Monday, March 7, 2011

మహిళలూ- మణి దీపాలు (7 )

కిరణ్ బేది (బేడి) : ఈ పేరే ఒక సంచలనం అప్పటికీ, ఇప్పటికీ కూడా. మన దేశపు తొలి ఐ.పీ.ఎస్ ఆఫీసర్ గా 1972 లో చరిత్ర సృష్టించారు ఆమె. పంజాబ్ లోని అమృత్ సర్ లో జూన్ 9 , 1949 వ సంవత్సరం లో ప్రకాష్ మరియు ప్రేమ పెషా వరియా దంపతుల రెండవ కుమార్తెగా జన్మించారు కిరణ్. చదువుతో పాటు ఆటలలో కూడా ఎంతో ప్రతిభ కనపరిచిన కిరణ్ టెన్నిస్ మీద ఎంతో  మక్కువ కనపరిచే వారు.. అంతే  కాదు,  టెన్నిస్ లో అనేక చాంపియన్ షిప్  లు గెలుచుకున్నారు కూడా.  అమృతసర్ గవర్నమెంట్ కాలేజీ నుంచీ బి.ఏ పట్టానీ, పంజాబ్ యూనివర్సిటీ నించి ఎం.ఎ పట్టానీ పొందారు. చదువు పూర్తీ కాగానే రెండు సంవత్సరాలు అమృత సర్ లోని ఖాల్సా కాలీజీ లో లెక్చరర్ గా పనిచేసిన ఆమె 1972 లో  కేవలం తన పట్టుదల కారణంగా చేరారు. ఎంచుకున్న ఏ పనిలోనైనా అద్వితీయంగా ఉండడమే ఆమె నైజం.
            ఉద్యోగరీత్యా ఆమె నిర్వహించినాన్ని కష్టతరమైన బాధ్యతలు అన్నీ ఇనీ కావు. డిల్లీ  లో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్ గా, మిజోరం లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా, చండీఘర్ లెఫ్టినెంట్ గవర్నర్ కి  సలహాదారుగా, డైరక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే ఐక్య రాజ్య సమితికి చెందిన సంస్థ లోనూ ఎన్నో గురుతరమైన బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా పోలీస్ అడ్వైసర్ గా ఐక్య రాజ్య సమితి శాంతి పరి రక్షణ లో ఆమె వహించిన బాధ్యతకి ఆమెకి  యూ. ఎం మెడల్ బహూకరించారు. అధికార పరిరక్షణలో ఆమె ఎవరినీ పట్టించుకునే వారు కాదు, ఎంతో ధైర్య సాహసాలతో తనకప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవారు. ఈ లక్షణమే ఆమె కు 'క్రేన్ బేడి' అనే బిరుదు ని కూడా కట్టబెట్టింది, కారణం అప్పటి ప్రధాని  శ్రీమతి. ఇందిరా గాంధి అధికారిక అమెరికా పర్యటనలో ఆమె  కార్ ని సరి ఐన చోట పెట్టలేదని కిరణ్ బేడి తొలగించడమే. 
