Thursday, February 24, 2011

మరి లేరు.. మరలిరారు.

    ముళ్ళపూడి వెంకట రమణ గారు ఇక లేరు.. మరి తిరిగి రారు.. నిజమేనా? తెల్లవారుతూనే ఎంత విషాదకరమైన వార్త వినవలసి వచ్చింది.. పొద్దున్నే ఒకటో రెండో తెలుగు బ్లాగ్లలో తప్ప మరెక్కడా కనిపించలేదు చాలా సేపు.. అబద్ధమైతే బావుండును అని ఒక ఆశ మనసులో అన్నిమూలలా.. ఆశ, దోశ అన్నారు ఆయన.. .

  ఇలా మీ దారిన మీరు హాయిగా వెళ్ళిపోతే  ..అరుదైన శైలికీ , ఆరోగ్యమైన హాస్యానికీ , అందమైన తెలుగు సాహిత్యానికీ ,  వీటన్నింటికీ చిరునామా రమణ గారే అని ఆరాధించే   ఆశేషాంధ్ర సాహితీప్రియుల మాట ఏమిటి?  అని అడుగుదామంటే వీలేదీ? అభిమానులు ..  సరే..
     పిల్లపిడుగులు బుడుగులూ, చిన్నారి సీగాన పెసూనాంబ లూ, రాధా గోపాళాలూ, లావుపాటి పక్కింటి పిన్నిగార్లూ, రెండు జెళ్ళ సీతలూ, వాళ్లకి ఈలలు వేసే బాబాయిలూ  ఏమయిపొతారు? హలో ఓ ఫైవుందా? అని అప్పారావులు ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ఫైవు కూడా రూపాయి బిళ్ళలా నాణెం అయిపోయిది కదా, కనీసం ఓ టెన్ ఉందా అని వారు అడగాలన్నా, ఆ డైలాగ్ మార్చి రాయాలన్నా ఎవరి దగ్గరకి వెళతారు ? పాపం వాళ్లనోసారి చూడండి సార్!

మూగమనసులూ, పూలరంగడూ, భార్యా భర్తలూ అంటూ ప్రేక్షకుల మనసులతో  మీ కలంతో దాగుడు మూతలాడి ఇక ఇప్పటికింతే అని ఇప్పుడు తీరిగ్గా దానికి కేప్ పెట్టేస్తే  ఎలాగండీ  ?

     మేమిద్దరం తూగోజీ, పగోజీ అని చెప్పి,  ఇప్పుడు ఆయన్నీ, ఆయనతో పాటు తెలుగువారినీ ఒంటరిగా వదిలేస్తే అర్ధం ఏమిటి రమణాజీ? భట్టు గారి అట్టు మీద వొట్టు, ఎన్నో తెలుగు కళ్ళల్లో తిరిగిన కన్నీరు మీద ఒట్టు... మీరు లేక మా  అందరి మనసులూ మూగపోవూ.. మనసుల దాకా ఎందుకు? ఈ వార్త విని మనుషులే మూగపోయారు..నిజంజీ.

   తెలుగు వాకిట మీరిద్దరూ వేసిన  "ముత్యాల ముగ్గులు', పెట్టిన 'గోరంత దీపాలు, బుద్ధిమంతులుగా మారిన బుడ్డిమంతులు,  వారు 'అందాల రాముళ్లై' తరుణి సీతమ్మను చేపట్టినప్పుడు మీరు చేయించిన 'సీతాకళ్యాణాలు' ( మామూలు భాషలో సీతమ్మ పెళ్ళిళ్ళూ  ), రాధా కళ్యాణాలు.. పెళ్లీడు పిల్లలతోనూ, నవదంపతులతోనూ  మీరు చదివించిన పెళ్లి పుస్తకాలు, మిస్టర్ మొగుడా? మిసెస్ పెళ్ళామా ? అన్నది కాదు ప్రశ్న, భర్త కొంచం ఎక్కువ సమానం అని నువ్వనుకున్నా  కావలసినది సమానత్వమే, తెలుసుకోరా మొగుడా అని మెత్తగా చివాట్లు పెట్టిన  మిస్టర్ పెళ్ళాలూ .. ఒకరా ఇద్దరా.. చిట్టా రాస్తే  సంపూర్ణ రామాయణమంత పెద్ద గ్రంధం నిండే మీ  చిత్రాలూ, పాత్రలు . చిత్రసీమనూ, మంచి తెలుగు చిత్రాభిమానులనూ ఎన్నో ఏళ్ళు ఏలిన జంట రాజాదిరాజుల్లో ఒకరు లేక  అనాధలై తల్లడిల్లి పోవూ?
   
