'అమ్మా నాగమ్మ '.ఈ పేరుతొ అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చింది .. అది విడుదలై పదేళ్లో, ఇరవై ఏళ్ళో అయింది.. కనక నేను ఒక సింహా వలోకనం లాంటిదేదో రాసేస్తున్నాను, అని అనుకుంటున్నారా కొంపదీసి!.. కాదు.. కానే కాదు..అలాంటి వ్యాసాలంటే బోలెడు ఇష్టమూ, రాయాలన్న కోరికా ఉన్నాయి, కానీ ప్రస్తుతం అంత సీనూ లేదు.. అంత టైమూ లేదు..
గొప్ప పెద్ద పాత్ర!! |
ఎందుకంటే ఇప్పుడు నేను గత వారం రోజులుగా 'కలలోనైనా మెలకువనైనా తలచేద నిన్నే' అని కలవరిస్తున్నది ఒకే పేరు.. ఒకే మనిషి.. ' ఆవిడే శ్యామల!!!' కాదు కాదు.. ' ఆవిడే నాగమ్మ'.. అమ్మయ్యా! చెప్పేశానా! ఇప్పటికే మీ కర్ధం అయిపోయి ఉంటుంది.. నాగమ్మ అంటే ఎవరో ?ఆవిడ పాత్ర నా ఈ చిన్ని, బుజ్జి జీవితం లో ఎంత గొప్పదో..
ఈ రోజు మీకు ఇంత సులువుగా చెప్పెస్తున్నాను కానీ ఆ రోజు.. నాకే అర్ధం కాలేదు..
పోయిన శనివారం పొద్దున్నే కుడి కన్ను అధిరితే..వేడి చేసిందేమో అనుకున్నాను.కానీ అసలు విషయం గ్రహించలేదు.
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.. నేను ఎం. ఎస్. సి లో ఉండగా మా ఫ్రెండ్ అనుపమ 'ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది కాదు, అశుభం, గోంగూర.. అంటారు.. నన్నడిగితే ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే, పెళ్ళయిన వాళ్ళైతే భర్తకీ, కాని వారైతే కాబోయే వాడికీ మంచి జరుగుతుంది అని అర్ధం చేసుకోవాలి.. అనేది..
మాయాబాజార్ లో శాస్త్రీ, శర్మ లు చెప్పినట్టు "శాస్త్రం ఏది చెప్పినా కర్కశం గానూ, నిష్కర్శ గా నూ చెప్తుంది.. మనమే దానిని సున్నితంగా అర్ధం చేసుకోవాలి అని తెలుసుకున్నాం.
అంతే కాదు తను కుడి కన్ను అదిరినప్పుదల్లా, 'ఎక్కడున్నాడో తెలియదు గానీ, మా కాబోయే ఆయనకీ మంచి జరుగుతుంది ఈ రోజు' అని ' అదిరేటి కన్ను నాదైతే, వచ్చేది మంచి నీకైతే.. ఏలా దడా ? అని పాడేసుకుని పరవశించి పోయేది ..
ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకుని నేను ఆ శనివారం నాడు పొద్దున్నే కుడి కన్ను అడిరితే మా అనుపమ లాగే అనుకున్నాను కాని.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ( కొంచం మెలోడ్రామా ఎక్కువ అయిందా? సారీ, ఆ సందర్భమే అలాంటిది మరి)
ఆ రోజు.. నాకూ మా నాగమ్మ కి మధ్యన జరిగిన సంభాషణ.
