Thursday, September 30, 2010

రాబోయే ప్రపంచ యుద్ధాలు..

         యుద్ధం రావాలని ఎవరూ కోరుకోరు. అందునా ప్రపంచయుద్ధం?? .అనుకోడానికే భయంగా ఉంటుంది. కానీ ఈ మధ్యన ఎక్కడ చూసినా మూడో ప్రపంచ యుద్ధం నీటికోసం జరుగుతుంది అనే చెప్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా మనం వనాలనీ, తటాకాలనీ, కొండలనీ, కోనలనీ, నదులనీ, సముద్రాలనీ వేటినీ వదలకుండా మన స్వార్ధం కోసం వాడేసుకుంటే తాగడానికి కూడా నీరు దొరక్క మన మనుగడకే ముప్పు రావచ్చు అన్నది మనందరికీ తెలిసినదే... వివిధ దేశాలలో ఇది చాలామందికి ఎంతో కొంత అనుభవంలోకి వచ్చిన విషయమే. నీతివనరులకోసం వివిధ దేశాలూ, రాష్ట్రాల  మధ్య విభేదాలు మరింత ఉధృతం గా మారితే మాత్రం యుద్ధాలు నిజంగానే తప్పవు. చూస్తూ ఉంటే కేవలం నీరు ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటికోసం యుద్ధాలు జరగవచ్చు అని. మరి అదేమిటి? మీరే చూడండి.
ఆదివారం కదా, సరదాగా అలా బయట తిరిగోద్దామా? అనుకుంటారు.. మీరూ, మీ శ్రీమతీ..ఇంకేం? అనుకోగానే త్వరగా తయ్యారయిపోతారు మంచి బట్టలు వేసుకుని, సెంటూ వగైరాలు కొట్టుకుని. కాని మీకు ఇక్కడ తెలియనిది ఒకటి ఉంది. మీరు అనుకున్న సమయానికే మీ ఊరిలో అనేక వందల  మంది అలాగే అనుకున్నారనీ, వాళ్ళందరూ కూడా మీరు కార్ బయటకు తీసే సమయానికే బయలుదేరారనీనూ.. 
ముందు కొంచం షాపింగ్ చేసేసి తర్వాత రెస్టారంట్ లో భోజనం చేసేసి వద్దాం అనుకున్నారు. రక రకాల సిగ్నల్స్ దాటుకుంటూ, ట్రాఫిక్ లో పడుతూ లేస్తూ, బయటకి వచ్చినందుకు మనల్నీ దారిలో మనకి అడ్డొచ్చిన వారినీ తిట్టుకుంటూ  షాపింగ్ మార్కెట్ దగ్గరకి వెళ్ళడానికి ఒక గంట..అక్కడకి వెళ్ళాకా ఉంటుంది.. కార్ ఎక్కడ పెట్టాలి?? హైదరాబాద్ లో ఆబిడ్స్, బెంగళూర్ లో కమర్షియల్ స్ట్రీట్ ఇలాంటివి అయితే కనీసం అరగంట పడుతుంది ఒక ఖాళీ స్థలం దొరకడానికి.
వరసగా రకరకాల రంగులూ, సైజులూ, ఆకారాల్లో కార్లు తోరనాల్లా పార్క్ చేసి ఉంటాయి.దీనికొక వరసా వావీ ఉండదు,వెతికి చూద్దామన్నా క్రమశిక్షణా, పద్దతీ కనపడదు. ఎక్కడైనా ఒక చోట ఖాళీ కనిపించిందంటే అది ఖచ్చితంగా ఎవరిదో గేట్ అయ్యి ఉంటుంది. లేదా ట్రాన్స్ ఫార్మర్ లాంటి దానికి దగ్గర, పేలిపోయే ప్రమాదం ఉండవచ్చు అని జనం అనుకున్న చోట మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఓ నాలుగు ప్రదక్షిణాలు చేస్తే దొరకవచ్చు.