజంగా ఒక  హాంటింగ్ మెలోడీ. 

                  "జాలిగా జాబిలమ్మా.. రేయి రేయంతా రెప్పవేయనే లేదు ఎందు చేతా. ఎందు చేతా..
                  పదహారు కళలనీ పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేతా.". అంటారు పల్లవిలో..

              జాలిగా  చూస్తూ జాబిలమ్మ రాత్రంతా నిదరపోలేదుట.. ఎందుకంటే పదహారు కళలని తనలో నింపకుండా తీసుకుని వెళ్ళిపోయే కృష్ణ పక్షం  తన ఎదలో చిచ్చు పెట్టడం వల్లనట. ఇక్కడ జాబిలమ్మ అంటే అద్భుతంగా పాడే బుల్లి గంధర్వుడు 'గంగాధరం', కృష్ణ పక్షం మరెవరో కాదు అతని  'గురువుగారు.' శర్మ గారు . వారు పెట్టిన చిచ్సు, ఆయన వయసుకు తగని,  ఏ మాత్రమూ ధర్మం కాని అసూయ. సంధర్భానీ, భావాన్ని ఇంతకంటే పొందికగా చెప్పడం సాధ్యమా? ఈ చిన్నారి జాబిలమ్మ తన వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది, "పెద్దవారు ఎదగకుండా చిన్నపిల్లల్లా  ప్రవర్తిస్తే  పిల్లలు పెద్దవారవుతారేమో".. అందుకే మొదటి చరణంలో తన తల్లి కాని తల్లికి ధైర్యం చెపుతాడు ఇలా..

                            " కాటుక కంటి నీరు.. పెదవుల నంటనీకు.. చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు..
                               నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెపుతున్నా. నీ కుంకుమ కెపుడూ పొద్దు గుంక దమ్మా.."

            కాటుక కంటి నీరు పెదవుల నంట నీయవద్దమ్మా. నీ మొహాన దీప కళిక లా   వెలిగే చిరునవ్వు చిన్నపోకూడదు. అంటూనే ఆ ముఖానే వెలిగే మరో దీపం, ఆ తల్లి నుదిట కుంకుమ  ఎప్పుడూ అస్తమించ దమ్మా అంటాడు.. గురువు గారు ఎప్పుడూ చల్లగా ఉండాలి.. ఉంటారు అని అనునయిస్తాడు.  గురువుగారి దారికడ్డం రాకుండా తానే తప్పుకోవాలి అనుకున్న తన నిర్ణయాన్ని చెప్పకుండానే చెప్తాడు, ఇదే మాటని రెండో చరణంలో మరింత స్పష్టంగా చెప్తాడు . 'నీ బుజ్జి గణపతినమ్మా .. అమ్మవైనా నిన్ను బుజ్జగిస్తున్నా' అని అ తల్లి కాని తల్లిని అనునయిస్తాడు. ఇక్కడ 'గణపతిని 'అని ఎందుకు అన్నారో మనసు కరిగేలా రెండో చరణంలో చెప్తారు శ్రీ సిరివెన్నెల..

                        సున్నిపిండిని నలిచి చిన్నారిగా మలచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి.
                        సుతుడన్న మతి మరిచీ, శూలాన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చు కంటి పెనిమిటి..

         ఈ రెండు పంక్తులు చాలు మొత్తం కధనీ, పాత్రల వైఖరిని మనముందు ఉంచడానికి. తన కొడుకు కాకపోయినా భర్తని ఒప్పించి దత్తత తీసుకుని,  ప్రతిభావంతుడైన ఆ బిడ్డని చూసుకుని మురిసిపోతుంది ఆ తల్లి, గురువు గారి భార్య.  అచ్చం తన వంటి నలుగు పిండికి ప్రాణం పోసిన పార్వతీదేవి లాగే.  తనకు పుట్టినవాడు కాకపోయినా ధార్మికంగా, వేదోక్త ప్రకారంగా తనవాడిని చేసుకున్న బిడ్డ మీద కూడా అలవి కాని అసూయని పెంచుకుని, అందరి జీవితాలనీ దుర్భరం చేసి  'పెద్దరికం' చూపించే గురువు.. 'చిచ్చు కంటి పెనిమిటి ' అన్న పద ప్రయోగం ఎంత   గొప్పగా ధ్వనిస్తుందో ఇక్కడ.. అక్కడ సదాశివుడు నిజంగానే చిచ్చు కన్ను ఉన్నవాడే.. ఇక్కడ ఆ కన్ను లేకుండానే అందరి మనసుల్లో చిచ్చు పెట్టగలవాడు, తండ్రే మరి .