ఇక్కడ నాగమ్మ గురించి రెండు ముక్కలు చెప్పాలి.. చాలా స్వతంత్రభావాలు కలిగిన మనిషి. భర్త చేసిన పనులు నచ్చక తను పిల్లలతో విడిగా ఉంటుంది.. అత్తవారి సపోర్ట్ తనకే.. అంతే కాదు.. ఒక అక్క చనిపోతే ఆవిడ పిలల్లనిద్దరిని హాస్టల్ లో పెట్టి చదివిస్తుంది.. ఆడపడుచు పెళ్ళికీ, అన్నయ్య లు పొతే వాళ్ళ కుటుంబాలకీ తనకి వీలైనంత అండగా ఉంటుంది. పెద్ద పిల్లాడు డ్రైవర్ గా పని చేస్తాడు, చిన్నవాడు చదువుకుంటున్నాడు.. పాపం ఆ అబ్బాయికి తరచూ ఫిట్స్ వస్తాయి.. అదొక టెన్షన్.. స్కూల్ నించి ఫోన్ వస్తుంది.. ఆదరా బాదరా గా పరిగెడుతుంది.. వాడి ట్రీట్ మెంట్ కోసం నిం హాన్స్ చుట్టూ చక్కర్లూ..ఆ బాధలూ, బాధ్యతలూ తనని తరచూ చికాకు పెడుతూనే ఉంటాయి.. అందుకే అందరూ' తిక్క ఎక్కువ ,నాగమ్మ మూడీ.. ఏమీ మాట్లాడదు రోబోలా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతుంది.. అంటారు.. నాకు చికాకు.. మీరెలా భరిస్తున్నారు అని కూడా అడుగుతూ ఉంటారు.నాకు మాత్రం ఒక్కోసారి తనని చూస్తె జాలి గానూ, తన ఇండివిడ్యువాలిటీ చూస్తే ఆనందంగానూ, గౌరవంగానూ ఉంటుంది.. వీలైనంత సహాయం చెయ్యడానికే ప్రయత్నిస్తాము మేము.. అలాగే గత ఏడు సంవత్సరాలుగా సాగుతోంది మా రిలేషన్.
మళ్ళీ సంభాషణ లోకి..
"మీరొక్కరే ఊర్లో ఉండేది.." అంది ఉపోద్ఘాతమనేదే లేకుండా..
"అంటే ఏమిటి ?" అన్నాను నేను .. తొందరగా వెలగలేదు ఫ్యూజు ..
"మీరు ఊరికి పోవట్లేదా ? అందరూ పోతున్నారు" మీరు కూడా వెళ్ళండి.. అంది 'వామనమూర్తికి బలి చక్రవర్తి భూదానం చేసినట్టు నాకు హాలిడే దానం చేస్తున్న ఫీలింగ్ తో..ఇలా నాగమ్మే నాకు లీవ్ ఇచ్చేస్తే ఇంకా మన మేనేజర్లు ఎందుకు? లీవ్ అప్రూవింగ్ సిస్టమ్స్ వగైరాలేందుకు?? అంతా భ్రమ..చిత్త భ్రాంతి
అప్పటికి అర్ధం అయింది.. 'ఎందుకు నువ్వు రేపు రావా? ' అన్నాను మెల్లిగా.. ( అదే మరి అజ్ఞానం.. ఒక్కరోజుకే ఐతే నాకు హాలిడే దానం ఎందుకు చేస్తుంది.. ? అనే ఆలోచన లేకుండా)
"రేపు వస్తాను.. సోమవారం నించి ఆరు రోజులు లీవ్ వేస్తున్నాను..మేల్ మరువత్తూర్ వెళతాము కదా, అంది. ఆవిడ ప్రతీ సంవత్సరం అమ్మవారి దీక్ష తీసుకుని ఆ ఊరు వెళుతుంది.. అది తెలిసిన విషయమే
"కానీ ఎప్పుడూ నువ్వు వెళ్ళేది 2-3 రోజులే కదా !.. ఈ సారి ఇన్ని రోజులేందుకు ?" అన్నాను ..
"మా పిల్లలిద్దరూ కూడా వస్తున్నారు.. వాళ్ళు కూడా దీక్ష తీసుకున్నారు. అందుకే అటునించి అటే రామేశ్వరం అవీ పోయి వద్దామని.. " అంది
ఆఫీస్ లలో పని చేసే వాళ్లకి లీవ్ అప్లై చెయ్యడమూ, అప్ప్రూవ్ అవ్వడమూ, కాకపోవడమూ అనే సమస్యలుంటాయి.. ఇక్కడ అలా కాదు కదా.. ఇది కేవలం ఇన్ఫర్మేషన్..
డిసైడ్ చేసినా.. |
'నేను ఇలా డిసైడ్ చేసినా.. నీ తిప్పలేవో నువ్వు పడు' అని..
"అందుకే చెప్తున్నాను.. నేను రాకపోతే కష్టం కదా.. మీరు కూడా ఊరికి పొండి "అంది నవ్వుతూ.."ఈ లాజిక్ చాలా బావుంది..అని నేను నవ్వాను. ఇంకేం చెయ్యగలను?
"అన్ని రోజులా? పోనీ నీకు తెలిసినవాళ్ళ నేవరినైనా చూసి ఈ నాలుగురోజులకి రమ్మన వచ్చు కదా, రేపు నాకు చుట్టాలు వస్తారు కూడా అన్నాను..
