Monday, July 9, 2012

ఈగ..ఈగ...ఈగ.. యముడి మెరుపు తీగ...

ఈగ..ఈగ...ఈగ.. యముడి మెరుపు తీగ...                         

నాకెందుకు ..నచ్చిందంటే 

        ఇది   తెలుగు చిత్ర పరిశ్రమని ఒక మలుపు తిప్పేసే కధ .. ఇన్ని రోజులూ నేను దీనికి మలుపులూ,  తలుపులూ, కిటికీలు.. చేరుస్తూ .మారుస్తూ ఉన్నాను.. ఇంత  ఆలస్యంగానైనా ఇది వెండి తెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉంది అని భీభత్సమైన డైలాగులు చెప్పలేదు కధా రచయత. 
   ఈ కధ వినగానే తనువంతా పులకరించి,  కనులు చెమరించి, ఎమోషన్ వర్షించింది. ఇన్ని రోజులు ఇలాంటి కధ చెప్పలేదేం?  అని దర్శకుడి మీద అలిగేసి, మీద పడి రక్కేసి   వెంటనే ఓకే చెప్పేసాను అని హీరో  ఓవర్ యాక్షన్ చెయ్యలేదు. ఇందులో నాది చాలా 'బబ్లీ అండ్ లవబల్ కారక్టర్' అని వచ్చీరాని ఇంగ్లీష్ లో పరమ రొటీన్ గా హీరోయినూ అనలేదు. ఇవి  నచ్చాయి నాకు.
 హీరోయిన్ ని ఇష్టపడే విలన్ హీరోని చంపేస్తే ఆ అబ్బాయి ఈగ గా మారి విలన్ మీద పగ తీర్చుకోవడమే కధ అని సింపుల్ గా ఒక లైన్ లో సినిమా మొదలుపెట్టినప్పుడే చెప్పేసాడు దర్శకుడు. ఈ సింప్లిసిటీ నచ్చింది... దాన్ని ఎలా తీస్తాడో అని దర్శకుడు  S.S.Rajamouli    వివిధ వర్గాల ప్రజలలో పెంచిన క్యూరిసియాటి నచ్చింది..
   ఇక అప్పటినించి ' ఈగ పగ తీర్చుకోవడమేమిటి??'  ఎలా ?తీర్చుకుంటుంది ? అనుకున్నవాళ్ళున్నారు , దానికన్నా ఇతనికేమైనా పిచ్చా ? వరసగా సినిమాలు హిట్ అవుతుంటే సంతోషంగా దాన్ని నిలబెట్టుకోక తీరి కూర్చుని చేతులు కాల్చు కుం టాడా ?అని పెదవి విరిచిన .వాళ్ళున్నారు.  రాజమౌళి ఏది చేసినా బాగా చేస్తాడు అని నమ్మకంగా ఉన్నవారూ ఉన్నారు.
   కధ  కన్నా ఎక్కువగా కధనాన్ని, ఎలాంటి కధ అయినా ప్రేక్షకులని తనతోటి తీసుకుని వెళ్ళగలిగితే అది ఎఫ్ఫెక్టివ్ గా కధ చెప్పడం అని నమ్మిన దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. అది ఎక్కడా ఓవర్ కాన్ఫిడెన్స్ గా  కనిపించకుండా జాగ్రత్త పడటం నచ్చింది..
నయాపైసంత నటన రాకపోయినా, నట వారసత్వం పేరుతోనూ, గ్లామర్తోనూ తొడగొట్టడాలూ,  పడగొట్టడాలూ అన్న ప్రాస డైలాగులతోనూ  ఇరవైయ్యేసి, పాతికేసి సంవత్సరాలు పింక్ స్లిప్ ఎరగని గవర్నమెంట్ ఉద్యోగుల్లా పని  చేసుకోస్తున్న హీరోలూ, చిత్ర పరిశ్రమ అంటే తమ సొంత పరిశ్రమ అనుకుంటూ సొంత వ్యాపారం లో దిగినట్టు రోజుకోకరుగా దిగుతున్న నవ వారసుల మధ్య 'కొత్త గాలి'' లా కనపడే హీరో నచ్చాడు.  కనిపించిన ఇరవై నిమిషాలూ అతని సహజమైన నటనా, చక్కటి చిరునవ్వూ , బాడీ లాంగ్వేజ్ నచ్చాయి. మొదటగా అష్టాచెమ్మా లో చూసినప్పుడే ఈ అబ్బాయి లో మంచి ఈజ్ ఉంది.. సరియిన సినిమాలు దొరకితే మంచి నటుడవుతాడు అనిపించినది సరి అయిన అభిప్రాయమే అని మళ్ళీ  అనిపించడం నచ్చింది. ఇంటర్మీడియేట్ చదువుతున్న పక్కింటి చిన్న పిల్లలా తిరుగుతూ పాత్రకి తగ్గట్టుగా నీట్ గా, క్యూట్ గా  ఉన్న హీరోయిన్ నచ్చింది.