     సుదీర్ఘమైన ఆమె ఉద్యోగ జీవితం లో ఆమె సలహాలూ, సూచనలూ ఎన్నో ముఖ్యమైన నిర్ణయాల అమలు కు తోడ్పడ్డాయి. అంతే కాదు, తీహార్ జైల్లో ఆమె ప్రవేశ పెట్టిన యోగా, విపాసనా ప్రాణాయామం, ఖైదీలకు చదువు వంటి  ఎన్నో సంస్కరణలు ఆమెకు రామన్ మెగసెసే అవార్డు తెచ్చిపెట్టాయి. ఒక పక్క ఇంత  బాధ్యాతాయుతమైన, కష్టమైన  ఉద్యోగాలు నిర్వహిస్తూనే 1988 లో డిల్లీ యూనివర్సిటీ నించి లా డిగ్రీనీ, 1993 లో డిల్లీ ఐ ఐ.టీ లోని  పొలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ డిగ్రీ నీ కూడా పొందారు.  అదీ ఆమె పట్టుదలకి నిదర్శనం, జైలు సంస్కరణలలో ఆమె అవలంబించిన మానవతా వాదానికీ, మంచితనానికీ 2005 లో గౌరవ లా డిగ్రీ ని పొందారు. పోలీస్ బ్యూరో ఆఫ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కి డైరక్టర్ జనరల్ గా ఉన్నప్పుదు ఆమె స్వచ్చంద పదవీ విరామాన్ని కోరి, పోలీస్ శాఖ నించి వైదొలగారు.
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆమె పలు కార్యక్రమాలలో పాలుగొంటున్నారు. స్టార్ ప్లస్ అనే టీ. వీ చానెల్ లో ప్రసారం అయ్యే 'ఆప్ కీ కచేరీ' అనే కార్యక్రమానికి జడ్జీగానూ, వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా పలు సమస్యలకి న్యాయపరమైన, చట్టపరమైన సలహాలనూ, సూచనలనూ అందిస్తారు. నవజ్యోతి అనే స్వచ్చంద సంస్థనీ,  భారతీయ జైళ్ల సంస్కరణ ల కోసం మరొక సంతని స్థాపించి వాటి కార్యక్రమాలని నిర్వహిస్తారు.
      కిరణ్ బేడి భర్త పేరు  శ్రీ. బ్రిజ్ బేడి. వీరికి సైనా అని ఒక కుమార్తె.  ఆమె తన భర్త తో కలిసి లఘు చిత్రాలూ, డాక్యుమెంటరీలు నిర్మిస్తారు.. అంతేకాక ఆమె కూడా తల్లి మాదిరిగానే సమాజ సేవలో ఎంతో ముందుంటారు.
      ఉద్యోగం అంటే కేవలం జీతం ఇచ్చే కొలువు అని ఆమె ఎన్నడూ అనుకోలేదు. నమ్మినదాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడం మాత్రమె ఆమెకు తెలుసు.. రాజీ పడడం, వెను తిరగడం ఆమెకు తెలియనే తెలీదు. అందుకే ఆమె ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచారు. నిలుస్తూనే ఉంటారు. మచ్చ లేని వ్యక్తిత్వమూ, ఎనలేని ధైర్య సాహసాలు కలగలిసిన శ్రీమతి బేడి మరెందరికో మార్గదర్శి కాగలరు అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు. 