ఇది ఓపెన్ మార్కెట్ లలో పరిస్థితి అయితే ఇంకాకేవలంమహానగరాలే కాక ఒక మాదిరి నగరాలలోకూడా ప్రముఖ సందర్శనాలయాలుగానూ , మళ్ళీ మాట్లాడితే దేవాలయాలంత  గోప్పవిగానూ  మారిపోయిన మాల్స్ లో పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. కొన్నింట్లో ఓ  పది అంతస్తులలో పార్కింగ్ ఉంటుంది. తిరుపతి ఘాట్ రోడ్ ఎక్కినట్టు లాఘవంగా స్టీరింగ్ తిప్పుకుంటూ ఎక్కడ 'పార్కింగ్ ఫుల్' అన్న బోర్డ్ లేదో చూసి అక్కడ పెట్టుకోవాలి. దీనికి మూల్యం బానే చెల్లిం చుకోవాలి మనం పెట్టే గంటల్ని బట్టి. మన వ్యాపారవేత్తలకి మాల్ కట్టడం లో ఉన్నంత శ్రద్ద పార్కింగ్ చోటు కట్టడం లో ఉండదు ( రెండిం టి మీదా వచ్చే ఆదాయం  లో ఉన్న వ్యత్యాసం ఒక్కటే  దీనికి కారణమా?). దానివల్ల ఎన్నో అవకతవకలూ, కొన్నిసార్లు ప్రమాదాలు.. సరిపడినంత స్థలం వదలక పోవడం వాళ్ళ మలుపులు తిరుగుతూ పైకి ఎక్కేదప్పుడూ, కిందకి దిగేటప్పుడూ ఎన్నో కార్లు గోడలని గుద్దేసుకోవడం నాకు తెలుసు. కొన్ని చోట్ల దానిని తగ్గించడానికి మలుపుల్లో పెద్ద పెద్ద రబ్బర్ మాట్ లని గోడలకి తాపడం చేయడం కూడా నాకు తెలుసు.
"భారత దేశంలోనే అతి పెద్ద సూపర్ మార్కెట్"! అని ఒకరూ.. "ఆసియా ఖండంలోనే గొప్ప మాల్" అని ఇంకొకరూ. "మీ గృహ ఉపకార ణాలన్నీ  ఒకే చోట లభించే చోటు "అని ఇలా పేపర్లలో చదవడానికి  బానే ఉంటుంది. కానీ దానికి తగ్గ పార్కింగ్ లేనప్పుడు వీటి అంత తలనొప్పి మరొకటి ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే చోట కడితే వ్యాపారం బాగుంటుంది అన్న దూరదృష్టి చాలా మంచిదే కానీ దానికి తగ్గ సదుపాయాలూ లేనప్పుడు ఇలాంటివి తెచ్చే లాభాలకన్నా, ఇబ్బందులే ఎక్కువ.. షాపింగ్ మార్కెట్ లూ, సినిమా హాళ్ళూ కలిపేసి ఒకే చోట కట్టేసే చోట ఈ సమస్య మరీ అధికం. కొన్ని చోట్ల కనీసం భద్రతా ఏర్పాట్లు లేకుండా కట్టేస్తారు. ప్రమాదం చెప్పి రాదు, మన జాగ్రత్త మనం తీసుకోవాలి అన్న ఆలోచనే ఉండదు.
  అదీకాక మనవారికి మనం కొనదలుచుకున్న షాప్ ముందే దిగాలి, వీలయితే మెట్లమీద.మనం దిగాకా కార్ అక్కడే ఉంది వెయిట్ చేస్తే మన పని పూర్తి కాగానే ఎక్కడానికి వీలుగా ఉంటుంది. కొంత దూరం నడిచి కార్ ఎక్కాలంటే ఇంకా కార్ లో వచ్చి లాభం ఏమిటి? ఇలాంటి ఆలోచనులున్నప్పుడు ఇంకా పార్కింగ్ ఎలా దొరుకుతుంది? అందుకే ప్రజల కోసం కట్టిన పార్కింగ్ ప్లేస్ లలో అరుదుగానూ, రోడ్ల మీద అన్నిచోట్లా తరచుగానూ కార్లని చూస్తూ ఉంటాము. వీటికోసం పెరిగిపోయే కోపాలు, గొడవలూ మాల్స్ లోకి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ ఆపకుండా కొట్టేసే హారన్లూ ఇవన్నీ చూస్తె నిజంగా విరక్తి వస్తుంది. ఈ మధ్యన కొన్నిచోట్ల చాలా కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది చూడటానికి బానే ఉన్నాయి.. పైకి, కిందకీ ముందుకీ, వెనక్కి మన కార్లని జరిపి తిరిగి మనకప్పగించడానికి పట్టే సమయం తప్ప. పెరుగుతున్న జనాభాతో పాటూ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న  వాహనాల సమాఖ్య ఇలానే సాగితే కేవలం వీటిని నిలుపుకోదానికే రాష్ట్ర సరిహద్దులూ, దేశ సరిహద్దులూ కూడా దాటవలసి వస్తుందేమో?