జంతువులూ పగ పడతాయా?  అంటే విఠలాచార్య సినిమాల లో కాకుండా నిజ జీవితం లో ? 
ఈగ కి అంత బలం ,తెలివి ఎలా వచ్చాయి?
 ఒక్క మాట మాట్లాడలేకపోయినా చెట్టంత మనిషిని ఎలా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టగలదు? 
 బొత్తిగా లాజిక్ ఉండద్దా? అన్న ..ప్రశ్నలకి... 

ఓ నా మనసా!! ఏమంటివి?  ఏమంటివి?? మామూలు మాస్ మసాలా సినిమాలలో, అదీ మన తెలుగు సినిమాలలో లాజికా?? ఎంత మాటా?? ఎంత మాటా?? 
లాజికా   సినిమా హిట్ అవుతుందా, లేదా? .అని  నిర్ణయించునది. కాదూ,  కాకూడదూ .. కాదందువా ??
వందలమందిని ఒంటి చేత్తో ఒక మానవుడు కొన్ని సార్లు ఒక చిన్నవాడు  కేవలం హీరో అన్న పేరున్నందున  మట్టి కరిపించుట లో ఉన్న లాజిక్ ఎంత??
కదిలే రైలుని ఆపేయడాలూ,  పదో,  పాతికో జీపులని మూడో కంటికి తెలియకుండా నేలలో పాతి విలన్ తో వాదన చేసే టైములో ఒక్క దెబ్బతో వాటిని ..తాడెత్తున లేపడాలూ.. వీటిలో ఉన్న లాజిక్ ఎంత?
ఈ క్షణం హైదరాబాద్ లో డైలాగ్ చెప్పి,  మరుక్షణం స్విట్జర్ లాండ్ లో పాట  పాడేసే  సందర్భం లో ఉన్న లాజిక్ ఎంత??
పంచ్ డైలాగు ల పేరిట 'వంశాలనీ', ఆ 'వంశాకురాలనీ' కేవలం సినిమా నటులుగా మాత్రమే కాకుండా తెరవేల్పులుగా,  ఇలవేల్పులుగా జనం భావించడం లో ఉన్న లాజిక్ ఎంత??
ఇలా చెప్పుకుంటూ ..పొతే తెలుగు సినిమా ఏనాడో లాజిక్ రహితం అయినది,  కాగా నేడు లాజిక్,  లాజిక్ అన్న వ్యర్ధవాదమెందుకు? 
 అని అన్నగారి స్టైల్ లో నాకు నేనే సమాధానం ..చెప్పుకున్నాను చూసారూ!  అది.. అబ్బో!  నాకు చాలా నచ్చింది.. ఇలాంటి సినిమాలో ,లాజిక్  లేకపోయినా కొన్నిచోట్ల కొద్దిగా ఆ లేకపోవడం మరీ  ఎక్కువ అయిందేమో అనిపించినా పెద్ద నష్టమేమీ లేదు.. మన ఎంటర్తైన్మెంట్ కి లోటేమీ ఉండదు.
   'వంద మాటలకన్న పది చేతలు మిన్న' అని నమ్మిన మన సెకండ్ హాఫ్ హీరో అదేనండీ మన ఈగ మాట్లాడలేకుండానే  తెలివిగా విలన్ ని ఇబ్బంది పెట్టడం నచ్చింది.  సిని మాటోగ్రఫీలూ,  స్క్రీన్ ప్లే లు లాంటి పెద్ద మాటలు నాకు  తెలియవు కానీ, ఈగ పగని తమ పగగా పిల్లలూ,పెద్దలూ భావించి అది వేసిన ప్లాన్ లకి పగలబడి నవ్వడమూ, మనుషులని ఎడంచేత్తో చంపేస్తున్నాడు కదా ఇంత  చిన్న ఈగ కి భయ పడతాడేం ? ఇంత  అమాయకుడా ? అని విలన్ మీద  జాలి పడటం, 'ఈగను చంపేంత సీను నీకు లేదమ్మా'  అంటూ ఈగ గెలిచిన  ప్రతీ సీనులోనూ కేరింతలు .కొట్టడం నచ్చింది. 