Sunday, March 6, 2011

మహిళలూ- మణిదీపాలు (6 )

 డా. వి.  శాంత: దాదాపు యాభై సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి నివారణ, చికిత్సల  నిమిత్తం పరిశోధనలు చేస్తూ, కాన్సర్ రోగుల సంరక్షణ   కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న వైద్య శిఖామణి డా. శాంత. ఆమె అవిరళంగా చేస్తున్న కృషి కి మెగసేసే అవార్డూ, పద్మ భూషణ్ లాంటి పురస్కారాలెన్నో ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
           డా. శాంత మార్చ్ 11 , 1927 వ తారీకున చెన్నై లో జన్మించారు.   ఆమె  ఎందరో విద్యావేత్తలూ, విద్యాధికులూ ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ఆమె కి చిన్నప్పటినించీ ఎంతో ప్రోత్సాహం లభించింది  ఒక   నోబుల్ బహుమతి  విజేత, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త  సర్. సి.వీ. రామన్  గారి సోదరుని మనవరాలు, మరొక  నోబుల్ బహుమతి విజేత, విశ్వవ్యాప్తంగా ప్రముఖులైన  శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చద్రశేఖర్ గారి  మేనకోడలు. డా. శాంత. చిన్నతనం నించీ ఆమెకి డాక్టర్ అవ్వాలనే కోరిక. మద్రాస్ మెడికల్ కాలీజీ నించి 1949 లో ఎం.బీ.బీ.ఎస్ డిగ్రీనీ, 1955 లో ఎం. డీ పట్టానీ పొందారు. ఎం.డీ పూర్తీ కాగానే పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వచ్చిన ఉద్యోగం కాదని డా. ముతులక్ష్మి రెడ్డి నెలకొల్పిన కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. మూడు సంవత్సరాలు  అక్కడ ఉచితంగా పని చేసిన తర్వాత ఆమెకి నెలకు 200 రూ జీతమూ, కాంపస్ లో ఇల్లూ దొరికాయి. అప్పటినించీ ఇప్పటివరకూ ఆమె అక్కడే నివస్తిస్తున్నారు.
             డా. ముతులక్ష్మి రెడ్డి గారి కుమారుడైన డా. ఎస్. కృష్ణమూర్తి తో కలిసి 12 పడకల చిన్న హాస్పటల్ నించీ 431 పడకలతో,  దేసవ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా  పేరెన్నిక గన్న కాన్సర్ ఇన్స్టిట్యూట్ గా తీర్చి దిద్దారు. వైద్యరంగం ఎంత ఆధునిక పద్దతులూ, పోకడలూ అవలంబించినా ఎప్పటికీ పేషంట్ ల విషయం లో ఎప్పటికీ మారనిది ఒకటుంది అంటారామె. ' ఎన్నో ఏళ్లుగా  కేన్సర్ కు గురి అయిన వారిలో మొదటగా కలిగేది విపరీతమైన భయం, మానసిక సంక్షోభం.ఒక డాక్టర్ వారితో ప్రేమగా మాట్లాడి, వారిలో నమ్మకాన్ని, భద్రతా భావాన్నీ కలిగించాలి.   అప్పుడే వారికి పరిస్థితులని ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది". ఈ రోజుల్లో ఇది జరగటం లేదని, అందుకే తానూ ఎప్పుడూ మెడికల్ విధ్యార్దులకీ, వైద్యులకీ ఇదే సలహా ఇస్తాననీ అంటారు.