    ఆత్మ కధంటే  కేవలం ఆత్మ స్తుతీ,  పరనిందా నూ.. అందుకే నేను రాయనన్నాను అన్నారు. అయినా స్వాతీజీ మాట కాదనలేక రాసానన్నారు. ఎంత మంచి పని చేసారు.. కోతి కొమ్మచ్చి, కో.కొ.. కొహొతి కొమ్మ్మచ్చి అని మొదటా, ఇంకోతి కొమ్మచ్చి అంటూ పిమ్మటా,  సరదాగా, గడుసుగా, గబా గబా  ఎన్నో కొమ్మలు ఎక్కించారు.. మధ్య మధ్యలో 'శాఖా చంక్రమణం' చేస్తున్నాను.. అయ్యా క్షమించండి అంటూ ఎన్నో విషయాలు తమాషాగా చెప్పారు, మురిపించారు.. మమ్మల్ని మరిపించారు.. ముక్కు గోక్కుంటున్న బొమ్మ వేసి 'ముక్కోతి కొమ్మచ్చి'  త్వరలో అని ఊరించారు. ఇంతలోకే ఏమంత తొందర వచ్చిందని చిటారు కొమ్మనేక్కేసారు ?  ఇక్కడ పంచిన సాహితీ పరిమళాలు చాలు , ఇంక అక్కడ కూడా ఇదే పని చెయ్యి అంటూ  ఓ ఆర్డర్ పారేసి  అక్కడ దేవుడేం మిఠాయి పొట్లం పెట్టాడో మరి..
   

Monday, February 7, 2011

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది?

        జనవరి 24 వ తారీకున బెంగళూరు ఇందిరానగర్ లోని పురందరదాస భవనంలో జరిగిన 'ప్రియా సిస్టర్స్' సంగీత కచేరీకి వెళ్ళాము. వాళ్ళిద్దరూ ఎంత ప్రతిభావంతులో, ఎంత బాగా పాడతారో ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు..
       వారిద్దరూ నాకు కజిన్స్ అవుతారు అని చెప్పుకోవడానికే నాకెంతో గర్వంగా ఉంటుంది.. చిన్నప్పుడు  ఎప్పుడూ వారిని కలిసే అవకాశం రాలేదు, ఈ మధ్యనే కలిసినా సరే  ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు. 'విద్యావంతులకి వినయమే భూషణం 'అన్న నానుడిని నిజం చేస్తూ..ఈ సారి వచ్చినప్పుడు మా  ఇంటికి తప్పకుండా వస్తామని చెప్పారు కూడా.
        క్రిందటి సంవత్సరం వాళ్ళ కచేరి కి వెళ్ళినప్పుడు వారిద్దరూ పాడిన  "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది  "అన్న కీర్తన మా మనసులకి హత్తుకుపోయింది. అందుకే ఈ సారి కచేరీ ప్రారంభం అవటానికి ముందే స్టేజ్ మీదకి వెళ్లి పలకరించి ఈ కీర్తన మళ్ళీ పాడమని మా రిక్వెస్ట్ ఇచ్చి వచ్చాను. వారు కూడా అన్ని రకాల కృతులూ అద్భుతంగా పాడి, తన్యావర్తనం తరవాత మొదటగా ఇదే పాట పాడారు. జంట గాత్రాలతో వారు భౌళి రాగం లో పాడుతుంటే చెప్పలేని ఒక అనుభూతి మనసంతా పరుచుకుంటుంది. వీనులవిందైన  గాత్రం, వినసొంపుగా  మానవ నైజాన్ని ఆవిష్కరించిన   సాహిత్యమూ కలిసి మన జీవితాన్ని మన కళ్ళెదుట నిలబెడతాయి.. నిలదీస్తాయి కూడా. ఆ కీర్తనని మీతో పంచుకోవాలనే ఈ ప్రయత్నం.
           అన్నమాచార్య కీర్తనగానే ప్రాచుర్యాన్ని పొందిన ఈ కీర్తన ని నిజానికి రాసినది ఆయన కుమారుడైన పెదతిరుమలాచార్య . ఆయన ఎంతో సరళమైన మాటలతో చక్కగా రచించిన కృతి ఇది.
పల్లవి: "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది? నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికనూ.. నీ చిత్తంబికనూ" అన్న పల్లవితో మొదలవుతుంది..అన్ని జన్మలలోనూ అత్యుత్తమమైనదిగా చెప్పబడే మనిషి  జన్మ ఎత్తినా సరే, ఫలమేముంది?.. అందుకే నిన్నే నమ్మినాను.. ఆ తర్వాత నీ ఇష్టం.. నువ్వే నన్ను బ్రోచే దిక్కువు  అని భగవంతునికి చెప్పుకోవడం..
 చరణం 1 :   మరువను ఆహారంబును, మరువను ఇంద్రియ భోగము, మరువను సంసార సుఖము మాధవ నీ మాయా 
                 మరిచెద సుజ్ఞానంబును, మరిచెద తత్వరహస్యము, మరిచెద గురువును దైవము మాధవ నీ మాయ      (ఎ)  
మొదటి చరణం లో ఆహారాన్నీ, ఇంద్రియ భోగాలనీ, సంసార సుఖాలనీ  మరువను కానీ సుజ్ఞానాన్నీ, తత్వరహస్యాన్నీ, గురువునీ దైవాన్నీ మాత్రం అవలలీలగా  మరిచిపోతాను అంటే  ఇది  ఓ మాధవా నీ మాయే కదా, అది కాక వేరే ఏదీ కాదు కదా, నేను ఎంతో గొప్ప మానజన్మ ఎత్తినా ఫలమేముంది ? చెయ్యవలసిన పనులు సరిగా చెయ్యనప్పుడు అందుకే నిన్నే నమ్మాను నీ చిత్తం.. అని అర్ధం 
చరణం 2 : విడువను పాపము పుణ్యము, విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడ నీ మాయా
                విడిచెద షట్ కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ   (ఎ) 