        ప్రతీ సీన్ మూడ్ కి తగ్గట్టు, అది ఎలివేట్ అయ్యేట్టు సమకూర్చిన సంగీతం  చాలా నచ్చింది.. కీరవాణి సింప్లీ సూపర్బ్. 'చంపేస్తా...లాంటి మ్యూజిక్ బాక్ గ్రౌండ్ లో వస్తూ ఉంటే  ఎందుకో  మాయాబజార్  లోని   'కోర్ కోర్ శరణు   కోర్' గుర్తొచ్చింది.  మేజిక్ చేసిన   చాలా మంచి బాక్ గ్రౌండ్  మ్యూ జిక్.
     తనకన్నా బలవంతుడు, తెలివైన వాడు హీరోగా (కనీసం తెర మీద) ఉంటే అతనికి సమ ఉజ్జీగా రాణించే విలన్ గా నటించడం వేరు. తన చిటికెన వేలి గో రంత ఉన్న చిన్న కీటకం తన  చుట్టూ తిరుగుతూ,ముప్పు తిప్పలు పెడుతూ పిచ్చేక్కిస్తున్నట్టుగా ఉండే సన్నివేశాలకు తగ్గట్టుగా,  లేని ప్రత్యర్ధిని ఊహించుకుంటూ నటించడం చాలా కష్టం . ఇంచుమించు ఏక పాత్రాభినయం లాంటిది. అలాంటి పాత్రలో నూటికి రెండు వందల పాళ్ళు జీవించిన సుదీప్ నటన చాలా, చాలా నచ్చింది.. చక్కని రూపం, గంభీరమైన వాచకం ( కొద్దిగా కన్నడ యాస ఉండవచ్చు  గాక), పవర్ఫుల్ స్క్రీన్ ప్రేసేన్స్ ,  అన్నింటినీ మించి  నటన  వెరసి ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేసిన సుదీప్ అభినయం అబ్బో!  చెప్పలేనంతగా  నచ్చింది.. ఆయన నటన వల్లనేమో కొన్ని సార్లు విలన్ పాత్ర ఈగ వల్ల ఇబ్బంది పడుతుంటే పాపం అనికూడా అనిపించింది. సినిమాకి ఇతనో హీరో.. రెండో సగం కొద్దిగా  సాగినట్టు అనిపించినా అది సుదీప్ నటన వల్లనే పరవాలేదులే, మరీ అంత సాగతీత .కాదులే అనిపిస్తుంది. చాలా స్టైలిష్ గా  ఉన్నాడు కూడా.
     మనకు తెలియనికధా  కాదు, ఊహాతీతమైన ముగింపూ కాదు... ఉన్నదల్లా మామూలుగా సాగే మన ఊహల కందకుండా  ఈగ ప్లాన్ లు వెయ్యడమూ,   హీరోయిన్ సాయంతో వాటిని అమలుపరచడమూ చివరకు అనుకున్నది సాధించడమూ నచ్చింది...మొత్తమ్మీద సినిమా బావుంది. చివరలో  ఈగ చేత చిరంజీవి వీణ స్టెప్సూ, రవితేజ జింతాత దరువులూ, జూ. ఎన్.టీ.యార్ డాన్సులూ కూడా  వేయిస్తుంటే, వాటిని చూసి  విరగబడి నవ్వుతున్న పిల్లలని, వాళ్ళని చూసి ఆనందపడుతున్న పెద్దవాళ్ళనీ చూస్తే.. ఫామిలీ అందరికీ నచ్చిన సినిమా అనిపించడం నచ్చింది. 

 ఈ సినిమా Super Success కి మూడు S లు  కారణం అనుకుంటాను నేను.. తెలుగు తెరమీదే  ఇంటర్నేషనల్ స్థాయి Special effects, తన పాత్రకీ , కధనానికీ ప్రాణం పోసిన విలన్- హీరో Sudeep, తను నమ్మిన దానిని చిత్తశుద్ధి తో, తన అనుచరగణంతో ( Team) తో కలిసి అనితరసాధ్యంగా ఆచరించి చూపించే S.S. Rajamouli. అందుకే ఆయన పేరులోని S.S. కి Supremely Successful అని భాష్యం ..చెప్పుకోవచ్చేమో ..