ఉన్న ఇన్ని గ్రహాలలో నివాసయోగ్యమైనది భూమి ఒక్కటే ( కనీసం ఇప్పటికి).  మన అవసరాలకోసం, స్వార్ధం కోసం, సంపాదనకోసం మన భూమిని ఇప్పటికే ఎంతో దుర్వినియోగం చేసేసాము, చేస్తూనే ఉన్నాం. ఇది ఇలాగే సాగితే మనం నిలబడ టానికైనా   స్థలం ఉంటుందో, లేదో? ఇంకా అప్పుడు కార్లు నిలబెట్టుకోవాలంటే ప్రపంచ యుద్ధాలు నిజంగానే   జరిగినా జరుగుతాయి.
  

            

Friday, September 17, 2010

జాలిగా జాబిలమ్మా..



        మనసులో   నాలుగు కాలాలపాటు నిలిచిపోయేది మంచిపాట అనుకుంటే ఎప్పుడు గుర్తు వచ్చినా కళ్ళనే కాదు మనసుని తడిమేదీ, తడిపేది.. గొప్ప పాట. అలాంటి గొప్ప పాటలు మాత్రమే రాయగలిగే  ఒక కలం.. ఆ కలం పట్టే ఒక చెయ్యి.. ఆ చేతిని ఎప్పుడూ , ఎల్లప్పుడూ సరి అయిన దిశలో మాత్రమే నడిపించే ఒక  సాహితీ మూర్తి.. సొంత పేరు కాకపోయినా పాటల వెన్నెలలూ, మాటల మిల మిలలూ కురిపిస్తూ,  పొందిన ఆ   పేరుకే  కళనీ, కాంతినీ, వెన్నెలంత చల్లదన్నాన్నీ, అపారమైన గౌరవాన్నీ  ఆపాదించుకున్న  ఆ  వ్యక్తి 'శ్రీ సిరి వెన్నెల.'   ఆయన కలంలో ఒదగని భావం లేదు.. ఆ ఇంకులో ఇంకని మధురిమ  లేదు..ఎంతమంది  ఎన్ని రకాలుగా  రాసినా, కీర్తించినా  ఇంకా  ఇంకా చెప్పుకోడానికి మరెంతో మిగిలి ఉన్న అసమాన  ప్రతిభా మూర్తి ఆయన . అందుకే ఈ టపా.  ఈ సాహితీ చంద్రునికో నూలుపోగు..
            " శ్లేషా మాత్రంగానైనా అభ్యంతరకరమైన పదాలుండవు శాస్త్రి గారి పాటల్లో "అని శ్రీ బాలు గారు ఎప్పుడూ చెపుతూ ఉండే మాట ఎంత నిజమో ఆయన రాసిన ఏ పాటైనా చెప్తుంది. అంతే కాదు.. కత్తికి  మహా ఉంటే రెండు వైపులా పదును ఉండవచ్చు  కానీ  కలానికీ, కవి హృదయానికీ అన్ని వైపులా పదునే అంటుంది ఆయన కలం. అందుకే  ఒక పాటలో 'తరలి రాద  తనే వసంతం.. తన దరికి రాని వనాలకోసం" అని  అంటే.. "అదుపెరుగని  ఆటలాడు వసంతాలు వలదంటే విరి వనముల పరిమళముల విలువేముందీ?" అంటారు మరొక పాటలో.   . పరస్పరం విభిన్నంగా అనిపించే భావాలని అందంగా రాసి నిజమే కదా అనిపించి ఒప్పించా గలగడమే   ఆయన  గొప్పతనం.
              మూడు నిమిషాల చిన్న పాటలో చిత్ర కధ మొత్తం ఇమిడ్చి,  జీవిత కధలా వినిపించీ, వినగానే అలరించి.. కళ్ళని ఎడిపించీ  మనసుని కదిలించగలిగే ఒక గొప్ప  పాట గురించే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది. శాస్త్రి గారు రాసిన ఎన్నో వందల అధ్బుతమైన పాటల్లోంచి  ఈ పాటనే నేను ఎంచుకోవడానికి ఇదే ముఖ్య కారణం. కళా తపస్వి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతి కిరణం' చిత్రం లో ఒక పాట గొప్పదీ, మరొకటి కాదు.. అని ఎంచడం పెద్ద దుస్సాహసం. అయినా ఈ పాటలో ఇమిడిన భావం, అనుభూతి ఎందుకో నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి.. ఇది నిజంగా ఒక  హాంటింగ్ మెలోడీ. 

