ముక్కుపైకెక్కు.. చెవులపక్కన నిక్కు.. జారిందంటే పుటుక్కు.. అని చిన్నప్పుడు పొడుపు కధ పొడుచుకుని.. "నాకు తెలుసు, నాకు తెలుసు" అంటూ చేతులెత్తి మరీ.. కళ్ళ జోడు అని చెప్పేవాళ్ళం. అన్ని రకాల దృష్టి దోషాలనూ వీలైనంతవరకూ సవరించి కంటిచూపుని మెరుగు పరిచే సాధనాలు మన కళ్ళ జోళ్ళు.. సారం లేని తినే తిండి వల్లనో, పెరుగుతున్న కాలుష్య ప్రభావమో, స్వాభావికంగా మానవ జన్యువులలోనూ, తద్వారా ఆరోగ్యంలోనూ వస్తున్న మార్పులో.. కారణ మేదైతేనేం ? .. ఈ మధ్యన కళ్ళజోళ్ళు ధరించడం కాలి జోళ్ళ వాడకమంత సాధారణం అయిపోయింది. ప్రతీవారికీ ఏదో ఒక కారణాన వయసుతో సంబంధం లేకుండా వీటిని దరించ వలసిన అవసరం వస్తోంది. సరదాకో, ఫాషన్ కో,ఎండకో వాడే కళ్ళజోళ్ళ సంగతి సరేసరి..
ఏడాదికొకసారి కళ్ళ పరీక్ష చేయించుకునే మేము ఈ సారి కూడా జనవరి ఒకటో తారీకున మా డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళాము. మా ఇద్దరికీ ఇప్పట్లో కళ్ళజోడు మార్చవలసిన అవసరం లేదు అని చెప్పారు, మా అబ్బాయికి కూడా పవర్ పెద్దగా పెరగలేదు కానీ మీరు ఎప్పుడూ స్పేర్ గా ఒకటి ఉంచుతారు కనక ఈ కొద్దిగా పెరిగిన పవర్ తో అది చేయించి ఉంచుకోండి అని సలహా చెప్పారు.
దానికోసం కొత్త జోడూ, అద్దాలూ కొనాలని షాప్ కి వెళ్లాం. మా ఇంటి వెనక ఉన్న షాపే ఇది, అతను మాకు బాగా తెలుసు కూడా. ఇక్కడొక విషయం చెప్పాలి. ఏ వస్తువైనా కొనడానికి వెళ్ళినప్పుడు మన అంచనాలని మించే ఉంటుంది కదా.. అది బంతిపూలైనా సరే, బంగారమైనా సరే.. అందుకని కొంత సిద్ధపడే వెళ్ళాము అయినా సరే అక్కడ మాకన్నీ షాక్ లే.
ముందు ఫ్రేం చూపించామన్నాము. "ఇది కొరియా లో చేసినది మేడం చాలా బావుంటుంది అన్నాడు ఒకటి చూపిస్తూ.. అది నిజానికి బానే ఉంది.. ధరతో సహా..పదిహేను వందలుట .. తరవాత ఇండోనేసియా లో చేసినది.. రెండు వేలు.. ఇలా ఒక దేశాన్ని మించి మరొక దేశపు ఫ్రేములూ, వాటితో పాటు అటు ఇటూగా సాగుతున్న ధరలు. నాకు అనుమానం వచ్చి.. "మన దేశంలో కళ్ళజోళ్ళ ఫ్రేములు తయారు చెయ్యరా? మనం అన్నీ దిగుమతి చేసుకోవడమేనా? అని అడిగాను. "ఉన్నాయండి.. కానీ క్వాలిటీ బావుండదు.. మూడు నెలలకే పై పొర ఊడి పోవడం, స్క్రూలు లూజ్ అయిపోవడం ( ఎవరివో మరి??) ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తాయండి అన్నాడు. ఒక్క ధరలూ, దేశాలూ మాత్రమే కాదు.. వీటిల్లో ఎన్ని రకాలో.. మెటల్, ప్లాస్టిక్, హాల్ఫ్ రిం, ఫుల్ రిం, సైడ్ ప్లాస్టిక్, షెల్ ఫ్రేం ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా..
ఆటలూ, పరుగులూ.. వీటిల్లో ఎప్పుడు విరగ గొట్టుకుంటారో తెలియని వయసులో అంత ఖరీదైనవి ఎందుకు ?అని నా అభిప్రాయం అని చెప్పాను అతనికి. వీటిల్లో స్టార్టింగ్ రేంజ్ 675 /- అన్నాడు, కానీ ఆ రేట్లలో రెండో మూడో మాత్రమే ఉన్నాయి. అవి మనకు ఎలాగూ పెద్దగా నచ్చవు. .. ఓ నాలుగుంటే కదా చూసుకోవడానికి .. మొత్తానికి మా ముగ్గురికీ, మధ్యలో చూపిస్తున్న అతనికీ ( అభిప్రాయం చెప్పాడు కనక) నచ్చిన ఫ్రేం దొరికింది. పాపం మా అబ్బాయి కూడా ఇంత ఖరీదు వేస్ట్ డాడీ, మళ్ళీ విరిగి పోతే అనుకుంటూ మాములుదే తీసుకున్నాడు. అమ్మయ్య! సగం పని అయిపోయింది కనక ఇంక అద్దాలు చూసేసుకుంటే సరి అనుకున్నామో లేదో మళ్ళీ ఇంకో బాంబు..