          అంతే కాదు, "విలియం ఒస్లేర్ అనే ప్రఖ్యాత వైద్యుడు చెప్పినట్టు. వైద్యం కేవలం సైన్సే కాదు, గొప్ప కళ కూడా. స్వాంతన కలిగిస్తూ నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ పెంచడం కళ అయితే, చికిత్స సైన్స్. నిజమైన డాక్టర్ ఎప్పుడూ రోగానికే కాక రోగికీ కూడా స్వాంతన చేకూర్చి చికిత్స  చెయ్యాలి అంటారు. ఈనాడు లభిస్తున్న ఆధునిక వైద్య విధానాలవల్ల పూర్వం కంటే ఎంతోమందిని ఈ వ్యాదినించి కాపాడ   గలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తారు.      
         వైద్య విధానాలు వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో వీరు ఇంకా తమ నియమాలకి కట్టుబడి కనీసం 60 శాతం మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. చికిత్సకీ, వైద్యానికీ రాజూ-పేదా అనే తేడా లేదంటారు. రోగాన్ని చాలా తోలి దశలోనే గుర్తించడం ఏంటో అవసరమని, తద్వారా నివారణ కీ, చికిత్సకీ ఎక్కువ వీలు , సమయమూ ఉంటుందని అంటారు. దీనికి ఇప్పుడు పెరిగిన శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకోవాలని అంటారు.
              ఎనభై మూడు సంవత్సారాల వయసులో కూడా ఆమె ఎప్పుడూ వైద్యం చెయ్యడానికీ, ఆపరేషన్లు చెయ్యడానికీ కూడా ముందుంటారు. 'తమ జీవితం ఆమె తమకిచ్చిన వరం 'అని ఎందరో పేషంట్లు వినమ్రంగా చెప్తారు. "నాకేవీ హాబీలు లేవు, ఎందుకంటే టైమే ఉండదు నాకు అంటారు'. మేలుకుని ఉన్న ప్రతీ నిమిషం ఆమె కేన్సర్ వ్యాధి నివారణకీ, చికిత్సకే వెచ్చిస్తారు. అందులోనే ఆమెకి ఆనందం, ఉత్సాహం. దీనిలో అలసట లేనే లేదు, ఆలసత్వం దగ్గరకి రానే రాదు. వచ్చే ఐదేళ్ళల్లో మీరేమి చేస్తారు? అని అడిగితె 'ఇలా దీనికోసం పనిచేస్తూనే కన్నుమూస్తే చాలు 'అంటారు..
              సేవాతత్పరత అనేది చాలా అరుదైపోయిన నేటి వైద్యరంగం లో , అలాంటి స్వార్ధపూరిత వాతావరణాన్ని  సవాలు చేస్తూ తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేసిన డా. శాంత ఎందరికో ఆదర్శం కావాలి. ఆమె చూపిన బాట లో ఎందరో యువతీ యువకులు కదలాలి.. కలిసి నడవాలి. ఆ మహోన్నత వైద్య శిఖామణి కి  మనందరి అభినందనలు తెలుపుదాం. భగవంతుడు ఆమెకు సంపూర్ణ ఆరోగ్య ఆయుర్దాయాలని ప్రసాదించాలని కోరుకుందాం.
             