                      ప్రాణ  పతి నంటుందా  . బిడ్డ గతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో ఇది కన్నీటి చితి
                      కాల కూటం కన్నా.. ఘాటైన గరళ మిదీ... గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
                     ఆటు పోటు నటనలివీ, ఆట విడుపు ఘటనలివీ ఆది శక్తివి నీవు.. అంటవు నిన్నేవీ
                     నీ బుజ్జి గణపతినీ బుజ్జగించీ చెపుతున్నా. కంచి కెళ్ళి పోయేవే కధలన్నీ..

              ఈ నాలుగు లైన్లలో బుజ్జి గణపతీ, అతని పెంపుడు తల్లీ పడే వేదన కనిపిస్తుంది..రెండు కళ్ళలాంటి ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏ మాత్రం హాని జరిగినా తల్లడిల్లిపోయే ఆమె స్త్రీ  హృదయమూ..  ఎంత గొంతు నులిమే విషమైనా    ఇవి ఎవరూ కావాలని చేసేవి కాదు.. జీవితంలో మాములుగా వచ్చే ఆటు పోట్లు మాత్రమే..  అంటూ ధైర్యం చెప్పే చిన్నారి తనయుడి గొప్పతనమూ మనల్ని పలకరిస్తాయి. అయినా   ఆది శక్తి రూపమైన అమ్మవు నువ్వు. నీకు ఇవేవీ అంటవు తల్లీ .. ఇందులో నువ్వు కేవలం నిమిత్త మాత్రురాలవు.. అంటూ..  అనునయంగా బుజ్జగిస్తూనే తన కధ కంచికి వెళ్ళిపోతోంది అని సూచిస్తాడు.

పాట పూర్తి అయ్యేసరికి ఎన్ని సార్లు విన్నా, మనవి  కాటుక కళ్ళైనా, కాకపోయినా వాటిల్లో  కన్నీరు వచ్చి చేరడం తధ్యం..పని కట్టుకుని పిలనక్కరలేదు..  చాలా సాధారణంగా కనిపించే అసాధారణమైన పాట ఇది.
             జాబిలమ్మ జాలిగా చూస్తూ చిన్నపోయినా. ఆ వెన్నెలల కళలని కృష్ణ పక్షం మింగేసినా శాస్త్రి గారి కలం మాత్రం వెన్నెలలే కురిపిస్తుంది.. ఎందుకంటే  ఎన్నటికీ గ్రహణం లేని వెన్నెలే మన  సిరివెన్నెల కనక.
             కళా తపస్వి దర్శకత్వం లో వచ్చిన ఈ స్వాతి కిరణం చిత్రంలో అన్ని పాటలు వెన్నెల కిరణాలే.. మణి  పూసలే.. పాటలకి ప్రాణం పోస్తూ స్వరపరిచారు 'గ్రహణం ఎరుగని మరో ఛంద'మామ' ' శ్రీ. మహదేవన్.. శ్రీమతి వాణీ జయరాం సుమధురంగా పాడారు. మమ్ముట్టీ, రాధికా, బాలనటుడు మంజునాథ్  తమ తమ పాత్రలకి ప్రాణం పోశారు.. 

            

16 comments:

  1. చాలా బాగా రాశారు. ఆయన మనసు గురించి చిన్న చిన్న పదాలతో ఎంతో లోతైన భావం చెప్తారనడాని ఈ మాటలే ఉదాహరణ
    "మనసా ఎందుకె కన్నీరు
    మన కోసం ఎవరున్నారు
    కలగనమని ఎవరన్నారు
    కరిగితె ఎవరేం చేస్తారు"

    ReplyDelete
  2. Naaku chala istamina song.....kanee vinnappudu manasu hurt outhundhi.....he mean it.