" ఎవరున్నారు? ఆ ప్రియ నిన్ననే పోయింది.. ఈ రత్న నాలుగురోజులు రానంది.. లక్ష్మి రేపు పోతోంది అని లిస్టు చదివింది..
ఇంకా నాకు ఓపిక నశించి.. "సరేలే.. ఏదో చెయ్యి.. కనీసం వచ్చే ఆదివారం వస్తావా? "అని అడిగాను నీరసంగా..
"వస్తాలెండి"..అంది ఉదారంగా.. "అది చాలనట్టు ఒక మూడు వేలు ఉంటె ఇచ్చేయండి.. జీతంలో కట్ చేద్దురుగాని.. అంత దూరం పోయాక డబ్బు తక్కువైతే కష్టం కదా! అంది..
'పోనీలే పాపం,. వెళ్లక వెళ్లక, ఒక సారి పిలల్లతో కలిసి వెళుతోంది అని వెంటనే మూడు వేలు ఇచ్చాను.
ఏ మాట కి ఆమాట చెప్పుకోవాలి.. " పని చేసే తీరు ఎలా ఉన్నా, వారం రోజులు సెలవు పెట్టడం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు మా నాగమ్మ విషయం లో.. ఒకటి రెండు రోజులకి మించి పెట్టదు.. వారం రోజులకి సరిపడా పని, అలవోకగా అరగంట లో చేసేస్తుంది ... అదే వేరే విషయం..
సుప్పండి |
ఇక్కడో చిన్న కధ. వెనకటికెవడో మన సుప్పండి లాంటి వాడు రాజు గారి దగ్గరకి వచ్చి "నన్ను పనిలో పెట్టుకోండి మహారాజా!, నా పని ముగ్గురి పని అన్నాడుట.. ఆయన సంబరపడి పెట్టేసుకుంటే తీరా తెలిసినది ఏవిటంటే ఈయనగారు చేసిన ప్రతీ పనికి వెనక ముగ్గురు సరి చెయ్యవలసి వచ్చేది.. అదే నా పని ముగ్గురి పని అంటే అని".. కొంచం అలాంటి దే ఇదన్నమాట. తనకి నచ్చినట్టు చేస్తుంది..
నేను ఏదైనా చెప్పబోతే.. "మీరొక్కరే నాకు చెప్పేది.. అది బాగులేదు.. ఇది బాగులేదు అని.. ఇంకెవ్వరూ అనేలేదు.. అంటుంది ఎదురు.. ఇంటి తాళం తన చేతిలో పెట్టినా సరే ఇల్లు బాంక్ అంత భద్రంగా ఉంటుంది అన్న భరోసా మీద మా నాగమ్మ "బ్రాండ్ వాల్యూ' చాలా చాలా ఎక్కువ..చాలా నమ్మకమైన మనిషి. నిజాయితీ తన రెండో పేరు.
అలా నా ఇంటినీ , నా ఇంటి పనినీ నా చేతుల్లోనే పెట్టేసి తను హాయిగా అమ్మ వారి దీక్షకని కొనుక్కున్న ఎర్ర చీర కట్టేసుకుని ఎర్ర బస్సెక్కి వెళ్ళిపోయింది హాయిగా.
ఎర్ర cheeraa |
ఎర్ర బస్సూ |
ఈ మర్ఫీ అనేవాడేవడో కానీ కంటికి కనబడితే కట్టేసి, కొట్టేసే వాళ్ళు ఎంత మంది ఉంటారో నేను ఊహించగలను..నాతొ సహా..
మర్నాడు ట్రైన్ దిగబోయే చుట్టాలూ..నాలుగు రోజుల్లో భోజనానికి రమ్మన్న బంధువులూ, అర్జంట్ పని మీద ముఫై కిలోమీటర్లు రానూ, మరో ముఫై పోనూ, వెళ్ళవలసిన ఆఫీస్ పనీ ఇలాంటివన్నీ తలుచుకుంటే నే బెంగ పట్టుకుంది నాకు..
ముగ్గురు నలుగురు స్నేహితులకి ఫోన్లు చేసాకా తెలిసింది.. అందరిదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. వీళ్ళందరూ కూడగట్టుకుని వెళతారేమో? తమ పనే కాదు, ఇతరుల పని తప్పించు కోవడానికి అనిపించింది..