                  "జాలిగా జాబిలమ్మా.. రేయి రేయంతా రెప్పవేయనే లేదు ఎందు చేతా. ఎందు చేతా..
                  పదహారు కళలనీ పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేతా.". అంటారు పల్లవిలో..

              జాలిగా  చూస్తూ జాబిలమ్మ రాత్రంతా నిదరపోలేదుట.. ఎందుకంటే పదహారు కళలని తనలో నింపకుండా తీసుకుని వెళ్ళిపోయే కృష్ణ పక్షం  తన ఎదలో చిచ్చు పెట్టడం వల్లనట. ఇక్కడ జాబిలమ్మ అంటే అద్భుతంగా పాడే బుల్లి గంధర్వుడు 'గంగాధరం', కృష్ణ పక్షం మరెవరో కాదు అతని  'గురువుగారు.' శర్మ గారు . వారు పెట్టిన చిచ్సు, ఆయన వయసుకు తగని,  ఏ మాత్రమూ ధర్మం కాని అసూయ. సంధర్భానీ, భావాన్ని ఇంతకంటే పొందికగా చెప్పడం సాధ్యమా? ఈ చిన్నారి జాబిలమ్మ తన వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది, "పెద్దవారు ఎదగకుండా చిన్నపిల్లల్లా  ప్రవర్తిస్తే  పిల్లలు పెద్దవారవుతారేమో".. అందుకే మొదటి చరణంలో తన తల్లి కాని తల్లికి ధైర్యం చెపుతాడు ఇలా..

                            " కాటుక కంటి నీరు.. పెదవుల నంటనీకు.. చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు..
                               నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెపుతున్నా. నీ కుంకుమ కెపుడూ పొద్దు గుంక దమ్మా.."