రెండవ చరణంలో అదే కొనసాగిస్తూ  అన్ని జన్మలలోనూ ఉత్తమమైన జన్మ ఎత్తి కూడా నేను నా దుర్గుణములనూ  , నా ఆశలనూ  పాప పుణ్యాలని  విడవ లేను కానీ వైరాగ్యాన్నీ, చేయవలసిన షట్ కర్మలనీ, ఆచార వ్యవహారాలనీ చాలా అవలీలగా విడిచేస్తాను ఇది అంతా ఓ విష్ణుడా నీ మాయ మాత్రమే! అని ఆయననే అనడం అన్నమాట. నువ్వు ఈ మాయలో పడకుండా రక్షిస్తే చాలు అనేమో మరి.

చరణం 3 :  తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధనముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా
                అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై,  నగి నగి నను నీవేలితి నాకా ఈ మాయా. (ఎ)

ఆఖరి చరణంలో పెరుకేంతో ఘనమైన ఈ మానవ జన్మలో నేను కోరి  తగులుకునేవన్నీ లంపటాలు, బంధనాలు అంతేకానీ కనీసం తలపులోనైనా మోక్షమార్గాన్ని తగులుకోను..అంతర్యామివై  నీవు నన్ను ఎలుకోవలసిన వాడివి, నా చెంతనే ఉండగా నాకేందుకయ్యా ఈ మాయ? అని ప్రశ్నిస్తారు తిరుమలాచార్య.
            మనుష్యుల జీవన విధానాన్నీ,  మాయా మోహపు జీవిత చక్రంలో ఇమిడిపోయి తెలుసుకోవలసిన సత్యాలనీ, విధానాల్నీ తెలుసుకోలేక పోవడాన్ని ఆవిష్కరిస్తూనే ఇది అంతా నీ మాయ మాత్రమే కదయ్యా, నా తప్పేముంది అని దేవుడిని అడుగుతారు. అలాగే నాకేమీ తెలియదు.. ఎంత గొప్ప జన్మ ఎత్తినా సరే.. నిజంగా నిన్నే నమ్మాను కనక అంతా నీ ఇష్టం అని ఆ అంతర్యామి పైనే భారం మోపుతారు ఆచార్యులవారు .  
మన జీవితాన్ని తరచి మనముందు నిలబెట్టే సాహిత్యమూ, సంప్రదాయబద్ధంగా సాగే ఎంతో చక్కని గానం వెరసి..అందరూ తప్పకుండా ఒక్కసారైనా విని తీరవలసిన కీర్తన అని నా అభిప్రాయం. క్రింద రెండు లింక్ లు ఇస్తున్నాను, ఒక దానిలో ప్రియా సిస్టర్స్ కనిపించరు, వినిపిస్తారు, రెండో దానిలో వారూ, వారిని అభిమానించేవారూ కూడా   కనిపిస్తారు.
ప్రియా సిస్టర్స్ అద్భుతంగా గానం చేసిన ఈ కీర్తన మీకోసం ఇదిగో ఇక్కడ..