    ReplyDelete
  3. చాలా బాగా వివరించారు. ఎంతో ఔచిత్యంతో వ్రాసిన పాట. సిరివెన్నెల గ్రేట్.

    ReplyDelete
  4. శిశిర గారూ.. థాంక్ యూ. మీరన్నది నిజం.. ఏ పాట రాసిన ఎంత గొప్ప పాటో అనిపించేలా రాయడం ఆయన గొప్పతనం. కలగనమని ఎవరన్నారు? కరిగితె ఎం చెస్తారు?
    అజ్ఞాత 1 గారూ. మనసుని తడుతుంది కనకే ఈ పాట వినగానే హృదయం బరువెక్కుతుంది.. స్పందించినందుకు ధన్యవాదాలు.
    అజ్ఞాత 2 గారూ.. థాంక్ యూ.. మీరు చెప్పింది నిజం..

    ReplyDelete
  5. excellent song.... SVSR sastry garu sandharbhaniki tagattu raayatamlo ayanaki ayane saati...delicate situation ki athi samanyamaina bhasha lo...manasuku hattukunelaa rastaaru....very touching song..

    mouna

    ReplyDelete
  6. అద్భుతమైన పాటని అందంగా పరిచయం చేయటానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
    psmlakshmi

    ReplyDelete
  7. చాలా మంచి పాట . నాకు కూడా చాలా ఇష్టమీపాట .విన్న ప్రతిసారి కొత్తగా మనసు భారమౌతుంది .

    ReplyDelete
  8. Very good song. one of all time great lyrics from Sirivennela

    ReplyDelete
  9. This is very good songs.

    This song discribes the "Paravathi" real sacrifice and struggel. This is more pain to bear than vemon.

    Every one will give support to "parvathi" after listening this song.

    In vinayaka story parvathi is the main character and deserved person.

    That why I like very much. One more siva song is there in this movie

    i.e "Sankara sankinchaku ra Onka Jabli channethhuku, Nilakada nerugani gangani eli, vishabhu naagulanu medaku chuttukani, aeee onka leni naa vanka" etc.

    Those words on lord siva is excellent.

    Thanks for the nice post

    ReplyDelete
  10. పి.ఎస్.ఎం లక్ష్మి గారూ, మాల గారూ.. లక్ష్మణ్ గారూ, అజ్ఞాత గార్లూ.. చదివి స్పందించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు..

    ReplyDelete
  11. Excellent vivarana.... chala baga vrasaru. Thanx for this.

    ReplyDelete
  12. Subhadra garu,

    chala baga rasarandi. mee blog chusaka inka chadavakunda undalekapoyanu. naku kuda swathikiranam lo patalu chala istam.anni animutyalu meerannattu. mee vivarana chadivedaka antha deep ga alochinchaledu. kani chadivka... hats off to sri sirivennela..

    ReplyDelete
  13. @అజ్ఞాతగారూ.. థాంక్ యూ..
    @కిరణ్మయిగారూ.. థాంక్ యూ.

    ReplyDelete
  14. చాలా చక్కని వివరణ ఇచ్చారు. సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతీ పాట ఆణిముత్యమే. చిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని పలికించే పాటలు రాయడం సీతారామ శాస్త్రి గారి గొప్పదనం. అరంగేట్రం తోనే తన పాట గొప్పదనాన్ని తెలుగు జాతికి చాటి చెప్పిన మహానుభావుడు సీతారామ శాస్త్రి గారు. ఇంకా ఎన్నో మంచి పాటలు ఆయన రచించాలని కోరుకుంటూ......

    ధన్యవాదములు.

    ReplyDelete
  15. చాలా చక్కని వివరణ ఇచ్చారు. సీతారామ శాస్త్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతీ పాట ఆణిముత్యమే. చిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని పలికించే పాటలు రాయడం సీతారామ శాస్త్రి గారి గొప్పదనం. అరంగేట్రం తోనే తన పాట గొప్పదనాన్ని తెలుగు జాతికి చాటి చెప్పిన మహానుభావుడు సీతారామ శాస్త్రి గారు. ఇంకా ఎన్నో మంచి పాటలు ఆయన రచించాలని కోరుకుంటూ......

    ధన్యవాదములు.

    ReplyDelete
  16. చాలా ధన్యవాదాలు హవిధర గారు..

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...