            కాటుక కంటి నీరు పెదవుల నంట నీయవద్దమ్మా. నీ మొహాన దీప కళిక లా   వెలిగే చిరునవ్వు చిన్నపోకూడదు. అంటూనే ఆ ముఖానే వెలిగే మరో దీపం, ఆ తల్లి నుదిట కుంకుమ  ఎప్పుడూ అస్తమించ దమ్మా అంటాడు.. గురువు గారు ఎప్పుడూ చల్లగా ఉండాలి.. ఉంటారు అని అనునయిస్తాడు.  గురువుగారి దారికడ్డం రాకుండా తానే తప్పుకోవాలి అనుకున్న తన నిర్ణయాన్ని చెప్పకుండానే చెప్తాడు, ఇదే మాటని రెండో చరణంలో మరింత స్పష్టంగా చెప్తాడు . 'నీ బుజ్జి గణపతినమ్మా .. అమ్మవైనా నిన్ను బుజ్జగిస్తున్నా' అని అ తల్లి కాని తల్లిని అనునయిస్తాడు. ఇక్కడ 'గణపతిని 'అని ఎందుకు అన్నారో మనసు కరిగేలా రెండో చరణంలో చెప్తారు శ్రీ సిరివెన్నెల..

                        సున్నిపిండిని నలిచి చిన్నారిగా మలచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి.
                        సుతుడన్న మతి మరిచీ, శూలాన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చు కంటి పెనిమిటి..

         ఈ రెండు పంక్తులు చాలు మొత్తం కధనీ, పాత్రల వైఖరిని మనముందు ఉంచడానికి. తన కొడుకు కాకపోయినా భర్తని ఒప్పించి దత్తత తీసుకుని,  ప్రతిభావంతుడైన ఆ బిడ్డని చూసుకుని మురిసిపోతుంది ఆ తల్లి, గురువు గారి భార్య.  అచ్చం తన వంటి నలుగు పిండికి ప్రాణం పోసిన పార్వతీదేవి లాగే.  తనకు పుట్టినవాడు కాకపోయినా ధార్మికంగా, వేదోక్త ప్రకారంగా తనవాడిని చేసుకున్న బిడ్డ మీద కూడా అలవి కాని అసూయని పెంచుకుని, అందరి జీవితాలనీ దుర్భరం చేసి  'పెద్దరికం' చూపించే గురువు.. 'చిచ్చు కంటి పెనిమిటి ' అన్న పద ప్రయోగం ఎంత   గొప్పగా ధ్వనిస్తుందో ఇక్కడ.. అక్కడ సదాశివుడు నిజంగానే చిచ్చు కన్ను ఉన్నవాడే.. ఇక్కడ ఆ కన్ను లేకుండానే అందరి మనసుల్లో చిచ్చు పెట్టగలవాడు, తండ్రే మరి .

                      ప్రాణ  పతి నంటుందా  . బిడ్డ గతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో ఇది కన్నీటి చితి
                      కాల కూటం కన్నా.. ఘాటైన గరళ మిదీ... గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
                     ఆటు పోటు నటనలివీ, ఆట విడుపు ఘటనలివీ ఆది శక్తివి నీవు.. అంటవు నిన్నేవీ
                     నీ బుజ్జి గణపతినీ బుజ్జగించీ చెపుతున్నా. కంచి కెళ్ళి పోయేవే కధలన్నీ..

              ఈ నాలుగు లైన్లలో బుజ్జి గణపతీ, అతని పెంపుడు తల్లీ పడే వేదన కనిపిస్తుంది..రెండు కళ్ళలాంటి ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏ మాత్రం హాని జరిగినా తల్లడిల్లిపోయే ఆమె స్త్రీ  హృదయమూ..  ఎంత గొంతు నులిమే విషమైనా    ఇవి ఎవరూ కావాలని చేసేవి కాదు.. జీవితంలో మాములుగా వచ్చే ఆటు పోట్లు మాత్రమే..  అంటూ ధైర్యం చెప్పే చిన్నారి తనయుడి గొప్పతనమూ మనల్ని పలకరిస్తాయి. అయినా   ఆది శక్తి రూపమైన అమ్మవు నువ్వు. నీకు ఇవేవీ అంటవు తల్లీ .. ఇందులో నువ్వు కేవలం నిమిత్త మాత్రురాలవు.. అంటూ..  అనునయంగా బుజ్జగిస్తూనే తన కధ కంచికి వెళ్ళిపోతోంది అని సూచిస్తాడు.