PS: కొత్త తెలుగు సినిమాలు వచ్చిన  వెంటనే  సినిమా హాల్ కి వెళ్లి చూసే అలవాటు లేనే లేదు, ఇంకా రివ్యూలు . కూడానా? మన బ్లాగ్ మిత్రులు  నీలం రాజ్ కుమార్ లాంటి వారు చక్క గా   రాస్తే,  నవ్వు కుంటూ చదివేసి, ఆ తర్వాతెప్పుడో వీలున్నప్పుడు టీవీ లో చూడడమే. సినిమా  బావుంది కదా అని సరదాగా రాసినది ఈ టపా. ఎవరినీ కించపరచాలని కానీ,తక్కువ చెయ్యాలని కానీ కాదు. సినిమా  గురించీ,  నా ఈ  టపా గురించీ మీ  ఆభిప్రాయాలని తప్పక తెలియచేస్తారు కదూ.. .
     

 

10 comments:

  1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్... ఇంతకంటే ఏం రాయాలండీ రివ్యూ..? సూపర్ గా ఉందండీ.

    ఈ సినిమా చూడలేకపోతున్నానే.. అన్న బాధ, ఎలాగైనా చూసెయ్యాలన్న కోరికా మీ రివ్యూ తో ఇంకా ఎక్కువయ్యిందండీ...

    ధన్యవాదాలతో...

    ఈగ..ఈగ..ఈగా.... ఝరన ఝరన తారే.. (పాడుకుంటూ..!)

    ReplyDelete
  2. అచ్చుగుద్దినట్టు నా మనసులో మాటలను మీ మనసు పలికింది. :)
    ఈరోజు పొద్దున్న ( మీ రివ్యూ చూడకముందు) నేను ఫేస్బుక్ లో రాసిన నా రివ్యూ:

    "చూసేసా చూసేసా...ఈగ చూసేసా! నాకైతే భలే నచ్చింది. concept లో కొత్తదనం లేకపోయినా ఈగ చేసే తమషాలన్నీ సూపర్! మొదటి సగం మొత్తం మాంచి స్పీడ్ లో మంచి పట్టుతో సాగింది. రెండో భాగం మాత్రం కొంచం ఇంకా మంచి స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా కొత్తగా ఏమైనా చేసుంటే ఇంకా సూపరు డూపర్ గా ఉండేది. ఇంత మంచి విజువల్ వండర్ తెలుగులో చూడ్డం భలే ఆనందంగా ఉంది. ఇంకోసారి చూడాలనుంది. ఈగ గురించి పరిశోధన చేసి, తీసుకున్న శ్రద్ధకి మాత్రం రాజమౌళికి జోహార్లు. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే ఈగ ఏదో పెద్ద పోటుగాడిలాగ తనకి మించిన పనులు చేసి విలన్ ని చంపే ప్రయత్నాలు చెయ్యకుండా తను ఏం చెయ్యగలదో అదే చేసి విసిగించింది. అదేంటో అక్కడ కళ్ళముందు ఈగ కనిపిస్తున్నా ఆ వెనకాల నాని మొహమే కనిపించింది చివరి దాకా. ఉన్న అరగంటలోనే ఎంత మాయ చేసావురా నానిగా!! సినిమా అంతా సుదీప్ సుదీప్ సుదీప్...చాలా బాగా చేసాడు, అందులోనూ ఈగని ఊహించుకుని చేసాడంటే...జోహార్లు! విలన్ అని తెలిసినా పాపం జాలేసింది సుదీప్ మీద. అంత పెద్ద మనిషి ఇంత చిన్న ఈగకు లోకువైపోయాడే అని ;) సమంత - ఏదో ఫరవాలేదు. బానే ఉంది. పోస్టర్లలో ఊరించినంత గొప్పగా లేదు. ఆ చిన్మయి గొంతే పెద్ద బ్యాక్‌డ్రాప్...పెద్ద నస. ఎక్కువ డైలాగులు లేకుండా రొమాంటిక్ గా గొంతు తగ్గించి చెప్పే సంభాషణలకే చిన్మయి గొంతు సూట్ అవుతుంది. కానీ ఈగలో సమంత బోల్డు హావభావాలు పలికించాలి. చిన్మయి గొంతులో ఒక్కటంటే ఒక్కటి సరిగ్గా పలకలేదు. "నానిని మరచిపోడానికి ట్రై చేస్తాను" అన్నప్పుడైతే మాత్రం నాకు నార్త్ఈస్ట్ వాళ్ళు తెలుగు మాట్లాడినట్టు, రఫీ - ఉదిత్ నారాయణ్ కలిసి తెలుగులో యుగళ గీతం పాడినట్టు అనిపించింది.