Tuesday, February 1, 2011

కదంబమాలిక- 10

    వారం వారం ఒక్కొక్క రకమైన  కుసుమాలని  తనలో ఇముడ్చుకుంటూ, అందమైన అల్లికల, మెలికలు తిరుగుతూ, సుమనోహరమైన సుగంధాల పరిమళాలు వెదజల్లుతున్న ప్రమదావనపు కదంబమాలికకి ఇది పదో మజిలీ. ఇప్పటివరకూ స్నేహితులందరూ ఎంతో నేర్పుగా 'ఒక్కరే' ఈ కధ మొత్తం రాసినంత సహజంగా కధ నడిపారు. ఇప్పుడు ఈ పూదండ అల్లిక కొనసాగించే బాధ్యత నాకిచ్చారు. "పరవాలేదే" అనిపించేలా రాసినా నా ప్రయత్నం ఫలించినట్టే అనుకుంటాను. రంగూ, వాసనా చూసి చెప్పండి మా ప్రమదావని లో "వాణి'( సాహిత్య సరస్వతి) 'తలనిండ దాల్చే ఈ పూదండ' లో నేను కూర్చిన పూలు ఎలా ఉన్నాయో ? చూడ ముచ్చటగా ( చదవ ముచ్చటగా   అనాలేమో? ) నేర్పుగా, కమనీయంగా అల్లిన నిన్నటి అల్లిక  శ్రీలలిత గారిది.. 

     పనిమనిషి లక్ష్మమ్మ కూతురు చంద్రి కి జరిగిన అన్యాయాన్ని  గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని  భర్తా, మావగారు మిగతా అందరితో కలిసి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుంది  సరోజిని. 

      "కంప్లైంట్ తీసుకుంటారో లేదో? చంద్రికి ఎప్పుడు నయమవుతుందో ?   షాక్ నించి జానకి తేరు కుంటుందా ? పువ్వుల్లా విరబూసి నవ్వుతూ తుళ్ళుతూ ఉండవలసిన పసి  పిలల్లపైన ఇంత అమానుషమా? ఎక్కడ మొదలవుతున్నాయో, ఎక్కడ పొంచి ఉన్నాయో, ఎప్పుడూ మీద పడతాయో తెలియని ఈ ఘోరాలకి అంతు  ఎక్కడ? 

       బస్ ఎక్కితే కావాలని రాసుకు పూసుకు తిరిగే కండక్టర్, కాలేజీ కెళితే ప్రేమా, దోమా అంటూ వెంటపడే ఆకతాయిలూ, కాదంటే కాల్చడానికి సిద్దపడుతున్న కీచకులూ, పిల్లల వయసెంత?  అని అయినా చూడకుండానే వారిని వేధించే కామాతురులూ,  పెద్దవారు వీధిలో కెళితే  నగలూ, వాటికోసం ప్రాణాలు హరించే దుర్మార్గులూ, ఇవి  చాలనట్టు కొత్త రకాలైన సైబర్ క్రైములూ, ఆడపిల్లలైతే ఒకరకం సమస్యలూ, మగపిల్లలైతే మరొక రకమైన సమస్యలూ.. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ చూసినా అబ్యూజ్. 