పాట పూర్తి అయ్యేసరికి ఎన్ని సార్లు విన్నా, మనవి  కాటుక కళ్ళైనా, కాకపోయినా వాటిల్లో  కన్నీరు వచ్చి చేరడం తధ్యం..పని కట్టుకుని పిలనక్కరలేదు..  చాలా సాధారణంగా కనిపించే అసాధారణమైన పాట ఇది.
             జాబిలమ్మ జాలిగా చూస్తూ చిన్నపోయినా. ఆ వెన్నెలల కళలని కృష్ణ పక్షం మింగేసినా శాస్త్రి గారి కలం మాత్రం వెన్నెలలే కురిపిస్తుంది.. ఎందుకంటే  ఎన్నటికీ గ్రహణం లేని వెన్నెలే మన  సిరివెన్నెల కనక.
             కళా తపస్వి దర్శకత్వం లో వచ్చిన ఈ స్వాతి కిరణం చిత్రంలో అన్ని పాటలు వెన్నెల కిరణాలే.. మణి  పూసలే.. పాటలకి ప్రాణం పోస్తూ స్వరపరిచారు 'గ్రహణం ఎరుగని మరో ఛంద'మామ' ' శ్రీ. మహదేవన్.. శ్రీమతి వాణీ జయరాం సుమధురంగా పాడారు. మమ్ముట్టీ, రాధికా, బాలనటుడు మంజునాథ్  తమ తమ పాత్రలకి ప్రాణం పోశారు.. 

            

Wednesday, September 15, 2010

నాలుగే రకాల పళ్ళు.. నాలుగొందల సాధనాలు..