అంతలోనే పట్టుదలా.. 'ఒకరి మీద ఆధార పడితేనే కదా?.. ఈ ఖర్మ.. మనం చేసుకోలేకపోతే కదా, ఇంతోటి పని.. ఒక్క అరగంట ముందు నిద్ర లేస్తే సరి.. అని భీషణమైన ప్రతిజ్ఞలు చేసేసుకున్నాను.
'ఎప్పడూ నాగమ్మ వెనకాల ఇది సరిగ్గా చెయ్యి.. అది ఇలా చెయ్యి అని చెప్పే బాధ ఉండదు.. మనకి కావలసినట్టు మనమే హాయిగా చేసుకోవచ్చు..
ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు .. ఇలా వెయ్యి రకాలుగా నాకు నేనే సర్ది చెప్పేసుకుని
ఒక స్క్రబ్బరూ, చీపురూ చేత్తో పట్టుకుని రెడీ అయిపోయాను. ఆ గుర్తొచ్చింది.. మొన్నెప్పుడో స్కాచ్ బ్రైట్ వాళ్ళు కొత్త తుడుచుకునే వస్తువేదో పరిచయం చేస్తూ మా అపార్ట్మెంట్ లో కొన్ని పోటీ లు అవీ పెట్టారు.. నెగ్గిన వాళ్లకి, వాళ్ళ ప్రాడక్ట్స్ గిఫ్ట్ గా ఇచ్చారు.. నాకు కూడా చాలా వచ్చాయని మీకు చెప్పాలి కదా..ఇవిగో చూసేయండి మరి..
ఇవన్నీ నాకు వాళ్ళు ఇచ్చ్చినవి..వెబ్ నించి తీసిన ఫోటో కాదు.. |
మేము ముగ్గురం, వచ్చినవాళ్ళు ముగ్గురూ,, పొద్దున్న టిఫిన్లూ, మధ్యాహ్నం భోజనాలూ చేస్తే ఇన్ని గిన్నెలు వస్తాయని నేను ఎప్పడూ ఊహించనే లేదు.. కొంపదీసి నాకు గిఫ్ట్ గా వచ్చిన స్క్రబ్బార్ లన్నీ అయిపోతాయేమో అని భయం వేసింది.
సింక్ ఖాళీగా , క్లీన్ గా ఉంచాలనే తాపత్రయంలో ప్రతీ అరగంటకీ గిన్నెలు తోముతూనే ఉన్నాము.. సర్డుతూనే ఉన్నాము.. ' పాత కాలపు పత్రివ్రతల సినిమాలలో అంటే, ' సతీ సక్కుబాయి' లాంటి వన్న మాట.వాటిల్లో ఆవిడ గిన్నెలు తోముతూనే ఉంటుది.. ఆవిడని కష్టాలు పెట్టడమే ధ్యేయంగా ఉండే పాత్రలు ఇంకా తెచ్చి పడేస్తూ ఉంటారు.. అది ఎంత వద్దనుకున్నా గుర్తోచ్చేసింది..
ఐతే ఇక్కడ అన్ని పాత్రలూ మనమే ( అంటే తోమించుకునే పాత్రలు కాదు లెండి ).. అదీ చిన్న తేడా.. "చేసేడి వాళ్ళమూ.. చేయించెడి వాళ్ళమూ మేమే.. అని భగవద్గీత కూడా పాడేసుకున్నాము..అంతే కాదు.. తోముకోడానికి గిన్నెలు అయిపోవడం అంటూ ఉండదు.. న్యూటన్ సూత్రంలాగా అప్పుడప్పుడు కాఫీ పాత్రలలాగానూ, మరొకప్పుడు టిఫిన్ పాత్రలలాగానూ, ఇంకోసారి వంట పాత్రలలాగానూ అవి రూపాంతరం చెందుతూ ఉంటాయి అని కూడా అర్ధం అయింది.
ఇంకా ఇల్లు తుడుచుకోవడం.. చీపురుతో తో మొదట.. తడి బట్టతో పిమ్మట.. ఇది ఒక్క పని లా కనిపించినా నిజానికి రెండు పనులు.. ఒక్కసారి తుడిచేసరికే నీరసం వచ్చింది..'మనం తుడుచుకుంటే ఎలా అద్దం లా మెరుస్తోందో? లాంటి మాటలు ఒకటికి పది సార్లు నాకు నేనే చెప్పుకుంటూ సంతృప్తి పొందడానికి విఫల యత్నాలు చాలానే చేసాను.