    ఇవ్వాళ అనితకి ఎదురైన  సమస్య చిన్నదా? దానిని ఈ రోజు ధైర్యంగా తిప్పికొట్టింది. రేపు, ఎల్లుండి? మళ్ళీ మళ్ళీ  ఎదురవుతూనే ఉంటే? ఇలా ఎన్నాళ్ళు? ఎన్ని చోట్ల? ఎలా తమని తాము కాపాడుకోవడం? ఎలా పిల్లలకి నేర్పించడం? రేపు తన పిల్లలకి ఏదైనా అయితే? ఆ ఆలోచనకే చిగురుటాకులా వణికిపోయింది.ఎవరైనా, ఏదైనా చేస్తే బావుండును. ఈ బాధలు, గొడవలు లేని సమాజం రావడం కలేనా? కల్లేనా ? అసలే సున్నితమైన ఆమె మనసు మరింత క్షోభ పడసాగింది. 

      " సరోజా! నేను కాసేపు నడుం వాలుస్తాను. వెళ్ళిన వాళ్ళు వస్తే నువ్వు చూసుకుంటావు కదా  " అని అత్తగారు వెళ్లి పడుకున్నారు. కొడుకూ, కోడలూ మంచి వాళ్ళు, తమ జీవితం వారి చెంత సుఖంగా నడుస్తుంది అన్న ధైర్యం, నిశ్చింతా  తన  అత్తా మామల కెంతో హాయినిస్తోంది.అలాగే ఇంత మంచివారి చెంత తనకీ అలాంటి తృప్తే లభిస్తోంది. అలాంటి ధైర్యం, తృప్తి  సమాజంలో అందరికీ  ఉండాలి కదా,  అది లేనినాడు క్షణక్షణం భయంతో బ్రతకడం కన్నా వేరే నరకం ఉందా  ? అలాంటి రోజు  రావాలంటే ఎం చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? అనుకుంటూ చిరాగ్గా తిరుగుతున్న సరోజినికి ఒక్కసారిగా ఎవరో చెళ్ళున చరిచినట్టుగా  అనిపించింది.

  "ఎవరో ఎందుకు చెయ్యాలి? మనకి మనమే చేసుకోకూడదా? తను గత కొన్ని రోజులుగా జానకికీ, అలాంటి వారికి  చేతనైన సహాయం చేద్దామని అనుకుంటూనే ఉంది కదా.. 'నాకు ఆకలి వేస్తె నేను అన్నం తింటేనే  నా ఆకలి తీరుతుంది., అది తీరేదారీ, తీర్చే దారీ నేనే వెతుక్కోవాలి కదా. ఈ మాత్రపు జీవిత సత్యం ఆపదకి వర్తించదా? నాకు ఆపద వస్తే ఎవరో వచ్చి రక్షించాలని ఎందుకనుకోవాలి?' "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా?"  ఘంటసాల మాస్టారి పాట గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు తను స్కూల్ లోనూ, కాలేజీలోనూ తరచుగా పాడేది ఈ పాట. నాన్నకు, తనకూ ఎంతో ఇష్టమైనది. 

      "పాటలో ఉన్న భావం చూడు తల్లీ? మంచి ఎక్కడుందో ,దాని పక్కనే చెడు ఉంటుంది, దీపపు వెలుతురి కింద చీకటి నీడలాగా. వెలుగు మనకి మనం చూపించుకుంటూ నలుగురికీ చూపిస్తే దారి దానికదే కనిపిస్తుంది.. దానికింద క్రీనీడ ని చూస్తే అది గోడమీద నీడలా మరింత పెద్దది అయి  భూతంలా భయపెడుతుంది. తప్పు చెయ్యని వారికి ఉండకూడని అవలక్షణం భయం తల్లీ!. ఎందుకంటే మనలో నిద్రాణమై ఉన్న ధైర్యాన్ని అది నిద్ర లేవనీయదు" . ఎప్పుడూ ఇలాగే చెప్పేవారు. 

    తన పిల్లలు అన్నింట్లోనూ, ఎప్పుడూ స్వతంత్రంగానూ, స్వాభిమానం తోనూ  ఉండాలని చెప్పేవారు. అదొక్కటే కాదు తండ్రి తనకెంతో ప్రియమైన నాయకురాలు 'సరోజినీ నాయుడు' పేరు తనకు, అక్కకి 'విజయలక్ష్మి పండిట్ 'పేరు విజయలక్ష్మి అని  పెట్టుకున్నానని చెప్పేవారు. గతించిన తండ్రి గుర్తుకు రాగానే మనసంతా ఆర్ద్రమైపోయింది ఆమెకి.. కళ్ళు నిండి కన్నీళ్ళు జల జలా కారాయి.  