"అబ్బా ! పొద్దున్నించీ పళ్లన్నీ ఒకటే పోటు" అంటారు బాపు గారి జోక్ లో ఒక తాతగారు. అది విన్న ఆయన భార్యేమో "ఓసోస్ !పళ్ళు అని బహువచనం కూడానూ" అంటుంది. చూడగానే, వినగానే కిసుక్కున నవ్వు పుట్టించే జోక్ ఇది. "పాపం తాతగారికి పళ్లన్నీ ఊడిపోయాయి కదా!, పళ్ళు ఎలా తోముకుంటారో?" అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడేమో "ఆహా ఎంత అదృష్టవంతులో కదా అనుకుంటాను. ఎందుకో తెలుసా.. చూడండి మరి..
కళ్ళూ, చెవులూ, కాళ్ళూ చేతులూ రెండేసి ఇచ్చిన దేవుడు పళ్ళు మాత్రం 32 ఇచ్చాడు. మంచిదే!.. అందువల్లే కదా మనం కావలసినవన్నీ తినగలుగుతున్నాము. మన శరీర ఆరోగ్యంలో దంతాల రక్షణా, ఆరోగ్యమూ ఎంతో ముఖ్య మైనవని తెలుసుకున్నాము కూడా. వాటిని శ్రద్ధగా చూసుకోకపోతే అనవసరంగా దంతవైద్యుల జేబులు నింపాలని కూడా మనకి తెలిసిపోయింది. అయితే వీటి శ్రద్ధ లోనే వచ్చింది చిక్కంతా. వెనకటి తరంలో మనవారు చక్కగా ప్రకృతి దొరికే వేపపుల్లలూ, పొయ్యిలో కచికా మొదలైనా వాటితో శుభ్రంగా తోముకునేవారు , అందుకే ఎనభై ఏళ్ళువచ్చినా ఒక్క పన్ను కూడా కదిలేది కాదు అని గొప్పగా మనకీ చెప్పేవారు. పుల్లల మాట ఎలా ఉన్నా, బూడిద లు అవి అంత మంచివి కాదు కదా. అప్పుడే వచ్చాయి తెల్లటి కుంచెలు వేసుకుని రంగురంగుల ప్లాస్టిక్ ముక్కలు.. అవేనండీ, మన బ్రష్ లు.
మొదట్లో వీటిని చూసి 'భలే ఉన్నాయే' అనుకున్నారు అందరూ.. కాలక్రమేణా వీటిల్లో ఎన్నో రకాలు, 'బస్సులు, రైళ్ళు, విమానాలు, జట్లు, జాకెట్లూ ఇలా దైనందిన జీవితంలో ఎలా స్పీడూ, మార్పూ వచ్చిందో అన్న లాల్చీ మాస్టారి మాట లా గే వీటిల్లోనూ అన్నమాట. అవేవిటో మనమూ చూద్దాం.
1. పుల్లలూ, బొగ్గూ, కచికా ఇలాంటివి మీ పల్లకి మేలు చెయ్యకపోగా హాని చేస్తాయి. ఇది నిజం గా నిజం.. వేప పుల్ల పరవాలేదు కాని. మిగతావి అస్సలు మంచివి కాదు. అందుకే బ్రష్ లు వాడండి అని తయారీదారులు చెప్తే చాలా మంది నేర్చుకున్నారు.. మెచ్చుకున్నారు. వాడడం మొదలు పెట్టారు కూడా. ఇది మంచి పరిణామం. తర్వాతే అయోమయం మొదలయింది.
2. బ్రష్ ఊరికే అలా ఒక పుల్లలా తిన్నగా ఉంటె ఉపయోగం లేదు.. కొంచం వంగి ఉంటేనే అది మీకు వీలుగా ఉంటుంది.. అన్నారు. ఓహో ! అలాగా, అనుకున్నాము.. కొద్దిగా వంపుగా ఉన్న బ్రష్ లు కోనేసుకున్నాం.
3. ఆ తర్వాత ఊరికే వంపుగా ఉంటె చాలదు.. దానికి తగినంత 'ఫ్లెక్సి బిలిటీ" ఉండాలి.. అప్పుడే అది మీ నోట్లో గుండ్రంగా తిరిగి హాయిగా శుభ్రం చేస్తుంది.. అందుకే మేము బ్రష్ ల తల భాగం కొద్దిగా అటూ, ఇటూ తిరిగేదిగా దీని రూపొందించాం . ఇప్పుడు మీరు తిరగనక్కరలేదు అని వారు చెప్తే. "ఆహా! భలే! వీరు ఇంత పరిశోధన చేస్తారు కనక ఇన్ని విషయాలు తెలుస్తాయి.. మనలాంటి సామాన్యులకి ఎలా తెలుస్తుంది?" అనుకున్నాము.