మొదటి రోజు చేసినప్పుడు ఆ ప్రయత్నం కొంత సఫలమైనా తర్వాత 'ఆ ఎలా ఉంటే ఏమిటి? ఇప్పుడు ఎవరు వచ్చి చూస్తారు?" అని మనసు అరుస్తుంటే నిజమే కదా అనుకున్నా..
మళ్ళీ అంతలోనే.. "ఛీ ఇలా అయిపోయనేమిటి? ఎవరికోసమో చేసుకుంటామా, మనకోసమే కదా ! అని దాని గొంతు నొక్కేసి మళ్ళీ బట్ట పెట్టి తుడిచేసా. దానికి తోడు మా అబ్బాయి 'అవును మా..ఈ రోజు ఇల్లు చాలా క్లీన్ గా ఉంది.." అని పొగడ్తలు.
గుండె గుభేల్ |
'రోజూ మనం తిరిగే ఇల్లు ఇలా భూగ్రహమంత పెద్దదిగా ఉందేమిటి? అసలు భూమినంతా ఎవరైనా తుడవాలంటే ఎన్ని రోజులు పడుతుంది?అసలు నైనైతే తుడవగాలనా? లాంటి తిక్క ప్రశ్నలు కూడా చాలానే ఉదయించాయి... ఇంకా బాల్కనీలు.. స్నానాల గదులూ మిగిలాయా? .. అమ్మ నాయనోయ్..అని గుండె గుభేల్మంది. ఇలా ఏదో అష్ట కష్టాలూ, ఆపసోపాలు పడుతూ రెండు రోజులు గడిచాయి.
చైన్ రియాక్షన్ |
మర్నాడు ఆఫీస్ నించి వచ్చేసరికి లేట్ అవ్వడంతో వంటా, భోజనాలూ, మిగతా పనులూ అయ్యేసరికి రెండు గంటలు పట్టింది.. మెషీన్ లో వేసిన బట్టలు 'మా సంగతేమిటి?' అని అడుగుతున్నాయి మరి.. నిద్ర కళ్ళనీ, వాషింగ్ మెషీన్ మూతనీ తెరిచి బట్టలు ఆరేయ్యాలంటే అంతక్రితం తాళ్లమీద ఉన్నవాటిని తీసి లోపలకి తేవాలి.. ఆ తెచ్చిన వాటిని మడత పెట్టాలి.. అవి మళ్ళీ వేసుకోవాలి. ఇలా చైన్ రియాక్షన్ అంటే ఏమిటో చాలా బాగా అర్ధం అయింది.. ఎంతైనా థియరీ కంటే ప్రాక్టికల్ కున్న వేల్యూ ఎక్కువ కదా..
జ్ఞానార్జన |
ఒక్క ఫిజిక్సూ, కేమిస్ట్రీ మాత్రమేనా ? మా నాగమ్మ నాలుగు రోజులు రాకపోతే ఎంత జ్ఞానం వచ్చిందో తెలుసా? .. మన ఇల్లు ఎలా ఉంది? ( జాగ్రఫీ/భూగోళం), వైశాల్యం ఎంత? పోడువెంత? వెడల్పెంత? ( జామెట్రీ), ఎపుడు ఎన్ని సార్లు తుడిచాను లేదా గిన్నెలు తోమాను? ( చరిత్ర), ఏ పని చేస్తే అది ఇంకో పనికి అనుకోకుండా దారి తీస్తుంది ? ( కెమిస్ట్రీ), ఏ పని చేస్తే ఎలాంటి ఎఫ్ఫెక్ట్ వస్తుంది? ( ఫిజిక్స్) మొక్కలకి నీళ్ళు మనకున్న టైము లో ఎప్పుడు పొయ్యాలి? అర్ధరాత్రి పోసినా ( అంటే టైము లేక) పరవాలేదా? ( బోటనీ), మన మొక్కల తోట్టెలు బాగా నచ్చి వాట్లో తమ విశ్రాంతి గృహాలని ఏర్పరుచుకున్న పావురాలని డిస్టర్బ్ చెయ్యకుండా బాల్కనీ ఎలా తుడవాలి ( జువాలజీ)లాంటివే కాకుండా ఇంత పని ఎందుకు చెయ్యాలి ? ( తర్కం), ఏది ఎప్పుడు చెయ్యాలి ( మీమాంస), ఎలా కరక్ట్ గా చెయ్యాలి ( వ్యాకరణం) లాంటి వి కూడా బాగానే పట్టు బడ్డాయి..