    ఈగ పుట్టుక, ఎగరడానికి ప్రయత్నించడం, భూమ్మీద పడ్డాక వింతలన్నిటినీ ఆశ్చర్యంగా చూడడం, చిన్న చిన్న కష్టాలను ఎదుర్కోవడం....ఇవన్నీ చాలా బాగున్నాయి. చివర్లో ఈగ చేత హీరోలని పేరడీ చేయించడం సూపరో సూపరు :) తాగుబోతు రమేష్ కామెడీతో సినిమాకి సంబంధం లేకపోయినా కథా గమనానికి అడ్డువచ్చినట్టో, లేదా అనవసరం అనో అస్సలనిపించలేదు. చాలా బావుంది....చాలా నవ్వుకున్నాం.

    సినిమాటోగ్రాఫర్ కి నమోనమః. కీరవాణి సంగీతానికి 80 మార్కులు. చాలాచోట్ల అదరగొట్టారు. కానీ క్లైమాక్స్ లో తుస్ మనిపించారు. చివరి 20 నిముషాలు BGM అస్సలు నప్పలేదు. సినిమా అయిపోయిందా లేదా అని డౌట్ వచ్చింది నాకైతే. క్లైమాక్స్ BGM అనగానే మనల్ని మునివేళ్ళ మీద నిలబెట్టేటట్టు ఉండాలి. అలాంటిది కుర్చీలో చతికిలబడేట్టు ఉంది. ఇంట్రవల్ ముందు మాత్రం పీక్ కి వెళ్ళిపోయింది. ఇంట్రవెల్ వరకు కథ, కథాగమనం, సంగీతం అన్నీ అదరహో! తరువాత కొంచం తగ్గాయి.

    ఇది ఎవరో చిన్నపిల్లల సినిమా అన్నారుగానీ సినిమాలో పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలైపోయి చందమామ కథల కాలంలోకి వెళ్ళిపోయారు. :) నిజంగా అందరూ చూడాల్సిన సినిమా. థియేటర్ లోనే చూడండి. మిస్ కాకండి. "

    ReplyDelete
  3. @ రాజ్ కుమార్ .. చాలా థాంక్స్ అండీ. మీ రివ్యూలు, బ్లాగ్ పోస్ట్ లూ క్రమం తప్పకుండా చదువుతాను నేను. తొందరగా చూసెయ్యండి.. కొన్ని లోపాలుంటే ఉండవచ్చు కానీ సినిమా మాత్రం బావుంది.
    @సౌమ్య.. భలే ఉంది మీ రివ్యూ.. అంతకంటే ఎక్కువగా మన ఇద్దరి అభిప్రాయాలు అచ్చు గుద్దడం.. గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ అనుకుందామా సరదాగా :) నిజంగానే మనిద్దరికీ ఒకేలా అనిపించడం బావుంది కదూ.. రఫీ, ఉదిత్ నారాయణ్ కలిసి యుగళ గీతం పాడినట్టు. :) ఊహించుకోవడానికే బావుంది ఈ కాంబినేషన్.
    @శేఖర్ .. థాంక్ యూ..

    ReplyDelete
  4. ఈగ సినిమా విడుదల రోజే మన రాజ్‍కుమార్ సమీక్ష కోసం ఎదురుచూసా!ప్చ్!
    మీ సమీక్ష బాగుంది.ఇక చూడాలి సినిమా!

    ReplyDelete
  5. @విజయ మోహన్.. నేను కూడా ఎదురు చూసాను.. కానీ రాజ్ కుమార్ ఇంకా చూడలేదు అంటున్నారు. మీకు నా సమీక్ష నచ్చినందుకు చాలా థాంక్స్..సినిమా తప్పకుండా చూడండి.
    @ద ట్రీ. .. ధన్యవాదాలండీ..
    @jalataaru vennela.. It is a nice movie.. may not be a classic but a definite joyride.. Thank you for stopping by..

    ReplyDelete
  6. జంపాల చౌదరిJuly 10, 2012 at 10:25 PM

    రివ్యూ బాగుంది
    -- జంపాల చౌదరి

    ReplyDelete
  7. Thank you very much Choudary garu...

    ReplyDelete

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...