4. రోజుకి హీనపక్షం పది నిమిషాలు దంతధావనం చేసుకున్నారనుకుంటే. వారానికెంత? నెలకెంత?సంవత్సారానికెంత? చివరికి మీ జీవితకాలంలో ఎంత? దీనివల్ల మీ చేతి కండరాల మీద ఎంత వత్తిడి? గట్రా గట్రా ,, అందుకే మీ బ్రష్ చేతిని అంటుకునే భాగానికి కుషన్ అమర్చాము. పెద్దలు మీకే ఇలా ఉంటె మీ లేత శిశువుల నాజూకు ( క్షమించెయ్యండి ప్రకటనల భాష వద్దన్నా వచ్చేస్తోంది మరి :)) చేతుల మీద ఎంత వత్తిడి? అందుకే బొటనవేలు పెట్టుకునేందుకు ఒక వొంకు ఏర్పాటు చేసాము అన్నారు. చేతులని సోఫాల్లో కూర్చో బెట్టినంత సంబర పడిపోయాము . పిల్లులూ, కుక్కలూ, బార్బీలూ అవి తర్వాత వచ్చాయి.
5. ఇన్ని చేసాకా కుంచెలు పట్టుదారాల్లా ఉండాలి కానీ కొబ్బరి పీచులా ఉంటే ఎంత హాని? ఎంత నష్టం? అని మనల్ని అడిగినట్టే అడిగి తయారీదారులే సమాధానం చూపించేశారు.. ఈ సెన్సిటివ్,, ఆ సుతి మెత్తనా అంటూ.మొదలు పెట్టి . పైగా ప్రపంచంలోని పళ్ళ డాక్టర్ లు అందరూ ఇవే వాడతారు, ఇవే సిఫార్స్ చేస్తారు అంటూ మళ్ళీ మళ్ళీ చెప్పేశారు. సరే.. 'చెప్పేవాడికి వినేవాడికి లోకువ ;అనడం కన్నా 'వినేవాడికి చెప్పే వాడంటే చాలా గౌరవం' అనుకుందాం.. మనం 'అవును.. ఇది మాత్రం నిజంగా నిజం 'అనుకున్నాం
6. ఇప్పుడేమో తరవాత తరం బ్రష్ లని ప్రవేశపెట్టారు. వీటిని మన పాత తరం వాటితో 'మన అబ్బాయి' అని కూడా పిలిపించారు. ఇవి మెత్తగా ఉంటూ, ఎలా అంటూ అలా తిరుగుతూ, పళ్ళూ, నోరు, నాలికా, చిగుళ్ళూ ఇంకా నోట్లో ఏముంటే అవన్నీ ఒక్క దెబ్బతో శుభ్రం చేసి పారేస్తుంది.. అన్నారు.
7. తరవాత ఏకంగా జాగ్రఫీలు, జామెట్రీ లు రంగ ప్రవేశం చేసేసాయి. పూర్తిగా 360 డిగ్రీల బ్రష్ అని ఒకటీ, మీ నోరు భూమండలం అంత ఉన్నా సరే. ఇది అన్ని రకాలుగా నూ రంగుల రాట్నాలు తిరిగి మరీ దుమ్ము దులిపేస్తుంది అని.
8. ఇవన్నీ కాదంటే బాటరీ తో నడిచే 'ఎలక్ట్రానిక్ బ్రష్లూ.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో..
ఇందులో ఏది మంచిదో? ఏది అవసరమో? ఏది కొనాలో తెలియని అయోమయం. ఒక్క బ్రష్ లనేమిటి మనం ఉపయోగించే ప్రతీ వస్తువులోనూ వినియోగదారులు ఎదుర్కుంటున్న ముఖ్యమైన సమస్య ఇది. తయారీదారుల మధ్య ఉన్న పోటీ ల పుణ్యం ఇది. దీనివల్లనే కళ్ళూ, మనసు చెదిరేలా రకరకాల తయారీలూ.. జేబులూ మనసులూ కొల్లగొట్టే ధరలూ.
ఇది ఇలాగే సాగితే ( సాగితే ఏమిటి? సాగుతూనే ఉంటుంది). కొన్ని రోజుల్లో మనం ఒక బ్రష్ కాక కనీసం నాలుగో లేక ఐదో కొనుక్కోవలసి వస్తుంది.. మన నోట్లో ఉన్నవి నాలుగు రకాల పళ్ళు కనక ( Incisors, canines, pre molars and Molars) ఒక్కో రకపు పళ్ళకీ ఒక్కో రకమైన బ్రష్, ఐదోది మన నాలుకా, చిగుళ్ళూ, వగైరాలకీనూ. శుభవార్త ఏమిటంటే ఇవి కొనుక్కున్న వారికి ఒక కీ రింగ్ ఫ్రీ కూడా. ఇది నేనివ్వడం లేదు.. ఇస్తారేమో అని చెప్తున్నాను. తలకి ఐదు బ్రష్లు దాచుకోవాలంటే ఈ మాత్రం అవసరం కదా అని నా ప్లాన్.
ఉన్నప్రతీ పన్నుకీ ఒక రకమైన బ్రష్ కొనుక్కోమనకుండా ఉంటె అదే పదివేలు కదా. ఇప్పుడు అర్ధం అయింది కదా పైన బాపు గారి జోక్ లో తాత గారు ఎందుకు అదృష్టవంతులో ? ఇదన్నమాట మన నాలుగు రకాల పళ్ళు , నాలుగొందల సాధనాలు అనే దంతోపాఖ్యానం.. సారీ బ్రష్శోపాఖ్యానం.

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...