Saturday, March 5, 2011

మహిళలూ- మణిదీపాలు (5 )

 ఇంద్ర నూయీ: ఇంద్ర కృష్ణమూర్తి నూయి.....వ్యాపార రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. చెన్నై లో జన్మించిన 55 సంవత్సారాల శ్రీ మతి నూయీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ నించీ డిగ్రీ చదివి, తర్వాత కలకత్తా లోని ఐ.ఐ.ఎం నించీ ఎం.బి.ఏ డిగ్రీ పొందారు. 
     చిన్నప్పుడు   ఇంద్ర తల్లిగారూ ఆమెకీ, చేల్లెలికూ ప్రతీ రాత్రి ఒక పోటీ పెట్టేవారుట, 'నేను జీవితం లో ఏమి సాధించ దల్చుకున్నాను ?' అన్న విషయం మీద ఒక  స్పీచ్ తయారుచేసి మాట్లాడాలి. ఎవరు గెలిస్తే వారికి చాక్లెట్. అలా అప్పటినించీ తమ  మీద తమకి నమ్మకమూ, జీవితంలో ఎదగాలి , ఏదో సాధించాలన్న కాంక్ష కలిగాయి వారిద్దరికీ.
చదువు పూర్తి అయిన తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలలో కొంత కాలం పని చేసాక 1978 లో ' యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ' నించి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో చేరిన ఆమె ఆతర్వాత మోటోరోలా లాంటి కంపెనీలలో కీలకమైన పదవులు నిర్వహించారు.
   పెప్సికో లో 1994 లో తొలిసారిగా అడుగిడిన ఆమె తొందరలోనే ప్రెసిడెంట్ మరియు సి.ఎఫ్.ఓ గా 2011  లో ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సలహాలలోనూ, వ్యవహారాలోనూ తనదైన కొత్త ఒరవడినీ, శైలినీ సృష్టించి కంపెనీ ని అభివృద్ధి పదంలోకి దూసుకుపోయేలా చేసారు. వీటిల్లో భాగమే 'ట్రోపికానా జ్యూస్ 'కంపెనీల కొనుగోలు, 'క్వేకర్ ఓట్స్' కంపెనీతో కలయికా వగైరాలు. సి.ఎఫ్.ఓ గా ఆమె బాధ్యతా చేపట్టిననాటి నించీ కంపెనీ వార్షిక ఆదాయం 72 % శాతం పెరిగింది అని బిజినెస్స్ వీక్ పత్రిక పేర్కొంది..అలా ఆమె 2007 లో 44 సంవత్సరాల పెప్సికో కంపెనీ చరిత్రలో ఐదవ సి.ఈ.వో గా బాధ్యతలని స్వీకరించారు. అప్పటినించీ విజవంతంగా తన బాధ్యతలని నిర్వయిస్తున్నారు. 
     స్వతంత్రంగానూ, సత్వరంగానూ నిర్ణయాలు తీసుకునే ఆమె నైజం ఆమె అభివృద్దికి ఎంతో దోహదపడింది, ఒక సారి నిర్ణయం తీసుకున్న ఏ  పనైనా సరే పూర్తి అయ్యేవరకూ విశ్రమించడం ఆమెకు తెలీదు. ఇటువంటి లక్షణాలే ఆమెని 25   బిలియన్ల బహుళ జాతి సామ్రాజ్యానికి అధిపతి ని చేసింది.. ఈ విషయాన్ని గురించి ఆమె ఇలా అంటారు. " రకరకాలైన వివక్షతలున్న సమాజంలో ఒక మహిళ ఉన్నత శిఖరాలని అధిరోహించడం అనేది మూడింతలు కష్టమనీ, దానికి తానూ ఎన్నుకొన్న మార్గం   తన పురుష సహోద్యుగల కంటే రెండింతలు ఎక్కువ కష్టపడటమే' అని. 
    ప్రస్తుతం గడుస్తున్న సమయాన్ని ఆస్వదిన్చాదమూ,  రాబోయే కాలంలో వచ్చే  ఉత్సాహభారితమైన క్షణాల కోసం ఎదురుచూడడమూ ఆమె కెంతో ఇష్టం. తను పుట్టిన దేశమన్నా ,  సంస్కృతి  అన్నా ఎంతో ఇష్టపడే ఆమె ఆఫీసు ఫంక్షన్లకీ, ఇతర సందర్భాలలోనూ సాంప్రదాయబద్ధం గా చీర ను ధరించడానికి ఇష్టపడతారు. ఇదొక్కటే కాదు తను చిన్ననాటినించే నేర్చుకొన్న ఇతర భారతీయ అలవాట్లూ, సంప్రదాయాలు మర్చిపోకుండా ఆచరిస్తారు. ఇంద్ర నూయి భర్త పేరు శ్రీ. రాజ్ నూయి, వీరికిద్దరు కుమార్తెలు. కుటుంబాన్నీ, ఉద్యోగాన్ని సమతూకంగా నిర్వహించడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. 
  ఆమె కార్యదక్షతనూ , దీక్షనూ సన్మానిస్తూ    ఎన్నో అవార్డ్ లు ఆమె సొంతమయ్యాయి. వీటిల్లో భారత ప్రభుత్వం వారు ప్రకటించిన పద్మ భూషణ్ (2007 ), బర్నార్డ్ కాలేజీ వారందించిన బర్నార్డ్ మెడల్ ఆఫ్ ఆనర్ లాంటి వాటితో పాటు మరెన్నో ఉన్నాయి. అనేక వ్యాపార పత్రికలు   వివిధ సంవత్సరాలలో ఆమెని ప్రపంచం లోని అతి శక్తివంతమైన మహిళలలో  ముఖ్యమైన  వ్యక్తిగా పేర్కొన్నాయి. ఇలా ఎన్నో విజయాలు ఆమె సొంతం. 
మహిళలూ- మణిదీపాలు (5 )
   