    తనేమో ఇలా వంటిటికి అంకితం అయిపోయి ఏం  చేస్తోంది.?. భాస్కర్ గట్టిగా మాట్లాడితేనే కన్నీళ్ళు పెట్టుకునేంత బేల అయిపోయింది  కదా తను? తన చిన్ని ప్రపంచం లో తను బాగానే ఉన్నాను అనుకుంటోంది.. 'చిన్ని నా బొజ్జకు శ్రీ రామరక్షా' అనుకుంటూ. కానీ తనకి తెలిసిన ఈ  చిన్న  ప్రపంచంలోనే ఎంతమంది బాధ పడుతున్నారో కదా? లక్ష్మమ్మ, జానకి. చంద్రి, అనిత ఇలా.. తెలిసి ఇందరు, తెలియక ఇంకెందరో   కానీ తనేం చెయ్యగలదు?  అసలు ఏమైనా చెయ్యగలదా ? ఇలా ఆమె ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయి. 

       లక్ష్మమ్మ చెప్పింది కూడా.'ఏం  చేసినా టూడెంట్ కుర్రాళ్ళు చెయ్యాలి అని.'. వాళ్ళు ఒక్కళ్ళ వల్లా అవుతుందా? ఈ సమాజం అందరిదీ కాదా?.. తనలాంటి మరెందరిదో కాదా? ఇలాంటివారందరూ కూడా కలిస్తే?   పొద్దున్న పదీ,  పదకొండు గంటలకల్లా పని పూర్తి చేసుకుని టీ.వీ ల ముందో, పగటి నిద్రతోనో కాలం గడిపే ఇల్లాళ్ళూ , రిటైర్ అయినా సరే ఇంకా ఆరోగ్యంగా, ఓపికగా ఉన్న పెద్దవారూ రోజూ తమ సమయంలో ఒక రెండు గంటలు కేటాయిస్తే ఏదైనా చెయ్యలేరా? 

   తనూ, మావగారు, ఇష్టమైతే అత్తగారు, సుభద్ర , వాళ్ళ అత్తా  ఇలా తమ ఇంట్లోనే  నలుగురైదుగురు ఉన్నారు., అనితా, వీలైతే లక్ష్మమ్మా, సుమిత్రా .. ఇలా ఎవరి పరిధిలో వారు చాతనైనంత సహాయం చేస్తే అదే ఒక గొప్ప పనికి ఆరంభం అవుతుందేమో.. ఇలాంటి మరో పది,  పదిహేను  ఇళ్లు  పట్టుకున్నా  కనీసం నలభై మంది అవుతారు కదా, అందరూ ఒక చోట చేరి ఈ సమస్యలన్నీ చర్చించి పరిష్కార మార్గాలు కనిపెట్టడం కష్టమా ? ఒక సంఘం గా ఏర్పడి పిల్లలకీ, పెద్దలకీ కావలసిన శిక్షణా, ధైర్యమూ సమకూర్చలేమా.? దేశాన్నంతా ఉద్దరించ  లేకపోవచ్చు కానీ కనీసం మనకి తెలిసినవారికి కావలసినంత సహాయం చెయ్యవచ్చు. కావాలంటే సహాయం చెయ్యడానికి మహిళా పోలీసులూ, స్త్రీ శిక్షణా సంఘాలూ ఇలాంటివారందరూ లేరా?  ఈ దిశగా ఆలోచిస్తే ఆమె కి చాలా ఉత్సాహంగా అనిపించింది. 

    రోజూ పెరుమాళ్ళకి  చేసే పూజ మాధవ సేవ.. ఇది మానవ సేవ.. మానవ సేవే మాధవ సేవ కదా.. దానికి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది కదా.. ఒక నిశ్చయానికి వచ్చినట్టు, మనసులో అప్పటివరకూ ఉన్న అశాంతి కొద్ది, కొద్దిగా మంచులా విదిపోతున్నట్టూ అనిపించింది.