అయితే అన్నింటి కంటే ముఖ్యంగా అలవడినది ఫిలాసఫీ అన్నమాట.. 'ఈ క్షణ భంగురమైన జీవితం లో ఈ ఇల్లు తుడిస్తే ఎంత ? తుడవక పొతే ఎంత? అనీ, బట్టలు ఉతికితేనే బట్టలా? లేకపోయినా బట్టలే కదా అని.. ఇలాంటివన్నమాట..
పొరపాటున కూడా ఇవన్నీ మా నాగమ్మ కి చెప్పకండి.. మీ మంచి కోసమే, మీ జ్ఞాన సముపార్జన కోసమే నేను లీవ్ తీసుకున్నది అన్నా అంటుంది..
సరే ఇలా ఆదివారం నించీ మూడు రోజులు సాగి బుధవారం వచ్చేసరికి నేను మా అబ్బాయికి ఎప్పుడూ చెప్పే విషయం ఒకటి గుర్తొచ్చింది. నేను పని చేస్తుంటే వాడికి చాలా తేలికగా జరుగుతున్నట్టుగా కనిపించి " ఓ! వడలు చెయ్యడమంటే ఇంతేనా? నేనూ చేసేస్తాను అనో.. పరాతాలు చెయ్యడం ఇంత ఈజీనా? .. అనో అన్నప్పుడు.. నేను నవ్వుతూ.. మనం చెయ్యక్కరలేని పని ఏదైనా సరే, ఎదుటి వాళ్ళు చేస్తుంటే చాలా సులువుగా అనిపిస్తుంది.. మనం చెయ్యవలసి వస్తేనే తెలుస్తుంది అందులో కష్టం అని అంటూ ఉంటాను.. ఇప్పుడు నా పరిస్థితి అదే..
అంటే
అమాంతం గా నాగమ్మ మీద అంతులేని జాలి పుట్టుకొచ్చింది. ' నాలుగు రోజులకే ఇంత విసుగు వచ్చేసింది.. రోజూ ఎలా చేస్తుందో పాపం.. అదీ ఒకటి కాదు, నాలుగైదు ఇళ్ళల్లో.. అందుకే పాపం అప్పుడప్పుడు ఈరోజు ఇల్లు బట్ట పెట్టి తుడవను అదీ అంటుంది అనిపించడం మొదలు పెట్టింది. పాపం ఈసారి అలా అంటే సరేలే! రేపు చేద్దువుగానిలే, అనాలి లాంటి భావాలన్నీ వచ్చేసాయి. ( ఇంతకూ ముందు అన్నాను అయినా సరే.. ఇప్పుడు కొత్తగా వచ్చిన జాలివల్ల అలా మరీ గట్టిగా అనిపిస్తోంది అన్నమాట).
ఎవరి పని వాళ్ళు చేస్తే తెలీదు కానీ మనమే అన్నీ చేసుకోవాలంటే తెలుస్తోంది అనుకున్నాను..
ఎవరి పని వాళ్ళు చేస్తే తెలీదు కానీ మనమే అన్నీ చేసుకోవాలంటే తెలుస్తోంది అనుకున్నాను..
అంతే కాదు తనతోటి.. " మనం డబ్బు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఒప్పుకున్న పని చేయాలి అని అనుకుంటాం కానీ చాలా బోర్ పాపం! అని కూడా చెప్పేసాను. అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేసినందుకు తనకీ తెలిసింది కదా.. 'వెరీ ట్రూ' అని చెప్పేశారు..
ఇది 'స్టాక్ హోమ సిండ్రోం' లా 'హౌస్ వితౌట్ నాగమ్మ 'సిండ్రోం ఏమో మరి..
ఏది ఏమైనా ఇవ్వాళ భళ్ళున తెల్లారి గురువారం అనుకోగానే 'అమ్మయ్య నాగమ్మ వచ్చేసే రోజు దగ్గరకొచ్చేసింది' అనుకుని ఆనందపడిపోయాను.. మళ్ళీ ఆఫీస్ నించి రాగానే చెయ్యడం కష్టం అని పని చేసేసుకుని వచ్చాను అనుకోండి.. ఇంకా ఇప్పుడు ఇంటికెళ్ళి..
"అమ్మా నాగమ్మా, త్వరగా రావమ్మా! అని పాడుకుంటూ వెయిట్ చెయ్యడమే.."ఇంకేమైనా చెయ్యచ్చా? కొంచం సలహా చెప్పరూ!!