Friday, March 4, 2011

మహిళలూ- మణిదీపాలు (4 )

సరళా థక్రాల్: ఆకాశంలో ఎగరడమే కలగానూ, అద్భుతంగానూ భావించే కాలంలో అలా ఎగిరే విమాన్నాన్ని నడపడం ఆనేది గొప్ప సాహసం. ఇలాంటి సాహసాలూ, అవకాశాలు కేవలం మగవాల్లకే సొంతం అని భావించే కాలంలో కాక పిట్ లోకి ఒక మహిళా అడుగిడడమే కాక,  వినీలాకాశంలోకి రివ్వున దూసుకుపోయింది. భారతదేశపు ఆ తోలి మహిళా పైలట్ పేరే సరళా థక్రాల్. మనం చెప్పుకునేది 1936 వ సంవత్సరం గురించి, అప్పుడు సరళ వయసు కేవలం 21 సంవత్సరాలు. 
             అప్పటికే  తొమ్మిది  మంది పైలట్లు ఉన్నఘనత ఉన్న కుటుంబంలో శ్రీ  పీ.డీ. శర్మ తో సరళ వివాహం జరిగింది. అప్పటికామే వయసు కేవలం పదహారు  మాత్రమే. ఆ తర్వాత భర్తా, మామగారు అందించిన తోడ్పాటు, సహకారం వలన ఆమె పైలట్ కావాలన్న కోరిక నెరవేరింది. ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకూడదని, భావించి కెప్టెన్ శర్మ ఆమెని డిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ లో చేరిపించారు.  తన భర్తా, ఆయన కంటే మిన్నగా తన  మామగారు ఇచ్చిన ప్రోత్సాహమూ, ఉత్సాహమూ ఇవ్వడం  వల్లే తను అప్పటివరకూ కేవలం మగవారికే పరిమితం అనుకున్న రంగంలోకి విజయవంతం గా అడుగుపెట్టానని ఆమె అంటారు. అలా ఆమె విమానం నడపడంలో  వెయ్యి గంటల శిక్షణ పూర్తీ చేసుకుని 'ఏ' సర్టిఫికేట్ సాధించారు.
    కమర్షియల్ పైలట్ కావడానికి అవసరం అయిన 'బీ' సర్టిఫికేట్ శిక్షణ కొనసాగుతుండగానే ఆమె జీవితంలో అనుకొనే విషాదం జరిగి, 1939 లో ఆమె భర్త క్రాష్ లో మరణించారు. దానివల్లనూ, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల శిక్షణ రద్దు చెయ్యడం వల్లనూ  , ఆమె కమర్షియల్ పైలట్ కాలేక పోయారు.
            ఆ తర్వాత ఆమె లాహోర్ లో మేయో ఆర్ట్ స్కూల్ లో చేరి గొప్ప పెయింటర్ గా పేరు పొందారు. ఆమె పెయింటింగ్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ విధానం లో ఉంటాయి, దానిలో ఆవిడ డిప్లమా సంపాదించారు . ఆర్యసమాజరీతిని అనుసరించే ఆమె తర్వాత పీ.పీ. థక్రాల్ ని ద్వితీయ వివాహం చేసుకున్నారు.  ఆవిడ పెయింటింగ్ కీ, చీరాల, నగల రూప కల్పనకీ ఉన్న అభిమానుల్లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, వారిలో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ముఖ్యులు.  అంతేకాదు, ఆవిడ దాదాపు ఇరవై సంవత్సారు అనేక కుటీర పరిశ్రమలకి తను డిజైన్ చేసుకున్న నగలూ, చీరలూ ఇచ్చేవారు, వీటిలో' నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ' ముఖ్యమైనది.
    ప్రస్తుతం తొంభై ఒక్క సంవత్సరాల  సరళ ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆసక్తితో ఉంటారు. "ప్రతీ రోజూ నేను చెయ్యవలసిన పనులన్నీ కాగితం మీద రాసుకుంటాను, తగినంత పని ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, లేకపోతే ఒక ముఖ్యమైన రోజు వృధాగా పోయినట్టుగా అనిపిస్తుంది నాకు " అంటారు. "తలపెట్టిన పని పూర్తీ అయ్యేవరకూ ఆపడం ఆవిడకి తెలియదు, పై బడిన వయసు వలన ఇప్పుడు ఇదివరకులా ఒక్క బిగిన పూర్తి చెయ్యలేకపోయినా పట్టుదలగా పూర్తి చేస్తూ ఉంటాను"  అంటారు. 
        మనిషికీ, జంతువులకీ ఉన్న తేడా నవ్వగలగడం, సంతోషంగా ఉండగలగడం.. అది ఎప్పటికీ ఎవరూ వదులుకోకూడదు. ప్రతీ రోజూ ఒక కొత్త అన్భంగానూ, అనుభూతిగానూ గడపాలి, దానివల్లనే నేను నా జీవితం లో వచ్చిన కల్లోలాలని అధిగామించ గలిగానని అంటారు.
              ఏనాటికీ తరిగిపోని ఉత్సాహానికీ, పోరాట పటిమకి ప్రతి రూపంగా కనిపిస్తారు ఆమె. ఈ వయసులో కూడా తన ఇంటి పని, వంట పని స్వయంగా చేసుకుంటారు. ఆమెని ఆదర్శంగా స్ఫూర్తి పొందిన ఎందరో అమ్మాయిలు పైలట్లు అయ్యారు. 

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...