     ఇంటిల్లిపాదీ టీ. వీ చూస్తున్నారు. ఇప్పుడు మా టీ. వీ లో వెలుగూ.. వెలిగించు కార్యక్రమంలో 'కాంతి' సంఘం గురించిన కార్యక్రమం, ఈ సంఘ స్థాపకురాలు శ్రీమతి. సరోజినీ, వారి అత్తమామలు శ్రీ. శ్రీరాం గారూ, శ్రీమతి. నారాయణమ్మ లతో పరిచయం అని అనౌన్స్ మెంట్  వచ్చింది. కార్యక్రమంలో తననీ, అత్తా మామలనీ ఇంటర్వ్యూ చేసారు.. తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలగురించి చెప్పారు. 
  •   ఉదా.. ప్రముఖ స్కూళ్ళ దగ్గర అడ్డూ, అదుపూ లేకుండా రెండు వైపులా వెళ్ళిపోయే వాహనాల వల్ల ఎందరో  పిల్లలు ప్రమాదాలకి గురి అవుతూ ఉండడం వల్ల తమ సంఘం ద్వారా కొంతమంది తల్లి తండ్రులు అక్కడ ట్రాఫిక్ పోలీస్ లకి సహాయంగా రోజూ వంతుల వారీగా నిలబడి స్కూల్ మొదలు పెట్టే సమయానికీ, విదిలే సమయానికీ ఉండడం వల్ల కలిగిన లాభాలూ. 
  • సిటీ బస్ లలో రోజూ కాలేజీ లకి వెళ్ళే అమ్మాయిలకి తోడుగా తమ సంఘం వాలంటీర్లు బస్ లలో అప్పుడప్పుడూ వెళ్లి వారి క్షేమ సమాచారాలు విచారించడాలూ, ఈవ్ టీజింగ్ లాంటి కేసులని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావడాలూ..
  • బాల కార్మికుల ని ఉద్ధరించడం కోసం 'పిల్లల సహాయ వాణి' సంస్థ తోడ్పాటుతో వాళ్ళని స్కూళ్ళలో చేర్పించడమూ, వారి క్షేమ సమాచారాలు చూడటమూ,
  • వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ కరాటే లాంటి ఆత్మ రక్షణ విద్యలు నేర్పించడమూ
  •  గుళ్ళకీ, వాకింగులకీ వెళ్ళే పెద్దలకీ, ఉద్యోగినులకీ 'పెప్పర్ స్ప్రే" లాంటి సాధనాలు సమకూర్చడమూ
  • అన్నింటికంటే ముఖ్యంగా అందరికీ వారం వారం కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి పరిస్థుతులలోనైనా సంయమనం, ధైర్యం కోల్పోకుండా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడం ఎలా ? అన్న విషయాల మీద వారికి తెలియ చెప్పడమూ 
ఇలాంటి వాటి గురింఛి వివరంగా చెప్పారు. ఇది ప్రజలు తమకోసం తాముగా నిర్మించుకున్న నెట్ వర్క్ అనీ, ఇలాంటి సంస్థల వల్ల తమకెంత అదనపు సహాయమో అని పోలీస్ కమీషనర్ కూడా చాలా మెచ్చు కున్నారు. అందరూ కొట్టిన చప్పట్ల మోతతో ఒకటే సందడి.తనవారి కళ్ళల్లోనూ, తన కళ్ళలోనూ ఏదో తెలియని ఆనందం. 

ఇంతలో వీధి తలుపు ఎవరో  కొట్టడంతో ఈ లోకంలోకి వచ్చింది సరోజిని..ఇప్పటివరకూ తన మనసులో మెదులుతున్న ఆలోచనలు అంతలోనే కలగా కనిపించడంతో సిగ్గుపడి నవ్వుకుంది. 'పగలు వచ్చినదే అయినా దీనిని పగటికల కానివ్వకూడదు తను కానివ్వదు' . 

"ఊహించుకోవడానికి ఎంతో అందంగా ఉన్న తన ఆలోచనలు ఆచరణలో కష్టసాధ్యమైనవే కానీ అసాధ్యమైనవి కాదు. ఎంతో పెద్ద పెద్ద ఉద్యమాలు నిర్వహించిన వారందరూ తమలాంటి వారే కదా? ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే  మొదలవుతుంది కదా, ఆ అడుగు తనదే ఎందుకు కాకూడదు? కావాలి "అనుకుంది స్థిరంగా. 
అలా మొదటి అడుగు వేసింది విశాల ప్రపంచపు క్షేమానికి తలుపు తెరవడానికి.
తరవాత ఏమైందో వచ్చే వారం చూడండి  ........

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...