"మామూలు అద్దాలు బావుండవండి.:. అని ఒక పెద్ద కాటలాగ్ మా ముందు పెట్టాడు.. దాన్లో ఉన్నన్ని పేర్లు సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తందూరీ, చైనీస్ ఇలా అన్ని రకాలు దొరికే హోటల్ మెనూ లో కూడా ఉండకపోవచ్చు.. పాలీ కార్బనేట్, ఆంటీ స్క్రాచ్, అంటీ గ్లేర్, ఫోటో సన్, సూపర్ తిన్, ఇలాంటివన్నీ కాలంలలోనూ, జిస్, సుప్రోల్.. ఇంకా ఇలాంటివెన్నో రకాల బ్రాండ్ ల పేర్లు వరసలలోనూ ఉన్న పెద్ద పెద్ద పట్టికలు చూపించాడు. ఇంక అక్కడనించి చూసుకోండి.. ఆ కామ్బినేషలూ, పర్ముటేషణ్ లూ .. ఒక్కోదానికి ఒక్కొక్క రేటు.. మినిమం మూడువేలుగా చెప్పవచ్చు, ఇంకా ఎక్కువేనేమో కూడా. ఈ లెక్కన అధమం వెయ్యి రూపాయలు ఫ్రేం కీ, మూడువేలు లెన్స్ లకి వేసుకున్నా ఒక కళ్ళజోడు ఖరీదు కనీసం నాలుగు వేలు అవుతుంది అన్నమాట. ఇంకా ప్రోగ్రెసివ్ లాంటివి కొనాలంటే ఇంకా ఎక్కువే.. కేవలం లెన్స్ లే ఐదేసి వేలూ లేక ఇంకా ఎక్కువో ఉంటాయి.. అంతే మా షాపు అతని భాషలో చెప్పాలంటే మంచి ఫ్రేమూ, మంచి లెన్స్ లూ ఉన్న కళ్ళ జోడు కి కనీసం పదివేలు అవుతుందేమో.. !!!
ఇది ఇప్పుడు కొత్తగా చూసినది కాకపోయినా, ధరలు మరీ ఇంత ఎక్కువగా అనిపించడం ఈ మధ్యన బాగా ఎక్కువ అయింది అనిపిస్తోంది నాకు. ముందుగా వాళ్ళు మన దేశంలో తయారయ్యే ఫ్రేములూ అవీ ఏమి చూపించారు, ఆ తర్వాత ఇంపోర్టెడ్ వాటి గుణాల్ని కీర్తించి మనల్ని నమ్మించి అమ్మే ప్రయత్నం చేస్తారు. మనలో ఉన్న బ్రాండ్ పిచ్చి ని బాగా వాడుకుంటారు. రెండేళ్ళ క్రితం వాడికి కొన్న( ఇంపోర్టెడ్ అని మాకు తెలియకుండానే) ఫ్రేం ఇంపోర్టెడ్ అని వాడి స్నేహితుడు సర్టిఫై చేసాక మా వాడి ఆనందం చూసి తీరాలి.
అంతేకాదు.. ఇదివరకు టైము చూపించడానికి మాత్రమే పనికివస్తుంది అనుకున్న వాచీ, చూపు సరిగా చూపించే కళ్ళ జోడూ, ధరించే బట్టలూ, చేతిలో పట్టుకునే సెల్ ఫోనూ, మేడలో వేసుకునే టై ఇలా ఒకటేమిటీ అన్నీ కూడా మనల్ని జనాలకి చూపించే సాధనాలుగా (fashion accessories) గా మారిపోయి, ప్రతీదానిలోనూ brand consciouness విపరీతంగా పెరిగి పోయాకా, ఇలా కాక ఎలా ఉంటాయి?. అందుకే ఈ మధ్యన కళ్ళ జోళ్ల మీదా, కాలి జోళ్ల మీదా కూడా swaarovski లాంటి అంతర్జాతీయ బ్రాండ్ ల తళుకులూ, బెళుకులూ అద్ది మరీ అమ్ముతున్నారు. వాటి ధర నాకు ఊహించడానికి కూడా కష్టమే..అందుకే అంటున్నాను.. ఈ కళ్ళ జోళ్ళు మాత్రం మనకి లోకాన్ని చూపించడం మాట ఎలా ఉన్నా, చుక్కలు తప్పకుండా చూపిస్తున్నాయి అని.
No comments:
Post a Comment